Monday, 16 January 2017

కల్పవల్లి బోయకొండ గంగమ్మకల్పవల్లి బోయకొండ గంగమ్మ

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, పుంగనూరు సమీపంలో బోయకొండలో వెలసిన గంగమ్మ తల్లి అదే ప్రస్తుతం బోయకొండ గంగమ్మగా పిలుస్తారు. జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అత్యంత ప్రణముఖ్యంలో ప్రసిద్ధికెక్కిన ఏకైక శక్తిక్షేత్రం.

బోయకొండ గంగమ్మ ఎలా వెలసింది?
క్రీ.శ 1782 టీప్పుసుల్తాన్ అనే నవాబు గుర్రం కొండ ప్రధాన కేంద్రంగా పరిపాలిస్తున్న పాలనలో అప్పటి పుంగనూరు జమిందారు ఇమ్మడి చిక్కరాయలు తిరుగుబాటు చేసి పుంగనూరు, ఆవులపల్లె దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు. అందుకు ఆగ్రహించిన టిప్పు సుల్తాన్ షేక్ బమర్, కిర్మిణి అనే సైన్యాధిపతుల నాయకత్వంలో 400 పదాతి దళాలను పుంగనూరు జమిందారుపై యుద్దానికి పంపి సుమారు 70 రోజులపాటు జరిగిన యుద్ధంలో దుర్గాలను సుల్తాన్ సేనలు కైవసం చేసుకున్నాయి. యుద్ధసమయంలో ప్రస్తుతం చౌడేపల్లె మండలం కాటిపేరిలోని ఏకీల, గిరిజన తెగలవారు పుంగనూరు జమిందారుకు అండగా నిలిచారు.

ఏకీల, గిరిజన తెగలవారిపై తుపాకులతో కాల్పులకు దిగడంతో తమ భర్తలను కాపాడుకునేందుకు మహిళలు అధిపరాశక్తిని స్మరించి రొకళ్ళు తీసుకోని పోరుకు సిద్ధమయ్యారు. వారిలో ఓ మహిళకు గంగమ్మ అవహించిదట. ఆమె రణభేరి గంగమ్మగా వీరోచితంగా పోరాడుతూ ఆగ్రహవేశంతో కత్తితో ఓ కొండరాయిని (ఈ క్రీంద చూపిన ఫొటోలో చూడవచ్చు ప్రస్తుతం అక్కడ రెండు రాళ్ళమధ్యలో అమ్మవారి భారీ ఎత్తు విగ్రహం నిర్మించడం జరుగుచున్నది) నరికి రెండు ముక్కలుగా చేసిందని స్థానిక కథనం. మరియు నవాబులు కాల్చిన తుపాకి గుండ్లన్ని ఒక గుండుకు తగిలి మట్టిబాణలో పడేలా అమ్మవారు మహత్యం ప్రదర్శించిదట.

జరుగుచున్న భీకరమైన యుద్ధంలో మహిళల రొకలిబడేల దెబ్బలకు తాళలేక నవాబు సేనలు పారిపోయారట. అప్పటినుంచి జనం బోయకొండలో ఆలయం నిర్మించి కొలవడం ప్రారంభించారు. అప్పటి నుండి ఏ కష్టం వచ్చినా గంగమ్మ రక్షిస్తుంది అని ప్రజల ప్రగాడ విశ్వాసం.

ఆలయ విశిష్టత
చల్లని వాతావరణంతో చిన్నచిన్న కొండలు, లోయలతో కూడిన చిట్టడవులు, నీటి కొలనులు సముదాయాలతో బోయకొండ ప్రాంతం శోభాయమానంగా ఉంటుంది. బోయకొండను ఎక్కేటప్పుడు మొదట రణభేరి గంగమ్మ(రౌద్రాకార గంగమ్మ) ఆలయం తరువాత కొంతదూరం వెళ్ళగానే భక్తులు స్నానం ఆచరించడానికి బండపై కోనేరు నిర్మించబడియున్నది.

అమ్మవారి ప్రధాన ఆలయం పద్మాకారంలో నిర్మించబడినది. పై అంతస్థును అష్టదిక్కులను సూచించే విధంగా రూపకల్పన చేయడం జరిగినది. దిగువున గర్భాలయంలో అమ్మవారి మూలవిగ్రహం ఉంది. ఆ గర్భగుడికి ఎదురుగా మరొకొనేరు నిర్మితమై వున్నది. కొనేరులోని నీటిని (దానినినే తీర్థంగా భావిస్తారు) వ్యవసాయ పంటలపై చల్లితే పంటలకు పట్టిన చీడపీడలు పోతాయని, ఇళ్లలో ఏవైనా దోషాలు వున్నా తీరుతాయని ప్రతీతి. భక్తులు ఈ తీర్థాన్ని కొనుగోలు చేయడానికి బారులు తీరుతారు. సదరు బోయకొండ గంగమ్మ ప్రభుత్వం ఆధ్వర్యంలో బోర్డు ఏర్పాటు చేయబడి అధ్యక్షులు, సభ్యులుతో కూడి ప్రభుత్వాధికారి ఒకరు దేవస్థానంనకు సాంకేతికాధికారి(EO) కూడా ఏర్పాటు చేసి ప్రస్తుతం నడుస్తున్నది.

నవరాత్రి ఉత్సవాలు
బోయకొండ గంగమ్మ ఆలయంలో ప్రతియేటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజూ కుంకుమార్చన, పుష్పం అడిగే కోర్కె(పుష్పం అడిగే కోర్కె, ఇంతకు పుష్పం మహిమ ఏమిటి తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి ఈ క్రీంద తెలుపబడినది), హారతి ప్రతియేటా మాఘమాసంలో రాహుకాలం అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు ఆలయంలో జరుగుతాయి. అత్యధికంగా ఆదివారం 50 వేల మందికి పైగా అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే మంగళ, గురు, శుక్రవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అమ్మవారి ఆలయం ఆదాయం ఏటా రూ.5.34 కోట్లు వస్తోంది. అందుకే ఈ దేవస్థానం అధ్యక్ష,సభ్యుల పదవులకు అత్యంత పోటీ ఉంటుంది.

అసలు పుష్ప మహిమ ఏమిటి?
ఏదైనా కార్యం చేపడితే అది సఫలమా, విఫలమా తెలుసుకోవడానికి భక్తులు బోయకొండ గంగమ్మను ఆశ్రయిస్తారు. అమ్మ వారి ఎదుట నిలిచి మనసులో కోర్కె కోరిన పుష్పం అడుగుతారు. ఆలయ అర్చకులు అమ్మవారి తలపై పుష్పాంని ఉంచగానే పుష్పం కుడి వైపు పడితే శుభంగాను ఎడమ వైపు పడితే అశుభంగాను భావిస్తారు. అమ్మవారి మూల విరాట్టు ఎదురుగా బోయకొండ గంగమ్మ ఉత్సవ విగ్రహానికి నిత్యకు0కుమార్చనలు,పూజలు జరుగుతాయి. ఆలయ ఆవరణలో ఇటీవల లక్షలాది రూపాయలతో అద్దాలమేడ నిర్మించి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. బోయకొండ గంగమ్మ మహిమలు తెలుసుకున్న ఇతర ప్రాంతాల వారు గంగమ్మ పేరుతొ శిలలకు అమ్మవారిని ఆవాహన చేసి వారి గ్రామాల్లో బోయకొండ గంగమ్మ పేరిట ఆలయాలు నిర్మించుకుంటున్నారు. బోయకొండ గంగమ్మకు వరపడగా పుట్టిన బిడ్డలకు బోయకొండప్ప, బోయకొండమ్మ, గంగప్ప, గంగమ్మలుగా పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

ఇక్కడ ఆలయ అర్చకులుగా యాదవులు వ్యవహరిస్తారు. ఉత్సవ విగ్రహం వద్ద మాత్రం బ్రాహ్మణ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బోయకొండలో విందు,మందులకు ప్రత్యేక స్థానం ఉంది. భారీఎత్తున జంతుబలులు సమర్పించి భక్తులంతా కొండ దిగువనే వంటలు వండి విందు చేసుకుంటారు.చాలా వరకు జనం ఇక్కడ విందు వినోదానికే తరాలిరావడం విశేషం. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రం నుంచి అత్యధికంగా వేల సంఖ్యలో వాహనాల్లో జనం వచ్చి అమ్మవారికి మొక్కులను చెలిస్తారు.

బోయకొండకు వెళ్ళాలంటే
శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ ఆలయం తిరుపతి నుంచి పాకాల,కల్లూరు, సదుం మీదుగా 110 కిలోమీటర్లు, పుంగనూరు నుంచి 18 కిలోమీటర్లు, మదనపల్లి నుంచి 20 కిలోమీటర్లు, చౌడేపల్లి నుంచి 13 కిలోమీటర్లు, నిమ్మనపల్లి నుంచి బండ్లపై మీదుగా 10 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 140 కిలోమీటర్లు ఉంటుంది. చిత్తూరు, పలమనేరుల నుంచి వచ్చే భక్తులు రాయలపేట మీదుగా బోయకొండ గంగమ్మ దేవస్థానంనకు చేరుకోవచ్చు.

వేద, శాస్త్ర, స్మార్త పురోహిత పరిషత్, శాంతి నగర్, ఖాధికాలని తిరుపతి
No comments:

Post a Comment