Monday, 14 November 2016

భువిలో వెలసిన ఈశ్వరుడు

‘ఆ ప్రాంతం... ఉత్కృష్టమైన శిల్పకళా సంపదకీ పౌరాణిక, చారిత్రక విశేషాలకీ ప్రకృతి అందాలకీ పెట్టింది పేరు. ‘టెంపుల్‌ సిటీ ఆఫ్‌ ఇండియా’గానూ పేరొందిన ఆ సుందర నగరమే భువనేశ్వర్‌. ఒడిశా రాష్ట్ర రాజధాని’ అంటూ అక్కడి విశేషాలను చెప్పుకొస్తున్నారు సిరిసిల్లకు చెందిన కందేపి రాణీప్రసాద్‌.

కనాటి కళింగ, నేటి ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో ఎటు చూసినా ఆలయాలే. అందుకే దీనికి టెంపుల్‌ సిటీ అని పేరు. ఇక్కడ గుడులన్నీ ఎరుపురంగులోనే ఉంటాయి. ఏ చిన్న గుడి చూసినా అద్భుత శిల్పకళతో విలసిల్లుతుంటుంది. చివరకు మేం బస చేసిన దక్రాన్‌ హోటల్లో కూడా సుభద్ర, జగన్నాథుడు, బలభద్రుడి విగ్రహాలు ఉన్నాయి. అక్కడే ఓ పక్కగా పరుపుల మీద సితార్‌, తబలా వాద్యాలను వాయించే సంగీతకారులు కూర్చుని ఉన్నారు. ఈ రాష్ట్రంలోని పూరీ, కోణార్క్‌లు శిల్పకళకూ; కటక్‌ సిల్వర్‌ ఫిలిగ్రీ ఇత్తడి కళలకూ; పిపిలీ ఆప్లిక్‌ వర్కుకీ ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మపురం, సంబల్‌పురి, మణియబంధా చీరలు అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఉత్కళ అనీ పిలుస్తారు. ఉత్కళ అంటే కళను ఉత్కృష్ట స్థాయికి తీసుకెళ్లడమని అర్థమట. కారణాలేమయినా ఈ రాష్ట్రాన్ని భారతదేశ ఆత్మగానూ దీన్ని చూడకుండా భారతదేశ యాత్ర పూర్తి కాదనీ చెబుతారు.

ఏకామ్ర క్షేత్రం!
మేం ముందుగా భువనేశ్వర్‌లోని లింగరాజ మందిరాన్ని చూడ్డానికి వెళ్లాం. ఇక్కడ శివుడు హరిహర రూపంలో పూజలందుకుంటాడు. గుడిలోపల విమాన, జగ్‌మోహన, నటమందిర, భోగమండప అని నాలుగు మండపాలు ఉంటాయి. మధ్యలో ఉన్న మండపం 180 అడుగుల ఎత్తులో ఉంటుంది. కళింగ శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో సోమవంశ రాజైన యయాతి కట్టించినట్లు చెబుతారు. భువనేశ్వర్‌ను ఏకామ్ర క్షేత్ర అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివలింగం ఓ మామిడి చెట్టు కింద నుంచి ఉద్భవించిందన్నది పురాణ వ్యాఖ్యానం.

ఆలయ ప్రాంగణంలో యముడి గుడి, సావిత్రి గుడి, సత్యదేవి గుడి, శక్తిమాత, నాగదేవుడు, దుర్గాదేవి, వినాయకుడు, విశ్వకర్మాదుల గుడులు కూడా ఉన్నాయి. విశ్వకర్మ అంటే బ్రహ్మ-ఈశ్వరుడు కలగలిసిన రూపంగా చెబుతారు. విశ్వకర్మ గుడి భూమిలోపలకు ఉంది. పది మెట్లు దిగి లోపలకు వెళ్లాలి. లింగరాజ ఆలయంలోని శివలింగం భూమిలో నుంచి ఉద్భవించింది కాబట్టే ఈ వూరికి భువనేశ్వర్‌ అనే పేరు వచ్చిందని విశ్వకర్మ గుడి పూజారి చెప్పారు. అంతేకాదు, ఈ గుడికున్న ప్రత్యేకతను కూడా వివరించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటిలోనూ కేవలం శివరాత్రి రోజున దర్శించుకుంటేనే ముక్తిని పొందగలమని చెబుతారు. కానీ ఈ లింగరాజ మందిరంలోని పరమేశ్వరుణ్ని నెలకు రెండుసార్లు అంటే రెండు చతుర్దశుల్లోనూ దర్శించుకుంటే ముక్తిని పొందగలమన్నది విశ్వాసం. అందుకే ఈ ఆలయం చాలా శక్తిమంతమైనదిగా చెబుతారు. అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో ఎక్కడా ఫొటోలు తీసుకోవడానికి అనుమతి లేదు. ఆలయం ముందు అంతా చెట్లు ఉండటంవల్ల బయట నుంచి కూడా అది పూర్తిగా కనిపించదు. తరవాత రాజారాణీమందిర్‌ను చూశాక సిద్ధేశ్వర్‌ ముక్తేశ్వర్‌ మందిరాలకెళ్లాం. ఇవి అచ్చం పూరీ దేవాలయాల నమూనాల్లానే ఉన్నాయి. ముక్తేశ్వర్‌ ఆలయంలో ఏటా మూడు రోజులు నృత్య వేడుక జరుగుతుంది. ఒడిశా రాష్ట్ర శాస్త్రీయ నృత్యమైన ఒడిస్సీని ఇక్కడ ప్రదర్శిస్తారు.

రెండంతస్తుల గుహ!
అక్కడ నుంచి నందన్‌ కానన్‌ జంతుప్రదర్శనశాలకి బయలుదేరాం. ఇది వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. నందన్‌ కానన్‌ అంటే ‘ద గార్డెన్‌ ఆఫ్‌ హెవెన్స్‌’ అని అర్థమట. అరుదైన తెల్ల పులుల్ని ఇక్కడ ఎంతో శ్రద్ధగా పెంచుతారు. ఇది చూశాక ఉదయగిరి, ఖండగిరి గుహలకు వెళ్లాం. ఇవి అజంతా ఎల్లోరా గుహల్లానే ఉన్నాయి. ఇందులో ఉదయగిరికి 18 గుహలు ఉండగా ఖండగిరికి 15 గుహలు ఉన్నాయి. ఇందులో రాణీగుంఫ అనే గుహ చాలా ప్రసిద్ధి చెందింది. ఇది రెండంతస్తులుగా ఉంటుంది. ఈ గుహ కొంత సహజంగా ఏర్పడగా మరికొంత భాగాన్ని కృత్రిమంగా తయారుచేశారు. ఖరవేలా రాజు జైన సన్యాసులకోసం ఈ గుహల్ని చెక్కించాడని చెబుతారు. ఈ గుహల దగ్గర కోతులు ఎక్కువ. ఆ రాత్రికి మేం అమరాపల్లి రిసార్ట్స్‌ అండ్‌ క్లబ్‌కు వెళ్లాం. ఇక్కడ ఏర్పాటు చేసిన డిన్నర్‌లో చాలా రకాలున్నాయి. అన్నీ రుచికరంగా ఉన్నాయి. పాలబొంగరాలను మాల్‌పువా పేరుతో వడ్డించారు.

తరవాతి రోజు భువనేశ్వర్‌కి 30 కిలోమీటర్ల దూరంలోని ధౌలి స్తూపం దగ్గరకు వెళ్లాం. ఇది పేరుకు తగ్గట్లే తెల్లగా స్వచ్ఛంగా ఉంది. ఇది అశోకుడి శాంతి స్తూపం. కళింగ యుద్ధం జరిగింది ఇక్కడే. ఆ యుద్ధంలో చనిపోయిన సైనికులను చూసి అశోకుడు మనసు మార్చుకుని బౌద్ధంలోకి మారాడు. ఆ తరవాత ప్రశాంత జీవనాన్ని గడిపాడు. ఈ స్తూపం వెనక ఓ శివాలయం కూడా ఉంది. తరవాత పూరీకి వెళ్లే దారిలోనే ఉన్న పిపిలీకి వెళ్లాం. ఆ గ్రామమంతా హస్తకళలే. వేలాడే క్లాత్‌ షాండ్లియర్లూ దీపాలూ కళ్లు చెదిరే రంగులతో ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక్కడే సాఖీగోపాల్‌ అనే కృష్ణుడి దేవాలయం ఉంది. పూజారులు మాత్రం డబ్బులకోసం బాగా విసిగిస్తారు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడి మనుమడైన సాఖీ కట్టించాడట. ఇక్కడ గోధుమలతో చేసిన ప్రసాదం పెడతారు. సాధారణంగా భారతదేశంలోని వైష్ణవాలయాల్లో ఈ గోధుమ ప్రసాదం పెట్టరు. బియ్యంతో చేసినదే పెడతారు. తరవాత చిల్కా సరస్సుకి వెళ్లాం. ఇక్కడకు సైబీరియా నుంచి లక్షల పక్షులు వలస వస్తాయి. ఇంకా ఇక్కడ డాల్ఫిన్లు నృత్యం చేసే ప్రదర్శన చాలా బాగుంది. భువనేశ్వర్‌లోని ఆలయాలన్నీ తిరిగి చూడాలంటే కనీసం వారం రోజులయినా అక్కడే ఉండాలి. వీలు చూసుకుని మళ్లీ వెళ్లాలనుకుంటూ తిరిగి వచ్చాం.

No comments:

Post a Comment