Thursday, 23 February 2017

హరోం హరా..





హరోం హరా..

ఊరు.. వాడ.. కొండ.. కోన.. పులకించే పండుగ శివరాత్రి. ఊరూరా ప్రభలు కట్టడం ఈ పండుగ ప్రత్యేకత. పంట ఇంటికి పంటలర వస్తున్న తరుణంలో సంక్రాంతి. ఆ ఆదిదేవుడు దయతో అన్ని పంటలు పూర్తిగా ఇంటికి చేరాక శివరాత్రి. తమను, తమ పంటలను కంటికి రెప్పలా కాపాడిన ఆ భోళాశంకరునికి రైతులు మొక్కులు తీర్చుకుంటారు. వ్యవసాయ వాహనాలు, ఎద్దులు, ఇతర పశువులను శివాలయం చుట్టూ తిప్పుతారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై భ క్తులు ఉత్సాహంగా, ఉల్లాసంగా శివయ్య దర్శనానికి తరలివెళతారు. కొందరు భక్తులు రోజంతా ఉపవాసంతో జాగరం చేయడం ఆనవాయితీ. శివరాత్రి నాడు భక్తులు హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ పారవశ్యంతో చేసే శివనామ స్మరణతో చలి శివ..శివా.. అంటూ పారిపోతుందని పెద్దలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రముఖ శివాలయాలు  సోమవారం నిర్వహించనున్న శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి.

యనమలకుదురులో శివరాత్రి ఏర్పాట్లు
యనమలకుదురు(పెనమలూరు) : నేటి నుంచి ప్రారంభం కానున్న శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రధాన ద్వారం నుంచి భక్తులు కొండ పైకి వెళ్లటానికి ప్రత్యేక వాహనాలు కేటాయించారు. ఇతరుల వాహనాలు కొండపైకి అనుమతించరు. మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా దీపాలు పెట్టారు. దాదాపు 60 అడుగులు ఎత్తు హనుమంతుడి విగ్రహానికి రంగులు వేశారు. నటరాజస్వామిని తీర్చి దిద్దారు. ఆరు మాసాలుగా చేపట్టిన కొండపై విస్తరణ పూర్తి చేశారు.

శివగిరిపై ఉత్సవాలకు సిద్ధం
మొగల్రాజపురం : కొండపై (శ్రీ వాగ్దేవీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం) శివగిరి మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది.40 అడుగుల ఎత్తు త్రిభుజాకారపు డమరుకం కలిగిన శివలింగాన్ని కొండపై ఏర్పాటు చేశారు. సున్నపుబట్టీల సెంటర్‌లోని అమ్మ కల్యాణ మండపం నుంచి శివగిరికి దారి ఉంది. సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని శివగిరిక్షేత్ర స్థాపకుడు మల్లికార్జునశర్మ తెలిపారు.

బలివేలో ఏర్పాట్లు సిద్ధం..
నూజివీడు : ముసునూరు మండలంలోని బలివే గ్రామంలో రామలింగేశ్వరస్వామి (భలే రామస్వామి) ఆలయం మహాశివరాత్రికి ముస్తాబవుతోంది. ఆలయంలో రామలింగేశ్వరస్వామి పశ్చిమ అభిముఖంగా దర్శనమిస్తారు. ఏటా మహాశివరాత్రి నాడు ఇక్కడ స్వామి కల్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

ఉత్తరవాహినీ ముక్త్యాల..
జగ్గయ్యపేట: మండలంలోని ముక్త్యాలలో భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఏటా ఉత్తరవాహినిలో స్నానం ఆచరించి స్వామిని దర్శించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. లక్షల సంఖ్యలో భక్తులు స్వామి కల్యాణాన్ని తిలకిస్తారు. అధికారులు స్నానఘాట్‌లను శుభ్రం చేయించారు. గ్రామ సమీపంలోని పంచముఖ అమృత లింగేశ్వరస్వామి (కోటి లింగాలు) మహాశివరాత్రికి ముస్తాబైంది. కోటిలింగాలను ఇక్కడ ప్రతిష్టించేందుకు 108 ఉప ఆలయాలు ఏర్పాటు చేశారు.

రామేశ్వరుని ఆలయం ముస్తాబు
తోట్లవల్లూరు : శివరాత్రి సందర్భంగా మండలంలోని ఐలూరులో గంగా పార్వతీ సమేత రామేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణానదిలో సుమారు లక్ష మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. నదిలో నీరు లేకపోవటంతో బోర్లు వేయించి జల్లు స్నానాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం పితృదేవతలకు పిండప్రదానాలు చేస్తారు. అనంతరం రామేశ్వరస్వామి, రఘునాయకస్వామిని దర్శించుకుంటారు. భక్తుల రాకకు పంచాయతీ, దేవాదాయశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.

సకల పాప హరణం.. సంగమేశ్వరుడి దర్శనం..
కూడలి(నందిగామ రూరల్): శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు గుర్తొచ్చేది కూడలి తిరునాళ్ల. ఏటా శివరాత్రికి నందిగామ మండలంలోని దాములూరు కూడలిలో సంగమేశ్వరస్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. వైరా, కట్టెలేరు సంగమ ప్రాంతంలో స్వామి వెలిశారు. కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి భక్తులు హాజరవుతారు. ఈ ఏడాది వైరా, కట్టెలేరు ఎండిపోయాయి. దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులు ప్రత్యామ్నాయంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు కుంటలు ఏర్పాటుచేశారు. కూడలి తిరునాళ్ల ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులు తిరునాళ్ల కొనసాగుతుంది.




రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఇదే..!
ఏలూరు/పెదవేగిత్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారానంతరం శ్రీలంక నుంచి అయోధ్య చేరడానికి ముందు మార్గమధ్యమంలో బ్రహ్మ హత్యా దోషనివారణార్థం మహాస్థలాలను ఎన్నుకుని ఈశ్వర లింగ ప్రతిష్ఠ చేస్తూ వెళతాడు. అందులో భాగంగా తమ్మిలేరు ఒడ్డున శ్రీరాముడు బలివేలో ఈశ్వర లింగ ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. అనంతరం బలివే రామలింగేశ్వరస్వామితో పాటు చుట్టుపక్కల నూటొక్క లింగాలు ప్రతిష్ఠింపజేస్తామని శ్రీరాముడు చెప్పినట్టు పురాణగాధ. ఈ ప్రాంతాన్ని బలి చక్రవర్తి పరిపాలించినట్లుగా చరిత్ర. అందుకే ఈ ప్రాంతానికి బలివేగా, ఇక్కడ వేంచేసిన స్వామిని బలివే రామస్వామిగా పిలుస్తారు. 101 శివలింగాల్లో ప్రస్తుతం 4, 5 మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో ప్రముఖమైనది మృత్యుమల్లేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని తాతగుడి అంటారు. రామలింగేశ్వరస్వామి కళ్యాణానంతరం రధోత్సవంనాడు తాతగుడికి వెళ్ళి ఆ స్వామి ఆశీస్సులు తీసుకునే సంప్రదాయం ఉంది. బలివే రామలింగేశ్వరస్వామి పశ్చిమకు అభిముఖంగా ఉండడం విశేషం. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచింది. ఈ స్వామి సమీపంలో తమ్మిలేరులో ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి పూర్వీకులకు పిండప్రధానం చేసి, పితృతర్పణాలు వదలడం ఆనవాయితీ.



రాముడు ప్రతిష్ఠించిన రామలింగేశ్వరుడు బలివే (ముసునూరు): భక్తుల కోర్కెలు తీర్చే బలివే శ్రీరామలింగేశ్వరుడు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాడు. కృష్ణా, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి ఏటా మూడు లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుని పూర్వీకులు, పితృదేవతలకు పిండప్రదానం చేయడం ఇక్కడ ప్రత్యేకత. శ్రీరాముడు రావణ సంహరాణానంతరం దోష నివారణార్థం మహాస్థలాలను ఎన్నుకొని ఈశ్వర లింగ ప్రతిష్ఠ చేసుకుంటూ అయోధ్య చేరడానికి ముందు మహా అరణ్యమైన ఈ స్థలంలో పరమేశ్వరుడుని ఆవాహనం చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణ గాధ. బలిచక్రవర్తి పరిపాలించిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతం బలివేగా, ఈ ఆలయాన్ని బలివే రామలింగేశ్వరస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామ పరిసరాల్లో పూర్వం 101 లింగాలు ఉండేవని పురాణాలు చెబుతుండగా, ఇప్పటికీ కొన్ని తవ్వకాలు బయటపడుతున్నాయి. ఈ గుడికి సమీపంలో బలివే రామస్వామికి తాతగా పిలిచే మృత్యు మల్లేశ్వరస్వామి లింగం (తాత గుడి) ఉంది. స్వామి వారు కల్యాణం అనంతరం రథోత్సవంలో తాత దర్శనం తీసుకుంటుండటం అనవాయితీగా వస్తుంది. ఇక్కడ స్వామి వారు పశ్చిమాభిముఖముగా సద్యోజాతమూర్తిగా వెలుగొందుతుండటం వల్ల పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచింది. ఆలయం చేరడానికి ఆర్టీసీ అధికారులు నూజివీడు నుంచి ప్రత్యేక బస్సు వసతి కల్పిస్తుండగా, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నూజివీడు డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల స్నానాలకు తమ్మిలేరు జలాలతో పాటు, జల్లు స్నానాలు దేవదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు.









No comments:

Post a Comment