Monday, 14 November 2016

టాంజానియా సఫారీ

ఆ సమయంలో.. లక్షల జంతువులు చనిపోతాయట!

‘వందల సంఖ్యలో క్రూర జంతువుల్నీ వేల సంఖ్యలో వన్యప్రాణుల్నీ అతి దగ్గరగా చూడాలంటే టాంజానియాలో సఫారీకి వెళ్లాల్సిందే...’ అంటూ అక్కడి విశేషాలను కళ్లకు కట్టినట్లుగా వివరిస్తున్నారు విశాఖపట్టణానికి చెందిన చెన్నూరు కామేశ్వరరావు.

మా కూతురూ అల్లుడూ టాంజానియా వాణిజ్య రాజధాని ధర్‌-ఎ-సలామ్‌లో నివసిస్తుండటంతో అక్కడకు వెళ్లాం. బంధుమిత్రులతో కలిసి ముందుగా సఫారీ చూడాలనుకున్నాం. ఉదయం ఆరు గంటలకి ధర్‌-ఎ-సలామ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కిలిమంజారోకు బయలుదేరాం. గంటన్నరలో అక్కడ దిగాం. ఇది ఆఫ్రికా ఖండ వన్యప్రాణుల నివాసానికి ముఖద్వారం లాంటిది. దిగేముందు మాకు విమానంలోంచి ఓ అద్భుత దృశ్యం కనిపించింది. అదే కిలిమంజారో... ఇది ఆఫ్రికాలోకెల్లా ఎత్తైనదే కాదు, ప్రపంచంలోకెల్లా విడిగా ఉన్న ఎత్తైన పర్వతం కూడా. ఎత్తు సముద్రమట్టం నుంచి 19,341 అడుగులు. ఈ పర్వతం మీద మూడు అగ్నిపర్వత శిఖరాలు ఉన్నాయి. ఇవి మంచుతో కప్పబడి తెల్లగా మెరుస్తున్నాయి.
ఎత్తైన మాసైలు! 
మేం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేసరికి స్వాగతం పలకడానికి ట్రావెల్‌ గైడ్‌ కమ్‌ డ్రైవర్‌ మాకోసం ఎదురుచూస్తున్నాడు. మా లగేజీతో సహా మేం సఫారీ వాహనంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుషాకు బయలుదేరాం. అక్కడ ట్రావెల్‌ ఆఫీస్‌కు చేరుకుని మాతో తెచ్చుకున్న ఫలహారం తిని గొరొంగొరొ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి బయలుదేరాం. ఇది అరుషాకు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడకు చేరేసరికి మధ్యాహ్నం 12.30 అయింది. ప్రవేశరుసుము ఒక్కొక్కరికి 50 డాలర్లు. ఇది ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఏప్రిల్‌- జూన్‌ను గ్రీన్‌ సీజన్‌గా పిలుస్తారు. జూన్‌, జులై నెలలు చాలా చల్లగా ఉంటాయి. నవంబరు, డిసెంబరుల్లో వర్షాలు ఎక్కువ.ప్రధాన ద్వారం నుంచి వన్యప్రాణులు ఉండే ప్రాంతానికి చేరుకోవడానికి సుమారు గంటన్నర సమయం పట్టింది. అక్కడ మమ్మల్ని సఫారీ వాహనంలోకి ఎక్కించారు. మాకు దారిలో పశువులు కాస్తోన్న ఆఫ్రికన్‌ కొండజాతివాళ్లు కనిపించారు. వాళ్లు నల్లగా పొడవుగా వింత వస్త్రధారణతో కనిపిస్తారు. వాళ్లే మాసైలు. వీళ్లు ఈ ప్రాంతానికి దగ్గరలోనే నివాసం ఉంటారు.

గొరొంగొరొ ఒకప్పుడు కిలిమంజారోకన్నా ఎత్తైన అగ్నిపర్వతం. సుమారు 30 లక్షల సంవత్సరాల క్రితం అది బద్దలవడంతో భూమికి 2000 అడుగుల లోతుకు కుంగిపోయింది. ఇలా కుంగిపోయిన నేలభాగం 100 చదరపు మైళ్ల వరకూ విస్తరించి ఉంది. దీన్నే అగాథం అంటారు. ఇది సముద్రమట్టానికి 5,900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం అంతా దట్టమైన పచ్చని గడ్డితో ఉంటుంది. ఇక్కడ ఏడాది పొడవునా నీటి వనరులు ఉంటాయి. అందుకే ఇక్కడ అన్ని జాతులకూ చెందిన వన్యప్రాణులూ కలిసి మొత్తం ముప్ఫైవేలకు పైగా నివసిస్తున్నాయి. మా సఫారీ వాహనం నుంచి బిగ్‌ ఫైవ్‌గా పిలిచే సింహాలనూ పులులనూ, చిరుతలనూ ఏనుగులనూ, రైనాలనూ చూశాం. మధ్యాహ్నం మా వాహనాన్ని ఓ సురక్షిత ప్రాంతంలో నిలిపి, మాతో తెచ్చుకున్న భోజనం చేశాక, మా సఫారీ ప్రయాణం మళ్లీ మొదలైంది. వందలకొద్దీ అడవి దున్నలూ జీబ్రాలూ జింకలూ జిరాఫీలూ నక్కలూ అడవి పిల్లులనూ చూశాం. ఇన్ని రకాల జంతువులు స్వేచ్ఛగా మా వాహనానికి అతి దగ్గరగా తిరుగుతుంటే మాకు ఎంతో ఆనందం వేసింది. వాటిని మా కెమెరాల్లో వీడియోల్లో బంధించాం. తరవాత ఇక్కడే ఉన్న ‘మగాడి’ అనే సరస్సు దగ్గరకు వెళ్లాం. అది సుమారు 400 రకాల జాతులకు చెందిన పక్షులకు నివాసయోగ్యంగా ఉంది. అయితే మిగిలిన వాటికన్నా ఫ్లెమింగోల సంఖ్యే ఇక్కడ ఎక్కువ. కొన్ని వేల సంఖ్యలో గుంపులుగుంపులుగా సరస్సులో తిరిగే ఈ పక్షులు నయనానందకరంగా ఉన్నాయి. ఇలా సఫారీ వాహనంలో సాయంత్రం ఐదు గంటలవరకూ విహరించాం. ఈ సఫారీకి ఏటా ఐదు లక్షల మంది విహారయాత్రకు వస్తారట.
రెస్టారెంటులో పుట్టినరోజు! 
తరవాత క్రేటర్‌ అంచున అంటే రెండు వేల అడుగుల ఎత్తులో ఉన్న కొండమీద ఉన్న సోపా లాడ్జికి బయలుదేరాం. అక్కడకు చేరుకోవడానికి సుమారు గంటన్నర సమయం పట్టింది. లాడ్జికి చేరుకోగానే ప్రవేశద్వారం దగ్గరే మాకు సాదర స్వాగతాలు లభించాయి. సిబ్బంది మా అందరినీ కరీబు(స్వాగతం), జాంబో(బాగున్నారా) అంటూ పలకరించారు. ముఖం తుడుచుకోవడానికి గోరువెచ్చని నాప్‌కిన్‌లూ వెల్‌కమ్‌ డ్రింకులూ ఇచ్చి, మాకు కేటాయించిన కాటేజీలకు తీసుకెళ్లారు. ఓ స్టార్‌ హోటల్లో ఉన్న సదుపాయాలన్నీ ఆ కాటేజీలో ఉన్నాయి. రాత్రివేళ అప్పుడప్పుడూ ఏనుగులూ అడవిదున్నలూ హోటల్‌ ఆవరణలోకి వచ్చే ఆస్కారం ఉండటంతో, భద్రతా సిబ్బంది సహాయం లేకుండా బయటకు రాకూడదని లాడ్జివారు సలహా ఇచ్చారు. లాడ్జి రెస్టారెంట్‌లో భోజనంలో మాకు కావాల్సిన శాకాహార, మాంసాహార వంటకాలను ఉంచారు. హోటల్‌ సిబ్బంది, మేనేజర్లు కాటేజీలో ఉన్న సదుపాయాల గురించీ ఆహార పదార్థాల నాణ్యత గురించీ అనేకసార్లు అడిగి తెలుసుకున్నారు. భోజనం చేసేటప్పుడు అక్కడ ఓ దృశ్యం మమ్మల్ని ఆకర్షించింది. ఆ రోజు రెస్టారెంట్‌కు హాజరైన అతిథుల్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే వారికి తమదైన శైలిలో శుభాకాంక్షలు అందజేస్తారు. రెస్టారెంటు సిబ్బంది, వంటవాళ్లు మొత్తం 12 నుంచి 15 మంది ఒకే వరుసలో నడుస్తూ వాళ్ల స్వాహిలి భాషలో పాడుకుంటూ అతిథి ఉన్న టేబుల్‌ దగ్గరకు వెళ్లి అతనికి శుభాకాంక్షలు అందజేశారు. కేకు కోయించారు. ఆ సమయంలో రెస్టారెంట్‌లో లైట్లు ఆఫ్‌ చేసి కొవ్వొత్తుల వెలుతురు మాత్రమే ఉంచారు.

మర్నాడు ఉదయాన్నే టిఫిన్‌ తినడానికి రెస్టారెంట్‌కి వచ్చాం. రకరకాల డ్రైఫ్రూట్లూ పండ్లరసాలూ పండ్లూ పాలూ కార్న్‌ఫ్లేక్సూ... వంటివన్నీ ఏర్పాటుచేశారు. ఇంకా రకరకాల రొట్టెలూ గుడ్లతో చేసిన పదార్థాలను అక్కడ ఉంచారు. ఎనిమిది గంటలకు సెరెంగెటి అనే మరో సఫారీ ప్రయాణం మొదలైంది. లాడ్జివారు ఆ రోజు మధ్యాహ్నం భోజనాన్ని అట్టపెట్టెల్లో పార్సిల్‌ చేసి ఇచ్చారు.
సెరెంగెటి పార్కులో... 
గొరొంగొరొ నుంచి సెరెంగెటి సఫారీ సుమారు 200 కిలోమీటర్లు ఉంటుంది. సెరెంగెటికి వెళ్లే దారిలో కొన్ని వేల అడవి దున్నలూ జింకలూ వందలకొద్దీ జీబ్రాలూ పదుల సంఖ్యలో జిరాఫీలూ ఆస్ట్రిచ్‌లూ కనిపించాయి. వేలసంఖ్యలో అడవిదున్నలు ఒకే వరుసలో వెళ్లడం మాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. మేం సెరెంగెటి ప్రవేశద్వారానికి చేరేసరికి మధ్యాహ్నం 12 గంటలు అయింది. అక్కడ ప్రవేశ రుసుము తలకి 50 డాలర్లు. టాంజానియాకి వాయువ్యదిశ నుంచి కెన్యా సరిహద్దులోని ఉత్తరం వరకూ అంటే సుమారు 15 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ఈ పార్కు మొత్తం దట్టమైన పొడవాటి గడ్డి పరచుకుని ఉంటుంది. సెరెంగెటి అనే పదం మాసై భాష నుంచి వచ్చింది. అంటే అంతులేని మైదానం అని అర్థం. ముందుగా సింహాలూ చిరుతలూ ఉన్న ప్రదేశానికి బయలుదేరాం. అక్కడ అవి చాలా కనిపించాయి. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు పార్కు ప్రవేశద్వారం దగ్గర ఉన్న కన్జర్వేషన్‌ ఆఫీసుకి వచ్చి, అక్కడ చెట్ల కింద ఏర్పాటుచేసిన బల్లల దగ్గర కూర్చుని భోజనం చేశాం. మళ్లీ రెండున్నరకు మా సఫారీ ప్రయాణం మొదలు... ఇప్పుడు సెరెంగెటి ఉత్తర భాగానికి బయలుదేరాం. అక్కడ ఆఫ్రికన్‌ ఏనుగులూ జిరాఫీలూ ఉన్నాయి. పెద్ద చెవులూ దంతాలూ కలిగి ఉన్న ఆఫ్రికన్‌ ఏనుగులు గుంపులుగుంపులుగా విహరిస్తున్నాయి. ఓ చోట రెండు ఏనుగులు తొండంతో పోట్లాడుకోవడం కనిపించింది.

ద గ్రేట్‌ మైగ్రేషన్‌ 
మేం వాహనంలో ముందుకు పోతుంటే ఆంటిలోప్‌(ఒకరకమైన జింక)లు గుంపుగా దాదాపు 15 అడుగుల ఎత్తు ఎగురుతూ రోడ్డునీ కాలువనీ దాటుతూ కనిపించాయి. ఆ దృశ్యం చూడ్డానికి అద్భుతంగా ఉంది. దారిలో ఓ నీటిగుంటలో రైనోలు నీటిలో మునుగుతూ తేలుతూ కనువిందు చేశాయి. నల్లని మూతులు కలిగి ఉన్న ఆఫ్రికన్‌ కోతులు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. అప్పటికే సమయం సాయంత్రం ఐదుగంటలు కావడం, ఇంకా అక్కడ ఉండటం ప్రమాదం అని హెచ్చరించడంతో మేం లాడ్జికి చేరుకున్నాం. మర్నాడు ఉదయాన్నే మాంజాకు బయలుదేరాం. తిరుగుప్రయాణంలో చూడని ప్రాంతాలకు తీసుకెళ్లారు. గృమెటి అనే నదీప్రాంతంలో చాలా మొసళ్లు కనిపించాయి. దగ్గరలోనే కొలాబస్‌ జాతికి చెందిన కోతులు గుంపులుగుంపులుగా ఉన్నాయి. పోతే సెరెంగెటికే తలమానికమైన ‘ద గ్రేట్‌ మైగ్రేషన్‌’ ఏటా మే నుంచి జులై వరకూ ఉంటుంది. ఆ సమయంలో దాదాపు 20 లక్షల జంతువులు ఎక్కువగా అడవిదున్నలూ జీబ్రాలూ ఆంటిలోప్సూ... కెన్యాకు వలసపోతాయి. మళ్లీ ఇక్కడ వాతావరణం అనుకూలించాక తిరిగి నవంబరు, డిసెంబరు నెలల్లో ఇక్కడకు వస్తాయి. ఆఫ్రికాలోని ఏడు సహజవింతల్లో ద గ్రేట్‌ మైగ్రేషన్‌ ఒకటి. ఈ 800 కిలోమీటర్ల వలస ప్రయాణంలో దాదాపు రెండున్నర లక్షల జంతువులు ఆకలీ నీటికొరతా వన్యమృగాల దాడుల కారణంగా చనిపోతాయట.

సెరెంగెటీలో హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ సదుపాయం కూడా ఉంది. అందులో ఎక్కి విస్తారమైన సెరెంగెటి పచ్చని మైదానాన్ని చూడవచ్చు. మాంజా చేరుకునేటప్పటికి సాయంత్రం నాలుగు గంటలయింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన విక్టోరియా మంచినీటి సరస్సు ఇక్కడే ఉంది. దీని ఉపరితలం 68,800 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంటుంది. దీని తీరం 4,828 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది టాంజానియా, కెన్యా, ఉగాండా దేశాల సరిహద్దుల్లో విస్తరించి ఉంది. ఈ సరస్సులో అతి ఎక్కువ లోతు 272 అడుగులు. అతి తక్కువ లోతు 130 అడుగులు. నైల్‌ పెర్చ్‌ అనే చేప ఈ సరస్సు ప్రత్యేకత. ఇంకా అనేక జాతులకు చెందిన చేపలు కూడా ఉంటాయి. దాదాపు లక్షన్నర మందికి ఈ చేపలే జీవనాధారం. ఇక్కడి చేపలు రుచిగా ఉండటంతో వీటికి ప్రత్యేక గిరాకీ ఉందట. అందుకే ఇవి చాలా ప్రదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. మేం ఆ రాత్రికి సరస్సుకి ఆనుకుని ఉన్న హోటల్లో బస చేసి, మర్నాడు తిరిగివచ్చాం.

No comments:

Post a Comment