Wednesday, 11 January 2017

అనంత పద్మనాభస్వామి కోనేటిలో కొలువైన గుహాలయం...

ఎక్కడైనా సరే, ఆలయ ప్రాంగణంలో అందమైన కోనేరు, ఆ కోనేటిలో తామరలు తేలుతూ ఉండటం సాధారణంగా కనిపించే దృశ్యం. అయితే ఈ ఆలయమే కోనేటిలో తేలియాడుతున్నట్లుగా ఉంటుంది. ఆ ఆలయం ఏమైనా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినదా అంటే, కానే కాదు- కనీసం పన్నెండు వందల ఏళ్ల క్రితం నాటిది. కేరళలోని కాసర్‌గోడ్‌లో ఉన్న ఈ ఆలయంలో సపరివారంగా కొలువైన వేలుపు అనంత పద్మనాభస్వామివారు.

పాలకడలిలోన.. శేషతల్పముపైన శయనించే ఓ స్వామీ... అన్నట్లుగా.. అనంతుడనే సర్పంపై పద్మనాభుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి కన్నులరమోడ్చి, హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉన్న భంగిమను చూస్తుంటే ఆలయంలోకి అడుగు పెట్టగానే చెప్పనలవి కాని ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందాలు మనసులను అలముకుంటాయి. స్వామివారి మూలమూర్తికి అటూ ఇటూ ఉన్న దేవేరులు శ్రీదేవి, భూదేవి విగ్రహాలు మనస్సుకు నిండుదనాన్ని చేకూరుస్తాయి.

కేరళ రాష్ట్రం కాసర్‌గోడ్‌లో గల ఈ ఆలయం అనంతమైన సంపదలకు అధినేతగా తిరువనంతపురంలో కొలువైన స్వామి వారి ఆలయానికి మూలస్థానమని ఆలయ అర్చకులు చెబుతారు. రెండెకరాల సువిశాలమైన ఈ కొలనుకు కుడి పక్కన ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక బిలం. ఆ బిలంలో నిత్యం నీరు కూడా ఉంటుంది. స్వామివారు ఈ గుహ నుంచి తిరువనంతపురంలోని ఆలయానికి రాకపోకలు సాగిస్తుంటారని స్థానికుల కథనం.

స్థలపురాణం: 
తుళు బ్రాహ్మణ వంశానికి చెందిన దివాకర ముని వి(బి)ల్వమంగళం అనే యోగి ఇప్పుడున్న ఆలయప్రాంతంలో తపస్సు చేస్తుండేవాడట. ఆయనను పరీక్షించడానికా అన్నట్లు ఓ రోజున స్వామివారు ఒక బాలుడి రూపంలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడట. బ్రహ్మాండమైన తేజస్సుతో, చూడముచ్చటగా ఉన్న ఆ బాలుడి ముఖాన్ని చూడగానే ముని సంభ్రమాశ్చర్యాలకు లోనై, ‘‘ఎవరు నాయనా నువ్వు’’ అని అడిగాడట. ఆ బాలుడు తాను ఇల్లూ వాకిలీ, అమ్మానాన్న ఎవరూ లేని అనాథనని చెప్పడంతో జాలిపడి, తన వద్దనే ఉండిపొమ్మని అడిగాడట.

అప్పుడా బాలుడు తాను ఏమి చేసినా, తనను ఏమీ అనకూడదని,  తనకు కోపమొస్తే క్షణం కూడా ఉండకుండా వెళ్లిపోతానని, అందుకు ఒప్పుకుంటేనే అక్కడ ఉంటానని షరతు పెట్టాడట. ముని అందుకు ఒప్పుకోవడంతో ఆయనకు సపర్యలు చేస్తూ, ఆ బాలుడు అక్కడే ఉండిపోయాడట. ఆ బాలుడు ఎన్ని తుంటరి పనులు చేసినా, ముని మౌనంగా సహించేవాడట. అయితే ఓరోజున ధ్యానంలో మునిగి ఉన్న మునికి బాలుడు తన తుంటరిపనులతో తపోభంగం కలిగించడంతో కోపంతో చేతులతో గెంటేశాడట. దాంతో ఆ బాలుడు ఒక తేజోపుంజంలా మారిపోయి, గుహలోంచి బయటకు దొర్లుకుంటూ వెళ్లిపోయాడట. చేష్టలుడిగి చూస్తుండిపోయిన మునికి ‘‘నీకెప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే అనంతపద్మనాభుడు కొలువుండే ఆనంతన్ కోట్ అనే ప్రదేశానికి రావచ్చు అని అశరీరవాణి పలుకులు వినిపించాయట.

తనది భ్రమేమోనని భావించిన ముని తిరిగి తపస్సులో లీనమయ్యాడట. అయితే, కన్నుమూసినా, తెరచినా, ఆ బాలుడి నగుమోమే కనుల ముందు కనిపిస్తూ ఉండడంతో ఆ బాలుడు ఎవరో కాదు, సాక్షాత్తూ ఆ అనంత పద్మనాభస్వామివారేనని  అర్థమైంది. దాంతో ముని తన తప్పిదానికి తీవ్రంగా పశ్చాత్తాపపడుతూ, అడుగుజాడలను బట్టి బాలుని వెతుక్కుంటూ వెళ్లాడట. ఒక కొండగుహ ముందు ఆ బాలుడి అడుగుజాడలు అదృశ్యం కావడంతో గుహలోకి వెళ్లాడట. ఓ చోట గుహ అంతమై, సముద్రానికి దారితీసింది. సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్లిన మునిని ఓ పెద్దకెరటం లాక్కుపోయి, ఒడ్డుకు విసిరేసింది. కళ్లు తెరిచి చూసేసరికి అక్కడ ఓ అడవి కనిపించింది. దూరాన ఉన్న ఆ అడవిలో ఆ బాలుడు కనిపించినట్లే క నిపించి, అంతలోనే మాయం అయ్యాడట.

అతణ్ణి అనుసరిస్తూ వెళ్లిన మునికి ఆ బాలుడు ఒక పెద్ద విప్పచెట్టు మీదికి ఎక్కడం కనిపించి, చెట్టు వద్దకు చేరాడట. ఇంతలో ఆ వృక్షం పెద్ద శబ్దం చే స్తూ కిందికి ఒరిగిపోయి, చూస్తుండగానే వేయిపడగల అనంతుడి రూపాన్ని సంతరించుకుంది. ఆ సర్పంపై ఆసీనుడైన అనంతపద్మనాభస్వామి చిరునవ్వుతో మునిని ఆశీర్వదించాడట. అక్కడే స్వామి శ్రీదేవి, భూదేవితో కలసి శిలావిగ్రహంగా మారిపోయాడని స్థలపురాణం చెబుతోంది. ఇదే కథ కొద్దిపాటి భేదాలతో కనిపిస్తుంది. శ్రీకోవిల్ అని పిలుచుకునే ఈ ఆలయం నమస్కార మండపం, తిటప్పల్లి, ముఖమండపం అని మూడు భాగాలుగా ఉంటుంది. జలదుర్గామాత విగ్రహం ఆలయంలోనికి స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది. నమస్కార మండపం నుంచి ఆలయంలోనికి దారి ఉంటుంది.

కోనేటికి మొసలి సంరక్షణ: 
స్వామి ఆలయం ఉన్న కోనేటినీరు కొబ్బరినీళ్లలా ఎంతో తియ్యగా ఉంటాయి. స్వచ్ఛంగా, తళతళలాడుతూ కనిపించే ఆ కోనేటిలో అతిపెద్ద మొసలి ఒకటి సంచరిస్తూ ఉంటుంది. దాని వయసు కనీసం నాలుగు వందల సంవత్సరాలకు పైనే ఉండి ఉంటుందని అంచనా. పూర్తి శాకాహారి అయిన ఈ మొసలి ఎవరినీ ఏమీ చేయదు. రోజూ కొలనులోంచి వచ్చి స్వామివారిని సేవించుకుంటూ ఉంటుంది. పూజారులు కూడా దీనిని భక్తి ప్రపత్తులతో పూజిస్తుంటారు.

స్వామివారిని కుల, మతభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సందర్శించవచ్చు. విశేషం ఏమిటంటే స్వామివారు కానీ, ఆయన దేవేరులు కానీ, ఎటువంటి లోహమూ లేదా రాతితో నిర్మించిన మూర్తులు కాదు... కాడు శర్కర యోగం అనే 108 రకాల ఔషధ వృక్షాల కలబోతతో నిర్మించినవి. దాదాపు నలభై ఐదు ఏళ్ల క్రితం ఈ దారు (కలప) అంతా శిథిలావస్థకు చేరడంతో, కంచి కామకోఠి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఈ విగ్రహాలను పంచలోహాలతో తాపడం వేయించారట. ఆలయ ప్రాకారం గోడల మీద కలపతో చెక్కిన దశావతారాల దారు శిల్పాలు అత్యద్భుతంగా ఉండి చూపులను కట్టిపడేస్తాయి.
 
ఇక్కడ ఇంకా ఏమేం చూడవచ్చు?
పర్యాటక ప్రదేశాలను చూడాలని కోరుకునే యాత్రికులకు కాసర్‌గోడ్ పర్యటన అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఇక్కడకు దగ్గరలోని కుంబాల రాజకోటలో సుప్రసిద్ధమైన గోపాలకృష్ణుని ఆలయం ఉంది. దగ్గరలోనే మల్లికార్జున ఆలయం, ట్రిక్కనాడ్, పాండ్యన్ కల్లు ఆలయం, అజనూర్‌లో భద్రకాళి కొలువైన మాడియన్ కులోం ఆలయం, బేళా చర్చ్, శంకరాచార్యులవారు నెలకొల్పిన ఎడినీర్ మఠం, తులూర్ వనంలోగల కేకుళోమ్ ఆలయం, నెల్లికున్ను మసీదు, మాధుర్‌లోని శ్రీమద్ అనంతేశ్వర వినాయకాలయం, మధువాహినీ నదితోపాటు ఎన్నో బీచ్‌లు, వేసవి విడుదులు రకరకాల పర్యాటక ప్రదేశాలున్నాయి.

ఎలా వెళ్లాలంటే..?
అనంతపురా కొలనుగుడికి వెళ్లడానికి దగ్గరలోని ప్రధాన రైల్వే స్టేషన్ కాసర్‌గోడ్ స్టేషన్. ఇక్కడి నుంచి ఆలయానికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. స్టేషన్‌లో రైలు దిగగానే బస్సులు, ఆటోలు ఉంటాయి. అలాగే కుంబాల స్టేషన్ కూడా ఉంది. మంగుళూరు ఏర్‌పోర్టుకు వెళ్తే అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి రైలులోనూ, బస్సులోనూ చేరుకోవచ్చు. అలాగే కోజికోడ్, కరిపూర్ ఏర్‌పోర్ట్‌లు కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి.

  - డి.వి.ఆర్.భాస్కర్

No comments:

Post a Comment