Sunday, 22 January 2017

హిమాచల్‌ ప్రదేశ్‌ - ఆలయాలకు ఆలవాలం


ఆలయాలకు ఆలవాలం హిమసమూహం

వెండిలా తళతళా మెరిసిపోయే హిమాలయ పర్వత శ్రేణులను సందర్శించడానికి అటు భక్తజనులూ, ఇటు పర్యాటక ప్రియులూ కూడా ఉవ్విళూరుతుంటారనడంలో అతిశయోక్తి లేదు. బహుశా అందుకే కాబోలు, దేశానికి పర్యాటకరంగం నుంచి ఆదాయం చేకూర్చే రాష్ట్రాలలో హిమాచల్‌ ప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఇక అక్కడి కులూ లోయల సంగతి చెప్పనవసరం లేదు. అక్కడి కొండల మీద వెలుగు నీడలకి వెర్రెత్తిన నికొలన్‌ రోరిచ్‌ అనే రష్యా చిత్రకారుడు గతంలో అక్కడ స్థిరపడి అద్భుతమైన పెయింటింగ్‌లు చేశారు.

సిమ్లా, కుర్గి, నర్కండా, కులు, మనాలి, చంబా, కూపర్, పబ్బర్‌ వంటి ప్రాంతాలు హిమాచల్‌ప్రదేశ్‌ అనే తోటలోని అందమైన పూలు! సోలోంగ్‌నుల్లా నుంచి పథ్రూ వరకు గల లోయ ప్రాంతంలో స్కీయింగ్‌ ఆనందం కోసం దేశవిదేశీ పర్యాటకులు బిలబిలలాడుతుంటారు.

శివరాత్రి అక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. అక్కడి శాలువాలు, రగ్గులు, దుప్పట్లు, తివాచీలు ప్రపంచ ప్రసిద్ధికెక్కాయి. అంతేకాదు, ఈ హిమవత్పర్వత శ్రేణులలో శక్తిస్వరూపిణి, చింతలు తీర్చే చల్లనితల్లి చింతపూర్ణాదేవి, చారెడేసి కన్నులతో కనువిందు చేసే నయనాదేవి, భీమసేనుడి భార్య హిడింబకు కూడా ఆలయాలున్నాయి.

చింతపూర్ణాదేవి
చింత అంటే బాధలు, ఆందోళనలు. తన భక్తుల చింతలను దూరంచేసే దేవి కాబట్టి ఈ తల్లికి చింతపూర్ణాదేవి అని పేరు వచ్చిందట. దక్షయజ్ఞంలో అవమానానికి గురై ప్రాణత్యాగం చేసిన సతీదేవి దేహాన్ని పరమశివుడు భుజాన వేసుకుని తిరుగుతుండగా, విష్ణుమూర్తి ఆ దేహాన్ని ముక్కలు చేసినప్పుడు, ఆమె పవిత్రపాదం ఇక్కడ పడిందని అంటారు. మరోగాథ ప్రకారం, భగత్‌మయీదాస్‌ అనే భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతి నిత్యం అమ్మవారిని పూజించేవాడు. కానీ లౌకిక సంబంధమైన కోరికలు ఏవీ కోరలేదు. ఒకసారి ఈ భక్తుడు తన మామగారి ఊరికి బయలుదేరాడు. అతను కొంతదూరం వెళ్లాక, అలసిపోయి ఒక చెట్టునీడన పడుకొని నిద్రపోయాడు. అతను నిద్రలో ఒక కలగన్నాడు.

ఆ కలలో, ఒక బాలిక కనిపించి, అక్కడ తను పిండ రూపంలో - గుండ్రని రాతి రూపంలో ఉన్నానని, తనకొక ఆలయం నిర్మించమని చెప్పింది. ఆమె చెప్పిన విధంగానే అతను అక్కడ ఉన్న అమ్మవారిని (పిండ రూపాన్ని) ఆలయంలో ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతారు. ఇప్పటికి ఇరవై ఆరు తరాల కిందట అమ్మవారి ప్రతిష్ఠ జరిగిందని చెబుతారు. సోలాసింఘి పర్వతశ్రేణిలోని అతి ఎత్తయిన ఒక పర్వతశిఖరం మీద చింతపూర్ణాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరచి ఉంటుంది. లడ్డు, హల్వా, పాయసం, పళ్లు మొదలైన నివేదనలతోపాటు పూలు, వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తారు.

కులు-మనాలి
కులు-మనాలి అనే రెండు ప్రాంతాలు కలిసిపోయి, అది ఒకే ఊరు అనుకునే పరిస్థితి ఉంది. కానీ కులు, మనాలి వేర్వేరు ఊళ్లు. మొదట కులు వెళ్లి అక్కడి నుంచి మనాలికి ప్రయాణం కట్టాలి. హిమాచలప్రదేశ్‌ అంటేనే హిమాచల పర్వతాలలో ఉన్న ప్రాంతమని అర్థం. కులు-మనాలి చుట్టూ ఎత్తయిన కొండలే దర్శనమిస్తాయి. ఈ ప్రాంతాలు వేసవి విడిది ప్రాంతాలు. సెప్టెంబరు నుంచి పూర్తిగా పచ్చదనంతో నిండిపోయి, ఈ కొండలు కనువిందు చేస్తాయి. జనవరి, ఫిబ్రవరి నెలలలో మంచుమీద స్కైయింగ్‌ జరుగుతూంటుంది. కులు జిల్లాకు దేవతల లోయ అని పేరు.

కులు ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలో బిజిలీ మహదేవ్‌ ఆలయం ఉంది. కులులోని రఘునాథ ఆలయం చూడదగినది.భారతీయ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన ప్రాంతం మనాలి. పూర్వం ప్రళయంలో ప్రపంచమంతా మునిగిపోయి నప్పుడు, తిరిగి సృష్టి చేయడానికై ఓడలో నుండి మనువు ఈ ప్రాంతంలో అడుగుపెడతాడు. అందుకే ఈ ప్రాంతానికి నిమనాలి - మనువు నివసించిన ప్రాంతం అని పేరు. పాత మనాలిలో మనువు ఆలయం ఉంది. ఈ ఆలయాన్నే కాక, పాత మనాలిలోని పురాతన కోటలను, కట్టడాలను, యాత్రికులు సందర్శిస్తూంటారు. మనాలి, దాని పరిసరాలు సప్తర్షుల నివాసంగా చెబుతారు.

అత్యద్భుతమైన ప్రకృతి అందాలతో, సాహస క్రీడలు జరిగే ప్రదేశాలతో మనాలి గొప్ప పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హిడింబి ఆలయం ఉంది. పాండవులలోని భీమసేనుని భార్య హిడింబి. ఈమె రాక్షస సంతతికి చెందినది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు హిడింబాసురుని సోదరి అయిన హిడింబి భీముడిని పెళ్లాడింది. వీరి కుమారుడే ఘటోత్కచుడు. హిమాలయాల పాదాల దగ్గర ఉన్న ఈ ఆలయం చుట్టూ అటవీ ప్రాంతం కలిగి ఉండి ఎంతో రమణీయంగా ఉంటుంది. నాలుగు అంతస్థుల గోపురంతో, దారు చెక్కడాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ ఆలయం. మనాలిలో బౌద్ధుల ఆశ్రమాలు కూడా చూడదగిన ప్రదేశాలు. వీటిని గోంపాలు అంటారు. గదన్‌ తెక్చోగోంప, హిమాలయన్‌ న్విన్గమప గోంప మొదలైన ఆశ్రమాలున్నాయి.

హిమాచలప్రదేశ్‌ పర్యాటకశాఖ నిర్వహించే హోటల్‌ కూడా చూడదగినదే. ఇది పూర్వకాలంలో నగ్గర్‌కోటగా పేరు పొందింది. ఇది ప్రస్తుతం హోటల్‌గా రూపాంతరం చెంది, హిమాచలప్రదేశ్‌ పర్యాటకశాఖ నిర్వహణలో ఉంది. దీనిని దర్శించినవారు, ఇందులోని కళానైపుణ్యానికి ఆశ్చర్యపోతారు. హనీమూన్‌ జంటలను ఆకర్షించే ప్రదేశంగా కూడా మనాలి పేరుపొందింది. ఇంతేకాక, సాహసక్రీడలైన స్కీయింగ్, పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, మౌంటెన్‌ బైకింగ్‌ మొదలైన సాహసక్రీడలు కూడా మనాలిలో జరుగుతుంటాయి. ఈ ఆటలలో పాల్గొనాలనే కాక, కేవలం మంచులో సరదాగా ఆటలాడుకోవాలని వచ్చేవారి సంఖ్య కూడా తక్కువ కాదు. మంచుకొండలలోని వేడినీటిబుగ్గలు ప్రకృతిలోని వింతగా, దేవుడిచ్చిన వరంగా చెబుతారు. మనాలికి సీమపంలో రహల్లా జలపాతం కనువిందు చేస్తుంది. ఇది సుమారు 2,500 మీటర్ల ఎత్తున ఉన్న ఈ జలపాతం చూస్తే, నయాగరాని చూసిన అనుభూతి పొందుతారు.

చాముండానందికేశ్వరి
చాముండాదేవిని గురించి దేవీభాగవతం, దుర్గాసప్తశతి మొదలైన పురాణాలలో వివరంగా ఉంది. చాముండాదేవి ఆలయాన్ని సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం నిర్మించారని చెబుతారు. కాళికాదేవి చాముండాదేవిగా ఇక్కడ ఉన్నదని చెబుతారు.మరోగాథ కూడా ఉంది. అమ్మవారు ప్రారంభంలో ఒక ఎత్తయిన పర్వతం మీద వెలిసిందని, ఒక అంధ భక్తుడు ప్రతీరోజు అమ్మవారిని దర్శించలేక పోతున్నందున బాధపడి అమ్మవారిని ప్రార్థించాడని, అతనిని కరుణించడానికని దేవి కొండ మీద నుండి ఇప్పుడున్నచోటికి వచ్చిందని స్థానికులు చెబుతారు.

జ్వాలాముఖి
జ్వాలాముఖి ఆలయం కాంగ్రాకి దక్షిణంగా సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. జ్వాలాముఖి దగ్గర సతీదేవి నాలుక పడిందని చెబుతారు. స్వచ్ఛమైన నీలిమంటతో ప్రకాశించే దేవిని పాండవులు కూడా దర్శించారని స్థానిక గాథ చెబుతోంది. ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుంచి నిరంతరం సహజవాయువు వెలువడుతుంది. దీన్ని ఆలయ పురోహితుడు వెలిగిస్తాడు. ఈ జ్వాలే జ్వాలాముఖి అమ్మవారిగా ఇక్కడ కొలువుదీరి భక్తుల పూజలందుకుంటోంది. ఇక్కడ ఈ జ్వాలే కాక, ఇంకో తొమ్మిది జ్వాలలు ఉన్నాయి. అవి కూడా దేవతలుగా పూజలందుకుంటున్నాయి. మహాకాళి, అన్నపూర్ణ, చండి, హింగుళ, వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజిదేవి ఈ తొమ్మిది జ్వాలా దేవతల పేర్లు. అమ్మవారికి పాలు, ఫలాలు, కలకండలని నివేదిస్తారు. రోజంతా రకరకాల పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రతీరోజు అయిదుసార్లు ఆరతి జరుగుతుంది. రోజుకొకసారి హోమం చేసి, దుర్గాసప్తసతి పారాయణ చేస్తారు.

హిమాచల్‌ కొండల దారిన...
ఒక్కసారి హిమాచల్‌ప్రదేశ్‌ కొండల వాలుల్లో నడిస్తే చాలు మీకు కొండల పిచ్చి పట్టుకుంటుంది. అలా పర్వతాలు ఎక్కడానికి, పెద్ద పెద్ద మంచు బండరాళ్లు ఎక్కి కొండల మీద తిరగడానికి తగిన శిక్షణ లేకపోతే ఎక్కలేరు. అందుకే అక్కడి మనాలీలో మౌంటెనీరింగ్, స్కీయింగ్‌ నేర్పే శిక్షణాలయం ఉంది. సట్లె్లజ్, బియాస్‌ నదులు జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ప్రశాంతంగా ప్రవహిస్తాయి గనుక వాటిలో పడవల పోటీలు, పడవ ప్రయాణాలు బహు చక్కగా సాగుతాయి.

హిమాచలపర్వతాలను ఎలా చేరుకోవాలంటే...?
జ్వాలాముఖి ఆలయాన్ని సందర్శించాలంటే ముందుగా కాంగ్రా చేరుకోవాలి. కాంగ్రాకు దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి రైళ్లున్నాయి. విమానంలో వెళ్లాలంటే గగ్గల్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలి. అక్కడినుంచి కాంగ్రాకు క్యాబ్‌లు, ట్యాక్సీలు ఉంటాయి. కాంగ్రా నుంచి బస్సులో జ్వాలాముఖికి వెళ్లవచ్చు లేదంటే ఢిల్లీ నుంచి ధర్మశాలకు విమానంలో వెళ్లి, అక్కడినుంచి ట్యాక్సీలో జ్వాలాముఖి ఆలయానికి చేరుకోవచ్చు.

ఉత్తమమైన మార్గం ఏమిటంటే... tourismmin-hp@nic.in, tourism.hp@nic.inకు మెయిల్‌ చేస్తే హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌నుంచి అక్కడ చూడదగ్గ ప్రదేశాలు; ఎలా చేరుకోవాలి, ఎక్కడ బస చేయాలి, ప్యాకేజీ ఏమిటి... వంటి వివరాలతో కూడిన మెయిల్‌ వస్తుంది. దాని ప్రకారం ప్లాన్‌ చేసుకోవచ్చు.

DVR. భాస్కర్‌No comments:

Post a Comment