Friday, 2 September 2016

హరిద్వార్

ఉత్తరాఖండ్ని అక్కడివారు ‘దేవభూమి’గా పిలుచుకుంటారు. హరిద్వార్, హృషీకేశ్, గంగోత్రి, యమునోత్రి, కేదారనాధ్, బదరీనాధ్, పాతాళ భువనేశ్వర్, బాగేశ్వర్, జాగేశ్వర్ వంటి పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. హిమాలయాలున్నాయి. విష్ణు ప్రయాగ, నంద ప్రయాగ, కర్ణ ప్రయాగ, రుద్రప్రయాగ, దేవ ప్రయాగలనే పంచ ప్రయాగలు, పంచ బదరులు ఉన్నాయి.


విశేషం దక్షేశ్వరాలయం
హరిద్వార్లో విశేషం ఏమిటంటే దక్షేశ్వరాలయం ఉంది. దక్ష ప్రజాపతికి ఒక ఆలయం ఉండడం అరుదైన విశేషం. బ్రహ్మ దక్షిణాంగుష్టంలో పుట్టినవాడు దక్షుడు. సతీదేవి ఇతని కూతురు. శివుడికి ఇచ్చి వివాహం చేశాడు. బ్రహ్మ యజ్ఞం చేస్తూంటే దక్షుడు చూడడానికి వెళ్లాడు, శివుడు కూడా అక్కడ ఉన్నాడు. కానీ మామగారిని చూసి లేవలేదు. గౌరవించలేదు. దక్షుడికి కోపం వచ్చి సతిని తనింటికి పిలవకుండా మిగిలిన కూతుళ్లను పిలిచి కానుకలిచ్చేవాడు. తండ్రి యజ్ఞం చేస్తున్నాడని తెలిసి పిలవకపోయినా తండ్రి దగ్గరికి వెడుతుంది. ‘నువ్వెందుకు వచ్చావు.’ అని దక్షుడు కోపంతో అడిగి - నీ పతి నన్ను అవమానించాడు కాబట్టి నీవూ నా కుల గౌరవం చెరిపే దానివే అని శివుడ్ని నిందిస్తాడు. సతి యోగాగ్ని కల్పించుకుని శరీరం దహింప చేసుకుంటుంది. శివుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. దక్షునికి కోపం వచ్చి యజ్ఞంలో హవ్యం పొందకుండు గాక అని శాపమిస్తాడు. ఇదీ సంక్షిప్త కథ.

దక్షుడి పేరిట - దక్షేశ్వరాలయం హరిద్వార్లో గంగ ఒడ్డున ఉంది. సతీదేవి జన్మస్థలం, దక్షుడి యజ్ఞవాటిక సతీదేవి దహింప చేసుకున్న స్థలం, చండీదేవి ఆలయం మొదలైనవి ఇక్కడ చూస్తాం. దక్షుడికి మీసాలుంటాయి.

దేవాలయం లోపలి గోడలలో దక్షుని జీవితంలోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. శివతాండవం, సతీదేవి దహనం వంటి చిత్రాలూ ఉన్నాయి. సతీదేవి జన్మస్థలాన్ని భక్తులు దర్శించుకుని పూజలు చేస్తారు. పూర్వం కోట గోడల్లాంటివి ఉండేవి. ఇప్పుడు నగరీకరణలో అవన్నీపోయి మూలాలు కనబడతాయి.
 -ద్వానా శాస్ర్తీ.

No comments:

Post a Comment