Thursday, 23 February 2017

ఏడుపాయల వనదుర్గమ్మవారు

శివరాత్రి ఉపవాసాల పండగ. జాగరణల పండగ. శివయ్యకు అభిషేకాల పండగ. ఇదే శివరాత్రి జాతరల పండగ కూడా. జాతర అనగానే గుర్తొచ్చేది తెలంగాణలోని ఏడుపాయల. వనదుర్గ అమ్మవారు కొలువుదీరిన ఏడుపాయల శివరాత్రి సమయంలో భక్తజనజాతరతో కిటకిటలాడతాయి. ఈ క్షేత్ర పర్యటన ఆధ్యాత్మిక ఆనందం పంచడంతో పాటు ఆహ్లాదకరమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మంజీర నాదాలు
ఎత్తయిన బండరాళ్లు. చిన్నరాయిపై పెద్దరాయి. పెద్దరాయిపై ఇంకా పెద్ద బండరాయి. ఆ బండరాళ్లను తాకుతూ సాగిపోయే మంజీరా నది. ఏడుపాయలుగా విడిపోయి సప్తస్వరాలు పలికే మంజీర నాద.. ఇదీ ఏడుపాయల సోయగం. జలతరంగాల నడుమ నిలిచిన కొండల్లో వెలిసింది వనదుర్గా అమ్మవారు. అపర కాళీ అవతారంగా అమ్మను భావిస్తారు. దుర్గా రూపాల్లో వనదుర్గ అంత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది. శతాబ్దాలుగా పూజలందుకుంటున్న అమ్మవారి విగ్రహం చూసినంత ప్రసన్నత చేకూరుతుంది. పూర్వం జనమేజయుడు ఈ క్షేత్రంలోనే సర్పయాగం చేసినట్లు స్థలపురాణం చెబుతోంది. వనదుర్గాదేవి సన్నిధిలో శివరాత్రి మొదలు వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.
 
శివరాత్రి సందర్భంగా ఏడుపాయలలో ఘనంగా జాతర నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు దీనికి హాజరవుతారు. జాతరలో భాగంగా శివరాత్రి మర్నాడు నిర్వహించే ఎడ్ల బండ్ల ఊరేగింపు కోలాహలంగా సాగుతుంది. ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఘనపురం ఆనకట్ట ఏడుపాయలలో ప్రధాన ఆకర్షణ. నిజాం నవాబుల కాలంలో నిర్మించిన డ్యామ్‌ మీదుగా భక్తులు ఆలయానికి చేరుకుంటారు. ఓవైపు పచ్చదనం.. మరోవైపు మంజీరా నదీ జలాలు.. కట్టమీదుగా సాగే కాలినడక ఎప్పటికీ గుర్తుండిపోతుంది.


ఎలా వెళ్లాలి.. 
హైదరాబాద్‌ నుంచి దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏడుపాయల. ముందుగా మెదక్‌ చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు అందుబాటులో ఉంటాయి. 

ఘనపురం కట్ట అందాలు వీక్షించాలనుకుంటే.. హైదరాబాద్‌ నుంచి మెదక్‌ (వయా నర్సాపూర్‌) బస్సు ఎక్కాలి. పోతంశెట్టిపల్లి చౌరస్తా దగ్గర బస్సు దిగి.. అక్కడి నుంచి ఘనపురం ఆనకట్ట వరకు ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లాలి. డ్యామ్‌పై నుంచి కాలినడక ద్వారా ఏడుపాయల చేరుకోవచ్చు. 

గోదావరి ఉపనది అయిన మంజీరా మహారాష్ట్రలోని బాలాఘాట్‌ పర్వతశ్రేణుల్లో పుట్టింది. కర్ణాటక మీదుగా తెలంగాణలోకి మెదక్‌ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కాశీలో గంగానది ప్రవాహం ఉత్తరంగా మారినట్లు.. ఏడుపాయల క్షేత్రం సమీపంలో మంజీరా ప్రవాహం ఉత్తర దిశకు మళ్లింది. అందుకే మంజీరా నదిని దక్షిణ గంగగా అభివర్ణిస్తారు. గురు గ్రహం మేష సంక్రమణ సందర్భంగా గంగానదికి పుష్కరాలు నిర్వహించినప్పుడు.. మంజీరానదికి కూడా పుష్కరోత్సవం చేస్తుంటారు. 

  
No comments:

Post a Comment