Monday, 29 August 2016

కృష్ణుయ్య ఐదు దివ్య ధామాలు

‘దేవకి పంట...
వసుదేవు వెంట...
యమునను నడిరేయి దాటితివంట...
వెలసితి వంట..
నందుని ఇంట...
రేపల్లె ఇల్లాయెనంటా....’

పుడుతూనే ఇన్ని లీలలు చేసిన బాలకృష్ణుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేడు ఆ నల్లనయ్య పుట్టినరోజు. తాను వెలసిన క్షేత్రాలంటే కన్నయ్యకు వెన్నముద్దలంత ఇష్టం. అటువంటి ఐదు దివ్య ధామాల్లో స్వామితో కలసి మనమూ విహరిద్దాం రండి.మధుర - బృందావనం


శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన ప్రదేశంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి కేశవ్దేవ్ దేవాలయం హిందువులకు అత్యంత పవిత్రం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణుడి మునిమనుమడైన వజ్రనాభుడు దాదాపు ఐదువేల సంవత్సరాల కిందట నిర్మించాడని స్థలపురాణం. ఈ దేవాలయంలో జన్మాష్టమితోపాటు వసంత పంచమి, మహాశివరాత్రి, గోపాష్టమి, దీపావళి మొదలైన పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

చూడదగిన ప్రదేశాలు
శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం, గర్భ గుహ, భాగవత భవన్తోపాటు కృష్ణుడు బాల్యంలో నడయాడిన గోకులం, బృందావనం వంటి ప్రదేశాలు కూడా మధుర జిల్లాలోనే ఉన్నాయి. మధుర నుంచి బృందావనం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గోవిందదేవ్, మీరాబాయి, మదనమోహన దేవాలయాలు ప్రసిద్ధి పొందినవి. బృందావనానికి సమీపంలోనే గోవర్ధన పర్వతం ఉంది. నేటికీ దీపావళి పండుగ తరవాత రోజున గోవర్ధన పూజ నిర్వహించడం ఆనవాయితీ. గోవర్ధన గిరిని చిటికెన వేలుపై ఏడు రోజులు ఎత్తి పట్టుకొన్న శ్రీకృష్ణుడు, ఈ రోజునే ఇంద్రుడి గర్వభంగం చేశాడని చెబుతారు. ఈ పర్వతాన్ని స్థానికులు కృష్ణుడి ప్రతిరూపంగా కొలుస్తారు. మధుర నుంచి గోకులం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీటితోపాటు మొఘలుల కాలంనాటి జామా మసీదు, కుసుమ సరోవరం, రాధా కుండ్, మధుర మ్యూజియం సందర్శనీయ స్థలాలు.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి మధుర 1375 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం ఉంది. మధురకు సమీప అంతర్జాతీయ విమానాశ్రయం (147కి.మీ.) న్యూఢిల్లీలో ఉంది. సమీప డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఆగ్రాలోని ఖేరియా విమానాశ్రయం(49కి.మీ.).


ద్వారక

ఏడు మోక్షపురుల్లో ఒకటిగా పిలిచే ద్వారక, గుజరాత రాష్ట్రంలో గోమతీ నదీ తీరంలో ఉంది. సంస్కృతంలో ద్వారక అంటే ‘స్వర్గానికి ద్వారం’ అని అర్థం. కృష్ణుడు పరిపాలించిన ప్రాంతంగా ద్వారక సుపరిచితం. ఇక్కడ దాదాపు 2500 సంవత్సరాల కిందట నిర్మించిన ద్వారకాధీశుడి దేవాలయం ప్రధానమైనది. జగద్గురువు ఆది శంకారాచార్యులు నెలకొల్పిన నాలుగు ప్రధాన మఠాల్లో ఒకటైన ద్వారకా పీఠం (కాళికా మఠం) ఇక్కడే ఉంది. కృష్ణ భక్తురాలైన మీరాబాయి ఇక్కడే స్వామి ప్రతిమలో లీనమైందని చెబుతారు. ఏటా జన్మాష్టమికి ఇక్కడ నిర్వహించే వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు హాజరవుతారు.

చూడదగిన ప్రదేశాలు
రుక్మిణీ దేవి దేవాలయం, గోమతీ ఘాట్, బెట్ ద్వారక, నాగేశ్వర జ్యోతిర్లింగం, ద్వారక లైట్హౌస్, గీతామందిరం, సముద్ర నారాయణ దేవాలయం.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి ద్వారక 1581 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం ఉంది. సమీప విమానాశ్రయం జామ్నగర్ (137 కి.మీ). జామ్నగర్, అహ్మదాబాద్ల నుంచి ద్వారకకు బస్సులో చేరుకోవచ్చు.


గురువాయూర్

కేరళ రాష్ట్రం గురువాయూర్లోని శ్రీకృష్ణ దేవాలయాన్ని భూలోక వైకుంఠంగా కీర్తిస్తారు. ఈ దేవాలయంలో స్వామి నాలుగు చేతులతో... పాంచజన్యం, సుదర్శన చక్రం, కౌమోదకి, తామర పువ్వును ధరించి దర్శనమివ్వడం విశేషం. శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో దేవకి, వసుదేవులకు ఇదే రూపంతో దర్శనమిచ్చాడని ప్రతీతి. అందుకే గురువాయూర్ను ‘దక్షిణ భారత ద్వారక’గా పేర్కొంటారు. ఈ దేవాలయం ఆవిర్భావం గురించి నారద పురాణంలో ఒక ఆసక్తికరమైన గాథ ఉంది. అర్జునుడి మునిమనుమడు (అభిమన్యుడి కుమారుడు) అయిన పరీక్షిత్తు మహారాజు తక్షకుడు అనే పాము కాటుతో మరణిస్తాడు. దీనికి ప్రతీకారంగా ఆయన కుమారుడు జనమేజేయుడు నిర్వహించిన సర్పయాగంలో వేలాది పాములు అగ్నికి ఆహుతి అవుతాయి. ఈ పాపం కారణంగా ఆయనకు తీవ్రమైన కుష్ఠు వ్యాధి సోకుతుంది. ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం ఉండదు. ఆ సమయంలో గురు దత్తాత్రేయ స్వామి ఆదేశాన్ని అనుసరించి గురువాయూర్లో కొలువైన శ్రీకృష్ణుడిని సేవించి రోగ విముక్తుడవుతాడు. ఇక్కడి స్వామిని గురువాయూరప్పన్గా కొలుస్తారు. స్వామి విష్ణువు రూపంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం కృష్ణ ఆలయంగానే ప్రసిద్ధి పొందింది. బాల కృష్ణుడి రూపంలో స్వామి నేటికీ ఈ దేవాలయంలో సంచరిస్తుంటాడని భక్తుల విశ్వాసం.

చూడదగిన ప్రదేశాలు
గురువాయూర్లోని రుద్రతీర్థం, మమ్మియూర్ మహాదేవ క్షేత్రం, ఎలిఫెంట్ క్యాంప్ శాంక్చురీ, పున్నత్తూర్ కొట్ట, వెంకటాచలపతి దేవాలయం, పార్థసారథి దేవాలయం, చాముండేశ్వరి దేవాలయం, హరికన్యక దేవాలయాలను సందర్శింవచ్చు. గురువాయూర్కు 80 కిమీ దూరంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జన్మస్థలమైన కాలడి గ్రామం ఉంది. అక్కడ పూర్ణానది ఒడ్డున ఉన్న శ్రీకృష్ణ దేవాలయం చూడదగింది.

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి గురువాయూర్ 975 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం లేదు. త్రిసూర్ వరకు రైల్లో వెళ్లి అక్కడ నుంచి మరో రైల్లో గురువాయూర్ వెళ్లొచ్చు. లేదా రోడ్డు మార్గంలో (30 కి.మీ) తేలిగ్గా వెళ్లొచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిన్లో ఉంది. (80 కి.మీ). కేరళ, కర్ణాటక, తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు సదుపాయం ఉంది.


ఉడిపి

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి క్షేత్రంలో కొలువైన చిన్ని కృష్ణుని ఆలయం హిందువులకు పరమ పవిత్రమైన ప్రాంతం. ఇక్కడి కృష్ణ మఠాన్ని 13వ శతాబ్దంలో ద్వైత సంప్రదాయ స్థాపకులు మధ్వాచార్యులు ప్రారంభించారు. ఆయన ఇక్కడ ఎనిమిది మఠాలు స్థాపించి వాటికి ఎనిమిది మందిని అధిపతులుగా ఏర్పాటు చేశారు. ఈ మఠాధిపతులే నేటికీ గర్భాలయంలో కృష్ణ పూజలు నిర్వహిస్తున్నారు. వీరికితప్ప ఇతరులెవరికీ మూలమూర్తిని తాకే అవకాశం లేదు. ఇక్కడి కృష్ణ విగ్రహాన్ని మధ్వాచార్యులు ప్రతిష్ఠించారు. ప్రతి రెండేళ్ళకు ఒకసారి నిర్వహించే ‘పర్యాయ’ పండుగ సందర్భంగా ఒక్కో మఠాధిపతికి దేవాలయం బాధ్యతలు అప్పగిస్తారు. ఇక్కడి స్వామికి ప్రతిరోజూ 14 రకాలైన పూజలను నిర్వహిస్తారు. ఈ ఆలయం వెనుక భాగంలో ఉన్న కిటికీ నుంచి స్వామిని దర్శించుకోవడం ప్రత్యేకత.. తన భక్తుడైన కనకదాసుడికి స్వామి ఈ కిటికీ నుంచే దర్శనం ప్రసాదించారని ప్రతీతి. అందుకే దీన్ని ఆయన పేరు మీదుగా ‘కనకన కిండి’ అని పిలుస్తారు.

చూడదగిన ప్రదేశాలు
చంద్రేశ్వర, అనంతేశ్వర దేవాలయాలు, సెయింట్ మేరీస్ ఐలాండ్, అనెగుడ్డె వినాయక దేవాలయం, కొడి బీచ్, కుద్లు ఫాల్స్, ఇంద్రాణి పంచదుర్గ పరమేశ్వరి దేవాలయం, మట్టు బీచ్, బ్రహ్మి దుర్గ పరమేశ్వరి దేవాలయం, కుండేశ్వర దేవాలయం, బెల్కల్ తీర్థ ఫాల్స్ .

ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి ఉడిపి 780 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం లేదు. మంగళూరు వరకు రైల్లో వెళ్లి అక్కడ నుంచి ఉడిపి (54 కిమీ) రైలు లేదా బస్సులో వెళ్ళవచ్చు. సమీప విమానాశ్రయం మంగళూరు (137 కి.మీ).నెమలి

ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి స్వామి ఎంతో మహిమ కలిగిన స్వామిగా భక్తులు భావిస్తుంటారు. సంతానం లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారు. 1953లో నెమలి గ్రామానికి చెందిన వనమా సీతారామయ్య అనే షావుకారు అదే గ్రామానికి చెందిన దారా నరసయ్య అనే రైతు పొలం కొన్నారు. అందులోని మట్టిని తవ్వుతుండగా స్వామి విగ్రహం, శంఖం, పాచిక బయటపడ్డాయి. విషయాన్ని కూలీలు షావుకారు దృష్టికి తీసుకువచ్చారు. 1957 ఫిబ్రవరి 6న స్వామి వెలిసిన ప్రాంతంలోనే ఆలయాన్ని నిర్మించి విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రతి ఏడాది మార్చిలో నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. పౌర్ణమి రోజున స్వామి కల్యాణం వైభవోపేతంగా నిర్వహిస్తారు. భక్తుల విరాళాలతో ఆలయ ప్రాంగణంలో నిర్మించిన గోశాలలో నిత్య పూజలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి స్వామివారి కల్యాణం జరుగుతుంది. భక్తుల విరాళాలతో నిత్య అన్నదానం చేస్తున్నారు.

ఎలా చేరుకోవాలి?
ఏపీలో విజయవాడకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరకు 16 కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఆలయానికి చేరుకునేందుకు బస్సు సౌకర్యంతో పాటు రైలు సౌకర్యం కూడా ఉంది. విజయవాడ, మధిర రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి రైలు మార్గం ద్వారా నెమలి చేరుకునే వీలుంది. ఖమ్మం నుంచి కల్లూరు, చినకోరుకొండ, పొచవరం, వెంకటాపురం, తాళ్లూరు, ఉమ్మడిదేవరపల్లి మీదుగా నెమలి చేరుకోవచ్చు. 

Andhrajyothy

No comments:

Post a Comment