Thursday, 3 November 2016

అంబాజీ మాత దేవాలయం

హృదయ పీఠం


విగ్రహమే లేని ఆలయం. కళ్లకు గంతలు కట్టుకొని దైవ దర్శనం. సీతాన్వేషణలో రాముడికి ధనుర్భాణాలను ఇచ్చిన దైవం. శ్రీకృష్ణుడు తల నీలాలు సమర్పించిన పుణ్యక్షేత్రం. కృష్ణుడుని భర్తగా పొందడానికి రుక్మిణీదేవి పూజలు చేసిన పుణ్యస్థలం. ఇలా ఎన్నో విచిత్రాలు, ఇంకెన్నో విశిష్టతలు, మరెన్నో పురాణగాథలు గల ఈ పుణ్యక్షేత్రం గుజరాత్‌లోని ఆరావళి పర్వత శ్రేణులలో కొలువై ఉంది. అంబాజీ మాత దేవాలయంగా ప్రపంచమంతా పేరుప్రఖ్యాతలు గల ఈ ఆలయం అత్యంత శక్తిమంతమైన శక్తి పీఠంగా విరాజిల్లుతుంది.

భారతదేశంలోని అతి ప్రాచీన, ఎంతో ఖ్యాతి పొందినది అంబాజీ ఆలయం. గుజరాత్ - రాజస్థాన్ సరిహద్దు ప్రాంతంలో బనస్కాంత జిల్లాలోని దంతా తాలూకా సమీపంలో అరసుర్ కొండలపై ఉంటుంది ఈ ఆలయం. మౌంట్ అబూ నుండి 45 కిలోమీటర్లు పాలంపూర్ నుండి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబాజీ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నవే ఈ కొండలు. ఈ కొండలపైనే వేదకాలానికి చెందినదిగా చెప్పుకునే అంబాజీ మాత దేవాలయం ఉంది. అరసుర్ కొండల పేరుతోనే ‘అరాసురి అంబాజీ’గా అమ్మవారిని కొలుస్తారు.

ఈ ఆలయాన్ని చేరుకోవటానికి 999 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. పాలరాతితో నిర్మితమైన ఈ ఆలయ గోపురంపైన స్వర్ణ కళశాలు సూర్యకాంతిలో మెరుస్తుంటాయి. నగిషీలు చెక్కిన వెండి ఆలయ ప్రధాన ద్వారం చిన్నదిగా ఉంటుంది. పాత పాలరాతి ఫలకాలపైన ఆలయానికి సంబంధించిన విశేషాలు తెలియజేస్తూ వేద భాష రాయబడి ఉంటుంది. సతీదేవి హృదయ స్థానం

సతీదేవి శివుడు ఆది దంపతులు. వీరి దాంపత్య అనుబంధం సామన్యులకు అర్థం కానిది. ఒకే ఆత్మ - ఒకే దేహంగా శివపురాణం ఈ దంపతుల కథనాలెన్నింటినో తెలియజేస్తుంది.

సతీదేవి తన తండ్రి దక్షుణి యజ్ఞకుండంలో చేరి ప్రాణత్యాగం చేసినప్పుడు, శివుడు ఆమె శరీరాన్ని భుజం మీద వేసుకొని ప్రళయకార రుద్రుడై ముల్లోకాలలో ప్రయాణిస్తుండగా  విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేశాడని, దీంతో సతీ దేవి దేహ ఖండాలు భరతఖండం మీద పడ్డాయని పురాణలు తెలియజేస్తున్నాయి. సతీదేవి శరీర ఖండాలు పడిన 51 స్థలాలు శక్తిపీఠాలయ్యాయి. వాటిలో సతీదేవి హృదయం అంటే గుండె భాగం అరసుర్ కొండల మీద పడింది. సతీదేవి హృదయం నిండా శివుడు కొలువై ఉన్నాడు. అమ్మవారి హృదయం, ఆమె హృదయంలో కొలువున్న శివుడు ఇక్కడ భక్తుల కోరికలు నెరవేర్చడానికి వెలిశారని కథనం. ఆ విధంగా అంబాజీ మాత ఆలయం శక్తిపీఠాలలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది.

ఆర్యవంశీయుల ఆరాధ్య దేవత
వేదకాలం నాటి నుంచి ఉన్న సరస్వతి నది ఈ పర్వతశ్రేణులలోనే ప్రవహిస్తుంది. ఈ నదికి దగ్గరలోనే అంబాజీ మాత ఆలయం ఉది. ఆర్యవంశీయులు ఆరాధించే దేవతలలో ఒక దేవతగా అంబాజీమాత పూజలందుకున్నట్టుగా కథనాలు ఉన్నాయి.  రావణుడితో సంగ్రామానికి బయల్దేరిన రాముడికి అంబాజీ మాత తన విల్లంబులను వరంగా ఇచ్చిందంట. అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణలతోనే రావణ సంహారం నిర్విఘ్నంగా జరిగిందని చెబుతారు.

అమ్మవారి ఆశీస్సులు అందుకున్న శ్రీకృష్ణుడు ఇక్కడే తలనీలాలు సమర్పించుకున్నాడని, రుక్మిణిదేవి అంబాజీ మాత కృపతోనే శ్రీకృష్ణుని భర్తగా పొందినదని కథనాలు ఉన్నాయి. పాండవులు వనవాసం చేసేటప్పుడు అంబాజీ మాతను కొలిచేవారని, అందువల్లే వారు విజయావకాశాలను పొందారనీ చెబుతారు.

మూర్తి కాదు శ్రీ యంత్రం
మూలమూర్తి ఇక్కడ శ్రీ విస యంత్రం. ఈ యంత్ర పీఠానికే వస్త్రాలు, ఆభరణాలు అలంకరించిన తీరు అమ్మ మూర్తి కొలువుదీరిన భ్రమకు లోను చేస్తుంది. ఈ పీఠాన్ని నేరుగా దర్శించకూడదని, కళ్లకు గంతలు కట్టుకొని దర్శించాలనే నియమం ఆసక్తిదాయకంగా ఉంటుంది. అమ్మవారి నిజరూపాన్ని సామాన్యజనం చూసి తట్టుకోలేరనే ఈ నియమం పెట్టారని స్థానికులు చెబుతారు. ఈ యంత్రం ముందు ఒక దీపశిఖ మాత్రమే నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుంది. ఆలయ ఆవరణ అంతా భక్తులు ‘జయ మాతా జీ’ అంటూ సాగించే నామ సంకీర్తనతో అక్కడి వాతావరణం ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లుతుంది.

పౌర్ణమి ప్రత్యేకం
అంబాజీ పట్టణంలో ప్రతి పౌర్ణమికి పెద్ద సంఖ్యలో చేరే భక్తులు ‘లోక్ మేలా పే’ ఆధ్యాత్మిక ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ. దసరా నవరాత్రి ఉత్సవాలూ వైభవంగా జరుపుతారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇక్కడ జరిగే గర్భానృత్యాలు అత్యంత నయనానందకరంగా ఉంటాయి. ప్రత్యేకంగా బాద్రపద పౌర్ణిమ, దీపావళి పర్వదినాల్లో ఉత్సవాలు దీపాలంకరణలతో ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలను తిలకించడానికి ప్రపంచంలోని నలుమూలల నుండి భక్తులు అంబాజీ ఆలయానికి చేరుకుంటారు.  పౌర్ణమి వెలుగుల్లో, విద్యుత్  దీపాల జిలుగుల్లో దేవాలయ అందం వర్ణించనలవి కాదు.

ప్రకృతి పరవశం
ఆలయం చుట్టూ గల ఆరావళి పర్వతాల్లో దట్టమైన అడవులు ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి సౌందర్యం, ఆధ్యాతికతల మేలుకలయికగా పర్యాటకులను ఆనందపరవశులను చేస్తుంది. కొండపైన సూర్యోదయ, సూర్యాస్తమయాల దృశ్యాలను తిలకించడం ఒక మధురానుభూతిగా పర్యాటకులు భావిస్తారు. మన దేశ ప్రధాని నుంచి అంబాజీ ఆలయాన్ని ఇప్పటి వరకు కొన్ని మిలియన్ల మంది భక్తులు దర్శించుకున్నారు. విశ్వవిఖ్యాతి చెందిన రాజులు, సాధుజన గాయకులు అమ్మవారి పాదాల చెంత తమను తాము సమర్పించుకున్న పవిత్ర పుణ్యక్షేత్రం. పర్యాటకులకు శక్తిపీఠాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ లభ్యం అవుతాయి. ఆది శక్తి మహిమను ఈ ఆలయ సమాహారం తెలియజేస్తుంది.

సమీప ఆకర్షణలు
పర్వతశ్రేణులలోని సుందర దృశ్యాలనే కాకుండా రోప్‌వే ఎక్కడం ద్వారా కూడా ఆనందించగలిగిన కొండలు ఇక్కడ ఉన్నాయి.
వేదకాలపు స్వచ్ఛమైన సరస్వతి నది అంబాజీ ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి దగ్గరగా శ్రీ కొటేశ్వర మహాదేవ, వారాహి, గణపతి ఆలయం ఉన్నాయి. ఇది అంబాజీ ఆలయం నుంచి 8 కిలోమీటర్ల దూరం. ఇక్కడ వాల్మీకి ఆశ్రమం, శక్తి ఆశ్రమం ప్రధాన ఆకర్షణలు.
మన్‌సరోవర్ అనే పెద్ద సరస్సు అంబాజీ ఆలయానికి వెనక వైపుగా ఉంటుంది. దీనిని శ్రీ తపిశంకర్ అనే భక్తుడు 1584-1594 మధ్య నిర్మించాడు. ఈ సరస్సుకు నాలుగు వైపులా మెట్లు, రెండువైపులా దేవాలయాలు ఉన్నాయి. ఒకటి మహాదేవ్ ఆలయం, మరొకటి అజయ్‌దేవీ ఆలయం. అజయ్‌దేవిని మాతా అంబాజీ సహోదరిగా భావిస్తారు. మన్‌సరోవర్‌లో స్నానమాచరించి ఆలయాన్ని దర్శిస్తారు. ఈ సరస్సు ప్రాకార కుడ్యాల మీద రాజా మాల్‌దేవ్ గురించి శిలాశాసనం ఉంది. ఈ శిలాశాసనం అంబాజీ మాత చరిత్రను గురించిన వివరాలను తెలియజేస్తుంది.
బలరాం వన్యప్రాణుల అభయారణ్యంలో అనేక రకాల పక్షులు, జంతువులు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు భారీ స్థాయిలో ఉన్నాయి.
అంబాజీ ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఆకర్షణ మాంగళ్య వనం ఉంది. ఈ తోటలో జ్యోతిష్య మొక్కలు ఉంటాయి. భక్తులు వారి వారి జాతక రాశుల ప్రకారం మొక్కలను ఇంటికి తీసుకొని వెళతారు.

ఇలా చేరుకోవాలి...
విమానమార్గం: 
అంబాజీకి 180 కి.మీ దూరంలో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి క్యాబ్ లేదా ట్యాక్సీ, బస్సులలో ప్రయాణించి ఆలయాన్ని చేరుకోవచ్చు.

రైలుమార్గం: 
అంబాజీకి 20 కి,.మీ దూరంలో రోడ్డు స్టేషన్ ఉంది. ఇక్కడికి రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుండి రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి.

రోడ్డు మార్గం: 
అహ్మదాబాద్, మౌంట్ అబూ, ఢిల్లీ, పాలంపూర్, హిమ్మత్‌నగర్ మొదలైన నగరాల నుండి అంబాజీకి బస్సు సదుపాయాలు ఉన్నాయి.

- నిర్మలారెడ్డి

Sakshi | October 09, 2016.

No comments:

Post a Comment