Tuesday, 11 October 2016

ఎల్లోరా గుహలు

ఎల్లోరా గుహలు
నాటి సృజనకు సాక్షం ఎల్లోరా


శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఎల్లోరా గుహలు. భారతీయ శిల్పకళా నైపుణ్యానికి ఓ మచ్చు తునకగా వాటిని చెప్పుకోవచ్చు. కఠినమైన రాతిశిలల్లో దాగి ఉన్న కళాకృతుల అందాలను మాటల్లో వర్ణించడం కాస్త కష్టమే! మరి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ ఎల్లోరా గుహల విశేషాలను ఈ వారం జర్నీలో చూసొద్దాం పదండి!!

మహరాష్ట్రలోని ఔరంగాబాద్‌కు పద్దెనిమిది మైళ్ల దూరంలో ఉన్నాయి ఎల్లోరా గుహలు. వాటిని సందర్శించడానికి మేము ఎక్కి ఉన్న ఆటోలు ఎల్లోరాలోని పదహారో గుహకు ఎదురుగా ఉన్న టాక్సీ స్టాండులో ఆగాయి. ప్రపంచవారసత్వ కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎల్లోరా గుహలు బౌద్ధ, జైన, బ్రాహ్మణీయ మతాల శిల్పకళాసృజనకు సంకేతాలుగా నిలుస్తున్నాయి. మొత్తం 34 గుహలున్న ఎల్లోరాలో శిల్పకళను వీక్షేంచేందుకు రెండు కళ్ళూ చాలవు. ఈ గుహలన్నింటిలో బౌద్ధ గుహలు ప్రాచీనమైనవని, వీటిని క్రీస్తు శకం 500 నుంచి 700 మధ్య కాలంలో చెక్కారని అక్కడ భారత పురాతత్వ శాఖ ఫలకాల ద్వారా తెలుసుకున్నాం.

ఒక్కో గుహా ఒక్కోలా
ఎల్లోరాలోని అత్యంత పురాతనమైన నిర్మాణం ఒకటో గుహ. ఇది ఎనిమిది గదుల విహారం. ఇందులో విశాలమైన ప్రాంగణం ఉంది. రెండో గుహ పెద్ద చైత్యమందిరం. ఇందులో సింహాసనంపై కూర్చొన్న అతి పెద్ద బుద్ధవిగ్రహం, పద్మాసనంలో ఉన్న బుద్ధుని విగ్రహాలు, అనేక మంది బోధిసత్వుల విగ్రహాలను ఆనాటి శిల్పులు రమణీయంగా మలిచారు. మూడో నెంబర్ గుహ ప్రాంగణం చివరిలో ప్రార్ధనామందిరం ఉంది. ఇక్కడ పద్మాసనంలోని బుద్ధుని పక్కనే నాగశిల్పాల విగ్రహాలున్నాయి. ఐదోనెంబరు గుహ విహారం, ఇందులో రెండు వైపులా ప్రత్యేకంగా గూళ్లు ఉన్నాయి. ఇది అతిధి గృహంగా గానీ, శిష్యులకు బోధనలు చేసే మందిరంగానైనా వాడేవారు. ప్రార్ధనామందిరంలో పెద్ద బుద్ధుని విగ్రహం ఉంది. ఆరో గుహ బౌద్ధ గుహ అయినప్పటికీ వీణాపాణి సరస్వతి విగ్రహంతో పాటు వివిధ బౌద్ధ జాతక కథల శిల్పాలున్నాయి. పదో గుహ సక్రమంగా తీర్చి దిద్దిన బౌద్ధచైత్యమందిరం. ముందు భాగాన్ని ఎక్కువగా నగిషీలు చెక్కి అలంకరించారు లోపలి భాగాన పైన చుట్టూ గ్యాలరీలుగల ఆర్చ్లు ఉన్నాయి. పై కప్పునకు వివిధ ఆకృతులతో నగిషీలు చెక్కారు. ఆనాటి కర్రపనితనాన్నే శిల్పాకృతుల్లోకి తీసుకొచ్చినట్లు కన్పిస్తోంది. స్తంభాలపైన మానవాకృతులను చెక్కారు.

మూడు అంతస్థుల 'తీన్థల్'
పదకొండో గుహ మూడంతస్థుల్లో నిర్మించిన ఒక కట్టడంలా ఉంది. ప్రతి అంతస్థులోనూ వసారాలున్నాయి. వివిధ రకాల బుద్ధుని శిల్పాలతో గేలరీలను నిర్మించారు. తొలి ఎల్లోరా శిల్పకళకి ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది. పన్నెండో గుహ మరింత పెద్దది. ఇది కూడా మూడు అంతస్థుల్లో నిర్మితమై ఉంది. దీనిని ఇక్కడ 'తీన్థల్'గా పిలుస్తారు. దీనిలో ప్రతి అంతస్థులోనూ గేలరీలున్నాయి. ఆలయంలోపల అతి పెద్దదైన బుద్ధుని విగ్రహం ఉంది. ఈ విగ్రహంలో బుద్ధుని రెండు చేతులూ జోడించి ఉంటాయి. ఇలాంటి విగ్రహం ఇంకెక్కడా మనకు కన్పించదు. తీవ్రధ్యానంలో ఉన్నట్లుగా శిల్పులు అత్యంత ప్రతిభావంతంగా మలిచారు. బ్రహ్మణమత గుహలు క్రీస్తుశకం 7-9 శతాబ్దాల మధ్యకాలంలో చెక్కారని అక్కడున్న సూచికలు తెలియజేస్తున్నాయి. అంతవరకూ మేము చూసిన బౌద్ధ గుహల్లో ఉన్న చైత్యమందిరాలు, విహారాలకూ ఇక్కడి గుహలకూ ఏమాత్రం పోలికేలేదు. బౌద్ధకళలాగే ఈ చెక్కడాలు మత సంబంధమైనవే అయినప్పటికీ వాటి వ్యక్తీకరణ మరో రూపంలో ఉంది.

సమష్టి శ్రమకు నిదర్శనం
ఎల్లోరా గుహాలయాల్లో అత్యంత ఉత్కృష్టమైనది పదహారో నెంబరు గుహ. ప్రపంచంలోనే అద్భుతమైన ఏకశిలా నిర్మాణంగా ఇది గుర్తింపు పొందింది. మానవ మహామేధస్సుకు, కళాసృజనకూ నిలువెత్తునిదర్శనంలా కన్పిస్తోంది. ఒక కొండలోని సుమారు 30లక్షల ఘనపుటడుగుల రాతిని పూర్తిగా చెక్కి, శిల్పాలను రూపొందించారు. వందలమంది నిర్మాణ నిపుణులు, శిల్పుల సమష్టి శ్రమతో ఈ మహాద్భుతాన్ని సృష్టించారు. ఈ గుహాలయ నిర్మాణానికి మొదటగా, కొండ శిఖరాగ్రం నుంచి ప్రారంభించి, ఒక దీర్ఘచతురస్రాకారపు అగడ్తను రాతి లోతుల్లోకి తవ్వి ఉంటారని స్పష్టమవుతోంది. సుమారు ముప్పైలక్షల ఘనపుటడుగుల రాతిని చెక్కి 107 అడుగుల లోతు, 154 అడుగుల వెడల్పు, 276 అడుగుల వైశాల్యంతో ముందుగా తవ్వి, ఆతర్వాత మధ్యలో మిగిలిన రాతిని దశాబ్దాలపాటు చెక్కి ఉంటారు. గోడలపైనా అపారమైన నగిషీలను చెక్కి, వాటికి అద్భుత నిర్మాణాన్ని జోడించారు. ఇందులో ఒక విశాలమైన ప్రాంగణం, మూడు భవంతులు, వాటిని అను సంధానించే విధంగా ఉపరితల వంతెనను ఏర్పాటు చేసారు. అంతేకాదు, సజీవ పరిమాణంలో ఉన్న ఏనుగుల విగ్రహాలను చూడొచ్చు. ఏనుగులే ఆలయభారాన్ని మోస్తున్నట్లుగా ఉన్న భంగిమలతో శిల్పులు చక్కగా తీర్చిదిద్దారు. గుహ పైకప్పు మూడు విభాగాలు గల పొరలతో సూది వంటి శిఖరాకృతిలో గోపురం ముందుకు పొడుచుకుని ఉండి, మొనదేలినట్లు కన్పిస్తోంది. పైన అర్ధగోళాకృతిలో నిర్మాణం జరిపారు. ఉత్తర ప్రాంగణంలో తొండంలేని ఒక పెద్ద ఏనుగు శిల్పాన్ని ఆనుకుని పెద్ద విజయస్తంభం ఉంది. ఇంకా పైకి వెళితే పన్నెండు ఫలకాలు గల గ్యాలరీ ఉంది. ఇందులో శివపురాణగాథల కల్పనలను శిల్పాలుగా మలిచారు. గోడకు దక్షిణంవైపునఉన్న గ్యాలరీ ఆనుకొని విష్ణువు విగ్రహాలు విభిన్న రూపాల్లో చెక్కారు. గుహకు అన్ని వైపులా రకర కాల శిల్పాలు భారతీయ శిల్పుల కళా ప్రతిభకు అద్దం పడుతున్నాయి. ఎదురుగా యాభై అడుగులు ఎత్తుకలిగి ముఖ్య కట్టడానికి సమాంతరంగా ఉన్న మందిరం ఒకటి ఉంది. ఇరవై చదరపు అడుగుల వైశాల్యమున్న ఈ మందిరంలో నంది విగ్రహానికి ఇరువైపులా ఒక రాయి, స్తంభం ఉన్నాయి. ఈ ధ్వజస్తంభం సుమారు యాభై అడుగులకు పైగా పొడవుంటుంది. దీనిమీద సూక్ష్మశైలిలో ఎన్నో శిల్పాలను చెక్కి ఉన్నారు. మతాభిప్రాయాలను పక్కనపెడితే ఈ గుహాలయం మాత్రం భారతీయ శిల్పకళకు ప్రపంచఖ్యాతిని తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. 25వ గుహ అంతర్భాగంలో ఏడుగుర్రాల రథంపై నిలబడి ఉన్న పెద్ద సూర్యుని విగ్రహం ఉంది.

జైన మత స్మృతులు..
జైన మతానికి సంబంధించిన 30 నుంచి 34వ నంబరు వరకూ ఉన్న గుహల్లో ముఖ్యమైనవి 32, 34 నెంబర్ల గుహలే. 30వ గుహలోని స్తంభాలు, పైకప్పులనూ పద్మాకారపు నగిషీలతో చెక్కారు. వర్ధమాన మహావీరుని విగ్రహం, దాని చుట్టూ చాలా మంది జైన తీర్ధంకరుల విగ్రహాలున్నాయి. 31వ నెంబరు గుహలో కూడా మహావీరుని విగ్రహం, తీర్థంకరుల విగ్రహాలున్నాయి. 32వ గుహను 'ఇంద్రసభ' అంటారని పక్కనే ఉన్న ఫలకంపై రాసారు. దీని ముఖద్వారం వద్ద సుమారు 30 అడుగుల ఎత్తైన ఏనుగు విగ్రహం ఉంది. దానికి సమీపంలోనే అందంగా అలంకరించినట్లు చెక్కిన ప్రార్ధనాలయం ఒకటుంది.. చివరిదైన 34 వ గుహలో ఉన్న విగ్రహాలన్నీ సేవకబృం దాలతో ఉన్న జైన తీర్ధంకరులవే. గోడల్లోనూ స్తంభాలపైనా జైన తీర్ధంకరుల విగ్రహాలను విరివిగా చెక్కారు. ఎల్లోరా సంద ర్శనలో అక్కడక్కడా గైడ్ అవసరమైన చోట గైడ్ హిందీలో చెప్పే విషయాలను మాతో వచ్చిన లియాఖత్ఆలీ తెలుగులోకి అనువదించి మాకు భాషా సమస్యరాకుండా చూసారు.

ఇలా వెళ్లాలి
హైదరాబాద్ నుంచి  మన్‌మాడ్‌కు వెళ్లే రైలుమార్గంలోనే ఔరంగాబాద్ స్టేషన్ ఉంది. అక్కడి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా గుహలున్నాయి. వీటిని చేరుకోవడానికి విరివిగా బస్సులు, ఇతర వాహనాలు ఉన్నాయి. ఔరంగాబాద్‌లో అందుబాటు ధరల్లోనే హోటళ్లు లభిస్తాయి.
- బెందాళం క్రిష్ణారావు
No comments:

Post a Comment