Thursday, 9 February 2017

ఆనందానుభూతుల ద్వారం...నైమిశారణ్య మార్గంముక్తినాథ్‌
ఆనందానుభూతుల ద్వారం...నైమిశారణ్య మార్గంవిష్ణుభక్తులందరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని తహతహలాడే పుణ్య క్షేత్రం ముక్తినాథ్‌. ఇది హిమాలయాల్లో 3710 మీటర్ల ఎత్తులో నెలకొని ఉంది. 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ముక్తినాథ్‌ 106వ క్షేత్రం. ముక్తినాథ్‌ క్షేత్రాన్ని ముక్తిక్షేత్రమనీ, త్రిశూలగ్రామం అనీ పిలుస్తారు. ఈ క్షేత్ర ప్రత్యేకత ఏమిటంటే, అటు హిందువులు, ఇటు బౌద్ధులు కూడా దీనిని పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. ముక్తినాథుణ్ణి ఒక్కసారి దర్శిస్తే మోక్షం వస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా లక్నోకి చేరుకోవాలి. ముక్తినాథుని దర్శనానికి వెళ్లే ముందు లక్నో చుట్టు పక్కల ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.

నైమిశారణ్యం:
లక్నోకి సుమారు 40 మైళ్ల దూరంలో నైమిశారణ్యం ఉంది. విష్ణుమూర్తి స్వయంగా వెలసిన ఎనిమిది వైకుంఠ క్షేత్రాల్లో ఇది ఒకటి. మనం భారత భాగవతాది పురాణాలలో నైమిశారణ్యం గురించి వింటూనే ఉంటాం. అంతే కాదు, 108 దివ్యదేశాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో స్వామి అరణ్యరూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడి ఆలయంలోని మూలవిరాట్టును దేవరాజ్‌ పెరుమాళ్‌గా పిలుస్తారు. ఇక్కడే చక్రతీర్థం ఉంటుంది. వలయాకారం కొలను మధ్యలో మరో వలయం లాంటి దిమ్మ ఉంటుంది. ఆ కొలనుకి దక్షిణంగా దుర్గ, రాధాకృష్ణ, వినాయకమందిరాలు ఉంటాయి. దగ్గర్లోనే మహర్షులైన వ్యాస, వైశంపాయనుల గుడులు ఉన్నాయి. వాటి ఎదుట ఉన్న పెద్ద హోమగుండంలో నిత్యాగ్నిహోత్రం వెలుగుతుంటుంది. అక్కడ పూర్వం 108 మంది రుషులు యజ్ఞం చేశారని ప్రతీతి.

గండకీనది:
నైమిశారణ్యం దగ్గర్లోనే కాళీ గండకీనది ఉంది. ఇది చాలా లోతుగా ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి దేవరాజ్‌ స్వామిని దర్శించుకోవాలి. పక్కనే అహోబిల మఠం ఉంటుంది. ఇక్కడ లక్ష్మీనరసింహాస్వామి గుడి ఉంది. మఠం నుంచి అయిదు గంటలు ప్రయాణిస్తే అయోధ్యకు చేరుకోవచ్చు.

రాముడి జన్మస్థానం :

అయోధ్య సరయూ నది ఒడ్డున ఉంది. అక్కడకి దగ్గరలో రాముడు జన్మించిన ప్రదేశం ఉంది. రామమందిరానికి వెళ్లే వీధులన్నీ ఇరుకుగా ఉంటాయి. ఆలయంలో రాముడికీ సీతకీ మాత్రమే మందిరాలు ఉన్నాయి. రామజన్మభూమి ప్రాంతం భద్రతాపరమైన తనిఖీల మధ్య దర్శించుకోవాల్సి ఉంటుంది. .

ముక్తినాథుని యాత్ర:
ముక్తినాథ్‌ ఆలయం నేపాల్‌లోని ముస్తాంగ్‌ జిల్లాలో ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా సరిహద్దు గ్రామమైన సొనాలి చేరుకోవాలి. ఇది సగం నేపాల్‌లోనూ సగం భారత్‌లోనూ ఉంది. ఇక్కడ భద్రతాపర తనిఖీలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి పోఖ్రా విమానాశ్రయం చేరుకొని జమ్‌సమ్‌ చేరుకోవాలి. పోక్రా నుంచి విమానంలో ప్రయాణించేటప్పుడు మంచుకొండలు, జలపాతాలు, అగాథంలా కనిపించే లోతైన లోయలు అద్భుతంగా ఉంటాయి. జమ్‌సమ్‌ మంచుశిఖరాలు కనులవిందుగా అనిపిస్తాయి. జమ్‌సమ్‌ నుంచి ఇరుకైన దారిలో గంటన్నర ప్రయాణిస్తే రాణీపువా గ్రామం చేరుకోవచ్చు. అక్కడ మోటారు సైకిళ్ల మీద నేపాలీయులు చాలామంది ఉంటారు. బైక్‌లమీదే ముక్తినాథ్‌కు వెళ్లాలి. ఎందుకంటే అది చాలా ఇరుకైన దారి. సుమారు 20 నిమిషాలు ప్రయాణిస్తే ముక్తినాథ్‌కు చేరుకోవచ్చు. ఇక్కడ హోటళ్లు తక్కువగా, చాలా చిన్నవి ఉంటాయి.

దేవాలయాన్ని చేరుకుని, స్వామిని సందర్శించుకోవాలంటే కనీసం 200 మెట్లు ఎక్కాలి మరి. తీరా ఆలయానికి చేరుకున్నాక, ఇంత చిన్న ఆలయమా! అని అనిపిస్తుంది కానీ, గుడి ఎంత చిన్నగా ఉన్నప్పటికీ, గర్భాలయంలో వింజామరలు వీచే శ్రీదేవి, భూదేవిలతో సహా సాక్షాత్కరించే శ్రీమన్నారాయణుని దివ్యసుందర విగ్రహాన్ని దర్శించుకునేసరికి, ఆ భావన కాస్తా ఎటో ఎగిరిపోతుంది. ఆలయ అంతరాళంలో శేషతల్పంపై పడుకుని ఉన్న విష్ణుదేవుడి విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోగానే, మనసు వైకుంఠానికి వెళ్లిపోతుంది. తన భక్తులూ తనతో సమానం అన్నట్లుగా ఆ స్వామి మూర్తి పక్కనే ఆయనకు పరమ భక్తాగ్రేసరుడైన రామానుజుల విగ్రహం దర్శనమిస్తుంది. గుడి పక్కనే 108 గోముఖాల గుండా నీటిధారలు పడుతుంటాయి. వీటి నుంచి వచ్చే నీళ్లు చల్లగా రక్తం గడ్డ కట్టేటట్లు ఉంటాయి. గుడికి దగ్గరలో దివ్యమైన జ్వాలతో మన అజ్ఞానాంధకారాలను పటాపంచలు చేసేందుకా అన్నట్లు ఒక దివ్య జ్యోతి మినుకు మినుకుమని వెలుగుతుంటుంది. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా చెప్పే మూడు జ్యోతులు ఉంటాయని భక్తుల విశ్వాసం.

శ్వేత గండకీ నది, డేవిడ్‌ పాల్స్‌:
పోఖ్రా నుంచి శ్వేతగండకీ నదికి వెళ్లవచ్చు. ఇక్కడ నీళ్లు పాలల్లా తెల్లగా, స్వచ్ఛంగా, తాగడానికి కొబ్బరినీళ్లలా ఉంటాయి. అక్కడికి దగ్గరలోనే డేవిడ్‌ ఫాల్స్‌ ఉన్నాయి. నీటిధారల్నీ భూమినీ ఎవరో కళాకారుడు చెక్కినంత అందంగా అక్కడ జలపాతం దూకుతూ ఉంటుంది. ఆ నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలీదు.

పశుపతి నాథ్‌
ఖాట్మండు నుంచి 12 గంటలు ప్రయాణిస్తే పశుపతి నాథుణ్ని దర్శించుకోవచ్చు. దారి మధ్యలో ఒక వైపు వాగులు మరో వైపు క్యాబేజీ కాలీఫ్లవర్‌ పంటపొలాలూ చూసుకుంటూ వెళ్లవచ్చు. పశుపతినాథుని ఆలయం చాలా విశాలంగా, సుందరంగా ఉంటుంది. ఆలయంలో ఈశ్వరుడు చతుర్ముఖుడు. గుడిలోపల వినాయకుడు, నర్‌నారాయణ్, శ్రీరామమందిరాలు కూడా ఉన్నాయి. పక్కనే భాగమతీనది ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున ఘాట్‌లో దహనం చేసి నదిలో కలిపితే కాశీలో మరణించిన పుణ్యం వస్తుందని స్థలపురాణం చెబుతోంది.

నీలకంఠ బుద్ధుడు:
నీల్‌కంఠ ఆలయం చాలా పెద్దది. గుడి మధ్యలో పెద్ద కొలను ఉంది. దాని మధ్యలో శ్రీమన్నారాయణుడి విగ్రహం ఉంది. అందువల్ల కొలను నీళ్లతో ప్రక్షాళన చేసుకోవడమే మహాప్రసాదంగా భావిస్తారు భక్తులు. అక్కడికి దగ్గరలో రాధాకృష్ణుడి ఆలయం ఉంది. ఇది ప్రపంచ వారసత్వ సంపదలో భాగంగా రక్షించబడుతోంది. పగోడాల్లాంటి గోపురాలు, పెద్ద సింహాలు, ఏనుగుల శిల్పాలతో పాటు నర్తన గణపతి, కాళికాంబ విగ్రహాలు చెక్కి ఉన్నాయి. రాధాకృష్ణమందిరంలో పైకప్పుపైన చెక్కిన మహాభారత ఘట్టాలు నయన మనోహరంగా ఉంటాయి. ముక్తినాథ్‌ యాత్రలో భాగంగా చాలా ప్రదేశాలను చూడవచ్చు. ఈ యాత్ర మనకు ఎన్నో మధుర స్మృతులను మిగులుస్తుంది.

ఎప్పుడు వెళ్లాలి?
ముక్తినాథుణ్ణి సందర్శించుకోవడానికి మార్చి నుంచి జూన్‌ వరకు అనుకూలంగా ఉంటుంది. అంతకన్నా ముందు లేదా ఆ తర్వాత వెళ్లలేం. వొళ్లు గడ్డకట్టించే చలి పులి, అతిశీతలవాయువులు మనల్ని తరిమి తరిమి కొడతాయి. మనం ఆనందానుభూతులను పొందలేము కూడా. కాబట్టి మనకు ఎండలనుంచి ఉపశమనం కలగాలన్నా, మంచుకొండల మధ్యన మనం ఆనందాన్ని అనుభవించాలన్నా ఎండాకాలమే మంచిది.

– డి.వి.ఆర్‌.భాస్కర్‌No comments:

Post a Comment