Sunday, 19 March 2017

ద్వారకను చూసొచ్చాం!
ద్వారకను చూసొచ్చాం!‘‘శ్రీకృష్ణుడు పాలించిన అలనాటి ద్వారక విశేషాలనూ, సోమనాథ్ జ్యోతిర్లింగ మహాత్త్వాన్నీ వైభోగాలకు నెలవైన చిత్తోడ్, ఉదయ్ పూర్ కోటల అందచందాలను ఏకకాలంలో చూసి రావాలంటే గుజరాత్,రాజస్తాన్ రాష్ట్రాలను పర్యటించాల్సిందే. ’’

మా పర్యటనలో భాగంగా ముందుగా మేం అహ్మదాబాద్‌కు వెళ్లాం. మేం వెళ్లింది దసరా సమయం కావడంతో ఎక్కడ చూసినా గార్భా సందడే. గుజరాతీలు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా జరుపుకునే పండగల్లో దసరా అత్యంత ముఖ్యమైనది. అందుకే నవరాత్రుల తొలి రోజున గార్భాను పూజామందిరాల్లో పెట్టి అమ్మవారిని ఆవాహన చేస్తారు. తొమ్మిదిరోజులూ భక్తిశ్రద్ధలతో పూజించి దశమినాడు హోమంతో పూజ పూర్తి చేసి దగ్గరలోని దేవాలయాల్లో ఉన్న పూజారులకు దక్షిణ తాంబూలాలతో గార్భాను సమర్పిస్తారు. చుట్టూ చిల్లులు ఉన్న కుండలో దీపం పెట్టి పైన మూతపెట్టినదే గార్భా. ప్రత్యేక ప్రదేశాల్లోనూ వీధికూడళ్లలోనూ మనం అమ్మవారి విగ్రహం పెట్టినట్లుగా ఈ గార్భాలను పెడతారు. చీకటిపడిన దగ్గర్నుంచీ తెల్లారేవరకూ చేసే ఈ గార్భా నృత్యాలనే రాస్‌ అంటారు.

తీన్‌ దర్వాజా!
ముందుగా మేం అహ్మదాబాద్‌లోని భద్రకాళీ మందిరంలో అమ్మవారిని దర్శించుకున్నాం. దేశానికి పశ్చిమం వైపున ఉండటంవల్లనేమో మనకన్నా గంట ఆలస్యంగా సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఉన్నాయక్కడ. పూర్వం నగరానికి స్వాగత ద్వారంలాంటి తీన్‌ దర్వాజా నేడు ప్రముఖ వ్యాపార కూడలి. దానిగుండానే పురాతన జామామసీదుకు వెళ్లాం. తరవాత సబర్మతీ నదీతీరాన్నే ఉన్న గాంధీజీ ఆశ్రమాన్నీ అక్కడ ఉన్న మ్యూజియాన్నీ చూశాం. ఆ మ్యూజియంలోని ఆనాటి దినపత్రికల్లో మన ఆంధ్ర పత్రిక కూడా ఉంది. అవన్నీ తిరిగి చూస్తుంటే నాటి పరిస్థితులు కళ్లకు కట్టినట్లుగా అనిపించాయి.

శ్రీకృష్ణ ద్వారక!
తరవాత చార్‌ధామ్‌లలో ఒకటైన ద్వారకకు బయలుదేరాం. దారి పొడవునా పవన విద్యుచ్ఛక్తికోసం ఏర్పాటుచేసిన గాలిమరలు ఉన్నాయి. అహ్మదాబాద్‌ నుంచి ఏడు గంటలు ప్రయాణించి ఇరుకిరుకు సందులతో ఉన్న ద్వారకలోకి అడుగుపెట్టాం. గోమతీనది అరేబియా సముద్రంలో కలిసే సంగమ ప్రదేశంలో విశ్వకర్మ చేతుల్లో రూపుదిద్దుకున్న శ్రీకృష్ణ రాజధాని ద్వారక ఇదేనా అనిపించింది. అలనాటి ద్వారక అనేకసార్లు సముద్రంలో మునిగిపోయింది. ఏడోసారి నిర్మించినదే ప్రస్తుత ద్వారక. ముందుగా ద్వారకాదీశ మందిరానికి వెళ్లాం. అద్భుతమైన శిల్పకళతో కట్టిన ఆ గుడిలో స్వామివారి నల్లరాతి విగ్రహం చక్కని అలంకరణతో నయన మనోహరంగా ఉంది. కృష్ణభక్తురాలైన మీరాబాయి భజన కీర్తనలు ఆలపిస్తూ ప్రజలు చూస్తుండగానే గర్భగుడిలోకి వెళ్లి మరి బయటకు రాలేదట. ఆ మహాభక్తురాలు కృష్ణుడిలో ఐక్యమైపోయిందని విశ్వసిస్తారు భక్తులు.

అక్కడకు బెట్‌ ద్వారక ఐదు కిలోమీటర్లు. ఆ దారిలో జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వరలింగం, గోపీతలావ్‌, రుక్మిణీమందిరం, సముద్ర నారాయణుని గుడి మొదలైన దర్శనీయ స్థలాలు ఉన్నాయి. లాంచీలో చిన్నదీవిలా ఉన్న బెట్‌ ద్వారకకు వెళ్లాం. అక్కడ కృష్ణుడు, సత్యభామ, ఇతర దేవేరుల మందిరాలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ ద్వారక, బెట్‌ ద్వారకల మధ్య గరుత్మంతునిపై తిరిగేవాడట. సూర్యాస్తమయ సమయానికి సముద్రతీరానికి చేరుకున్నాం. నేలనుంచి సుమారు 30-40 అడుగులు కిందకు కుంగిపోయినట్లు దిగబడిపోయిన సముద్ర ఒడ్డును చూస్తుంటే ఒళ్లు జలదరించినట్లయింది. ఏదో ఉపద్రవంతో ఒక్కసారిగా భూమి ముక్కలైపోయినట్లుగా పొరలుపొరలుగా కనిపిస్తుంది. అది చూస్తుంటే నాటి పురాణాలూ ఇతిహాసాలూ నిజంగా జరిగాయా అనిపించకమానదు. గాంధీగారి సొంతూరు!

ద్వారకకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది పోరుబందరు. కృష్ణుడు కుచేలుడికి బహూకరించిన నాటి సుధామపురే నేటి పోరుబందరు. కృష్ణుడు రాజమందిరాన్ని ప్రసాదించినా అందులో నివసించకుండా పక్కనే చిన్న గదిలో ఉంటూ కృష్ణుణ్ణి పూజించి తరించిన ఆ సుధామ మందిరం, దాని పక్కనే ఆయన గదీ నాటి బావీ నేటికీ ఉండటం విశేషం. అక్కడనుంచి తరవాత గాంధీజీ జన్మించిన ఇంటిని చూడ్డానికి బయలుదేరాం. పురాతన భవనమైనా చెక్కుచెదరలేదు. ఎగువ మధ్యతరగతి వైశ్య కుటుంబం కావడంతో ఇల్లు దర్పంగా విశాలంగా ఉంది. బాపూజీ తల్లిదండ్రులవీ బాపూజీ-కస్తూర్బాలవీ నిలువెత్తు తైలవర్ణ చిత్రాలు అలంకరించారు.

ప్రభాస పట్టణ దర్శనం...
అక్కడకు 129 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమనాథ్‌కు రాత్రికి చేరుకున్నాం. పురాణాల్లో దీన్నే ప్రభాస పట్టణంగా చెబుతారు. పాలసముద్రంలాంటి అరేబియా ఒడ్డున విశాలమైన ప్రాంగణాల్లో అద్భుత శిల్పకళా చాతుర్యానికి నితువెత్తు దర్పణంలా మెరిసిపోతుంది ఈ దేవాలయం. మందిరం దగ్గర్లోనే కపిల, హిరణ్య, సరస్వతి అనే మూడు నదుల త్రివేణీ సంగమస్థానం భక్తులతో సందడిగా ఉంది.

కృష్ణుని మహాప్రస్థానం..!
మహా ప్రళయానికి ద్వారక నాశనం కాగా శ్రీకృష్ణుడు సోమనాథ్‌ పక్కనే ఉన్న భాలకా అనే ప్రదేశం చేరుకుని చెట్టు కింద విశ్రమిస్తున్నాడట. ఆయన పాదాన్ని లేడి కన్నులా భావించి కిరాతకుడు వేటకై బాణాన్ని విడవగా అది కృష్ణ పరమాత్మ ప్రాణాలు గైకొందట. బలరాముడు ఆదిశేషుని రూపంలో త్రివేణీసంగమం దగ్గర ఉన్న పుట్ట ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయాడట. శంఖుచక్రాలు సముద్రంలో లీనమై గోమతీ చక్రాల రూపంలో సోమనాథ్‌-ద్వారకల మధ్య ఉన్న సముద్ర ప్రదేశంలో మాత్రమే లభిస్తున్నాయట. ఒకవైపు శంఖం, మరోవైపు చక్రంలా ఉండి ఇవి లక్ష్మి-విష్ణు స్వరూపంగా సర్వశక్తిమంతమై నేటికీ పూజలందుకుంటున్నాయి.

చిత్తోడ్‌గఢ్‌ కోటలో...


అక్కడ నుంచి రాజుపుత్రుల శౌర్యప్రతాపాలూ వైభోగాలూ దర్శించడానికి రాజస్థాన్‌కు బయలుదేరాం. దారిపొడవునా పాలరాతి కొండలు పచ్చగా కళకళలాడుతున్నాయి. ఉదయ్‌పూర్‌కు ముందు మేవాడ్‌ రాజుల రాజధాని ఈ చిత్తోడ్‌గఢ్‌. క్రీ.శ. 7-16 వరకూ ఎన్నో వైభోగాలతో తులతూగింది. ఖిల్జీల దండయాత్రలో నాశనమైపోయింది. మీరా పూజలందుకున్న కృష్ణమందిరం నేటికీ పూజలందుకుంటూ గత స్మృతుల్లోకి మనల్ని నెడుతుంది. శివమందిరంలో బాల, ఫ్రౌడ, వృద్ధ రూపాలుగా శిరస్సు మాత్రమే కనిపించేలా చెక్కిన ఎత్తైన శివుని విగ్రహం కొంత భయం గొలిపేలా ఉంది. ఆ పక్కనే గోముఖ్‌ రిజర్వాయర్‌, కాళీమందిరం, రాణీ పద్మినీ ప్యాలెస్‌, గులాబీవనం, జైనమందిరం కనిపిస్తాయి.

అద్భుత అందగత్తె అయిన రాణీ పద్మినీ, రాణీ కర్ణావతిల సమాధుల్ని చూశాం. చిత్తోడ్‌ సామ్రాజ్యాధికారం కోసం పసిబిడ్డగా ఉన్న ఉదయ్‌సింగ్‌ని చంపాలనుకున్నారట దాయాదులు. ఈ కుట్రను పసిగట్టిన దాసి పన్నాబాయి ఉదయ్‌సింగ్‌ స్థానంలో అదే వయసున్న తన బిడ్డను ఉంచిందట. దాయాదుల చేతిలో ఆ బిడ్డ హతం కాగా చిన్నారి ఉదయ్‌సింగ్‌తో పన్నాబాయి కోట దాటి తప్పించుకున్న ప్రదేశం మనకు కనిపిస్తుంది. ఇలా ఎన్నో చారిత్రక సాక్ష్యాలకు నిలయం చిత్తోడ్‌కోట. ప్రస్తుతం కొండజాతివారు ఈ కోటలో సీతాఫలాలు పండించుకుంటూ జీవిస్తున్నారనీ వాళ్లు రాణా ప్రతాప్‌కు సహాయం చేసిన భీల్‌ తెగవారనీ మా గైడ్‌ చెప్పాడు. నార చీరలు తయారుచేయడం, అతి తేలికైన రజాయిలు చేయడం వాళ్ల ప్రత్యేకత అనీ, ప్రభుత్వ సహకారంతో వాటిని కోటలోని దుకాణాల ద్వారా అమ్ముకుంటూ ఆ డబ్బుతోనే జీవించే నిజాయతీ పరులనీ చెప్పాడు. తరవాత అక్కడినుంచి ఉదయ్‌పూర్‌కు వెళ్లాం.

సరస్సుల నగరంలో విహారం... 


మహారాణా ఉదయ్‌సింగ్‌ అడవిలాంటి ఈ ప్రదేశానికి వేటాడుతూ రాగా గోస్వామి ప్రేమ్‌జీ అనే సన్యాసి ఇక్కడ కోటను నిర్మించమన్నాడట. ఆయన ఆదేశంతో 1559లో నాలుగు అంతస్తులుగా కోటనూ నగరాన్నీ నిర్మించాడట. అందుకే ఈ నగరం ఆయన పేరు మీదనే ఉదయ్‌పూర్‌గా స్థిరపడింది. నగరానికి రాణీలాంటి సిటీ ప్యాలెస్‌ పిచోలా సరస్సు పక్కనే ఉన్న కొండమీద ఉంది. ఇప్పటికీ ఉదయ్‌సింగ్‌ వంశంలోని 24వ తరం వారి అధీనంలోనే ఈ కోట ఉంది. వారి కులదైవమైన సూర్యుని ముద్ర ప్రవేశద్వారంపై ఉంటుంది. లోపల విశాలమైన వరండాలూ గదులూ ఉన్నాయి. ఉదయ్‌సింగ్‌ కుమారుడు రాణా ప్రతాప్‌, మొఘల్‌ చక్రవర్తుల కొమ్ముకాస్తున్న జైపూర్‌ రాజు రాజా మాన్‌సింగ్‌ని చంపడానికి తన గుర్రం చేతక్‌కు ముందు ఇనుముతో చేసిన ఏనుగుతొండం కట్టి కదనరంగంలోకి వెళతాడు. మాన్‌సింగ్‌ అధిరోహించిన ఏనుగు, దాన్ని ఓ పిల్ల ఏనుగుగా భావించి చేతక్‌ జోలికి రాదు. అయితే అది దగ్గరకొచ్చాక చేతక్‌ ఒక్కసారిగా కత్తులు కట్టిన తనముందు కాళ్లతో పైకి లేవడంతో రాణా చేతిలో మావటి క్షణాల్లో చనిపోయాడట. కానీ మాన్‌సింగ్‌ కిందకు వంగడంతో ప్రాణాలతో బయటపడతాడు. ఆ యుద్ధంలో గాయపడ్డ రాణాప్రతాప్‌ను తను గాయపడ్డా కూడా యుద్ధభూమి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంబాల్‌గఢ్‌ వరకూ తీసుకెళ్లి అక్కడ 42 అడుగుల వెడల్పు ఉన్న బనాస్‌ నదిలో దూకి రాణా ప్రాణాలు కాపాడి చేతక్‌ కన్ను మూసిందట. ఆ దృశ్యాలన్నీ తైలవర్ణ చిత్రాల్లో చిత్రించి ఉన్నాయి. ఇక, రాజదర్బారు, సింహాసనాలతోబాటు రాజప్రాసాదానికే తలమానికమైన అద్దాల నెమలి ఆనాటి కళాకారుల పనితనానికి ప్రతీక. మేవాడ్‌ రాజులు సూర్యదర్శనం తరవాతే భోజనం చేస్తారు. శ్రావణమాసంలో సూర్యదర్శనం కష్టం కాబట్టి, ఆ సమయంలో దర్శించుకోవడానికి ప్రజ్వలంగా వెలుగుతున్నట్లున్న సూర్యబింబం ఆకారాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. అతిథులను ఆటపట్టించడానికి నిర్మించిన రాతి తలుపులూ సరదా పుట్టించే వేట దృశ్యాల వర్ణ చిత్రాలూ... ఇలా ఎన్నెన్నో చిత్రవిచిత్రాలు అక్కడ ఉన్నాయి.

పాలరాతితో చేసిన తొట్టెలో బంగారునాణాలను నింపి దసరా కానుకగా జనానికి పంచేవారట. సుగంధద్రవ్యాలతో హోలీ ఆడుకునే చిన్న కొలనూ ఫౌంటెయినూ అద్దాల మందిరమూ ముఖమల్‌ మందిరమూ... ఇలా అవన్నీ చూస్తుంటే సమయమే తెలియలేదు.


కోటపైనుండి ఒకవైపు సరస్సు మధ్యలో మహారాజా జగత్‌సింగ్‌ నిర్మించిన వేసవి విడిది లేక్‌ ప్యాలెస్సూ దానికి కొద్దిదూరంలో ఉదయ్‌విలాస్‌ కోటా కనిపిస్తాయి. అక్కడ నుంచి సహేలియోంకీ బాడీకి వెళ్లాం. రాణా సంగ్రామ్‌సింగ్‌ ఆనాటి రోజుల్లోనే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఫౌంటెయిన్లు నిర్మించిన అందమైన ఉద్యానవనమే ఈ సహేలియోంకీ బాడీ. ముందుగా వెల్‌కమ్‌ ఫౌంటెయిన్‌ కనిపిస్తుంది. మనం వస్తుంటే ఇందులోంచి నీళ్లు పైకి చిమ్ముతాయి. తరవాత జోరువాన శబ్దం వినిపించే బాదల్‌ బర్‌సాత్‌, చెట్ల ఆకులూ పొదలమీద పడుతున్న వాన శబ్దాన్ని వినిపించే శ్రావణ బరసాత్‌ ఫౌంటెయిన్లనీ చూశాం. చివరగా తామరకొలను దగ్గరకు వెళ్లాం. దానికి నలువైపులా పాలరాతి ఏనుగుల తొండాల నుంచి నీరు చిమ్మేలా నిర్మించారు. అలాగే కొలను మధ్యలో రకరకాల పక్షుల ముక్కుల నుంచి నీళ్లు రావడం ఎంతో బాగుంది. చివరిగా రాణాప్రతాప్‌ స్మారక స్తూపం చూసి తిరుగు ప్రయాణమయ్యాం.No comments:

Post a Comment