Monday, 29 August 2016

కృష్ణుయ్య ఐదు దివ్య ధామాలు

‘దేవకి పంట...
వసుదేవు వెంట...
యమునను నడిరేయి దాటితివంట...
వెలసితి వంట..
నందుని ఇంట...
రేపల్లె ఇల్లాయెనంటా....’

పుడుతూనే ఇన్ని లీలలు చేసిన బాలకృష్ణుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేడు ఆ నల్లనయ్య పుట్టినరోజు. తాను వెలసిన క్షేత్రాలంటే కన్నయ్యకు వెన్నముద్దలంత ఇష్టం. అటువంటి ఐదు దివ్య ధామాల్లో స్వామితో కలసి మనమూ విహరిద్దాం రండి.మధుర - బృందావనం


శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన ప్రదేశంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి కేశవ్దేవ్ దేవాలయం హిందువులకు అత్యంత పవిత్రం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణుడి మునిమనుమడైన వజ్రనాభుడు దాదాపు ఐదువేల సంవత్సరాల కిందట నిర్మించాడని స్థలపురాణం. ఈ దేవాలయంలో జన్మాష్టమితోపాటు వసంత పంచమి, మహాశివరాత్రి, గోపాష్టమి, దీపావళి మొదలైన పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

చూడదగిన ప్రదేశాలు
శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం, గర్భ గుహ, భాగవత భవన్తోపాటు కృష్ణుడు బాల్యంలో నడయాడిన గోకులం, బృందావనం వంటి ప్రదేశాలు కూడా మధుర జిల్లాలోనే ఉన్నాయి. మధుర నుంచి బృందావనం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గోవిందదేవ్, మీరాబాయి, మదనమోహన దేవాలయాలు ప్రసిద్ధి పొందినవి. బృందావనానికి సమీపంలోనే గోవర్ధన పర్వతం ఉంది. నేటికీ దీపావళి పండుగ తరవాత రోజున గోవర్ధన పూజ నిర్వహించడం ఆనవాయితీ. గోవర్ధన గిరిని చిటికెన వేలుపై ఏడు రోజులు ఎత్తి పట్టుకొన్న శ్రీకృష్ణుడు, ఈ రోజునే ఇంద్రుడి గర్వభంగం చేశాడని చెబుతారు. ఈ పర్వతాన్ని స్థానికులు కృష్ణుడి ప్రతిరూపంగా కొలుస్తారు. మధుర నుంచి గోకులం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీటితోపాటు మొఘలుల కాలంనాటి జామా మసీదు, కుసుమ సరోవరం, రాధా కుండ్, మధుర మ్యూజియం సందర్శనీయ స్థలాలు.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి మధుర 1375 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం ఉంది. మధురకు సమీప అంతర్జాతీయ విమానాశ్రయం (147కి.మీ.) న్యూఢిల్లీలో ఉంది. సమీప డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఆగ్రాలోని ఖేరియా విమానాశ్రయం(49కి.మీ.).


ద్వారక

ఏడు మోక్షపురుల్లో ఒకటిగా పిలిచే ద్వారక, గుజరాత రాష్ట్రంలో గోమతీ నదీ తీరంలో ఉంది. సంస్కృతంలో ద్వారక అంటే ‘స్వర్గానికి ద్వారం’ అని అర్థం. కృష్ణుడు పరిపాలించిన ప్రాంతంగా ద్వారక సుపరిచితం. ఇక్కడ దాదాపు 2500 సంవత్సరాల కిందట నిర్మించిన ద్వారకాధీశుడి దేవాలయం ప్రధానమైనది. జగద్గురువు ఆది శంకారాచార్యులు నెలకొల్పిన నాలుగు ప్రధాన మఠాల్లో ఒకటైన ద్వారకా పీఠం (కాళికా మఠం) ఇక్కడే ఉంది. కృష్ణ భక్తురాలైన మీరాబాయి ఇక్కడే స్వామి ప్రతిమలో లీనమైందని చెబుతారు. ఏటా జన్మాష్టమికి ఇక్కడ నిర్వహించే వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు హాజరవుతారు.

చూడదగిన ప్రదేశాలు
రుక్మిణీ దేవి దేవాలయం, గోమతీ ఘాట్, బెట్ ద్వారక, నాగేశ్వర జ్యోతిర్లింగం, ద్వారక లైట్హౌస్, గీతామందిరం, సముద్ర నారాయణ దేవాలయం.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి ద్వారక 1581 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం ఉంది. సమీప విమానాశ్రయం జామ్నగర్ (137 కి.మీ). జామ్నగర్, అహ్మదాబాద్ల నుంచి ద్వారకకు బస్సులో చేరుకోవచ్చు.


గురువాయూర్

కేరళ రాష్ట్రం గురువాయూర్లోని శ్రీకృష్ణ దేవాలయాన్ని భూలోక వైకుంఠంగా కీర్తిస్తారు. ఈ దేవాలయంలో స్వామి నాలుగు చేతులతో... పాంచజన్యం, సుదర్శన చక్రం, కౌమోదకి, తామర పువ్వును ధరించి దర్శనమివ్వడం విశేషం. శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో దేవకి, వసుదేవులకు ఇదే రూపంతో దర్శనమిచ్చాడని ప్రతీతి. అందుకే గురువాయూర్ను ‘దక్షిణ భారత ద్వారక’గా పేర్కొంటారు. ఈ దేవాలయం ఆవిర్భావం గురించి నారద పురాణంలో ఒక ఆసక్తికరమైన గాథ ఉంది. అర్జునుడి మునిమనుమడు (అభిమన్యుడి కుమారుడు) అయిన పరీక్షిత్తు మహారాజు తక్షకుడు అనే పాము కాటుతో మరణిస్తాడు. దీనికి ప్రతీకారంగా ఆయన కుమారుడు జనమేజేయుడు నిర్వహించిన సర్పయాగంలో వేలాది పాములు అగ్నికి ఆహుతి అవుతాయి. ఈ పాపం కారణంగా ఆయనకు తీవ్రమైన కుష్ఠు వ్యాధి సోకుతుంది. ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం ఉండదు. ఆ సమయంలో గురు దత్తాత్రేయ స్వామి ఆదేశాన్ని అనుసరించి గురువాయూర్లో కొలువైన శ్రీకృష్ణుడిని సేవించి రోగ విముక్తుడవుతాడు. ఇక్కడి స్వామిని గురువాయూరప్పన్గా కొలుస్తారు. స్వామి విష్ణువు రూపంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం కృష్ణ ఆలయంగానే ప్రసిద్ధి పొందింది. బాల కృష్ణుడి రూపంలో స్వామి నేటికీ ఈ దేవాలయంలో సంచరిస్తుంటాడని భక్తుల విశ్వాసం.

చూడదగిన ప్రదేశాలు
గురువాయూర్లోని రుద్రతీర్థం, మమ్మియూర్ మహాదేవ క్షేత్రం, ఎలిఫెంట్ క్యాంప్ శాంక్చురీ, పున్నత్తూర్ కొట్ట, వెంకటాచలపతి దేవాలయం, పార్థసారథి దేవాలయం, చాముండేశ్వరి దేవాలయం, హరికన్యక దేవాలయాలను సందర్శింవచ్చు. గురువాయూర్కు 80 కిమీ దూరంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జన్మస్థలమైన కాలడి గ్రామం ఉంది. అక్కడ పూర్ణానది ఒడ్డున ఉన్న శ్రీకృష్ణ దేవాలయం చూడదగింది.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి గురువాయూర్ 975 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం లేదు. త్రిసూర్ వరకు రైల్లో వెళ్లి అక్కడ నుంచి మరో రైల్లో గురువాయూర్ వెళ్లొచ్చు. లేదా రోడ్డు మార్గంలో (30 కి.మీ) తేలిగ్గా వెళ్లొచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిన్లో ఉంది. (80 కి.మీ). కేరళ, కర్ణాటక, తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు సదుపాయం ఉంది.


ఉడిపి

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి క్షేత్రంలో కొలువైన చిన్ని కృష్ణుని ఆలయం హిందువులకు పరమ పవిత్రమైన ప్రాంతం. ఇక్కడి కృష్ణ మఠాన్ని 13వ శతాబ్దంలో ద్వైత సంప్రదాయ స్థాపకులు మధ్వాచార్యులు ప్రారంభించారు. ఆయన ఇక్కడ ఎనిమిది మఠాలు స్థాపించి వాటికి ఎనిమిది మందిని అధిపతులుగా ఏర్పాటు చేశారు. ఈ మఠాధిపతులే నేటికీ గర్భాలయంలో కృష్ణ పూజలు నిర్వహిస్తున్నారు. వీరికితప్ప ఇతరులెవరికీ మూలమూర్తిని తాకే అవకాశం లేదు. ఇక్కడి కృష్ణ విగ్రహాన్ని మధ్వాచార్యులు ప్రతిష్ఠించారు. ప్రతి రెండేళ్ళకు ఒకసారి నిర్వహించే ‘పర్యాయ’ పండుగ సందర్భంగా ఒక్కో మఠాధిపతికి దేవాలయం బాధ్యతలు అప్పగిస్తారు. ఇక్కడి స్వామికి ప్రతిరోజూ 14 రకాలైన పూజలను నిర్వహిస్తారు. ఈ ఆలయం వెనుక భాగంలో ఉన్న కిటికీ నుంచి స్వామిని దర్శించుకోవడం ప్రత్యేకత.. తన భక్తుడైన కనకదాసుడికి స్వామి ఈ కిటికీ నుంచే దర్శనం ప్రసాదించారని ప్రతీతి. అందుకే దీన్ని ఆయన పేరు మీదుగా ‘కనకన కిండి’ అని పిలుస్తారు.

చూడదగిన ప్రదేశాలు
చంద్రేశ్వర, అనంతేశ్వర దేవాలయాలు, సెయింట్ మేరీస్ ఐలాండ్, అనెగుడ్డె వినాయక దేవాలయం, కొడి బీచ్, కుద్లు ఫాల్స్, ఇంద్రాణి పంచదుర్గ పరమేశ్వరి దేవాలయం, మట్టు బీచ్, బ్రహ్మి దుర్గ పరమేశ్వరి దేవాలయం, కుండేశ్వర దేవాలయం, బెల్కల్ తీర్థ ఫాల్స్ .

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి ఉడిపి 780 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం లేదు. మంగళూరు వరకు రైల్లో వెళ్లి అక్కడ నుంచి ఉడిపి (54 కిమీ) రైలు లేదా బస్సులో వెళ్ళవచ్చు. సమీప విమానాశ్రయం మంగళూరు (137 కి.మీ).నెమలి

ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి స్వామి ఎంతో మహిమ కలిగిన స్వామిగా భక్తులు భావిస్తుంటారు. సంతానం లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారు. 1953లో నెమలి గ్రామానికి చెందిన వనమా సీతారామయ్య అనే షావుకారు అదే గ్రామానికి చెందిన దారా నరసయ్య అనే రైతు పొలం కొన్నారు. అందులోని మట్టిని తవ్వుతుండగా స్వామి విగ్రహం, శంఖం, పాచిక బయటపడ్డాయి. విషయాన్ని కూలీలు షావుకారు దృష్టికి తీసుకువచ్చారు. 1957 ఫిబ్రవరి 6న స్వామి వెలిసిన ప్రాంతంలోనే ఆలయాన్ని నిర్మించి విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రతి ఏడాది మార్చిలో నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. పౌర్ణమి రోజున స్వామి కల్యాణం వైభవోపేతంగా నిర్వహిస్తారు. భక్తుల విరాళాలతో ఆలయ ప్రాంగణంలో నిర్మించిన గోశాలలో నిత్య పూజలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి స్వామివారి కల్యాణం జరుగుతుంది. భక్తుల విరాళాలతో నిత్య అన్నదానం చేస్తున్నారు.

ఎలా చేరుకోవాలి?
ఏపీలో విజయవాడకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరకు 16 కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఆలయానికి చేరుకునేందుకు బస్సు సౌకర్యంతో పాటు రైలు సౌకర్యం కూడా ఉంది. విజయవాడ, మధిర రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి రైలు మార్గం ద్వారా నెమలి చేరుకునే వీలుంది. ఖమ్మం నుంచి కల్లూరు, చినకోరుకొండ, పొచవరం, వెంకటాపురం, తాళ్లూరు, ఉమ్మడిదేవరపల్లి మీదుగా నెమలి చేరుకోవచ్చు. 

Andhrajyothy

ఐదు ద్వారకలు
ఐదు ద్వారకలు‘‘మధ్యప్రదేశ్‌ నర్మదాతీరంలోని ఓంకారేశ్వరుణ్ణీ ఉజ్జయినీ మహంకాళేశ్వరుణ్నీ రాజస్థాన్‌లోని చారిత్రక కోటల్నీ గుజరాత్‌లో కృష్ణభగవానుడు నడయాడిన ప్రదేశాలనూ ముఖ్యంగా పంచద్వారకలుగా చెప్పే ఐదు శ్రీకృష్ణ మందిరాల్నీ ఏకకాలంలో చూసొచ్చా’మంటూ ఆయా విశేషాలను చెప్పుకొస్తున్నారు సికింద్రాబాద్‌కు చెందిన మాఢభూషి అరవిందవల్లి.పంచద్వారకలైన మూల ద్వారక, బెట్‌ద్వారక, శ్రీనాథ్‌ద్వారక, కాంక్రోలి ద్వారక, డాకోర్‌ ద్వారకలకు వెళ్లాలని ఆలోచన. ఒకరోజు ఓ ప్రకటనలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల ఇరవై రోజుల యాత్ర గురించి చదివి వెంటనే టిక్కెట్లు తీసుకున్నాం. బెంగళూరు నుంచి దిల్లీ Sampark Kranti Expressలో బయలుదేరి రాత్రి 11.30కి భోపాల్‌కి చేరుకున్నాం. ఒకే కుటుంబానికి చెందిన 25 మంది మాతోపాటు వచ్చారు. మా టూర్‌ ఆపరేటరు మరో 8 మందితోనూ వంటవాళ్లతోనూ సామాన్లతో ముందే భోపాల్‌ చేరుకుని మా అందర్నీ బస్సులో ఉజ్జయినీకి తీసుకెళ్లారు. తెల్లవారుజామున 4 గంటలకు ఉజ్జయినీకి చేరుకున్నాం.

భస్మ దర్శనం!
ఉదయం ఎనిమిది గంటలకే స్నానపానాదులూ కాఫీటిఫిన్లూ కానిచ్చి మర్నాడు మహాకాళేశ్వరుని భూరిదర్శనంకోసం మా గుర్తింపుకార్డులతో గుడిదగ్గర రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. రోజుకి 300 మందిని మాత్రమే ఆ దర్శనానికి అనుమతిస్తారు. అక్కణ్ణించి ఓంకారేశ్వరుణ్ణి చూడ్డానికి బస్సులో ఇండోర్‌ మీదుగా వెళ్లాం. ఘాట్‌రోడ్డు ప్రయాణం ఆహ్లాదకరంగా అనిపించింది. సాయంత్రం నాలుగుగంటలకు ఓంకారేశ్వరుడి దర్శనానికి వెళ్లాం. అభిషేకాలు చేయించుకుని తిరిగి బస్సులో ఉజ్జయినీకి ప్రయాణమయ్యాం. రాత్రి పదకొండు గంటలకు ఉజ్జయినీకి వెళ్లాం. కానీ రెండు గంటలకే లేచి మహాకాళేశ్వరుని దర్శనం కోసం క్యూలో నిలబడ్డాం. అప్పటికే చాలామంది ఉన్నారు. నాలుగు గంటలకు దర్శనం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ శివలింగాన్ని అభిషేకించవచ్చు. జలాభిషేకం తరవాత అందర్నీ మూలవిగ్రహానికి ఎదురుగా పెద్ద హాలులో కూర్చోబెట్టి పంచామృత అభిషేకం చేసి తిరిగి నీటితో శుద్ధి చేసి లింగాన్ని వెన్నా పూలూ పండ్లతో అలంకరించి భూరి (కొన్ని గంటల ముందు కాల్చిన శవం తాలూకూ భస్మం)తో అభిషేకం చేస్తారు. ఈ సేవను స్త్రీలు చూడకూడదని ముఖంమీద కొంగు కప్పుకోమని చెబుతారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ చప్పట్లూ వాద్యాలూ తాళాలూ ఢమరుక ధ్వనులూ హరహరమహాదేవ అనే నినాదాలతో దద్దరిల్లిపోతుంది. ఆ అనుభూతిని వర్ణించలేం.

రాజస్థాన్‌లో...
తరవాత ఉజ్జయినీలో ఉండే మహంకాళి, భైరవస్వామి, విష్ణాలయాలు అన్నీ చూసుకుని ఆ రోజు రాత్రి అక్కడ జైపూరుకి వెళ్లే రైలు ఎక్కి ఉదయానికి చేరుకున్నాం. అక్కడ భవంతులూ ఆఫీసులూ అన్నీ గులాబీరంగులోనే ఉన్నాయి. ముందుగా జంతర్‌మంతర్‌కు వెళ్లాం. ఇది ఖగోళశాస్త్రం, జ్యోతిషం నేర్చుకునేవాళ్లకి పాఠశాల లాంటిది. సూర్యుడి వెలుతురూ నీడలతోనే సమయమూ దినమూ తిథీ వారమూ నక్షత్రమూ రాశీ వంటివన్నీ తెలుసుకునేందుకు వీలుగా కట్టిన సిమెంట్‌ కట్టడాలను అక్కడ చూడవచ్చు. పక్కనే ఉన్న సిటీప్యాలెస్‌లో రాజామాన్‌సింగ్‌ వాడిన వస్తువుల రాజకుటుంబీకుల ఫొటోలూ ఉన్నాయి. సిటీప్యాలెస్‌ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని ప్రాచీన జైపూర్‌ కోటను చూసి జలమహల్‌ చూడ్డానికి వెళ్లేటప్పటికి రాత్రి ఏడున్నర అయిపోయింది. చుట్టూ నీళ్లూ మధ్యలో దీపాలతో అది అందంగా ఉంది.

మర్నాడు ఉదయం మూడు గంటలకు జైపూరు నుంచి బికనీరుకి ప్రయాణమయ్యాం. సాయంత్రం నాలుగు గంటలకు బికనీరు చేరుకున్నాం. కనకమహల్‌, మేఘమహల్‌ చూశాక సభామండపంమీద చిత్రపటాలనూ పాలరాతి శిల్పాలనూ వీక్షించాం. అవన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. అక్కణ్ణుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్‌నాక్‌ గ్రామంలోని మూషికాలయంలోని ప్రాంగణమంతా ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. కాళ్లతో ఎక్కడ వాటిని తొక్కేస్తామేమోనని భయం కలుగుతుంది. గుడిలోపల వేలకొద్దీ ఎలుకలు ఉన్నాయి. గుడి బయట ఒక్క ఎలుకా లేదు. ఎలుక విగ్రహానికి రోజూ సాయంత్రం హారతినిస్తారట. తిరిగి బికనీరుకి చేరుకున్నాం. ఉదయాన్నే బస్సులో జైసల్మేరు వెళ్లాం. జనవరి నెల కావడంతో చలి బాగా ఉంది. దారంతా పొగమంచు... డ్రైవరు జాగ్రత్తగా నడిపాడు. మధ్యాహ్నం 12 గంటలకు రామ్‌దేవ్‌ బాబా సమాధి ఉన్న వూరు చేరుకున్నాం. రాజస్థానీలకు ఆరాధ్యదైవం రామ్‌దేవ్‌ బాబా. ప్రజలు తమ కోరికలను బాబాకు చెప్పుకుని అవి తీరాక బట్టతో తయారుచేసిన గుర్రపు బొమ్మలూ, తీపి వంటకాలను మేళతాళాలతో తీసుకొచ్చి బాబాకు నివేదన చేస్తారు.

అది చూశాక మూడు గంటలకు జై సల్మేర్‌ చేరుకున్నాం. ఆ వూళ్లొ అన్ని ఇళ్లూ ఆఫీసులూ బంగారురంగులో ఉన్నాయి. దీన్ని గోల్డెన్‌ సిటీ అంటారు. ఇక్కణ్ణించి గోబీ ఎడారి, థార్‌ ఎడారులకు వెళ్లొచ్చు. మమ్మల్ని సాయంత్రం నాలుగు గంటలకల్లా గోబీ ఎడారిలో వదిలారు. అక్కడ ఒంటెలమీద ఇద్దరం చొప్పున కూర్చుని ఎడారిలో ఐదు కిలోమీటర్ల మేర ప్రయాణించాం. ఎడారిలో కూర్చుని సూర్యాస్తమయం దృశ్యాన్ని వీక్షించడం మరచిపోలేని అనుభవం. ఉదయాన్నే కోట చూడ్డానికి వెళ్లాం. ఇందులో రెండు గుడులు ఉన్నాయి. ఒకటి శీతలామాత ఆలయం, రెండోది జైనమందిరం. దీన్నే శ్వేత మందిరం అని కూడా అంటారు. రాజస్థాన్‌లోని ప్రతీ కోటా చూడదగ్గదే. మధ్యాహ్నం భోజనం చేశాక రాత్రి పది గంటలకు బయలుదేరి జోధ్‌పూర్‌కి చేరుకున్నాం. జోథ్‌పూర్‌ను సన్‌సిటీ అంటారు. ఈ కోటను ముగ్గురు చక్రవర్తుల హయాంలో కట్టించారు. ఇది పూర్తయ్యేసరికి మూడువందల సంవత్సరాలు పట్టింది. యుద్ధాల్లో శిథిలమైన కోటను పునర్నిర్మించడానికి 150 సంవత్సరాలు పట్టిందనీ ఇది సుమారు 600 ఏళ్ల నాటిదనీ గైడు చెప్పాడు. కోట పైకి చేరుకుని చూస్తే వూరంతా కనిపిస్తుంది. నీలం రంగు ఇళ్లు ఎక్కువగా కనిపించాయి. ఎండ నుంచి రక్షిస్తుందన్న కారణంతో నీలిరంగు వేస్తారనీ అందుకే దీన్ని నీలినగరం అంటారనీ గైడు చెప్పాడు. అక్కణ్ణుంచి పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయాన్నీ ఆ తరవాత చిత్తౌడ్‌గఢ్‌లోని కోటల్నీ చూసి పంచద్వారకల్లో ఒకటైన శ్రీనాథ్‌ ద్వారకకు చేరుకున్నాం.

నాథ్‌ ద్వారక!
నాథ్‌ద్వారానే శ్రీనాథ్‌ ద్వారక అంటారు. ఇక్కడ కృష్ణుడు ఏడేళ్ల పిల్లాడిగా దర్శనమిస్తాడు. ప్రస్తుతం ఇక్కడున్న విగ్రహాన్ని 17వ శతాబ్దంలో మధుర నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఉదయాన్నే హారతి ఇస్తూ స్వామిని మేలుకొలుపుతారు. తరవాత కాసేపు గుడి మూసి స్వామిని అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. దీన్నే శింగార్‌ సేవ అని పిలుస్తారు. ఇక్కడ అభిషేకానికి భక్తులు పాలే కొని ఇస్తారు. తరవాత అక్కణ్ణుంచి కాంక్రోలి ద్వారకకు వెళ్లాం. ఉదయ్‌పూర్‌ సమీపంలోని రాజసమండ్‌ సరస్సు ఒడ్డున ఉన్న ఈ ఆలయంలోని కృష్ణుణ్ణి ద్వారకాధీశ్‌గా కొలుస్తారు. ఇక్కడి విగ్రహం కూడా మధుర నుంచే వచ్చిందట. ఈ ఆలయాన్ని దర్శిస్తే చింతలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఇవన్నీ ఆయన నడయాడిన స్థలాలే. అక్కణ్ణుంచి ఉదయపూర్‌కి చేరుకుని కోట చూడ్డానికి వెళ్లాం. అది చాలా అందంగా ఉంది. ఆ రాత్రికి అక్కడే ఉండి మౌంట్‌ అబూకి చేరుకున్నాం. అక్కడ బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళ్లాం. అది చాలా పెద్దది. హాల్లో 2000 మంది కూర్చునే స్థలం ఉంది. ఇక్కడకు వెళ్లినవాళ్లంతా రెండు నిమిషాలైనా ధ్యానం చేస్తారు. తరవాత ఆబ్రూ దేవాలయానికి వెళ్లాం. 500 మెట్లు ఎక్కి పెదవి ఆకారంలో ఉన్న గుహలోని దేవీమాతను దర్శించుకున్నాం. రాజస్థానీ భాషలో ఆబ్రూ అంటే పెదవి అని అర్థం. ఇది క్రమేణా ఆబూగా మారింది. ఎర్రచలువరాతితో కట్టిన దిల్‌వారా మందిరాలను చూసి ఎవరైనా నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. మధ్యాహ్నం భోజనం చేసి రాజస్థాన్‌ సరిహద్దుల్లో నుంచి గుజరాత్‌లోకి ప్రయాణించాం.

బంగారు ద్వారక!
దారిలో గబ్బర్‌ అనే వూరిలో అంజేమాత గుడికి వెళ్లాం. ఇది అష్టాదశ పీఠాల్లో ఒకటి. ఇక్కడే సతీదేవి గుండె పడిందని చెబుతారు. అది చాలా పెద్ద గుడి. రాత్రికి సిద్ధాపూరులో విశ్రమించి ఉదయాన్నే మాతృగయకు వెళ్లాం. అక్కడ తల్లికి పిండప్రదానాలు చేసేవాళ్లు చేసుకున్నారు. ఎందుకంటే తల్లికి పిండప్రదానం చేసే చోటు ఇదొక్కటేనట. ఇక్కడి బిందుసరోవరంలో స్నానం చేసి పిండప్రదానం చేస్తే మంచిదని భాగవతంలో ఉన్నట్లు పూజారులు చెప్పారు. తరవాత మూల ద్వారకకు చేరుకున్నాం. అరేబియా సముద్రతీరంలోని ఈ నగరాన్ని ఒకప్పుడు గోల్డెన్‌సిటీగా పిలిచేవారు. క్రీ.పూ. 1500నాటి పురాతన నగరమే ద్వారక. తప్పక చూడాల్సిన సప్త పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి. ప్రధాన ఆలయంలో సాయంత్రం హారతి దర్శనం చేసుకుని మళ్లీ ఉదయాన్నే గోమతీనదిలో స్నానం చేసి కృష్ణుణ్ణి దర్శించుకుని వెన్న ప్రసాదాలు స్వీకరించాం. తరవాత సముద్రంలో ఉన్న బెట్‌ ద్వారకకు మరబోటులో వెళ్లాం. సముద్రపు పక్షులు మా తలమీదుగా ఎగురుతూ మేం వేసే మరమరాలు తింటూ ఆలయం వరకూ వచ్చి మళ్లీ మాతో ద్వారకకు వచ్చాయి. బెట్‌ద్వారకలో కృష్ణుడి పరివారం ఉండేదట. అక్కడి స్వామిని దర్శించుకుని నాగేశం చేరుకున్నాం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ పార్వతీపరమేశ్వరులు నాగ్‌, నాగిని రూపాల్లో ఉంటారు. పిల్లలు లేనివాళ్లు ఇక్కడ అమ్మే జంటపాముల బొమ్మలు పెట్టి ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు.

డాకోర్‌ రణ్‌ఛోడ్‌రాయ్‌!
తరవాత సోమనాథ్‌ ఆలయాన్నీ కృష్ణుడు నిర్యాణం పొందిన స్థలాన్నీ బోయవాడు బాణం వేసిన చోటునీ చూసి భావనగర్‌కు బయలుదేరాం. అక్కడ సముద్రం ఒడ్డు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో చిన్న రాయి మీద పాండవులు శివలింగాలు పెట్టి పూజ చేశారట. సముద్రంలో నీళ్లు వెనక్కి వెళ్లినప్పుడు అక్కడ ఐదు శివలింగాలు కనిపిస్తాయి. సాధారణంగా ఉదయం పదిగంటలలోపే ఇది సాధ్యం. ఆ తరవాత నీళ్లు వచ్చి ఏమీ కనిపించవు. కానీ మేం ధైర్యం చేసి బురదలో నడుచుకుంటూ వెళ్లి దర్శించుకుని గంటన్నరలో వెనక్కి వచ్చాం. సాయంత్రానికి డాకోర్‌ ద్వారకకు చేరుకున్నాం. ఇక్కడ కృష్ణుణ్ని రణ్‌ఛోడ్‌రాయ్‌జీగా కొలుస్తారు. బోడన అనే భక్తుడి కోరిక మేరకు నిండుపౌర్ణమినాడు కృష్ణుడు ఇక్కడకు వచ్చాడట. అందుకే పున్నమినాడే ఇక్కడకు భక్తులు ఎక్కువగా వస్తారు. ఇక్కడి ఆలయనిర్మాణం ఎంతో బాగుంది. అక్కడ కృష్ణుణ్ణి దర్శించుకున్నాక రుక్మిణీదేవి ఆలయాన్నీ చూసొచ్చాం. ఇక్కడితో మా పంచద్వారకలు పూర్తయ్యాయి. మర్నాడు గాంధీనగర్‌, అహ్మదాబాద్‌లో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసి వెనుతిరిగాం.