Monday, 14 November 2016

మంచుకోడల్లో మహేశ్వరుడు


ప్రయాణం కష్టమైనప్పటికీ ఉత్తరాఖండ్‌లోని మంచుకొండల మధ్యలో 11,473 అడుగుల ఎత్తులోని మధ్యమహేశ్వర్‌ను చూడాలనుకున్నాం. రుషికేశ్‌కు 227 కిలోమీటర్ల దూరంలో ఉందీ శైవక్షేత్రం. ఉఖీమఠ్‌ నుంచి సుమారు 31 కిలోమీటర్ల దూరం మట్టిరోడ్డుమీద ప్రయాణించి రాన్సీ గ్రామం చేరుకున్నాం. ఈ రోడ్డు చిన్న వాహనాలు ప్రయాణించేందుకు మాత్రమే అనుకూలం. రాత్రికి రాన్సీ గ్రామంలోనే బసచేశాం. పొద్దున్నే గుర్రాలమీద బయలుదేరాం. రాన్సీ నుంచి మధ్యమహేశ్వర్‌కు 14 కిలోమీటర్లు. కాలినడకన లేదా గుర్రాలమీదగానీ వెళ్లాలి.
అక్కడ యాత్రికులు తక్కువ!
ఈ దారిలో గౌదర్‌ అనే గ్రామం వస్తుంది. ఇక్కడే మహేశ్వర్‌ గంగ, మార్త్యాండ గంగలు సంగమిస్తాయి. ఇక్కడ యాత్రికులకు కావలసిన భోజన, నివాస సౌకర్యాలు ఉన్నాయి. గౌదర్లో భోజనం చేసి కాసేపు విశ్రమించాం. ఈ దారిలోనే ఉన్న మరో గ్రామం కాళీమఠ్‌. దీన్నే సిద్ధపీఠం అంటారు. కాళీమఠ్‌లో కాళీ ఉపాసకులకు మంత్రసిద్ధి కలుగుతుందనే నమ్మకంతో సాధువులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి మందిరాలూ, భైరవుడి ఆలయమూ ఉన్నాయి. ప్రయాణమంతా దట్టమైన అడవుల మధ్య కాలిబాటనే సాగింది. మధ్యలో వచ్చే గ్రామాలదగ్గర మెట్ల సేద్యం కనిపిస్తుంటుంది. మిగిలిన ప్రాంతమంతా అడవే. ఈ అడవిలో చిరుతపులుల సంచారం ఎక్కువని స్థానికులు చెప్పారు. చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా అనిపించినా ప్రయాణం మాత్రం కష్టమే. పొద్దున ఏడింటికి బయలుదేరిన మాకు గుర్రాలమీద మధ్యమహేశ్వర్‌కి చేరేసరికి సాయంత్రం ఐదు గంటలు అయింది.
సముద్రమట్టానికి సుమారు 3,497 మీటర్ల ఎత్తులో చుట్టూ మంచుతో కప్పబడ్డ హిమాలయాల నడుమ పచ్చని తివాచీ పరిచినట్లున్న పచ్చికలోయలో ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి హడావుడీ ఆర్భాటమూ లేకుండా కనిపిస్తుంది మహేశ్వర్‌ మందిర్‌. అక్కడ రూములు కూడా చాలా సాధారణంగానే ఉంటాయి. అక్కడే ఫ్రెష్‌ అయి దర్శనానికి వెళ్లాం. ఆ సమయంలో సాయంత్రం హారతి ఇస్తున్నారు. గుడిలో మేమూ పూజారిగారూ తప్ప ఎవరూ లేరు. ఓ పక్కగా సన్నని సెలయేరులా ప్రవహిస్తున్న మధ్యమహేశ్వర్‌ గంగ ఒడ్డున పూజలు అందుకుంటోన్న నాభి ఆకారంలోని శివలింగాన్ని చూడగానే ప్రశాంతంగా అనిపించింది. గర్భగుడికి కుడివైపున పాలరాతి జ్ఞానసరస్వతి విగ్రహం ఉన్న మందిరమూ, బయటఉన్న చిన్న మందిరాల్లో పార్వతీదేవి, అర్ధనారీశ్వరుల విగ్రహాలూ ఉన్నాయి. ఈ ప్రాంతం ఏడాదిలో ఆరునెలలకాలం మంచుతో కప్పబడిఉంటుంది. ఆ సమయంలో ఉత్సవమూర్తులను ఉఖీమఠ్‌లో ఉంచి పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు.
బుడా మహేశ్వర్‌!
మందిరంలోనుంచి బయటకు వచ్చిన మాకు ఓ పక్కగా ఉన్న టెంట్‌లోనే హోటల్‌ను నడుపుతోన్న దాని యజమాని రొట్టెలు తిని రూములోకి వెళ్లమన్నాడు. మరో అరగంటలో అతను హోటల్‌ మూసేస్తాడట. చలి బాగా పెరగడంతో మేం రాత్రి భోజనాలు కానిచ్చుకుని విశ్రమించాం. మర్నాడు ఉదయాన్నే మధ్య మహేశ్వరుడి హారతి చూసుకుని కొండ పై ఉన్న బుడా మహేశ్వర్‌ని దర్శించుకునేందుకు కాలినడకన బయలుదేరాం. కిందనుంచి బుడామహేశ్వర్‌కి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. గుర్రాలు అంత పైకి ఎక్కవని చెప్పారు. మాక్కూడా వూపిరి పీల్చుకోవడం కష్టమైంది. అంత చల్లని వాతావరణంలోనూ చెమటలు పట్టాయి. కానీ పైకి చేరాక అక్కడి ప్రకృతి అందాలు మమ్మల్ని మరో లోకంలో విహరింపజేశాయి. అక్కడ ఓ చిన్నమందిరం, అందులో ఓ శివలింగం ఉన్నాయి. దాన్నే బుడా మహేశ్వర్‌ అంటారు. ప్రతిరోజూ ముందుగా బుడా మహేశ్వర్‌కి పూజలు చేశాకే మధ్య మహేశ్వరుడికి పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి చూస్తే చుట్టూ తెల్లని మంచుతో కప్పబడ్డ చౌఖంబా, కేదార్‌నాథ్‌, నీలకంఠ, త్రిశూల్‌, కామెట్‌, పంచోలి పర్వతశిఖరాల మధ్య స్వచ్ఛమైన జలాలతో ఉన్న సరస్సు కనువిందు చేస్తుంది. పర్వతాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యాత్ర సెప్టెంబరు, అక్టోబరులో పెట్టుకుంటే మంచిది. ప్రతి ఏడాదీ కేదార్‌నాథ్‌ మందిరం తెరిచిన పదిహేను రోజులకి దీన్ని తెరుస్తారు. కేదార్‌నాథ్‌ మూయడానికి ముందే దీన్ని మూసేస్తారు. ఈ మందిరంలో కర్ణాటకకు చెందిన లింగాయత శైవులు పూజారులుగా ఉంటున్నారు.
కేదార్‌నాథ్‌, తుంగనాథ్‌, రుద్రనాథ్‌, మధ్యమహేశ్వర్‌, కపాలేశ్వర్‌లను పంచ కేదారాలు అని అంటారు. ఈ ఐదింటినీ అదే వరసలో దర్శించుకోవాలి అని చెబుతారు.ఈ పంచ కేదార మందిరాల్నీ పాండవులే నిర్మించి శివుణ్ని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందారని చెబుతారు. అందుకే ఇవన్నీ ఒకేలా ఉంటాయి. ఈ మందిరం కూడా కేదార్‌నాథ్‌ మందిర ట్రస్ట్‌ వారి ఆధ్వర్యంలోనే నడుస్తోంది. మేం అక్కడ నుంచి కిందకి వచ్చి పది గంటలకల్లా తిరుగు ప్రయాణమయ్యాం.

No comments:

Post a Comment