Wednesday, 29 March 2017

అగస్త్వేశ్వరస్వామి - దక్షిణ కాశీ





ఇక్కడ దర్శనం చేసుకుంటే కాశీకి వెళ్లినంత పుణ్యం



చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రాశస్త్యం పొందిన శైవక్షేత్రాల్లో అగస్త్వేశ్వరస్వామి కొండ దక్షిణ కాశీగా పేరుగాంచింది. పుంగనూరు మండలం నెక్కొంది సమీపంలో ఈ క్షేత్రం ఉంది. అగస్త్య మహాముని ఈ శివలింగాన్ని ప్రతిష్టించడంతో ఆలయానికి శ్రీ అగస్త్యేశ్వరాలయమనే పేరు వచ్చింది. కొండ శిఖరాగ్రంపై విశాల స్థలంలో శివపార్వతులు, శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, అగస్త్యేశ్వరస్వామి, వినాయకుడు, చౌడేశ్వరి, వీరభద్రుడు, భద్రకాళి పూజలందుకుంటున్నారు.

స్థలపురాణం:
అగస్త్యుడు ప్రతిష్టించిన శివలింగం పార్వతీ కల్యాణ సమయంలో పరమేశ్వరుని ఆదేశం మేరకు అగస్త్యుడు దక్షిణ దేశంలో శివాలయాలు స్థాపిస్తూ ఇక్కడి కొండను చేరుకున్నాడు. పార్వతీ కల్యాణ సమయంలో తాను అక్కడ లేనందుకు అగస్త్యుడు ఆందోళన చెందుతుండగా శివుడు స్వయంభువుగా పుట్టనుంచి ఉద్భవించడంతో రుషి కొండలోని గవి లోపల ఆ శివలింగాన్ని ప్రతిష్టించాడు. నాటి చోళరాజులు ఆలయం, ప్రహరీ, గర్భగుడి, దక్షిణ ప్రవేశ ద్వారంతో ప్రధాన ఆలయం, తూర్పు ప్రవేశంగా గర్భాలయాలు, కోనేరు తదితరాలను క్రీ.పూ.921వ శతాబ్దంలో నిర్మించారు. అనంతరం క్రీ.శ.1329లో ఈ ప్రాం తాన్ని పరిపాలించిన గంగవంశ రాజులు తర్వాత ఆర్కాట్‌ నవాబులు, పుంగనూరు జమీందార్లు వంశపారంపర్య ధర్మకర్తలుగా అగస్త్యేశ్వరకొండను అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆలయం దేవాదాయశాఖ ఆధీనంతో ఉంది.

అద్భుత శిల్పకళ చోళరాజులు నిర్మించిన ఈ ఆలయం అద్బుతమైన శిల్పకళతో ఉట్టిపడుతోంది. 16 స్తంభాలపై నిర్మించిన నాలుగు అంతస్తుల గౌని మండపం సందర్శకులను ఆకట్టుకుంటుంది. దక్షిణ ప్రవేశంగా పైకి ఎక్కేందుకు 18 రాతిమెట్లతో, ప్రతి స్తంభాన్ని అద్బుత శిల్పకళాచిత్రాలతో నిర్మించారు. పై అంతస్తు తామర పుష్పం వలె, అష్టభుజ ఆకారంతో ఎనిమిది ద్వారాలతో అద్భుతంగా నిర్మించారు. గౌని మండపంలో గతంలో స్వామివారి బ్రహ్మరథానికి రాతి తేరు చక్రాలు ఉండేవి. శిథిలమై ఇది కూలిపోవడంతో రాతి రథం స్థానంలో కొయ్యరథం నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఆలయ ప్రాముఖ్యతను వివరిస్తూ రాతి శాసనాలు ఉన్నాయి. 240 అడుగుల పొడవు అంతే వెడల్పుతో నిర్మించిన కోనేరుకు నాలుగు వైపులా మెట్ల వరుసలు నిర్మించారు. కోనేటి మధ్యలో 75 అడుగుల ఎత్తుతో నాలుగుకాళ్ల మండపం ఉండేదట. నలువైపులా కోనేరులోకి వెళ్లేందుకు నిర్మించిన ప్రాకార మండపాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

No comments:

Post a Comment