Tuesday, 11 October 2016

ఎల్లోరా గుహలు

ఎల్లోరా గుహలు
నాటి సృజనకు సాక్షం ఎల్లోరా


శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఎల్లోరా గుహలు. భారతీయ శిల్పకళా నైపుణ్యానికి ఓ మచ్చు తునకగా వాటిని చెప్పుకోవచ్చు. కఠినమైన రాతిశిలల్లో దాగి ఉన్న కళాకృతుల అందాలను మాటల్లో వర్ణించడం కాస్త కష్టమే! మరి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ ఎల్లోరా గుహల విశేషాలను ఈ వారం జర్నీలో చూసొద్దాం పదండి!!

మహరాష్ట్రలోని ఔరంగాబాద్‌కు పద్దెనిమిది మైళ్ల దూరంలో ఉన్నాయి ఎల్లోరా గుహలు. వాటిని సందర్శించడానికి మేము ఎక్కి ఉన్న ఆటోలు ఎల్లోరాలోని పదహారో గుహకు ఎదురుగా ఉన్న టాక్సీ స్టాండులో ఆగాయి. ప్రపంచవారసత్వ కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎల్లోరా గుహలు బౌద్ధ, జైన, బ్రాహ్మణీయ మతాల శిల్పకళాసృజనకు సంకేతాలుగా నిలుస్తున్నాయి. మొత్తం 34 గుహలున్న ఎల్లోరాలో శిల్పకళను వీక్షేంచేందుకు రెండు కళ్ళూ చాలవు. ఈ గుహలన్నింటిలో బౌద్ధ గుహలు ప్రాచీనమైనవని, వీటిని క్రీస్తు శకం 500 నుంచి 700 మధ్య కాలంలో చెక్కారని అక్కడ భారత పురాతత్వ శాఖ ఫలకాల ద్వారా తెలుసుకున్నాం.

ఒక్కో గుహా ఒక్కోలా
ఎల్లోరాలోని అత్యంత పురాతనమైన నిర్మాణం ఒకటో గుహ. ఇది ఎనిమిది గదుల విహారం. ఇందులో విశాలమైన ప్రాంగణం ఉంది. రెండో గుహ పెద్ద చైత్యమందిరం. ఇందులో సింహాసనంపై కూర్చొన్న అతి పెద్ద బుద్ధవిగ్రహం, పద్మాసనంలో ఉన్న బుద్ధుని విగ్రహాలు, అనేక మంది బోధిసత్వుల విగ్రహాలను ఆనాటి శిల్పులు రమణీయంగా మలిచారు. మూడో నెంబర్ గుహ ప్రాంగణం చివరిలో ప్రార్ధనామందిరం ఉంది. ఇక్కడ పద్మాసనంలోని బుద్ధుని పక్కనే నాగశిల్పాల విగ్రహాలున్నాయి. ఐదోనెంబరు గుహ విహారం, ఇందులో రెండు వైపులా ప్రత్యేకంగా గూళ్లు ఉన్నాయి. ఇది అతిధి గృహంగా గానీ, శిష్యులకు బోధనలు చేసే మందిరంగానైనా వాడేవారు. ప్రార్ధనామందిరంలో పెద్ద బుద్ధుని విగ్రహం ఉంది. ఆరో గుహ బౌద్ధ గుహ అయినప్పటికీ వీణాపాణి సరస్వతి విగ్రహంతో పాటు వివిధ బౌద్ధ జాతక కథల శిల్పాలున్నాయి. పదో గుహ సక్రమంగా తీర్చి దిద్దిన బౌద్ధచైత్యమందిరం. ముందు భాగాన్ని ఎక్కువగా నగిషీలు చెక్కి అలంకరించారు లోపలి భాగాన పైన చుట్టూ గ్యాలరీలుగల ఆర్చ్లు ఉన్నాయి. పై కప్పునకు వివిధ ఆకృతులతో నగిషీలు చెక్కారు. ఆనాటి కర్రపనితనాన్నే శిల్పాకృతుల్లోకి తీసుకొచ్చినట్లు కన్పిస్తోంది. స్తంభాలపైన మానవాకృతులను చెక్కారు.

మూడు అంతస్థుల 'తీన్థల్'
పదకొండో గుహ మూడంతస్థుల్లో నిర్మించిన ఒక కట్టడంలా ఉంది. ప్రతి అంతస్థులోనూ వసారాలున్నాయి. వివిధ రకాల బుద్ధుని శిల్పాలతో గేలరీలను నిర్మించారు. తొలి ఎల్లోరా శిల్పకళకి ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది. పన్నెండో గుహ మరింత పెద్దది. ఇది కూడా మూడు అంతస్థుల్లో నిర్మితమై ఉంది. దీనిని ఇక్కడ 'తీన్థల్'గా పిలుస్తారు. దీనిలో ప్రతి అంతస్థులోనూ గేలరీలున్నాయి. ఆలయంలోపల అతి పెద్దదైన బుద్ధుని విగ్రహం ఉంది. ఈ విగ్రహంలో బుద్ధుని రెండు చేతులూ జోడించి ఉంటాయి. ఇలాంటి విగ్రహం ఇంకెక్కడా మనకు కన్పించదు. తీవ్రధ్యానంలో ఉన్నట్లుగా శిల్పులు అత్యంత ప్రతిభావంతంగా మలిచారు. బ్రహ్మణమత గుహలు క్రీస్తుశకం 7-9 శతాబ్దాల మధ్యకాలంలో చెక్కారని అక్కడున్న సూచికలు తెలియజేస్తున్నాయి. అంతవరకూ మేము చూసిన బౌద్ధ గుహల్లో ఉన్న చైత్యమందిరాలు, విహారాలకూ ఇక్కడి గుహలకూ ఏమాత్రం పోలికేలేదు. బౌద్ధకళలాగే ఈ చెక్కడాలు మత సంబంధమైనవే అయినప్పటికీ వాటి వ్యక్తీకరణ మరో రూపంలో ఉంది.

సమష్టి శ్రమకు నిదర్శనం
ఎల్లోరా గుహాలయాల్లో అత్యంత ఉత్కృష్టమైనది పదహారో నెంబరు గుహ. ప్రపంచంలోనే అద్భుతమైన ఏకశిలా నిర్మాణంగా ఇది గుర్తింపు పొందింది. మానవ మహామేధస్సుకు, కళాసృజనకూ నిలువెత్తునిదర్శనంలా కన్పిస్తోంది. ఒక కొండలోని సుమారు 30లక్షల ఘనపుటడుగుల రాతిని పూర్తిగా చెక్కి, శిల్పాలను రూపొందించారు. వందలమంది నిర్మాణ నిపుణులు, శిల్పుల సమష్టి శ్రమతో ఈ మహాద్భుతాన్ని సృష్టించారు. ఈ గుహాలయ నిర్మాణానికి మొదటగా, కొండ శిఖరాగ్రం నుంచి ప్రారంభించి, ఒక దీర్ఘచతురస్రాకారపు అగడ్తను రాతి లోతుల్లోకి తవ్వి ఉంటారని స్పష్టమవుతోంది. సుమారు ముప్పైలక్షల ఘనపుటడుగుల రాతిని చెక్కి 107 అడుగుల లోతు, 154 అడుగుల వెడల్పు, 276 అడుగుల వైశాల్యంతో ముందుగా తవ్వి, ఆతర్వాత మధ్యలో మిగిలిన రాతిని దశాబ్దాలపాటు చెక్కి ఉంటారు. గోడలపైనా అపారమైన నగిషీలను చెక్కి, వాటికి అద్భుత నిర్మాణాన్ని జోడించారు. ఇందులో ఒక విశాలమైన ప్రాంగణం, మూడు భవంతులు, వాటిని అను సంధానించే విధంగా ఉపరితల వంతెనను ఏర్పాటు చేసారు. అంతేకాదు, సజీవ పరిమాణంలో ఉన్న ఏనుగుల విగ్రహాలను చూడొచ్చు. ఏనుగులే ఆలయభారాన్ని మోస్తున్నట్లుగా ఉన్న భంగిమలతో శిల్పులు చక్కగా తీర్చిదిద్దారు. గుహ పైకప్పు మూడు విభాగాలు గల పొరలతో సూది వంటి శిఖరాకృతిలో గోపురం ముందుకు పొడుచుకుని ఉండి, మొనదేలినట్లు కన్పిస్తోంది. పైన అర్ధగోళాకృతిలో నిర్మాణం జరిపారు. ఉత్తర ప్రాంగణంలో తొండంలేని ఒక పెద్ద ఏనుగు శిల్పాన్ని ఆనుకుని పెద్ద విజయస్తంభం ఉంది. ఇంకా పైకి వెళితే పన్నెండు ఫలకాలు గల గ్యాలరీ ఉంది. ఇందులో శివపురాణగాథల కల్పనలను శిల్పాలుగా మలిచారు. గోడకు దక్షిణంవైపునఉన్న గ్యాలరీ ఆనుకొని విష్ణువు విగ్రహాలు విభిన్న రూపాల్లో చెక్కారు. గుహకు అన్ని వైపులా రకర కాల శిల్పాలు భారతీయ శిల్పుల కళా ప్రతిభకు అద్దం పడుతున్నాయి. ఎదురుగా యాభై అడుగులు ఎత్తుకలిగి ముఖ్య కట్టడానికి సమాంతరంగా ఉన్న మందిరం ఒకటి ఉంది. ఇరవై చదరపు అడుగుల వైశాల్యమున్న ఈ మందిరంలో నంది విగ్రహానికి ఇరువైపులా ఒక రాయి, స్తంభం ఉన్నాయి. ఈ ధ్వజస్తంభం సుమారు యాభై అడుగులకు పైగా పొడవుంటుంది. దీనిమీద సూక్ష్మశైలిలో ఎన్నో శిల్పాలను చెక్కి ఉన్నారు. మతాభిప్రాయాలను పక్కనపెడితే ఈ గుహాలయం మాత్రం భారతీయ శిల్పకళకు ప్రపంచఖ్యాతిని తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. 25వ గుహ అంతర్భాగంలో ఏడుగుర్రాల రథంపై నిలబడి ఉన్న పెద్ద సూర్యుని విగ్రహం ఉంది.

జైన మత స్మృతులు..
జైన మతానికి సంబంధించిన 30 నుంచి 34వ నంబరు వరకూ ఉన్న గుహల్లో ముఖ్యమైనవి 32, 34 నెంబర్ల గుహలే. 30వ గుహలోని స్తంభాలు, పైకప్పులనూ పద్మాకారపు నగిషీలతో చెక్కారు. వర్ధమాన మహావీరుని విగ్రహం, దాని చుట్టూ చాలా మంది జైన తీర్ధంకరుల విగ్రహాలున్నాయి. 31వ నెంబరు గుహలో కూడా మహావీరుని విగ్రహం, తీర్థంకరుల విగ్రహాలున్నాయి. 32వ గుహను 'ఇంద్రసభ' అంటారని పక్కనే ఉన్న ఫలకంపై రాసారు. దీని ముఖద్వారం వద్ద సుమారు 30 అడుగుల ఎత్తైన ఏనుగు విగ్రహం ఉంది. దానికి సమీపంలోనే అందంగా అలంకరించినట్లు చెక్కిన ప్రార్ధనాలయం ఒకటుంది.. చివరిదైన 34 వ గుహలో ఉన్న విగ్రహాలన్నీ సేవకబృం దాలతో ఉన్న జైన తీర్ధంకరులవే. గోడల్లోనూ స్తంభాలపైనా జైన తీర్ధంకరుల విగ్రహాలను విరివిగా చెక్కారు. ఎల్లోరా సంద ర్శనలో అక్కడక్కడా గైడ్ అవసరమైన చోట గైడ్ హిందీలో చెప్పే విషయాలను మాతో వచ్చిన లియాఖత్ఆలీ తెలుగులోకి అనువదించి మాకు భాషా సమస్యరాకుండా చూసారు.

ఇలా వెళ్లాలి
హైదరాబాద్ నుంచి  మన్‌మాడ్‌కు వెళ్లే రైలుమార్గంలోనే ఔరంగాబాద్ స్టేషన్ ఉంది. అక్కడి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా గుహలున్నాయి. వీటిని చేరుకోవడానికి విరివిగా బస్సులు, ఇతర వాహనాలు ఉన్నాయి. ఔరంగాబాద్‌లో అందుబాటు ధరల్లోనే హోటళ్లు లభిస్తాయి.
- బెందాళం క్రిష్ణారావు
Thursday, 6 October 2016

తిరుప్పరన్ కుండ్రం - వేలాయుధపాణితిరుప్పరన్ కుండ్రం - వేలాయుధపాణిశ్రీ సుబ్రహ్మణ్యస్వామి అసురుడు సూరపద్ముడి సంహారానికి ఆరు రణశిబిరాలను ఏర్పాటుచేశారు. వీటిని తమిళంలో ఆరుపడైవీడు అంటారు. ఈ శిబిరాల్లో ప్రముఖమైనది తమిళనాడు మధురై జిల్లాలోని తిరుప్పరన్ కుండ్రం. ఇతర క్షేత్రాలు తిరుచెందూర్, పళణి, తిరుత్తణి, స్వామిమలై, పళమ్ముదిర్ చోళై.

కొండ దిగువన శిలలను తొలిచి నిర్మించిన తిరుప్పరన్ కుండ్రం ఆలయం అద్భుత శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. పాండ్యుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు తెలుపుతున్నాయి. అయితే అంతకు పూర్వమే ఆలయం ఉన్నట్టు ఆధారాలున్నాయి. నాయక రాజుల కాలంలో నిలువెత్తు విగ్రహాలను చెక్కారు. కొండను తొలచి ఆలయాన్ని నిర్మించడంతో పాటు పలు దేవతల విగ్రహాలను అద్భుతంగా చెక్కడం ద్రవిడ శిల్పకళకు అద్దం పడుతుంది.

ఆరుపడైవీడులో మొదటిది
ఆరుపడైవీడులో ఈ ఆలయం మొదటిది కావడం విశేషం. అన్ని ఆలయాల్లో మురుగన్ నిలుచుకొని అభయమిస్తుండగా ఈ ఆలయంలో ఆసీనుడై భక్తులను ఆశీర్వదిస్తుండటం విశేషం. దేవలోక అధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవయానిని కార్తికేయుడికి ఇచ్చి వివాహనం జరిపిన ప్రదేశంగా తిరుప్పరన్ కుండ్రం ఖ్యాతిచెందింది. దేవయాని సమేతుడైన స్వామి చుట్టూ త్రిలోక సంచారి నారద మునీంద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ, సరస్వతి మాత, సూర్యచంద్రులు, గంధర్వులు వున్న చిత్రం కనిపిస్తుంది.

అభిషేకం వేలాయుధానికే...
సాధారణంగా ఆలయాల్లో అభిషేకం మూలవిరాట్టుకు చేస్తారు. అయితే ఇందుకు భిన్నంగా స్వామి వారి ఆయుధమైన వేలాయుధానికి ఇక్కడ అభిషేకం చేయడం గమనార్హం. సూరపద్ముడిని సంహరించిన అనంతరం స్వామి తన వేలాయుధంతో ఇక్కడకి వచ్చినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. తమిళమాసమైన పెరటాసి నెలలో వేలాయుధాన్ని పక్కన కొండ పై వున్న కాశీవిశ్వనాధుని ఆలయానికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ప్రధాన మందిరం
ప్రధాన మందిరంలో శ్రీ సుబ్రమణ్యస్వామి భక్తులకు దర్శనమిస్తుంటారు. సమీపంలోనే ఆది దంపతులైన పార్వతి, పరమేశ్వరుల మందిరం, కర్పగ వినాయక మందిరం, విష్ణుమూర్తి ఆలయాలున్నాయి. ప్రాంగణంలోనే కంబతడి మండపం, అర్ధమండప, మహామండపాలను చూడవచ్చు. వీటి పై ఉన్న శిల్పకళ చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది.

నక్కిరార్ ఆలయం
ప్రముఖ తమిళకవి నక్కిరార్కు ఒక ఆలయముంది. ఆలయ సమీపంలో తపస్సు చేసుకుంటున్న నక్కీరార్కు ఒక రోజు ఆలయ పుష్కరిణలో సగం చేప, సగం పక్షి రూపంలో వున్న ఒక జీవం కనిపించింది. దీన్ని ఆయన తదేకంగా చూడటంతో తపస్సు భంగమైంది. ఆ విచిత్ర రూపం రాక్షసరూపం దాల్చి అతన్ని బందీగా పట్టుకుంది. దీంతో ఆయన తనను రక్షించమంటూ మురుగన్ను తిరుమురుగట్టురుపడైని గానం చేశాడు. దీంతో స్వామి ప్రత్యక్షమై నక్కిరార్ను అతనితో పాటు వున్న అనేకమందిని రక్షించాడు. స్వామి తన వేలాయధంతో ఒక రాతిపై కొట్టడంతో గంగ జలం బయటకు వచ్చింది. ఈ జలంలో మునిగితే పాపాలు పోతాయి. ఎంత వేసవిలోనూ ఈ తీర్థం ఎండిపోకపోవడం విశేషం.

ఇలా చేరుకోవచ్చు
* తమిళనాడులోని మధురై చేరుకొని అక్కడ నుంచి తిరుప్పరన్కుండ్రానికి చేరుకోవచ్చు.
* మధురై నుంచి తిరుప్పరన్కుండ్రం 8 కి.మీ.దూరంలో వుంది.
* మధురైకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి విమాన, రైలు, బస్సు సౌకర్యాలున్నాయి.నేపాల్లో ప్రకృతి అందాలు చూద్దామా!

మంచు శిఖరాల మీద విమానంలో విహరించాం

‘ఎవరెస్టు శిఖరం మీద ఎగురుతూ ధవళవర్ణంలో ధగధగలాడే హిమాలయ పర్వతశ్రేణుల సౌందర్యాన్నీ ఆ కొండల్లోంచి జాలువారి వయ్యారంగా మలుపులు తిరుగుతూ సాగే నదుల అందాలనూ... ఎంతసేపు చూసినా విసుగనిపించదు.’ అంటూ ఆ విశేషాలను మనతో పంచుకుంటున్నారు ఇటీవలే నేపాల్ను సందర్శించిన మిర్యాలగూడకు చెందిన బి.దయానంద్.

చుట్టూ భూభాగంతో ఉండే నేపాల్లో ప్రకృతి అందాలకూ జీవ వైవిధ్యానికీ లోటు లేదు. ప్రధాన ఆదాయం పర్యటక రంగమే. అందుకే ఆ దేశాన్ని చూసేందుకు ఖమ్మం నుంచి గోరఖ్పూర్ వరకూ రైల్లో వెళ్లి, అక్కడ నుంచి మరో రెండు గంటలు ప్రయాణించి నేపాల్ సరిహద్దుకి చేరుకున్నాం. అక్కడ గేటు దగ్గర తనిఖీలన్నీ పూర్తయ్యాక నేపాల్లోని భైరవ పట్టణంలో అడుగుపెట్టాం. ఇది విశాలమైన రోడ్లతో చక్కని కట్టడాలతో పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఓ గంట ప్రయాణం చేశాక లుంబినీకి చేరుకున్నాం. బుద్ధుడు జన్మించిన రాజప్రాసాదం ఓ పెద్ద ఉద్యానవనంలో అవసానదశలో ఉంది. మొండిగోడలతో శిథిలావస్థలో ఉన్న ఆ పురాతన రాజప్రాసాదంమీద బౌద్ధమత సంప్రదాయంలో ఓ పెద్ద డోమ్ను నిర్మించారు. మర్నాడు పదిగంటలపాటు హిమాలయ పర్వతశ్రేణుల్లో ప్రయాణించి ఖాట్మండు చేరుకున్నాం. ఇక్కడ హోటల్ గదుల ధరలు భారత్తో పోలిస్తే చాలా తక్కువ. మన రూపాయి 1.60 నేపాలీ రూపైయాలతో సమానం. పైగా మన రూపాయలు అక్కడ చలామణీ అవుతాయి. నేపాల్లో 90 శాతం హిందువులూ పది శాతం మంది ఇతరులూ ఉన్నారు. ఖాట్మండులో చూడాల్సిన ప్రదేశాల్లో పశుపతినాథ్ మందిరం ముఖ్యమైనది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఈ మందిరంలోని శివలింగానికి నాలుగువైపులా ముఖాలు దర్శనమిస్తాయి. దానిపైన బంగారురేకుతో చెక్కిన శివముఖాకృతిని తొడుగుతారు. భారత సంతతికి చెందినవారే ఇక్కడ పూజారులు. ఈ మందిరానికి దిగువన ఓ పక్కగా భాగమతీ నది ప్రవహిస్తుంటుంది. మందిర ప్రాంగణం నుంచి కిందకు చూస్తుంటే కొంతమంది మంత్రోచ్ఛారణతో ఓ పార్ధివ శరీరాన్ని నదిలో మూడుసార్లు ముంచి ఒడ్డునే ఉన్న చితిపై దహనం చేయడం కన్పించింది. అందులో నుంచి వస్తోన్న పొగ పశుపతి మందిరంవైపు వస్తూ గోపురాన్ని తాకుతూ ఉంటే ఆ శరీరంలోని ఆత్మ ఆ గోపురంద్వారా మందిరంలోకి ప్రవేశించి ఆ దైవంలో ఐక్యమవుతుందా అన్న భావన కలుగుతుంది.

దర్బారు కూడలి!
తరవాత మేం దర్బార్ స్క్వేర్కు వెళ్లాం. రాజమహల్తోపాటు ఇతరత్రా అనేక మందిరాలూ ప్రజాదర్బారు భవనాలూ పచ్చికబయళ్లతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడే కాదు, పాటన్, భక్తపుర్ పట్టణాల్లో కూడా దర్బారు స్క్వేర్లు ఉన్నాయి. చెక్కలతోనూ ఇటుకలతోనూ కట్టిన అనేక అంతస్తుల పగోడాలతో ఇవి ఎంతో చూడచక్కగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు పట్టణాలూ కలిసిపోయి ఖాట్మండు వ్యాలీగా మారాయి.
తరవాత అక్కడ నుంచి బౌద్ధ స్థూపానికి వెళ్లాం. బుద్ధుడి మరణానంతరం ఓ పేద మహిళ తన జీవితకాలం కష్టపడి దీన్ని నిర్మిస్తూ మరణించిందనీ ఆమె కోరిక మేరకు నలుగురు కొడుకులూ దాన్ని పూర్తిచేశారనీ చెబుతారు. 118 అడుగుల ఎత్తూ 325 అడుగుల చుట్టుకొలతలతో ఉన్న ఈ స్థూపం ప్రపంచంలోని ఎత్తైన స్థూపాల్లో ఒకటి. ఇక్కడి నుంచి బుడా నీలకంఠ దగ్గరకు వెళ్లాం. అక్కడ ఉన్న నీటికొలనులో ఆదిశేషునిమీద నిద్రిస్తున్నట్లుగా ఉన్న నలభై నాలుగు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ఉంది. క్షీరసాగర మథనంలో ఏర్పడిన గరళాన్ని తాగిన శివుడు ఆ గరళకంఠాన్ని చల్లార్చుకోవడానికి ఈ కొలనులో నీరు తాగాడనీ అందుకే ఆ పేరు వచ్చిందనీ పూజారులు చెప్పారు. ఇక్కడ నుంచి స్వయంభూనాథ్కి వెళ్లాం. దీన్నే కోతుల ఆలయం అనీ పిలుస్తారు. ఈ కొండమీదకి రోడ్డుమార్గంలోగానీ 365 మెట్లు ఎక్కిగానీ చేరవచ్చు. ఇక్కడికి ఉదయం తొమ్మిదిగంటలలోపు వెళ్లడం మంచిది. ఓ పెద్ద సరస్సు మధ్యలో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోన్న తామరపుష్పాన్ని దగ్గరగా చూడాలని మంజుశ్రీ అనే యోధుడు కొన్ని కొండరాళ్లను తొలగించి సరస్సులోని నీటిని ఖాళీచేసి ఆ పుష్పం దగ్గరకు వెళ్తూ ఉంటే తామరపుష్పం పెద్ద కొండగానూ దాని తేజస్సు స్థూపంగానూ మారాయనీ అందుకే దీన్ని స్వయంభూ స్థూపం అంటారనీ చెప్పారు. ఈ స్థూపానికి నలువైపులా బుద్ధుడి కళ్లను చిత్రించారు. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించింది.

పర్వత శిఖరాల్లో విహారం
తరవాత రాయల్ ప్యాలెస్కి వెళ్లాం. మ్యూజియంగా మార్చిన ఈ ప్యాలెస్లో అనేక కళాఖండాలూ నేపాల్ సంస్కృతీ చిహ్నాలూ ప్రాచీన వస్తువులూ కనిపించాయి. ఖాట్మండులోని థామెల్ ప్రాంతంలో క్యాసినోలూ నైట్క్లబ్ల సందడి కనిపించింది. తరవాతిరోజు ఉదయం త్రిభువన్ ఏరోడ్రోమ్కి వెళ్లాం. ఓ మౌంటెయిన్ ఫ్లైట్లో లాంగ్టాంగ్ నుంచి గౌరీశంకర్, ఎవరెస్టు, మకాలు వరకూ ఉన్న అన్ని పర్వతాల ఉపరితలాన్నీ చూపించారు. విమానం ఆయా పర్వత శిఖరాలమీద ఎగురుతుంటే సూర్యుడి కిరణాలు ఆ మంచు శిఖరాలమీద రంగులు మారుతూ మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఎవరెస్టు పర్వతశిఖరంమీద ఎగురుతున్నప్పుడు ఎంతో ఉద్విగ్నతకు గురవుతాం. కదిలే మేఘాల నీడలు సూర్యుడి వెలుగులో తెల్లని మంచుకొండలమీద నల్లగా పడుతూ వేగంగా పరుగెడుతున్నట్లు కనిపిస్తుంటే తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయాం.

ఆ మర్నాడు ఉదయం ఖాట్మండు నుంచి మూడుగంటలపాటు ప్రయాణించి మనోకామన అనే ప్రదేశానికి చేరుకున్నాం. కొండమీద ఉన్న ఈ మందిరానికి రోప్వే ద్వారా ప్రయాణిస్తుంటే ఎంతో థ్రిల్లింగ్గా అనిపించింది. ఈ మందిరంలోని అమ్మవారిని త్రికరణ శుద్ధితో ప్రార్థిస్తే మనసులో కోరికలన్నీ నెరవేరతాయట. అందుకే దీనికా పేరు. దర్శనానంతరం అక్కడి నుంచి మూడు గంటలపాటు ప్రయాణించి పోఖరాకి చేరుకున్నాం. ఈ పట్టణంలో సగభాగం సరస్సులే. మరోపక్క మంచుతో కప్పబడిన అన్నపూర్ణ పర్వతశిఖరాలు కనువిందు చేస్తుంటాయి. ఫెవా సరస్సు పక్కన గల బజారులో ఖరీదైన షాపులూ రెస్టరెంట్లూ కనిపించాయి. ఈ పట్టణంలో చూడదగ్గవాటిలో గుప్తేశ్వర్ మహదేవ్ కేవ్ మందిరం ముఖ్యమైనది. ఈ గుహలోకి వెళ్లడానికి సుమారు యాభై అడుగుల లోతుకి ఉన్న మెట్లు దిగాలి. ఈ మెట్లు దిగి కిందకు వెళితే ఓ ద్వారం ఉంటుంది. ఈ ద్వారం గుండా లోపలకు వెళితే ఓ గుహ కనిపిస్తుంది. అందులో కొంతదూరం నడిచాక మరో వందమెట్లు కిందకు ఉంటాయి. అవి దిగుతూ ఉంటే చల్లని నీటి చుక్కలు మనమీద ధారలాగా పడుతుంటాయి. అయినా గాలి లేకపోవడంతో చెమటలు పడుతుంటాయి. అలా మెట్లన్నీ దిగి కొంతదూరం నడిస్తే అక్కడ శివాలయం కనిపించింది. దైవదర్శనానంతరం మందిరం వెనక వైపున ఉన్న గుహలోకి వెళ్లాం. అక్కడ గుహ చాలా ఇరుకుగా ఉంటుంది. తరవాత అక్కడ నుంచి కొంతదూరంలోని ఓ కొండమీద ఉన్న వింధ్యవాసినీ మందిరానికి వెళ్లాం. ఇందులోనే అనేక దేవాలయాలు ఉన్నాయి.

అది పెద్ద సాహసమే!
తరవాత గబ్బిలాల గుహకి వెళ్లాం. ఇందులోకి వెళ్లడానికి అందరికీ టార్చిలైటు ఇస్తారు. ఈ గుహలో ఏటవాలుగా ఉన్న మార్గంలో యాభై అడుగులు వెళ్లాక గుహ అంతా ఎత్తుపల్లాలతో చీకటిగా ఉంటుంది. కొంతదూరం వెళ్లాక బయటకు రావడానికి మరో మార్గం ఎక్కడో పైన కనిపించింది. అక్కడకు పాకుతూ వెళితే ఓ రంధ్రం కనిపించింది. ముందు చేతులు బయటపెట్టి దాన్ని పట్టుకుని తల బయటకు పెట్టాలి. తలను పూర్తిగా నేలవైపు వంచి చేతులతో పాకుతూ శరీరాన్ని బయటకు లాగాలి. ఇది చాలా క్లిష్టమైన చర్య. పర్వతారోహణ శిక్షణలో ఓ భాగమని ఆ గుహ నిర్వాహకులు చెప్పారు. తరవాత అక్కడే ఉన్న డెవీస్ ఫాల్స్, మహేంద్ర కేవ్స్, ఫెవా సరస్సుల్నీ చూశాం. సరస్సు మధ్యలోని విష్ణు మందిరాన్ని సందర్శించుకుని పోఖరాకు సమీపంలోని సారంగపూర్కి వెళ్లాం. అక్కడ బంగీజంప్, జిప్మర్, పారాగ్లైడింగ్, రాఫ్టింగ్, క్యాంపింగ్, రాక్క్లైంబింగ్... వంటి సాహస క్రీడలు ఉన్నాయి.

ముక్తినాథ యాత్ర!
మర్నాడు ఉదయం ఆరుగంటలకు ముక్తినాథ్ వరకూ బయలుదేరాం. పోఖరా నుంచి ముక్తినాథ్ వరకు ప్రయాణించడం అంటే ప్రపంచంలో పదో ఎత్తైన అన్నపూర్ణ పర్వత శిఖర వలయాన్ని దక్షిణం నుంచి ఉత్తరం వరకూ అంటే సగభాగం చుట్టి వేయడమే. ఇది సుమారు 15 గంటల ప్రయాణం. బేణి వరకూ మాత్రమే తారు రోడ్డు ఉంటుంది. మిగిలిన రోడ్డు మొత్తం మట్టిరోడ్డు. ఈ మట్టిరోడ్డుమీద భారీ కొండల్ని ఎక్కుతూ లోయలోకి దిగుతూ ప్రయాణించాలి. కొన్నిచోట్ల ధూళి బస్సులోకి వచ్చి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మరికొన్నిచోట్ల బురద ఉంటుంది. ఇక్కడ ఏమాత్రం జారినా కింద ప్రవహించే కాళి-గండకీనదిలో పడిపోవడం ఖాయం. మరికొన్నిచోట్ల కొండలమీద మేఘాలను తాకుతూ ప్రయాణిస్తాం. అక్కడక్కడ రోడ్డుపక్కన ఉన్న గ్రామాలే మాకు ఆతిథ్యాన్ని ఇచ్చాయి. ఇక్కడి ప్రజలు చాలా కష్టజీవులు. అయినా ముఖంలో చిరునవ్వు చెరగదు. ఏదైనా అడిగితే ఎంతో వినయంగా జవాబు చెబుతారు. యువతీయువకులు అలంకరణకి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. వీళ్లను చూస్తుంటే హిమాలయాలు ఫ్యాషన్లకి పుట్టిల్లేమో అనిపిస్తుంది. కానీ వీళ్ల మాటల్లో ముఖాల్లో అమాయకత్వం స్పష్టంగా కనిపిస్తుంది. భోజనానంతరం మా ప్రయాణం మళ్లీ మొదలైంది. మాతోనే వస్తోన్న కాళీగండకీ నదీ ప్రవాహం పాయలుగా చీలింది. సాయంత్రం ఆరుగంటలకు జోమ్సోమ్ అనే చిన్న పట్టణం చేరుకున్నాం. ఆ రాత్రి జోమ్సోమ్లో గడిపి ఉదయాన్నే ముక్తినాథ్కు ప్రయాణమయ్యాం. సుమారు యాభై కిలోమీటర్ల దూరం... మట్టిరోడ్డు ప్రయాణం... మూడుగంటలపాటు ప్రయాణించి ముక్తినాథ్కు చేరుకున్నాం. ఇదో అద్భుతప్రదేశం. సుమారు పదమూడు పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉన్న ముక్తినాథ్ నుంచి ఎటు చూసినా అన్నీ మట్టికొండలే కనిపిస్తాయి. ఈ కొండలపై ఓ చెట్టుగానీ మొక్కగానీ కనిపించవు. కారణం ఈ కొండలన్నీ పది నెలలపాటు మంచుతో కప్పబడి ఉంటాయి. వీచే చల్లనిగాలులూ నులివెచ్చని నీరెండల మధ్య కనుచూపుమేర వరకూ ఉన్న ఈ మట్టికొండలను చూస్తుంటే నిజంగా మనం భూమిమీదే ఉన్నామా లేక వేరే గ్రహంమీద ఉన్నామా అన్న అనుమానం కలగకమానదు. ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో కొండపై ఉన్న మందిరానికి కాలినడకన ప్రయాణమయ్యాం. ఇక్కడ కొండమీదకు ఎక్కేటప్పుడు ఆక్సిజన్ అందక ఇబ్బందితో కిందకు జారే అవకాశం ఉంటుంది. అనేక అవరోధాలను అధిగమించి పురాతనమైన ముక్తినాథ్ మందిరానికి చేరుకున్నాం. ఇది శ్రీమహావిష్ణువు మందిరం. దీనికి వెనకవైపున 108 గోముఖాల నుంచి వెలువడే నీటి ధారల్లో స్నానమాచరించి శ్రీమహావిష్ణువును దర్శించుకుంటే జనన మరణాలనుంచి ముక్తి పొంది ఆ భగవంతునిలో ఐక్యమవుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయంలో పూజారిణులు మాత్రమే ఉంటారు. ఇందుకోసం కొన్ని ప్రత్యేక లక్షణాలున్న బాలికలను చిన్నవయసులోనే గుర్తించి వాళ్లకి శిక్షణ ఇచ్చి పూజారిణులుగా నియమిస్తారు. వీళ్లు జీవితకాలం అవివాహితులుగానే ఉంటూ తమ జీవితాన్ని ఆ భగవంతునికి అంకితం చేస్తారు. దర్శనానంతరం ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న జ్వాలామయి మందిరానికి వెళ్లాం. ఈ మందిరం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. లోపలికి గాలి బాగా వీస్తుంది. కానీ మందిరంలో ఉన్న ప్రమిదలోని జ్వాల మాత్రం నిరంతరం వెలుగుతుండటం అద్భుతంగా అనిపిస్తుంది. ప్రకృతి ప్రియులకూ భక్తులకూ స్వర్గధామం అనిపించే ముక్తినాథ్కు అయిష్టంగానే వీడ్కోలు పలికి వెనుతిరిగాం.

డ్యూమాస్‌ బీచ్‌ - ఆ బీచ్‌లో ఆత్మలు ఉన్నాయా?

అనగనగా ఓ బీచ్‌.. 
చుట్టూ చిమ్మచీకట్లు.. 
హోరున శబ్దం చేసే అలలు.. 
చీకటికే భీతి గొలిపించే నల్లని సముద్రపు ఇసుక.. 
చిత్రవిచిత్రంగా వీచే పిల్లగాలులు.. 
చెవి దగ్గరకొచ్చి ఎవరో ఏదో చెబుతున్నట్టుగా వినీవినిపించని మాటలు.. 
అంతలోనే ఒళ్లు గగుర్పొడిచేలా బిగ్గరగా ఓ నవ్వు.. 
దూరంగా ఎవరితోనో కొట్లాటకు దిగినట్టుగా కుక్కల అరుపులు.. 
చుట్టూ చూస్తే ఎవరూ కనిపించని మాయాజాలం.. 
ఇవి చాలవూ ఓ మనిషి బిక్కచచ్చిపోవడానికి..?

గుజరాత్‌లోని సూరత్‌కు 19 కిలోమీటర్ల దూరాన ఉన్న డ్యూమస్‌ బీచ్‌ గురించి కథలు కథలుగా చెప్పుకొంటారు పర్యాటకులు. ఇక్కడ ఆత్మలు ఉన్నాయని, అవి రాత్రి పూట బీచ్‌ ఒడ్డున సంచరించే వారికి హాని తలపెడతాయనేది ప్రధానంగా వినిపించే మాట. సాయంత్రం అయితే చాలు. స్థానికులు ఈ బీచ్‌ వైపు రావడానికి అస్సలు ఇష్టపడరు. పైగా ఎవరైనా డ్యూమస్‌ వైపు వెళ్తామనగానే అడ్డుపడతారు. అటువైపు వెళ్లొద్దంటూ సలహాలిస్తారు. నిజంగా ఈ బీచ్‌లో అంతగా భయపెట్టే అంశమేంటి..?

నల్లని ఇసుక..
నిజానికి డ్యూమస్‌ బీచ్‌ ఒకటి కాదు.. నాలుగు బీచ్‌లను కలిపి డ్యూమస్‌ బీచ్‌గా పిలుస్తారు. వీటిలో రెండు పర్యాటకులకు బాగా తెలిసినవే. మూడో బీచ్‌ను కొద్దిమంది మాత్రమే సందర్శిస్తారు. ఇక, నాలుగో బీచ్‌లో జనసంచారం గురించి మాట్లాడుకోకపోవడమే మేలు. దేశంలోని ఏ బీచ్‌లోనూ కనిపించని విధంగా ఈ బీచ్‌లో నల్లని ఇసుక దర్శనమిస్తుంది. దీనికి స్థానికులు చెప్పే వివరణ.. స్మశానం! అవును, ఒకప్పుడు డ్యూమస్‌ బీచ్‌లో ఓ హిందూ స్మశానం ఉండేది. వేలాది హిందువులను అక్కడే ఖననం చేసేవారు. అలా ఏర్పడిన బూడిద.. సముద్రపు ఇసుకతో కలిసి నల్లగా తయారైందని చెబుతారు స్థానికులు.

ఆత్మల సంచారం..
హిందూ మత విశ్వాసాల ప్రకారం మరణించినవారు సంతృప్తి చెందకపోతే వారి ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటుంది. అలా వేలాది ఆత్మలు ఈ బీచ్‌లో సంచరిస్తున్నాయని చాలామంది నమ్మకం. రాత్రి వేళల్లో బీచ్‌ ఒడ్డున తిరిగేవారికి ఈ ఆత్మల గొంతు వినిపిస్తుందని, కొన్ని ఆత్మలు అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నట్టుగా చిత్రవిచిత్రంగా అరుస్తాయని గ్రామస్థులు చెబుతారు. కొన్నిసార్లు ఉన్నట్టుండి బిగ్గరగా ఎవరో నవ్వుతున్నట్టుగా అనిపిస్తుందని, కానీ చుట్టూ చూస్తే ఎవ్వరూ కనిపించరని కొందరు పర్యాటకులు చెబుతారు. సాధారణంగానే అత్యంత నల్లని డ్యూమస్‌ బీచ్‌.. చీకటి పడుతున్న కొద్దీ జడల మర్రిలా మరింత భయంకర రూపాన్ని సంతరించుకుంటుంది. పర్యాటకులు, స్థానికులు భయపడేందుకు ఇదీ ఓ కారణం కావొచ్చు.

విచిత్ర ప్రవర్తన..
డ్యూమస్‌ బీచ్‌ గురించి చాలామంది పర్యాటకులు చెప్పేది ఇక్కడి విచిత్రమైన వాతావరణమే. సాధారణంగా కుక్కలు ఈ బీచ్‌కు రాగానే అదే పనిగా అరుస్తూ ఉంటాయట. ఎవరినో చూస్తున్నట్టు, వారితో గొడవ పడుతున్నట్టు కుక్కలు విచిత్రంగా ప్రవర్తిస్తాయట. పెంపుడు కుక్కలదీ ఇదే పరిస్థితి. ఈ కుక్కల యజమానులు వాటిని నియంత్రించడానికి నానా తంటాలూ పడతారట ఈ బీచ్‌లో. ఇవి కాకుండా.. పర్యాటకుల శరీరాలను ఏవో గాలులు తాకుతున్నట్టూ, వారిని ముందుకు వెళ్లవద్దనట్టుగా అడ్డుకుంటున్నట్టూ అనుభూతి కలుగుతుందట.

మిస్సింగ్‌...?
స్థానికుల మాటలు పెడచెవిన పెట్టి, రాత్రి పూట బీచ్‌ను సందర్శించిన కొందరు పర్యాటకులు ఇప్పటికీ కనిపించకుండా పోయారనే ఓ పుకారు సమీప గ్రామాల్లో వినిపిస్తూ ఉంటుంది. గతంలో కొందరు స్థానికులు కూడా బీచ్‌కు వెళ్లి తిరిగిరాలేదట.

భయపెట్టే హవేలి..
ఈ బీచ్‌లో మరింత భయపెట్టే కథలు హవేలి విషయంలో వినిపిస్తాయి. నవాబు సిది ఇబ్రహీం ఖాన్ కట్టించిన ఈ ప్యాలెస్‌లో ప్రస్తుతం మనుషులెవరూ నివసించడం లేదు. ఈ హవేలీ బాల్కనీలో ఎవరో నిల్చున్నట్టుగా కనిపిస్తుందట. దగ్గరగా వెళ్లి చూస్తే ఆ ఆకారం మాయమవుతుందట. అందుకే స్థానికులు సైతం హవేలిలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. ఇక, పర్యాటకులను ఇందులోకి చాలా ఏళ్ల కిందటి నుంచే అనుమతించడం లేదు.

అంతా భూటకం..
ఈ మొత్తం కథనాన్ని భూటకమని కొట్టి పారేసేవారూ ఉన్నారు. చాలామంది మొండిగా ఈ బీచ్‌లో రాత్రిపూట బస చేశారు. కానీ, వారు ఇక్కడ ప్రచారంలో ఉన్నట్టుగా.. తమకు ఎలాంటి అసహజ అనుభవాలూ ఎదురుకాలేదని చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం మొదలుపెట్టారని, నిజానికి డ్యూమస్‌లో అంతటి భయానక వాతావరణం ఏమీ ఉండదని చెబుతున్నారు. అయితే, కొంతమంది తమ కెమెరాల్లో బంధించిన కొన్ని దృశ్యాలు ఆత్మలు ఉన్నాయనడానికి బలం చేకూర్చుతున్నాయి. అదే సమయంలో అవి ఫ్లాష్‌ లోపాల వల్ల ఏర్పడిన ఇల్యూజన్ అనేవారూ లేకపోలేదు. మొత్తానికి ఇక్కడ ఆత్మలు ఉన్నాయా.. లేదా అన్నది పక్కన బెడితే, ప్రస్తుతం దేశంలోని డిమాండ్‌ ఉన్న బీచ్‌ల్లో ఇదీ ఒకటిగా మారిపోయింది. ఆత్మలా మజాకానా..!
(సాక్షి స్కూల్ ఎడిషన్)