Sunday, 29 January 2017

గోవా

సౌత్ గోవా vs నార్త్‌ గోవా

సౌత్ గోవాలో మిరామర్‌ బీచ్‌(Miramar Beach), ఓల్డ్‌ గోవా చర్చి(Old Goa Church), మంగేషి దేవాలయం(Mangeshi Temple), దొనపాల బీచ్‌(Dona Paula Beach), జువారీ నది (Zuari River), మార్మగో హార్బర్‌(Mormugao Harbour), మండోవి నదిలో బోటు షికారు(Mandovi River, Panjim) ఉంటాయి.

నార్త్‌ గోవాలోని కండోలిమ్‌(Calangute), బాఘా(Baga Beach), అంజునా బీచ్‌(Anjuna), వగేటర్‌ బీచ్‌ or బాగటర్‌ (Vagator Beach), కాలన్‌గ్యూట్‌ బీచ్‌ or కలన్‌గుటె బీచ్‌ (Calangute Beach)ల సందర్శనతో పాటు ఎన్నో వింతలు.

శ్రీకాళహస్తి ఆలయం









శ్రీకాళహస్తి ఆలయం



‘ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి. దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది.’ అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. ఆయన శ్రీకాళహస్తి క్షేత్రమహాత్యం ఇలా వివరించారు.

శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటేనే వాయువు ఉంటుంది. వాయువంతటి గొప్పక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఇంద్రునికే జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత. ఈ క్షేత్రంలో పరమశివుడే కైలాసగిరులుగా వెలిశాడు. దేశంలో చాలా చోట్ల దక్షిణ కాశీలు ఉన్నాయి. అయితే ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే ఉంది. అలాగే దక్షిణ కైలాసం కూడా ఒకే ఒక్కటి ఉంది. అదే శ్రీకాళహస్తి. భూలోకంలో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం మరెక్కడా లేదు. ఇక్కడ ఆలయ శిఖరం దర్శనం చేసుకుంటే కైలాసం చూసినట్లే. భక్తుడికి అగ్రతాంబులం వేసిన క్షేత్రం కూడా ఇదే. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమశివుని ముఖ్య భక్తుడైన భక్తకన్నప్పకు మొదటి పూజ చేస్తారు. దేశంలోనే అన్ని ఆలయాల్లో భక్తులు సవ్యదిశలో ప్రదక్షిణం చేసి స్వామి, అమ్మవారిని దర్శించుకుంటారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుని, జ్ఞానప్రసూనాంబను దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఇక్కడ రాహు-కేతువులు శాంతిస్తున్నాయి. శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖాన స్వామివారి ఆలయం ఉండటంతో ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి... మొదట పాతాళ వినాయకస్వామిని దర్శించుకున్నాక శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే మంచిది. నక్కీరుడు అనే భక్తుడు కుష్ఠువ్యాధితో బాధపడుతూ చరమాంకంలో శివుని దర్శించుకుని మోక్షం పొందాలని భావించాడు. కైలాసానికి ఎలా చేరుకోవాలో తెలియలేదు. శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్లి శివుని దర్శించుకున్నాక శిఖరదర్శనం చేసుకోవాలని అదృశ్యశక్తి ఉపదేశం చేసింది. అలా దర్శనం చేసుకోవడంతో నక్కీరుని కుష్ఠువ్యాధి నయమైంది. పాతాళ గణపతి ఆలయం వద్ద నాలుగు పర్యాయాలు విఘ్నేశ్వరస్వామిని తలచుకుంటే భక్తులకు మోక్షం లభిస్తుంది.

శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగేశ్వరుడు నవగ్రహ కవచం ధరించి ఉన్నాడు. ఇలా ధరించడంతో గ్రహాలన్నింటినీ శివుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి తల ఓ వైపు వాల్చి ఉంది. ఇలా ఏ క్షేత్రంలో కూడా లేదు. మృత్యువును జయించిన గురు దక్షిణామూర్తి కూడా ఈ క్షేత్రంలో దక్షిణాది ముఖాన ఉన్నాడు. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. గురు దక్షిణామూర్తి సన్నిధిలో ఒక క్షణం కళ్లు మూసుకుని ఆయనను స్మరించుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుంది. చిన్నారులకు గురుదక్షిణామూర్తి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచిది. ఒక మాటలో చెప్పాలంటే శ్రీకాళహస్తి క్షేత్రం పరమశివుని ఆవాసం. ఈ క్షేత్రంలో ఉండటం ఎంతో అదృష్టం. శ్రీకాళహస్తిలో అడుగు పెడితే పుణ్యం లభించినట్లే.

కర్ణాటక కోస్తా తీరం






ఆ ఉదయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం!
అరేబియా సముద్ర అందాలూ సుందర ప్రకృతి దృశ్యాలూ వాటి నడుమ వెలసిన పౌరాణిక క్షేత్రాలతో అలరారే అద్భుత ప్రదేశమే కర్ణాటక కోస్తా తీరం అంటున్నారు ఆ ప్రాంతాన్ని సందర్శించిన హైదరాబాద్‌కు చెందిన AVS ప్రసాద్‌.

కర్ణాటక రాష్ట్రంలో ఉడుపి, కొల్లూరు, శృంగేరి, హోర్నాడు, ధర్మస్థల, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ ఏకకాలంలో చూసి రావాలనుకుని పక్కా ప్రణాళికతో కాచిగూడలో యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాం. తెల్లవారుజామున నాలుగు గంటలకు అక్కడ దిగి, అక్కడ నుంచి తిరిగి ఉదయం ఏడు గంటలకు కరవార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉడుపికి బయలుదేరాం. కరవార్‌ ఎక్స్‌ప్రెస్‌ వారానికి మూడుసార్లు అంటే సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయాన్నే బయలుదేరుతుంది. ఇది కాకుండా బెంగళూరు నుంచి రోజూ రాత్రి 8 గంటలకు బయలుదేరే కరవార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉడుపి, కొల్లూరు చేరుకోవచ్చు.

మేం ఎక్కిన రైలు హాసన్‌ దాటాక కుక్కి క్షేత్రం వరకూ ప్రకృతి కనువిందు చేసింది. ఆ కొద్ది మేర కొండదారి కావడంతో రైలు సుమారు 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ప్రయాణ మార్గానికి ఓ వైపు కొండలూ మరోవైపు లోయలూ సెలయేళ్లతో అద్భుతంగా ఉంది. రైలు సుమారు 50 గుహల గుండా ప్రయాణం చేస్తుంది.

సాయంత్రం ఎనిమిది గంటలకు ఉడుపి శ్రీకృష్ణ క్షేత్రాన్ని చేరుకుంది. రైల్వేస్టేషనుకు వూరు 5 కి.మీ. దూరం. ఆటోలో శ్రీకృష్ణ ఆలయానికి దగ్గరలోని ఓ గెస్ట్‌హౌస్‌కి వెళ్లాం. ఈ ఆలయానికి దగ్గరలోని గీతా మందిర్‌, ఇతర మఠాలు, ఇంకా లాడ్జీల్లో పర్యటకులకు వసతి సౌకర్యం ఉంటుంది. ఆలయానికి వెళ్లేటప్పుడు బస చేసిన తాలూకు కాగితాలనూ మన ఐడీప్రూఫ్‌నూ మరిచిపోకుండా తీసుకెళ్లాలి. ఉదయాన్నే బయలుదేరి ఆలయానికి చేరి స్వామిని దర్శించుకున్నాం. ఒకప్పుడు భూకంపం తరవాత శ్రీకృష్ణ భక్తుడైన కనకదాసు ఎలాగయితే ఆయన్ని దర్శించుకున్నాడో అదేమాదిరిగా భక్తులు కిటికీలో నుంచే చూడాలి. ఉడుపి కృష్ణునికి చేసే అలంకారం ఎంతో ముద్దుగా ఉంటుంది. కృష్ణ జన్మాష్టమిని ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతారు. తరవాత మందిరం ముందున్న పుష్కరిణినీ పక్కనే ఉన్న అనంతేశ్వర స్వామినీ చంద్రమౌళీశ్వరుణ్ణీ దర్శించుకుని గదికి వచ్చి అన్నీ సర్దుకుని కారులో కొల్లూరు మూకాంబిక అమ్మవారి దర్శనానికి బయలుదేరాం.

కొల్లూరు మూకాంబిక అమ్మ వారు
ఉడుపి నుంచి కుందపుర మీదుగా కొల్లూరుకి 80 కిలోమీటర్ల దూరం. కుందపుర నుంచి కొల్లూరు వరకూ 40 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డు ప్రయాణం మనల్ని మరో లోకంలో విహరింపచేస్తుంది. కొండలూ, లోయలూ, జలపాతాలూ, కాఫీ తేయాకు తోటలూ, రబ్బరూ వక్క చెట్లతో ఎటుచూసినా పచ్చదనం పరవళ్లు తొక్కుతున్నట్లే అనిపిస్తుంది. సముద్రమట్టానికి 1300 మీటర్ల ఎత్తులో కొండల మధ్య కొలువైన మూకాంబిక అమ్మవారి దివ్యదర్శనం చేసుకుని తరించాం. కౌమాసుర అనే రాక్షసుణ్ణి పార్వతీదేవి మూకాంబిక అవతారంతో సంహరించిందన్నది పురాణ కథనం. అక్కడకు పదికిలోమీటర్ల దూరంలోనే కొడ్చాద్రి హిల్స్‌ ఉన్నాయి. సమయాభావంతో మేం అక్కడకు వెళ్లలేదు గానీ అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంటాయట.

సాగర తీరంలో శివరూపం!
తరవాత బైందూరు మీదుగా 66 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రాన్ని ఆనుకుని ఉన్న మురుడేశ్వర్‌ శివక్షేత్రాన్ని చేరుకున్నాం. ఇది ప్రపంచంలోకెల్లా రెండో అతి పెద్ద శివుని విగ్రహం. ఎంతో అందంగా నిర్మించిన ఆ విగ్రహాన్ని తనివితీరా చూసి తరించాం. ఇక్కడి ఆలయ గోపురం ప్రపంచంలోకెల్లా ఎత్తైనది. 21 అంతస్తులతో ఉన్న ఈ గోపురం పై అంతస్తులోకి ఎక్కేందుకు లిఫ్ట్‌ సౌకర్యం ఉంది. అక్కడ నుంచి అరేబియా సముద్రాన్నీ శివుడి విగ్రహాన్నీ వీక్షించవచ్చు. ఈ విగ్రహం ఇక్కడి బీచ్‌ను ఉత్తర దక్షిణాలుగా విడదీస్తూ ఆ ప్రాంతానికే తలమానికంగా నిలుస్తోంది. ఆ తరవాత ముందే అనుకున్న ప్రణాళిక ప్రకారం శృంగేరికి బయలుదేరాం.

సూర్యాస్తమయం... నయనానందకరం!
మేం శృంగేరికి అగుంటె మీదుగా బయలుదేరాం. ఎందుకంటే అగుంటె సూర్యాస్తమయ వీక్షణ ప్రదేశం. సముద్రమట్టానికి 2,700 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం నుంచి అరేబియా సముద్రంలో అస్తమిస్తోన్న సూర్యుణ్ని చూస్తుంటే కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ఎంతోమంది పర్యటకులు సూర్యాస్తమయ సమయానికి ఇక్కడకు చేరుకుని ఆ అందాలను తమ కెమెరాల్లో బంధిస్తారు. ఇక్కడ నుంచి శృంగేరి 25 కి.మీ. మేం అక్కడకు చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటలు కావొచ్చింది. మర్నాడు ఉదయం శారదా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అమ్మవారు స్వర్ణాభరణాలంకరణతో పుష్పార్చనలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారు. అమ్మ దర్శనంతో మా జన్మలు చరితార్ధమయ్యాయన్న భావన కలిగింది. జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు స్థాపించిన మొట్టమొదటి పీఠం శృంగేరి. మేం ఉదయాన్నే వెళ్లడంవల్ల భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. శారదా అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న అతి ప్రాచీనమైన విద్యాశంకరుల దేవాలయం కూడా దర్శించుకున్నాం. ఈ ఆలయం హొయసల నిర్మాణశైలిని కలిగి ఉంది. ఈ ఆలయాల పక్కనే తుంగానది వయ్యారంగా ప్రవహిస్తోంది.

ఉదయసంధ్య వేళలో...
ఈ ఆలయం నుంచి తుంగానది మీదుగా కాలినడకన వెళ్లే వంతెన ఉంది. ఆవలి వైపు పీఠాధిపతుల ఆశ్రమం ఉంది. ఉదయం వేళలో ఆ నది మీద కప్పేసిన పొగమంచూ ఆ పొగమంచును చీల్చుకుంటూ వస్తోన్న లేలేత బంగారు సూర్యకిరణాలూ నదిమీదుగా ఎగురుతోన్న పక్షుల గుంపులూ ఆ చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయతా... చూస్తుంటే సృష్టికర్త ఓ అందమైన చిత్తరువుని గీసి అక్కడ పెట్టాడా అనిపించింది. ఆ నదిలోని చేపలు భక్తులు వేసే మరమరాల కోసం నీటిమీద ఎగిరెగిరి పడుతున్నాయి. తుంగానదిలో నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. దాంతో కింద ఉన్న భూమి కనిపిస్తుంటుంది. ఆ ఉదయాన్ని మేం ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే ఇంతకన్నా  అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఇంతవరకూ ఎక్కడా చూడలేదు. అక్కడ అమ్మవారి ప్రధాన ఆలయం పక్కనే ఉన్న ఆది శంకరులు, తోరణ గణపతి ఆలయాలను దర్శించుకుని వీడలేక వీడలేక ఆ గుడి బయటకు వచ్చాం. అక్కడ నుంచి ఉదయం పది గంటలకే బయలుదేరి హోర్నాడు అన్నపూర్ణ అమ్మవారి దర్శనం కోసం బయలుదేరాం. శృంగేరి నుంచి హోర్నాడు 45 కిలోమీటర్ల దూరం. ఈ మార్గం కూడా మనల్ని కళ్లు తిప్పుకోనీయదు. ఎత్తయిన కొండలూ వాటి మధ్యనే బొమ్మరిళ్లలాంటి ఇళ్లతో నిండిన చిన్న చిన్న వూళ్లూ చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలా తోచాయి. అమ్మవారి ఆలయానికి చేరేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయింది. లగేజీని బస్టాండుకు దగ్గరలోనే ఉన్న ఓ షాపులో పెట్టి దర్శనానికి వెళ్లాం. అరగంటలోనే ఆది శక్త్యాత్మక అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దివ్యమంగళ దర్శనం చేసుకుని తరించాం. అగస్త్యేశ్వరుడు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. దర్శనం తరవాత అమ్మవారి భోజనం చేశాం. ఇక్కడికొచ్చే వాళ్లంతా ఆలయంవారు పెట్టే భోజనం తప్పక తింటారు. అక్కణ్ణుంచి మధ్యాహ్నం మూడు గంటలకే ధర్మస్థలకు బయలుదేరాం.

హోర్నాడు నుంచి కొట్టిగర మీదుగా ధర్మస్థల చేరుకోవాలి. ఇది సుమారు 95 కిలోమీటర్ల దూరం. అయితే కొట్టిగర వరకూ 40 కి.మీ. ప్రయాణం పూర్తిగా కొండలతో ఘాట్‌ రోడ్ల మధ్య సాగిపోతుంది. కొట్టిగర నుంచి ధర్మస్థల వరకూ 45 కిలోమీటర్ల విశాలమైన కొండదారి కిందకి దిగుతూ ఉంటుంది. ఇలా దిగేటప్పుడు మాత్రం చాలా మలుపులు ఉంటాయి. సాయంత్రం ఐదు గంటలకు ధర్మస్థల చేరుకుని ముందుగానే రిజర్వ్‌ చేసుకున్న గెస్ట్‌హౌస్‌లో దిగి బస చేశాం. ఈ ప్రదేశం తిరుమలలా ఉంది. వూళ్లొకి ప్రవేశించగానే త్రిశూలం పట్టుకుని ఉన్న పెద్ద శివుని విగ్రహం ఉంది. మేం వెళ్లిన రోజునా మర్నాడూ మంజునాథుణ్ణీ అమ్మవార్లనూ తనివితీరా దర్శించుకున్నాం. అమ్మవారి విగ్రహం చాలా చిన్నగా ఎన్నో ఆభరణాలతో ఉంటుంది. ఆలయంలోపల చతురస్రాకారపు చెక్కమీద రకరకాలైన దేవతా రూపాలు చెక్కి ఉన్నాయి. లోపల వినాయకుడి ఆలయం కూడా ఉంది. అవన్నీ చూసుకుని సాయంత్రానికి అక్కడకు 60 కిలోమీటర్ల దూరంలోని కుక్కి సుబ్రహ్మణ్యస్వామిని చూడ్డానికి వెళ్లాం.

సర్పరక్షిత క్షేత్రం!
ధర్మస్థల, కుక్కి క్షేత్రాల మధ్య ప్రతి అరగంటకీ బస్సులు ఉంటాయి. కుక్కిలో అతి తక్కువ రుసుముతోనే బస చేయడానికి అన్ని వసతులతో కూడిన కుమార కృప, స్కంద కృప, కార్తికేయ మొదలైన అతిథిగృహాలూ ప్రైవేటు లాడ్జీలూ ఉన్నాయి. ఉదయాన్నే ఇక్కడ ప్రవహించే కుమారధార నదిలో స్నానం చేసి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాం. గర్భగుడిలో కింద శివలింగం, దానికి నాగాభరణం, పైన మళ్లీ నాగాభరణం, ఆపైన దేదీప్యమానంగా వెలిగిపోతూ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నారు. సుబ్రహ్మణ్యుడికి కుడివైపున ఉమామహేశ్వర మందిరం ఉంది. బయట ఉన్న మరో చతురస్ర ప్రాకారంలో నాగప్రతిష్ఠమండపం, సంకల్ప మండపం, శృంగేరి మఠం, హోసొలిగమ్మ ఉన్నాయి. కుక్కి ముందుగా శివ క్షేత్రం. శివుడు పరీక్షిత్‌ మహారాజుకి వరమివ్వడంతో సుబ్రహ్మణ్యుడు ఇక్కడ వెలిశాడట. సుబ్రహ్మణ్యుడు, ఆది సుబ్రహ్మణ్యుడుగా పుట్ట రూపంలో ఇక్కడే ఉన్న వేరొక ఆలయంలో కొలువై ఉన్నాడు. భక్తులందరూ తప్పకుండా కుమారధారలో స్నానమాచరించి ఈ రెండు ఆలయాలనూ దర్శించుకుంటారు. కుమారధార అనేక ఔషధమొక్కల గుండా ప్రవహిస్తుంది. కాబట్టి సర్వ శారీరక రోగాలనూ నయంచేయగల శక్తీ, దైవికంగా సర్వపాపాలనూ హరించే శక్తీ ఈ నదికి ఉన్నాయని విశ్వసిస్తారు. త్రేతాయుగంలో పరశురాముడు క్షత్రియ వధ అనంతరం ఆ పాపాలను హరింపజేసుకునేందుకు ఇక్కడి కుమారధారలో స్నానమాచరించాడన్నది స్థల పురాణం. వాసుకి తపస్సు కారణంగా సర్పజాతి, గరుత్మంతుడి నుంచి ఈ కుక్కి క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని చెంత రక్షణ పొందుతుందని ప్రతీతి.

ఇక్కడి ఆలయంవారు నిర్వహించే సర్ప సంస్కార సేవలో వరసగా రెండురోజులు పాల్గొన్నాం. ఈ క్రతువుకి ఓ ప్రత్యేక యాగశాల ఉంది. కుటుంబం నుంచి నలుగురిని పూజకు అనుమతి ఇస్తారు. పూజ రెండోరోజున ప్రధాన ఆలయంలో నాగప్రతిష్ఠ జరగడంతో సర్పసంస్కార పూజ ముగుస్తుంది. పూజలో పాల్గొన్న భక్తులకే కాకుండా కుక్కి వచ్చే మిగిలిన భక్తులందరికీ కూడా రోజూ రెండు పూటలా అన్నదానం జరుగుతుంది. ఈ వారం రోజుల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించామన్న ఆనందంతో వెనుతిరిగాం. అయితే ఆయా క్షేత్రాల్లోని ఆలయాలను పురుషులు తప్పకుండా పంచె, బనీనుతోనే దర్శించాలి. చొక్కా వేసుకోకూడదు. కండువా కప్పుకోవచ్చు. అదే స్త్రీలయితే చీర, లేదా చున్నీ ఉన్న చుడీదార్‌ మాత్రమే వేసుకోవాలి.

లక్షద్వీప్‌






లక్షద్వీప్‌
పేరుకే లక్షద్వీప్‌... ఉన్నది 36 దీవులే!

లక్షద్వీప్‌... ఆ పేరు వినగానే అక్కడ అన్ని దీవులున్నాయేమో అనుకుంటారంతా. కానీ అది కేవలం 36 దీవుల సమాహారం. అరేబియా సముద్రంలో ఆణిముత్యాల్లా మెరిసే ఆ దీవుల్ని చూడాలని బయలుదేరాం. అక్కడ విహరించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. హైదరాబాద్‌ నుంచి కొచ్చీ చేరుకుని ఆ దీవుల్లోని పర్యటకశాఖ నుంచి అనుమతి తీసుకున్నాం. పర్యటక శాఖవారి ఓడలో అయితే భోజన, వసతి సదుపాయాలూ సముద్ర క్రీడలూ అన్నీ వాళ్లే ఏర్పాటుచేస్తారు. నెల రోజుల ముందుగానే యాత్రకు టిక్కెట్లు బుక్‌ చేసుకున్నాం.

అది 150 గదుల ఓడ!
కొచ్చీలో లక్షద్వీప్‌ కేంద్రం దగ్గర ఉదయం 9 గంటలకు ఓడ ఎక్కడానికి అందరం కలిశాం. లగేజీ స్కానింగ్‌ చేశాక చెక్‌ఇన్‌ అయ్యాం. అక్కడే ఓడ బోర్డింగు పాసులు అందజేశారు. పర్యటకులందరికీ కాంప్లిమెంటరీ టీషర్టూ, ఆ దీవుల క్యాలెండరూ, టోపీలూ జ్ఞాపికలుగా ఇచ్చారు. బస్సులో కె.వి. సముద్రం అనే ఓడ దగ్గరకు సరిగ్గా 11 గంటలకు చేరుకున్నాం. మాతోపాటు ఆ దీవుల నివాసితులు కూడా ఆ ఓడ ఎక్కారు. ఐదు అంతస్తులతో 150 గదులతో మొత్తం 750 మంది ప్రయాణించడానికి వీలుగా ఉంది. ఐదో అంతస్తులో మొదటి తరగతి AC గది తీసుకున్నాం. రైల్లోని రెండో AC మాదిరిగానే ఓడలో కూడా కిందొక బెర్తూ పైనొక బెర్తూలాంటి మంచాలు ఉన్నాయి. టేబులూ రెండు కుర్చీలూ లగేజీ పెట్టుకునేందుకు వీలుగా ఓ బీరువా, అటాచ్డ్‌ టాయ్‌లెట్‌ ఉన్నాయి. గది చిన్నగా సౌకర్యంగా ఉంది. కిటికీలోనుంచి చూస్తే కనుచూపుమేరా అనంతసాగరమే. లక్షదీవుల్లో 36 ఉన్నప్పటికీ పది దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. అధికార భాష మలయాళం. అయితే చాలామంది హిందీ మాట్లాడగలరు. మధ్యాహ్నం రెండుగంటలకు భోజనం ముగించుకుని ఓడ చూడ్డానికి బయలుదేరాం. సమాచార కేంద్రం, హాస్పిటల్‌, భోజనశాల, వినోదకార్యక్రమాలు నిర్వహించే హాలు... అన్నీ ఉన్నాయి. కెప్టెన్‌ అనుమతితో ఫ్రంట్‌ ఆపరేషన్‌ రూములో ఓడ వివరాలన్నీ తెలుసుకున్నాం. GPS నావిగేషన్‌, సెక్యూరిటీ, వాతావరణం, సిగ్నల్‌ వ్యవస్థ ఇలా సముద్రప్రయాణానికి అవసరమైనవాటి అన్నింటి గురించీ వివరించారు. మా టూర్‌ మేనేజర్‌ అన్ని అంతస్తుల్లోకి వెళ్లి ఓడలో ఉన్న సదుపాయాలూ భోజనవేళలతోపాటు యాత్ర గురించిన వివరాలు తెలియచేశాడు. సాయంత్రానికి అందరం ఓడ పైనున్న డెక్‌కు చేరుకున్నాం. సాగరతీర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అందరం ఆనందంగా గడిపాం. రాత్రి 8 గంటలకు డైనింగ్‌హాల్‌కు చేరుకుని భోజనం చేసి విశ్రమించాం.

అక్కడ మద్యపానం నిషిద్ధం!
రెండోరోజు వేకువనే సూర్యకిరణాలు క్యాబిన్‌లోకి రావడంతో మెలకువ వచ్చింది. డెక్‌పైకి వెళ్లి సూర్యోదయాన్ని చూస్తే కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. సముద్రాన్ని చీల్చుకుంటూ సూర్యుడు పైకి వస్తున్నాడా అనిపించింది. ఉదయభానుడి కిరణాలతో అలలు వెండి వెలుగులో మెరుస్తున్నాయి. అక్కడక్కడా పైకి ఎగురుతూ మళ్లీ నీళ్లలోకి దూకే టూనా చేపల్ని చూస్తుంటే ఆ కాంతికిరణాల మెరుపుకి ఆనందంతో అవి నృత్యం చేస్తున్నట్లే ఉంది. అల్పాహారం ఓడలోనే ముగించి లైఫ్‌జాకెట్‌లు ధరించి పడవల్లో తీరం చేరుకున్నాం. కనుచూపుమేరలో మినికాయ్‌ దీవి నీలిజలాలతోనూ కొబ్బరితోటలతోనూ ఆకర్షిస్తోంది. కొచ్చి నుంచి ఈ దీవికి సుమారు 400 కిలోమీటర్ల దూరం. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో 20 గంటలపాటు ఓడలో ప్రయాణించి అక్కడకు చేరుకున్నాం.

మినికాయ్‌దీవివాసుల ఆచార వ్యవహారాలూ మిగిలినవారికంటే భిన్నంగా ఉంటాయి. పురుషులు మలయాళీల వస్త్రధారణలోనే ఉన్నారు. స్త్రీలు రంగురంగుల బురఖాలు ధరించారు. ముస్లిం జనాభా ఎక్కువ. తీర ప్రాంతంలో ఉండే తేమ వాతావరణమే అక్కడా ఉంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడు. ఉక్కబోత ఉన్నా చెమట లేదు. ఎండ తీవ్రత మాత్రం తెలుస్తోంది. లక్షదీవుల్లో మద్యపానం నిషేధం. బంగారం అనే ఒక్క దీవిలోనే అనుమతిస్తారు. మేం 1885లో సర్‌ జేమ్స్‌ నికోలస్‌ డగ్లస్‌ నిర్మించిన వైట్‌హౌస్‌ చూడ్డానికి వెళ్లాం. అక్కడ చల్లని తీయని కొబ్బరిబొండాలతో స్వాగతించారు. ఐదు అంతస్తుల ఎత్తున్న లైట్‌హౌస్‌లో వృత్తాకారంలో ఉన్న 400 మెట్లు ఎక్కి పైకి వెళ్లాం. అక్కడ నుంచి చూస్తే ఎక్కడా నేల కనిపించకుండా పైకి లేచిన కొబ్బరితోటలూ అలలు అంతగాలేని గంభీరముద్రలోని నీలిసాగరజలాలూ తీరంవెంబడి చూడచక్కగా కట్టిన రిసార్టులూ ఈతకొలనులతో ప్రకృతి అందాలన్నీ అక్కడే కొలువుదీరాయా అనిపించింది. అన్ని అంతస్తులు ఎక్కిన శ్రమంతా ఎటుపోయిందో తెలియదు. అక్కడ నుంచి అందరం రిసార్టుకి చేరుకున్నాం. అక్కడే పర్యటక శాఖ ఉచితంగా ఏర్పాటుచేసిన వాటర్‌స్పోర్ట్స్‌కు లైఫ్‌జాకెట్‌తో వెళ్లాం. చిన్న పడవలతో స్వయంగా తెడ్డు వేసుకుంటూ కయాకింగ్‌ చేసి ఆనందించాం. ముఖానికి మాస్క్‌ వేసుకుని సముద్రంలోపలున్న జీవుల్ని చూసే స్నోర్కలింగ్‌కి వెళ్లాం. వాటర్‌స్కూటర్‌, బనానా బోట్‌రైడ్‌లకు మాత్రం ఇష్టమైన వాళ్లు టిక్కెట్లు కొనుక్కుని వెళ్లారు. కొంతమంది స్కూబా డైవింగ్‌కి వెళ్లారు. భోజన సమయానికి అందరం తిరిగి రిసార్టుకి చేరుకున్నాం. టూనా చేప వంటకాలతో భోజనం వడ్డించారు.

సాంఘిక జీవనం!
కాసేపు విశ్రాంతి తీసుకున్నాక విలేజ్‌ టూర్‌కి ఆటోల్లో తీసుకెళ్లారు. అక్కడ మహిళలు స్వయంగా తయారుచేసిన కొబ్బరి స్వీటు, మసాలావడ, తేనీటిని అల్పాహారంగా ఇచ్చారు. పక్కనే వాళ్ల ఇళ్లు ఉన్నాయి. మధ్యలో అందరికీ ఉమ్మడిగా ఉన్న వంటగదిలో కొందరు స్త్రీలు సముద్రంమీదకి పనికి వెళ్లిన తమ మగవాళ్లకోసం కొన్ని వంటకాలు చేస్తూ కనిపించారు. పదిమంది స్త్రీలు రోజూ వంతులవారీగా అన్ని రకాల వంటల్నీ కొబ్బరి మట్టల్ని మండించే మట్టిపొయ్యిలమీద చేస్తుంటారట. వాళ్లలా సాంఘిక జీవనం కొనసాగించడం ఎంతో ముచ్చటగొలిపింది. గ్రామంలో జనాభా కేవలం రెండువేలమంది మాత్రమే. సాయంత్రం వరకూ ఆ పచ్చటి చెట్ల మధ్య గడిపి ఓడమీదకి చేరుకున్నాం.

అంతా అక్షరాస్యులే!
మర్నాడు ఉదయం ఆరు గంటలకు కాల్‌పెనీ అనే మరో దీవికి చేరుకున్నాం. అల్పాహారం ఓడలోనే ముగించి ఉత్సాహంతో ఈ దీవిలోకి అడుగుపెట్టాం. ఈ దీవి జనాభా నాలుగు వేలు కాగా అందరూ అక్షరాస్యులే. వాళ్లలో దాదాపు 500 మంది వైద్యులేనట. లక్షదీవుల్లో మెట్రిక్‌ పాసయిన మొదటి మహిళది కూడా ఈ దీవేనట. ఆమెకిప్పుడు 83 సంవత్సరాలు. ఓ గ్రామంలో ఉన్న ఆమెను చూశాం. ఆ దీవిలో దక్షిణంవైపు అలలు సముద్రక్రీడలకు అనుకూలంగా లేకపోవడంతో నార్త్‌ ఎండ్‌ టిప్‌కు తీసుకుని వెళ్లారు. పది నిమిషాల ప్రయాణంలో అటూ ఇటూ కూడా సముద్రం కనిపిస్తూ ఉంది. పచ్చని కొబ్బరి చెట్ల మధ్యలో మునగచెట్లు ఉన్నాయి.

నార్త్‌ ఎండ్‌ టిప్‌కు చేరుకోగానే మూడువైపులా సముద్రం కనిపించింది. అక్కడ అలలు అంత ఉధృతంగా లేవు. మధ్యలో బండరాళ్లూ అడుగున ఇసుకరేణువులు కనిపించేంత తేటగా ఉన్నాయక్కడి జలాలు. కాసేపు అక్కడ గడిపి తిరిగి రిసార్టుకి చేరుకుని సముద్ర క్రీడలకు వెళ్లాం. కాల్‌పెనీలో 1947లో సంభవించిన తీవ్ర తుఫానువల్ల కొంత భూభాగం విడిపోయింది. కాస్త దూరంలో ఉన్న ఆ దీవికి మమ్మల్ని పడవల్లో తీసుకువెళ్లారు. సముద్రంలోపల నాచుమొక్కలూ సీకుకుంబర్‌... వంటి జంతువులూ ఎక్కువగా ఉన్నాయి. ఆ జంతువుల్ని పట్టుకుంటే మెత్తని స్పాంజుల్లా ఉన్నాయి. స్నోర్కలింగ్‌కి వెళ్లినప్పుడు వివిధ ఆకారాల్లో రంగుల్లో ఉన్న కోరల్స్‌ కనిపించాయి. వాటిమధ్యలో అటూఇటూ తిరుగుతోన్న గోల్డ్‌ఫిష్‌లూ చారల చేపలూ స్నేక్‌ ఫిష్‌లూ... ఇలా చాలా రకాలు కనిపించాయి. మధ్యాహ్న భోజనానంతరం గ్రామంలో తిరుగుతూ అక్కడ నివసిస్తోన్న కుటుంబాలతో మాటలు కలిపాం.

అక్కడి ప్రజలు సౌమ్యులూ స్నేహశీలురూ. మా సంభాషణ అంతా హిందీలో సాగింది. అక్కడ ప్రభుత్వం నిర్వహిస్తోన్న కొబ్బరి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను సందర్శించాం. కొబ్బరినూనె, కొబ్బరిపొడి తయారీ చూపించారు. తరవాత మహిళలు స్వయం సహాయక బృందంగా ఏర్పడి తయారుచేస్తోన్న టీషర్టు యూనిట్‌ని కూడా చూశాం. ధర తక్కువగా ఉండటంతో వాటిని కొనుక్కున్నాం. తిరిగి సాయంత్రానికి రిసార్టుకి చేరుకున్నాం. అక్కడ స్థానిక జానపద, సంప్రదాయ నృత్యరీతుల్ని ప్రదర్శించారు. మల్‌ అనే భాషలో వారు పాడుతున్న పాట అర్థం కాకపోయినా వారి లయవిన్యాసాలను చూసి ముగ్ధులమయ్యాం. చేతిలో డప్పులాంటి పరికరంతో శబ్దం చేస్తూ అడుగులు వేసే తీరు ఎంతో బాగుంది. రాత్రికి ఓడకు చేరుకున్నాం.

వందల రకాల చేపలు!
మూడోరోజు ఉదయానికల్లా లక్షద్వీపాల రాజధాని అయిన కవరట్టి అనే దీవికి వెళ్లాం. 11 వేల జనాభా ఉన్న ఆ దీవి అన్నింటికన్నా పెద్ద దీవి కూడా. ఇక్కడ కొన్ని ఇళ్లు అధునాతనంగా ఉన్నాయి. అక్కడ సముద్రం అడుగున ఉన్న జీవరాశుల్ని చూపించడానికి తీసుకెళ్లారు. రంగురంగుల చేపలూ సీఅనీమోన్‌లూ బ్రెయిన్‌ కోరల్సూ ఫింగర్‌ కోరల్సూ లాంటివాటిని చూపించారు. సముద్రం అడుగున ఇంత పెద్ద ప్రపంచం ఉందా అని ఆశ్చర్యం వేసింది. కోరల్స్‌ సేకరించడం నిషిద్ధం. కొందరు స్కూబాడైవింగ్‌ చేస్తే మిగిలిన వాళ్లు తీరందగ్గరే వాటర్‌స్కూటర్‌, నీబోర్డు... తదితర క్రీడలతో కాలం గడిపారు. భోజన సమయానికి అందరం రిసార్టుకి చేరుకున్నాం. కాసేపు విశ్రమించాక మినీ బస్సులో గ్రామ సందర్శనకు వెళ్లాం. రోడ్లన్నీ సిమెంట్‌తో వేసినవే. ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుచేసిన మ్యూజియంలో వందల రకాల చేపల్ని ప్రదర్శనకు ఉంచారు. పక్కనే మరో భవనంలో సొరచేపల ప్రదర్శన కూడా ఏర్పాటుచేశారు. ఆ సాయంత్రం స్థానిక బాలికలతో ఏర్పాటుచేసిన జానపద నృత్య కార్యక్రమం ఎంతో అలరించింది. తేనీటి విందు అయ్యాక తిరిగి ఓడను చేరుకోవడానికి మరపడవల్లో బయలుదేరాం. రాత్రికి డెక్‌పై అందరం ఆనందంగా గడిపి అడ్రస్‌లు తీసుకుని, మర్నాడు ఉదయం 9 గంటలకు కొచ్చీ చేరుకున్నాం.

ప్రపంచంలోనే ధనిక దేశం!


ప్రపంచంలోనే ధనిక దేశం!
 
*ప్రపంచ సంపన్న దేశాల్లో మొదటిది. ఇక్కడ ఒక వ్యక్తి తలసరి ఆదాయం 68 లక్షల రూపాయలకు పైమాటే.
* ఈ దేశం వాస్తవానికి ఆసియా ఖండానికి చెందినదే కానీ ఉన్నదేమో మధ్యప్రాచ్యంలో.
* ఈ దేశం మొత్తం మన త్రిపుర రాష్ట్రం అంత ఉంటుందంతే. దాన్ని 8 మున్సిపాలిటీలుగా, 98 జోన్‌లుగా విభజించారు.

జెండా : జెండాలో కుంకుమ రంగు దేశం కోసం రక్తం చిందించిన అమరుల త్యాగానికి, తెలుపు శాంతికి గుర్తు.
రాజధాని : దోహా

అధికారిక భాష : అరబిక్‌
జనాభా : 22,58,283
విస్తీర్ణం : 11,586 చదరపు కిలోమీటర్లు
కరెన్సీ : ఖతారీ రియాల్‌

* బిరియానీ అంటే ఇక్కడి వారికి ఎంతో ఇష్టం. మధ్యాహ్న భోజనం అనంతరం ‘కరాక్‌ టీ’ తాగడం ఇక్కడి వారందరికీ అలవాటు.

* 89 శాతం మంది అక్షరాస్యులే.
* ద్వీపకల్ప దేశమైన దీనిలో చాలా భాగం ఎడారే. అయితే చమురు, సహజవాయువులు ఎక్కువగా దొరుకుతాయి. ద్రవీకృత పెట్రోలియం వాయువు (ఎల్‌పీజీ)ని అధికంగా ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే దేశమిది.
* దోహా దగ్గర సముద్రంలో ‘దపర్ల్‌’ పేరుతో ఓ కృత్రిమ దీవిని తయారు చేశారు. దానిపై అత్యంత విలాసవంతమైన నివాస సముదాయాల్ని కట్టారు. 12,000 మంది ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు. సముద్రపు అందాల్ని చూస్తూ ఇక్కడున్న షాపింగ్‌ కాంప్లెక్సుల్లో కావల్సిన వాటిని కొనుక్కోవచ్చు.
* 1971లో ఇది UK నుంచి స్వాతంత్య్రం పొందింది.


* ఈ బుల్లి దేశానికి మొత్తం 11,800 మంది సైన్యం ఉన్నారు.
* దోహాలో ఉన్న హామద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాల్లో తొమ్మిదోది.
* శీతకాలంలో ఇక్కడ కనిష్ఠంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత, వేసవి కాలంలో గరిష్ఠంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది.
* ఇక్కడ శుక్రవారం అంతా ప్రార్థనల్లో పాల్గొంటారు. అందుకే మధ్యాహ్నం వరకు దుకాణాలు సైతం తెరవరు.
* ఇక్కడున్న వారిలో 80 శాతం మంది విదేశీయులే. 18 శాతం మంది భారతీయులున్నారు.
* దుస్తుల విషయంలో ఇక్కడ సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తారు. స్త్రీ పురుషులెవరైనా మోకాళ్ల కింద వరకు దుస్తులు ధరించాలి. మహిళలు కచ్చితంగా చేతులు కప్పుకోవాలి.
* రాజధాని నగరంలో ఉన్న తేలియాడే మ్యూజియం ‘మెష్రిబ్‌ ఎన్‌రిచ్‌మెంట్‌ సెంటర్‌’ ఇక్కడ ప్రధాన పర్యటక ఆకర్షణ.

Friday, 27 January 2017

కోనసీమ









కోనసీమ


గోదావరి నదీపాయలైన గౌతమి, వశిష్టల మధ్య ఒకవైపు బంగాళాఖాతంతో ఉన్న డెల్టా ప్రాంతం - కోనసీమ. త్రికోణాకారంలో కోన(కొండ)ని పోలి ఉన్న సీమ(ప్రాంతం) కనుక దీనిని కోనసీమ అంటారట. తూర్పుగోదావరి జిల్లాలో పదహారు మండలాలు కోనసీమలో ఉన్నాయి. అవి అమలాపురం, సఖినేటిపల్లి, రాజోలు, మలికిపురం, పి.గన్నవరం, అంబాజీపేట, మామిడికుదురు, కొత్తపేట, ఆత్రేయపురం, అయినవిల్లి, అల్లవరం, ఉప్పలగుప్తం, రావులపాలెం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాలు.



గోదావరిమీద బ్రిడ్జీలు నిర్మించడానికి పూర్వం కోనసీమనుంచి బయట ప్రదేశానికి రాకపోకలు లాంచీలమీద, పడవలమీద జరిగేది. ఇప్పటికీ లాంచీ ప్రయాణాలు పాతబడిపోలేదు. గోదావరినది దాటుతున్నప్పుడు దూరంగా మధ్య, మధ్యలో కనిపించే లంకల్లాంటి ఇసుకమేటలు, చిన్నచిన్న అలలు లాంచీ అంచులకి తగిలి నప్పుడు మీదపడే నీటి తుంపరలు, చల్లగా వీచే గాలి, లాంచీలో జనాల రణగొణద్వని- పదిహేను, ఇరవై నిమిషాల ప్రయాణం డ్రీం జర్నీలా ఉండేది.

సమృద్ధిగా నీటివనరులు, అత్యంత సారవంతమైన నేలా ఉన్న కారణంగా పంటలు చాలా బాగా పండుతాయి. కనుచూపుమేర విస్తరించిన వరిపొలాలు, కొబ్బరితోటలు, కాలువల్లో నింపాదిగా సాగే పడవలతో కేరళానుంచి ఒకముక్క కత్తిరించి ఆంధ్రాలో అతకించినట్టు ఉంటుంది కోనసీమ. కోనసీమలో రైతే రాజు. పొలానికి నీరు పెట్టుకోవడం, దుక్కిదున్నుకోవడం, విత్తనాలు జల్లుకోవడం, నాట్లువేసుకోవడం, కలుపు తీసుకోవడం, ఎరువులు, పురుగుమందులు జల్లుకోవడం, కోతలు కోసుకోవడం, కుప్పలునూర్చుకోవడం, ధాన్యాన్ని మార్కెట్టుకో, ఇంటికో చేర్చుకోవడం, మళ్ళీ పైర్లు చల్లుకోవడం... ఏడాదంతా పనే! దాళవాలకి నీరు వదలనప్పుడో, తుఫాన్లు కన్నెర్రజేసినప్పుడో, పంటలకి కిట్టుబాటుధర సరిగా లేనప్పుడు తనంతట తాను క్రాపు హాలిడే ప్రకటించుకొన్నప్పుడో తప్పించి రైతుకి శలవు లేదు. ఇక్కడ వరి తరువాత ఎక్కువగా పండించే పంట అరటి. రావులపాలెంలో అరటి మార్కెట్ రాష్ట్రంలోనే ప్రముఖమైన వాటిల్లో ఒకటి. తెలతెల వారుతూ ఉండగా, మంచు తెరలు ఇంకా భూదేవి మేనిపై నుంచి తొలగకముందే సైకిళ్ళమీద రైతులు అరటిగెలలు మార్కెట్లకి తీసుకువెళుతుండడం ఒక మనోహరమైన దృశ్యం.



కోనసీమలో ఎన్నో దేవాలయాలున్నాయి. ర్యాలిలో జగన్మోహినీ కేశవస్వామి, మురమళ్ళలో వీరేశ్వరస్వామి, ముక్తేశ్వరంలో క్షణముక్తేశ్వరస్వామి, అప్పనపల్లిలో వేంకటేశ్వరస్వామి, అంతర్వేదిలో నరసింహస్వామి, అయినవిల్లిలో శ్రీ సిద్దివినాయకస్వామి, మందపల్లిలో శనేశ్వరస్వామి ఇక్కడి కొన్ని ప్రముఖమైన దేవాలయాలు.

`గుళ్ళూ, గోపురాల్లాంటివేనా ఇంకా ఏమైనా ఉన్నాయా?` అంటారా? అన్నీ చెప్పాలంటే ఒక్క టపా సరిపోదు. అలా అని చెప్పకుండా ఉండాలంటే మనసొప్పదు. అందుకే మీకోసం, నాకోసం కొన్ని విశేషాలని ఇక్కడ ఇస్తున్నాను.

అవి ఏమిటంటే.. ఆదుర్రులో బౌద్ద స్థూపం, మలికిపురంలో దిండీ రిసార్ట్స్, ముమ్మిడివరంలో బాలయోగి ఆశ్రమం, అమలాపురంలో కోనసీమకే మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ ఎస్.కే.బీ.ఆర్ కాలేజ్. ఆత్రేయపురం పూతరేకులు, బండారులంక చీరలు, కోనసీమ కొబ్బరికాయలు, ఆప్యాయంగా పలకరించే ప్రజలు ఈ ప్రాంతం ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఎవరో చెప్పినట్టు కోనసీమ అంటే వర్షంలా కురిసిన చిలకాకుపచ్చరంగు కల. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు! కెమేరాని ఎటుతిప్పి తీసినా అందమైన దృశ్యమే వస్తుంది.

ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు జనసామాన్యాన్ని కూడా చూడండి. కలుపుతీసే పల్లె పడుచులు, మైదానంలో మేకలని కాసుకొనే ముసలికాపరి, చెట్లకొమ్మలకి తాడు ఉయ్యాల కట్టి ఊగే చిన్నపిల్లల గుంపు, కాలువలో ప్రపంచాన్ని మరిచి ఈతలుకొట్టే యువకులు, సంధ్యా సమయంలో పడవ తెడ్డుమీద గెడ్డం ఆనించి సూర్యాస్తమయాన్ని చూస్తున్న నావవాడు, ఆవుల మందని ఇంటిదారి పట్టిస్తున్న కుర్రాళ్ళు... ఏదయినా మీ కెమేరా కంటికి అందమైన ఫోటోని ఇవ్వవచ్చు.



ఫేస్‌బుక్‌లో కోనసీమ అనే పేజీని ఇక్కడ చూడండి

ద్వారపూడి దేవాలయాలు









ద్వారపూడి


కాకినాడకి 32 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రీ వైపు వెళ్ళే కెనాల్ రోడ్డు ప్రక్కన ద్వారపూడి ఉంది. ఇక్కడ ఒకే ప్రాంగణంలో సుమారు పది పెద్ద దేవాలయాలు ఉన్నాయి.





పాలరాతితో నాలుగు అంతస్తులుగా నిర్మించిన శివాలయం:
ఇందులో స్తూపాకారంగా క్రిందనుంచి నాలుగవ అంతస్తువరకూ వ్యాపించిన శివలింగం ఉంది. రెండవ, మూడవ అంతస్తులలో ప్రదక్షిణ మార్గం చుట్టూ పురాణగాధలో సన్నివేశాలని తెలియజేసే విగ్రహాలను ఏర్పాటుచేశారు. నాలుగవ అంతస్తులో, శివలింగ శిఖరానికి అబిషేకం చేస్తే, అబిషేక జలం క్రిదకి వచ్చే మార్గంలో ప్రధాన లింగానికి అనుసంధానం చేసిఉన్న 18 చిన్న లింగాలని తాకుతూ క్రిందకి వస్తుంది. ఈ దేవాలయాన్ని అష్ఠాదశ(18) ఉమా సోమేశ్వరదేవాలయం అంటారు.



శివాలయానికి ఎదురుగా నటరాజస్వామి, రెండువైపులా హనుమంతుడు, నందీశ్వరులు తమ తమ హృదయాలలో శ్రీరామ పట్టాభిషేకాన్ని చూపిస్తూ పెద్ద విగ్రహాలు ఉన్నాయి.



(ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉంచడం యొక్క ఉద్దేశ్యం, నందీశ్వరుడి గుండెల్లో సీతారాములు ఎందుకు ఉన్నారో నాకు అర్ధంకాలేదు)


శివాలయం ప్రక్క ప్రవేశద్వారానికి ఎదురుగా మహానంది ఉంది. ఆలయం నాలుగవ అంతస్తు కిటికీ నుంచి కనిపించేలాగ దీనిని నిర్మించారు.



పురాణాలలో నందీశ్వరుడికి సంబంధించిన మూడునాలుగు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ప్రతీశివాలయంలోనూ శివలింగానికి అభిముఖంగా నందిని చూస్తుంటాం. నంది శివుని వాహనంగా మనకి తెలుసు. కానీ లింగపురాణంలో నంది సాక్షాత్తూ శివుని అవతారం అని చెప్పబడింది. శిలాదుడు అనే మహర్షి అమరుడైన(మరణం ఉండబోని చిరంజీవి అయిన) ఒక పుతృనికోసం శివునికి తపస్సుచేస్తాడు. శివుడు అతని తపస్సుకి మెచ్చి తానే అతనికి పుత్రునిగా జన్మిస్తానని వరం ఇచ్చి, అలాగే చేస్తాడు. అంతేకాకుండా కైలాసంలో శివునికి ద్వారపాలకులిగా ఉండే ఇద్దరిలో ఒకరు నంది, రెండవవాడు మహాకాళి. శివుని ప్రమదగణాలకు అధిపతికూడా నందీశ్వరుడే. నందికి దివ్యత్వం, బలం, అధికారమే కాకుండా తెలివి కూడా ఉందని చెప్పే కథ ఏమిటంటే - ఈయన పురాణాలలో చెప్పబడిన ప్రధమగురువులలో ఒకడట. ఈ సారి ఏదైనా శివాలయానికి వెళ్ళినప్పుడు నందిని కేవలం ఒక వాహనంగానే కాకుండా, ఇంకా మిగిలిన అంశాలుకూడా దృష్ఠిలో ఉంచుకొని చూడండి.

భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం:
శివాలయానికి ఎడమవైపు భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం ఉంది. వెండి శివలింగం భారతదేశం మొత్తానికి ఇక్కడే ఉందట. దర్శనానికి ఆడవారు చీరలో, మగవారు పంచలో సాంప్రదాయబద్దంగా వెళ్ళాలి. లేకపోతే అనుమతించరు. బయట మగవాళ్ళకి పంచలు రెండురూపాయలకి అద్దెకి ఇస్తున్నారు. అందరికీ అవే ఇస్తూ ఉంటారు కనుక ఎవరైనా అద్దెకితీసుకొని లోనికి వెళ్ళవచ్చు. ఇక్కడే విష్ణుమూర్తి యొక్క దశావతార దేవాలయం నిర్మాణంలో ఉంది.

అయ్యప్పస్వామి దేవాలయం:
ఈ గుడిని ఆంధ్రా శబరిమల అని అంటారు. అయ్యప్ప మాలదారులు అంతదూరం ప్రయాణించి శబరిమల వెళ్ళలేనప్పుడు ఇక్కడికి వస్తారు. 1989లో అయ్యప్పస్వామి పంచలోహ విగ్రహాన్ని కంచి పీఠాధిపతి స్వామీ జయేంద్ర సరస్వతి వారి చేతులమీదగా ప్రతిష్టించారు. ఒకేరాతి మీద చెక్కిన 18 మెట్లను తమిళనాడు నుంచి తీసుకువచ్చారట. కేరళలోని శబరిమల ఆలయంలో జరిగిన విధంగానే ఇక్కడకూడా సాంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహిస్తారు.

మహిషాసురిడిని దుర్గాదేవి సంహరించిన తరువాత, అతని సోదరి మహిష బ్రహ్మ గురించి తపస్సుచేసి శివుడి చేత కానీ, విష్ణువు చేత గానీ చంపబడకుండా ఉండాలని వరంపొందుతుంది. తరువాత కొంతకాలానికి మోహినీ రూపంలో ఉన్న విష్ణువుని చూసి శివుడు మోహించిన కారణంగా వారికి జన్మించిన పుత్రుడే ధర్మశాస్త అనబడే అయ్యప్ప. మహిషను చంపడానికి పుట్టిన కారణజన్ముడు. అయ్యప్పని హరిహర పుత్రుడు అని కూడా అంటారు. ఈ పురాణ గాధని సూచిస్తూ దేవాలయానికి ముందు ఎత్తైన శివకేశవ విగ్రహం ఉంది.



దుర్గాదేవి ఆలయం:
గుదిలోనికి సింహపు నోటి ప్రవేశ ఆకారపు ద్వారంగుండావెళ్ళాలి. లోపల చిన్న అష్ఠలక్ష్ముల మందిరం, వివేకానంద, వేమన, బ్రహ్మంగారు వంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. మధ్యలో దేవి.

ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. సాయిబాబా మందిరం, నాగదేవత ఆలయం, శనీశ్వరాలయం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం....

శిరిడీ సాయిబాబా ఆలయంలో సాయినాధుని విగ్రహానికి వెనుకవైపు ఒక గర్భ గుడిలాంటి చాంబర్లో పవళించి ఉన్న అనంత పద్మనాభ స్వామి ఇక్కడ ఉన్న అన్నింటిలోనూ నాకు బాగానచ్చింది.

పెద్ద గుడి. చూడటానికి ఎలా లేదన్నా గంట పడుతుంది. ఇక్కడి పరిసరాలు సుచీ శుబ్రతలతో ఉంటే దర్శనం ఒక గొప్ప అనుభూతిని మిగల్చడం ఖాయం. కానీ, ఎవరూ అంత శ్రద్ద తీసుకొంటున్నట్లు కనిపించడం లేదు.

దేవాలయం స్టాల్లో పద్దెనిమిది పిక్చర్ పోస్టుకార్డుల సెట్ పాతికరూపాయలకి అమ్ముతున్నారు. ఈ వాల్ మీద టైటిల్స్ ప్రింట్ చేసి ఉన్న ఫోటోలు అందులోనివే. మిగిలినవి నేను తీసినవి. కెమేరా అనుమతిస్తున్నారు. దానికి టిక్కెట్టు ముప్పై రూపాయలు. కారు పార్కింగి కి ప్రత్యేకమైన స్థలం లేకపొయినా, రోడ్డుప్రక్క నిలుపుకొన్నందుకు దేవాలయం వాళ్ళకి ఇరవై రూపాయలు కట్టాలి. చిల్లర దగ్గర ఉంచుకోండే!



Wednesday, 25 January 2017

శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు


శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు తెలిస్తే...తప్పక దర్శించుకోవాలనుకుంటారు

‘ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి. దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది.’ అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. కైలాసగిరుల ప్రదక్షిణ కోసం ఇటీవల ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి క్షేత్రమహాత్యం గురించి వివరించారు. ఆ విశేషాలివీ...

శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటేనే వాయువు ఉంటుంది. వాయువంతటి గొప్పక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఇంద్రునికే జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత. ఈ క్షేత్రంలో పరమశివుడే కైలాసగిరులుగా వెలిశాడు. దేశంలో చాలా చోట్ల దక్షిణ కాశీలు ఉన్నాయి. అయితే ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే ఉంది. అలాగే దక్షిణ కైలాసం కూడా ఒకే ఒక్కటి ఉంది. అదే శ్రీకాళహస్తి. భూలోకంలో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం మరెక్కడా లేదు. ఇక్కడ ఆలయ శిఖరం దర్శనం చేసుకుంటే కైలాసం చూసినట్లే. భక్తుడికి అగ్రతాంబులం వేసిన క్షేత్రం కూడా ఇదే. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమశివుని ముఖ్య భక్తుడైన భక్తకన్నప్పకు మొదటి పూజ చేస్తారు. దేశంలోనే అన్ని ఆలయాల్లో భక్తులు సవ్యదిశలో ప్రదక్షిణం చేసి స్వామి, అమ్మవారిని దర్శించుకుంటారు.

శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుని, జ్ఞానప్రసూనాంబను దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఇక్కడ రాహు-కేతువులు శాంతిస్తున్నాయి. శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖాన స్వామివారి ఆలయం ఉండటంతో ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి... మొదట పాతాళ వినాయకస్వామిని దర్శించుకున్నాక శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే మంచిది. నక్కీరుడు అనే భక్తుడు కుష్ఠువ్యాధితో బాధపడుతూ చరమాంకంలో శివుని దర్శించుకుని మోక్షం పొందాలని భావించాడు. కైలాసానికి ఎలా చేరుకోవాలో తెలియలేదు. శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్లి శివుని దర్శించుకున్నాక శిఖరదర్శనం చేసుకోవాలని అదృశ్యశక్తి ఉపదేశం చేసింది. అలా దర్శనం చేసుకోవడంతో నక్కీరుని కుష్ఠువ్యాధి నయమైంది. పాతాళ గణపతి ఆలయం వద్ద నాలుగు పర్యాయాలు విఘ్నేశ్వరస్వామిని తలచుకుంటే భక్తులకు మోక్షం లభిస్తుంది.

శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగేశ్వ రుడు నవగ్రహ కవచం ధరించి ఉన్నాడు. ఇలా ధరించడంతో గ్రహాలన్నింటినీ శివుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. శ్రీకాళహస్తిలో కొలువైఉన్న జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి తల ఓ వైపువాల్చి ఉంది. ఇలా ఏ క్షేత్రంలో కూడా లేదు. మృత్యువును జయించిన గురుదక్షిణామూర్తి కూడా ఈ క్షేత్రంలో దక్షిణాది ముఖాన ఉన్నాడు. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఒక క్షణం కళ్లు మూసుకుని ఆయనను స్మరించుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుంది. చిన్నారులకు గురుదక్షిణామూర్తి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచిది. ఒక మాటలో చెప్పాలంటే శ్రీకాళహస్తి క్షేత్రం పరమశివుని ఆవాసం. ఈ క్షేత్రంలో ఉండటం ఎంతో అదృష్టం. శ్రీకాళహస్తిలో అడుగు పెడితే పుణ్యం లభించినట్లే.

Tuesday, 24 January 2017

పాపికొండల యాత్ర రమణీయం

ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదం కలిగించే జల విహారం
పాపికొండల యాత్ర రమణీయం
అడవిలో ప్రకృతి మధ్య జలపాతాల నడుమ విహారం అద్భుతం


ప్రకృతి సంపదకు నెలవు ఆంధ్రప్రదేశ్‌, గలగలపారే గోదావరి, కృష్ణ నదులు, పచ్చని పొలాలు, ఆకుపచ్చని కొండలు విహార పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అరకు, బాపట్ల వద్ద ఉన్న సూర్యలంక బీచ్‌లలో ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను సిద్ధం చేసిన టూరిజం సంస్థ పాపికొండలకు బోట్‌ షికార్‌ నిర్వహిస్తున్నది. రాజమండ్రి లేదా పోలవరం నుంచి గోదావరిలో బోటులో పర్యటిస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ, జల విహారం చేస్తూ జీవితంలో కొత్త అనుభూతులను పొందవచ్చు.

రామాయణం ప్రకారం అయోధ్య రాముడు అరణ్యవాసం సందర్భంగా దండకారణ్యంలో భాగంగా ఉన్న భద్రాచలం ప్రాంతంలో కుటీరం ఏర్పాటు చేసుకుని కొన్ని నెలలు గడిపాడు. సీతారాములు అడుగు పెట్టిన ఆ ప్రాంతమంతా రమణీయమే.

తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి ప్రవహించే ప్రాంతం చక్కటి గృహిణి నుదుటి నుంచి తీసుకున్న పాపిడి మాదిరిగా రెండువైపులా కొండల నడుమ పాపిడిలా గోదావరి సాగుతుంది. అందుకే ఈ కొండలకు పాపి కొండలు అని వ్యవహారంలోకి వచ్చింది.

పాపి కొండలను చూడాలంటే రాజమండ్రి నుంచి బోటుద్వారా వెళ్లవచ్చు. రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలోని పోలవరం నుంచి, అలాగే కూనవరం, శ్రీరామగరి నుంచి బోటులో వెళ్లవచ్చు. శ్రీ రామగిరి భద్రాచలానికి 60 కిలోమీటర్లదూరంలో ఉంది. రాజమండ్రి నుంచి భద్రాచలానికి బోటు సర్వీసు ఉంది. వర్షాకాలం తప్ప అన్న సీజన్లలోనూ బోటు ప్రయాణానికి గోదావరి అనుకూలమే. ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి మే, జూన్‌ నెలల వరకూ పాపికొండలను బోటులో సందర్శించాలనే విహార యాత్రికులు ఇష్టపడతారు.

పాపికొండల సందర్శన
పాపికొండల పర్యటనకు పలు ప్యాకేజీలను టూరిజం శాఖ సిద్ధం చేసింది. రాజమండ్రి నుంచి పాపి కొండలకు ఒకరోజు ప్యాకేజీ కూడా ఉన్నాయి. పట్టిసీమ దేవాలయం, పోలవరం ప్రాజెక్టు, గండి పోచమ్మ దేవాలయం సందర్శన నందీశ్వర దేవాలయం దర్శనం, కొల్లూరు వాగు , పాపి కొండలు, పేరంటాలపల్లి దేవాలయ సందర్శన ఈ పర్యటనలో భాగం. ఉదయం బయలు దేరితే రాత్రి కల్లా తిరిగి రాజమండ్రి చేరవచ్చు.

రాజమండ్రి భద్రాచలం
రాజమండ్రి నుంచి భద్రాచలానికి నది మార్గంలోనూ, రోడ్డు మార్గంలోనూ వెళ్లి ఒకరోజులో తిరిగి రావచ్చు. రాజమండ్రి నుంచి భద్రచలానికి పట్టి సీమ గండి పోచమ్మ దేవాలయం, పాపికొండలు, పేరంటాలమ్మ పల్లి దేవాలయం నుంచి భద్రాచలం వె ళ్లి తిరిగి రావచ్చు. కొల్లూరులో వెదురుతో అల్లిన గుడిసెల్లో రాత్రి పూట ఉండడం ఓ అపూర్వ అనుభూతి. రాజమండ్రి నుంచి కొత్త జంటలు ముఖ్యంగా ఈ ప్యాకేజీ ఇష్టపడతారు. రాజమండ్రి నుంచి బయలుదేరి, పోచమ్మ గుడి, పాపి కొండలు, పేరంటాలపల్లి, మీదుగా కొల్లూరు. కేంప్‌ స్థలానికి చేరుతాం. అక్కడ రాత్రి పూట హాయిగా గడిపి మర్నాడు భద్రాచలానికి తీసుకువెళ్లి దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తారు. రెండు రోజులూ చక్కటి పౌష్టికాహారం, కోరుకున్న వారికి మాంసాహారం లేదా శాకాహారం ఇస్తారు. రాజమండ్రి నుంచి పాపి కొండలకు వెళ్లి శిరివాక వెదురు రిసార్‌‌టలలో రాత్రిళ్లు గడపడం మరో అనుభవం. బోట్‌ మేనేజర్‌, గైడ్‌ లు మీకు తోడుగా ఉంటారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని, దేవీ పట్నంను బోట్‌ ద్వారా సందర్శించవచ్చు. కొరటూరు క్యాంప్‌ సైట్‌లో విడిది కల్పిస్తారు.

మారేడుమిల్లి అడవిలో.. ప్రకృతి రమణయం
ప్రకృతి రమణీయత పూర్తిగా ఆస్వాదించాలంటే మారేడిమిల్లి అడవిలో ఏర్పాటు చేసిన హట్‌ లలో గడపాల్సిందే. యాంత్రిక జీవనంతో విసిగి పోయిన వారికి ఎంతో ఆహ్లాదం కలిగించే యాత్ర ఇది. హానీమూన్‌ జంటలకు, కుటుంబంతో వెళ్లే వారికీ ఇది గొప్పఅనుభూతి. పూర్తిగా అడవిలో ప్రకృతి సిద్ధమైన జలపాతాలను చూస్తూ గంటలకు గంటలు గడిపి వేయవచ్చు.

తూర్పు గోదావరి జిల్లా మారేడు మిల్లి అటవీ రిసార్‌‌ట్స లో చక్కటి అనుభూతిని అందిస్తున్నది అంధ్రప్రదేశ్‌ టూరిజం. అడవిలో పచ్చదనాన్ని చూస్తూ, చక్కగా ఏర్పాటు చేసిన మార్గంలో నడుస్తూ గడపవచ్చు. జింకలు, అడవి దున్నలు, నెమళ్లు ఈ ప్రాంతంలో విహరిస్తూ ఉంటాయి. ఆ ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలో జలతరంగిణి జలపాతం, 20 కిలోమీటర్ల దూరంలో స్వర్ణధార జలపాతాలు ఉన్నాయి. పెద్ద పెద్ద మామిడి చెట్ల మధ్య 50 అడుగుల ఎత్తు ఉన్న చెట్ల మధ్య ప్రయాణిస్తూ, ఎగసిపడే జలపాతాలను చూడడానికి రెండు కన్నులు చాలవు. మారేడు మిల్లీ నుంచి 36 కిలోమీటర్ల దూరంలోని రంప జలపాతాన్ని కూడా సందర్శించవచ్చు. ఇక రంపచోడవరానికి వెల్లాలంటే రాజమండ్రి వైపు 26 కిలోమీటర్లు ప్రయాణించాలి. రంపచోడవరం నుంచి జీపులో రంప జలపాతాలవద్దకు వెళ్లవచ్చు. సమీపంలోనే నందనవనం, కార్తీక వనం, వాలి సుగ్రీవ ఔషధ మొక్కల పెంపక కేంద్రం, మంండనికుంజ్‌ - విహారస్థల్‌ కూడా వెళ్లవచ్చు. వలమూరు నది పక్కనే అడవులో రిసార్‌‌ట్స ఉంటాయి. జీపులో ప్రయాణిస్తే ఆ ప్రాంతాలను చేరవచ్చు. ఈ యాత్రలో భాగంగా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, తాటికొండ వెంకటేశ్వరస్వామి దేవాలయం, జలపాతాలవద్ద గడపవచ్చు. ఉదయం రాజమండ్రిలో బయలుదేరితే రాత్రికి మళ్లీ రాజమండ్రికి రావచ్చు.

పచ్చదనాల ప్రత్యేకం కోనసీమ పర్యటన
ఆంధ్రప్రదేశ్‌ టూరిజం కోనసీమ స్పెషల్‌ టూర్‌ పర్యటనకు అవకాశం కల్పిస్తున్నది. ద్వారపూడి శ్రీ అయ్యప్పస్వామి దేవాలయం, బిక్కవోలు శ్రీ సిద్ధి వినాయక దేవాలయం, సామర్లకోట కుమార భీమేశ్వర దేవాలయం, ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం, కోటిపల్లి శ్రీ సోమేశ్వరస్వామి దేవాలయం దర్శింపజేసే కోనసీమ టూర్‌ ఎందరో భక్తులను ఆకట్టుకుంటున్నది. అలాగే వాడపల్లి, ర్యాలీ, అతర్వేది, దిండి రిసార్‌‌ట్స కు మరో ప్యాకేజీ, వాడపల్లి, ర్యాలీ, భీమవరం, పాలకొల్లు, పెనుగొండకు మరో ప్యాకేజీ ఉన్నాయి. భద్రాచలం నుంచి పాపికొండలు, పర్ణశాల, ద్వారక తిరుమలకు, భద్రాచలం నుం కొల్లూరుకు శిరివంక బాంబూ రిసార్‌‌ట్స కు ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి.

Monday, 23 January 2017

2017 చూడాలని ఉంది

ఎన్ని చూసినా ఇంకా చూడవలసినవి, ఎంత చెప్పినా ఇంకా తెలియాల్సినవి మన దేశంలో ఎన్నో అద్భుత ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో నాటి రాజులు కట్టించినవి కొన్నయితే, ఆధ్యాత్మికతకు దారులు చూపేవి మరికొన్ని. ప్రకృతి ప్రేమికుల దాహార్తిని తీర్చేవి ఇంకొన్ని. 2017లో ఈ అద్భుతమైన 17 ప్రదేశాల గురించి తెలుసుకుంటే ‘చూడాలని ఉంది’ అనకుండా ఉండలేరు.

  • 1 ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రముఖమైనది వెయ్యేళ్లనాటి కేదార్‌నాథ్‌ మందిరం. పాండవులు నిర్మించిన ఈ ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించిడినట్టు కథనాలున్నాయి. కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవులు శివుని కోపం తపస్సు చేసి, ఇక్కడ కొలువుదీరమని కోరినట్టు కథనాలున్నాయి. కేదార్‌నాథ్‌ను దర్శిస్తే జన్మచక్రంలో బంధీలుకారని, మోక్షప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. మందిరంతో పాటు హిమాలయా ల్లోని గర్హాల్‌ వద్ద మందాకిని నది సోయగాలను చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఈ ప్రాంతాన్ని పరమేశ్వరుడు రక్షిస్తున్నట్టు చెబుతారు. మంచు కొండలలో కొలువుదీరిన కేదార్‌నాథ్‌ చార్‌ధామ్‌ యాత్రలలో రారాజు. సత్యయుగానికి చెందిన ఈ దేవాలయం గురించే కాదు, ఈ ప్రాంతం గురించి ఎన్నో కథనాలున్నాయి.
    కేదార్‌నాథ్‌ చేరుకోవాలంటే..
    విమానమార్గంలో డెహ్రడూన్‌ (ఉత్తరాఖండ్‌) ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలి. అక్కడనుంచి బదరినా«ద్‌∙315, కేదార్‌నాథ్‌ 240, గంగోత్రి 298, యమునోత్రి 177 కిలోమీటర్లు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు విమాన సదుపాయాలున్నాయి. రైల్వేస్టేషన్‌ రిషీకేష్‌లో ఉంది. ఇక్కడ నుంచే బదరినాథ్, కేదార్‌నాథ్, గంగోంత్రి, యమునోత్రిలకు హరిద్వార్‌ మీదుగా చేరుకోవాలి. హరిద్వార్‌కు అన్ని నగరాల నుంచి రైలుమార్గాలున్నాయి. రిషికేష్‌ నుంచి కేదార్‌నాథ్‌ మీదుగా రుద్రప్రయాగ చేరుకోవచ్చు. ఆకర్షణీయ ప్రదేశాలు: బదరినాథ్‌తో పాటు సూర్యకుండ్, నీల్‌కం, సతోపంత్‌ సరస్సు సందర్శనీయ స్థలాలు. మరిన్ని వివరాలకు: http://uttarakhandtourism.gov.in// లాగిన్‌ అయి తెలుసుకోవచ్చు.

  • మనోహరమైన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలకు ఆలవాలం అల్వార్‌. రాజస్థాన్‌లో గల ఈ ప్రాంతానికి  ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 163 కిలోమీటర్లు. అల్వార్‌కు సమీప పట్టణాల నుంచి బస్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రైలుమార్గం గుండా అల్వార్‌ వెళ్ళే పర్యటన జీవితాంతం మరిచిపోలేనిదిగా ఉంటుంది. సరిస్కా టైగర్‌ రిజర్వ్‌లో హోటల్‌ సదుపాయాలున్నాయి. ఇక్కడి అడవిలో బస ఓ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. రాజస్థాన్‌ ప్రాంతీయ వంటకాలను ఇక్కడ రుచి చూడవచ్చు. ఢిల్లీ వాసులకు ఇది వీకెండ్‌ స్పాట్‌ అని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిపి వినోద విహారానికి ‘సరిస్కా’ ఒక అద్భుతమైన ప్లేస్‌ అని చెప్పవచ్చు. ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్లు, జైపూర్‌ నుంచి 107 కిలోమీటర్లు. 1955లో అభయారణ్యంగా ప్రకటించిన ప్రభుత్వం 1979లో నేషనల్‌ పార్క్‌గా ప్రకటించింది.
    http://rtdc.tourism.rajasthan.gov.in


  • 3 ఏడవ మనువు ఈ ప్రాంతాన్ని సృష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అతని పేరు మీదుగానే మనాలీ వచ్చిందని ప్రతీతి. ఎల్తైన పర్వత ప్రాంతాలు వాటి మీదుగా పచ్చని వనాలు, చల్లటి మలయమారుతం, పువ్వుల సోయగాలు ఎంతసేపయినా అలసటేరాని ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది మనాలీ అని చెప్పుకోవచ్చు. భుంటార్‌లో విమానాశ్రయం నుంచి మనాలి 50 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ– షిమ్లా నుంచి మనాలీ చేరుకోవచ్చు.  చలికాలంలో గడ్డకట్టపోయేట్టుగా ఉండే ఇక్కడి వాతావరణం వేసవికి అనుకూలంగా ఉంటుంది.
    ఆకర్షణీయ ప్రదేశాలు: అత్యంత నిర్మాణ కౌశలంతో ఆకట్టుకునే హిడింబా, మనై దేవాలయాలు. అలాగే వశిష్ట మహర్షి ప్రాచీన ఆలయం. టిబెటన్‌ల ఆశ్రమాలు, శివ, గాయత్రి, అర్జున ప్రాచీన మందిరాలను సందర్శించవచ్చు. సైట్‌ సీయింగ్‌ టూర్స్‌కి హిమాచల్‌ ప్రదేశ్‌ టూరిజమ్‌ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. వివరాలకు ఉఝ్చజీ Email: manali@hptdc.in

  • 4 ఆరావళి పర్వతప్రాంతంలో ఉన్న ఉదయపూర్‌ (రాజస్థాన్‌)కు దేశంలో అత్యంత రొమాంటిక్‌ పట్టణాలలో ఒకటిగా పేరుంది. చుట్టూ నాలుగు సరస్సులతో అలరారుతున్న ఈ పట్టణం ఎన్నో విశేషాలకు నెలవు. ‘జెవెల్‌ ఆఫ్‌ మేవార్‌’, ‘వెనీస్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అనే పేర్లు దీనికి సొంతం. అద్భుతమైన సరస్సులు ఉండటం ఒక విశేషమైన అత్యద్భుతమైన చారిత్రక సౌరభాలు ఉండటం మరో విశేషం. మొఘలుల కోటలు, ప్యాలెస్‌లు, దేవాలయాలు, హిల్స్‌ ఈప్రాంత సొంతం. ఉదయపూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది నధ్వారా దేవాలయం. పిచోలా సరస్సు చుట్టూ స్నాన ఘట్టాలు, దేవాలయాలు, ప్యాలెస్‌లు ఉండటంతో ఇది కమలంలా భాసిల్లుతుంది. ఫతేసాగర్‌ లేక్, ఉదయ్‌సాగర్‌ లేక్, జైస్మండ్‌ లేక్‌లు ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ప్రాచీన ఉద్యానవనం సహేలియో కి బరి ఫతేసాగర్‌ సరస్సు ప్రాంతంలో ఉంది. ఇక్కడ శిల్ప్‌గ్రామ్‌ కళాకృతులకు నెలవు. ఇక్కడ ఉన్న 26 ఇండ్లు అత్యంత సంప్రదాయ నిర్మాణ కౌశలంతో భాసిల్లుతాయి. ఇది ఈ ప్రాంతానికే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
    http://rtdc.tourism.rajasthan.gov.in/

  • 5 ప్రకృతి ప్రేమికులను అయస్కాంతంలా ఆకర్షించే శక్తి నుబ్రావ్యాలీ సొంతం. మాటల్లో చెప్పలేని ప్రకృతి అందాలను ఇక్కడ వీక్షించవచ్చు. సమీప ఎయిర్‌పోర్ట్‌ లేహ్‌లో ఉంది. ఇక్కడి ‘కౌశక్‌ బకులా రిన్‌పోచే’ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నుబ్రావ్యాలీకి 120 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి జీప్‌లో వ్యాలీకి వెళ్లేమార్గం అత్యద్భుతంగా ఉంటుంది. రైలుమార్గంలో వెళ్లాలంటే జమ్మూలోని ‘టవి’కి వెళ్లాలి. ఇక్కడ నుంచి నుబ్రా 620 కిలోమీటర్లు.

    నుబ్రావ్యాలీ మంచు ప్రదేశం. బస్సు సదుపాయాలు తక్కువ. జీపుల్లోనే ఈ వ్యాలీలో ప్రయాణించాల్సి ఉంటుంది. ట్రక్స్, మిలటరీ వాహనాల వల్ల బస్సులు చాలా చోట్ల ఆగిపోయే అవకాశం ఉంది.నుబ్రావ్యాలీ చేరుకున్న పర్యాటకులు ఖర్దుంగా వద్ద మిలిటరీ పాసులు తీసుకొని, ఫొటోల కోసం అనుమతి పొందాలి. ఈ ప్రాంతంలో కాశ్మీర్‌ శాలువాలు, బాదంపప్పులు, ఆప్రికాట్‌లను కొనుగోలు చేయవచ్చు. కుంకుమపువ్వు తోటల పెంపకాన్ని దగ్గరగా పరిశీలించవచ్చు.

    32 మీటర్ల పొడవున్న మైత్రేయ బుద్ధను ఇక్కడ వీక్షించవచ్చు. దలైలామా ఈ ప్రాంతాన్ని సందర్శించడంతో ప్రపంచశాంతి ప్రదేశంగా పేరొచ్చింది. ఒంటెల మీద సవారీ ఈ ప్రాంత ప్రత్యేకత. ఒంటెలు ఎడారులలో కదా నడిచేది అనే అనుమానం కలగవచ్చు. కానీ, ఇక్కడ దానికి విరుద్ధంగా సిల్క్‌ రూట్‌లో ఒంటెల మీద ప్రయాణం అత్యద్భుతంగా ఉంటుంది. లేహ్‌కి 140 కిలోమీటర్ల దూరంలో పనామిక్‌ గ్రామం ఓవర్‌వ్యూ అత్యద్భుతంగా ఉంటుంది.

  • గుజరాత్‌లో సోలంకియుల కాలాన్ని స్వర్ణయుగంగా చెప్ప వచ్చు. వీరి కాలంలో రూపుదిద్దుకున్న అనేక కట్టడాలు గుజరాత్‌ లోని మొధెరాలో సందర్శించవచ్చు. పుష్పవతి నది బ్యాక్‌డ్రాప్‌లో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల టెర్రా–ఫార్మడ్‌ గార్డెన్‌లో నింగిని తాకుతున్నట్టుగా ఉండే వృక్షాలను వీక్షించవచ్చు. ఇక్కడి సన్‌ టెంపుల్‌ తప్పక సందర్శించదగినది. మొ««ధెరాలో చక్రవర్తుల కథనాలెన్నింటినో తెలుసుకోవచ్చు. విశాలమైదానాలు, స్వాగతం పలికే దేవాలయ కాంప్లెక్స్‌ చెప్పుకో దగినవి. పురాణాలలో ఈ ప్రాంతం పేరు ‘మొధెరక్‌’ అని ఉంది. అంటే మర ణించిన పుట్టలు అని అర్థం. జైనుల అచ్చుప్రతులు, బ్రహ్మపురాణం, స్కందపురాణాలు ఈ ప్రాంతంలోనే పుట్టాయి. ధర్మవన్యక్షేత్ర అనే పేరు కూడా ఈ ప్రాంతానికి ఉంది. మొధెరా సన్‌ టెంపుల్‌ నాటి నిర్మాణ చాతుర్యాన్ని కళ్లకు కడుతుంది. కమలంలా ఉండే ఈ టెంపుల్‌ శిఖరభాగం ఇక్కడి నీటిలో అద్దంలో చూసినట్టు దర్శించవచ్చు. ద్వారం గుండా బయల్దేరితే సభామండపం, అంతరల్, గర్భగృహాలను చేరుకుంటాం.

    ఈ ప్రాంతానికి అన్ని ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు మార్గం గుండా చేరుకోవచ్చు. అహ్మదాబాద్‌లో ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్‌లు ఉన్నాయి. అహ్మదాబాద్‌ నుంచి మొధెరాకు 101 కిలోమీటర్లు. సమీప రైల్వేస్టేషన్‌ మెహసనాలో ఉంది.  Mail: info@gujarattourism.com

  • ఇది దేశంలోనే అతి పెద్ద జైన్‌ టెంపుల్‌. భావనగర్‌కు (గుజరాత్‌) 51 కిలోమీటర్ల దూరంలో ఉంది పలిటన. ఇది 863 దేవాలయాల సముదాయం. శత్రుంజయ హిల్‌పైన పలిటన దేవాలయం కొలువుదీరి ఉంది. మొత్తం 3950 మెట్లు 3.5 కిలోమీటర్లు అధిరోహిస్తే ఈ మందిరాలను చేరుకోవచ్చు. క్రీ.శ. 900 ఏళ్ల కాలంలో రెండుదశలుగా నిర్మించారు. 16వ శతాబ్దిలో ఈ దేవాలయ నిర్మాణ పునరుద్ధరణ చేపట్టారు.
    రోడ్డుమార్గం గుండా భావనగర్‌కి చేరుకోవాలంటే ముంబై వయా అహ్మదాబాద్‌ వెళ్లే జాతీయరహదారి మీదుగా 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. అహ్మదాబాద్‌లో రైల్వేస్టేషన్‌ ఉంది. ముంబై, అహ్మదాబాద్‌ల నుంచి భావనగర్‌కు డొమెస్టిక్‌ ఎయిర్‌లైన్స్‌ అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు: టూరిస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోకు 9493350099 ఫోన్‌ చేసి కనుక్కోవచ్చు. E-mail: tibhyderabad@gujarattourism.com

  • 8 స్నేహ బృందంతో కలిసి ట్రెక్కింగ్‌ వెళ్లాలంటే మధేఘాట్‌ సరైన ప్లేస్‌. పశ్చిమపూణె (మహారాష్ట్ర) రాయగడ్‌ జిల్లా సరిహద్దు నుంచి 62 కిలోమీటర్ల దూరంలో ఉంది మధేఘాట్‌. భటఘర్‌ డ్యామ్‌ బ్యాక్‌ వాటర్‌ సమీపంలో టోర్నా కోట, రాజ్‌గడ్, రాయ్‌గడ్‌ కోటలు ఉన్నాయి. సముద్రమట్టం నుంచి 850 మీటర్ల ఎత్తున టోర్నఫోర్ట్‌ ఉంటుంది. రాయగడ్‌ ఫోర్ట్, లింగాన, వరంధా ఘాట్, శివథార్‌ ఘాట్‌ ఉన్నాయి. అత్యంత చల్లగా ఉండే హిల్‌ స్టేషన్‌ ఇది. ఇక్కడ గల లింగన ఫోర్ట్‌ను ఛత్రపతి శివాజీ ఉపయోగించారు. నాటి గుర్తులను ఇక్కడ వీక్షించవచ్చు. బిర్వాడి నుంచి మధేఘాట్‌కు నడకదారి గుండా చేరుకోవచ్చు. మధేఘాట్‌ కింద చిన్న శివ మందిరం ఉంటుంది. ఈ స్వామిని‘దేవ్‌ టేక్‌’ అంటారు. ట్రెక్కర్స్‌కి ఇది మంచి ట్రెక్కింగ్‌ స్పాట్‌. వీటితోపాటు కెంజాల్‌గడ్, రాయిరేశ్వర్, రాయ్‌గడ్, లింగన ఫోర్ట్, శివతార్‌ ఘల్‌ కి మహాబలేశ్వర్‌ రోడ్‌ మీదుగా వెళితే ముంబయ్‌–గోవా హైవే మీదుగా బిర్వాడి చేరుకోవచ్చు.

  • పశ్చిమ బెంగాల్‌లో టెర్రకోట టెంపుల్స్‌ సముదాయాలు ఎక్కువ. వీటిలో బిష్ణుపూర్‌ ఆలయంలో ప్రఖ్యాతిగాంచినది. గుప్తుల కాలంలో నిర్మించిన ఈ టెర్రకోట మందిరాలు అలనాటి సాంస్కృతిక కళావైభవంతో అలరారు తున్నాయి. బిష్ణుపూర్‌ టెంపుల్‌ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరింది. ఈ ప్రాంతం కళల కాణాచి, విశ్వవిద్యాలయాలకు, ప్రాచీన సాంస్కృతిక  విద్యాలయాలకు పెట్టింది పేరు.

    బిష్ణుపూర్‌ నుంచి అరమ్‌బాగ్, దుర్గాపూర్, అసన్‌సోల్, కోల్‌కత్తాకు రోడ్డుమార్గాలున్నాయి. బిష్ణుపూర్‌కు కలకత్తా నుంచి రైలు సదుపాయాలున్నాయి. బిష్ణుపూర్‌ మందిరానికి చేరుకోవాలంటే పట్నం నుంచి ఆటో–రిక్షాలలో బయల్దేరవచ్చు. కాలుష్యరహితంగా ఉంచాలనే ధ్యేయంతో ఇక్కడకు మోటార్‌వాహనాలను అనుమతించడం లేదు. సమీప ఎయిర్‌పోర్ట్‌ కోల్‌కతా. ఇక్కడ నుంచి బిష్ణుపుర్‌ 140 కిలోమీటర్లు. ఆకర్షణీయప్రదేశాలు:  రస్‌మంచా, పంచరత్న టెంపుల్, పతార్‌ దర్వాజ, గడ్‌ దర్వాజ, దాల్‌మండల్‌ కమాన్, స్టోన్‌ చారియట్, నూతన్‌ మహల్, చిన్నమస్త టెంపుల్‌.

  • 10 మధ్యప్రదేశ్‌లోని ఓర్చా కట్టడాన్ని బుందేల్‌ ఛీఫ్తాన్‌ రుద్రప్రతాప్‌ నిర్మించారు. గుప్తుల కాలానికి చెందిన ఈ కట్టడం పురాతత్వ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అక్టోబర్, మార్చిలలో సందర్శించదగినదిగా పేరొందిన ఈ ప్రాంతానికి సమీప ఎయిర్‌పోర్ట్‌ ఖజురహో. రైల్వేస్టేషన్‌ ఝాన్సీలో ఉంది. ఓర్చాకు ఇది 19 కిలోమీటర్లు. ఝాన్సీ–ఖజరహోకు రోడ్డు మార్గం ఉంది. గ్వాలియర్‌కు 120 కిలోమీటర్లు, ఖజరహోకు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. జహంగీర్‌ మహల్, రాయ్‌ప్రవీణ్‌మహల్, రాజ్‌మహల్, చతుర్భుజి టెంపుల్, లక్ష్మీనారాయణ టెంపుల్, జానకి, హనుమాన్‌ మందిర్, షాహిద్‌స్మారక్‌ ప్రదేశాలు సందర్శించదగినవి. ఇక్కడ నుంచి 139 కిలోమీటర్ల దూరంలో డియోగడ్‌ ఉంది.
    www.mptourism.com-----

  • 11 తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లాలో ఉంది ఎమరాల్డ్‌ లేక్‌. ఊటీ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ సరస్సులో విభిన్నరకాల చేపలు ఆకట్టుకోగా, చుట్టుపక్కల పక్షుల సందడి మనల్ని మరోలోకంలో విహరింపజేసేలా చేస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ఉషోదయ, సూర్యస్తమయాలు అందమైన పెయింటింగ్‌లా దర్శనమిస్తాయి. చుట్టుపక్కల తేయాకు తోటలు, వాటిమీదగా పరమళించే తేనీటి ఘుమఘుమలు, టీ పరిశ్రమలు ఈ ప్రాంతానికి ప్రత్యేకం.  కోయంబత్తూర్‌కి హైదరాబాద్‌ నుంచి నేరుగా విమాన సదుపాయాలున్నాయి. సమీప రైల్వేస్టేషన్‌ కోయంబత్తూరులో ఉంది. కోయంబత్తూర్‌ నుంచి ఎమరాల్డ్‌ లేక్‌కి ట్యాక్సీ కారులో, బస్సులలో బయల్దేరవచ్చు.  ఆకర్షణీయ ప్రదేశాలు: బొటానికల్‌ గార్డెన్, ఊటీ, రోజ్‌ గార్డెన్, లేక్‌ పార్ట్, ఊటీ లేక్, డీర్‌ పార్క్‌.

  • 12 దేవుడి సృష్టిగా అభివర్ణించే ఈ ప్రాంతంలో అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గ్యాంగ్‌టక్‌. సిక్కిమ్‌ వాసులు ఇక్కడ ‘పాంగ్‌ లహ్‌బ్సోల్‌’ పండగ ప్రతి యేటా అత్యంత ఘనంగా జరుపుతారు. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై గడ్డకట్టే చలి ఉంటుంది. మే నుంచి సెప్టెంబర్‌ వరకు వేసవి. జూన్, జూలై, ఆగస్టు నెలలు వర్షాకాలం. సిక్కిమ్‌లో బాగ్దోగ్రా ఎయిర్‌పోర్ట్‌ ఉంది. గ్యాంగ్‌టక్‌కి 124 కిలోమీటర్లు. సిక్కిమ్‌ టూరిజమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ హెలీకాప్టర్‌ సర్వీసులను నడుపుతోంది. ఇక్కడ నుంచి గ్యాంగ్‌టక్‌కి 20 నిమిషాలలో చేరుకోవచ్చు. జల్‌పైగురి, సిల్‌గురిలలో రెండు రైల్లే స్టేషన్లు ఉన్నాయి. బాగ్దోగ్రా, డార్జిలింగ్, పెమయంగ్‌స్టే, ట్సూంగో, యమ్‌తంగ్‌లకు గ్యాంగ్‌టక్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రాంతాలన్నీ 20 నుంచి 120 కిలోమీటర్ల లోపు పరిధిలో ఉన్నాయి. గ్యాంగ్‌టక్‌లో మార్చ్‌ నుంచి మే వరకు సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ వరకు బడ్జెట్‌ హోటల్స్‌ సదుపాయాలను పొందవచ్చు.
    మరిన్ని వివరాలకోసం... http://www.sikkimtourism.gov.in లాగిన్‌ అవ్వచ్చు.

  • 13 ఇలా తలం పై దేవుడి స్వర్గం ఏదైనా ఉందంటే అది కేరళ. నీలగిరి పర్వత శ్రేణులలో కొలువుదీరిన ఈ పర్యాటక ప్రాతం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన నీళ్లు, ఆకట్టుకునే విశాల అటవీ ప్రాంతాలు... కేరళను ఒక్కసారైనా సందర్శించాల్సిందే అనుకోకుండా ఉండరు పర్యాటకులు. కేరళ ఆయుర్వేద చికిత్సలకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. ఈ పర్వత శ్రేణులలో 19వ శతాబ్దిలో తేయాకుతోటల పెంపకం విరివిగా చేపట్టారు. ఎర్వికులమ్‌ నేషనల్‌ పార్క్‌ లక్కమ్‌ జలపాతాలు, 2,695 మీటర్ల ఎత్తులో ఉండే అనముడి శిఖరం ఇక్కడ తప్పక దర్శించాల్సినవి.

    కొచ్చిలో అంతర్జాతీయ విమానాశ్రమం ఉంది. ఇక్కడనుంచి 130 కిలోమీటర్లు మున్నార్‌. హైదరాబాద్‌ నుంచి కొచ్చికి విమానాలున్నాయి. కొచ్చిలో రైల్వేస్టేషన్‌ ఉంది. హైదరాబాద్‌ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో కొచ్చికి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి క్యాబ్స్, బస్సులలో మున్నార్‌ చేరుకోవచ్చు. ఆకర్షణీయ ప్రదేశాలు:  పోతమేడు, దేవికులమ్, పల్లివాసల్, అట్టుకల్, న్యాయమకడ్, చిత్తిరపురం, లోకల్‌ హార్ట్‌ గ్యాప్, రాజమల. ఇవన్నీ 15 కిలోమీటర్లలోపు పరిధిలో ఉన్నాయి.

















శిర్ఖండాదేవి - చంద్రవదనాదేవి






మంచు కొండల్లో మహాదేవి దర్శనం

హిమాలయ పర్వతాలు మహాదేవుడికే కాదు, మహాదేవికీ నిలయాలే అనడానికి నిదర్శనంగా నిలుస్తాయి ఉత్తరాఖండ్‌లోని శివాలిక్‌ శ్రేణుల్లోని శిర్ఖండాదేవి, చంద్రవదనాదేవి శక్తిపీఠాలు. అంటూ ఆ విశేషాలు చెప్పుకొస్తున్నారు పుణెకు చెందిన కర్రా నాగలక్ష్మి.

శిర్ఖండాదేవి

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో డెహ్రాడూన్‌ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ వేసవి విడిది మసూరీ రోప్‌వేలూ జలపాతాలూ బౌద్ధారామాలూ మాల్‌ రోడ్డూ మేఘాలను తాకుతున్నట్లుండే పర్వతాలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే వాటితోపాటు దాని చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు ఇంకేం ఉన్నాయా అని స్థానికుల్ని ఆరాతీయడంతో తెలిసినవే ఎన్నడూ వినని ఈ రెండు శక్తిపీఠాలు. ముందుగా శిర్ఖండాదేవిని దర్శించుకుందామని బయలుదేరాం. మసూరీకి 34 కిలోమీటర్ల దూరంలో ధనౌల్టీకి సమీపంలో సముద్రమట్టానికి సుమారు 2760 మీటర్ల ఎత్తులో ఉంది శిర్ఖండాదేవి ఆలయం. మసూరీ నుంచి అంతా ఘాట్‌ రోడ్డు ప్రయాణమే. చుట్టూ పైన్‌ చెట్లతో కూడిన దట్టమైన అడవి మధ్యలో మా ప్రయాణం సాగింది. రోడ్డు పక్క అక్కడో ఇల్లూ ఇక్కడో ఇల్లూ తప్ప మరేమీ లేవు. కద్దుఖల్‌ అనే గ్రామంలో ఓ చోట రెండు పాకలు వేసి ఉన్నాయి. నాలుగు గుర్రాలు కూడా ఉన్నాయి. కానీ మేం ఈ గ్రామం నుంచి నడిచి వెళ్లాలనుకున్నాం. అయితే చలి బాగా ఉండటంతో అక్కడి పాకలో వేడివేడి టీ తాగి నడక ప్రారంభించాం. మూడు కిలోమీటర్లు నడవడానికి మాకు గంటన్నర సమయం పట్టింది. అక్కడ దారి మెట్లు మెట్లుగా జారుడుగా ఉంది. కొన్ని మెట్ల తరవాత వంకలు తిరిగిన సన్నని కాలి బాట మొదలైంది. ఆ తరవాత దారి నిట్టనిలువుగా పైకి ఎక్కేలా ఉంది. చుట్టూ ఉన్న ప్రకృతి సోయగం ఆయాసాన్ని మరిపించినా అంత చలిలోనూ మాకు చెమటలు పట్టాయి. ఎట్టకేలకు మందిరం ప్రాంగణంలోకి అడుగుపెట్టాం. అక్కడ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన బోర్డు మీద మందిరం స్థలపురాణం వివరంగా రాసి ఉంది. వెళ్లగానే ముందు మందిరంలోకి వెళ్లాం. అది చాలా చిన్నగా ఉంది. అమ్మవారి విగ్రహం కూడా చాలా చిన్నది. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోగానే అక్కడేదో శక్తి ఉన్నట్లే అనిపించింది. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి మృతదేహంతో ఆ పరమశివుడు చేసిన రుద్రతాండవం కారణంగా ఆమె శిరస్సు శరీరం నుంచి వేరయి ఈ పర్వత శిఖరాల మీద పడిందట. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాల్నే శక్తిపీఠాలుగా పిలుస్తారు. అలా ఆమె శిరస్సు పడటం ద్వారా వెలసినదే ఈ శిర్ఖండా దేవి. ఇక్కడ దేవీ నవరాత్రులూ గంగా నవరాత్రులూ నిర్వహిస్తారు. ఆ సమయంలో చుట్టుపక్కల ప్రదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. మిగిలిన సమయాల్లో పెద్దగా ఉండరు. మేం వెళ్లినప్పుడు ఆ మందిరంలో ఇంకెవ్వరూ లేరు. అందుకే అక్కడ చాలాసేపు కూర్చుని స్తోత్రాలు చదువుకుని తిరుగుప్రయాణమయ్యాం.

చంద్రవదనాదేవి!
ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా మంచుపడుతూ ఉంటుంది. వర్షాకాలంలో పర్యటించకపోవడమే మేలు. తిరుగుప్రయాణంలో మేం మసూరీకి కాకుండా స్థానికుల నుంచి సమాచారం తీసుకుని చంద్రవదనాదేవి పీఠానికి బయలుదేరాం. దేవ ప్రయాగ రోడ్డులో ప్రయాణం మొదలైంది.

దారి మొత్తం కొండ రోడ్డే. అడవిగుండానే సాగుతుంది. అక్కడక్కడా చిన్న చిన్న గ్రామాలూ మెట్ట వ్యవసాయం తప్ప మరేమీ లేవు. సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించాక జామనీఖాల్‌ గ్రామానికి చేరుకున్నాం. అక్కడ నుంచి సుమారు మరో ఏడు కిలోమీటర్లు ప్రయాణించి చంద్రవదనీ పర్వతానికి చేరుకున్నాం. అక్కడ నుంచి సుమారు ఓ కిలోమీటరు కొండమీదకి నడిచి చంద్రవదనాదేవి మందిరానికి చేరుకున్నాం. ఇది కూడా చాలా చిన్న మందిరం. మందిరం దగ్గర పూజారి తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. గర్భగుడి మధ్యలో ఎర్రని బట్ట పైనుంచి కట్టి ఉంది. పూజారిని అది తొలగిస్తే అమ్మవారిని దర్శించుకుంటామని అడిగాం. అయితే దాన్ని ఎప్పుడూ తొలగించమని ఆయన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాం. చంద్రవదనాదేవి అంటే అందమైనది అని అర్థం. అయితే ఆ మందిరంలో అసలు అమ్మవారి విగ్రహమే లేదట. మరక్కడ ఏమి ఉంటుందని అడిగితే ఆయనకూ సరిగ్గా తెలీదట. కానీ శ్రీచక్రం ఉండొచ్చు అన్నాడు. ఎందుకంటే రోజూ ఉదయమూ సాయంత్రమూ పూజారి కళ్లకు గుడ్డ కట్టుకుని ధూపదీపనైవేద్యాలు సమర్పించి ఇవతలకు వస్తారట. రుద్రతాండవం చేస్తోన్న శివుణ్ణి ఆపేందుకు విష్ణుమూర్తి తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె గుప్తాంగం చంద్రవదనీ పర్వతంమీద పడిందట. అమ్మవారి ప్రతిరూపమైన శ్రీచక్రాన్ని అంగం ఉన్న ప్రదేశంలో ప్రతిష్టించి ఉంటారనీ దాన్ని పరులెవరూ చూడకూడదనీ చెప్పారాయన. అక్కడ ఉన్న ఎర్ర బట్టను సైతం కళ్లకు గంతలు కట్టుకుని ఏడాదికోసారి మారుస్తారట. అందుకే మేం కూడా ఆ ఎర్రబట్టకు ఇవతల నుంచే పూజ ముగించి బయటకు వచ్చాం. దసరా నవరాత్రుల్లో చుట్టుపక్కల గ్రామ ప్రజలు వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. తిరుగుప్రయాణంలో సుమారు 35 కిలోమీటర్లు ప్రయాణించి దేవప్రయాగకు చేరుకున్నాం. అప్పటికే సాయంత్రం ఏడవడంతో ఆ రాత్రికి అక్కడే బస చేసి, అరుదైన శక్తి పీఠాలను దర్శించుకున్నామన్న సంతృప్తితో ఆ మర్నాడు పుణెకి తిరిగి వచ్చాం.

Sunday, 22 January 2017

హిమాచల్‌ ప్రదేశ్‌ - ఆలయాలకు ఆలవాలం






ఆలయాలకు ఆలవాలం హిమసమూహం

వెండిలా తళతళా మెరిసిపోయే హిమాలయ పర్వత శ్రేణులను సందర్శించడానికి అటు భక్తజనులూ, ఇటు పర్యాటక ప్రియులూ కూడా ఉవ్విళూరుతుంటారనడంలో అతిశయోక్తి లేదు. బహుశా అందుకే కాబోలు, దేశానికి పర్యాటకరంగం నుంచి ఆదాయం చేకూర్చే రాష్ట్రాలలో హిమాచల్‌ ప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఇక అక్కడి కులూ లోయల సంగతి చెప్పనవసరం లేదు. అక్కడి కొండల మీద వెలుగు నీడలకి వెర్రెత్తిన నికొలన్‌ రోరిచ్‌ అనే రష్యా చిత్రకారుడు గతంలో అక్కడ స్థిరపడి అద్భుతమైన పెయింటింగ్‌లు చేశారు.

సిమ్లా, కుర్గి, నర్కండా, కులు, మనాలి, చంబా, కూపర్, పబ్బర్‌ వంటి ప్రాంతాలు హిమాచల్‌ప్రదేశ్‌ అనే తోటలోని అందమైన పూలు! సోలోంగ్‌నుల్లా నుంచి పథ్రూ వరకు గల లోయ ప్రాంతంలో స్కీయింగ్‌ ఆనందం కోసం దేశవిదేశీ పర్యాటకులు బిలబిలలాడుతుంటారు.

శివరాత్రి అక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. అక్కడి శాలువాలు, రగ్గులు, దుప్పట్లు, తివాచీలు ప్రపంచ ప్రసిద్ధికెక్కాయి. అంతేకాదు, ఈ హిమవత్పర్వత శ్రేణులలో శక్తిస్వరూపిణి, చింతలు తీర్చే చల్లనితల్లి చింతపూర్ణాదేవి, చారెడేసి కన్నులతో కనువిందు చేసే నయనాదేవి, భీమసేనుడి భార్య హిడింబకు కూడా ఆలయాలున్నాయి.

చింతపూర్ణాదేవి
చింత అంటే బాధలు, ఆందోళనలు. తన భక్తుల చింతలను దూరంచేసే దేవి కాబట్టి ఈ తల్లికి చింతపూర్ణాదేవి అని పేరు వచ్చిందట. దక్షయజ్ఞంలో అవమానానికి గురై ప్రాణత్యాగం చేసిన సతీదేవి దేహాన్ని పరమశివుడు భుజాన వేసుకుని తిరుగుతుండగా, విష్ణుమూర్తి ఆ దేహాన్ని ముక్కలు చేసినప్పుడు, ఆమె పవిత్రపాదం ఇక్కడ పడిందని అంటారు. మరోగాథ ప్రకారం, భగత్‌మయీదాస్‌ అనే భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతి నిత్యం అమ్మవారిని పూజించేవాడు. కానీ లౌకిక సంబంధమైన కోరికలు ఏవీ కోరలేదు. ఒకసారి ఈ భక్తుడు తన మామగారి ఊరికి బయలుదేరాడు. అతను కొంతదూరం వెళ్లాక, అలసిపోయి ఒక చెట్టునీడన పడుకొని నిద్రపోయాడు. అతను నిద్రలో ఒక కలగన్నాడు.

ఆ కలలో, ఒక బాలిక కనిపించి, అక్కడ తను పిండ రూపంలో - గుండ్రని రాతి రూపంలో ఉన్నానని, తనకొక ఆలయం నిర్మించమని చెప్పింది. ఆమె చెప్పిన విధంగానే అతను అక్కడ ఉన్న అమ్మవారిని (పిండ రూపాన్ని) ఆలయంలో ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతారు. ఇప్పటికి ఇరవై ఆరు తరాల కిందట అమ్మవారి ప్రతిష్ఠ జరిగిందని చెబుతారు. సోలాసింఘి పర్వతశ్రేణిలోని అతి ఎత్తయిన ఒక పర్వతశిఖరం మీద చింతపూర్ణాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరచి ఉంటుంది. లడ్డు, హల్వా, పాయసం, పళ్లు మొదలైన నివేదనలతోపాటు పూలు, వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తారు.

కులు-మనాలి
కులు-మనాలి అనే రెండు ప్రాంతాలు కలిసిపోయి, అది ఒకే ఊరు అనుకునే పరిస్థితి ఉంది. కానీ కులు, మనాలి వేర్వేరు ఊళ్లు. మొదట కులు వెళ్లి అక్కడి నుంచి మనాలికి ప్రయాణం కట్టాలి. హిమాచలప్రదేశ్‌ అంటేనే హిమాచల పర్వతాలలో ఉన్న ప్రాంతమని అర్థం. కులు-మనాలి చుట్టూ ఎత్తయిన కొండలే దర్శనమిస్తాయి. ఈ ప్రాంతాలు వేసవి విడిది ప్రాంతాలు. సెప్టెంబరు నుంచి పూర్తిగా పచ్చదనంతో నిండిపోయి, ఈ కొండలు కనువిందు చేస్తాయి. జనవరి, ఫిబ్రవరి నెలలలో మంచుమీద స్కైయింగ్‌ జరుగుతూంటుంది. కులు జిల్లాకు దేవతల లోయ అని పేరు.

కులు ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలో బిజిలీ మహదేవ్‌ ఆలయం ఉంది. కులులోని రఘునాథ ఆలయం చూడదగినది.భారతీయ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన ప్రాంతం మనాలి. పూర్వం ప్రళయంలో ప్రపంచమంతా మునిగిపోయి నప్పుడు, తిరిగి సృష్టి చేయడానికై ఓడలో నుండి మనువు ఈ ప్రాంతంలో అడుగుపెడతాడు. అందుకే ఈ ప్రాంతానికి నిమనాలి - మనువు నివసించిన ప్రాంతం అని పేరు. పాత మనాలిలో మనువు ఆలయం ఉంది. ఈ ఆలయాన్నే కాక, పాత మనాలిలోని పురాతన కోటలను, కట్టడాలను, యాత్రికులు సందర్శిస్తూంటారు. మనాలి, దాని పరిసరాలు సప్తర్షుల నివాసంగా చెబుతారు.

అత్యద్భుతమైన ప్రకృతి అందాలతో, సాహస క్రీడలు జరిగే ప్రదేశాలతో మనాలి గొప్ప పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హిడింబి ఆలయం ఉంది. పాండవులలోని భీమసేనుని భార్య హిడింబి. ఈమె రాక్షస సంతతికి చెందినది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు హిడింబాసురుని సోదరి అయిన హిడింబి భీముడిని పెళ్లాడింది. వీరి కుమారుడే ఘటోత్కచుడు. హిమాలయాల పాదాల దగ్గర ఉన్న ఈ ఆలయం చుట్టూ అటవీ ప్రాంతం కలిగి ఉండి ఎంతో రమణీయంగా ఉంటుంది. నాలుగు అంతస్థుల గోపురంతో, దారు చెక్కడాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ ఆలయం. మనాలిలో బౌద్ధుల ఆశ్రమాలు కూడా చూడదగిన ప్రదేశాలు. వీటిని గోంపాలు అంటారు. గదన్‌ తెక్చోగోంప, హిమాలయన్‌ న్విన్గమప గోంప మొదలైన ఆశ్రమాలున్నాయి.

హిమాచలప్రదేశ్‌ పర్యాటకశాఖ నిర్వహించే హోటల్‌ కూడా చూడదగినదే. ఇది పూర్వకాలంలో నగ్గర్‌కోటగా పేరు పొందింది. ఇది ప్రస్తుతం హోటల్‌గా రూపాంతరం చెంది, హిమాచలప్రదేశ్‌ పర్యాటకశాఖ నిర్వహణలో ఉంది. దీనిని దర్శించినవారు, ఇందులోని కళానైపుణ్యానికి ఆశ్చర్యపోతారు. హనీమూన్‌ జంటలను ఆకర్షించే ప్రదేశంగా కూడా మనాలి పేరుపొందింది. ఇంతేకాక, సాహసక్రీడలైన స్కీయింగ్, పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, మౌంటెన్‌ బైకింగ్‌ మొదలైన సాహసక్రీడలు కూడా మనాలిలో జరుగుతుంటాయి. ఈ ఆటలలో పాల్గొనాలనే కాక, కేవలం మంచులో సరదాగా ఆటలాడుకోవాలని వచ్చేవారి సంఖ్య కూడా తక్కువ కాదు. మంచుకొండలలోని వేడినీటిబుగ్గలు ప్రకృతిలోని వింతగా, దేవుడిచ్చిన వరంగా చెబుతారు. మనాలికి సీమపంలో రహల్లా జలపాతం కనువిందు చేస్తుంది. ఇది సుమారు 2,500 మీటర్ల ఎత్తున ఉన్న ఈ జలపాతం చూస్తే, నయాగరాని చూసిన అనుభూతి పొందుతారు.

చాముండానందికేశ్వరి
చాముండాదేవిని గురించి దేవీభాగవతం, దుర్గాసప్తశతి మొదలైన పురాణాలలో వివరంగా ఉంది. చాముండాదేవి ఆలయాన్ని సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం నిర్మించారని చెబుతారు. కాళికాదేవి చాముండాదేవిగా ఇక్కడ ఉన్నదని చెబుతారు.మరోగాథ కూడా ఉంది. అమ్మవారు ప్రారంభంలో ఒక ఎత్తయిన పర్వతం మీద వెలిసిందని, ఒక అంధ భక్తుడు ప్రతీరోజు అమ్మవారిని దర్శించలేక పోతున్నందున బాధపడి అమ్మవారిని ప్రార్థించాడని, అతనిని కరుణించడానికని దేవి కొండ మీద నుండి ఇప్పుడున్నచోటికి వచ్చిందని స్థానికులు చెబుతారు.

జ్వాలాముఖి
జ్వాలాముఖి ఆలయం కాంగ్రాకి దక్షిణంగా సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. జ్వాలాముఖి దగ్గర సతీదేవి నాలుక పడిందని చెబుతారు. స్వచ్ఛమైన నీలిమంటతో ప్రకాశించే దేవిని పాండవులు కూడా దర్శించారని స్థానిక గాథ చెబుతోంది. ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుంచి నిరంతరం సహజవాయువు వెలువడుతుంది. దీన్ని ఆలయ పురోహితుడు వెలిగిస్తాడు. ఈ జ్వాలే జ్వాలాముఖి అమ్మవారిగా ఇక్కడ కొలువుదీరి భక్తుల పూజలందుకుంటోంది. ఇక్కడ ఈ జ్వాలే కాక, ఇంకో తొమ్మిది జ్వాలలు ఉన్నాయి. అవి కూడా దేవతలుగా పూజలందుకుంటున్నాయి. మహాకాళి, అన్నపూర్ణ, చండి, హింగుళ, వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజిదేవి ఈ తొమ్మిది జ్వాలా దేవతల పేర్లు. అమ్మవారికి పాలు, ఫలాలు, కలకండలని నివేదిస్తారు. రోజంతా రకరకాల పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రతీరోజు అయిదుసార్లు ఆరతి జరుగుతుంది. రోజుకొకసారి హోమం చేసి, దుర్గాసప్తసతి పారాయణ చేస్తారు.

హిమాచల్‌ కొండల దారిన...
ఒక్కసారి హిమాచల్‌ప్రదేశ్‌ కొండల వాలుల్లో నడిస్తే చాలు మీకు కొండల పిచ్చి పట్టుకుంటుంది. అలా పర్వతాలు ఎక్కడానికి, పెద్ద పెద్ద మంచు బండరాళ్లు ఎక్కి కొండల మీద తిరగడానికి తగిన శిక్షణ లేకపోతే ఎక్కలేరు. అందుకే అక్కడి మనాలీలో మౌంటెనీరింగ్, స్కీయింగ్‌ నేర్పే శిక్షణాలయం ఉంది. సట్లె్లజ్, బియాస్‌ నదులు జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ప్రశాంతంగా ప్రవహిస్తాయి గనుక వాటిలో పడవల పోటీలు, పడవ ప్రయాణాలు బహు చక్కగా సాగుతాయి.

హిమాచలపర్వతాలను ఎలా చేరుకోవాలంటే...?
జ్వాలాముఖి ఆలయాన్ని సందర్శించాలంటే ముందుగా కాంగ్రా చేరుకోవాలి. కాంగ్రాకు దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి రైళ్లున్నాయి. విమానంలో వెళ్లాలంటే గగ్గల్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలి. అక్కడినుంచి కాంగ్రాకు క్యాబ్‌లు, ట్యాక్సీలు ఉంటాయి. కాంగ్రా నుంచి బస్సులో జ్వాలాముఖికి వెళ్లవచ్చు లేదంటే ఢిల్లీ నుంచి ధర్మశాలకు విమానంలో వెళ్లి, అక్కడినుంచి ట్యాక్సీలో జ్వాలాముఖి ఆలయానికి చేరుకోవచ్చు.

ఉత్తమమైన మార్గం ఏమిటంటే... tourismmin-hp@nic.in, tourism.hp@nic.inకు మెయిల్‌ చేస్తే హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌నుంచి అక్కడ చూడదగ్గ ప్రదేశాలు; ఎలా చేరుకోవాలి, ఎక్కడ బస చేయాలి, ప్యాకేజీ ఏమిటి... వంటి వివరాలతో కూడిన మెయిల్‌ వస్తుంది. దాని ప్రకారం ప్లాన్‌ చేసుకోవచ్చు.

DVR. భాస్కర్‌



Wednesday, 18 January 2017

తీపిగుర్తుగా హాలిడే ట్రిప్‌

హాలిడే ట్రిప్‌ తీపిగుర్తుగా మిగిలిపోవాలంటే ఈ టిప్స్‌ను ఫాలో అయిపోండి.
  • నాణ్యమైన అండర్‌ గార్మెంట్స్‌ను ఎంచుకోండి. మీరు నమ్మినా, నమ్మకపోయినా నాణ్యమైన లోదుస్తులు హాలిడే ట్రిప్‌లో చాలా అవసరం. ఎందుకంటే చాలా దూరం వాకింగ్‌ చేయాల్సి వస్తుంది. సైట్‌ సీయింగ్‌ కోసం నడవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్‌, సయాకింగ్‌ వంటివి చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే యాంటీ బ్యాక్టీరియల్‌ అండర్‌ గార్మెంట్స్‌ను ఎంచుకోండి.
  • మందులు తీసుకెళ్లండి. ఫస్ట్‌ ఎయిడ్‌కిట్‌, నొప్పి నివారణ మాత్రలు తప్పనిసరి. దగ్గు మందు, జ్వరానికి పారాసెటమాల్‌ వంటి జనరల్‌ మందులు వెంట ఉంచుకోండి.
  • ఇంటర్నేషనల్‌ ట్రిప్స్‌కు వెళుతున్నట్లయితే కూపన్స్‌ కోసం ప్రయత్నించండి. డబ్బు ఆదా విషయంలో కూపన్స్‌ బాగా ఉపకరిస్తాయి.
  • టాబ్లెట్‌లో మీకు నచ్చిన వీడియోలు, పాటలు డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకోండి. లాంగ్‌ ట్రిప్‌లో బోర్‌డమ్‌ను పోగొట్టడానికి ఇవి బాగా పనికొస్తాయి.
  • కొంచెం ఖర్చు ఎక్కువైనా లగ్జరీకే ప్రాధాన్యం ఇవ్వండి. ఎందుకంటే ట్రిప్‌ మెమొరబుల్‌గా నిలిచిపోవాలంటే ఆ మాత్రం చేయక తప్పదు.
  • ఇయర్‌ప్లగ్స్‌ను బ్యాగులో ఉంచుకోండి. నాయిస్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ఇయర్‌ ప్లగ్స్‌ బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే టూర్‌ మెమొరబుల్‌గా చిరకాలం నిలిచిపోతుంది.

Monday, 16 January 2017

మిస్టరీ వాల్‌

ఆ గోడను ఎప్పుడు కట్టారో తెలియదు.. ఎవరు కట్టించారో అనవాలు దొరకడం లేదు.. ఏ ప్రయోజనాన్ని ఆశించి దాన్ని నిర్మించారో తెలుసుకుందామంటే అదీ కష్టసాధ్యంగానే ఉంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయ్సేన్‌ జిల్లాలో ఉన్న 80 కిలోమీటర్ల పొడవైన రాతిగోడ పురా వస్తు పరిశోధకులకు, చరిత్రకారులకు పెద్ద పజిల్‌గా మారింది.

వింధ్య పర్వత శ్రేణుల మీదుగా, కొండలు, అరణ్యాలు, పచ్చటి పొలాల్లో సైతం విస్తరించిన ఈ గోడ నిర్మాణం ఆసాంతం ఆశ్చర్యకరం. కొన్నిచోట్ల 15 అడుగుల ఎత్తుతో, మరికొన్ని ప్రాంతాల్లో నేలను తాకుతున్నట్లుగా, బోలెడు మలుపులతో ఉన్న ఈ రాతి కట్టడం వెంబడి ప్రయాణించడం ఓ అద్భుతమైన అనుభూతి. కొంతమంది ఔత్సాహికులు దీన్ని ఏకంగా ‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా’గా పేర్కొంటున్నారు. దీని పొడవు 80 కిలోమీటర్లు ఉంటుందని చెబుతున్నా అందులో చాలావరకూ కాలగర్భంలో కలిసిపోయింది. ఈ గోడను ఆనుకొని ఉన్న గ్రామాల్లో నివసించే ప్రజలు దీన్ని ముద్దుగా ‘దివాల్‌’ అని పిలుచుకుంటున్నారు.

అద్భుత శిల్పసంపద
ఈ గోడ పరిసరాల్లో ఇప్పటివరకు దొరికిన అవశేషాల్లో అద్భుతమైన శిల్పసంపద బయటపడింది. సుందరమైన దేవతా మూర్తుల విగ్రహాలు, నాగప్రతిమలు, సున్నపురాయితో నిర్మితమైన సరస్సులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతులేదు. అయితే సరైన పర్యవేక్షణ లేకపోవడం కారణంగా వీటిలో చాలావరకూ చోరుల పాలయ్యాయి. కొన్ని విగ్రహాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.

తెలిసింది కొంతే
అంతులేని రహస్యాలకు నిలయంగా మారిన ఈ గోడ విషయంలో ఇప్పటివరకూ తెలిసింది గోరంత మాత్రమే అని ఇంకా తెలియాల్సింది కొండంత ఉందని చారిత్రక నిపుణుల అభిప్రాయం. దట్టమైన అడవుల్లో లోపలకు ప్రయాణించే కొద్దీ ఈ గోడకు సంబంధించిన రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. అర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో సుదీర్ఘ కాలం పనిచేసి రిటైరైన పరిశోధకుడు ఒకరు దీనిపై అనేక సంవత్సరాలుగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ‘ఈ గోడ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అనవాళ్లు గానీ, శాసనాలు గానీ ఇప్పటివరకూ లభ్యం కాలేదు. అందువల్ల దీన్ని ఏ రాజుల కాలంలో నిర్మించారో అంచనా వేయడం అసాధ్యంగా మారింద’ని ఆయన అంటున్నారు.

అంతా రహస్యం
లెగో బ్రిక్స్‌ ఆకారంలో ఉన్న పెద్ద సైజు రాళ్లతో ఈ గోడను నిర్మించారు. గోడ లోపలి భాగంలో కొన్నిచోట్ల మెట్ల నిర్మాణాలు ఉన్నాయి. శత్రువుల రాకను దూరం నుంచే గుర్తించడానికి వీలుగా రహస్య ఏర్పాట్లున్నాయి. ఆయుధ సామగ్రిని భద్రపరుచుకోవడానికి కూడా గోడ లోపలే ఏర్పాట్లు చేశారు. వీటినిబట్టి ఈ గోడ ఒక సైనిక స్థావరంలా ఉపయోగించేవారేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పర్యాటకానికి అనుకూలం
కచ్చితంగా చెప్పలేకపోయినా 900-1300 సంవత్సరాల మధ్యలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజపుత్ర రాజుల కాలంలో దీన్ని నిర్మించి ఉండవచ్చని ఓ అంచనా. ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, టూరి్‌స్టలకు మంచి సందర్శనా స్థలంగా తీర్చిదిద్దితే బాగుంటుంది. ఇక్కడికి సమీపంలోనే భీంబెట్కాలో 30 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న గుహలను రాతియుగం నాటివిగా గుర్తించిన యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా ప్రకటించింది. సాంచీలోని బౌద్ధ స్థూపం కూడా గుర్తింపు పొందింది.

గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా
రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌కు సమీపాన ఉన్న కుంభల్‌గఢ్‌ కోట గోడ 38 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.. దీన్ని కట్టడంలో అప్పటివారి ప్రతిభ, అంకితభావాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాల్సిందే తప్ప మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. రాజపుత్ర యోధుడు మహారాణా ప్రతాప్‌ పుట్టింది కూడా ఈ కోటలోనే. ఆరావళీ పర్వత శ్రేణుల్లో నిర్మితమైన ఈ కోట రాజపుత్ర వీరుల సాహసాలకు ప్రత్యక్ష సాక్షి. ఇందులో 300 వరకూ పురాతన జైన ఆలయాలు, 60 హిందూ దేవాలయాలు ఉన్నాయి. దీన్ని నిర్మించిన మహారాణా కుంభ జ్ఞాపకార్థం రాజస్థాన్‌ టూరిజం విభాగం ఇక్కడ ఏటా మూడు రోజుల పాటు పండుగ నిర్వహిస్తుంది.

కల్పవల్లి బోయకొండ గంగమ్మ



కల్పవల్లి బోయకొండ గంగమ్మ

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, పుంగనూరు సమీపంలో బోయకొండలో వెలసిన గంగమ్మ తల్లి అదే ప్రస్తుతం బోయకొండ గంగమ్మగా పిలుస్తారు. జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అత్యంత ప్రణముఖ్యంలో ప్రసిద్ధికెక్కిన ఏకైక శక్తిక్షేత్రం.

బోయకొండ గంగమ్మ ఎలా వెలసింది?
క్రీ.శ 1782 టీప్పుసుల్తాన్ అనే నవాబు గుర్రం కొండ ప్రధాన కేంద్రంగా పరిపాలిస్తున్న పాలనలో అప్పటి పుంగనూరు జమిందారు ఇమ్మడి చిక్కరాయలు తిరుగుబాటు చేసి పుంగనూరు, ఆవులపల్లె దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు. అందుకు ఆగ్రహించిన టిప్పు సుల్తాన్ షేక్ బమర్, కిర్మిణి అనే సైన్యాధిపతుల నాయకత్వంలో 400 పదాతి దళాలను పుంగనూరు జమిందారుపై యుద్దానికి పంపి సుమారు 70 రోజులపాటు జరిగిన యుద్ధంలో దుర్గాలను సుల్తాన్ సేనలు కైవసం చేసుకున్నాయి. యుద్ధసమయంలో ప్రస్తుతం చౌడేపల్లె మండలం కాటిపేరిలోని ఏకీల, గిరిజన తెగలవారు పుంగనూరు జమిందారుకు అండగా నిలిచారు.

ఏకీల, గిరిజన తెగలవారిపై తుపాకులతో కాల్పులకు దిగడంతో తమ భర్తలను కాపాడుకునేందుకు మహిళలు అధిపరాశక్తిని స్మరించి రొకళ్ళు తీసుకోని పోరుకు సిద్ధమయ్యారు. వారిలో ఓ మహిళకు గంగమ్మ అవహించిదట. ఆమె రణభేరి గంగమ్మగా వీరోచితంగా పోరాడుతూ ఆగ్రహవేశంతో కత్తితో ఓ కొండరాయిని (ఈ క్రీంద చూపిన ఫొటోలో చూడవచ్చు ప్రస్తుతం అక్కడ రెండు రాళ్ళమధ్యలో అమ్మవారి భారీ ఎత్తు విగ్రహం నిర్మించడం జరుగుచున్నది) నరికి రెండు ముక్కలుగా చేసిందని స్థానిక కథనం. మరియు నవాబులు కాల్చిన తుపాకి గుండ్లన్ని ఒక గుండుకు తగిలి మట్టిబాణలో పడేలా అమ్మవారు మహత్యం ప్రదర్శించిదట.

జరుగుచున్న భీకరమైన యుద్ధంలో మహిళల రొకలిబడేల దెబ్బలకు తాళలేక నవాబు సేనలు పారిపోయారట. అప్పటినుంచి జనం బోయకొండలో ఆలయం నిర్మించి కొలవడం ప్రారంభించారు. అప్పటి నుండి ఏ కష్టం వచ్చినా గంగమ్మ రక్షిస్తుంది అని ప్రజల ప్రగాడ విశ్వాసం.

ఆలయ విశిష్టత
చల్లని వాతావరణంతో చిన్నచిన్న కొండలు, లోయలతో కూడిన చిట్టడవులు, నీటి కొలనులు సముదాయాలతో బోయకొండ ప్రాంతం శోభాయమానంగా ఉంటుంది. బోయకొండను ఎక్కేటప్పుడు మొదట రణభేరి గంగమ్మ(రౌద్రాకార గంగమ్మ) ఆలయం తరువాత కొంతదూరం వెళ్ళగానే భక్తులు స్నానం ఆచరించడానికి బండపై కోనేరు నిర్మించబడియున్నది.

అమ్మవారి ప్రధాన ఆలయం పద్మాకారంలో నిర్మించబడినది. పై అంతస్థును అష్టదిక్కులను సూచించే విధంగా రూపకల్పన చేయడం జరిగినది. దిగువున గర్భాలయంలో అమ్మవారి మూలవిగ్రహం ఉంది. ఆ గర్భగుడికి ఎదురుగా మరొకొనేరు నిర్మితమై వున్నది. కొనేరులోని నీటిని (దానినినే తీర్థంగా భావిస్తారు) వ్యవసాయ పంటలపై చల్లితే పంటలకు పట్టిన చీడపీడలు పోతాయని, ఇళ్లలో ఏవైనా దోషాలు వున్నా తీరుతాయని ప్రతీతి. భక్తులు ఈ తీర్థాన్ని కొనుగోలు చేయడానికి బారులు తీరుతారు. సదరు బోయకొండ గంగమ్మ ప్రభుత్వం ఆధ్వర్యంలో బోర్డు ఏర్పాటు చేయబడి అధ్యక్షులు, సభ్యులుతో కూడి ప్రభుత్వాధికారి ఒకరు దేవస్థానంనకు సాంకేతికాధికారి(EO) కూడా ఏర్పాటు చేసి ప్రస్తుతం నడుస్తున్నది.

నవరాత్రి ఉత్సవాలు
బోయకొండ గంగమ్మ ఆలయంలో ప్రతియేటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజూ కుంకుమార్చన, పుష్పం అడిగే కోర్కె(పుష్పం అడిగే కోర్కె, ఇంతకు పుష్పం మహిమ ఏమిటి తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి ఈ క్రీంద తెలుపబడినది), హారతి ప్రతియేటా మాఘమాసంలో రాహుకాలం అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు ఆలయంలో జరుగుతాయి. అత్యధికంగా ఆదివారం 50 వేల మందికి పైగా అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే మంగళ, గురు, శుక్రవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అమ్మవారి ఆలయం ఆదాయం ఏటా రూ.5.34 కోట్లు వస్తోంది. అందుకే ఈ దేవస్థానం అధ్యక్ష,సభ్యుల పదవులకు అత్యంత పోటీ ఉంటుంది.

అసలు పుష్ప మహిమ ఏమిటి?
ఏదైనా కార్యం చేపడితే అది సఫలమా, విఫలమా తెలుసుకోవడానికి భక్తులు బోయకొండ గంగమ్మను ఆశ్రయిస్తారు. అమ్మ వారి ఎదుట నిలిచి మనసులో కోర్కె కోరిన పుష్పం అడుగుతారు. ఆలయ అర్చకులు అమ్మవారి తలపై పుష్పాంని ఉంచగానే పుష్పం కుడి వైపు పడితే శుభంగాను ఎడమ వైపు పడితే అశుభంగాను భావిస్తారు. అమ్మవారి మూల విరాట్టు ఎదురుగా బోయకొండ గంగమ్మ ఉత్సవ విగ్రహానికి నిత్యకు0కుమార్చనలు,పూజలు జరుగుతాయి. ఆలయ ఆవరణలో ఇటీవల లక్షలాది రూపాయలతో అద్దాలమేడ నిర్మించి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. బోయకొండ గంగమ్మ మహిమలు తెలుసుకున్న ఇతర ప్రాంతాల వారు గంగమ్మ పేరుతొ శిలలకు అమ్మవారిని ఆవాహన చేసి వారి గ్రామాల్లో బోయకొండ గంగమ్మ పేరిట ఆలయాలు నిర్మించుకుంటున్నారు. బోయకొండ గంగమ్మకు వరపడగా పుట్టిన బిడ్డలకు బోయకొండప్ప, బోయకొండమ్మ, గంగప్ప, గంగమ్మలుగా పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

ఇక్కడ ఆలయ అర్చకులుగా యాదవులు వ్యవహరిస్తారు. ఉత్సవ విగ్రహం వద్ద మాత్రం బ్రాహ్మణ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బోయకొండలో విందు,మందులకు ప్రత్యేక స్థానం ఉంది. భారీఎత్తున జంతుబలులు సమర్పించి భక్తులంతా కొండ దిగువనే వంటలు వండి విందు చేసుకుంటారు.చాలా వరకు జనం ఇక్కడ విందు వినోదానికే తరాలిరావడం విశేషం. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రం నుంచి అత్యధికంగా వేల సంఖ్యలో వాహనాల్లో జనం వచ్చి అమ్మవారికి మొక్కులను చెలిస్తారు.

బోయకొండకు వెళ్ళాలంటే
శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ ఆలయం తిరుపతి నుంచి పాకాల,కల్లూరు, సదుం మీదుగా 110 కిలోమీటర్లు, పుంగనూరు నుంచి 18 కిలోమీటర్లు, మదనపల్లి నుంచి 20 కిలోమీటర్లు, చౌడేపల్లి నుంచి 13 కిలోమీటర్లు, నిమ్మనపల్లి నుంచి బండ్లపై మీదుగా 10 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 140 కిలోమీటర్లు ఉంటుంది. చిత్తూరు, పలమనేరుల నుంచి వచ్చే భక్తులు రాయలపేట మీదుగా బోయకొండ గంగమ్మ దేవస్థానంనకు చేరుకోవచ్చు.

వేద, శాస్త్ర, స్మార్త పురోహిత పరిషత్, శాంతి నగర్, ఖాధికాలని తిరుపతి




Friday, 13 January 2017

తమిళనాడు యాత్ర

పర్యాటకరంగానికి ఆయువుపట్టు. సహజ అందాలకు, ప్రకృతి రమణీయ తకు పుట్టినిల్లు. దేవాలయాలు కళాత్మక సౌరభాలు. గోపురాలు శిల్పకళా చాతుర్యానికి ప్రతిరూపాలు. భిన్న సంస్కతితో పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా ఆకట్టుకునే గొప్పతనం తమిళనాడు సొంతం. కన్యాకుమారి, కుంబకోణం, రామేశ్వరం, చిదంబరం, శ్రీరంగం, జంబుకేశ్వ రం, మీనాక్షి, స్వర్ణ దేవాలయం.. ఇలా ఆధ్యాత్మిక ప్రదేశాలెన్నో ఈ రాష్ట్రంలో ఉన్నాయి.

శ్రీపురం స్వర్ణదేవాలయం
ఇటీవలే నిర్మించిన స్వర్ణ దేవాలయం వేలూరుకు దగ్గర్లో మలైకుడి సమీప కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. చెన్నై నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్‌ టన్నుల సిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉంటుంది.

బృహదీశ్వర ఆలయం
అత్యంత ప్రాచీన హిందూ దేవాలయంగా ప్రఖ్యాతిగాంచినది తంజా వూరు బృహదీశ్వర ఆలయం. హిందువుల పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడినది

కుంబకోణంలో బ్రహ్మ దేవాలయం
కావేరి, అరసలర్‌ నదుల మధ్య ఏర్పడింది కుంభకోణం. ఈ నగరాన్ని ‘సిటీ అఫ్‌ టెంపుల్స్‌’ గా పిలుస్తుంటారు. ఇక్కడ 188 ఆలయాలున్నాయి. చుట్టుపక్కల మరో 100 టెంపుల్స్‌ వరకూ ఉంటాయి. కుమ్బెస్వర టెంపుల్, సారంగపాణి టెంపుల్, రామస్వామి టెంపుల్‌ లు ప్రసిద్ధి చెందినవి. ప్రతి సంవత్సరం ఈ టెంపుల్‌ టవున్‌లో ‘మహామాహం’ ఫెస్టివల్‌ జరుగుతుంది. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు కుంబకోణంకు వస్తారు.

రామేశ్వరం
హిందువుల పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది రామేశ్వరం. రామేశ్వరాన్ని విష్ణుమూర్తి ఏడవ అవతారం భావిస్తారు. రావణాసురుడి చర నుండి సీతాదేవిని కాపాడే క్రమంలో శ్రీలంక వెళ్లడానికి ఇక్కడ నుంచే రాముడు వంతెనను నిర్మించాడట. అందువల్లే రామేశ్వరానికి ఆపేరు. ఈ ప్రాంతంలో సుమారు 64 తీర్దాలు ఉండగా వీటిలో 24 ప్రాముఖ్యత గలవని, ఈ నీటిలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

శ్రీసుబ్రహ్మన్యేశ్వర దేవాలయం
ఈ ఆలయం తిరుచెందూర్‌ తూతుకుడి జిల్లాలో ఉంది. ఇక్కడ  అందమైన దేవాలయాలు, తిరుచెందూర్‌ మురుగన్‌ టెంపుల్, వల్లి గుహ, దత్తాత్రేయ గుహ కలవు.

కన్యాకుమారి
భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రా స్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగానూ విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం, చంద్రోదయాలను చూసి పులకించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు.

తప్పక సందర్శించదగినవి
వివేకానంద రాక్, తిరువళ్లువర్‌ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమారి ఆలయం ముఖ్యమైనవి. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. వివేకానంద రాక్‌కు సమీపంలోని తిరువళ్లువర్‌ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇది ఆసియాలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచినది. బాణాసురుడిని సంహరించిన అమ్మవారి ‘కుమరి ఆలయం’ చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. కాంచీపురం థౌజండ్‌ టెంపుల్స్‌ నగరంగా ప్రఖ్యాతిగాంచింది. తమిళనాడులో చారిత్రక హిందూ ఆలయం  మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మధురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది. రంగనాధుడు రంగనాయకి అమ్మవారితో కొలువైవున్న దివ్యక్షేత్రం శ్రీరంగం. ఇది వైష్ణవ దివ్యదేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు.  పంచభూత క్షేత్రాలలో రెండవది జంబుకేశ్వరం. జంబుకేశ్వరానికి తిమేవ కాయ్, తిరువనైకావల్‌ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రము అని అర్థం. పూర్వం ఇక్కడ అధికంగా జంబువృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు.  శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి చెందిన ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని.

Wednesday, 11 January 2017

శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే మోహనం...

పుణ్యతీర్థం

విష్ణుమూర్తి శేషశయనుడై భక్తుల మొరలను ఆలకిస్తూశ్రీరంగనాయకితో కొలువుతీరిన క్షేత్రం... శ్రీరంగం. విశాల ప్రాంగణం, ఎత్తయిన గోపురాలు, దేవతామూర్తుల సముదాయం. దేవాలయంలోనే పట్టణం. ఇవీ ఈ క్షేత్రం విశేషాలు. ‘రంగ రంగ రంగపతి రంగనాథానీ సింగారాలే తరచాయె శ్రీరంగనాథా’... అని అన్నమయ్య సంకీర్తన చేసింది ఈ క్షేత్రం గురించే!

శ్రీరంగనాథుడు, రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్న వైష్ణవ దివ్యక్షేత్రం– శ్రీరంగం. ఇది తమిళనాడులోని తిరుచినాపల్లి (తిరుచ్చి)కి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్యన ఉన్న ఒక ద్వీపం. ‘శ్రీరంగం’ అనే ఊరిలో దేవాలయం లేదు. ‘శ్రీరంగ దేవాలయం’లోనే శ్రీరంగం అనే ఊరు ఉంది. దేవాలయం ఊరు కలగలిసినదే – శ్రీరంగం. దీనిని వైష్ణవ దివ్య దేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఆళ్వారులు ఈ క్షేత్ర మహిమను గానం చేశారు. ప్రధాన ఆలయంలో స్వామి శయనమూర్తిగా దర్శనమిస్తాడు. క్షీరసాగరంలో పవళించిన శ్రీమహావిష్ణువు నాభి నుంచి పద్మంలో జన్మించిన బ్రహ్మ ఇక్కడ కనపడడు. సూర్యోదయానికి ముందే బ్రహ్మదేవుడే స్వామివారిని పూజిస్తారని ఈ క్షేత్రానికి సంబంధించిన గాథలు చెబుతున్నాయి. స్వామి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధి నిర్వర్తిస్తాడనీ, శ్రీరంగంలో శయనిస్తాడనీ తెలుస్తోంది. విశిష్టాద్వైత స్థాపకుడు రామానుజాచార్యులు శ్రీరంగంలోనే అనేక సంవత్సరాలు ఉండి, స్వామి సేవలో పాల్గొన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం
దాదాపు 156 ఎకరాల విస్తీర్ణంలో, నాలుగు కి.మీ. పొడవైన ప్రాకారంతో ఈ దేవాలయం నిర్మితమై, ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయంగా చరిత్రలో నిలిచింది. ఇక్కడ 50 పైచిలుకు పరివార దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. స్వామివారి రాజగోపురం 236 అడుగుల ఎత్తు కలిగి (ఆసియాలోనే అతి పెద్ద రాజగోపురం), 13 అంతస్థులతో శోభాయమానంగా ఉంటుంది. శ్రీరంగంలో మొత్తం 21 గోపురాలు ఉండగా, తూర్పున ఉన్న గోపురంలో ముఖ్యమైన దేవుడిని ప్రతిష్ఠించారు. దీర్ఘచతురస్రాకారంగా ఉండే ఈ పీఠమే మొత్తం దేవాలయానికి గర్భగుడిగా, మూలస్థానంగా ప్రాచుర్యంలో ఉంది. ప్రాంగణంలోనే వసతి సముదాయాలు, వాణిజ్య సముదాయాలు కలిగిన ఆలయం ఇది. కంబోడియాలోని అంకోర్‌వాట్‌ మందిరం వైశాల్యంలో దీని కంటే పెద్దదే అయినప్పటికీ, ఆ దేవాలయం శిథిలావస్థలో ఉంది. కానీ ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతి పెద్ద హిందూ దేవాలయం మాత్రం శ్రీరంగమే.

అమ్మవారితో....
కావేరీ నదీ తీరాన మూడు ప్రసిద్ధ రంగనాథ దేవాలయాలు ఉన్నాయి. మైసూరు సమీపంలోని శ్రీరంగపట్టణంలో ఆది రంగడు, శివసముద్రంలో మధ్య రంగడు, శ్రీరంగంలోని రంగనాథస్వామి మందిరంలో అంత్య రంగడు. శ్రీరంగంలోని మండపాన్ని భోగమండపం అంటారు. రామ, కృష్ణావతారాలను విభవ అవతారాలుగా పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు ఈ క్షీరాబ్ధి నాథుడే మూలమని ఆళ్వారులు విశ్వసిస్తారు.

విభీషణుడికి రాముడిచ్చిన విగ్రహం
వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ సంతుష్టుడై తాను ఆరాధించేది శ్రీరంగనాథుడిననీ, కనుక నీవు కూడా ఆరాధించమనీ ఆ ఆరాధనను ఇక్ష్వాకు మహారాజుకు ప్రసాదించాడు. అలా రంగనాథ ఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది. సీతాపహరణం తరువాత విభీషణుడు రావణుడితో విభేదించి, రాముని  శరణు కోరి ఆశ్రయం పొందాడు. విభీషణుడి భక్తికి మెచ్చిన రాముడు రావణ వధ అనంతరం తమ ఆరాధ్య దైవం అయిన రంగనాథుడి విగ్రహాన్ని అతడికి ఇస్తూ ‘లంకకు తీసుకెళ్లు. కాని దారిలో ఎక్కడా ఈ విగ్రహాన్ని నేల మీద ఉంచకూడదు’ అని వివరించాడు. కానీ విభీషణుడు ఉభయ కావేరుల మధ్యనున్న ద్వీపంలో విశ్రమించేందుకు విగ్రహాన్ని దించి తిరిగి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆశ్చర్యంగా ఆ విగ్రహం రాలేదు. ఈ సంగతి తెలిసిన ఆ ప్రాంత పాలకుడు ధర్మచోళుడు విభీషణుడిని ఓదార్చి, ‘స్వామివారు ఇక్కడ ఉండేందుకు ఇష్టపడుతున్నందున ఇక్కడే దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుడదాం’ అన్నాడు. విభీషణుడి కోరిక మేరకు స్వామివారు లంక ఉన్న దక్షిణ దిక్కునకు తిరిగారని స్థల పురాణం చెబుతోంది.

చంద్రగిరికి చేరిన ఉత్సవమూర్తి
ఇక్కడ గర్భాలయంలో శయనించి ఉన్న మూర్తిని పెరియ పెరుమాళ్‌ అనీ, ఉత్సవమూర్తిని నంబెరుమాళ్‌ అనీ అంటారు. ఒకానొక సమయంలో తురుష్కుల వలన ఉపద్రవం ఏర్పడినప్పుడు శ్రీరంగనాథుల ఉత్సవమూర్తిని చంద్రగిరి ప్రాంతానికి చేర్చారనీ, ఆ సమయంలో మరొక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా ప్రతిష్ఠించార నీ చరిత్ర.

బంగారు స్తంభాలు...
గర్భాలయంలో శ్రీరంగనాథుని ఎదుట ఉన్న బంగారు స్తంభాలను తిరుమణైత్తూణ్‌ అంటారు. ప్రసాదాలు స్వీకరించే ప్రదేశానికి గాయత్రి మండపం, గర్భాలయానికి ముందున్న ప్రదేశానికి చందన మండపం, ప్రదక్షిణకు తిరువణ్ణాళి ప్రదక్షిణం అని పేరు.

ప్రాకారాలు...
మొదటి ప్రాకారంలో ద్వారపాలకుడు, యాగశాల, విరజా బావి, చిలకల మండపం, కణ్ణన్‌ సన్నిధి ఉన్నాయి. రెండో ప్రాకార గోపుర ద్వారంలో పవిత్రోత్సవ మండపం, దొర మండపం ఉన్నాయి. ఇక్కడ ఉన్న విరజా మండపం క్రింది నుంచి విరజానది ప్రవహిస్తోందని పండితులు చెబుతారు. విణ్ణప్పం అంటే అభ్యర్థన జరిగే మండపంలో ధ్వజారోహణ మండపం కూడా ఉంది. ఇక్కడ స్తంభాల మీద ఉన్న వినీత ఆంజనేయస్వామి వరాలివ్వగల శక్తిమంతుడని చెబుతారు. మూడవ ప్రాకారాన్ని అలినాడన్‌ తిరువీధి అంటారు. ఈ వీధిలో గరుత్మంతుని సన్నిధి,  వెలుపల వాలి సుగ్రీవుల సన్నిధులు ఉన్నాయి. నమ్మాళ్వార్‌ సన్నిధి ఈ ప్రాకారంలోనే ఉంది. ప్రాకారానికి ఎడమ భాగంలో ధాన్యం కొలిచే మండపం, దీని ప్రక్కన నంజీయర్‌ సన్నిధి ఉన్నాయి. ఈ ప్రాకారంలో ఇంకా చంద్ర పుష్కరిణి, పొన్న చెట్టు, వేదవ్యాస సన్నిధి, వరదరాజస్వామి సన్నిధి, వైకుంఠనాథన్‌ సన్నిధి, సూర్య పుష్కరిణి... వంటివి ఎన్నో ఉన్నాయి. ప్రతి సంవత్సరం పది దినాలు శ్రీరంగనాథులు కొలువుతీరే వేయి కాళ్ల మండపం ఉంది. దీనిని సహస్రస్థూణా మండపం అంటారు. ఈ మండపంలో స్వామి వేంచేసి ఉండే స్థలానికి తిరుమామణి మండపం అని పేరు.

ఉత్సవాలు..
ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాటి వైకుంఠ ద్వార దర్శనం సుప్రసిద్ధం. ఉగాది, విజయదశమి మొదలైన ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఇక్కడ ప్రతి నిత్యం ఉత్సవ సంబరమే.

లౌకికవాదానికి ప్రతీక...
ఢిల్లీ సుల్తాన్‌ కాలంలో ఇక్కడ మూర్తిని ఢిల్లీకి తరలించాడనీ, సుల్తాన్‌ కుమార్తె స్వామి భక్తురాలిగా మారిందనీ, అనంతరం ఈ విగ్రహాన్ని రామానుచార్యులు శ్రీరంగానికి తీసుకువచ్చాడనీ, సుల్తాన్‌ కుమార్తె తన విశేష భక్తితో స్వామివారిలో ఐక్యమైందని చెబుతారు. ఇందుకు ప్రతీకగా ఇప్పటికీ పౌర్ణమి, ఏకాదశి సమయాల్లో స్వామివారు లుంగీ ధరించి, కనిపిస్తారు. రోటీలను నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా ఉంది. షేక్‌ చినమౌలానా ఈ ఆలయానికి ఆస్థాన నాదస్వర విద్వాంసునిగా పనిచేశారు. ఈయనది ప్రకాశం జిల్లా కరవది గ్రామం.

ఈ దేవాలయంలో గరుడాళ్వార్‌ 25 అడుగుల ఎత్తులో దర్శనమిస్తాడు. 30 మీటర్ల పొడవాటి వస్త్రంతో స్వామిని అలంకరిస్తారు. అతి సుందరమైన శిల్పకళతో ఒక మండపం ఇక్కడి గరుడాళ్వార్‌కి ఉంది. ఈ ఆలయంలో మాత్రమే శ్రీరంగనాథస్వామిని భక్తిప్రపత్తులతో ఆరాధించిన మహమ్మదీయ రాణి తుళ్లకునాచ్చియార్‌ చిత్రం ఉంది. ఈ ఆలయంలో భగవద్‌ శ్రీరామానుజాచార్య స్వామి పార్థివ దేహాన్ని ఎనిమిదవ శతాబ్దంలో కొన్నాళ్లు భద్రపరిచారు. ద్రావిడ శైలిలో నిర్మితమైన ఈ దేవాలయం ప్రాకృతిక ఉపద్రవాల అంచున ఉంది. గతంలో చాలాసార్లు డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్‌ వారి దాడులను తట్టుకుని కాలపరీక్షకు నిలబడింది.

శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా సాధ్యం కాని ఇంతటి బృహత్తరమైన ఆలయాన్ని ఆ రోజుల్లో మనవారు ఎలా నిర్మించగలిగారో అంతుచిక్కదు. ఆలయంలో ఉన్న వెయ్యి స్తంభాల మండపం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఇన్ని స్తంభాలను ఎంత మంది శిల్పులు, ఎలా నిర్మించారో అంతు చిక్కదు. బరువైన రాళ్లను ఎత్తయిన ప్రదేశాలోకి ఏ విధంగా తీసుకువెళ్లారన్నది సమాధానం లేని ప్రశ్న.

దర్శన వేళలు...:
ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. మధ్యాహ్నం 12 నుంచి 1.5 మధ్య తిరిగి సాయంత్రం 6 నుంచి 6.45 మధ్య పూజ జరుగుతుంది. ఈ సమయంలో దర్శనానికి అనుమతించరు. ఉదయం 6 నుంచి 7.15 వరకు విశ్వరూప సేవ ఉంటుంది. ఈ సేవలో పాల్గొనాలనుకుంటే 50 రూపాయలు టికెట్‌ కొనుగోలు చేయాలి. శీఘ్ర దర్శనం కావాలనుకుంటే 250 రూపాయల టికెట్‌ కొనాలి.

సౌకర్యాలు...: వసతి సౌకర్యాలకు ఇబ్బంది లేదు. దేవాలయ వసతి గృహాలున్నాయి. ప్రైవేట్‌ హోటల్స్, లాడ్జీలు ఉన్నాయి. సాధారణ హోటల్స్‌ నుంచి ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌ వరకు చాలా అందుబాటులో ఉన్నాయి.

ఇలా చేరుకోవచ్చు...
తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగానికి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఉంది. ఇక్కడి నుంచి దూరం కేవలం 9 కి.మీ. పావుగంటలో చేరుకోవచ్చు. తిరుచిరాపల్లిలో రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి శ్రీరంగానికి 15 నిమిషాలలో చేరుకోవచ్చు. చెన్నై నుంచి తిరుచిరాపల్లి 333 కిలోమీటర్లు.
– డా. పురాణపండ వైజయంతి