Saturday, 30 December 2017

కేరళ... ఓ అందాల భరిణె..!


కేరళ... ఓ అందాల భరిణె..!
‘ఎటు చూసినా ఆకాశాన్ని తాకుతున్నట్లున్న పచ్చని చెట్లూ, చేయి ఎత్తితే అందేంత దగ్గరలో తెల్లని మబ్బులూ, కళ్లు తిరిగిపోయే లోతైన లోయలూ, పచ్చటి దుప్పటి పరిచినట్లుగా ఉన్న తేయాకుతోటల కొండలూ, కొబ్బరిచెట్ల సౌందర్యంతో తడిసిముద్దవుతోన్న బ్యాక్‌వాటరూ... అవన్నీ చూస్తుంటే జన్మ ధన్యమైనట్లే అనిపించింది’ అంటూ కేరళ అందాల గురించి చెప్పుకొస్తున్నారు వరంగల్‌కు చెందిన బండి రవీందర్‌.నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ట్రావెలర్‌ సర్వే ప్రకారం ప్రపంచంలో చూడదగ్గ మొదటి 50 ప్రదేశాల్లో కేరళ ఉండటంతో కేరళ అందాలను చూడాలనుకుని ఉపాధ్యాయ కుటుంబ మిత్రులమంతా కలిసి 80 మందిమి బయలుదేరాం. వరంగల్‌ నుంచి ఎర్నాకుళం జంక్షన్‌కు 24 గంటల ప్రయాణం. రెండు ట్రావెల్‌ బస్సుల్లో కొచ్చీకి వెళ్లి ముందే బుక్‌ చేసుకున్న హోటల్లో దిగాం. స్నానపానాదులు అయ్యాక డచ్‌ ప్యాలెస్‌, మ్యూజియంలను చూసి సాయంత్రం హార్బర్‌కు వెళ్లాం. ఇది ప్రకృతి సిద్ధమైన హార్బర్‌. మనదేశంలోని పోర్టుల్లోకెల్లా పెద్దది. ఆ రాత్రి బోటు అద్దెకు తీసుకుని అర్ధరాత్రి 12 గంటల వరకూ ఆనందంగా గడిపాం.గురువాయూర్‌లో...
తెల్లవారి త్రిసూర్‌ జిల్లాలోని గురువాయూర్‌కి బయలుదేరాం. దారి పొడవునా కొబ్బరిచెట్లే. వేలు, లక్షల కొబ్బరిచెట్లను చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. మూడుగంటల ప్రయాణం తరవాత గురువాయూర్‌కి చేరుకున్నాం. ఈ దేవాలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. దీన్ని భూలోక వైకుంఠంగా చెబుతారు. తెలుగువారికి తిరుపతి, శ్రీశైలం ఎలానో కేరళీయులకి గురువాయూర్‌, శబరిమల అలాగే. ఇందులోకి హిందువులకు మాత్రమే ప్రవేశం. ఆడవాళ్లు తెల్లని చీరలూ మగవాళ్లు చొక్కా లేకుండా తెల్లని అంగవస్త్రం, లుంగీతో దేవుణ్ణి దర్శించుకోవాలి. అయస్కాంత లక్షణాలున్న నల్లని రాయితో మలిచిన చిన్నికృష్ణుని విగ్రహాన్ని దర్శించుకుని తన్మయత్వానికి లోనయ్యాం. గురువు అంటే బృహస్పతి, వాయు అంటే వాయుదేవుడు. ఊర్‌ అంటే స్థలం. బృహస్పతి, వాయుదేవుడు కలిసి ఈ స్థలంలో స్వయంగా కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి గురువాయూర్‌ అని పేరొచ్చిందట. గురువాయురప్పన్‌గా పిలుచుకునే ఇక్కడి చిన్నికృష్ణుడి దర్శనం సమస్త పాపహరణంగా భావిస్తారు. ఏటా ఫిబ్రవరిలో గురువాయూర్‌ ఉత్సవం పదిరోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతుంది. మొదటిరోజు అనయోట్టం ఉత్సవం ఏనుగుల పరుగుపందెంతో మొదలవుతుంది. పందెంలో గెలిచిన ఏనుగు ఏడాదిపాటు దేవుని ఉత్సవ విగ్రహాన్ని మోసే అవకాశాన్ని దక్కించుకుంటుంది. ఇక్కడి ఏనుగులను నడిచే గురువాయురప్పన్‌లుగా భావిస్తారు. అందుకే ఎంతోమంది ఏనుగులను దేవాలయానికి విరాళంగా ఇస్తుంటారు. వాటిని ప్రత్యేక క్యాంపులో సంరక్షిస్తున్నారు. దైవదర్శనం తరవాత ఏనుగుల క్యాంపు చూడ్డానికి వెళ్లాం. అక్కడ 56 ఏనుగులు ఉన్నాయి. అవన్నీ మగవే కావడం విశేషం. నాలుగు దశాబ్దాలపాటు దేవాలయంలో సేవచేసి 1976లో మరణించిన కేశవన్‌ సేవలకు గుర్తుగా విగ్రహాన్ని నిర్మించారు. ఆ మధ్యాహ్నం మున్నార్‌కు బయలుదేరాం.మున్నార్‌లో...
ఇడుక్కి జిల్లాలో ఉన్న మున్నార్‌, గురువాయూర్‌కి 180 కి.మీ. దూరంలో సముద్రమట్టానికి 1800 మీ. ఎత్తులో ఉంది. ఆ దారిలో ఎత్తయిన కొండలూ లోతైన లోయలూ కొండలమీద నుంచి ఉరికే జలపాతాలూ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. జలపాతం కనిపించినప్పుడల్లా ఆగుతూ సాగిన మా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. రాత్రి ఎనిమిది గంటలకు మున్నార్‌కి చేరుకున్నాం. ఉదయం కర్టెన్లు తీసి చూస్తే, వెనక వైపంతా పెద్దలోయా, పచ్చనిచెట్లూ, కొండలూ, వాటి మధ్యలో అందమైన ఇళ్లూ... చిత్రకారుడు గీసిన చిత్రంలా ఎంతో అందంగా అనిపించింది. అల్పాహారం తిన్నాక మున్నార్‌ అందాలను చూడ్డానికి బయలుదేరాం. ఎటుచూసినా ఆకాశాన్ని తాకే పచ్చని చెట్లూ, చేతికి అందుతాయేమోనన్నంత దగ్గరగా తెల్లని మబ్బులూ, చూస్తేనే కళ్లు తిరిగిపోతాయనిపించే లోతైన లోయలూ, కొండలనిండా పచ్చటి దుప్పటి పరిచినట్లుగా ఉన్న తేయాకుతోటలూ... మరోలోకంలో విహరిస్తున్నట్లే అనిపించింది. ఇక్కడ 30కి పైగా టీ ఎస్టేట్స్‌ ఉన్నాయి. దారిలో రెండుమూడు తోటల్లో బస్సు ఆపి కాసేపు వాటిల్లో తిరిగి, దగ్గర్లోని టాటా టీ మ్యూజియం చూడ్డానికి వెళ్లాం. లోపల తేయాకుని వివిధ దశల్లో ఎలా ప్రాసెసింగ్‌ చేస్తారో గైడ్‌ చూపించాడు. కమ్మని రుచిగల టీని ఉచితంగా అందించారు. అక్కడి అవుట్‌లెట్స్‌లో రకరకాల టీ పొడులు కొనుక్కోవచ్చు.అక్కడినుంచి 13 కి.మీ. దూరంలోని మట్టుపెట్టి డ్యామ్‌కు వెళ్లాం. దీన్ని 1953లో రెండుకొండల మధ్యలో నిర్మించారు. జలవిద్యుచ్ఛక్తి తయారీతోబాటు వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోందీ డ్యామ్‌. ఇక్కడే బోటింగ్‌ సౌకర్యం కూడా ఉంది. తరవాత 20 కి.మీ. దూరంలోగల ఎరవికుళం వైల్డ్‌లైఫ్‌ పార్కుకి బయలుదేరాం. కేరళలో ఏర్పాటుచేసిన మొట్టమొదటి వైల్డ్‌లైఫ్‌ పార్కు ఇదేనట. ఇక్కడ అంతరించిపోతున్న నీలిగిరి థార్‌, లాంగర్‌, సాంబార్‌, గౌర్‌, ఇంకా కొన్ని ఏనుగులు ఉన్నాయట. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్పించే నీలకురింజి మొక్కలు ఉన్నాయి. అవి పూలుపూసిన సంవత్సరం పార్కులోని కొండలు మొత్తం నీలంరంగులో కనిపిస్తాయి. పశ్చిమ కనుమల్లోని అనాముడి అనే ఎత్తయిన కొండ ఈ పార్కులోనే కనిపిస్తుంది. ఈ కొండ పెద్ద ఏనుగు తల రూపంలా ఉండటంవల్ల అనాముడి (మలయాళంలో ఏనుగుతల)అని పిలుస్తారు. దీన్ని దక్షిణ భారత ఎవరెస్ట్‌ అనీ అంటారు.

తరవాత మజిలీ 90 కి.మీ. దూరంలోని తెక్కడి. ఈ దారిలో అన్నీ సుగంధద్రవ్యాల తోటలే. దారిలో మైలాదుమ్‌పురా వద్ద సుగంధద్రవ్యాల పార్కుకి వెళ్లాం. మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క...వంటి మొక్కలను  ప్రత్యక్షంగా చూడొచ్చు. అన్ని భాషల్లో వివరించడానికి గైడ్లు ఉన్నారు. ఈ మొక్కలు ఎలా పెరుగుతాయో వాటిని ఎలా ప్రాసెస్‌ చేస్తారో అన్నీ చక్కగా తెలుగులో వివరించారు. అక్కడి షాపుల్లో తాజా దినుసుల్ని కొనుక్కున్నాం. మిరియాల తరవాత ఎక్కువగా కనిపించేవి రబ్బర్‌ తోటలే. రబ్బరు ఉత్పత్తిలో 90 శాతం కేరళ రాష్ట్రానిదే. ఈ చెట్లన్నింటికీ కాండం దగ్గర చేతికి అందే ఎత్తులో కవర్లు కట్టి ఉన్నాయి. ఆ కవర్లలోకి తెల్లని ద్రవం(లేటెక్స్‌) వస్తుందనీ దాన్నే రబ్బురుగా మలుస్తారనీ చెప్పారు. సాయంత్రానికి తెక్కడికి చేరుకున్నాం. అక్కడ పెరియార్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చ్యురీ ఉంది. ఇందులో పులులూ, ఏనుగులూ, సాంబార్‌లూ, కోతులూ ఉన్నాయి. వీటిని చూడ్డానికి అడవి చుట్టూ సరస్సును ఏర్పాటుచేశారు. పడవలో వెళ్లి చూడాలి. ఆ రాత్రికి తెక్కడిలోని మార్షల్‌ ఆర్ట్‌ థియేటర్‌కు వెళ్లి, కలారిపట్టు అనే యుద్ధవిద్యనుచూసి, అలెప్పీకి బయలుదేరాం.అలెప్పీలో...
బ్యాక్‌ వాటర్‌ సందర్శక కేంద్రంగా దీనికి పేరు. హౌస్‌ బోటులకీ స్నేక్‌ బోటులకీ ఇది పేరొందిన ప్రదేశం. మున్నార్‌ నుంచి 170 కి.మీ. దూరంలో ఉన్న అలెప్పీ అలప్పుజా జిల్లా ముఖ్య కేంద్రం. బస్సులో వస్తుంటే ఇరువైపులా పంటకాలువలూ పడవలూ కొబ్బరిచెట్లూ ఎవరో అందంగా తీర్చిదిద్దినట్లుగా ఉందీ ప్రాంతం. ఇక్కడ పడవలే ప్రయాణసాధనాలు. అలెప్పీ అందాలను పర్యటకులకు చూపించడానికి దాదాపు వెయ్యి హౌస్‌బోటులు రెడీగా ఉన్నాయి. మనం చెల్లించే ధరనుబట్టి వీటిల్లో ప్రీమియం, డీలక్స్‌, లగ్జరీ రకాలు ఉన్నాయి. పడవలో సిట్టింగ్‌, లివింగ్‌, డైనింగ్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌.... అన్నీ దేనికది ఉంటాయి. ఏసీ, గీజర్‌, శాటిలైట్‌ టీవీ అన్ని సదుపాయాలూ ఉన్నాయి. పడవమీద ఎక్కి కూర్చోవడానికి సన్‌డెక్‌ ఉంటుంది.ఈ పడవలో సుమారు 10, 12 కి.మీ. బ్యాక్‌వాటర్లో తీసుకెళ్లి రాత్రంతా ఒకచోట ఆపి ఉదయం తిరిగి మనం ఎక్కినచోట వదిలిపెడతాయి. మన ఇష్టాన్నిబట్టి ఒక రాత్రిగానీ ఒక పగలూరాత్రి కలిపిగానీ ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు. అల్పాహారం, లంచ్‌, డిన్నర్‌, కాఫీ, టీలు అన్నీ మన వెంటే ఉన్న కుక్‌ బోటులోని కిచెన్‌లోనే వండి వడ్డిస్తాడు. మేం రెండు బోట్లు అద్దెకు తీసుకుని వెళ్లాం. మధ్యలో ఒకచోట రెండు గంటలు ఆపుతారు. అక్కడ హోటళ్లు ఉన్నాయి. వాటిల్లో మనముందే చేపలను పట్టేసి, వేయించి వడ్డిస్తారు. వాటి రుచి అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రయాణిస్తుంటే ఒకవైపంతా ఇళ్లూ మరోవైపంతా కొబ్బరిచెట్లూ పంటపొలాలూ ఉన్నాయి. ఇళ్లముందు నుంచే బోట్లు వెళ్తుంటాయి. ఇంటింటికీ ఓ పడవ ఉంటుంది.

అలెప్పీ నెహ్రూట్రోఫీ బోట్‌ రేసింగ్‌కు ప్రసిద్ధి. ఏటా ఆగస్టు నెలలో రెండో శనివారం జరుగుతాయివి. వీటినే స్నేక్‌ బోట్‌ రేసెస్‌ అనీ అంటారు. పడవ వెనక భాగం 15 అడుగుల ఎత్తులో లేచి పాములా కనిపిస్తుంది. 140 అడుగుల పొడవున్న ఈ పడవలను 110 మంది నడుపుతూ పందెంలో పాల్గొంటారు. దాదాపు 20 బృందాలు పోటీలో పాల్గొంటాయి. దీన్ని లక్షలమంది స్థానికులూ పర్యటకులూ వీక్షిస్తారు. వందమంది ఒకే పడవను ఒకేసారి తెడ్డువేయడం గమ్మత్తుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి త్రివేండ్రం వెళ్లి, పద్మనాభస్వామి గుడినీ కోవలం బీచ్‌నీ సందర్శించి వెనుతిరిగాం.

Saturday, 2 December 2017

లడక్‌ సరస్సు

మనోహరం లడక్‌ సరస్సుల విహారం!

‘సుర్రో సుర్రన్నాడే ’ అంటూ శక్తి సినిమాలో ఇలియానా మెలికలు తిరుగుతూ అందాలొలికించిన ప్రదేశం గుర్తుందా, ‘సత్‌రంగీ రే...’ అంటూ మణిరత్నం దిల్‌ సేలో చిత్రీకరించిన పాటా, త్రీ ఇడియట్స్‌ క్లైమాక్స్‌ సీనూ... ఇలా అనేక సినిమాల్లో కనువిందు చేస్తోన్న లడక్‌ సరోవర అందాలను ప్రత్యక్షంగా చూసి వచ్చాం’ అంటూ ఆ అనుభవాలను చెప్పుకొస్తున్నారు సికింద్రాబాద్‌కు చెందిన డాక్టర్‌ కె.సీతారత్న.

భిన్న ప్రాంతాలూ అక్కడ మాత్రమే జీవించే విభిన్న రకాల జంతువులూ పక్షులూ వృక్షజాతులూ ఆటవిక తెగలూ... ఇలా జీవ వైవిధ్యానికి మరో పేరు భారతదేశమైతే; అరుదైన, కనుమరుగవుతున్న జీవజాతులతో కూడిన బయోరిజర్వ్‌లూ అద్దాల్లా మెరిసే నీలి రంగు సరోవరాలకూ మారుపేరే లడక్‌. ఎత్తైన ఆ మంచుకొండల్లోని ముదురు నీలిరంగుల్లో ప్రకాశించే సరస్సుల సోయగం వర్ణించనలవి కాదు. అందుకే అచ్చంగా ఆ సరస్సుల్ని సందర్శించాలనుకుని ప్రణాళిక చేసుకున్నాం. జూలై 30వ తేదీన ముందుగా లేహ్‌కు చేరుకున్నాం. అక్కడి నుంచి ఇన్నోవాలో Pangong Tso Lake(పాంగోంగ్‌ త్సొ సరస్సు)కి బయలుదేరాం. ఇది 40 శాతం భారత భూభాగంలోనూ 60 శాతం టిబెట్‌(చైనా) లోనూ ఉంది. భారత్‌-చైనా సరిహద్దు నియంత్రణ రేఖ మీద ఉన్నందున నిరంతరం సైన్యం కాపలా ఉంటుంది. విదేశీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే లైన్‌ పర్మిట్‌ ఉండాలి. మారిన రాజకీయ పరిస్థితుల వల్ల దేశీయులు కూడా ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ తీసుకోవాలి. అందుకే Leh[లేహ్‌(లే)]లోనే పర్మిట్‌తో బాటు వాటి జిరాక్స్‌ ప్రతులూ, ఆధార్‌, మా ఫొటోలూ అన్నీ తీసుకున్నాం. వాటిని చెక్‌ పోస్టుల దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది.

కత్తి మీద సవాల్‌!
Leh(లేహ్‌) నుంచి బయలుదేరి, 45 కిలోమీటర్ల దూరంలోని Karu (‘కార్‌’) అనే ప్రాంతానికి చేరుకుని, అక్కడి నుంచి 17,800 అడుగుల ఎత్తులోని Chang La Pass (చాంగ్‌ లా పాస్‌)కి చేరుకున్నాం. ఇది ఎత్తైన కొండదారుల్లో రెండోది. అక్కడ ఉన్న ఓ చిన్న హోటల్లో టీ తాగి, చుట్టుపక్కల దృశ్యాలను ఫొటోలు తీసుకుని మళ్లీ బయలుదేరాం. నెమ్మదిగా ప్రవహిస్తున్న సింధునదినీ దాని మధ్యలో వూదారంగు పూలతో నిండిన మట్టి దిబ్బల్నీ చూస్తూ మా ప్రయాణం సాగింది. అక్కడి నుంచి మరో 58 కి.మీ. ప్రయాణించాక తంక్‌సే అనే ప్రాంతం వచ్చింది. ఇది దాటాక రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఈ ప్రాంతాన్ని Pagal Nala(పాగల్‌నాలా) అంటారు. అక్కడక్కడా హిమనదాల నుంచి కిందకి ప్రవహించి వచ్చిన నీరు మూడు నాలుగు అడుగుల లోతు వరకూ ఉంది. ఆ ప్రవాహాలని దాటడం కత్తి మీద సవాలే. టైర్లు రాళ్ల మధ్య ఇరుక్కుని ముందుకీ వెనక్కీ కదలని పరిస్థితి. ఎలాగో కష్టపడి 32 కి.మీ. ప్రయాణించాక స్పాంగుర్‌ త్సొ సరస్సు వచ్చింది. ఇది దాటాక మేం బస చేసే పాంగోంగ్‌ త్సొ రిసార్టుకు చేరుకున్నాం.

ఈ ప్రయాణంలో వాతావరణం ఎప్పుడెలా మారిపోతుందో తెలీదు. రోడ్డు అస్సలు బాగుండదు. టెలిఫోనూ సెల్‌ఫోను సంకేతాలు చేరని ఎత్తైన ప్రాంతం. అక్కడ వీచే ఈదురు గాలుల తాకిడికి చెవులు చిల్లులు పడతాయేమో అనిపిస్తుంది. వాతావరణంలో ఆక్సిజన్‌ శాతం చాలా తక్కువ. మౌంటెయిన్‌ సిక్‌నెస్‌కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆక్సిజన్‌ సిలిండర్లను ఉపయోగించే విధానాన్ని తెలుసుకుని, వాటిని ఉపయోగించడానికి మానసికంగా సిద్ధపడినవారే ఈ ప్రాంతాన్ని పర్యటించాలి. చలికాలంలో అయితే పాంగోంగ్‌ సరస్సు గడ్డ కట్టి ఉంటుంది. మే నుంచి మంచు కరగడం ప్రారంభమవుతుంది. అందుకే అప్పటి నుంచి సెప్టెంబరు వరకూ దీన్ని ఎక్కువమంది సందర్శిస్తుంటారు. భూమ్మీద ఉన్న ఎత్తైన ఉప్పునీటి సరస్సు ఇదే.

కరెంటు ఉండదు!
సాయంత్రం నాలుగు గంటలకు సరస్సు దగ్గరకు చేరుకున్నాం. అది చూశాక అప్పటివరకూ పడ్డ కష్టమంతా హుష్‌కాకిలా ఎగిరిపోయింది. 14,270 అడుగుల ఎత్తులో నెమలిపింఛం వర్ణంలోని నీటితో మెరిసిపోతుందా ఉప్పునీటి సరస్సు. అప్పటికే అక్కడ చాలామంది సందర్శకులు ఉన్నారు. క్రమంగా సూర్యాస్తమయం కావడంతో పసుపూ బంగారు వర్ణాలు సంతరించుకున్న నీలాకాశ అందాలు సరస్సుల్లో ప్రతిఫలిస్తున్నాయి. అలా చాలాసేపు ఆ సరస్సు దగ్గరే ఉండి, మారుతున్న ఆకాశంలోని రంగుల్నీ హిమశిఖర సౌందర్యాన్నీ చూస్తూ గడిపేశాం. ఎనిమిది గంటలకు చీకట్లు కమ్ముకు రావడంతో రిసార్టుకి వచ్చేశాం. రిసార్టుల్లోగానీ గ్రామాల్లోగానీ కరెంటు ఉండదు. రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకూ రిసార్టుల వాళ్లే జనరేటర్ల ద్వారా చిన్న చిన్న బల్బులు వెలిగేలా చూస్తారు. రాత్రి పది గంటలకు ఆ జనరేటర్‌ కూడా బంద్‌ అవుతుంది. రాత్రివేళ ఉపయోగించుకోవడానికి హై పవర్‌ టార్చిలైటు వెంట ఉండాల్సిందే. మౌంటెయిన్‌ సిక్‌నెస్‌ కారణంగా ఆ రాత్రంతా నిద్రలేదు. ట్యాబ్లెట్లు వేసుకుని, రెండు గంటలపాటు ఆక్సిజన్‌ తీసుకోవాల్సి వచ్చింది.

మర్నాడు ఉదయం రిసార్టు కుర్రాడు ఇచ్చిన వేడినీళ్లతో కాలకృత్యాలు ముగించుకుని అల్పాహారం తీసుకుని, ఉదయ కాంతిలో సరస్సు అందాలను మరోసారి తనివితీరా చూసి, తిరుగుప్రయాణమయ్యాం. లేహ్‌ ప్రాంతానికి చేరుకునేసరికి సాయంత్రం ఐదు గంటలయింది. త్సొ మోరిరి, త్సొ కర్‌ ప్రాంతాలకు వెళ్లడానికి ఇన్నోవాను ఏర్పాటుచేసుకున్నాం. మధ్యలో పెట్రోల్‌ దొరకదు కాబట్టి మొత్తం 400 కి.మీ. దూరానికి సరిపడా పోయించుకుని బయలుదేరాం. ఈ సరస్సులకు వెళ్లడానికీ లేహ్‌ పట్టణంలోనే రిస్ట్రిక్టెడ్‌ ఏరియా అనుమతి తీసుకుని బయలుదేరాలి.

ఆరు గంటలకే లేహ్‌ నుంచి బయలుదేరి, ఉప్పి మీదుగా చుమ్‌థాంగ్‌ చేరుకున్నాం. అక్కడ మధ్యాహ్న భోజనం చేసి, కాసేపు విశ్రమించాం. అక్కడ ఓ బౌద్ధ ఆరామం, వేడినీటి బుగ్గలూ ఉన్నాయి. వాటిని సందర్శించి ప్రయాణం కొనసాగించాం. దారిపొడవునా సింధునది మా వెంటే వస్తోంది. అక్కడక్కడా అది గట్లు తెంచుకుని దారికి అడ్డం పడటంతో వాహనాలు కూడా ఆగిపోయాయి. నదీప్రవాహం రోడ్లమీద మూడు అడుగుల ఎత్తు చేరడంతో అసలు అది నదా లేక రోడ్డా అనేది కూడా తెలిసేది కాదు. రక్షణ దళాలు రోడ్లను మరమ్మత్తులు చేస్తున్నా ప్రవాహాన్ని నియంత్రించడం వాళ్ల వల్ల కావడం లేదు. మొత్తమ్మీద ఆర్మీ వాహనాల సాయంతో బయటపడ్డాం.

పష్మీనా గొర్రెలతో...
చుమ్‌థాంగ్‌ నుంచి 60 కి.మీ. ప్రయాణించాక త్సొ మోరిరి సరస్సుకి చేరుకున్నాం. కొంతదూరం ప్రయాణించగానే పష్మీనా జాతికి చెందిన తెల్లని గొర్రెల్ని మేపుతున్న స్థానిక తెగల స్త్రీ పురుషులు కనిపించారు. టిబెట్‌ నుంచి వలస వచ్చిన చాంగ్‌పాస్‌ అనే సంచార తెగ ఇక్కడ నివసిస్తోంది. వీళ్లు వ్యవసాయం కూడా చేస్తారు. ప్రభుత్వ సహకారంతో ఈ పష్మీనా గొర్రెల్ని పెంచి వాటి నుంచి తీసిన బొచ్చుని విక్రయిస్తారు. ఇది ఖరీదైన ఉన్నిగా పేరొందింది. దీంతో చేసే శాలువాలూ దుప్పట్లూ పలుచగా ఉంటాయి. కానీ చలి నుంచి బాగా కాపాడతాయి.

సాయంత్రం ఐదు గంటలకు అక్కడకు చేరుకున్నాం. టెంటులో లగేజీ పెట్టేసి, రిసార్టు వారిచ్చిన కాఫీ తాగి కెమెరాలతో సరస్సు దగ్గరకు చేరుకున్నాం. ఇది మంచినీటి సరస్సు. సముద్రమట్టానికి 15,075 అడుగుల ఎత్తులో ఉంది. దీని చుట్టూ హిమాలయ శ్రేణులు 18 నుంచి 20 వేల అడుగుల ఎత్తులో కనిపిస్తాయి. ఆ మధ్యలో ఉన్న లోయనే రప్‌షు అంటారు. దాని చుట్టూ తిరుగుతూ హిమాలయాల్లో మాత్రమే కనిపించే సూర్యాస్తమయ అందాలను చూస్తూ గడిపేశాం. ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. టిబెట్‌కు చెందిన అడవి గాడిదలైన కియాంగ్‌లు ఈ ప్రాంతానికే పరిమితం. ఎరుపురంగు నక్కలూ, బార్‌ హెడ్‌ బాతులూ కూడా ఇక్కడ కనిపిస్తాయి.

సరస్సు వద్ద పెద్ద ఆర్మీ క్యాంపు ఉంది. అక్కడ ఉన్న గ్రామం పేరు కొర్జొక్‌. పర్యటక రిసార్టులకు ఈ సైనిక క్యాంపు నుంచే రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకూ కరెంటు సరఫరా ఇస్తారు. మిగిలిన సమయాల్లో కరెంటు ఉండదు. ఫోను సిగ్నల్స్‌ ఉండవు. ఇవన్నీ లద్దాఖ్‌లో అత్యంత మారుమూల ప్రదేశాలు. రాత్రయ్యేసరికి మెల్లగా తలనొప్పి పెరిగింది. కళ్లు తిరగడం కూడా ప్రారంభమయ్యేసరికి సిలెండర్‌ ద్వారా ఆక్సిజన్‌ను రెండు గంటలపాటు పీల్చాల్సి వచ్చింది.

మర్నాడు ఉదయాన్నే లేచి సరస్సు దగ్గరకు వెళ్లాం. అప్పుడు కనిపించిందో దృశ్యం. దాదాపు మూడు వందలకు పైగా ఉన్న బార్‌హెడెడ్‌ బాతుల గుంపు మేం ఉన్న వైపునకు ఒడ్డుకి రాసాగింది. మేం వాటికి కనిపించకుండా మట్టి దిబ్బల వెనక నిలబడి ఫొటోలు తీసుకున్నాం. ఒక గుంపు తరవాత మరో గుంపు వచ్చింది. అవన్నీ కూడా వలస పక్షులే. వీటికి మనదేశంలోని బ్రీడింగ్‌ సెంటర్లు లద్దాఖ్‌ సరస్సులు మాత్రమే. ఇక్కడే గుడ్లు పెట్టి, పొదిగి వాటికి ఎగరడం నేర్పి తిరిగి తమతోబాటు సైబీరియాకి తీసుకుని పోతాయి. అలా అవి ప్రయాణిస్తున్నంత మేర వెళుతూ తిరిగి అలసిపోయాం. సాయంత్రం నడిచే ఓపిక లేక వాహనంలోనే సరస్సు దగ్గరకు వెళ్లి, సాయం సంధ్యా సమయంలో తళుకులీనే హిమవర్ణ సోయగాలను వీక్షించి ఆనందంగా బసకు చేరుకున్నాం.

ఆ మంచుకొండల్లో మంచు కురవదు!
దాదాపు 130 అడుగుల లోతులో 26 కి.మీ. పొడవూ సుమారు ఐదు కిలోమీటర్ల వెడల్పూ ఉండే త్సొ మొరిరి సరస్సు అందాలను మరోసారి చూసి, మర్నాడు ఉదయాన్నే తిరుగు ప్రయాణమయ్యాం. దారిలో మాహి అనే వంతెన వచ్చింది. అక్కడి నుంచి దారి మళ్లి ప్రయాణిస్తే త్సొ కర్‌ సరస్సు వస్తుంది. అదీగాక సింధునది మేం వచ్చిన దారిని ముంచెత్తడంతో ఆర్మీ వాళ్లు కూడా రూటు మార్చుకుని ఆ దారిలోనే ప్రయాణించారు. మార్గం అంతా గుంతలమయం. రప్‌షు లోయలోని లోతైన సరస్సు ఇది. దీని చుట్టూ 9 చదరపు కిలోమీటర్ల మోరి మైదానం ఉంది. దీని వెనకగా తుగ్‌జి, గర్షన్‌ అనే హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అనేక సంవత్సరాల కిందట త్సొ కర్‌ సరస్సు ఈ పర్వతాల వరకూ విస్తరించి ఉండేదట. ఉప్పునీటి సరస్సు కావడంతో చాంగ్‌ పా అనే సంచారజాతి వారు సరస్సు నుంచి ఉప్పును తీసి టిబెట్‌కు తరలించేవారట. చిత్రమైన విషయం ఏంటంటే అక్కడ మంచు కురవదు, వర్షం పడదట. ఉష్ణోగ్రత వేసవిలో 30 డిగ్రీల సెంటీగ్రేడూ, చలికాలంలో -40 డిగ్రీలూ ఉంటుంది.

ఇక్కడ ఓ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. అందులో బ్లాక్‌ హెడెడ్‌ కొంగలూ టిబెటన్‌ బాతులూ తోడేళ్లూ నక్కలూ మార్మోట్‌లూ గోధుమరంగు తలతో ఉండే గల్స్‌... వంటి అరుదైన జీవజాతులు ఉన్నాయి. అయితే మేం సరస్సు దగ్గరకు మాత్రం వెళ్లలేకపోయాం. ఎందుకంటే దానిచుట్టూ బురదతో నిండిన నీటి మొక్కలు ఉన్నాయి. అక్కడ కాలేస్తే లోపలకు కూరుకుపోతాయట. పైగా సరస్సు అంతా మంచుతో గడ్డకట్టుకుపోయి ఉంది. అందుకే దూరం నుంచే దాన్ని చూసి వెనుతిరిగాం.Wednesday, 1 November 2017

ఘృశ్నేశ్వరస్వామి

ఘృశ్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం
భక్తులు తాకే జ్యోతిర్లింగం


అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన శిల్పాలకు నెలవైన ఎల్లోరా గుహలకు సమీపంలో ఘృశ్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం విరాజిల్లుతోంది. మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ జ్యోతిర్లింగం అపూర్వ మహిమలకు పేరుగాంచింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పన్నెండవదిగా వినుతికెక్కింది. ఔరంగబాద్‌ జిల్లా, వేరూల్‌ గ్రామంలో శివాలయ తీర్థం సమీపంలో వెలిసిన ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించి తరించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులది మహాద్భాగ్యమని చెప్పొచ్చు. జ్యోతిర్లింగా ఆఖరిది అయిన ఘృశ్నేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు.

ఇళాపురే రమ్య విశాల కేస్మిన్‌ సముల్లసం తంచ జగద్వరేణ్యం వందే మహోదార తర స్వభావం ఘుశ్శేశ్వరాఖ్యం శరణ్యం ప్రపద్యే

పురాణగాథ
పూర్వం ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసీలు నివాసం ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాంబీ అనేవారు. ఆదిమతెగ భాషలో బాంబీ అంటే పాముల పుట్ట అని అర్థం. మరాఠీలో దీనిని ‘వరూల్‌’ అంటారు. కాలక్రమేణ అది వేరూల్‌గా మారింది. ఈ ప్రాంతంలో ఏలగంగా నది ప్రవహిస్తుంది. ఏలగంగా నది తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వేరూల్‌గా ప్రసిద్ధి చెందిందని మరో కథనం.

చరిత్ర
ఈ ప్రాంతంలో ఏల్‌ అనే రాజు ఉండేవాడు. ఆయన రాజధాని ఏలాపూర్‌. అదే వేరూల్‌గా ప్రసిద్ధి చెందిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఒకసారిరాజు వేటకు వనానికి వెళ్తాడు. అక్కడ అడవి జంతువులతో పాటు మునుల ఆశ్రమంలో ఉండే జంతువులని కూడా సంహరిస్తాడు. అది చూసిన మునులు రాజు సర్వాంగాలకు పురుగులు పట్టాలని శపిస్తారు. ఆ శాపం వల్ల రాజు వనాల వెంట తిరుగుతూ ఉంటాడు. ఒకనాడు బాగా దాహం వేయడంతో అడవిలోని చాలా చోట్ల తిరుగుతాడు. అయిన కూడా ఎక్కడా నీరు దొరకదు. ఒక చోట మాత్రం ఆవు డెక్కలతో చేసిన నీటికుంటలో కొద్దిగా నీరు కనిపిస్తుంది. రాజు వాటిని కొద్దిగా తాగగానే విచిత్రంగా అతని శరీరానికి పట్టిన పురుగులన్నీ మటుమాయం అవుతాయి. రాజు ఆ సరస్సు ఉన్న ప్రదేశంలో తపస్సును ఆచరించగా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రదేశంలో తీర్థాలను ప్రతిష్టిస్తాడు. దగ్గరలో ఒక సరోవరాన్ని నెలకొల్పుతాడు. బ్రహ్మ నెలకొల్పిన సరోవరమే బ్రహ్మసరోవరం. కాలక్రమేణ అది శివాలయంగా ప్రసిద్ధి గాంచింది.

స్థలపురాణం
పూర్వం దేవగిరి దుర్గంలో సుధర్మడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు. వారు నిత్యం అనేక పూజలు, నైతిక కార్యక్రమాలను నిర్వహించేవాడు. కానీ వారికి సంతానం లేక బాధపడేవారు. ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన ఘుష్మను భర్తకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటుంది. వివాహానికి ముందే వారిని చూసి ఈర్ష్య పడనని వాగ్ధానం చేస్తుంది. వివాహం అయిన తరువాతా అక్కాచెల్లెళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాలక్రమేన ఘుష్మకు మగ సంతానం కలిగింది. కొంతకాలానికి ఘుష్మ కుమారుడికి వివాహం జరుగుతుంది. చెల్లెలి సంతానం అభివృద్ధి చెందడం సహించలేని సుదేహ.. ఘుష్మ కుమారున్ని చంపి కోనేటిలో పడేస్తోంది. శివ భక్తురాలైన ఘుష్మ ‘ ఇదంతా పరమేశ్వరుని లీల’ అనుకుంటూ ముక్కంటిని స్తుతిస్తుంది. అప్పుడక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు జరిగిన విషయాన్ని ఘుష్మకు వివరిస్తాడు. పరమ శివుడు సుదేహని సంహరించడానికి ఉపక్రమించగా వద్దని ఘుష్మ ప్రాధేయపడుతుంది. దాంతో పరమేశ్వరుడు సుదేహకు పాపపరిహారం కల్పిస్తాడు. అప్పుడు ఘుష్మ స్వామిని తన పేరు మీద అక్కడ కొలువుతీరమని వేడుకుంటుంది. అంతట ఆ స్వామి అక్కడ స్వయంభువు కొలువయ్యాడు. ఘుశమేశుడిగా వెలసిన పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఆ ఘుశమేశుడే కాలక్రమంలో ఘృశ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం.

ఆలయ విశిష్టత
పూర్వం రాజులు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుతున్న స్థితిలో వేరూల్‌ గ్రామ పెద్ద, పరమ శివ భక్తుడైన భోస్లేకు ఘృశ్నేశ్వరుని మహిమ వలన పాముపుట్టలో ఒక పెద్ద నిధి లభిస్తుంది. ఆ సంపదతో అతను ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయిస్తాడు. అంతేకాక శిఖర సింగనపూర్‌లో ఒక చెరువును తవ్వించాడని ప్రతీతి. ఆ తరువాత భోస్లే వంశంలో సాక్షాత్తు ఆ భోలానాథుడే జన్మించి వంశప్రతిష్ఠను పెంచాడని కథనం. తరువాతి కాలంలో ఆలయానికి అహల్యాదేవి హోల్కార్‌ జీర్ణోద్ధరణ పనులు చేయించిందని ప్రశస్తి.

240 అడుగుల ఎత్తు, 185 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయం నేటికి ధృఢంగా, సుందరంగా నిలిచి ఉంది. మందిరానికి సగం ఎత్తులో ఫలకంపై దశావతారాల విగ్రహాలు చెక్కబడి దర్శనమిస్తాయి. ఇతర దేవతా విగ్రహాలూ భక్తి భావం రేకిత్తిస్తాయి.

24 రాళ్ల స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండపాన్ని నిర్మించారు. నందీశ్వరుడు ఏకశిల విగ్రహంగా దర్శనిమిస్తాడు. ఇక్కడ స్వామి వారు 17 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో పూర్వాభిముఖంగా దర్శనమిస్తారు. భక్తులే స్వయంగా అభిషేకాలు నిర్వహించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఒక్కటే భక్తులు తాకే జ్యోతిర్లింగం. గర్భగుడిలోనికి పురుషులు పై వస్త్రాన్ని విడిచి వెళ్లాలి.

ఎలా చేరుకోవాలి
ఔరంగాబాద్‌ నుంచి ఈ క్షేత్రం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
* దిల్లీ, ముంబయిల నుంచి ఔరంగాబాద్‌కు విమానాలను నడుపుతున్నారు.
* రైలు మార్గం ద్వారా అయితే ఔరంగాబాద్‌ నుంచి ఇక్కడికి నేరుగా చేరుకోవచ్చు.
* రోడ్డు మార్గం ద్వారా అయితే ప్రైవేట్‌, సొంత వాహనాల్లో ఔరంగాబాద్‌ నుంచి చేరుకోవచ్చు.
* వేరూల్‌ గ్రామం నుంచి ఔరంగాబాద్‌కు బస్సులు నడుస్తుంటాయి.Tuesday, 31 October 2017

ఉడుపి భూలోక వైకుంఠం

ఉడుపి భూలోక వైకుంఠం


సరిగ్గా బ్రాహ్మీముహూర్తం రాగానే శంఖనాదాలు, దుందుభులు, నగారాలతో ప్రతిధ్వనిస్తుంది ఉడుపి మఠం. ఆలయ పూజారులతో సహా మఠంలో పని చేసేవారందరూ ఆ దివ్యనాదాలతో మేల్కొని, తమ దైనందిన చర్యలు ప్రారంభిస్తారు. కర్ణాటకలోని పేరెన్నికగన్న పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి పొందినది ఉడుపి. ధనిక-పేద; అగ్ర-నిమ్న కులాలనే భేదభావాలు మనుషులకే తప్ప, పరమాత్ముడికి లేవనేందుకు సాక్షాత్తూ ఆ కృష్ణభగవానుడే నిదర్శనం చూపించిన పుణ్యస్థలి ఉడుపి.

కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాకు పశ్చిమంగా, మంగుళూరుకు 60 కి.మీ దూరంలో ఉంది. ఉడుపి పుణ్యక్షేత్రం. నిత్యం ఉత్సవాలతో, లక్షలాది మంది యాత్రికులతో కళకళలాడుతూ ఉంటుంది ఈ పవిత్ర యాత్రాస్థలం. ‘ఉడుప’(చంద్రుడు)’ అనే పదాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి ఉడుపి అనే పేరు వచ్చింది. పేరుకు తగ్గట్టే ఈ పవిత్ర క్షేత్రం స్వచ్ఛంగా, వెన్నెలలో ప్రకాశించే చంద్రుడిలా అద్వితీయమైన, అగోచరమైన దివ్యచైతన్యంతో అక్కడక్కడ పెద్ద పెద్ద మామిడి, పనస తోటలు, సువిశాలమైన పొలాలగుండా ప్రయాణించే యాత్రికులకు కొబ్బరి, పోక చెట్లు తమ తలలూపుతూ స్వాగతం పలుకుతాయి.

విశిష్టాద్వైత మత స్థాపకులు మధ్వాచార్యుల పవిత్ర హస్తాల మీదుగా స్థాపితమైన మఠం ఉడుపి. కనకదాసు అనే పరమభక్తుడిని నిమ్న కులస్థుడనే కారణంతో పూజారులు కృష్ణ దర్శనానికి నిరాకరించగా స్వయంగా తానే తన ప్రియభక్తునికి ప్రత్యక్ష దర్శనమిచ్చిన కరుణామూర్తి ఉడుపి చిన్నికృష్ణుడు. ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో ప్రథమస్థానం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడుపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీ కృష్ణమందిరం ఉంది. ఉత్తర ద్వారం గుండా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడివైపు దేవాలయ కార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీని ద్వారా గర్భగుడిలో ప్రవేశం పీఠాధిపతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండితో తాపడం పెట్టిన నవరంధ్రాల గవాక్షం గుండా చేసుకోవచ్చు. గర్భగుడికి కుడివైపు ముఖ్యప్రాణ దేవత (హనుమంతుడు), వామభాగాన గరుడ దేవర ఉన్నారు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు వెళితే, ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది. ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్టమఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడుపి రథవీధిలో, శ్రీ కృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి. అవి: పుత్తగె, పేజావర, పలిమారు, అదమారు, సోదె, శీరూరు, కాణియూరు, కృష్ణాపుర.

మధ్వాచార్యులవారు ఒకసారి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న ఓడను, అందులోని ప్రయాణికులను తన తపశ్శక్తితో రక్షించాడు. అప్పుడు ఓడలోని నావికుడు ఆయనకు గోపీచందనం మూటను కానుకగా సమర్పించాడు. మధ్వాచార్యులు ఆ మూటను విప్పి చూడగా, ఆ చందనపు కణికల మధ్య చిన్నికృష్ణుడి విగ్రహం కనిపించింది. అది శ్రీకృష్ణుడి లీలగా భావించిన మధ్వాచార్యులవారు ఆ కృష్ణుడి విగ్రహాన్ని ఉడుపిలో ప్రతిష్ఠించారు. అదే మనం చూస్తున్న విగ్రహం. కనకదాసుకు కృష్ణపరమాత్మ పశ్చిమాభిముఖుడై దర్శనమిచ్చిన చోటనే ఒక మంటపం కట్టించారు. ఆ మంటపానికే కనకదాసు మంటపమని పేరు. ఉడుపిలో జరిపే పండుగలు, పర్వదినాలు: మకర. సంక్రాంతి, మధ్వ నవమి, హనుమాన్‌ జయంతి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, నవరాత్రి మహోత్సవం, మధ్వ జయంతి (విజయ దశమి), నరక చతుర్దశి, దీపావళి, గీతాజయంతి వంటి పండుగలను పర్యాయ మఠంలో అంగరంగవైభవంగా జరుపుతారు.

దగ్గరలో ఉన్న మరికొన్ని ముఖ్య ప్రదేశాలు: 

కొల్లూరు ముకాంబికా దేవాలయం, మరవంతె బీచ్, మల్పే రేవు, కాపు దీపస్తంభం (కాపు లైటు హౌసు), కార్కళలోని గోమటేశ్వరుడు, వేణూరులోని గోమటేశ్వరుడు, అత్తూరులో సెయింట్‌ లారెన్స్‌ ఇగర్జి, సెయింట్‌ మేరీస్‌ ద్వీపం, మూడబిదరెలో సావిరకంబద బసది మణిపాల్, బైందూరు కోసళ్ళి జలపాతం, జామియా మసీదు, 200 సంవత్సరాల జామియా మసీదులో సరికొత్తగా 18,000 మంది ప్రార్థనలు చేసే విధంగా ప్రార్థనాశాలలున్నాయి. ఇక్కడ 3000 మంది భక్తులు బసచేయవచ్చు.

పాజక: ఉడిపి నుండి 12 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ మాధవాచార్యుడు ద్వైతసిద్ధాంత ప్రసంగం చేశాడు.
కొల్లూరు: ఉడిపి నుండి 74 కి.మీ దూరంలో ఉంది. మూకాంబికాదేవి నివాసిత ప్రదేశమని భక్తుల విశ్వాసం.
కర్కల: ఉడిపి నుండి 37 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ జైన బసదీలు (ఆలయాలు), గోమటేశ్వర శిల్పం (బృహద్రూపం ) ప్రత్యేక ఆకర్షణ.
అనెగుడ్డె: ఉడిపి నుండి 30 కి.మీ.లు. ఇక్కడ ప్రముఖ గణేశాలయం ఉంది.
ఆత్తుర్‌ చర్చి: ఉడిపి నుండి 25 కి.మీ.లు. ఇక్కడ ఏటా నిర్వహించే సంతకు కులమతభేద రహితంగా ప్రజలు వస్తారు.
బర్కూర్‌: ఉడిపి నుండి 15కి.మీల దూరం. జైన బసదీలు ఉన్న బర్కూరు తులునాడు రాజులకు రాజధాని.
సాలిగ్రామ: ఉడిపి నుండి 27కి.మీల దూరం. ఇక్కడా గురునరసింహస్వామి ఆలయం ఉంది.
పరంపల్లి: ఇక్కడ ఎనిమిది వందల ఏళ్ల నాటి పురాతనమైన విష్ణుమూర్తి ఆలయం ఉంది.
పెర్నకిల: ఇక్కడ ఒక పురాతన గణేశుని ఆలయం ఉంది.
పెర్దోర్‌: ఉడిపి నుండి 22 కి.మీ దూరంలో ఉంది.
అగుంబే – షిమోగా రాష్టీయ్ర రహదారి సమీపంలో అనంతపద్మనాభస్వామి ఆలయం ఉంది.
హరియాద్క: ఉడిపి నుండి 16 కి.మీలు. పురాతనమైన వీరభద్రాలయం ఉంది.
శంకరనారాయణ: ఉడిపి నుండి 40 కి.మీలు. శకరనారాయణాలయం ఒక సరోవరం మధ్యన ఉండడం విశేష ఆకర్షణ.
మారనకట్టె: ఉడిపి నుండి 45 కి.మీలు. ఈప్రాంతం ప్రకృతి ఆరాధకులకు స్వర్గభూమివంటిది.
మందర్హి: ఉడిపి నుండి 20 కి.మీలు. ఇక్కడ అమ్మనవారు (దుర్గాపరమేశ్వరి) ఆలయం ఉంది. ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే ‘దోశ‘ సంతానప్రాప్తి కలిగిస్తుందని ప్రజలు విశ్వాసం.
ముదుహోలె కర్కడ: ఇక్కడ పురాతన దుర్గాపరమేశ్వరి ఆలయం ఉంది.
సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం: ఇది ఉడిపి నుండి 40 కి.మీలు. ఇక్కడ అరుదైన జంతువులు, పక్షులు, ఔషధ మొక్కలు ఉన్నాయి.
మూకాంబికా వన్యప్రాణి అభయారణ్యం: ఇది ఉడిపి నుండి 50 కి.మీలు. కుందపూర్‌– కొల్లూర్‌ రోడ్డు పక్కన విస్తరించి ఉంది.
కుర్ధు తీర్ధ జలపాతాలు: ఉడిపి నుండి 42 కి.మీలు. పశ్చిమ కనుమలలోని దట్టమైన అరణ్యాల మధ్య, 300 అడుగులున్న ఒక అందమైన జలపాతం. ఋషుల తపస్సుతో ఈ మడుగు ఎంతో పవిత్రతను, ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంగ తీర్ధ: కుర్ధు తీర్ధకు ఎగువన మంగ తీర్ధ ఉంది. ఇది దట్టమైన అరణ్యాల మధ్య నిటారుగా ఉన్న పర్వతాలలో ఉంది కనుక ఇక్కడకు కోతులు తప్ప మానవమాత్రులు చేరలేరు కనుక దీనిని కోతుల తీర్థం అని కూడా అంటారు.
బర్కన జలపాతం: ఉడిపి నుండి 54 కి.మీ దూరంలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో ఉడిపి, చికమగళూరు, శివమొగ్గ కూడలి ప్రాంతంలో ఉంది; బెల్కల్‌ తీర్థ జలపాతం, అరసిన గుండి, కుద్లు తీర్థ, కొసల్లి జలపాతం, సౌపర్ణిక, స్వర్ణ, చక్ర, సీత, వర్హి, కుబ్జ నదులున్నాయి. ఈ నదులలో అందమైన నదీ ద్వీపాలు ఉన్నాయి. వీటిని కుర్దూలు అంటారు. వీటిలో కొన్ని ద్వీపాలలో జనావాసాలు ఉన్నాయి.

విశేషాల ఉడిపి
శ్రీ కృష్ణుని రథానికి బ్రహ్మరథమని పేరు. ఇది బంగారంతో రూపొందింది.
శ్రీ కృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని రత్నఖచితమైన సింహాసనంపై ఉంచుతారు.
అలనాడు శ్రీ కృష్ణుడు కనకదాసుకు దర్శనమిచ్చిన గవాక్షం(కిటికీ)లో నుంచే ఈ నాటికీ భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటున్నారు.

ఎలా వెళ్లాలి?
దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి మంగుళూరుకు రైళ్లు, బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడుపికి బస్సులు, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి ఉడుపికి నేరుగా బస్సులున్నాయి. హైదరాబాద్‌ డెక్కన్‌ నుంచి వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ ఉంది.
– డి.వి.ఆర్‌.భాస్కర్‌

ద్వారక - మునిగి తేలిన నగరం

ద్వారక
మునిగి తేలిన నగరం


ద్వారకనగరాన్ని శ్రీ కృష్ణుడు పరిపాలించాడని పురాణాల్లో చదువుకున్నాం కదా... ఆయన తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు జలాలలో మునిగిపోయింది. మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం ఈ నగరం సముద్రంలో కలిసి పోయింది. విష్ణు పురాణం ద్వారకానగర మునక గురించి ప్రస్తావించింది. యాదవ ప్రముఖులు గాంధారి శాపప్రభావాన, మునుల శాపప్రభావాన తమలో తాము కలహించికొని నిశ్శేషంగా మరణిస్తారు. ఆ తరువాత శ్రీ కృష్ణుని ఆదేశం మీద అర్జునుడు యాదవకుల సంరక్షణార్థం ఇక్కడకు వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారాకాపుర వాసులను ద్వారక నుండి దాటించిన మరు నిమిషం ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ద్వారకానగరం మునిగిపోవడంతో ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమైంది.

పదహారో శతాబ్దంలో ఈ అలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణుని ముదిమనుమడు వజ్రనాభుడు ఈ ఆలయానికొక రూపునిచ్చాడని చెబుతారు. ప్రస్తుతం మనకు కనిపించే అయిదంతస్తుల దివ్య ఆలయ శిఖరం మీద సూర్యచంద్రుల చిహ్నాలతో విలసిల్లే పతాకం కనిపిస్తుంది. ఈ ఆలయంలోకి స్వర్గ, మోక్షద్వారాలనే రెండు ద్వారాల గుండా ప్రవేశించవచ్చు. గర్భగుడిలో నాలుగు భుజాలతో విలసిల్లే త్రివిక్రమ(వామన) మూర్తి ఉన్నారు. ఆలయ సమీపంలో బలరాముడికి, కృష్ణుడికీ కుమారుడు, మనుమడూ అయిన ప్రద్యుమ్న అనిరుద్ధులకూ, శివకేశవులకూ ప్రత్యేకమైన పూజాస్థానాలున్నాయి. ఈ ఆలయంలో దేవకి, జాంబవతి, సత్యభామల విగ్రహాలు కూడా ఉన్నాయి. రుక్మిణీదేవికి మాత్రం ఈ ఆలయానికి దూరంగా ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఆమె శ్రీకృష్ణుని అష్టమహిషుల్లో ప్రధానమైనది కాబట్టి ఈ ఆలయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గోమతీ నది సముద్రంలో కలిసే చోటున ద్వారకాధీశుని ఆలయం ఉంది.

ఈ క్షేత్రానికి సమీపానే గోమతీ నది సముద్రంలో సంగమిస్తుంది. అక్కడ నుండి బస్సుమార్గంలో బేట్‌ ద్వారక చేరాలి. ఇది శ్రీ కృష్ణుని నివాస స్థలం. ఇక్కడ స్వామి శంఖ చక్రధారియై ఉపస్థితమై ఉన్నాడు. దీనికి ఐదు కి.మీ. దూరంలో శంఖతీర్థం ఉంది. ఇక్కడ పెరుమాళ్ళ వక్షస్థలాన శ్రీదేవి ఉపస్థితమై ఉంది. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్‌. ఇక్కడ అనేక సన్నిధులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం తిరుమంజనం జరుగుతుంది. పసిపిల్లాడిలా–రాజులా–వైదికోత్తమునిలా అలంకారాలు జరుగుతుంటాయి. ద్వారక నుండి ఓఖా పోవుమార్గంలో ఐదు కి.మీ.ల దూరాన రుక్మిణీదేవి సన్నిధి ఉంది. ఇదే రుక్మిణీ కల్యాణం జరిగిన ప్రదేశం. ద్వారకాపురిలో వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి, సత్యభామాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. బేట్‌ ద్వారక ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి.

పవిత్ర నగరం
ద్వార్‌ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి, ద్వారం లాంటి అర్థాలు ఉన్నాయి. ద్వార్‌ అనే పదం ఆధారంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారక అయింది. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్‌ ధామ్‌ (నాలుగు ధామాలు) లలో ద్వారకాపురి ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు బద్రీనాథ్, పూరి, రామేశ్వరం. ద్వారకాధీశుని ఆలయాన్ని జగత్‌మందిరం అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. ద్వారకాపురి సమీపంలో జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వరలింగం ఉంది. ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠం స్థాపించబడింది. ఆది శంకరాచార్యులవారు నెలకొల్పిన నాలుగు మఠాలలో ఇది ఒకటి. మిగిలినవి శృంగేరి, పూరి, జ్యోతిర్మఠం. ద్వారకా పీఠాన్ని కాళికా పీఠంగా కూడా అంటారు.

శ్రీద్వారకనాథ్‌ మహాత్యం
ఆదిశంకరులు ద్వారకాధీశుడిని దర్శించి ద్వారకాపీఠాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ కృష్ణుడు క్షత్రియ రాకుమార వివాహ అలంకరణలో దర్శనం ఇస్తాడు. 108 దివ్యదేశాలలో ఈ క్షేత్రం ఒకటి. ద్వారకానా«థుడికి అనేక సేవలు, దర్శనాలు ఉంటాయి. దర్శనలకు తగినట్లు వస్త్రధారణలో మార్పులుంటాయి.

ద్వారకాసామ్రాజ్యం
మహాభారతం, హరివంశం, స్కాంద పురాణం, భాగవత పురాణం, విష్ణుపురాణాలలో ద్వారకాపురి ప్రస్తావన ఉంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీ కృష్ణ నిర్మితమైన ద్వారాపురి ఉండేదని. పురాణేతిహాసాలలో వర్ణించబడిన విధంగా అది సముద్రగర్భంలో కలసిపోయిందని విశ్వసిస్తున్నారు. శ్రీ కృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్థాల నుండి ద్వారకావాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.  ద్వారకా నగరాన్ని శ్రీ కృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. సౌరాష్ట్ర పడమటి సముద్రతీరంలో ఈ భూమి నగర నిర్మాణార్థ్ధం ఎంచుకోవడమైంది. ఈ నగరం ప్రణాళిక చేయబడి తరువాత నిర్మించబడింది. గోమతీనదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన నగరం ద్వారక. ఈ నగరానికే ద్వారామతి, ద్వారావతి కుశస్థలి అని పేర్లున్నాయి. ఇది నిర్వహణా సౌలభ్యం కోసం ఆరు విభాగాలుగా విభజించి నిర్మించబడింది. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్యకూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో నిర్మితమైనది. రాజ్యసభా మంటపం పేరు సుధర్మ సభ. రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం ఇదే. ఈ నగరం సుందర సముద్రతీరాలకు ప్రసిద్ధం.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీకి చెందిన ఒక బృందం చేసిన పరిశోధనలలో సముద్రగర్భంలోని ద్వారాపురి కనుగొనబడింది. ఆరు మాసాల పరిశోధనానంతరం 2000 డిసెంబరు మాసంలో కనుగొన్నారు. ఈ పరిశోధనానంతరం అదే విద్యాసంస్థ 2001లో జరిపిన పరిశోధనలో సముద్రజలాల్లో మునిగి ఉన్న కళాఖండాలను స్వాధీనపరచుకున్నారు. అలా లభించిన కళాఖండాలలోని భాగాలు యు. కె లోని ఆక్స్‌ఫర్డ్, జర్మనీ లోని హానోవర్‌ అలాగే పలు భారతీయ విద్యాసంస్థలకు కాలనిర్ణయ పరిశోధనా నిమిత్తం పంపారు.

బేట్‌ ద్వారక
బేట్‌ ద్వారక ప్రధాన దైవమైన శ్రీ కృష్ణుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బేట్‌ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్రతీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రీస్తు శకంలో సముద్రతీర దేశాలతో జరిగిన వ్యాపార, వాణిజ్యాలకు తార్కాణం. ఈ పుష్కలమైన రేవుపట్టణం మతప్రధానమయిన కేంద్రం. శ్రీ కృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత సముద్రగర్భంలో కలసి పోయిందనే విశ్వాసానికి బలం చేకూరుతోంది. నిర్మాణశాస్త్ర నిపుణుల బృందాల పరిశోధనా ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్రగర్భం నుండి వెలికి వచ్చాయి. ఇక్కడ అధిక సంఖ్యలో లభించిన రాతి లంగర్లు పురాతనకాలంలో ఉన్న రేవుపట్టణాలలో బేట్‌ ద్వారక చాలా ప్రముఖమైనదని సూచిస్తున్నాయి. బేట్‌ ద్వారక పరిసరాలు నౌకలు సురక్షితంగా నిలవడానికి అవకాశం కల్పిస్తూ ఈ నగరాన్ని సముద్రతరంగాల నుండి రక్షించిందని తెలియజేస్తున్నాయి.

ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌కు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ద్వారకకు రోడ్డు మార్గాన వెళ్లవచ్చు.
సికింద్రాబాద్, అహ్మదాబాద్‌ ఓఖా ఎక్స్‌ప్రెస్‌లో ద్వారకకు సుమారు 39 గంటల ప్రయాణం. ద్వారక రైల్వేస్టేషన్‌ నుంచి పదినిమిషాలలో ద్వారకాధీశుని ఆలయానికి చేరుకోవచ్చు.

గోపరాజు పూర్ణిమాస్వాతి

Friday, 13 October 2017

సంతాన ప్రదాయిని కోట సత్తెమ్మ


సంతాన ప్రదాయిని కోట సత్తెమ్మ

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉంది కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం. అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. కోరిన కొర్కెలు తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందింది సత్తెమ్మ. శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానానికి పురాతన చరిత్ర ఉంది. అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలోని తూర్పు చాళుక్యుల కాలానికి చెందినదని పరిశోధనలు చెబుతున్నాయి. అప్పట్లో నిడదవోలును నిరవధ్యపురంగా పిలిచేవారు. నిరవధ్యపురాన్ని పాలించిన వీరభద్రుని కోటలోని అమ్మవారు శక్తిస్వరూపిణిగా పూజలందుకున్నారు. కాలక్రమేణా కోట శిథిలమైంది. అమ్మవారి విగ్రహం కనుమరుగైంది. అలా అదృశ్యమైన అమ్మవారు 1934లో తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి పొలంలో, పొలం దున్నుతున్నప్పుడు బయటపడింది. భూమి యజమాని కలను అనుసరించి కోటసత్తెమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి  నేటి వరకు అమ్మ... భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా, వరాలిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచుతోంది. ఈ ఆలయానికి ఉభయగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, గుంటూరు, కృష్ణ, జిల్లాల భక్తులు అధికంగా విచ్చేస్తుంటారు. ఆలయంలో ఏటా దసరా ఉత్సవాలతోపాటు అమ్మవారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహిస్తున్నారు.

శంఖచక్రగద అభయ హస్త యజ్ఞోపవీతధారిణిగా ఏకశిలా స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా వెలసిన అమ్మవారిని సందర్శించటానికి రెండుకళ్లూ చాలవేమోననిపిస్తుంది. ఈ ఆలయానికి  క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి. 


అమ్మవారి దర్శనం కోసం ఏటా సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఇక్కడ 65 గదులు ఉన్నాయి. ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాలలో భక్తులు విశేషంగా తరలివచ్చి తమ మెక్కుబడులు తీర్చుకుంటారు. చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి కుటుంబంలోనూ కోటసత్యనారాయణ, కోటసత్తెమ్మ అనే పేర్లు తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఏటా శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు సుమారు 1000 మంది ముతైదువలతో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ వ్రతాలకు నిడదవోలు పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి మహిళలు తరలిరావడంతో సందడి నెలకొంటుంది. దేవస్థానం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకులు, లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు రోజుకి సుమారు 100 మందికి శాశ్వత అన్నదాన ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అమ్మవారి దేవస్థానం ముందు భాగంలో దాతల సహకారంతో తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మాణ పనులు సాగుతున్నాయి.

సంతాన వృక్షానికి పెరుగుతున్న  భక్తుల తాకిడి
శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న సంతాన వృక్షానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ఊయల కట్టడం సంప్రదాయం. సంతానం లేని దంపతులు ఈ వృక్షం దగ్గరకు చేరుకుని ఎర్రటి వస్త్రం, పూర్తిగా పండిన రెండు అరటిపండ్లను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం ఒక అరటి పండును, ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దంపతులు సంతాన వృక్షానికి ఊయల కట్టి, ఆ ఊయలలో పండును ఉంచి, ‘అమ్మా... పండు కడుతున్నాను పండంటి బిడ్డను ప్రసాదించు తల్లీ’ అని వేడుకుంటారు. బిడ్డ పుట్టిన తరువాత అమ్మవారి సన్నిధి తీసుకువచ్చి పేరు పెట్టుకోవడంతోపాటు బిడ్డ ఎత్తు తులాభారంతో మొక్కుబడి తీర్చుకుంటారు. తులాభారానికి నగదు (నాణేల రూపంలో) లేదా పటిక బెల్లం తూకం సమర్పించుకుంటారు.

ఆలయానికి వచ్చే మార్గం...
అమ్మవారి ఆలయం నిడదవోలు రైల్వేస్టేషన్‌కి (బస్‌ స్టాండ్, గణపతి సెంటర్‌ల మీదుగా) 3 కిలోమీటర్ల దూరాన ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి 26 కిలోమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు.

Wednesday, 27 September 2017

పంచముఖేశ్వరాలయం

పరమాద్భుతం పంచముఖేశ్వరాలయంపవిత్రమైన కావేరీ పుష్కరాలు మొదలవుతున్నాయి త్వరలో. పుష్కర స్నానంతో పాటు అక్కడే ఉన్న పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించడం అధిక పుణ్యప్రదం, ఫలప్రదం. కావేరీ నది ప్రవహించే కర్ణాటక, కేరళ, తమిళనాడులలో కావేరీ పుష్కరఘాట్‌లకు చేరువలో ఉన్న పుణ్యక్షేత్రాలలో కర్ణాటకలోని తలకాడ్‌ వైద్యేశ్వర స్వామి వారి ఆలయం సుప్రసిద్ధమైనది. ఎందుకంటే ఇక్కడ శివుని పంచముఖాలూ, పంచనామాలతో, పంచ ఆవరణలలో పంచలింగాలుగా కొలువుదీరి, భక్తులను అబ్బురపరుస్తూ, అనుగ్రహిస్తుంటాయి. అవే వైద్యేశ్వర, అర్కేశ్వర, వాసుకేశ్వర, సైకతేశ్వర, మల్లికార్జున లింగాలు. అలాగే ఇక్కడ పాతాళేశ్వర, మరాళేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రతి ఆలయ దర్శనానికి ముందూ కావేరీ నదిలో స్నానం చేసి, ఆ తర్వాతనే స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ఆచారం. అయిదు ఆలయాలూ 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి కాబట్టి, మార్గాయాసం కూడా ఉండదు. ఒకవేళ ఏమైనా బడలిక కలిగినా, నదీస్నానంతో ఒళ్లు తేలికపడుతుంది కూడా.

ఈ పంచముఖలింగాలనూ దర్శించుకున్నాక అక్కడకు చేరువలోనే ఉన్న కీర్తినారాయణస్వామి వారి ఆలయానికి వెళ్లి, స్వామి వారిని సందర్శించుకోవాలి. అలా చేస్తేనే యాత్రాఫలం దక్కుతుందని అంటారు.

బెంగళూరుకు దగ్గరలోని తలకాడులోగల పంచముఖేశ్వర స్వామి ఆలయం పేరుకు ఒకటే కానీ, ఐదు ఆలయాలున్నాయి. అయిదూ శివాలయాలే. తలకాడు చాలా చిన్న గ్రామం. అయినప్పటికీ పంచముఖ ఆలయాల కారణంగా ప్రసిద్ధికెక్కింది. ప్రతి సోమవారమూ ఇక్కడ ఇసక వేస్తే రాలనంత మంది భక్తజన సందోహం స్వామివారిని అర్చిస్తూ... శివనామస్మరణ చేస్తుంటారు. ప్రత్యేకించి పౌర్ణమినాడు, మరీ విశేషంగా చెప్పాలంటే శ్రావణ పున్నమి, కార్తీక పున్నములలో ఇక్కడికి వచ్చే భక్తజన కోటితో ఊరంతా నిండిపోతుంది.

నిజానికి అసలీ గ్రామమంతా ఆలయాలతో నిండి ఉండేదట. అయితే, విదేశీయుల దండయాత్రలలో ఆలయాలన్నీ ఇసుక మేటవేసినట్లయిపోయాయి. అందుకే ఇక్కడ ఎండ మాడ్చేస్తున్నా, కాళ్లు కాలిపోతున్నా, పాదరక్షలతో నడవడం అపచారంగా భావిస్తుంటారు భక్తులు. వైద్యనాథేశ్వర స్వామి వారిని సందర్శించడం, అభిషేకం చేసుకోవడం వల్ల దీర్ఘరోగాలు, మొండివ్యాధులు తొలగిపోయి, ఆరోగ్యవంతులవుతారన్న నమ్మకంతో ఎక్కడెక్కడినుంచో భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. తమ నమ్మకం వమ్ముకానట్లుగా ఆరోగ్యభాగ్యంతో వెళుతుంటారు. ఇతర సందర్శనీయ స్థలాలు భక్తులు పవిత్రమైన పుష్కరస్నానం చేయడంతోపాటు ఆ చుట్టుపక్కలనున్న ఆలయాలను, చారిత్రక, ప్రకృతి రమణీయ ప్రదేశాలను సందర్శించడం వల్ల ఆ దివ్యానుభూతులను మళ్లీ పుష్కరాలొచ్చే వరకూ మదిలో పదిలంగా మూటగట్టుకోవచ్చు.

మైసూరులోని చెన్నకేశవ స్వామి ఆలయం:
12వ శతాబ్దంలో హొయసాల రాజుల కాలానికి చెందిన ఈ ఆలయ నిర్మాణం, శిల్పచాతుర్యం అపురూపం, అనితర సాధ్యం. మూడవ నరసింహ వర్మ నిర్మించిన ఈ ఆలయం కావేరీ పుష్కరస్నానం చేసే భక్తులకు అవశ్య సందర్శనీయం.

భగందేశ్వర ఆలయం: 
కర్ణాటకలోని భగమండలంలోగల ఈ ఆలయం భగంద మహర్షి పేరు మీదుగా నెలకొన్నది. భగమండలంలోగల త్రివేణీ సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.

విశ్వేశ్వరాలయం, కర్ణాటక:
8వ శతాబ్దంలో రాష్ట్రకూటుల కాలంలో చాళుక్యల శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. కావేరీ పుష్కరఘాట్లలో ఇది అత్యంత తలమానికమైనదిగా పేరు పొందింది.

అదే విధంగా ఇక్కడకు దగ్గరలోని సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, చెన్నకేవస్వామి ఆలయాలు రెండూ తప్పక చూడదగ్గ ప్రాచీన ఆలయాలు. శిల్పసంపద కలబోసుకున్న పురాతన కట్టడాలు.

– డి.వి.ఆర్‌. భాస్కర్‌Tuesday, 12 September 2017

మహేంద్రగిరి


మహేంద్రగిరి.. ఎంత బాగుందో..!


‘ప్రకృతిలో మమేకమై కొండాకోనల్లో పర్యటించాలన్నా, మేఘాలమీద నడుస్తున్నట్లో గాల్లో తేలుతున్నట్లో ఉన్న అనుభూతిని సొంతం చేసుకోవాలన్నా, సాహసయాత్రలు చేయాలనుకున్నా... మహేంద్రగిరి ఎక్కాల్సిందే’ అంటున్నారు ఇటీవలే అక్కడికెళ్లొచ్చిన శ్రీకాకుళవాసి గేదెల భరత్‌కుమార్‌.

ఒడిశాలోనే రెండో అత్యంత ఎత్తైన శిఖరమైన మహేంద్రగిరి పర్వతాన్ని మిత్రులమంతా కలిసి అధిరోహించాలనుకున్నాం. ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాలోని డియోమలి పర్వతం తర్వాత ఆ రాష్ట్రంలో రెండో అత్యంత ఎత్తైన పర్వతం మహేంద్రగిరే. సముద్రమట్టానికి 4925 అడుగుల ఎత్తులో తూర్పుకనుమల్లో ఉన్న ఆ పర్వతాన్ని ఎక్కేందుకు మేము ఒడిశాలోని గజపతి జిల్లా కేంద్రమైన పర్లాఖెమొండికి చేరుకున్నాం. అక్కడినుంచి మూడు బైకులమీద 66 కి.మీ దూరంలోని మహేంద్రగిరి ప్రాంతానికి బయలుదేరాం. ఏడోమైలు, లంజిపొదొరో, జిరంగో, కొయ్‌పూర్‌, మడవ తదితర గ్రామాలు దాటి ముందుకు సాగాం. వంకరలు తిరిగిన ప్రమాదకరమైన ఘాట్‌రోడ్డు అది. నేల నుంచి నింగి వరకూ పచ్చదనం పరుచుకుందా అనిపించేంతగా అబ్బురపరిచే ఎత్తైన కొండలూ, దారిపొడవునా కనిపించే సెలయేర్లూ, కొండలమీద నుంచి ఉరికే జలపాతాల సోయగాల్ని చూస్తూ 44 కి.మీ మేర సాగిన మా బైకు ప్రయాణం సాహసభరితంగా అనిపించింది.

మడవ గ్రామం దాటాక బుర్ఖత్‌ సమీపంలోని ఓ సాధువు ఆశ్రమం దగ్గర మా బైకులను నిలిపి కాలినడకన బయలుదేరాం. మూడు వైపులా ఎత్తైన కొండల్నీ కనుచూపుమేరలోని కొండలన్నింటినీ మింగేసిన మేఘాలను చూసి మంత్రముగ్ధులయ్యాం. అప్పటికే అక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఆ వర్షంలో తడుస్తూనే నిటారుగా ఉన్న ఆ కొండల్ని ఎక్కుతూ ముందుకెళ్లాం. కొంతసేపటికి వర్షం తగ్గుముఖం పట్టింది. మహేంద్రగిరి శిఖరాన్ని చేరుకునే క్రమంలో చిన్న చిన్న కొండలెన్నో ఎక్కాం. ఎత్తుకు చేరుతున్న కొద్దీ మేఘాల నడుమ నడుస్తున్నట్లూ ఆకాశాన్ని అందుకున్నట్లూ గాలిలో తేలుతున్నట్లూ అనుభూతి చెందాం.

సూర్యాస్తమయ సమయానికి మేం మహేంద్రగిరిపైకి చేరుకున్నాం. పచ్చదనంతో నిండిన కొండలను ముద్దాడే నీలాకాశంలో కనువిందు చేసే సూర్యాస్తమయ దృశ్యాల్ని కమ్ముకొస్తున్న చిరుచీకట్లు మెల్లమెల్లగా మింగేయసాగాయి. ఆ అందాల్ని చూస్తూనే ముందుకు సాగాం. చిక్కని చీకటి అడవంతా పరచుకుంది. సుదూరంలోని పలు గ్రామాలూ, పట్టణాల్లో రాత్రి పూట వెలిగి ఉన్న వీధి దీపాలు మిణుగురు పురుగుల గుంపులా కనిపించాయి. ఆ చీకటివెలుగుల దోబూచులాటలో అలా నడుస్తూనే ఉన్నాం. దారిపొడవునా పక్షులూ కీచురాళ్ల చిరుశబ్దాలు వీనులవిందు చేశాయి. అలా మధ్యాహ్నం మూడు గంటలకు మొదలైన మా నడక, రాత్రి తొమ్మిది గంటలవరకూ సాగి, ఎట్టకేలకు అక్కడున్న బాబా కుటీరానికి చేరుకున్నాం. మా బృందంలో సభ్యుడైన కోరాడ కృష్ణప్రసాద్‌కు ఆ ప్రాంతం చిరపరిచితం కావడం, గతంలో ఆయన అక్కడికి పలుమార్లు వెళ్లి ఉండటంతో చీకటిపడినా నడకమార్గంలో మేం ఎక్కడా దారి తప్పలేదు.

ఈ దట్టమైన అరణ్యంలో పర్వతశిఖరంపైన చిన్న కుటీరాన్ని ఏర్పాటుచేసుకుని గత పదిహేనేళ్లుగా ప్రఫుల్లబాబా ఒక్కరే నివాసం ఉంటున్నారు. ఓ యాగశాలను ఏర్పాటు చేసుకుని పదిహేనేళ్లుగా నిత్య హోమం నిర్వహిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఆదివాసీలే ఆయనకు అవసరమైన నిత్యావసరాలను అప్పుడప్పుడూ కింది నుంచి పైకి చేరవేస్తుంటారు.

ఆయన యాగశాల ఎదురుగా ఉన్న మట్టికుటీరంలో ఆ రాత్రికి పడుకున్నాం. అప్పటికే అక్కడ కుండపోతగా వర్షం కురుస్తోంది. మరోవైపు చలిగాలి మమ్మల్ని వణికించేస్తోంది. మాతో పాటు దుప్పట్లు తీసుకుని వెళ్లినా అక్కడి చలి నుంచి అవి ఎంతమాత్రమూ కాపాడలేకపోయాయి. దీంతో బాబా తన దగ్గరున్న రగ్గులు కప్పుకోమని ఇచ్చారు. వాటిని కప్పుకొని చలినుంచి రక్షణ పొందాం.

ఆధ్యాత్మిక కేంద్రం!
ఏడాది పొడవునా మానవ సంచారమే కనిపించని ఈ ప్రాంతం, మహాశివరాత్రి ముందు రోజు మాత్రం భక్తులతో నిండిపోతుంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబంగా తదితర రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు కాలినడకన తరలివచ్చి, శివలింగాలను దర్శించుకుంటారు. ముందురోజు రాత్రికే కొండపైకి చేరుకుని అక్కడే చెట్లూ, పొదల మాటున బస చేస్తారు. చలికాలం కావడంతో ఆ సమయంలో ఎటువైపు చూసినా నెగళ్లే కనిపిస్తుంటాయి. ఇటీవల కాలంలో కార్తీక మాసంలోనూ ఈ ప్రాంతాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరిగింది. ఈ పర్వతంపైనే పరశురాముడు తపస్సు చేశాడనీ చెబుతారు. అందుకు ప్రతీకగా రెండు దశాబ్దాల కిందట ఈ పర్వత శిఖరంపైన పరశురాముడి విగ్రహాన్నీ ఏర్పాటుచేశారు. ధ్యానం, యోగాభ్యాసానికి అనుకూలప్రదేశం కావడంతో వాటి సాధన కోసం వస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరిగింది. అలా వచ్చేవారిలో చాలామందికి బాబా మట్టికుటీరమే శరణ్యం. కానీ అది చాలా చిన్నది. అయినా వచ్చేవాళ్లు వంటసామగ్రి వెంట తెచ్చుకుని అక్కడే వండుకుని నిద్రిస్తుంటారు.

పాండవుల ఆలయాలు
మర్నాడు ఉదయం నిద్రలేవగానే బయటకు వచ్చి చూస్తే మంచుపొరలు చీల్చుకుంటూ వెలుగులు చిమ్మే సూర్యోదయం అనిర్వచనీయ అనుభూతిని మిగిల్చింది. సమీపంలోని బంగాళాఖాతం తీరమూ, గ్రామాలూ, పట్టణాలు అన్నీ కలిసి ప్రకృతి కాన్వస్‌పైన చిత్రకారుడు వేసిన చిత్రాలను తలపించాయి.మేం బస చేసిన ఆశ్రమానికి సమీపంలోనే పాండవుల ఆలయాలు ఉన్నాయి. వనవాసం సమయంలో పాండవులు కొంతకాలం ఇక్కడ జీవించారనీ, అప్పుడు ఈ ఆలయాలను నిర్మించారనీ చెబుతారు. కుంతి, ధర్మరాజు, భీముడి ఆలయాలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలినవి శిథిలమయ్యాయట. ఈ ఆలయాలన్నింటిలోనూ శివలింగాలే ఉన్నాయి. 30 అడుగుల ఎత్తులో ఉన్న కుంతీ ఆలయాన్ని అత్యంత అరుదైన రాతికట్టుతో నిర్మించారు. దీని వాస్తునిర్మాణం ఓడ్ర శిల్పాన్ని పోలి ఉంది. ఆలయం భూమి లోపలికి దిగినట్లు కనిపిస్తుంది. మెట్లు దిగి లోపలికి వెళ్లాం. ఆలయం ముఖద్వారం పశ్చిమదిశలో ఉంది. ఆలయం వెలుపలి భాగంలో తూర్పున కుమారస్వామి, ఉత్తరాన పార్వతీదేవి, దక్షిణాన విఘ్నేశ్వరుని విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం ఎదురుగా రెండు పురాతన బావులున్నాయి. ఎత్తైన కొండమీద వాటిని ఎలా తవ్వారన్న ఆలోచన ఆశ్చర్యానికి గురిచేసింది.


కుంతీ మందిరం నుంచి ఉత్తరదిశలో ఉన్న కొండపైన ధర్మరాజు ఆలయం ఉంది. ఈ పర్వతంపైన ఉన్న ఆలయాలన్నింటిలోకి ఇదే పెద్దది. దీనికి పశ్చిమదిశలో ముఖద్వారం ఉంటుంది. భక్తులు దీన్ని యుధిష్ఠర ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం కళింగ నిర్మాణ శైలిలోని త్రిరథ ఆకారాన్ని పోలి ఉందని చరిత్రకారుల అభిప్రాయం. ఆలయం పక్కనుంచి పారే సెలయేటి సవ్వడి మమ్మల్ని చాలాసేపు అక్కడి నుంచి కదలనివ్వలేదు. ధర్మరాజు ఆలయం ఎదురుగా ఉన్న మరో కొండ శిఖరంపైన భీముడి ఆలయాన్ని కేవలం అయిదు భారీ రాళ్లతో నిర్మించారు. ఆ ఆలయం లోపలికి వెళ్లడానికి చిన్న సందు మాత్రమే ఉంటుంది. మహేంద్రగిరి పర్వతంపైన ఉన్న అన్ని ఆలయాల్లో ఇదే పురాతనమైనది. క్రీ.శ.ఆరో శతాబ్దానికి ముందే ఈ ఆలయాలు వెలుగులోకి వచ్చాయనేది చరిత్రకారుల అభిప్రాయం. ఈ పర్వతం కొసన ఉన్న ఓ కొండపైన జగన్నాథస్వామి ఆలయం ఉంది. దీన్ని దారుబ్రహ్మ ఆలయంగా పిలుస్తారు. చుట్టూ చెట్లూ వాటి మధ్య రాళ్లూరప్పలతో కూడిన అత్యంత క్లిష్టమైన మార్గంలో ఆ ఆలయానికి చేరుకున్నాం.

మహేంద్రతనయ నది జన్మస్థలం
స్నానపానాదులు ముగించుకుని మహేంద్ర తనయగా పిలిచే నది పుట్టిన ప్రదేశం చూడ్డానికి వెళ్లాం. ఒడిశాలోని గజపతి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాల్లోని వేల ఎకరాలకు తాగు, సాగునీరును అందించే మహేంద్రతనయ ఈ పర్వతంలోనే పుట్టింది. అయితే అది ఎక్కడన్నది కచ్చితంగా చెప్పలేం. దాని ఆనవాళ్లుగా అనేక ప్రవాహాలు చూపిస్తారు. ఎందుకంటే మహేంద్రగిరి పర్వతంపైన ఏడాదిపొడవునా వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈ వర్షపు నీరు ఆ కొండపైన అనేక సెలయేర్లుగా, జలపాతాలుగా పారి కిందికి వచ్చేసరికి నది రూపును సంతరించుకుని, రెండు పాయలుగా విడిపోతుంది. ఒక పాయ శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వైపు సాగి, 70 కి.మీ మేర ప్రవహించి గొట్టా బ్యారేజీ వద్ద వంశధార నదిలో కలిస్తే, మరో పాయ మందసవైపుగా సాగి 40 కి.మీ.మేర ప్రవహించి బారువవద్ద సముద్రంలో కలుస్తుంది.

జీవవైవిధ్యానికి కేంద్రం
మహేంద్రగిరి జీవవైవిధ్యానికీ కేంద్రమే. నెమళ్లు, ఎగిరే ఉడుతలు, రాక్షస తొండలు, ఏనుగులు, మచ్చల జింకలు, మైనాలు వంటి అనేక రకాల అరుదైన జీవజాలానికి ఇది నివాస కేంద్రం. దాదాపు 1200 రకాల జాతులకు చెందిన మొక్కలు ఈ పర్వతంపైన ఉన్నాయని ఒడిశా జీవవైవిధ్య మండలి నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఒడిశా రాష్ట్రంలోని వివిధ పుష్పజాతులకు చెందిన మొక్కల్లో 35 శాతం మొక్కలకు మహేంద్రగిరి ఆవాస కేంద్రమని గుర్తించారు. దాదాపు 300కు పైగా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడ లభిస్తాయి. అతి త్వరగా అంతరించిపోతున్న, అత్యంత అరుదైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇప్పటికీ ఈ పర్వతంపైన లభిస్తున్నాయి.

అక్కడ పూటపూటకీ ఆకాశంలో రంగులు మారిపోసాగాయి. తొలిసంధ్యలో పక్కన ఏముందో కనిపించనంతగా దట్టంగా కమ్మేసిన మంచూ, అంతలోనే చురుక్కుమనిపించే సూర్యోదయం, ఉన్నట్టుండి భోరున కురిసే వర్షమూ సాయంసంధ్యా సమయానికి ఆహ్లాదాన్ని పంచే శీతగాలులూ రాత్రికి ఎముకలు కొరికేసే చలీ... ఇలా ఒక్క రోజులోనే అనుభవంలోకి వచ్చిన అక్కడి వాతావరణానికి అచ్చెరువొందుతూనే పర్వతం మొత్తాన్నీ చుట్టి ఆ సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యాం.

ఎలా వెళ్లాలి?
మహేంద్రగిరిని పర్యటించాలనుకునేవాళ్లకి అక్కడ బస చేయడానికి తగిన సదుపాయాలు లేవు. కాబట్టి ఒడిశాలోని గజపతి జిల్లా కేంద్రమైన పర్లాఖెమొండికి చేరుకుంటే అక్కడ బస చేయడానికి లాడ్జీలు అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి 200 కి.మీ దూరంలో, భువనేశ్వర్‌ నుంచి 285 కి.మీ దూరంలోనూ పర్లాఖెమొండి ఉంది. ఒడిశాలోని బ్రహ్మపురం రైల్వేస్టేషన్‌ నుంచి 120 కి.మీ., శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌ నుంచి 40 కి.మీ దూరం ప్రయాణించీ పర్లాఖెమొండి చేరుకోవచ్చు. పర్లాఖెమొండి నుంచి మహేంద్రగిరికి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాల్లో వెళ్లొచ్చు. లేదా కొయిన్‌పూర్‌ వరకూ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించొచ్చు. వ్యక్తిగత వాహనాల్లో వెళితే బుర్ఖత్‌ వరకూ చేరుకోవచ్చు. అక్కడ వాహనాలను నిలిపేసి కాలినడకన ఎక్కాల్సిందే. కొయినపూర్‌లో అటవీశాఖ అతిథిగృహం ఉంది. అక్కడ నలుగురు బస చేసేందుకు వీలుంటుంది. అక్కడ కూడా వాహనాలను నిలిపి కాలినడకన పర్వతాన్ని ఎక్కొచ్చు.మహేంద్రజాలం చూడాల్సిందే!

తూర్పుకనుమల్లో అందాలు నెలకొన్న కొండలు మహేంద్రగిరులు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పర్వత శ్రేణులపై ప్రకృతి ఎప్పుడూ పరవశిస్తూ ఉంటుంది. చెట్లు, చేమలతో పచ్చలపేరులా మెరిసిపోతున్న మహేంద్రగిరుల్లో.. అక్కడక్కడా వజ్రాలు పొదిగినట్టుగా అపురూప ఆలయాలు దర్శనమిస్తాయి. ముత్యాలు కుమ్మరించినట్టుగా నీటి చెలమలు కనిపిస్తాయి. ఈ గిరులకు ఏడాదంతా పర్యాటకుల తాకిడి ఉంటుంది. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా వేల మంది భక్తులు తరలి వస్తారు. ఇక్కడి పాండవుల ఆలయాలను సందర్శిస్తారు. ఆ చుట్టుపక్కల వాళ్లు ప్రతిష్ఠించిన మహాలింగాలను భక్తితో పూజిస్తారు.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం సింగుపురం సమీపంలో ఉంటాయి మహేంద్రగిరులు. సముద్ర మట్టానికి ఐదువేల అడుగుల ఎత్తులో ఉన్నాయివి. అరుదైన వృక్షసంపద వీటి సొంతం. వనవాసకాలంలో పాండవులు మహేంద్రగిరులపై కొంతకాలం గడిపారని చెబుతారు. ఆ సమయంలో ఒక్కొక్కరూ ఒక్కో మందిరాన్ని నిర్మించుకొన్నారని స్థానిక కథనం. అందుకు తగ్గట్టుగా ఇప్పుడు అక్కడ పాండవుల పేరిట ఆలయాలు కనిపిస్తాయి. ధర్మరాజు, కుంతీదేవి ఆలయాలు ఒక ప్రదేశంలో ఉండగా.. భీమసేనుడి ఆలయం ఎత్తయిన శిఖరంపై కనిపిస్తుంది. అక్కడికి కొంత దూరంలో అర్జునుడు, నకుల, సహాదేవుల ఆలయాలు ఉన్నాయి. వీటి పరిసర ప్రాంతాల్లో పాండవులు ప్రతిష్టించారని భావించే లింగాలు కనిపిస్తాయి.

కాలప్రవాహంలో ఆలయాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా.. వాటి ప్రాశస్త్యం మాత్రం తగ్గలేదు. ఏటా శివరాత్రి సందర్భంగా మహేంద్రగిరులపై జరిగే ఉత్సవాలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూడా భక్తులు వస్తుంటారు. పిల్లలు, పెద్దలు వ్యయప్రయాసలకోర్చి సాహసయాత్రకు పూనుకుంటారు. శివరాత్రికి ఒకరోజు ముందుగానే భక్తులంతా గిరులపైకి చేరుకుంటారు. పూజాసామగ్రి, మంచినీళ్లు, ఆహారం, పళ్లు అన్నీ వెంట తెచ్చుకుంటారు. శివరాత్రి ఉపవాస దీక్షలో ఉంటారు. భజనలతో రాత్రంతా జాగరణ చేస్తారు. మర్నాడు భోజనాలు చేసుకొని తిరుగు ప్రయాణం అవుతారు. శివరాత్రి సందర్భంగా జనంతో కిటకిటలాడే మహేంద్రగిరులు ఆ తర్వాత బోసిపోతాయి. సాహస యాత్రికులు మాత్రం తరచూ ఇక్కడికి వస్తుంటారు.

ఇలా వెళ్లాలి..

  • మహేంద్రగిరుల యాత్రకు సాహసంతో పాటు ఓపిక కూడా ఉండాలి. ముందుగా శ్రీకాకుళం, ఇచ్ఛాపురం నుంచి బస్సుల్లో మందస మండలం సింగుపురం చేరుకోవాలి.
  • మహేంద్రగిరులకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ పలాస. ఇక్కడి నుంచి మందస మీదుగా సింగుపురం చేరుకోవచ్చు. బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.
  • సింగుపురం నుంచి వాహనాల్లో.. చొంపాపురం మీదుగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామమైన రాజబసకు వెళ్లాలి. ఆపై కాలినడక మొదలవుతుంది. దాదాపు 28 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. చల్లని గాలులు, ప్రకృతి సౌందర్యం, గలగల పారే సెలయేళ్లు.. యాత్రికులకు అలసట తెలియనివ్వవు.
కాశీబుగ్గ-మందస

Saturday, 2 September 2017

మదరాంతేశ్వర స్వామి

రోజు రోజుకూ పెరిగే గణపయ్య

విఘ్నాలకు అధిపతి వినాయకుడు. పార్వతీ తనయుడైన గణపతిని పూజించిన అనంతరమే అన్ని కార్యాలను ప్రారంభిస్తాం. మూషిక వాహనుడైన విఘ్నేశ్వరునికి దేశంలో ఆలయాలు అనేకం ఉన్నాయి. తొలి పండగను వినాయక చవితిగా జరుపుకొంటాం. జగన్మాత కుమారుడైన స్వామికి ఉన్న విశిష్ట ఆలయాల్లో కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లాలోని మధూరు ఒకటి. మధురవాహిని నదీ తీరంలో, ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరిన విఘ్నరాజును దర్శించుకునేందుకు భక్తులు వస్తుండటంతో మధూరు నిత్యం దైవ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంతో నిండివుంటుంది.
ఉద్భవమూర్తి..
మధూరులోని ఆలయంలో ప్రధాన దైవం పరమేశ్వరుడు. ఈ క్షేత్రంలో మదరాంతేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. స్థలపురాణం ప్రకారం ఒక మహిళ స్వామివారి విగ్రహాన్ని కనుగొంది. అందుకనే స్వామివారిని ఉద్భవమూర్తిగా పేర్కొంటారు. తొలిసారిగా మహిళా భక్తురాలికి స్వామివారు దర్శనమిచ్చారు. అందుకనే ఆమె పేరుపై మధూరు ఆలయంగా ప్రసిద్ధి చెందింది. స్వామి గర్భగుడి వెలుపల దక్షిణ భాగం గోడపై వినాయకుడి విగ్రహం ఉంటుంది. రోజురోజుకూ స్వామివారు పెరుగుతుండటం విశేషం. అందుకనే బొడ్డ గణేశా అని పిలుస్తుంటారు. ప్రధాన దైవం ఈశ్వరుడు అయినా గణనాథునికి విశేషపూజలు నిర్వహించడం క్షేత్ర ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది.


టిప్పుసుల్తాన్‌ వెనుదిరిగాడు..
ఒక కథనం ప్రకారం టిప్పుసుల్తాన్‌ ఆధ్వర్యంలోని సేనలు మలబార్‌పై దండెత్తాయి. ఈ క్రమంలోనే ఆలయంపైకి సేనలు వచ్చాయి. ఆలయ ప్రాంగణంలోని బావిలోని నీటిని టిప్పుసుల్తాన్‌ తాగిన తరువాత మనస్సు మారి దాడిని విరమించుకొని వెనక్కు మళ్లినట్టు తెలుస్తోంది.ఆలయాన్ని ఏనుగు ఆకారంలో నిర్మించారు. మూడు అంతస్తులుగా ఉండే ఆలయం సందర్శకులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది.


ప్రసాదంగా అప్పం..
ఆలయంలో కేరళ సంప్రదాయ వంటకమైన అప్పాన్ని ప్రసాదంగా ఇస్తారు. మహాగణపతికి ఉదయాస్తమానసేవ నిర్వహిస్తారు. సహస్ర అప్ప పూజలో భాగంగా వెయ్యి అప్పాలతో పూజలు జరిపిస్తారు. మరో ముఖ్యమైన సేవ మూడప్పమ్‌. ఇందులోనూ అప్పాలతో పూజ జరిపించడం విశేషం. వినాయక చవితికి భారీ స్థాయిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.


ఎలా చేరుకోవాలి...

  • కాసర్‌గోడ్‌ నుంచి ఆలయం 7 కి.మీ. దూరంలో ఉంది.
  • కాసర్‌గోడ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మధూర్‌కు వివిధ వాహనాల ద్వారా చేరుకునే సౌలభ్యముంది.
  • మంగళూరు విమానాశ్రయం ఇక్కడ నుంచి 70 కి.మీ. దూరంలో ఉంది. విమానాశ్రయం నుంచి ఆలయానికి ప్రైవేటు ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు.

కాణిపాకం వినాయకుడు

అలాంటి వాళ్ల‌కు సింహస్వప్నం కాణిపాకం వినాయకుడు

సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.

క్షేత్రచరిత్ర / స్థలపురాణం:
సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్‌’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.

ఈ బొజ్జ గణపయ్య.. ప్రమాణాల దేవుడయ్య!
కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకం’లో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది..!

నిత్యం పెరిగే స్వామి!
వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు.

కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి.

బ్రహ్మహత్యా పాతక నివారణార్థం:
స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట! అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు:
మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు.


సర్పదోష పరిహారార్థం.. వరదరాజస్వామి ఆలయ నిర్మాణం
స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికిగానూ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూలవిరాట్‌ ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు.

పంచామృతాభిషేకం టిక్కెట్‌ ధర: రూ. 550
సేవాఫలితం:స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం. ఈ సేవల్లో పాల్గొనడం వలన అన్ని కష్టాలు తొలగుతాయి.

గణపతి హోమం టిక్కెట్‌ ధర: 500
సేవాఫలితం:‘కలౌ చండీ వినాయకః’ అంటే ఈ కలియుగమున పిలవగానే పలికే దేవతలు.. చండి(దుర్గా), గణపతి. మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ, ఏదో ఒక ఆటంకం జరగవచ్చు. అన్ని విఘ్నాలను అధిగమించాలి. అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి. స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి.

గణపతి మోదకపూజ టిక్కెట్‌ ధర: 300
గణపతి పురాణంలో సహస్రనామాల్లో ‘మోదక ప్రియాయనమః’ అని ఉంది. మోదకం అంటే కుడుములు అని అర్థం. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్న ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయంలో గణపతి మోదక పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారు.

సహస్ర నామార్చన, వ్రతపూజ టిక్కెట్‌ ధర: రూ. 150, రూ. 58
సేవాఫలితం:‘కలౌ గణేశ’ స్మరణామున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 నామాలు అర్పించడం వల్ల విశేషఫలం కలుగుతుంది.

మూల మంత్రార్చన టిక్కెట్‌ ధర: రూ. 300
సేవాఫలితం: దీనినే నారికేళ పూ అంటారు. వినాయకుని గణాధిపతిగా నియమించిన తర్వాత.. అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకొమ్మని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గణపతిని అవాహనం చేసి నారికేళంతో పూజిస్తే మహాగణపతి సంతుష్ఠి చెందుతారు. సకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి.

సంకటహర గణపతి వ్రతం టిక్కెట్‌ ధర: రూ. 151
సేవాఫలితం: గణేశ పురానంలో ఈ వ్రతానికి విశేష స్థానం కల్పించారు. దీన్ని శ్రీ కృష్ణుడు, బ్రహ్మదేవుడు తదితరులు ఆచరించారు. సంతానం, వ్యాపార అభివృద్ధి, సకల విఘ్నాలు తొలగడం, ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు.

పూలంగి సేవ టిక్కెట్‌ ధర: రూ. 1,000
సేవాఫలితం: వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం, అంత్రాలయం, అర్ధమండపం, స్వామివారికి విశేష పుష్పాలకంరణ చేస్తారు. రంగుల పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం, సౌభాగ్యం కలుగుతాయి.

అక్షరాభ్యాసం టిక్కెట్‌ ధర: రూ. 116
సేవాఫలితం: చదువుల తండ్రి వినాయకుడు. అలాంటి వినాయకుడి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల చదువులు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంటుంది.

అన్నప్రాసన టిక్కెట్‌ ధర: రూ.116
సేవాఫలితం: పిల్లలకు అన్నప్రాసనం, విశిష్ఠరోజున చేస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుని ఆలయంలో అన్నప్రాసన చేయడం శుభం. ఇక్కడ అన్నప్రాసన చేయడం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది. మొదటి పూజలు అందుకునే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి.

వివాహ ఆహ్వానపత్రికలకు పూజలు టిక్కెట్‌ ధర: రూ. 51
సేవాఫలితం: వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత పూజలు చేస్తారు. మొదటి వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయి.

వసతి.. రవాణా సౌకర్యాలు:
కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కి.మీ.లు.. తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా.. అటు తిరుమల.. శ్రీకాళహస్తిల సందర్శనకు వెళ్తుంటారు కనుక.. కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే.. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి. 

తిరుపతి నుంచి.. చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. ప్రైవేటు వాహనాలూ విస్తృతంగా లభిస్తాయి. దగ్గరలోని రైలు.. విమాన మార్గ సదుపాయం అంటే.. తిరుపతినే ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాలి.

Sunday, 20 August 2017

శివమెత్తిన గంగ...

శివమెత్తిన గంగ...

విష్ణువర్ధనుని పట్టపురాణి అయిన శాంతల దేవి తనకు కుమారుడు కలగలేదనే కారణంతో ఈ పర్వతం మీదే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాన్ని ఆవిడ పేరుతోనే పిలుస్తారు. హొయసాల ప్రభువైన విష్ణువర్ధనుడు శివగంగ దేవాలయ పునరుద్ధరణకు కృషి చేశాడు. తరువాత ఏలుబడిలోకి వచ్చిన కెంపెగౌడ రెండు గాలిగోపురాలను నిర్మించాడు.

బెంగళూరుకు 34 మైళ్ల దూరంలో, తుముకూరు దగ్గర దక్షిణానికి రోడ్డు చిన్నదిగా చీలి, శివగంగ గ్రామం చేరుతుంది. దాబస్‌పేట్‌ రైల్వే స్టేషను నుంచి శివగంగ నాలుగు మైళ్ల దూరంలో ఉంది. ఈ పర్వతం... ఉత్తర దిక్కు నుండి శివలింగాకారంలో, తూర్పు దిక్కు నుంచి వృషభాకృతిలో, దక్షిణం నుంచి మహాసర్పంగా, పశ్చిమం నుంచి మహాగణపతి ఆకారంలో దర్శనమిస్తుంది. ఈ పర్వతం మీద అనేక నీటి బుగ్గలు, తటాకాలు, పెద్ద దేవాలయాలతో కూడిన గుహలు ఉన్నాయి. పురాణాలలో ఈ పర్వతాన్ని కకుద్గిరి అని పిలిచారు. కకుత్‌ అంటే ఎద్దు మూపురం అని అర్థం. ఈ శిఖరంపైన పరిశుద్ధమైన గంగాజలంతో నిండిన నీటిబుగ్గలున్న కారణంగా, ఈ పర్వతానికి శివగంగ అనే పేరు సార్థకమైనదని చెబుతారు. ఇక్కడి స్వామి గంగాధరేశ్వరుడు.

శివగంగ గ్రామం నుంచి పర్వత ప్రాంతం చేరుతుండగా మానవ నిర్మితాలైన నున్నటి మెట్లు కనిపిస్తాయి. మార్గంలో పెద్ద రాతితో మలచబడిన గణపతి విగ్రహం, నంది మంటపం, పాదెకల్‌ వీరభద్ర విగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం కనిపిస్తాయి. ఇక్కడ రెండు పెద్ద గుహలలో శివాలయం, అమ్మవారి ఆలయాలు దర్శన మిస్తాయి. రెండు ద్వారాలకు పైన ఉన్న రెండు గోపురాలలో తూర్పు గోపురం హొయసాల కాలం నాటిది, ఉత్తర గోపురం విజయనగర కాలంనాటిది.

 లోపలకు వెళ్తే గిరిజా కల్యాణ మంటపం, ఏక స్తంభాధారంగా ఉన్న నవరంగం కనిపిస్తాయి. నవరంగ దక్షిణ భాగం నుంచి గుహకు చేరుకోవాలి. గంగాధరేశ్వరుని ముఖ్య ఉత్సవమూర్తికి గంగాపార్వతీ మూర్తులు ఇరుపక్కల కనువిందు చేస్తాయి. ఆలయంలో శాసనాలతో నిండిన అనేక గంటలు ఉన్నాయి.  ఏటా జనవరిలో సంక్రాంతి రోజున, గంగాధరేశ్వరుడు, హొన్నమ్మదేవిల కల్యాణోత్సవం  జరుగుతుంది. కొండ శిఖరం మీద నుంచి జాలువారే గంగాజలంతో కల్యాణోత్సవంలో దేవతామూర్తులను అభిషేకిస్తారు.

గంగాధరేశ్వర శివలింగం దివ్యమైనది. ఈ లింగం మీద పూత పూయబడిన నెయ్యి మరుక్షణం వెన్నగా మారిపోతుంది. ఓషధీ శక్తుల కారణంగానే ఈ విధంగా జరుగుతోందని, ఈ వెన్న వల్ల అనేక రుగ్మతలు తగ్గుతాయని చెబుతారు. ఆలయ గుహకు ఉత్తరంగా మరొక చిన్న గుహాలయంలో హొన్నదేవి కొలువుతీరి ఉంది. కొద్దిగా ముందుకు వెళితే ఐదడుగుల ఎత్తులో అమ్మవారి విగ్రహం సాక్షాత్కరిస్తుంది. సాక్షాత్తు శంకరాచార్యులు ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. శ్రీచక్ర ప్రభావంతో హొన్నదేవి మహాత్మ్యం వృద్ధి చెందుతోంది.

ఈ మందిరానికి పడమరగా గల పాతాళగంగ నీరు కొబ్బరినీళ్లలా మధురంగా ఉంటాయి. కొండ మీద చక్రతీర్థం, శంకరాచార్య తీర్థం, శంకర గుహ, శంకర పాద చిహ్నాలు, శంకరాచార్య విగ్రహం ఉన్నాయి. అగస్త్యేశ్వరునికి ప్రత్యేకం మందిరం ఉంది. మఠ సమీపంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దివ్యశక్తి ఉన్నట్లుగా చెబుతారు. సుబ్రమ్మణ్యేశ్వరునికి క్షీరాభిషేకం చేస్తుండగా, పాలు సర్పాకృతిలో దర్శనమిచ్చాయట. అంతేకాదు, ఈ స్వామిని కొలిచిన వారికి సంతానం కలుగుతుందని కూడా స్థానికులు చెబుతారు. వాలుగా ఉన్న ఒక కొండ శిఖరం మీద చెక్కిన నంది లేదా బసవన్న మూర్తి అద్భుత శిల్ప నైపుణ్యానికి ప్రతీక.

వెళ్ళే మార్గం... 
బెంగళూరు నుంచి దోబస్‌పేట వరకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. దోబాస్‌పేట నుంచి శివగంగ ఎనిమిది కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుంచి బస్సులు, టాక్సీలు నిత్యం అందుబాటులో ఉంటాయి. దోబస్‌పేట్‌ రైలు స్టేషన్‌ అతి సమీపంగా ఉంది.
బెంగళూరు వరకు విమానంలో వచ్చి, అక్కడ నుంచి టాక్సీ లేదా మినీ బస్సుల ద్వారా పర్వతశిఖరం చేరుకోవచ్చు.

♦ ఇక్కడ వినాయకుని దేవాలయం, అగస్త్య తీర్థానికి సమీపంలో 108 శివలింగాలు ఉన్నాయి. శిఖరం మీద ఉన్న నంది విగ్రహాన్ని దర్శించుకోవడానికి వెళ్లేవారు తమ వెంట తప్పనిసరిగా మంచినీళ్లు ఉంచుకోవాలి. పైన చాలా వేడిగా ఉంటుంది.

♦ కొండ మీద గంగాధరేశ్వరుడు, స్వర్ణాంబ, శాంతేశ్వర, ఓంకారేశ్వర, రేవన సిద్ధేశ్వర, కుంభేశ్వర, సోమేశ్వర, ముద్దు వీరేశ్వర అనే అష్ట శివలింగాలు ఉన్నాయి.

♦ నంది వృషభ, మకర  వృషభ, మహిష బసవ, గారే బసవ, దొడ్డ బసవ, కొడుగళ్లు అనే బసవ అష్ట వృషభాలు, అగస్త్య తీర్థం, శంకర తీర్థం, కణ్వతీర్థం, కదంబ తీర్థం, మైథల తీర్థం, పాతాళగంగ, ఒలకల్లు తీర్థం, కపిల తీర్థం అనే అష్టతీర్థాలు ఉన్నాయి.
– డా. వైజయంతి

హంపి

హంపి బాలకృష్ణాలయం అద్భుత శిల్పచాతుర్యం
హంపి పేరు వినగానే మనకు విరూపాక్షాలయమే గుర్తొస్తుంది. అయితే, హంపీలో విరూపాక్షాలయంతో బాటు బాలకృష్ణుడి గుడి కూడా ఉంది. ఈ ఆలయాన్ని అలనాటి విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు యుద్ధంలో సాధించిన విజయానికి ప్రతీకగా స్వయంగా దగ్గరుండి మరీ ఎంతో శ్రద్ధాభక్తులతో కట్టించాడని ప్రతీతి.

ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు అన్నట్లుగా ముద్దులొలికే మోముతో ఉంటాడు బాలకృష్ణుడు. దురదృష్టం ఏమిటంటే ఈ నగుమోమును మనం ఇప్పుడు ఈ గుడిలో సందర్శించుకోలేం. 15వ శతాబ్దానికి చెందిన సువిశాలమైన, సుందరమైన ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ, చారిత్రక సంపదగా యూనెస్కో గుర్తించింది. కృష్ణాష్టమి సందర్భంగా ఈ ఆలయంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా వేడుకలు, ఉత్సవాలు జరుగుతాయి.

ఎల్తైన ప్రాకారాలు, ఆ ప్రాకారాలపై అత్యద్భుతంగా చెక్కిన పౌరాణిక శిల్పాలు ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయం అంతరాళం, గర్భగృహం, అర్ధమంటపం లేదా ప్రదక్షిణ మంటపం, ముక్తిమంటపం లేదా రంగమంటపం అని నాలుగైదు విభాగాలుగా ఉంటుంది. ఆలయానికి తూర్పుదిశగా ఉన్న మంటపానికే  రంగమంటపమని పేరు. అత్యున్నతమైన ప్రాకారాలున్న ఈ రంగమంటపంలోనే అమ్మవారు కొలువుదీరి ఉంటారు. దక్షిణదిక్కుగా అందమైన అరటి తోట. ఆ తర్వాత ఓ రాతి ఉద్యానం. వీటన్నింటినీ కలుపుతూ ఒక కొలను.

అయితే, ఆ కొలనులో నీరుండక పోవడం వల్ల అది వాడకంలో లేదు. పశ్చిమానికి వెళితే దీర్ఘచతురస్రాకారపు భవంతి. ఒకప్పుడు అది అతి పెద్ద ధాన్యపు గాదె, దానిని ఆనుకుని సువిశాలమైన వంటశాల ఉండేది. చిత్రమేమిటంటే, ఆ భవంతి మహమ్మదీయ కట్టడాన్ని తలపిస్తుంది. దాని వెనకాలకు వెళితే ఇరుకుగా ఉండే మెట్లు. ఆ మెట్లెక్కితే ఆలయం పై భాగానికి చేరుకోవచ్చు. అక్కడ నిలబడి చూస్తే, అందమైన చిత్రాన్ని చూడవచ్చు.

ఇక సభామంటపంలోనికి అడుగిడితే... అక్కడి లోపలి నాలుగు గోడలపైనా బాలకృష్ణుడు, హనుమంతుడు, కాళీయమర్ధనం చేస్తున్న కృష్ణుడు, శ్రీ మహావిష్ణువు దశావతారాల చిత్రాలు సజీవమా అన్నట్లు కనిపిస్తుంటాయి. అంతరాలయం పై కప్పుపైన సింహతలాటాలు, వాద్యగాళ్ల శిల్పాలు కనువిందు చేస్తుంటాయి.
బాలకృష్ణాలయంలో బాలకృష్ణుడి విగ్రహం ఉండదు. ఒకప్పుడు ఉండేది కానీ, మహమ్మదీయుల దండయాత్రలలో నాశనం అవుతుందన్న ఉద్దేశంతో చిన్నికృష్ణుడి విగ్రహాన్ని తీసి వేరేచోట భద్రం చేయగా, ఇప్పుడది చెన్నైలోని నేషనల్‌ మ్యూజియంలో ఉంది. కృష్ణుడి విగ్రహం లేదు కదా, ఇంకేముందక్కడ చూడటానికి? అనే సందేహం రావచ్చు... అయితే, ఆలయంలోని శిల్పసంపదను, ఆలయం నిర్మాణాన్ని తప్పకుండా చూసి తీరవలసిందే. ఉత్సవ విగ్రహాలకే పూజలు నిర్వహిస్తున్నారు.
బాలకృష్ణాలయంలోకి అడుగు పెట్టడానికి ఏ విధమైన రుసుమూ వసూలు చేయరు. అంతేకాదు, ఆలయంలోపల కానీ, వెలుపల కానీ మనం ఎన్ని ఫొటోలైనా తీసుకోవచ్చు. మనల్ని ఎవరూ అభ్యంతర  పెట్టరు.

ఎలా వెళ్లాలంటే..?
బెంగళూరు నుంచి హోస్పేటకు ఆర్టీసీ బస్సులున్నాయి. రైళ్లున్నాయి. హోస్పేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని హంపీ చేరుకోవడానికి ప్రైవేటు ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రైవేటు వాహనాలు ఉన్నాయి.

హంపీలో చూడదగ్గ ఇతర ప్రదేశాలు
విరూపాక్ష దేవాలయం, విరూపాక్ష గుహలు, కడలేకలులో ఏకశిలతో నిర్మించిన భారీ గణేశుని విగ్రహం, శశిలేకలులో ఉదరానికి మొలతాడులా సర్పాన్ని చుట్టుకుని ఉన్న ఎనిమిదడుగుల గణేశుని విగ్రహం, హజార రామాలయం, పట్టాభిరామాలయం, కమల్‌ మహల్, హంపీబజార్‌... ఒకనాడు విజయనగర రాజుల కాలంలో రత్నాలు, అమూల్యాభరణాలను రాశులు పోసి విక్రయించిన వీధి ఇది. ఇప్పుడు ఈ వీధిలో కృత్రిమమైన నగలు, రంగురాళ్లు అమ్ముతున్నారు. అచ్యుతరాయాలయం: పూర్తిగా విజయనగర కళారీతిలో నిర్మించిన ఈ ఆలయంలో విష్ణ్వాంశ స్వరూపుడైన తిరువేంగళనాథుని విగ్రహాన్ని సందర్శించుకోవచ్చు. ఇంకా 900 ఏళ్ల క్రితం నాటి చంద్రమౌళీశ్వరాలయం తప్పక సందర్శనీయమైనది. గగన్‌ మహల్, ఆర్కియాలజికల్‌ మ్యూజియం కూడా చూడదగ్గ ప్రదేశాలు.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Saturday, 19 August 2017

నాంపల్లిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి

దండాలన్నా నాంపల్లి నర్సన్నా 

ఐదు తలల సర్పాకారం... 
తలపై శ్రీకృష్ణుడి నృత్యరూపం.. 
52 అడుగుల ఎల్తైన గుట్ట.. 
చుట్టూ పచ్చని పంటలు.. 
కనుచూపు మేర కనువిందుచేసే అందాలు...  
మనసును ఉల్లాసంగా ఉంచే ప్రకృతి దృశ్యాలు...
ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అద్భుత శిల్పాలు 
నాంపల్లిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం సొంతం. 

ఆ గుట్టపై శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఎంతో విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రం. పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ఆనందానుభూతులలో ఓలలాడతారు. 

నాంపల్లిని పూర్వం నామపల్లిగా పిలిచేవారు. ఆరువందల ఏళ్ల కిందట ఈ గుట్టపై శ్రీలక్ష్మీనర్సింహస్వామి వెలసినట్లు చెబుతారు. శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో చోళుల కాలంలోనే స్వామివారికి పూజాదికాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. సహజ సిద్ధంగా ఓ వైపు మూలవాగు.. మరోవైపు మానేరు వాగులు ప్రవహిస్తుంటాయి. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత లోపల ఉన్న అంజనేయస్వామి రాతి శిల. ఈ హనుమంతుడికి మండల దీక్షలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం. సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులు నాంపల్లిగుట్టకు కూడా వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. కొత్తగా పెళ్లయిన జంటలు సంతానం కలగాలని మొక్కుకుని, కోరిక నెరవేరాక ఇక్కడ వనభోజనాలు చేస్తారు. రాజరాజనరేంద్రుడు, ఆయన సతీమణి కూడా స్వామివారిని సేవించి, సంతానాన్ని పొందినట్లు చారిత్రక కథనాలున్నాయి.

గుట్టపై గుహలు
నాంపల్లిగుట్టపై సహజసిద్ధమైన బండరాళ్ల మధ్య గుహలు, రెండు కోనేరులున్నాయి. ఇక ఆలయం పక్కనే ఉన్న చిన్న గుహలో శివలింగంతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకూ పూజలు జరుగుతాయి. క్రీ.శ 10 శతాబ్దంలో నవనాథ సిద్ధులు(తొమ్మిది మంది) ఈ గుట్టపై తపస్సు చేసి సిద్ధి పొందారని ప్రతీతి. నిత్యం నవనాథులు ఈ గుహ నుంచి భూగర్భ సొరంగ మార్గంలో వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసే వారని చెబుతారు.

కాళీయ మర్దనం.. ప్రత్యేకత
నాంపల్లిగుట్ట ఆసాంతం సింహం నిద్రిస్తున్న తీరులో ఉంటుంది. గుట్ట ఎంత మహిమాన్వితంగా కనిపిస్తుందో ప్రకృతి అందాలతో అంతగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సహజ సిద్ధమైన అందాలతో పాటు కాళీయమర్దనం మరో ప్రత్యేకత. ఐదుతలల సర్పాకారంలో నిర్మించిన నాగదేవత ఆలయం. నాగపాము తలపై శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవితో నృత్యం చేస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఎటు నుంచి చూసినా గుట్టపై చెట్లపొదల్లో చుట్టుకుని పడుకున్న కొండంత పాములా కనిపిస్తుంది. పామునోటిలోనికి  వెళ్తుండగా.. శ్రీలక్ష్మీనర్సింహస్వామి లీలలను తెలిపే రకరకాల శిల్పాలు కనువిందు చేస్తాయి. గుట్టపైకి వచ్చిన వారు వీటిని మైమరచి చూస్తూ... నర్సింహుడి ఉగ్రరూపాన్ని, నాగదేవతను దర్శించుకుంటారు. నూనెతో, పాలతో స్వయంగా అభిషేకాలు నిర్వహించుకుంటారు.

వేడుకలు.. ఉత్సవాలు
ప్రతి శ్రావణమాసంలో సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి కల్యాణం, శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణం, శివరాత్రి వేడుకలు, శ్రీరామనవమి, గోదారంగనాథుల కల్యాణ వేడుకలు జరుగుతాయి. వేములవాడకు అతి సమీపంలో ఉన్న నాంపల్లిగుట్ట అభివృద్ధికి  తెలంగాణ పర్యాటక శాఖ రూ.29 కోట్లతో గుట్ట దగ్గర ధ్యానమందిరం, ప్లానెటోరియం, గుట్టపైకి రోప్‌వే, కాటేజీలు, లైట్‌ అండ్‌ సౌండ్స్‌ వంటి ఆధునిక వసతులను సమకూర్చేందుకు ప్రతిపాదించారు. గుట్టపైకి ఘాట్‌ రోడ్డు సౌకర్యం ఉంది.

ఎలా చేరుకోవాలి..!
నాంపల్లిగుట్టకు చేరాలంటే రోడ్డు మార్గం ఒక్కటే ఉంది. హైదరాబాద్‌ మీదుగా రావాలంటే సిద్దిపేట, సిరిసిల్ల గుండా 152 కిలోమీటర్లు ప్రయాణించి వేములవాడ చేరుకోవాలి. అక్కడి నుంచి మూడుకిలోమీటర్ల దూరంలో నాంపల్లిగుట్ట దర్శనమిస్తుంది. కరీంనగర్‌కు 32 కిలోమీటర్ల దూరంలో వేములవాడ మార్గంలో ఉంది. జగిత్యాల మీదుగావచ్చే వారు 55 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆర్టీసీ బస్సు సౌకర్యం, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. గుట్టపైకి వాహనాలు వెళతాయి. మెట్ల గుండా ఆలయానికి చేరుకోవాలి.Tags: Sri Lakshmi Narasimha Swamy Temple, శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం

Sunday, 13 August 2017

దక్షిణాది బద్రి... లింబాద్రిదక్షిణాది బద్రి... లింబాద్రి


నిజామాబాద్‌ జిల్లాలోని లింబాద్రి గుట్ట తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయం. పచ్చని కొండల నడుమ ప్రకృతి రమణీయత మధ్యన అలరారే ఈ క్షేత్రంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని సందర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున జరిగే రథోత్సవానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు.

భీమ్‌గల్‌ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో లింబాద్రి గుట్ట ఉంది. రెండంతస్తుల గుట్ట ఇది. మొదటి అంతస్తుపైకి మెట్ల మార్గం, రహదారి మార్గం ఉన్నాయి. మొదటి అంతస్తులో శ్రీవారి మాడ వీధులు, కమలా పుష్కరిణి, కళ్యాణ మంటపం, రథం గుడి, అయోధ్య ఆంజనేయ స్వామి ఆలయం ఉంటాయి. రెండవ అంతస్తులో లోతైన రాతి గుహలో కొలువుదీరిన స్వామి వారి మూల విరాట్టు ఉంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి ఇరుకైన గుహ మార్గం గుండా వెళ్లాలి. ఈ గుహ మార్గం ప్రవేశ ద్వారం వద్ద జోడు లింగాలు ఉంటాయి. గుహమార్గం ద్వారా వంగుని 250 మీటర్లు వెళితే రాతి గుహలతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గర్భాలయంలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి మూల విరాట్టు, పక్కనే నరనారాయణుల (కృష్ణార్జునుల) విగ్రహాలు కనువిందు చేస్తాయి.

శాంత నరసింహుడు 

సాధారణంగా ఏ నరసింహ క్షేత్రంలో చూసినా స్వామి వారి విగ్రహం ఉగ్ర రూపంతో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం తొడపైన లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుని శాంత రూపంలో దర్శనమిస్తాడు.

స్వయంభూ నరసింహ క్షేత్రం 

శ్రీ లక్ష్మీ నరసింహుడి స్వయంభూ క్షేత్రాలలో ఇదొకటి. బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయంలో పార్వతి పాదాలను చూడడంతో కోపోద్రిక్తుడైన ముక్కంటి తన గోటితో బ్రహ్మ ఐదవ తలను తొలగించాడని పురాణం చెబుతుంది. దీంతో బ్రహ్మ ఇక్కడే తపమాచరించి శ్రీహరిని నరసింహుడిగా సాక్షాత్కరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. దీంతో లక్ష్మీసమేతుడుగా స్వామి వారు ఇక్కడే వెలియడం అరుదైన విషయమని చెబుతారు.

దక్షిణ బద్రీనాథ్‌గా ప్రసిద్ధి 

పవిత్ర బద్రీనాథ్‌ క్షేత్రం తర్వాత గర్భాలయంలో స్వామి వారి మూలవిరాట్టు పక్కన నరనారాయణుల విగ్రహాలు ఇక్కడ మాత్రమే∙ఉన్నాయి. దీంతో ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్‌గా విశిష్టత వచ్చింది.

జోడులింగాలు 

పరమశివుడు తనకు సంప్రాప్తించిన బ్రహ్మహత్యా దోష నివారణకై తపమాచరించి దోష విముక్తుడై శ్రీవారి ఆజ్ఞచే ఈ క్షేత్రంలోనే జోడు లింగాల రూపాన వెలిసాడట. ఇందుకు ప్రతీకగా గర్భాలయ మార్గ ప్రవేశ ద్వారం వద్ద భక్తులకు జోడు లింగాలు దర్శనమిస్తాయి. యముడు ఈ క్షేత్రంలో బిల్వవృక్ష రూపంలో తపమాచరించి శాంతి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రుడు ఈ క్షేత్రంలో స్వామిని కమలాలతో పూజించి శాప విముక్తుడైనాడట.

అయోధ్య హనుమాన్‌ 

శ్రీరాముని ఆజ్ఞతో కవి పుంగవుడైన హనుమంతుడు ఇక్కడకు వచ్చి తపమాచరించి నరసింహుని రూపంలో ఉన్న శ్రీరాముని దర్శించాడట. అందుకే కొండ దిగువ ప్రాంతంలో క్షేత్ర పాలకుడైన అయోధ్య హనుమాన్‌ ఆలయం కనిపిస్తుంది.

కమలా పుష్కరిణి 

ఇక్కడి పుష్కరిణికి కమలా పుష్కరిణిగా పేరు. సతీ విక్రయ దోషనివారణకై సత్య హరిశ్చంద్రుడు నరసింహుని సేవించి తరించాడట. నరనారాయణులు సన్నిధానంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారట. ధర్మరాజు ఈ క్షేత్రాన్ని దర్శించి కృతార్థుడైనట్లు, ప్రహ్లాదుడు తపమాచరించినట్లు పురాణకథనం.

నామధేయులు 

ఈ ప్రాంతంతో పాటు జిల్లా, పక్క జిల్లా అయిన రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలో అడుగడుగునా లింబాద్రి, లింబన్న, లింబయ్య, నర్సింహులు, నర్సయ్య, నర్సయ్య, నర్సింగ్‌ తదితర పేర్లు గల వ్యక్తులు తారసపడతారు. మండలంలో అడుగుడుగునా ఈ పేర్లు గల వాళ్లు కనబడతారు.

ఎలా వెళ్లాలి 

హైదారాబాద్‌ నుండి నేరుగా ఆర్మూర్‌ వరకు బస్సులో రావచ్చు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుండి ఆర్మూర్‌ వరకు 25 కి.మీ. అక్కడి నుండి భీమ్‌గల్‌ మండల కేంద్రానికి 25 కిలోమీటర్లు. భీమ్‌గల్‌ నుండి 5 కిలో మీటర్ల దూరంలోని లింబాద్రి గుట్టకు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల ద్వారా చేరుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే దేవాలయం బస సౌకర్యం కల్పిస్తుంది.
– K రవి గౌడ్, సాక్షి, భీమ్‌గల్, నిజామాబాద్‌ జిల్లా

Sunday, 6 August 2017

శ్రీరంగపట్నం


భూలోక వైకుంఠం... శ్రీరంగపట్నం

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు అతి సమీపంలో మాండ్యా జిల్లాలో ఉన్న ఈ ఆలయానికి చారిత్రకంగా, ధార్మికంగా, సాంస్కృతికంగా కూడా ఎంతో పేరున్నది. మైసూరు రాజులు శ్రీరంగపట్టణాన్నే రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు. రంగరాయను ఓడించి వడయార్‌ రాజు 1614లో శ్రీరంగపట్టణాన్ని వశపరచుకున్నాడు. మైసూర్‌ పులి టిప్పుసుల్తాన్‌కి శ్రీరంగనాథుడంటే ఎనలేని భక్తి. టిప్పుసుల్తాన్‌ తండ్రి హైదరాలీ మైసూరును పాలించిన కాలంలో ఆయన రంగనాథుని ప్రార్థించిన తర్వాతనే యుద్ధభూమిలోకి అడుగు పెట్టేవాడట. శ్రీరంగపట్టణం చుట్టూతా కావేరీ నది ఆవరించి ఉంటుంది.

అందువల్ల ఇది ఒక ద్వీపంలా కనిపిస్తుంది. ఎల్తైన ఆలయ గోపురం, రెండు సువిశాలమైన ప్రాకారాలు, ఆలయ మంటపం, ఉన్నతమైన ముఖమంటపంతో అలరారుతుంటుంది. ఆలయ ముఖద్వారం పైకప్పు చిన్న చిన్న శిఖరాలన్నీ కలిసి గుచ్చిన పుష్పమాలాలంకృతమై ఉంటుంది. గర్భగుడిలోకి అడుగుపెట్టగానే ఏడుతలల ఆదిశేషువుపై శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువు, ఆయన పాదాలు వత్తుతున్న లక్ష్మీదేవి దర్శనమిస్తారు. ఆలయంలో నరసింహస్వామి, గోపాలకృష్ణుడు, శ్రీనివాసుడు, హనుమంతుడు, గరుడుడు, పన్నిద్దరు ఆళ్వారుల సన్నిధులు కూడా కనిపిస్తాయి.

కావేరీ నీరు వైకుంఠంలోని విరజానదితో సరితూగగలిగేంత పవిత్రమైనవని విశ్వాసం. గంగ కూడా కావేరీలో స్నానం చేసి తన పాపాలను పోగొట్టుకుంటుందని పురాణ కథనాలున్నాయి. అంతేకాదు, కావేరీ నది కోరికమేరకే శ్రీరంగనాథుడు ఇక్కడ కొలువయ్యాడని, బ్రహ్మ, రుద్రుడు కూడా దివినుంచి భువికి దిగివచ్చి రంగనాథుని పూజిస్తారని ప్రతీతి. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన విష్ణువర్థనుడనే రాజు ఎంతో ధనాన్ని వెచ్చించి ఆలయ అభివృద్ధికి పాటుపడ్డాడు. ఆయన భార్య అలమేలమ్మ ప్రతి మంగళ, శుక్రవారాలలో దేవేరులకు అమూల్యమైన ఆభరణాలు తయారు చేయించి అలంకరింపజేసేది. ఆ తర్వాత వచ్చిన విజయనగర రాజులు, అనంతర కాలంలో మైసూరు మహారాజులు ఆలయానికి మరింత శోభను చేకూర్చారు. అంగరంగవైభవంగా ఉత్సవాలు నిర్వహించారు.


సేవలు, ఉత్సవాలు: 

మకర సంక్రాంతినాడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ముక్కోటి ఏకాదశినాడు స్వామివారి ఉత్తరద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈరోజున స్వామివారిని వెన్నతో అలంకరిస్తారు. సాయంత్రం కిరీటాలంకరణ చేస్తారు. ఆ తర్వాత రథసప్తమికి కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మాఘ పూర్ణిమనాడు స్వామివారికి కావేరీనదిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఈ పర్వదినాన వేలాది భక్తులు స్వామిని సేవించుకుంటారు. వైశాఖ శుద్ధ సప్తమినాడు శ్రీరంగ జయంతి ఉత్సవాలు జరుపుతారు. ఆ తర్వాత వచ్చే పున్నమినాడు బంగారు గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఇక్కడ ఇంకా ఏమేమి చూడవచ్చు? టిప్పుసుల్తాన్‌ కోట, శ్రీరంగనాథిట్టులోని బర్డ్‌ శాంక్చువరీ, నిమిషాంబ ఆలయం, దొడ్డ ఘోశాయ్‌ ఘాట్, కరిఘట్ట కొండలు, సంగమ, గుంబాజ్, జామా మసీద్‌ వంటివాటిని సందర్శించవచ్చు.

ఎలా వెళ్లాలి? దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి శ్రీరంగపట్నానికి నేరుగా రైళ్లు, బస్సులు ఉన్నాయి. విమానాశ్రయం మాత్రం మైసూరులో ఉంది. అక్కడినుంచి శ్రీరంగపట్నం కేవలం పదహారు కిలోమీటర్లే. విశాఖపట్నంలోని గాజువాక నుంచి శ్రీరంగపట్నానికి నేరుగా రైలుంది.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌


జంబుకేశ్వర క్షేత్రం


ప్రకృతి సౌందర్యానికి రమణీయతకు
జంబుకేశ్వర క్షేత్రం


శివుడి పంచభూతలింగ క్షేత్రాలలో జలతత్వానికి ప్రతీక జంబుకేశ్వర క్షేత్రం. తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న ఈ జంబుకేశ్వరం సహజ ప్రకృతి సౌందర్యంతో శోభిల్లే రమణీయ ప్రదేశం. కావేరిని తమిళంలో పొన్ని అని కూడా పిలుస్తారు. పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరీ నదిలో స్నానం చేయడం, జంబుకేశ్వరుడిని పూజించడం విశిష్ట ఫలదాయకమని క్షేత్రమహాత్మ్యం చెబుతోంది. జంబుకేశ్వర స్వామివారు భక్తవత్సలుడిగా పేరు పొందిన బోళాశంకరుడు.

చిత్తశుద్ధితో ప్రార్థిస్తే చాలు, కష్టనష్టాలన్నింటినీ చిటికలో తొలగించి, సకల సంపదలూ ప్రసాదిస్తాడని భక్తులు ప్రస్తుతిస్తుంటారు. పవిత్రమైన ఈ శ్రావణమాసంలో శైవ క్షేత్రాలను సందర్శించడం, అభిషేకాలు, అర్చనలు చేయడం ప్రశస్తమని పురాణాలు చెబుతున్నాయి. చోళరాజులు నిర్మించిన ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను అనంతర కాలంలో పల్లవులు, పాండ్యులు, విజయనగర రాజులు చేపట్టినట్లు చారిత్రక కథనాలను బట్టి తెలుస్తోంది. జంబుకేశ్వర క్షేత్రానికి తిరువానైకవర్‌ అనే పేరు కూడా ఉంది.

పేరెలా వచ్చింది
జంబూ అంటే తెల్లనేరేడు అని అర్థం. ఇక్కడ తెల్లనేరేడు చెట్లు అధికంగా ఉండటం వల్ల దీనికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది. పూర్వం శంభుడనే రుషి ఉండేవాడు. ఆయన మహా శివభక్తుడు. శివుని ప్రత్యక్షంగా దర్శించుకుని పూజించాలని శివుని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, ‘‘నేను ఇక్కడ లింగరూపంలో కొలువుదీరతాను. నువ్వు ఇదే ప్రదేశంలో జంబూవృక్షరూపంలో ఉండి నన్ను సేవించుకుంటూ ఉందువుగానీ’’ అని వరమిచ్చాడు. ఇలా ఆ ముని ఇప్పటికీ జంబూవృక్షరూపంలో ఆలయ ప్రాంగణంలో ఉండి శివుణ్ణి, శివభక్తులను దర్శించుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ స్వామివారు జలరూపంలో ఉండరు. సానవట్టం నుంచి స్వామిని అభిషేకిస్తున్నట్లుగా నీరు ఊరుతూనే ఉంటుంది. పానవట్టం చుట్టూ అర్చకులు వస్త్రాన్ని కప్పుతారు. మళ్లీ అందులోకి నీరు ఊరుతుంటుంది. ఈ వస్త్రాన్నే పిండి, అర్చకులు భక్తులకు తీర్థంగా సమర్పిస్తుంటారు.

అత్యంత ప్రాచీన ఆలయాలలో ఒకటిగా పేరొందిన ఈ ఆలయం ఎత్తయిన గోపురాలతో, విశాలమైన ప్రాకారాలతో, వివిధమైన ఉపాలయాలతో, మండపాలతో, తీర్థాలతో సందర్శకులను ఎంతగానో అలరిస్తుంది. నాలుగవ ప్రాకారం 32 అడుగుల ఎత్తు, వేలాది అడుగుల చుట్టుకొలతతో చూడముచ్చట గొలుపుతుంటుంది. అత్యద్భుతమైన ఈ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుడికోసం వృద్ధశిల్పి రూపంలో వచ్చి, దేవతలను కట్టడ నిర్మాణ నిపుణులుగా మార్చి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు స్థలపురాణం చెబుతోంది.

ఆదిశంకరుడు ప్రతిష్ఠించిన శ్రీ యంత్రం
సాక్షాత్తూ శంకరుని అవతారంగా ప్రస్తుతించే జగద్గురు ఆదిశంకరులవారు జంబుకేశ్వరుని సన్నిధిలో అత్యంత శక్తిమంతమైన, మహిమాన్వితమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి, క్షేత్రానికి ఆకర్షణ శక్తిని పెంపొందించినట్లు, అఖిలాండేశ్వరిగా, జగన్మాతగా పేరు గాంచిన ఇక్కడి అమ్మవారికి శ్రీచక్రాంకితమైన రెండు కర్ణాభరణాలను సమర్పించుకున్నట్లు ఐతిహ్యం. అమ్మవారి మందిరంలో గర్భాలయానికి ఎదురుగా అమ్మవారి ముద్దులపట్టి, విఘ్నాలకు రాజయిన వినాయకుని మూర్తిని కూడా శంకరులే ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతోంది.

నిత్యకల్యాణ దంపతులు
ఇక్కడ స్వామి, అమ్మవార్లకు నిత్యం మూడుకాలాలలో పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు, నివేదనలు జరుగుతుంటాయి. శివునికి సంబంధించిన పర్వదినాలలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. స్వామి, అమ్మవార్లకు నిత్యం కల్యాణోత్సవాలను జరుపుతారు. ఈ ఆలయం ఆవరణలోని పలు ముఖ్య ఆలయాలేగాక చుట్టుపక్కల వినాయక, సుబ్రహ్మణ్య, ఇతర శివదేవ పరివార ఆలయాలు, స్వామి భక్తులైన నందరార్, తిరునావుక్కరుసు, మానిక వాసగర్, సంబంధార్‌ తదితర నాయనారుల ఉపాలయాలు కూడా సందర్శనీయమైనవి. తిరుచ్చి సమీపంలోనే కలియుగ వైకుంఠమైన శ్రీరంగం ఉంది.

ఎలా వెళ్లాలంటే..?
చెన్నై నుంచి జంబుకేశ్వరానికి నేరుగా రైళ్లు, బస్సులు ఉన్నాయి.

డి.వి.ఆర్‌.భాస్కర్‌

Tuesday, 25 July 2017

శ్రీముఖలింగం


శ్రీముఖలింగం అష్టదిక్కులు... అష్టతీర్థాలు 

శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగానికి కాశీక్షేత్రంతో సమానమైన ఖ్యాతి ఉంది. అందుకే దక్షిణకాశి అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో ఉన్న అష్టతీర్థాలను అశ్విని దేవతలు ఏర్పాటు చేసినట్లు స్థలపురాణం చెబుతోంది. మాయాజూదంలో రాజ్యాన్ని కోల్పోయిన పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో ఈ తీర్థాల్లో పుణ్యస్నానాలు చేసి ఇక్కడ కొలువైన మధుకేశ్వరుడు, వారాహి అమ్మవారు, జంబుకేశ్వరుడు, ముక్తేశ్వరస్వామి, మహావిష్ణువు, ఆదిత్యుడు, సోమేశ్వరుడు తదితర దేవతలను దర్శించుకోవడంతోపాటు పితృశ్రాద్ధాలు, తిలతర్పణాది కార్యక్రమాలు చేసినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. ప్రధానంగా పాండవ ప్రథముడు ధర్మరాజు జూదంలో రాజ్యం పోగొట్టుకున్నప్పుడు భీముడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అదే భీమేశ్వరాలయం. శ్రీ ముఖలింగ క్షేత్రానికి ఈ నెల 31 నుంచి ఆగష్టు 31 వరకూ అష్టతీర్థ రాజమహాయోగం సందర్భంగా ప్రత్యేక వ్యాసకుసుమం...

సాధారణంగా పుణ్యనదులైన గంగ, కృష్ణ, గోదావరి, పెన్న, కావేరి నదులకు గురుగ్రహం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కుంభం తదితర రాశుల్లో ప్రవేశిస్తే నదులకు 12 సంవత్సరాలకు పుష్కరాలు వస్తాయి. అప్పుడు భక్తులు పుణ్యస్నానాలు చేసి పితృదేవతలకు పిండప్రదానాలు నిర్వహిస్తారు. కాని శ్రీముఖలింగంలో జరగనున్న అష్టతీర్థాలకు అష్టమి, స్వాతి నక్షత్రంతో కూడిన పౌర్ణమి, సోమవారం, శ్రవణం నక్షత్రంతో ఒకే విధంగా ఉండాలి. ఇలా అరుదుగా సంభవిస్తాయి. ఇలా గతంలో 1946, 2000 సంవత్సరాల్లో వచ్చినట్లు ఆలయ చరిత్రను బట్టి తెలుస్తోంది. దక్షిణాయనం, శ్రావణమాసం శుక్లపక్షం అష్టమి ఘడియల్లో సోమవారం స్వాతి నక్షత్రంతో కూడిన శ్రవణ నక్షత్రంనాడు ఈ తీర్థాల్లో రాజమహాయోగం పుణ్యక్రతువులు ప్రారంభిస్తారు. ఎనిమిది రోజులు అనంతరం సోమవారం పౌర్ణమి గ్రహణం అనంతరం పుణ్యస్నానాలతో ఈ మహాక్రతువును ముగిస్తారు.

తీర్ధాల విశిష్టత.. పుణ్యస్నానాల ఫలితం
అష్టతీర్థాలు.. అష్టదిక్కులు.. కొలువైన దేవతలు శ్రీముఖలింగంలో జరగనున్న రాజమహాయోగానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ పుణ్యతీర్థాలలో స్నానాలు చేసి ఆయా దేవతలను దర్శించుకోవడంతోపాటు ప్రధాన దేవాలయంలో ముఖలింగేశ్వరుని దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదు. దీర్ఘరోగాలు పటాపంచలైపోతాయి. కోరిన కోర్కెలు తీరి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. మాన సిక రోగాలు, పిచ్చి, రుణబాధలు తొలగి అషై్టశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రధానంగా పితృదేవతలకు పిండ ప్రదానాలు, దానధర్మాలు చేయడం, తిల తర్పణ కార్యక్రమాలు నిర్వహించడం సంప్రదాయం.

మొదటి రోజు (సోమవారం): 

బిందు తీర్థం ఈశ్యాన దిక్కున ఉంది. పాండవులు వనవాసం సమయంలో ఇదే గిరిపై నివాసం ఉన్నట్లు స్థలపురాణం చెబుతోంది. ఇందులో పుణ్యస్నానం అనంతరం అనంతగిరి (పద్మనాభకొండ)పై ఉన్న శ్రీముఖలింగేశ్వరుని క్షేత్రపాలకుడు మహావిష్ణువుని దర్శించుకోవాలి.

రెండవ రోజు (మంగళవారం): 

గయా తీర్థం పద్మనాభ గిరి కింద తూర్పుదిక్కున ఉంది. ఇక్కడ స్నానానంతరం విష్ణుపాదాలు, శంఖు, చక్రాలను దర్శించుకోవాలి. వీటితోపాటు సమీపంలో ఉన్న శివలింగ దర్శనం చేయాలి. ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు. అలాగే దానధర్మాలు చేయడం వల్ల మోక్షం కలుగుతుందంటారు.

మూడవ రోజు (బుధవారం): 

హంసతీర్థం పశ్చిమ దిక్కున ఉంది. స్నానానంతరం ప్రధాన ఆలయం ఆది విరాట్టు వారాహి సహిత శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకోవాలి.

నాలుగవ రోజు (గురువారం): 

పిశాచవిమోచన తీర్థం దక్షిణం దిక్కున ఉంది. స్నానం చేసి నగిరికటకాం గ్రామ సమీపంలో ఉన్న ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవాలి. సాయంత్రం కనుల పండువగా వారాహి సహిత శ్రీముఖలింగేశ్వరునికి గజవాహనంపై తిరువీధి ఉత్సవం జరుగుతుంది.

ఐదవరోజు (శుక్రవారం): 

పక్షి మోచన తీర్థం ఆగ్నేయ దిక్కున ఉంది. ఇందులో కుటుంబ సమేతంగా స్నానాలు చేసి దానధర్మాలు ఆచరించాలి. భీమేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. జూదంలో ఓడిపోయి రాజ్యం పోగొట్టుకున్న పాండవులు అరణ్య వాసం చేసే సమయంలో ఈ క్షేత్రంలో ఉండగా భీముడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది.

ఆరవ రోజు (శనివారం): 

జంబూతీర్థం ఉత్తర దిక్కున ఉంది. ఈ రోజున ఈ తీర్థంలో స్నానం చేసిన అనంతరం జంబుకేశ్వరుని దర్శనం చేసుకోవాలి.

ఏడవ రోజు (ఆదివారం): 

సూర్యతీర్థం వాయవ్య దిక్కులో ఉంది. స్నానం ఆచరించి ఆదిత్యేశ్వరస్వామిని దర్శించుకోవాలి. ఈ తీర్థం రోగ హరమైనది అని భక్తుల విశ్వాసం.

ఎనిమిదవ రోజు (సోమతీర్థం): 

నైరుతి దిక్కున ఉంది. చివరిరోజు సోమవారం పౌర్ణమి సందర్భంగా ఈ తీర్థంలో స్నానం చేసి సోమేశ్వర స్వామి దర్శనం, అనంతరం దానధర్మాలు చేయాలి. ఈ తీర్థంలో అష్టదిక్పాలకులలో ఒకరైన చంద్రుడు స్నానమాడి శాపవిమోచనం పొందాడు. అనంతరం సోమేశ్వర స్వామి లింగ ప్రతిష్ట చేసినట్లు శ్రీముఖలింగేశ్వర క్షేత్ర మహాత్మ్యంలో ఉంది.

జన్మ ధన్యం!
అష్టతీర్థ రాజమహాయోగం ఇక్కడ ప్రధాన పుణ్యక్రతువు. ఈ తీర్థాల్లో స్నానాలు చేస్తే మోక్షంతోపాటు పుణ్యం సిద్ధిస్తుంది. పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారు పుణ్యలోకాలకు వెళతారు. దానధర్మాలు, తిలతర్పణ కార్యక్రమాలు చేయడం ద్వారా మానవ జన్మ ధన్యమైనట్లే అంటారు. ఎనిమిది రోజులు పాటు అష్టతీర్థాల్లో స్నానం చేసి ఆ తీర్థాల్లో కొలువైన దేవతలతోపాటు వారాహి సహిత ముఖలింగేశ్వరుని దర్శనం తప్పని సరిగా చేసుకోవాలని ఆలయ ప్రధానార్చకులు టి. శ్రీకృష్ణ చెబుతున్నారు.

ఇదీ రూట్‌...
హైదరాబాద్‌ లేదా విజయవాడ నుంచి విమానంలో విశాఖపట్నం వరకూ రావచ్చు. అక్కడ నుంచి నేరుగా కారు/ బస్సు/రైలులో శ్రీకాకుళం రోడ్‌ (స్టేషన్‌)కు వస్తే, అక్కడ నుంచి శ్రీముఖలింగంకు 40 కిలోమీటర్లు ప్రయాణం. రైలులో వచ్చే వారు శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లో దిగితే అక్కడ నుంచి శ్రీముఖలింగం చేరుకునేందుకు ట్యాక్సీ లేదా బస్సులున్నాయి.

– సుంకరి శాంతభాస్కర్‌ సాక్షి, జలుమూరు, శ్రీకాకుళం జిల్లా