Monday, 16 January 2017

మిస్టరీ వాల్‌

ఆ గోడను ఎప్పుడు కట్టారో తెలియదు.. ఎవరు కట్టించారో అనవాలు దొరకడం లేదు.. ఏ ప్రయోజనాన్ని ఆశించి దాన్ని నిర్మించారో తెలుసుకుందామంటే అదీ కష్టసాధ్యంగానే ఉంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయ్సేన్‌ జిల్లాలో ఉన్న 80 కిలోమీటర్ల పొడవైన రాతిగోడ పురా వస్తు పరిశోధకులకు, చరిత్రకారులకు పెద్ద పజిల్‌గా మారింది.

వింధ్య పర్వత శ్రేణుల మీదుగా, కొండలు, అరణ్యాలు, పచ్చటి పొలాల్లో సైతం విస్తరించిన ఈ గోడ నిర్మాణం ఆసాంతం ఆశ్చర్యకరం. కొన్నిచోట్ల 15 అడుగుల ఎత్తుతో, మరికొన్ని ప్రాంతాల్లో నేలను తాకుతున్నట్లుగా, బోలెడు మలుపులతో ఉన్న ఈ రాతి కట్టడం వెంబడి ప్రయాణించడం ఓ అద్భుతమైన అనుభూతి. కొంతమంది ఔత్సాహికులు దీన్ని ఏకంగా ‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా’గా పేర్కొంటున్నారు. దీని పొడవు 80 కిలోమీటర్లు ఉంటుందని చెబుతున్నా అందులో చాలావరకూ కాలగర్భంలో కలిసిపోయింది. ఈ గోడను ఆనుకొని ఉన్న గ్రామాల్లో నివసించే ప్రజలు దీన్ని ముద్దుగా ‘దివాల్‌’ అని పిలుచుకుంటున్నారు.

అద్భుత శిల్పసంపద
ఈ గోడ పరిసరాల్లో ఇప్పటివరకు దొరికిన అవశేషాల్లో అద్భుతమైన శిల్పసంపద బయటపడింది. సుందరమైన దేవతా మూర్తుల విగ్రహాలు, నాగప్రతిమలు, సున్నపురాయితో నిర్మితమైన సరస్సులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతులేదు. అయితే సరైన పర్యవేక్షణ లేకపోవడం కారణంగా వీటిలో చాలావరకూ చోరుల పాలయ్యాయి. కొన్ని విగ్రహాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.

తెలిసింది కొంతే
అంతులేని రహస్యాలకు నిలయంగా మారిన ఈ గోడ విషయంలో ఇప్పటివరకూ తెలిసింది గోరంత మాత్రమే అని ఇంకా తెలియాల్సింది కొండంత ఉందని చారిత్రక నిపుణుల అభిప్రాయం. దట్టమైన అడవుల్లో లోపలకు ప్రయాణించే కొద్దీ ఈ గోడకు సంబంధించిన రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. అర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో సుదీర్ఘ కాలం పనిచేసి రిటైరైన పరిశోధకుడు ఒకరు దీనిపై అనేక సంవత్సరాలుగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ‘ఈ గోడ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అనవాళ్లు గానీ, శాసనాలు గానీ ఇప్పటివరకూ లభ్యం కాలేదు. అందువల్ల దీన్ని ఏ రాజుల కాలంలో నిర్మించారో అంచనా వేయడం అసాధ్యంగా మారింద’ని ఆయన అంటున్నారు.

అంతా రహస్యం
లెగో బ్రిక్స్‌ ఆకారంలో ఉన్న పెద్ద సైజు రాళ్లతో ఈ గోడను నిర్మించారు. గోడ లోపలి భాగంలో కొన్నిచోట్ల మెట్ల నిర్మాణాలు ఉన్నాయి. శత్రువుల రాకను దూరం నుంచే గుర్తించడానికి వీలుగా రహస్య ఏర్పాట్లున్నాయి. ఆయుధ సామగ్రిని భద్రపరుచుకోవడానికి కూడా గోడ లోపలే ఏర్పాట్లు చేశారు. వీటినిబట్టి ఈ గోడ ఒక సైనిక స్థావరంలా ఉపయోగించేవారేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పర్యాటకానికి అనుకూలం
కచ్చితంగా చెప్పలేకపోయినా 900-1300 సంవత్సరాల మధ్యలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజపుత్ర రాజుల కాలంలో దీన్ని నిర్మించి ఉండవచ్చని ఓ అంచనా. ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, టూరి్‌స్టలకు మంచి సందర్శనా స్థలంగా తీర్చిదిద్దితే బాగుంటుంది. ఇక్కడికి సమీపంలోనే భీంబెట్కాలో 30 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న గుహలను రాతియుగం నాటివిగా గుర్తించిన యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా ప్రకటించింది. సాంచీలోని బౌద్ధ స్థూపం కూడా గుర్తింపు పొందింది.

గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా
రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌కు సమీపాన ఉన్న కుంభల్‌గఢ్‌ కోట గోడ 38 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.. దీన్ని కట్టడంలో అప్పటివారి ప్రతిభ, అంకితభావాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాల్సిందే తప్ప మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. రాజపుత్ర యోధుడు మహారాణా ప్రతాప్‌ పుట్టింది కూడా ఈ కోటలోనే. ఆరావళీ పర్వత శ్రేణుల్లో నిర్మితమైన ఈ కోట రాజపుత్ర వీరుల సాహసాలకు ప్రత్యక్ష సాక్షి. ఇందులో 300 వరకూ పురాతన జైన ఆలయాలు, 60 హిందూ దేవాలయాలు ఉన్నాయి. దీన్ని నిర్మించిన మహారాణా కుంభ జ్ఞాపకార్థం రాజస్థాన్‌ టూరిజం విభాగం ఇక్కడ ఏటా మూడు రోజుల పాటు పండుగ నిర్వహిస్తుంది.

No comments:

Post a Comment