Sunday, 29 January 2017

లక్షద్వీప్‌


లక్షద్వీప్‌
పేరుకే లక్షద్వీప్‌... ఉన్నది 36 దీవులే!

లక్షద్వీప్‌... ఆ పేరు వినగానే అక్కడ అన్ని దీవులున్నాయేమో అనుకుంటారంతా. కానీ అది కేవలం 36 దీవుల సమాహారం. అరేబియా సముద్రంలో ఆణిముత్యాల్లా మెరిసే ఆ దీవుల్ని చూడాలని బయలుదేరాం. అక్కడ విహరించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. హైదరాబాద్‌ నుంచి కొచ్చీ చేరుకుని ఆ దీవుల్లోని పర్యటకశాఖ నుంచి అనుమతి తీసుకున్నాం. పర్యటక శాఖవారి ఓడలో అయితే భోజన, వసతి సదుపాయాలూ సముద్ర క్రీడలూ అన్నీ వాళ్లే ఏర్పాటుచేస్తారు. నెల రోజుల ముందుగానే యాత్రకు టిక్కెట్లు బుక్‌ చేసుకున్నాం.

అది 150 గదుల ఓడ!
కొచ్చీలో లక్షద్వీప్‌ కేంద్రం దగ్గర ఉదయం 9 గంటలకు ఓడ ఎక్కడానికి అందరం కలిశాం. లగేజీ స్కానింగ్‌ చేశాక చెక్‌ఇన్‌ అయ్యాం. అక్కడే ఓడ బోర్డింగు పాసులు అందజేశారు. పర్యటకులందరికీ కాంప్లిమెంటరీ టీషర్టూ, ఆ దీవుల క్యాలెండరూ, టోపీలూ జ్ఞాపికలుగా ఇచ్చారు. బస్సులో కె.వి. సముద్రం అనే ఓడ దగ్గరకు సరిగ్గా 11 గంటలకు చేరుకున్నాం. మాతోపాటు ఆ దీవుల నివాసితులు కూడా ఆ ఓడ ఎక్కారు. ఐదు అంతస్తులతో 150 గదులతో మొత్తం 750 మంది ప్రయాణించడానికి వీలుగా ఉంది. ఐదో అంతస్తులో మొదటి తరగతి AC గది తీసుకున్నాం. రైల్లోని రెండో AC మాదిరిగానే ఓడలో కూడా కిందొక బెర్తూ పైనొక బెర్తూలాంటి మంచాలు ఉన్నాయి. టేబులూ రెండు కుర్చీలూ లగేజీ పెట్టుకునేందుకు వీలుగా ఓ బీరువా, అటాచ్డ్‌ టాయ్‌లెట్‌ ఉన్నాయి. గది చిన్నగా సౌకర్యంగా ఉంది. కిటికీలోనుంచి చూస్తే కనుచూపుమేరా అనంతసాగరమే. లక్షదీవుల్లో 36 ఉన్నప్పటికీ పది దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. అధికార భాష మలయాళం. అయితే చాలామంది హిందీ మాట్లాడగలరు. మధ్యాహ్నం రెండుగంటలకు భోజనం ముగించుకుని ఓడ చూడ్డానికి బయలుదేరాం. సమాచార కేంద్రం, హాస్పిటల్‌, భోజనశాల, వినోదకార్యక్రమాలు నిర్వహించే హాలు... అన్నీ ఉన్నాయి. కెప్టెన్‌ అనుమతితో ఫ్రంట్‌ ఆపరేషన్‌ రూములో ఓడ వివరాలన్నీ తెలుసుకున్నాం. GPS నావిగేషన్‌, సెక్యూరిటీ, వాతావరణం, సిగ్నల్‌ వ్యవస్థ ఇలా సముద్రప్రయాణానికి అవసరమైనవాటి అన్నింటి గురించీ వివరించారు. మా టూర్‌ మేనేజర్‌ అన్ని అంతస్తుల్లోకి వెళ్లి ఓడలో ఉన్న సదుపాయాలూ భోజనవేళలతోపాటు యాత్ర గురించిన వివరాలు తెలియచేశాడు. సాయంత్రానికి అందరం ఓడ పైనున్న డెక్‌కు చేరుకున్నాం. సాగరతీర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అందరం ఆనందంగా గడిపాం. రాత్రి 8 గంటలకు డైనింగ్‌హాల్‌కు చేరుకుని భోజనం చేసి విశ్రమించాం.

అక్కడ మద్యపానం నిషిద్ధం!
రెండోరోజు వేకువనే సూర్యకిరణాలు క్యాబిన్‌లోకి రావడంతో మెలకువ వచ్చింది. డెక్‌పైకి వెళ్లి సూర్యోదయాన్ని చూస్తే కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. సముద్రాన్ని చీల్చుకుంటూ సూర్యుడు పైకి వస్తున్నాడా అనిపించింది. ఉదయభానుడి కిరణాలతో అలలు వెండి వెలుగులో మెరుస్తున్నాయి. అక్కడక్కడా పైకి ఎగురుతూ మళ్లీ నీళ్లలోకి దూకే టూనా చేపల్ని చూస్తుంటే ఆ కాంతికిరణాల మెరుపుకి ఆనందంతో అవి నృత్యం చేస్తున్నట్లే ఉంది. అల్పాహారం ఓడలోనే ముగించి లైఫ్‌జాకెట్‌లు ధరించి పడవల్లో తీరం చేరుకున్నాం. కనుచూపుమేరలో మినికాయ్‌ దీవి నీలిజలాలతోనూ కొబ్బరితోటలతోనూ ఆకర్షిస్తోంది. కొచ్చి నుంచి ఈ దీవికి సుమారు 400 కిలోమీటర్ల దూరం. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో 20 గంటలపాటు ఓడలో ప్రయాణించి అక్కడకు చేరుకున్నాం.

మినికాయ్‌దీవివాసుల ఆచార వ్యవహారాలూ మిగిలినవారికంటే భిన్నంగా ఉంటాయి. పురుషులు మలయాళీల వస్త్రధారణలోనే ఉన్నారు. స్త్రీలు రంగురంగుల బురఖాలు ధరించారు. ముస్లిం జనాభా ఎక్కువ. తీర ప్రాంతంలో ఉండే తేమ వాతావరణమే అక్కడా ఉంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడు. ఉక్కబోత ఉన్నా చెమట లేదు. ఎండ తీవ్రత మాత్రం తెలుస్తోంది. లక్షదీవుల్లో మద్యపానం నిషేధం. బంగారం అనే ఒక్క దీవిలోనే అనుమతిస్తారు. మేం 1885లో సర్‌ జేమ్స్‌ నికోలస్‌ డగ్లస్‌ నిర్మించిన వైట్‌హౌస్‌ చూడ్డానికి వెళ్లాం. అక్కడ చల్లని తీయని కొబ్బరిబొండాలతో స్వాగతించారు. ఐదు అంతస్తుల ఎత్తున్న లైట్‌హౌస్‌లో వృత్తాకారంలో ఉన్న 400 మెట్లు ఎక్కి పైకి వెళ్లాం. అక్కడ నుంచి చూస్తే ఎక్కడా నేల కనిపించకుండా పైకి లేచిన కొబ్బరితోటలూ అలలు అంతగాలేని గంభీరముద్రలోని నీలిసాగరజలాలూ తీరంవెంబడి చూడచక్కగా కట్టిన రిసార్టులూ ఈతకొలనులతో ప్రకృతి అందాలన్నీ అక్కడే కొలువుదీరాయా అనిపించింది. అన్ని అంతస్తులు ఎక్కిన శ్రమంతా ఎటుపోయిందో తెలియదు. అక్కడ నుంచి అందరం రిసార్టుకి చేరుకున్నాం. అక్కడే పర్యటక శాఖ ఉచితంగా ఏర్పాటుచేసిన వాటర్‌స్పోర్ట్స్‌కు లైఫ్‌జాకెట్‌తో వెళ్లాం. చిన్న పడవలతో స్వయంగా తెడ్డు వేసుకుంటూ కయాకింగ్‌ చేసి ఆనందించాం. ముఖానికి మాస్క్‌ వేసుకుని సముద్రంలోపలున్న జీవుల్ని చూసే స్నోర్కలింగ్‌కి వెళ్లాం. వాటర్‌స్కూటర్‌, బనానా బోట్‌రైడ్‌లకు మాత్రం ఇష్టమైన వాళ్లు టిక్కెట్లు కొనుక్కుని వెళ్లారు. కొంతమంది స్కూబా డైవింగ్‌కి వెళ్లారు. భోజన సమయానికి అందరం తిరిగి రిసార్టుకి చేరుకున్నాం. టూనా చేప వంటకాలతో భోజనం వడ్డించారు.

సాంఘిక జీవనం!
కాసేపు విశ్రాంతి తీసుకున్నాక విలేజ్‌ టూర్‌కి ఆటోల్లో తీసుకెళ్లారు. అక్కడ మహిళలు స్వయంగా తయారుచేసిన కొబ్బరి స్వీటు, మసాలావడ, తేనీటిని అల్పాహారంగా ఇచ్చారు. పక్కనే వాళ్ల ఇళ్లు ఉన్నాయి. మధ్యలో అందరికీ ఉమ్మడిగా ఉన్న వంటగదిలో కొందరు స్త్రీలు సముద్రంమీదకి పనికి వెళ్లిన తమ మగవాళ్లకోసం కొన్ని వంటకాలు చేస్తూ కనిపించారు. పదిమంది స్త్రీలు రోజూ వంతులవారీగా అన్ని రకాల వంటల్నీ కొబ్బరి మట్టల్ని మండించే మట్టిపొయ్యిలమీద చేస్తుంటారట. వాళ్లలా సాంఘిక జీవనం కొనసాగించడం ఎంతో ముచ్చటగొలిపింది. గ్రామంలో జనాభా కేవలం రెండువేలమంది మాత్రమే. సాయంత్రం వరకూ ఆ పచ్చటి చెట్ల మధ్య గడిపి ఓడమీదకి చేరుకున్నాం.

అంతా అక్షరాస్యులే!
మర్నాడు ఉదయం ఆరు గంటలకు కాల్‌పెనీ అనే మరో దీవికి చేరుకున్నాం. అల్పాహారం ఓడలోనే ముగించి ఉత్సాహంతో ఈ దీవిలోకి అడుగుపెట్టాం. ఈ దీవి జనాభా నాలుగు వేలు కాగా అందరూ అక్షరాస్యులే. వాళ్లలో దాదాపు 500 మంది వైద్యులేనట. లక్షదీవుల్లో మెట్రిక్‌ పాసయిన మొదటి మహిళది కూడా ఈ దీవేనట. ఆమెకిప్పుడు 83 సంవత్సరాలు. ఓ గ్రామంలో ఉన్న ఆమెను చూశాం. ఆ దీవిలో దక్షిణంవైపు అలలు సముద్రక్రీడలకు అనుకూలంగా లేకపోవడంతో నార్త్‌ ఎండ్‌ టిప్‌కు తీసుకుని వెళ్లారు. పది నిమిషాల ప్రయాణంలో అటూ ఇటూ కూడా సముద్రం కనిపిస్తూ ఉంది. పచ్చని కొబ్బరి చెట్ల మధ్యలో మునగచెట్లు ఉన్నాయి.

నార్త్‌ ఎండ్‌ టిప్‌కు చేరుకోగానే మూడువైపులా సముద్రం కనిపించింది. అక్కడ అలలు అంత ఉధృతంగా లేవు. మధ్యలో బండరాళ్లూ అడుగున ఇసుకరేణువులు కనిపించేంత తేటగా ఉన్నాయక్కడి జలాలు. కాసేపు అక్కడ గడిపి తిరిగి రిసార్టుకి చేరుకుని సముద్ర క్రీడలకు వెళ్లాం. కాల్‌పెనీలో 1947లో సంభవించిన తీవ్ర తుఫానువల్ల కొంత భూభాగం విడిపోయింది. కాస్త దూరంలో ఉన్న ఆ దీవికి మమ్మల్ని పడవల్లో తీసుకువెళ్లారు. సముద్రంలోపల నాచుమొక్కలూ సీకుకుంబర్‌... వంటి జంతువులూ ఎక్కువగా ఉన్నాయి. ఆ జంతువుల్ని పట్టుకుంటే మెత్తని స్పాంజుల్లా ఉన్నాయి. స్నోర్కలింగ్‌కి వెళ్లినప్పుడు వివిధ ఆకారాల్లో రంగుల్లో ఉన్న కోరల్స్‌ కనిపించాయి. వాటిమధ్యలో అటూఇటూ తిరుగుతోన్న గోల్డ్‌ఫిష్‌లూ చారల చేపలూ స్నేక్‌ ఫిష్‌లూ... ఇలా చాలా రకాలు కనిపించాయి. మధ్యాహ్న భోజనానంతరం గ్రామంలో తిరుగుతూ అక్కడ నివసిస్తోన్న కుటుంబాలతో మాటలు కలిపాం.

అక్కడి ప్రజలు సౌమ్యులూ స్నేహశీలురూ. మా సంభాషణ అంతా హిందీలో సాగింది. అక్కడ ప్రభుత్వం నిర్వహిస్తోన్న కొబ్బరి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను సందర్శించాం. కొబ్బరినూనె, కొబ్బరిపొడి తయారీ చూపించారు. తరవాత మహిళలు స్వయం సహాయక బృందంగా ఏర్పడి తయారుచేస్తోన్న టీషర్టు యూనిట్‌ని కూడా చూశాం. ధర తక్కువగా ఉండటంతో వాటిని కొనుక్కున్నాం. తిరిగి సాయంత్రానికి రిసార్టుకి చేరుకున్నాం. అక్కడ స్థానిక జానపద, సంప్రదాయ నృత్యరీతుల్ని ప్రదర్శించారు. మల్‌ అనే భాషలో వారు పాడుతున్న పాట అర్థం కాకపోయినా వారి లయవిన్యాసాలను చూసి ముగ్ధులమయ్యాం. చేతిలో డప్పులాంటి పరికరంతో శబ్దం చేస్తూ అడుగులు వేసే తీరు ఎంతో బాగుంది. రాత్రికి ఓడకు చేరుకున్నాం.

వందల రకాల చేపలు!
మూడోరోజు ఉదయానికల్లా లక్షద్వీపాల రాజధాని అయిన కవరట్టి అనే దీవికి వెళ్లాం. 11 వేల జనాభా ఉన్న ఆ దీవి అన్నింటికన్నా పెద్ద దీవి కూడా. ఇక్కడ కొన్ని ఇళ్లు అధునాతనంగా ఉన్నాయి. అక్కడ సముద్రం అడుగున ఉన్న జీవరాశుల్ని చూపించడానికి తీసుకెళ్లారు. రంగురంగుల చేపలూ సీఅనీమోన్‌లూ బ్రెయిన్‌ కోరల్సూ ఫింగర్‌ కోరల్సూ లాంటివాటిని చూపించారు. సముద్రం అడుగున ఇంత పెద్ద ప్రపంచం ఉందా అని ఆశ్చర్యం వేసింది. కోరల్స్‌ సేకరించడం నిషిద్ధం. కొందరు స్కూబాడైవింగ్‌ చేస్తే మిగిలిన వాళ్లు తీరందగ్గరే వాటర్‌స్కూటర్‌, నీబోర్డు... తదితర క్రీడలతో కాలం గడిపారు. భోజన సమయానికి అందరం రిసార్టుకి చేరుకున్నాం. కాసేపు విశ్రమించాక మినీ బస్సులో గ్రామ సందర్శనకు వెళ్లాం. రోడ్లన్నీ సిమెంట్‌తో వేసినవే. ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుచేసిన మ్యూజియంలో వందల రకాల చేపల్ని ప్రదర్శనకు ఉంచారు. పక్కనే మరో భవనంలో సొరచేపల ప్రదర్శన కూడా ఏర్పాటుచేశారు. ఆ సాయంత్రం స్థానిక బాలికలతో ఏర్పాటుచేసిన జానపద నృత్య కార్యక్రమం ఎంతో అలరించింది. తేనీటి విందు అయ్యాక తిరిగి ఓడను చేరుకోవడానికి మరపడవల్లో బయలుదేరాం. రాత్రికి డెక్‌పై అందరం ఆనందంగా గడిపి అడ్రస్‌లు తీసుకుని, మర్నాడు ఉదయం 9 గంటలకు కొచ్చీ చేరుకున్నాం.

No comments:

Post a Comment