Friday, 9 September 2016

దేవాలయాలు

అక్కడ రావణుడూ దేవుడే
రాముడనగానే దేవుడంటాం. రావణుడంటే రాక్షసుడంటాం. కానీ ఈ దశకంఠుడికి లంకలోనే కాదు మన దేశంలోనూ ఆలయాలున్నాయి.
మహాభారతంలో దుష్టులుగా ముద్రపడిన దుర్యోధన, శకుని, కర్ణులకూ ఆలయాలున్నాయి. వీరికే కాదు మన ఇతిహాసాల్లో ప్రాధాన్యం ఉన్న ఎందరికో మందిరాలు వెలిశాయి. ఆ విశేషాలు..

లంకేశ్వరుడిగా కీర్తి మూట గట్టుకున్నా.. సీతను చెరపట్టి రావణుడు దుష్టుడిగా మిగిలిపోయాడు.
నక్కజిత్తులతో, కుతంత్రపు ఎత్తులతో భారతంలో తారసపడే ఓ పాత్రే శకుని.
ఇక పంచపాండవుల సతీమణి ద్రౌపది.
భీముడి భార్య, రాక్షస రూపిణి హిడింబి, కౌరవాగ్రజుడు దుర్యోధనుడు, కవచకుండలాలతో జన్మించిన వీరుడు కర్ణుడు, కోరుకున్నప్పుడు మరణం పొందే భీష్మాచార్యులు, భర్త కోసం జీవితాంతం అంధురాలిగా మారిన గాంధారి, శ్రీరామచరితను వినిపించిన లవకుశులు ఇలా ఆ ఇతిహాసాల్లో ప్రతి పాత్ర ఓ వైవిధ్యమే. వీరందరికి మనదేశవ్యాప్తంగా ఆలయాలుండటం ఓ ప్రత్యేకతే.

హిడింబి - మనాలి
ఈ దేవాలయం ఓ గుహాలో ఉంటుంది. ఇది మనాలిలో ఉంది. భక్తులు మొక్కుగా ఇక్కడ రక్తతర్పణం చేస్తారు.

కర్ణ ఆలయం - ఉత్తరకాశీ
కర్ణుడి ఆలయం ఉత్తరకాశీలోని డియోర గ్రామంలో ఉంది. ఇక్కడ పాండవులకు కూడా చిన్నపాటి ఆలయాలు ఉండటం విశేషం. దీన్ని చెక్కతో నిర్మించారు.

వాల్మీకి ఆలయం - లాహోర్
రామాయణాన్ని రాసిన అపరబ్రహ్మ వాల్మీకి. ఆ వాల్మీకి మహర్షికి లాహోర్లో ఓ ఆలయం ఉంది. ఇక్కడ దీంతో పాటు శ్రీకృష్ణుడి ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. చెన్నైలోని తిరువాన్మయూర్లో కూడా వాల్మీకి మహర్షికి గుడి ఉంది. ఈ ఆలయానికి దాదాపు 1,300 సంవత్సరాల చరిత్ర ఉంది.

ద్రౌపది ఆలయం - బెంగళూరు
బెంగళూరులో ఉన్న ధర్మరాయ స్వామి ఆలయంలోనే పాండవుల సతీమణి ద్రౌపది పూజలందుకుంటోంది. ఈ ఆలయానికి దాదాపు 800 సంవత్సరాల చరిత్ర ఉంది. తమిళనాడులో కూడా చాలా ప్రాంతాల్లో ద్రౌపదికి ఆలయాలు ఉండటం విశేషం. అంతేకాదు తమిళులు ద్రౌపదిని కాళీమాత అవతారంగా భావిస్తారు. ఈ మాతను ద్రౌపది అమ్మాన్గా పిలుచుకుంటారు.

గాంధారి ఆలయం - మైసూరు
కౌరవుల తల్లి గాంధారికి మైసూరులో ఆలయం నిర్మించారు. దీనికోసం దాదాపు రూ.2.5 కోట్లు ఖర్చు చేశారు. ఇది 2008లో ప్రారంభమైంది.

రావణ ఆలయం - మధ్యప్రదేశ్
రావణుడిని చాలా ప్రాంతాల్లో దేవుడిగా పూజిస్తారు. మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్లలో రావణుడికి ఆలయాలు ఉన్నాయి.

ఇక అలహాబాద్లో భీష్మ పితామహుడికి ఆలయం ఉండటం విశేషం. రామాయణ, భారతాల్లోని పాత్రలు ఇప్పటికీ ప్రజలచే పూజలందుకోవడాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు.

శకుని, దుర్యోధన ఆలయాలు - కొల్లం
మాట్లాడే ప్రతి మాట వెనుక ఏదో కుతంత్రాన్ని ఆలోచించే శకునికి కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ మంచి లక్షణాల వల్లే శకున్ని ఆరాధించే భక్తులు పుట్టుకొచ్చారు. కేరళలోని కొల్లం జిల్లాలో పవిత్రేశ్వరం గ్రామంలో శకునికి ఆలయం ఉంది. అక్కడ నిత్య పూజలు జరగడం విశేషం. ఈ ఆలయానికి వచ్చే భక్తులు కొబ్బరికాయ, పట్టువస్ర్తాలు సమర్పిస్తుంటారు. ఇది చాలా పురాతనమైన ఆలయం.

శకుని ఆలయానికి దగ్గర్లోనే దుర్యోధనుడికి కూడా ఓ ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు దుర్యోధనుడికి పోకవక్క, కోడిపుంజు, ఎర్రని వస్త్రం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాదు శకుని, దుర్యోధనులకు ఇక్కడ కల్లు (మద్యం)ను కూడా నివేదిస్తుంటారు. దుర్యోధనుడికి ఉత్తరాఖండ్లో కూడా ఓ ఆలయం ఉంది. అక్కడ ప్రతిరోజూ కౌరవాగ్రజుడు పూజలందుకుంటాడు.

సుగ్రీవ ఆలయం - బెంగళూర్
వానరవీరుడు, శూరుడు, కిష్కింధ రాజైన ‘సుగ్రీవుడి’ పాత్ర రామాయణంలో కీలకం. శ్రీరాముుని స్నేహితుడిగా ఆయనకు సీతామాతను వెతకడంలో సాయమందిస్తాడు. రామానుగ్రహాన్ని పొందిన సుగ్రీవుడు నిరంతరం భక్తులు పూజలందుకుంటున్నాడు. బెంగళూరులో ఉన్న సుగ్రీవుని ఆలయం ఎంతో పురాతనమైంది. ఆరు అడుగుల ఎత్తున్న సుగ్రీవుడి విగ్రహం చూడటానికి హనుమంతుడిలా ఉంటుంది. రామేశ్వరంలో కూడా సుగ్రీవ ఆలయం ఉంది.

జటాయువు ఆలయం - నాశిక్
నాశిక్కు 65 కిలోమీటర్ల దూరంలో జటాయువు ఆలయం ఉంది. దీన్నే జటాయు మోక్ష తీర్థంగా పిలుస్తారు. రావణునితో వీరోచితంగా పోరాడిన జటాయువు పక్షి ఇక్కడే ప్రాణాలు విడిచినట్లు స్థానికుల కథనం. ఆ ప్రాంతానికి సమీపంలో ఓ చిన్న కొలను ఉంది. దాంట్లోని నీరు ఏ కాలంలోనైనా ఒకేలా ఉండటం విశేషం.

No comments:

Post a Comment