Monday, 14 November 2016

చిదంబరం

ఇదే... చిదంబర రహస్యం!
‘‘ ‘ఆంగికం భువనం యశ్య వాచికం సర్వవాజ్ఞ్మయం ఆహార్యం చంద్ర తారాది తంవందే సాత్వికం శివం’ అంటూ నటరాజస్వామిని ఆరాధిస్తుంటాం. ఆ రూపాన్ని కళ్లారా చూడాలన్న కోరికతో ఇటీవలే చిదంబర క్షేత్రాన్ని దర్శించి వచ్చాం’’ అంటూ ఆ ఆలయ విశేషాలు చెప్పుకొస్తున్నారు వైజాగ్‌కు చెందిన బొమ్మకంటి పద్మావతి.చిదంబరంలో దిగగానే నేరుగా నటరాజస్వామి దేవాలయానికే వెళ్లాం. ఆలయం చుట్టూ తిలై అనే రకం చెట్లున్నాయి. అందుకే దీన్ని తిలై చిదంబరం అంటారు. దీని అసలు పేరు చితాంబళం. క్రమంగా చిదంబరంగా మారింది. చిత్‌ అంటే మనస్సు. అంబళం అంటే ఆకాశం. ఆకాశానికి సంబంధించిన జ్ఞాన ప్రదేశమని అర్థం. అందుకే దీన్ని చిదాకాశం అనీ పిలుస్తారు. 


పట్టణం మధ్యలోని 40 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో నటరాజు, శివకామి అమ్మన్‌, గణపతి, గోవిందరాజ పెరుమాళ్‌, మురుగన్‌లు కొలువై ఉన్నారు. ప్రాంగణంలో మొత్తం ఐదు మండపాలు ఉన్నాయి. మొదటిది చిత్‌ అంబళం. ఇందులో నటరాజస్వామి, ఆయన అర్ధాంగి శివకామ సుందరి కొలువై ఉంటారు. దీనికి ఎదురుగా ఉన్నదే పొన్‌ అంబళం లేదా కనకసభ. తరవాతది 56 స్తంభాలున్న నృత్యమండపం. నాలుగోది రాజసభ లేదా వెయ్యిస్తంభాల మండపం. వెయ్యి రేకుల పద్మం(సహస్రారామం)గుర్తుగా చెప్పే ఈ హాలుని ఉత్సవ సమయాల్లోనే తెరుస్తారు. దేవసభగా పిలిచే ఐదో మండపంలో పంచమూర్తులైన గణేశుడు, సోమస్కంద, శివానంద నాయకి, మురుగన్‌, చండికేశ్వరులు కొలువై ఉన్నారు. 


నటరాజస్వామి! 
చిదంబరం స్వయంభూక్షేత్రం. పంచభూత క్షేత్రాల్లో ఒకటి. దీన్నే ఆకాశలింగ క్షేత్రమనీ అంటారు. ఇక్కడ ఈశ్వరుడు ఆనంద తాండవరూపంలో నటరాజస్వామిగా దర్శనమిస్తాడు. పూర్వకాలంలో వారణాసి నుంచి వ్యాఘ్రపాదుడు అనే యోగి వచ్చి ఇక్కడ స్వయంభూలింగం కలదనీ అది కూడా నటరాజ రూపంలో ఉన్నదనీ గుర్తించాడట. ఈ యోగి పులిచర్మాన్ని ధరించేవాడట. అందుకే వ్యాఘ్రపాదుడని పేరు. ఇక్కడ శివుడు చేసే ఆనందతాండవాన్ని చూడ్డానికి శ్రీమహావిష్ణువూ, ఆయన వెంట ఆదిశేషుడు పతంజలి రూపంలో దేవాలయానికి వచ్చేవారట. ఆలయకుడ్యాలమీద చిత్రించి ఉన్న ఆ ఇద్దరి చిత్రాలూ అందుకు సాక్ష్యాలుగా నిలుస్తాయి.ఆలయానికి పశ్చిమదిశలో ఉన్న గోపురంమీద సూర్యతేజస్సుగల సింహముఖం ఉంది. తూర్పుదిక్కున ఉన్న గోపురంమీద సోమస్కందుడి రూపం కనిపిస్తుంది. దీన్నే శివశక్తి స్వరూపంగా భావిస్తారు. దక్షిణ గోపురంమీద మార్కండేయుణ్ణి కాపాడే ఈశ్వరుణ్ని యమస్వరూపంగా చెబుతారు.


12, 13వ శతాబ్దాల్లో ఈ ఆలయాన్ని చోళులు, పల్లవులు, చేర రాజులు అభివృద్ధిపరిచినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆధునిక శాస్త్రజ్ఞులు ఈ ఆలయానికి సంబంధించి అనేక విషయాలు గుర్తించారు. మానవదేహానికీ ఈ దేవాలయ నిర్మాణానికీ దగ్గర పోలికలు ఉన్నాయట. 

చిదంబరం ఓ అద్భుత శక్తి క్షేత్రం. దీనికి అయస్కాంతశక్తి ఉందనీ భూమధ్యరేఖలోని బిందువు, ఈ నటరాజ విగ్రహంలోని కాలిబొటనవేలుని సూచిస్తుందనీ చెబుతారు. ఆకాశలింగం(చిదంబరం), వాయులింగం (కాళహస్తి), భూలింగం(కాంచీపురం), అగ్నిలింగం(తిరువణైక్కవల్‌), జలలింగం (తిరువణ్ణామలై) అనే పంచభూతలింగాల్లో 1, 2, 3 దేవాలయాలను ఒకే సరళరేఖలో 79 డిగ్రీల 41నిమిషాల తూర్పు అక్షాంశంమీద నిర్మించారు. అందుకే దీన్ని ఓ ఖగోళ, భౌగోళిక అద్భుతంగా చెబుతారు. 

చిదంబరం ఆలయానికి మన శరీరంలోని నవ రంధ్రాల మాదిరిగానే 9 ద్వారాలు ఉన్నాయి. ఈ దేవాలయంలోని ఓ గోపురాన్ని 21,600 బంగారు రేకులతో కప్పారు. ఇది ఒకరోజుకి మనిషి శ్వాసలోని ఉచ్ఛ్వాస, నిశ్వాసాల సంఖ్యతో సమానం. ఆ రేకుల్ని తాపడం చేయడానికి ఉపయోగించిన బంగారు మేకుల సంఖ్య 72 వేలు. యోగశాస్త్ర ప్రకారం మనిషి శరీరంలోని నాడుల సంఖ్యా అంతే. మన శరీరంలో ఎడమవైపు గుండె ఉండే ప్రదేశంలానే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఎడమచేతి వైపునకు తిరిగి ఉంటుంది. దీనికి పక్కనే ఉన్న నాలుగు స్తంభాల మండపం నాలుగు వేదాలకూ ప్రతీక. శివపూజలో జరిగే 28 కైంకర్యాలని సూచిస్తూ శివకామసుందరి అమ్మవారి ప్రాంగణంలో 28 స్తంభాలు ఉంటాయి. వీటిమీద 64 కళలకూ గుర్తుగా 64 బీములు ఉంటాయి. బంగారు తాపడం కలిగిన గోపురంమీద ఉన్న నవ కలశాలూ నవశక్తులకి సంకేతాలు. అర్ధమండపానికి ఆనుకుని ఉన్న మండపంలోని 18 స్తంభాలు అష్టాదశ పురాణాలకు ప్రతీక. 


చిదంబర రహస్యం! 
ఈ ఆలయంలో స్వామి నటరాజ రూపం, ఇదీ అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్ఫటికలింగ రూపం, ఏ రూపమూలేని దైవసాన్నిధ్యం అనే మూడు స్వరూపాల్లో దర్శనమిస్తాడు. మూడో రూపమే చిదంబర రహస్యం.. గర్భాలయంలోని వెనకగోడమీద ఓ చక్రం గీసి ఉంటుందట. దానిముందు బంగారు బిల్వ ఆకులు వేలాడుతుంటాయి. అవేమీ కనిపించకుండా ఓ తెర కట్టి ఉంటుంది. అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం. భవ అంటే మనసు... ఆ దైవంలో మనసు ఐక్యం అయ్యే ప్రదేశం. అంటే అక్కడ ఏ రూపం లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఆ దైవ సాన్నిథ్యాన్ని అనుభూతించడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం... అదే చిదంబర రహస్యం. 


ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే నటరాజస్వామిని దర్శించి బయటకు వచ్చి వెనుతిరిగిచూస్తే ఆలయ గోపురం వెనుకనే వస్తున్న అనుభూతి కలుగుతుంది. అనేక విశిష్టతలున్న చిదంబర క్షేత్రాన్ని దర్శించుకుని తాదాత్మ్యంతో తిరిగివచ్చాం.

No comments:

Post a Comment