Thursday, 23 February 2017

కోటప్పకొండ - త్రికూటేశ్వరస్వామిశివరాత్రి ఉపవాసాల పండగ. జాగరణల పండగ. శివయ్యకు అభిషేకాల పండగ. ఇదే శివరాత్రి జాతరల పండగ కూడా. జాతర అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్‌లోని కోటప్పకొండ. త్రికోటేశ్వరుడు వెలసిన కోటప్పకొండ శివరాత్రి సమయంలో భక్తజనజాతరతో కిటకిటలాడతాయి. ఈ క్షేత్ర పర్యటన ఆధ్యాత్మిక ఆనందం పంచడంతో పాటు ఆహ్లాదకరమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది.  

జగత్తుకు పితృదేవుడైన పరమేశ్వరుడు బాలుడిగా అవతరించిన క్షేత్రం...
బ్రహ్మవిష్ణువులకు దక్షిణామూర్తిగా ఉపదేశం ఒసిగిన ప్రదేశం...
ఇలా ఎన్నో పౌరాణిక విశేషాలను కలిగి ఉన్న ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం కోటప్పకొండ.

గుంటూరు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శివరాత్రి సందర్భంగా తిరునాళ్ల సందడితో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కోటప్పకొండపై పచ్చదనం నిండుగా ఉంటుంది. మూడు శిఖరములతో కనిపిస్తుంది. వీటిని బ్రహ్మ, విష్ణు, రుద్ర స్వరూపములుగా భావిస్తారు. ఈ శిఖరాలను త్రికూటమలు అని, ఇక్కడ వెలసిన పరమేశ్వరుడ్ని త్రికూటేశ్వరస్వామి, త్రికోటేశ్వరస్వామి అని పిలుస్తారు. కోటప్పకొండకు ఆ పేరు రావడం వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ముక్కోటి దేవతలు పరమేశ్వరుడి కోసం ఇదే కొండపై తపస్సు చేశారట. అందుకే ఈ కొండను కోటప్పకొండగా పిలుస్తారని స్థానికులు చెబుతుంటారు.

శివరాత్రి సందర్భంగా కోటప్పకొండపై జరిగే జాతరకు దేశవ్యాప్తంగా పేరుంది. ఈ సందర్భంగా భక్తులు తీసుకువచ్చే ప్రభల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భారీ కర్రలతో ప్రభలు రూపొందించి వాటిని అందంగా ముస్తాబు చేస్తారు. విద్యుత దీపాలు అలంకరించి తిరునాళ్లకు తీసుకువస్తారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందలాది భారీ ప్రభలు కొండ దిగువభాగంలోని పొలాల్లో ఉంచుతారు. చిన్న ప్రభల సంఖ్య వేలల్లో ఉంటుంది. శివరాత్రి మొదలు నాలుగైదు రోజులపాటు ఈ ప్రాంతమంతా సందడిగా ఉంటుంది. రికార్డింగ్‌ డాన్సులు, డప్పుమోతలు, ఆటపాటలు ఇలా కోరుకున్నవారికి కోరుకున్నంత వినోదం దొరుకుతుంది. కొండపై నుంచి తిలకిస్తే.. జనసంద్రాన్ని చూడొచ్చు. ప్రభల వెలుగులు.. సముద్రంలో తెరచాపల్లా కనువిందు చేస్తాయి.

ఎలా వెళ్లాలి.
నరసరావుపేట నుంచి కోటప్పకొండ 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి అరగంటకో బస్సు సౌకర్యం ఉంది. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయి. గుంటూరు నుంచి కోటప్పకొండకు 62 కిలోమీటర్లు. ఇక్కడ్నుంచి చిలకలూరిపేట లేదా నరసరావుపేట మీదుగా కోటప్పకొండ చేరుకోవచ్చు. కోటప్ప కొండ మీద దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి రమణీయతతో పాటు అందమైన విగ్రహాలు పర్యాటకులకు ఆనందాన్నిస్తాయి. పచ్చని వనంలో కదలాడే నెమళ్లు, పావురాలు, చిలకలు ప్రత్యేక ఆకర్షణ. త్రికూట పర్వతంలో మొదటి కొండపై ఓ ఆలయం ఉంది. రెండో కొండపై త్రికోటేశ్వర ఆలయం కనిపిస్తుంది. మూడో కొండపై కల్యాణకట్ట, సిద్ధి వినాయక మందిరం ఉన్నాయి.

No comments:

Post a Comment