Saturday, 3 September 2016

ఘృష్ణేశ్వర స్వామి

జ్యోతిర్లింగ స్వరూపుడు

ఆ స్వామిని ఏ పేరుపెట్టి పిలిచినా వచ్చి ఆదుకుంటాడు. భక్తితో ఏది సమర్పించినా ఆదుకుని, కటాక్షిస్తాడు. అందుకే ఆ స్వామి భక్తవ శంకరునిగా, భోళాశంకరునిగా పూజలందుకుంటున్నాడు. శివ పూజ అనేది ప్రాప్తంతో కూడుకున్నది. శివానుగ్రహం ఉంటేనేగానీ శివపూజ లభించదు. శివపూజకు ఎలాంటి నియమ నిబంధనలు లేవు... భక్తితో రెండు చుక్కలు నీరు పోస్తే మహాదేవుడైన ఆ స్వామి పెద్ద మనస్సు చేసుకుని కటాక్షిస్తాడు. అయితే ఉండాల్సిందల్లా భక్తి, విశ్వాసం. శివుడు తన భక్తుల్ని అనుగ్రహించడానికి అనేక చోట్ల వెలిసినప్పటికీ, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలే ఎక్కువగా ప్రసిద్ధి పొందాయి. కారణం, ఆయా క్షేత్రాలతో శివుడు భక్తుల అభీష్టం మేరకు, లోక కళ్యాణం కోసం వెలిశాడు. అలా శివుడు తనకు తానుగా ఆవిర్భవించిన క్షేత్రాలే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల మహిమ అపారం. ఆ మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిసిన పుణ్యథామమే ‘వెరూల్’.

మహారాష్టల్రోని ఔరంగాబాద్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివుడు ఇక్కడ ఘృష్ణేశ్వర స్వామిగా కొలువులందుకుంటున్నాడు. వెరూల్ దివ్యక్షేత్రంలోని శ్రీఘృష్ణేశ్వర స్వామి ఆలయం అందమైనది. మనోహరమైన కట్టడాలతో అలరారుతున్న ఈ ఆలయం చూపురులను ఇట్టే ఆకర్షిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో అలలారుతున్న ఈ దివ్యాలయాన్ని రోజూ వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు.

సాక్షాత్తు మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో వెలసిన వెరూల్ దివ్యక్షేత్రంలో పూర్వం నాగజాతి ఆదివాసులుండేవారు. ‘బాంబీ’ అంటే పాముల పుట్టలని అర్థం. పాముపుట్టలను మరాఠీలో ‘వారూళ్’ అంటారు. ‘వారుళే’ కాలక్రమంలో వెరూల్గా రూపాంతరం చెందినట్టు తెలుస్తోంది. అలాగే పూర్వకాలంలో ఈ క్షేత్రాన్ని ‘యెల’ అనే పేరుగల రాజు పాలించేవాడు. అతని రాజధాని ‘యేలాపూర్’. ఆ యేలాపూర్ యేలూరుగా, వెరూల్గా పేర్గాంచింది.

మనోహరమైన కట్టడాలు, ప్రాకారాలతో అందంగా అలరారుతున్న శ్రీఘృష్ణేశ్వర స్వామి ఆలయం అతి పురానతనమైంది. ఈ ఆలయాన్ని జైజాబాయి, అహిల్యాదేవి హోల్కర్ తదితర భక్తులు పునర్నిర్మించారు. అలాగే ఈ ఆలయ గోపురానికి జయరామ్ భాటియా అనే భక్తుడు స్వర్ణరేకు తాపడం చేశాడు. అలాగే 24 రాళ్ల స్తంభాలతో సభా మండపాన్ని కూడా చేయించాడు. అతి పురానతమైన ఘృష్ణేశ్వరం మహిమాన్వితమైనది. శివుడు ఈ క్షేత్రంలో కొలువై ఉండడానికి పలు పురాణగాథ ప్రచారంలో ఉన్నాయి.

పూర్వం దేవ పర్వతంపై సుదేహ, సుధర్ముడనే బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. సుదేహాకు సంతానం కల్గకపోవడంతో తన చెల్లెలు అయిన ధుశ్శను తన భర్తకిచ్చి వివాహం చేసింది. కొంతకాలానికి ధుశ్శ గర్భాన్ని ధరించి ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ కొడుకు పెద్దవాడై సంతోషభాగ్యాలతో ఉండడంతో ద్వేషాన్ని పెంచుకున్న సుదేహ, తన చెల్లెలు ధుశ్శ కొడుకును చంపించింది చెరువులో పడవేయించిందట. శివ భక్తురాలైన ధుశ్శ, తన కొడుకు మరణించినా చెక్కుచెదరకుండా శివార్చన చేసిందట. శివుడు అనుగ్రహించి ధుశ్శ కొడుకుకి పునర్జీవితం ప్రసాదించాడు. దీనికి కారణమైన సుదేహను భస్మం చేయడానికి ఉద్యుక్తుడవుతుండగా, తన అక్క చేసిన పాపాన్ని క్షమించమని, లోకకళ్యాణం కోసం స్వామిని అక్కడ వెలవమని ప్రార్థించిందట. ధుశ్శ అభీష్టం మేరకు శివుడు అక్కడ ఘృష్ణేశ్వర స్వామి’ నామధేయుడై జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు.

మరో పురాణగాథ ప్రకారం ఒకసారి శివుడు, పార్వతి కామ్యకవనంలో ఏకాంతంలో వుండగా పార్వతికి దాహం వేసిందట. అపుడు శివుడు పాతాళం నుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడట. అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేర్గాంచింది. పార్వతి మాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ, కేసరిలను శివాలయ తీర్థంలో కలిపిందట. ఆమె చేతిలో కుంకుమతో శివలింగం తయారయ్యందట. ఆ లింగం నుంచి ఓ దివ్యజ్యోతి ఉద్భవించగా, పార్వతిమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో వుంచి, లోక కళ్యాణం కోసం అక్కడ ప్రతిష్టించిందట. ఆనాటి నుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడనే పేరొచ్చింది. సాక్షాత్తు పార్వతిమాత ప్రతిష్టించిన జ్యోతిర్లింగం కాబట్టే, దీనికి ఇంత మహత్తు ఏర్పడిందంటారు.

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ఆలయం విశాలమైనది. పూర్తిగా రాతి కట్టడం. ఆలయానికి ముందు భారీ ఆకారంలో ఉన్న రాతి నంది ఉంది. ఈ నంది శిల్పం అందం వర్ణనాతీతం. గర్భాలయానికి ముందు ఎడమవైపు భాగంలో విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. గర్భాలయంలో ఉన్న ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శనం సర్వపాపహరణం. ముక్తిదాయకం... భూమిలోకి చొచ్చుకుపోయి ఉన్న ఈ జ్యోతిర్లింగానికి దిన వారాలతో పనిలేకుండా రోజూ జల, ఫల, పుష్ప, పంచామృతాభిషేకాలు జరుగుతాయి. అలాగే మాఘ, కార్తీక మాసాలలో ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో ఇంకా పార్వతిమాత, వినాయకుడు, ఆంజనేయ స్వామి తదితర దేవతామందిరాలు కూడా ఉన్నాయి.

దాసరి దుర్గా ప్రసాద్


No comments:

Post a Comment