Saturday, 10 September 2016

కొడైకెనాల్

ప్రకృతి పరిమళం కొడైకెనాల్

ప్రకృతికి పచ్చల మణిహారంలా... సహజసిద్ధ అందాలతో కొడైకెనాల్ పర్యాటకుల్ని ఆహ్వానిస్తోంది. చక్కటి అనుభూతులు పంచే సందర్శనా ప్రదేశాలకు ఈ ప్రాంతం పెట్టిందిపేరు. విహార యాత్రలను ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన కొడైకెనాల్ పర్యాటక విశేషాలు ఈ వారం
జర్నీలో..

తమిళనాడు రాష్ట్రం నడిబొడ్డున ఉన్న కొడైకెనాల్ సందర్శన కోసం శ్రీకాకుళం నుంచి మా బృందం బయలుదేరింది. నిజానికి, కొడైకెనాల్ వేసవి విడిది కేంద్రం అయినప్పటికీ ఏ సీజన్లోనైనా సందర్శకులను ఉల్లాసపరుస్తూనే ఉంటుంది. కోయంబత్తూర్ రైల్వేస్టేషన్లో ట్రైన్ దిగి ముందే మాట్లాడుకున్న బస్సులో కొడైకెనాల్ బయలుదేరాం. పళని మీదుగా ఘాట్‌రోడ్డులో మా ప్రయాణం సుమారు రెండున్నర గంటలపాటు సాగింది. మధ్యాహ్నం రెండు గంటలకు మా బస్సు కొడైకెనాల్ చేరింది. బస్స్టాండును ఆనుకుని హోటళ్లు చాలా ఉన్నాయి. రోజుకు 250 రూపాయల నుంచి, వేయి రూపాయల వరకు గదులు అద్దెకు దొరుకుతాయి. బస్‌స్టాండ్ దగ్గరే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సంస్థ కార్యాలయం ఉంది. అక్కడ స్థానిక హోటళ్ల వివరాలు, చూడదగిన ప్రదేశాల వివరాలు లభిస్తాయి. మేమంతా ముందుగానే హోటల్ రూం బుక్ చేసుకోవడంతో లగేజీ వాటిలో సర్దేసి అదే హోటల్లో మధ్యాహ్నం భోజనం చేశాం.

కనువిందు చేసే కొడై సరస్సు
హోటల్ పక్కనే ఉన్న కొడై సరస్సు దగ్గరకు వెళ్లాం. ఇది కొడైకెనాల్ పట్టణ కేంద్రంలోనే ఉంది. బ్రిటీష్ హయాంలో 1863లో నిర్మించిన మానవ నిర్మిత సరస్సు ఇది. 45 హెక్టారులు (60 ఎకరాలు) విస్తరించి ఉన్న ఈ సరస్సు ఒక వైపు అరచెయ్యి మాదిరిగా వెడల్పుగా ఉండి, మరోవైపు చేతి వేళ్ళ మాదిరిగా సన్నని పాయలుగా ఉంటుంది. ఈ సరస్సులో బోటు షికారు కూడా ఉంది. మాతో వచ్చినవారిలో కొంతమంది బోటు షికారుకు వెళ్లారు. మరి కొంత మంది గుర్రం సవారీ చేశారు. ఇంకొంతమంది అక్కడే అద్దెకు ఇచ్చే సైకిళ్లను తీసుకొని, సరస్సు చుట్టూ ఉన్న రోడ్డుపై సైక్లింగ్‌కు వెళ్లారు. ఈ సరస్సులో ప్రతి ఏడాదీ మే నెలలో బోట్ రేసులు జరుగుతాయట.

పంపార్ జలపాతం
కొడైకెనాల్ పట్టణానికి ఒక చివరనున్న పంపార్ జలపాతం దగ్గరకు వెళ్లాం. ఎత్తు పల్లాలతో ఉన్న రాతినేల మీద ప్రవహించే సన్నని వాగు అది. కొన్ని సందర్భాలలో ఇది ఉదృతంగానూ, మరికొన్ని సమయాల్లో మామూలుగానూ ప్రవహించడం ఈ జలపాతం ప్రత్యేకత. ఈ ప్రాంతంలో కోతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, చేతుల్లో ఉన్నవి లాక్కోడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ జలపాతం దగ్గరే కొడైకెనాల్ పరిసరాల్లో లభించే రకరకాల జాతుల పండ్లను అమ్మే దుకాణాలున్నాయి.

కోకర్స్వాక్ ఆహ్లాదకరం
కొడైకెనాల్లోని ఒక కొండ అంచునే ఉన్న కాలిబాట ప్రాంతం కోకర్స్వాక్. పంపార్ జలపాతం దగ్గరనుంచి మేమంతా ఈ కాలిబాట మార్గంపైకి వెళ్లాం. మేఘాలతాకిడితో ఉన్న ఈ కొండ చూసేందుకు కాలిబాటలో మేఘమాలికల మధ్య నడుస్తున్న అనుభూతులను పంచుతుంది. అక్కడక్కడా కూర్చోడానికి సిమెంట్ సోఫాలను కూడా పర్యాటకుల సౌకర్యార్ధమై ఏర్పాటు చేశారు. కొండ చుట్టూ ఉన్న ప్రకృతి సోయగాలు ఆహ్లాదంతో మనసుని నింపేస్తాయి.

గ్రీన్ వ్యాలీ వ్యూ
కోకర్స్ వాక్ తర్వాత పక్కనే ఉన్న గ్రీన్వ్యాలీవ్యూకి వెళ్లాం. పర్యాటకులు కొండ అంచున నిలబడి చూడటానికి వీలుగా ఒక ప్లాట్‌ఫామ్ నిర్మించారు. ఇక్కడి నుండి చూస్తే విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ వ్యూ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వైగై డ్యామ్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రకృతి అందాలతో మమేకం కావడానికి ఆఫ్లాట్ఫామ్పై చాలా సమయం గడిపాం. కొడైకెనాల్లో ఉన్న ప్రసిద్ధ నిర్మాణాలలో సెయింట్ మేరీ చర్చి ఒకటి. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ చర్చిలోకి అడుగుపెట్టాం. సుమారు 150 సంవత్సరాలకు పూర్వం కొడైకెనాల్లో నిర్మించిన మొట్ట మొదటి చర్చి ఇది అని అక్కడున్న ఫలకాలు సూచిస్తున్నాయి. ఈ చర్చిలో గోడలపైనా, ఇతర అలంకరణలోనూ నగిషీ పని ఎంతో కళాత్మకంగా ఉంది.

గుణ గుహ
రోడ్డు అంచులో ఉన్న ఒక బాట వెంట సుమారు 200 గజాలు గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో నుంచి కిందకు దిగుతూ వెళితే, చిన్న కొండ అడుగుభాగంలో గుహ కనిపిస్తుంది. కానీ దాని దగ్గరగా వెళ్ళి చూడటం కుదరలేదు. అక్కడకు వెళ్ళటానికి వీలు లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. స్థానికులు దీనిని దయ్యాల గుహ అని వ్యవహరిస్తారు. అయితే విషసర్పాలు ఎక్కువగా ఈ గుహలో ఉంటాయని, అందువల్లే పర్యాటకులు లోపలికి వెళ్ళకుండా గుహ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసారని మా మిత్రుడొకరు చెప్పారు.

అందమైన పైన్ వృక్షాలు
మంచు, చలి ఉండే కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరిగే పైన్ వృక్షాలు ఇక్కడ ఓ చోట సుమారు కిలోమీటర్ విస్తీర్ణంలో దట్టంగా పెరిగి ఉన్నాయి. కొడైకెనాల్‌కు ఈ పైన్ వృక్షాల అరణ్యం ఒక ప్రత్యేకతగా నిలిచింది. ఇక్కడ చాలా సినిమాల చిత్రీకరణ జరిగింది. అలాగే, అవతార్ సినిమా చూసిన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో చూపించిన ఆకాశాన్ని తాకే సూదిమొన కొండల అందాలు. అటువంటివే కొడైకెనాల్లో రమణీయమైన పిల్లర్ రాక్స్. కొడైకెనాల్ నుంచి ఏడున్నర కిలోమీటర్ల దూరంలో ఇవి ఉన్నాయి. ఇక్కడ నుంచి సుందర ప్రకృతిలోని సమస్త అందాలను చూడవచ్చు. ఇక్కడ సహజ సిద్ధమైన మూడు పొడవైన శిలలు ఒకదానికొకటి ఆనుకుని సుమారు 400 అడుగులు ఎత్తు కలిగి ఉంటాయి. కొడైకెనాల్లో రెండు టెలిస్కోప్ హౌసులున్నాయి. ఒకటి కురింజి ఆండవర్ టెంపుల్ దగ్గర ఏప్రిల్ నుంచి జూన్ వరకు తెరిచి ఉంటుంది. రెండోది కోకర్ప్ వాక్ దగ్గర ఏర్పాటు చేశారు. ఇవి కాక కొడైకెనాల్లో దట్టంగా చెట్లతో నిండి ఉన్న విశాలమైన శాంతిలోయ, సోలార్ ఫిజికల్ అబ్జర్వేటరీ, కొడైలో ఎత్తయిన ఆండవర్ టెంపుల్. పాయింట్ నుంచి చూస్తే ఉత్తరాన ఉన్న పళని హిల్స్ తదితర పర్యాటక ప్రదేశాలను చూడొచ్చు.

షాపింగ్
కొడైకెనాల్లో షాపింగ్ ఒక ప్రత్యేకతని సంతరించుకొని ఉంటుంది. రకరకాల ఐటమ్స్ అందుబాటు ధరల్లో ఇక్కడ లభిస్తాయి. ఇక్కడున్న ఖాది ఎంపోరియం, హ్యండ్లూం, కో- ఆపరేటివ్ స్టోర్, గవర్నమెంటు సేల్స్ ఎంపోరియం, మినీ సూపర్‌బజార్, స్పెన్సర్ అండ్ కంపెనీ వంటివి నిత్యం పర్యాటకుల షాపింగ్‌తో కళకళలాడుతుంటాయి.
ఎలా వెళ్ళాలి?
కొడైకెనాల్ సందర్శనకు ఏన్నో మార్గాలున్నాయి. మధురై ఎయిర్‌పోర్టు ఇక్కడికి 120 కి.మీ దూరంలో ఉంది. కోయంబత్తూరు ఎయిర్‌పోర్టు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొడై రైల్వేస్టేషన్‌కు ఇతర ప్రధాన నగరాల నుంచి రైళ్లు ఉన్నాయి ఈ స్టేషనకు పళని రైల్వే స్టేషనన్ 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, పళని, మధురై, దిండిగల్, తిరుచిరాపల్లి, ఈరోడ్, కుయిలి నుంచి బస్సు సౌకర్యం ఉంది. కొడైకెనాల్ నుంచి మధురై 120 కి.మీ. కొడైకెనాల్ నుంచి పళని 65 కి.మీ, కోయంబత్తూరు నుంచి 178 కి.మీ, తిరుచ్చి నుంచి 197 కి.మీ, దిండిగల్ నుంచి 110 కి.మీ దూరంలో ఉన్నాయి. కొండ ప్రాంతం కనుక ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తే మధురై నుంచి సుమారు నాలుగు గంట లు, పళని నుంచి రెండు గంటలు, దిండిగల్ నుంచి మూడున్నర గంటల బస్సు ప్రయాణం ద్వారా కొడైకెనాల్ చేరుకోవచ్చు.
- బెందాళం క్రిష్ణారావు

No comments:

Post a Comment