Monday, 23 January 2017

శిర్ఖండాదేవి - చంద్రవదనాదేవి


మంచు కొండల్లో మహాదేవి దర్శనం

హిమాలయ పర్వతాలు మహాదేవుడికే కాదు, మహాదేవికీ నిలయాలే అనడానికి నిదర్శనంగా నిలుస్తాయి ఉత్తరాఖండ్‌లోని శివాలిక్‌ శ్రేణుల్లోని శిర్ఖండాదేవి, చంద్రవదనాదేవి శక్తిపీఠాలు. అంటూ ఆ విశేషాలు చెప్పుకొస్తున్నారు పుణెకు చెందిన కర్రా నాగలక్ష్మి.

శిర్ఖండాదేవి

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో డెహ్రాడూన్‌ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ వేసవి విడిది మసూరీ రోప్‌వేలూ జలపాతాలూ బౌద్ధారామాలూ మాల్‌ రోడ్డూ మేఘాలను తాకుతున్నట్లుండే పర్వతాలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే వాటితోపాటు దాని చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు ఇంకేం ఉన్నాయా అని స్థానికుల్ని ఆరాతీయడంతో తెలిసినవే ఎన్నడూ వినని ఈ రెండు శక్తిపీఠాలు. ముందుగా శిర్ఖండాదేవిని దర్శించుకుందామని బయలుదేరాం. మసూరీకి 34 కిలోమీటర్ల దూరంలో ధనౌల్టీకి సమీపంలో సముద్రమట్టానికి సుమారు 2760 మీటర్ల ఎత్తులో ఉంది శిర్ఖండాదేవి ఆలయం. మసూరీ నుంచి అంతా ఘాట్‌ రోడ్డు ప్రయాణమే. చుట్టూ పైన్‌ చెట్లతో కూడిన దట్టమైన అడవి మధ్యలో మా ప్రయాణం సాగింది. రోడ్డు పక్క అక్కడో ఇల్లూ ఇక్కడో ఇల్లూ తప్ప మరేమీ లేవు. కద్దుఖల్‌ అనే గ్రామంలో ఓ చోట రెండు పాకలు వేసి ఉన్నాయి. నాలుగు గుర్రాలు కూడా ఉన్నాయి. కానీ మేం ఈ గ్రామం నుంచి నడిచి వెళ్లాలనుకున్నాం. అయితే చలి బాగా ఉండటంతో అక్కడి పాకలో వేడివేడి టీ తాగి నడక ప్రారంభించాం. మూడు కిలోమీటర్లు నడవడానికి మాకు గంటన్నర సమయం పట్టింది. అక్కడ దారి మెట్లు మెట్లుగా జారుడుగా ఉంది. కొన్ని మెట్ల తరవాత వంకలు తిరిగిన సన్నని కాలి బాట మొదలైంది. ఆ తరవాత దారి నిట్టనిలువుగా పైకి ఎక్కేలా ఉంది. చుట్టూ ఉన్న ప్రకృతి సోయగం ఆయాసాన్ని మరిపించినా అంత చలిలోనూ మాకు చెమటలు పట్టాయి. ఎట్టకేలకు మందిరం ప్రాంగణంలోకి అడుగుపెట్టాం. అక్కడ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన బోర్డు మీద మందిరం స్థలపురాణం వివరంగా రాసి ఉంది. వెళ్లగానే ముందు మందిరంలోకి వెళ్లాం. అది చాలా చిన్నగా ఉంది. అమ్మవారి విగ్రహం కూడా చాలా చిన్నది. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోగానే అక్కడేదో శక్తి ఉన్నట్లే అనిపించింది. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి మృతదేహంతో ఆ పరమశివుడు చేసిన రుద్రతాండవం కారణంగా ఆమె శిరస్సు శరీరం నుంచి వేరయి ఈ పర్వత శిఖరాల మీద పడిందట. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాల్నే శక్తిపీఠాలుగా పిలుస్తారు. అలా ఆమె శిరస్సు పడటం ద్వారా వెలసినదే ఈ శిర్ఖండా దేవి. ఇక్కడ దేవీ నవరాత్రులూ గంగా నవరాత్రులూ నిర్వహిస్తారు. ఆ సమయంలో చుట్టుపక్కల ప్రదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. మిగిలిన సమయాల్లో పెద్దగా ఉండరు. మేం వెళ్లినప్పుడు ఆ మందిరంలో ఇంకెవ్వరూ లేరు. అందుకే అక్కడ చాలాసేపు కూర్చుని స్తోత్రాలు చదువుకుని తిరుగుప్రయాణమయ్యాం.

చంద్రవదనాదేవి!
ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా మంచుపడుతూ ఉంటుంది. వర్షాకాలంలో పర్యటించకపోవడమే మేలు. తిరుగుప్రయాణంలో మేం మసూరీకి కాకుండా స్థానికుల నుంచి సమాచారం తీసుకుని చంద్రవదనాదేవి పీఠానికి బయలుదేరాం. దేవ ప్రయాగ రోడ్డులో ప్రయాణం మొదలైంది.

దారి మొత్తం కొండ రోడ్డే. అడవిగుండానే సాగుతుంది. అక్కడక్కడా చిన్న చిన్న గ్రామాలూ మెట్ట వ్యవసాయం తప్ప మరేమీ లేవు. సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించాక జామనీఖాల్‌ గ్రామానికి చేరుకున్నాం. అక్కడ నుంచి సుమారు మరో ఏడు కిలోమీటర్లు ప్రయాణించి చంద్రవదనీ పర్వతానికి చేరుకున్నాం. అక్కడ నుంచి సుమారు ఓ కిలోమీటరు కొండమీదకి నడిచి చంద్రవదనాదేవి మందిరానికి చేరుకున్నాం. ఇది కూడా చాలా చిన్న మందిరం. మందిరం దగ్గర పూజారి తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. గర్భగుడి మధ్యలో ఎర్రని బట్ట పైనుంచి కట్టి ఉంది. పూజారిని అది తొలగిస్తే అమ్మవారిని దర్శించుకుంటామని అడిగాం. అయితే దాన్ని ఎప్పుడూ తొలగించమని ఆయన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాం. చంద్రవదనాదేవి అంటే అందమైనది అని అర్థం. అయితే ఆ మందిరంలో అసలు అమ్మవారి విగ్రహమే లేదట. మరక్కడ ఏమి ఉంటుందని అడిగితే ఆయనకూ సరిగ్గా తెలీదట. కానీ శ్రీచక్రం ఉండొచ్చు అన్నాడు. ఎందుకంటే రోజూ ఉదయమూ సాయంత్రమూ పూజారి కళ్లకు గుడ్డ కట్టుకుని ధూపదీపనైవేద్యాలు సమర్పించి ఇవతలకు వస్తారట. రుద్రతాండవం చేస్తోన్న శివుణ్ణి ఆపేందుకు విష్ణుమూర్తి తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె గుప్తాంగం చంద్రవదనీ పర్వతంమీద పడిందట. అమ్మవారి ప్రతిరూపమైన శ్రీచక్రాన్ని అంగం ఉన్న ప్రదేశంలో ప్రతిష్టించి ఉంటారనీ దాన్ని పరులెవరూ చూడకూడదనీ చెప్పారాయన. అక్కడ ఉన్న ఎర్ర బట్టను సైతం కళ్లకు గంతలు కట్టుకుని ఏడాదికోసారి మారుస్తారట. అందుకే మేం కూడా ఆ ఎర్రబట్టకు ఇవతల నుంచే పూజ ముగించి బయటకు వచ్చాం. దసరా నవరాత్రుల్లో చుట్టుపక్కల గ్రామ ప్రజలు వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. తిరుగుప్రయాణంలో సుమారు 35 కిలోమీటర్లు ప్రయాణించి దేవప్రయాగకు చేరుకున్నాం. అప్పటికే సాయంత్రం ఏడవడంతో ఆ రాత్రికి అక్కడే బస చేసి, అరుదైన శక్తి పీఠాలను దర్శించుకున్నామన్న సంతృప్తితో ఆ మర్నాడు పుణెకి తిరిగి వచ్చాం.

No comments:

Post a Comment