Saturday, 18 March 2017

సంగమేశ్వర ఆలయం14 Sept 2015


జలాధివాసానికి చేరువలో సంగమేశ్వరుడుకర్నూలు జిల్లా సప్తనదీ సంగమక్షేత్రంలో వెలసిన శ్రీలలితా సంగమేశ్వరుడు జలాధివాసానికి చేరువవుతున్నాడు. శ్రీశైల జలాశయ నీటిమట్టం 840 అడుగులకు చేరితే గర్భాలయంలోకి నీరు ప్రవేశిస్తుంది. పూర్తిస్థాయికి (885అడుగులు) చేరితే క్షేత్రం సంపూర్ణంగా సప్తనదీజల గర్భంలోకి చేరుతుంది.12 February 2017


కనిపించి కన్నీరొలికించే ఆలయం


మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ లో పుట్టి కృష్ణాజిల్లా లోని హంసలదీవి దగ్గర సాగరసంగమం జరిగే కృష్ణవేణీ నది మార్గంలో ఎన్నెన్నో అపురూప ఆలయాలు. ఈ నది ప్రతి మలుపు దగ్గరా ఒక ఆలయం. ఇక ఉపనదులు కలిసే కొన్ని సంగమప్రదేశాలను సంగమేశ్వరంగా వ్యవహరిస్తారు. కర్నాటకలో బాదామి చాళుక్యుల తొలిరాజధాని ఐహోళె సమీపంలో ఘటప్రభ, మలప్రభల నదులు సంగమించే ప్రదేశాన్ని కూడలి సంగమ అంటారు. ఇక్కడ చాళుక్యుల కాలం నాటి ఆలయంతో పాటూ వీరశైవ మతస్థాపకుడు, సంఘసంస్కర్త బసవన్న సమాధి మందిరమూ ఉంది.

దక్షిణాదిలో శాతవాహనుల తర్వాత వర్ధిల్లిన రాజ్యం చాళుక్యులది. వీరికాలం నాటికి బౌద్ధ, జైన మతాలు విస్తారంగా వ్యాప్తిలో ఉన్నా వీరు మాత్రం వైదిక మతావలంబులు. వీరి తొలిరాజధాని ఐహోళె, పట్టాభిషేకాలు జరుపుకున్న పట్టాడకల్ లలో ఎన్నో అపురూప ఆలయాలను, బాదామిలో గుహాలయాలను నిర్మించారు. ఆ తర్వాత రాజ్యవిస్తరణలో భాగంగా మొలకసీమ, ఏరువసీమ, రెండేరులసీమగా పిలువబడే ప్రస్తుత మహబూబ్ నగర్, కర్నూల్ జిల్లాలలోని భూభాగాన్ని తమ ఏలుబడి కిందకు తెచ్చుకున్నారు. ఈసీమలో తుంగభద్ర, కృష్ణల సంగమ ప్రదేశమైన కూడలి, కూడవెల్లిగా వ్యవహరించే ప్రదేశంలో తాము పట్టాడకల్ లో నిర్మించిన ఆలయాల నమూనాతో కూడవెల్లి సంగమేశ్వరాలయాన్ని నిర్మించారు.

ఈ ఆలయ నిర్మాణానంతరం మరిన్ని ఆలయాలను నిర్మించాలనుకున్నా వరద సమయాల్లో గర్భాలయాల్లోకి ఒండ్రుమట్టి చేరుతున్నందున మరో ప్రాంతాన్ని అన్వేశించగా తుంగభద్ర ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న అలంపురం కనిపించింది. ఇది అదివరకే జోగుళాంబ శక్తి పీఠమైనందున, పరుశురాముడి తండ్రి జమదగ్ని ఆశ్రమ ప్రాంతమైనందున ఇక్కడ నవబ్రహ్మాలయాలను నిర్మించారు.

కాలక్రమేణా చాళుక్యుల ప్రాభవం తగ్గింది. రాష్ట్రకూటుల ప్రాభవం హెచ్చింది. వీరికి పల్లవులతో సంబంధ బాంధవ్యాలున్నందున చాళుక్యులను జయించారు. వీరూ ఆలయాలు నిర్మించాలనుకున్నారు.

నల్లమలలో భవనాశి అనే సెలయేరుగా పుట్టి కృష్ణలో కలిసే ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఈ సంగమానికి నివృత్తి సంగమం అని పేరు. పాపులను పునీతులుగా మారుస్తూ గంగా నదికి కాకి రూపం వచ్చిందని, ఆ రూపం పోగొట్టుకోవడానికి సంస్థ తీర్తాల్లో జలకమాడుతూ తిరుగుతున్న ఆవిడ ఇక్కడ హంస రూపం పొందిందని కథనం. ఆవిడ పాప నివృత్తి అయినందున నివృత్తి సంగమేశ్వరంగా వ్యవహరించేవారు. ఇక్కడ నది ఒడ్డున ఒక పురాతన శివాలయం ఉంటుంది. పాండవులు అరణ్యవాస సమయాన ఇక్కడికి వచ్చారని. శివలింగం తేవడానికి భీమూన్ని కాశీకి పంపగా అతను ముహూర్త సమయానికి రానందున ధర్మరాజు ఒక వేపమొద్దును శివలింగంగా ప్రతిష్టించాడని కథనం. తల మీద, రెండు బాహువుల్లో రెండు చొప్పున మొత్తంగా ఐదు లింగాలు తెచ్చిన భీముడు ఆగ్రహంతో వాటిని విసిరెయ్యగా అక్కడ మల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్దేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం పేరుతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని కథనం.

ఇక రాష్ట్రకూటులు ఈ ప్రదేశంలో చాళుక్య, పల్లవుల వాస్తు రీతులను మేళవించి ఆలయాలు నిర్మించారు. వీరి ఆలయం ఒక పెద్ద రాతిరధాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయాలున్న ప్రదేశంలో ధ్యానం చేస్తే రూపాయలు కురుస్తాయనే నమ్మకంతో దీన్ని రూపాల సంగమం అనేవారని ప్రజల్లో ఒక కథ ప్రచారంలో ఉంది.

కాలచక్ర గమనంలో రాజులు,రాజ్యాలు పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి. మన తొలి ప్రధాని నెహ్రూ "ఆధునిక ఆలయాలు"గా అభివర్ణించిన బహుళార్ధసాధక ప్రాజెక్టులు మొదలయ్యాయి. కృష్ణానది మీద శ్రీశైలంలో ప్రాజెక్ట్ నిర్మాణం మొదలైంది. మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లో వందలాది గ్రామాలు నీట మునిగాయి, ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

క్రీ.పూ 1250 ప్రాంతంలో ఈజిప్ట్ లో నాటి పాలకుడు రామ్‌సెస్ 2 తన విజయచిహ్నంగా ఒక కొండను తొలచి భవ్య ఆలయం నిర్మించాడు. దాన్ని అబు సింబెల్ ఆలయంగా వ్యవహరిస్తారు.1960 ల్లో అస్వాన్ హై డామ్ నిర్మాణంలో ఈ ఆలయం మునుగుతుందని అనేక దేశాలు, UNO సహకారంతో ఆ కొండను, శిల్పాలను ఒక్కొక్కటిగా విడదీసి కాస్త ఎగువ ప్రదేశంలో పునర్ణిర్మించారు. ఈ ఆలయ ప్రేరణతో పురావస్తు శాఖ వారు సంగమేశ్వర ఆలయాలనూ ఊకో రాయికి ఒక నంబర్ ను ఇచ్చి విడదీసారు.

కూడవెల్లి లోని ఆలయాన్ని అలంపురంలో నిర్మించగా...రాష్ట్రకూటుల రూపాల సంగమేశ్వరాన్ని కర్నూలు శివారులో ఉన్న జగన్నాధ గట్టు పైన పునర్ణిర్మించారు. ఇక పాత నివృత్తి సంగమేశ్వరంలో గొప్ప శిల్పసంపద లేనందున వదిలివేసారు.

ఈ నివృత్తి సంగమం నదిలోనే ఉండిపోయేది. కానీ 1996 లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బాంక్ అప్పు కోసం G.O-69 తీసుకు వచ్చాడు. అంతదాకా 854 అడుగుల కనీస నీటిమట్టం ఉండాల్సిన శ్రీశైలం రిజర్వాయర్లోని నీళ్లను 836 అడుగుల వరకు కిందున్న నాగార్జునసాగర్, కృష్ణా డేల్టాకు తరలించే ఏర్పాటు చేసాడు.(నీళ్లు దిగువకు వదులుతూ విద్యుదుత్పాదనను, డెల్టాలోని పంటలనూ బ్యాంక్ వారికి చూపాడు)...ఇక ప్రతి ఏటా ఈ ఆలయం నదీ గర్భం నుంచి బయట పడటం మొదలైంది. ఇలా 4,5 నెలలు వెలుపల ఉండి తుంగభద్ర, కృష్ణలకు వరదలొచ్చినప్పుడు తిరిగి నదీ గర్భంలోకి చేరేది. 2015-16 లో సుమారు 8 నెలలు బయటే ఉండిపోయింది.

ఈ లోగా ఈ శిధిలాలయం మహిమ ప్రచారం చేస్తూ కొందరు దిగిపోయారు. ఆలయ సందర్శనకు యాత్రికుల తాకిడి మొదలైంది. ఈ ఆలయం బయట పడిందంటేనే రాయలసీమ కు కన్నీరొస్తుంది.కారణం రాయలసీమకు కృష్ణా జలాలను అందిచే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 841 అడుగుల దగ్గర ఉంటుంది. ఇక ఆలయం బయట పడిందంటే బ్రహ్మాండమైన వరదలొస్తే తప్ప ఈ పోతిరెడ్డిపాడుకు నీళ్లు చేరవు. కానీ ఆ విషయం విస్మరించిన జనం ఆలయ సందర్శనకు వెళుతూనే ఉంటారు. రైతులు మాత్రం ఎప్పుడు ఈ ఆలయం మునుగుతుందా అని ఆలోచిస్తూ కార్తెలను లెక్కపెట్టుకుంటూ ఉంటారు.

పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లందిస్తున్నామనే కబుర్లు కాదు... చిత్తశుద్ది ఉండి నిజంగా రాయలసీమకు నీళ్లు పారాలంటే ఈ కనీసనీటి మట్టాన్ని 854కు పెంచాలని, ఆ పట్టిసీమ వల్ల మిగులుతున్నాయని చెప్పే 45 టి.యం.సి నీళ్లు రాయలసీమకు నికర జలాలుగా కేటాయించగలరా అని సీమ రైతాంగం ప్రశ్నిస్తుంది.

మొత్తానికి కనిపించి రాయలసీమ రైతులను ఏడిపిస్తున్న ఆలయం ఈ సంగమేశ్వరం.21 Aug 2017

సప్తనదుల్లో కొలువుదీరిన సంగమేశ్వరుని ఆలయంఅది వేలసంవత్సరాల చరిత్ర కలిగి వున్న ఆధ్యాత్మిక స్థలం.. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన పవిత్ర ప్రాంతం.. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఏకంగా ఏడు నదులు (తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి) కలిసే అద్భుతమైన ప్రదేశం.. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం. ఎన్నో శైవాలయాలకు కొలువైన కర్నూలు జిల్లాలో సంగమేశ్వర ఆలయం ఒక్కటే ప్రత్యేక విశిష్టత కలిగి వుంది. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది.

స్థలపురాణం :
పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని పురాణ గాధ. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది. మరొక కథనం ఏమిటంటే.. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు.. ప్రతిష్ట సమయానికి రాలేదు. దీంతో.. రుషుల సూచన మేరకు ధర్మరాజు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భీముడు.. తీవ్ర ఆగ్రహంతో తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థలపురాణం చెబుతోంది.

ఆలయ విశేషాలు :

  • ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతోపాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.
  • ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా... అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు. అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం.
  • ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడింది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి.19 Sept 2017


భక్తవల్లభుడు.. సంగమేశ్వరుడుభక్తవల్లభుడైన సంగమేశ్వరుడిని ఇంటి నుంచే భక్తితో కొలిస్తే పలుకుతాడని ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. సోమవారం సాయంత్రానికి ఆలయం గోపురం సగానికి పైగా కృష్ణమ్మ ఒడిలోకి చేరింది. క్షేత్రంలో ఎగువ ఉమా మహేశ్వరాలంలో ఎగువ ఘాట్‌లో మెట్ల పూజలు, గంగా పూజ. లలితా సంగమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులచే మెట్లోత్సవ పూజలు నర్విహించారు. ఎగువ ఉమామహేశ్వరాలయం వద్ద సాక్షిసంగమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోటులో నదిలోని క్షేత్రానికి చేరుకుని అక్కడ గంగా పూజ, కృష్ణమ్మకు పూజలు శిఖర పూజలు, సత్యనారాయణుడు, సూర్యనారాయణులకు పూజలు నిర్వహించారు. రైతులంతా ఉత్తరం చూసి ఎత్తురగంప అనే సామెత ఉంది. అందుకు తగ్గట్టే ఉత్తర కార్తి రైతులను రాష్ట్ర ప్రజలను ఆదుకుందన్నారు. పూజకార్యక్రమంలో తహసీల్దారు రామకృష్ణ, పలువురు భక్తులు పాల్గొన్నారు.5 February 2018


కృష్ణమ్మ ఒడినుంచి బయటపడుతున్న సంగమేశ్వరుడు
శ్రీశైలం జలాశయంలోని కృష్ణాజలాల నుంచి సంగమేశ్వరుడు బయటపడుతున్నాడు. సోమవారం ఆలయ శిఖరం బయటపడి భక్తులను ఆనందంలో ముంచెత్తింది. గత ఏడాది సెప్టెంబర్ 16వ తేదీన పూర్తిస్థాయిలో గంగ ఒడికి చేరిన సంగమేశ్వరుడు క్రమేణా మళ్లీ భక్తుల దర్శనం కోసం సిద్ధమవుతున్నాడు. కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలంలోని పురాతన సంగమేశ్వర ఆలయం వేసవికాలం మినహా సుమారు ఎనిమిది నెలలు కృష్ణాజలాల్లో మునిగిపోయే విషయం విదితమే. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల తక్కువగా ఉండటంతో ఆలస్యంగా బయటపడుతోంది. గత ఏడాది మహాశివరాత్రికి పూజలందుకున్న సంగమేశ్వరుడు ఈ ఏడాది మాత్రం కేవలం శిఖర దర్శనానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. మహా శివరాత్రి పర్వదినాన ఆలయ శిఖరానికి పూజలు నిర్వహించడానికి ఆలయ పూజారి తెలకపల్లి రఘురామశర్మ సిద్ధమవుతున్నారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నీటిమట్టం 857.30 అడుగులుగా నమోదైంది. దీంతో ఈ ఏడాది ఆలయం పూర్తిగా బయటపడి భక్తుల పూజలు అందుకోవాలంటే ఏప్రిల్ మాసాంతం వరకు ఆగాల్సి ఉంటుందని జల వనరులశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.18 Sept 2017


కృష్ణమ్మ గలగల : మునిగిన సంగమేశ్వరుడుకర్నూలు జిల్లా ఆత్మకూర్ సమీపంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం సంగమేశ్వర ఆలయం కృష్ణా నదిలో మునిగింది. రాష్ట్రానికి పై భాగంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది పోటెత్తింది. తెలంగాణాలోని నారాయణాపుర్‌, జూరాల మీదుగా కర్నూలు జిల్లాకు భారీగా వచ్చి చేరింది వరదనీరు. సుంకేసుల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా జలాల ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలో బ్యాక్‌ వాటర్‌ పెరుగుతుండటంతో సప్త నదుల సంగమేశ్వరం గర్భాలయం పూర్తిగా మునిగిపోయింది.

భారీ వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ ఉట్టిపడుతుంది. శ్రీశైలం జాలశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. కృష్ణా నది పరవళ్లకు తోడు ఉపనది తుంగభద్ర నుంచి వచ్చే నీరు కూడా వచ్చి చేరుతుండడంతో ఇవాళ ఉదయానికి 1,12,694 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. శ్రీశైలం జలాశయం వైపు కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. రిజర్వాయర్‌లోకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో-1.48 లక్షల క్యూసెక్కులు ఉన్నది. ఔట్‌ఫ్లో- 1,813 క్యూసెక్కులుగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 17.5 టీఎంసీల నీరు జలాశయానికి వచ్చి చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 849.6 అడుగులకు నీరు ఉంది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

February 09, 2018


బయిట పడుతున్న సంగమేశ్వరుడు


శ్రీ శైలం జలాశయంలోని కృష్ణాజలాల నుంచి సంగమేశ్వరుడు బయటపడుతున్నాడు. ఆలయ శిఖరం బయటపడి భక్తులను ఆనందంలో ముంచెత్తింది. గత ఏడాది సెప్టెంబర్ 16వ తేదీన పూర్తిస్థాయిలో గంగ ఒడికి చేరిన సంగమేశ్వరుడు క్రమేణా మళ్లీ భక్తుల దర్శనం కోసం సిద్ధమవుతున్నాడు. కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలంలోని పురాతన సంగమేశ్వర ఆలయం వేసవికాలం మినహా సుమారు ఎనిమిది నెలలు కృష్ణాజలాల్లో మునిగిపోయే విషయం విదితమే. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల తక్కువగా ఉండటంతో ఆలస్యంగా బయటపడుతోంది. గత ఏడాది మహాశివరాత్రికి పూజలందుకున్న సంగమేశ్వరుడు ఈ ఏడాది మాత్రం కేవలం శిఖర దర్శనానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. మహా శివరాత్రి పర్వదినాన ఆలయ శిఖరానికి పూజలు నిర్వహించడానికి ఆలయ పూజారి తెలకపల్లి రఘురామశర్మ సిద్ధమవుతున్నారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నీటిమట్టం 857.30 అడుగులుగా నమోదైంది. దీంతో ఈ ఏడాది ఆలయం పూర్తిగా బయటపడి భక్తుల పూజలు అందుకోవాలంటే ఏప్రిల్ మాసాంతం వరకు ఆగాల్సి ఉంటుందని జల వనరులశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.No comments:

Post a Comment