Sunday, 29 January 2017

కర్ణాటక కోస్తా తీరం


ఆ ఉదయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం!
అరేబియా సముద్ర అందాలూ సుందర ప్రకృతి దృశ్యాలూ వాటి నడుమ వెలసిన పౌరాణిక క్షేత్రాలతో అలరారే అద్భుత ప్రదేశమే కర్ణాటక కోస్తా తీరం అంటున్నారు ఆ ప్రాంతాన్ని సందర్శించిన హైదరాబాద్‌కు చెందిన AVS ప్రసాద్‌.

కర్ణాటక రాష్ట్రంలో ఉడుపి, కొల్లూరు, శృంగేరి, హోర్నాడు, ధర్మస్థల, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ ఏకకాలంలో చూసి రావాలనుకుని పక్కా ప్రణాళికతో కాచిగూడలో యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాం. తెల్లవారుజామున నాలుగు గంటలకు అక్కడ దిగి, అక్కడ నుంచి తిరిగి ఉదయం ఏడు గంటలకు కరవార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉడుపికి బయలుదేరాం. కరవార్‌ ఎక్స్‌ప్రెస్‌ వారానికి మూడుసార్లు అంటే సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయాన్నే బయలుదేరుతుంది. ఇది కాకుండా బెంగళూరు నుంచి రోజూ రాత్రి 8 గంటలకు బయలుదేరే కరవార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉడుపి, కొల్లూరు చేరుకోవచ్చు.

మేం ఎక్కిన రైలు హాసన్‌ దాటాక కుక్కి క్షేత్రం వరకూ ప్రకృతి కనువిందు చేసింది. ఆ కొద్ది మేర కొండదారి కావడంతో రైలు సుమారు 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ప్రయాణ మార్గానికి ఓ వైపు కొండలూ మరోవైపు లోయలూ సెలయేళ్లతో అద్భుతంగా ఉంది. రైలు సుమారు 50 గుహల గుండా ప్రయాణం చేస్తుంది.

సాయంత్రం ఎనిమిది గంటలకు ఉడుపి శ్రీకృష్ణ క్షేత్రాన్ని చేరుకుంది. రైల్వేస్టేషనుకు వూరు 5 కి.మీ. దూరం. ఆటోలో శ్రీకృష్ణ ఆలయానికి దగ్గరలోని ఓ గెస్ట్‌హౌస్‌కి వెళ్లాం. ఈ ఆలయానికి దగ్గరలోని గీతా మందిర్‌, ఇతర మఠాలు, ఇంకా లాడ్జీల్లో పర్యటకులకు వసతి సౌకర్యం ఉంటుంది. ఆలయానికి వెళ్లేటప్పుడు బస చేసిన తాలూకు కాగితాలనూ మన ఐడీప్రూఫ్‌నూ మరిచిపోకుండా తీసుకెళ్లాలి. ఉదయాన్నే బయలుదేరి ఆలయానికి చేరి స్వామిని దర్శించుకున్నాం. ఒకప్పుడు భూకంపం తరవాత శ్రీకృష్ణ భక్తుడైన కనకదాసు ఎలాగయితే ఆయన్ని దర్శించుకున్నాడో అదేమాదిరిగా భక్తులు కిటికీలో నుంచే చూడాలి. ఉడుపి కృష్ణునికి చేసే అలంకారం ఎంతో ముద్దుగా ఉంటుంది. కృష్ణ జన్మాష్టమిని ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతారు. తరవాత మందిరం ముందున్న పుష్కరిణినీ పక్కనే ఉన్న అనంతేశ్వర స్వామినీ చంద్రమౌళీశ్వరుణ్ణీ దర్శించుకుని గదికి వచ్చి అన్నీ సర్దుకుని కారులో కొల్లూరు మూకాంబిక అమ్మవారి దర్శనానికి బయలుదేరాం.

కొల్లూరు మూకాంబిక అమ్మ వారు
ఉడుపి నుంచి కుందపుర మీదుగా కొల్లూరుకి 80 కిలోమీటర్ల దూరం. కుందపుర నుంచి కొల్లూరు వరకూ 40 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డు ప్రయాణం మనల్ని మరో లోకంలో విహరింపచేస్తుంది. కొండలూ, లోయలూ, జలపాతాలూ, కాఫీ తేయాకు తోటలూ, రబ్బరూ వక్క చెట్లతో ఎటుచూసినా పచ్చదనం పరవళ్లు తొక్కుతున్నట్లే అనిపిస్తుంది. సముద్రమట్టానికి 1300 మీటర్ల ఎత్తులో కొండల మధ్య కొలువైన మూకాంబిక అమ్మవారి దివ్యదర్శనం చేసుకుని తరించాం. కౌమాసుర అనే రాక్షసుణ్ణి పార్వతీదేవి మూకాంబిక అవతారంతో సంహరించిందన్నది పురాణ కథనం. అక్కడకు పదికిలోమీటర్ల దూరంలోనే కొడ్చాద్రి హిల్స్‌ ఉన్నాయి. సమయాభావంతో మేం అక్కడకు వెళ్లలేదు గానీ అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంటాయట.

సాగర తీరంలో శివరూపం!
తరవాత బైందూరు మీదుగా 66 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రాన్ని ఆనుకుని ఉన్న మురుడేశ్వర్‌ శివక్షేత్రాన్ని చేరుకున్నాం. ఇది ప్రపంచంలోకెల్లా రెండో అతి పెద్ద శివుని విగ్రహం. ఎంతో అందంగా నిర్మించిన ఆ విగ్రహాన్ని తనివితీరా చూసి తరించాం. ఇక్కడి ఆలయ గోపురం ప్రపంచంలోకెల్లా ఎత్తైనది. 21 అంతస్తులతో ఉన్న ఈ గోపురం పై అంతస్తులోకి ఎక్కేందుకు లిఫ్ట్‌ సౌకర్యం ఉంది. అక్కడ నుంచి అరేబియా సముద్రాన్నీ శివుడి విగ్రహాన్నీ వీక్షించవచ్చు. ఈ విగ్రహం ఇక్కడి బీచ్‌ను ఉత్తర దక్షిణాలుగా విడదీస్తూ ఆ ప్రాంతానికే తలమానికంగా నిలుస్తోంది. ఆ తరవాత ముందే అనుకున్న ప్రణాళిక ప్రకారం శృంగేరికి బయలుదేరాం.

సూర్యాస్తమయం... నయనానందకరం!
మేం శృంగేరికి అగుంటె మీదుగా బయలుదేరాం. ఎందుకంటే అగుంటె సూర్యాస్తమయ వీక్షణ ప్రదేశం. సముద్రమట్టానికి 2,700 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం నుంచి అరేబియా సముద్రంలో అస్తమిస్తోన్న సూర్యుణ్ని చూస్తుంటే కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ఎంతోమంది పర్యటకులు సూర్యాస్తమయ సమయానికి ఇక్కడకు చేరుకుని ఆ అందాలను తమ కెమెరాల్లో బంధిస్తారు. ఇక్కడ నుంచి శృంగేరి 25 కి.మీ. మేం అక్కడకు చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటలు కావొచ్చింది. మర్నాడు ఉదయం శారదా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అమ్మవారు స్వర్ణాభరణాలంకరణతో పుష్పార్చనలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారు. అమ్మ దర్శనంతో మా జన్మలు చరితార్ధమయ్యాయన్న భావన కలిగింది. జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు స్థాపించిన మొట్టమొదటి పీఠం శృంగేరి. మేం ఉదయాన్నే వెళ్లడంవల్ల భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. శారదా అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న అతి ప్రాచీనమైన విద్యాశంకరుల దేవాలయం కూడా దర్శించుకున్నాం. ఈ ఆలయం హొయసల నిర్మాణశైలిని కలిగి ఉంది. ఈ ఆలయాల పక్కనే తుంగానది వయ్యారంగా ప్రవహిస్తోంది.

ఉదయసంధ్య వేళలో...
ఈ ఆలయం నుంచి తుంగానది మీదుగా కాలినడకన వెళ్లే వంతెన ఉంది. ఆవలి వైపు పీఠాధిపతుల ఆశ్రమం ఉంది. ఉదయం వేళలో ఆ నది మీద కప్పేసిన పొగమంచూ ఆ పొగమంచును చీల్చుకుంటూ వస్తోన్న లేలేత బంగారు సూర్యకిరణాలూ నదిమీదుగా ఎగురుతోన్న పక్షుల గుంపులూ ఆ చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయతా... చూస్తుంటే సృష్టికర్త ఓ అందమైన చిత్తరువుని గీసి అక్కడ పెట్టాడా అనిపించింది. ఆ నదిలోని చేపలు భక్తులు వేసే మరమరాల కోసం నీటిమీద ఎగిరెగిరి పడుతున్నాయి. తుంగానదిలో నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. దాంతో కింద ఉన్న భూమి కనిపిస్తుంటుంది. ఆ ఉదయాన్ని మేం ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే ఇంతకన్నా  అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఇంతవరకూ ఎక్కడా చూడలేదు. అక్కడ అమ్మవారి ప్రధాన ఆలయం పక్కనే ఉన్న ఆది శంకరులు, తోరణ గణపతి ఆలయాలను దర్శించుకుని వీడలేక వీడలేక ఆ గుడి బయటకు వచ్చాం. అక్కడ నుంచి ఉదయం పది గంటలకే బయలుదేరి హోర్నాడు అన్నపూర్ణ అమ్మవారి దర్శనం కోసం బయలుదేరాం. శృంగేరి నుంచి హోర్నాడు 45 కిలోమీటర్ల దూరం. ఈ మార్గం కూడా మనల్ని కళ్లు తిప్పుకోనీయదు. ఎత్తయిన కొండలూ వాటి మధ్యనే బొమ్మరిళ్లలాంటి ఇళ్లతో నిండిన చిన్న చిన్న వూళ్లూ చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలా తోచాయి. అమ్మవారి ఆలయానికి చేరేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయింది. లగేజీని బస్టాండుకు దగ్గరలోనే ఉన్న ఓ షాపులో పెట్టి దర్శనానికి వెళ్లాం. అరగంటలోనే ఆది శక్త్యాత్మక అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దివ్యమంగళ దర్శనం చేసుకుని తరించాం. అగస్త్యేశ్వరుడు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. దర్శనం తరవాత అమ్మవారి భోజనం చేశాం. ఇక్కడికొచ్చే వాళ్లంతా ఆలయంవారు పెట్టే భోజనం తప్పక తింటారు. అక్కణ్ణుంచి మధ్యాహ్నం మూడు గంటలకే ధర్మస్థలకు బయలుదేరాం.

హోర్నాడు నుంచి కొట్టిగర మీదుగా ధర్మస్థల చేరుకోవాలి. ఇది సుమారు 95 కిలోమీటర్ల దూరం. అయితే కొట్టిగర వరకూ 40 కి.మీ. ప్రయాణం పూర్తిగా కొండలతో ఘాట్‌ రోడ్ల మధ్య సాగిపోతుంది. కొట్టిగర నుంచి ధర్మస్థల వరకూ 45 కిలోమీటర్ల విశాలమైన కొండదారి కిందకి దిగుతూ ఉంటుంది. ఇలా దిగేటప్పుడు మాత్రం చాలా మలుపులు ఉంటాయి. సాయంత్రం ఐదు గంటలకు ధర్మస్థల చేరుకుని ముందుగానే రిజర్వ్‌ చేసుకున్న గెస్ట్‌హౌస్‌లో దిగి బస చేశాం. ఈ ప్రదేశం తిరుమలలా ఉంది. వూళ్లొకి ప్రవేశించగానే త్రిశూలం పట్టుకుని ఉన్న పెద్ద శివుని విగ్రహం ఉంది. మేం వెళ్లిన రోజునా మర్నాడూ మంజునాథుణ్ణీ అమ్మవార్లనూ తనివితీరా దర్శించుకున్నాం. అమ్మవారి విగ్రహం చాలా చిన్నగా ఎన్నో ఆభరణాలతో ఉంటుంది. ఆలయంలోపల చతురస్రాకారపు చెక్కమీద రకరకాలైన దేవతా రూపాలు చెక్కి ఉన్నాయి. లోపల వినాయకుడి ఆలయం కూడా ఉంది. అవన్నీ చూసుకుని సాయంత్రానికి అక్కడకు 60 కిలోమీటర్ల దూరంలోని కుక్కి సుబ్రహ్మణ్యస్వామిని చూడ్డానికి వెళ్లాం.

సర్పరక్షిత క్షేత్రం!
ధర్మస్థల, కుక్కి క్షేత్రాల మధ్య ప్రతి అరగంటకీ బస్సులు ఉంటాయి. కుక్కిలో అతి తక్కువ రుసుముతోనే బస చేయడానికి అన్ని వసతులతో కూడిన కుమార కృప, స్కంద కృప, కార్తికేయ మొదలైన అతిథిగృహాలూ ప్రైవేటు లాడ్జీలూ ఉన్నాయి. ఉదయాన్నే ఇక్కడ ప్రవహించే కుమారధార నదిలో స్నానం చేసి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాం. గర్భగుడిలో కింద శివలింగం, దానికి నాగాభరణం, పైన మళ్లీ నాగాభరణం, ఆపైన దేదీప్యమానంగా వెలిగిపోతూ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నారు. సుబ్రహ్మణ్యుడికి కుడివైపున ఉమామహేశ్వర మందిరం ఉంది. బయట ఉన్న మరో చతురస్ర ప్రాకారంలో నాగప్రతిష్ఠమండపం, సంకల్ప మండపం, శృంగేరి మఠం, హోసొలిగమ్మ ఉన్నాయి. కుక్కి ముందుగా శివ క్షేత్రం. శివుడు పరీక్షిత్‌ మహారాజుకి వరమివ్వడంతో సుబ్రహ్మణ్యుడు ఇక్కడ వెలిశాడట. సుబ్రహ్మణ్యుడు, ఆది సుబ్రహ్మణ్యుడుగా పుట్ట రూపంలో ఇక్కడే ఉన్న వేరొక ఆలయంలో కొలువై ఉన్నాడు. భక్తులందరూ తప్పకుండా కుమారధారలో స్నానమాచరించి ఈ రెండు ఆలయాలనూ దర్శించుకుంటారు. కుమారధార అనేక ఔషధమొక్కల గుండా ప్రవహిస్తుంది. కాబట్టి సర్వ శారీరక రోగాలనూ నయంచేయగల శక్తీ, దైవికంగా సర్వపాపాలనూ హరించే శక్తీ ఈ నదికి ఉన్నాయని విశ్వసిస్తారు. త్రేతాయుగంలో పరశురాముడు క్షత్రియ వధ అనంతరం ఆ పాపాలను హరింపజేసుకునేందుకు ఇక్కడి కుమారధారలో స్నానమాచరించాడన్నది స్థల పురాణం. వాసుకి తపస్సు కారణంగా సర్పజాతి, గరుత్మంతుడి నుంచి ఈ కుక్కి క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని చెంత రక్షణ పొందుతుందని ప్రతీతి.

ఇక్కడి ఆలయంవారు నిర్వహించే సర్ప సంస్కార సేవలో వరసగా రెండురోజులు పాల్గొన్నాం. ఈ క్రతువుకి ఓ ప్రత్యేక యాగశాల ఉంది. కుటుంబం నుంచి నలుగురిని పూజకు అనుమతి ఇస్తారు. పూజ రెండోరోజున ప్రధాన ఆలయంలో నాగప్రతిష్ఠ జరగడంతో సర్పసంస్కార పూజ ముగుస్తుంది. పూజలో పాల్గొన్న భక్తులకే కాకుండా కుక్కి వచ్చే మిగిలిన భక్తులందరికీ కూడా రోజూ రెండు పూటలా అన్నదానం జరుగుతుంది. ఈ వారం రోజుల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించామన్న ఆనందంతో వెనుతిరిగాం. అయితే ఆయా క్షేత్రాల్లోని ఆలయాలను పురుషులు తప్పకుండా పంచె, బనీనుతోనే దర్శించాలి. చొక్కా వేసుకోకూడదు. కండువా కప్పుకోవచ్చు. అదే స్త్రీలయితే చీర, లేదా చున్నీ ఉన్న చుడీదార్‌ మాత్రమే వేసుకోవాలి.

No comments:

Post a Comment