Saturday, 18 March 2017

పశుపతినాథ్ ఆలయంపశుపతినాథ్ ఆలయంనేపాల్ లోని పవిత్రమైన పశుపతినాథ్ ఆలయం


పశుపతినాథ్ దేవాలయం.. ఇది నేపాల్ దేశ రాజధాని అయిన కాఠ్మండు నగరంలోని భాగమతి నది ఒడ్డున వుంది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా వున్న ఈ ఆలయాన్ని అతి పవిత్రమైన శైవాలయంగా భావిస్తున్నారు. ఈ దేవాలయాన్ని సందర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా వుండే శివభక్తులు వేలసంఖ్యల్లో తరలివస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. శివుడు ఆత్మలింగం రూపంలో వెలిసిన ఈ ఆలయం నిర్మాణం వెనుక రెండు ఇతిహాసాలు దాగివున్నాయి. అవేమిటో తెలుసుకుందామా...

గోవు ఇతిహాసం-1 :
పూర్వం ఒకనాడు శివుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండేవాడు. అప్పుడు కొందరు దేవతలు శివుడిని తన స్వరూపంలో చూడాలనే కోరికతో శివుడు జింక అవతారంలో ఉన్నప్పుడు అతని కొమ్ముని పట్టుకొన్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగిపోయి ఇక్కడ ఖననం చేయబడింది. కొన్ని శతాబ్ధాల తరువాత ఒకనాడు ఓ ఆవు ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఈ లింగం పడిన ప్రదేశంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి చూశాడు. ఆవు పాలు ఎందుకు కురిపిస్తుందోనన్న అనుమానంతో ఆ కాపరి అక్కడి ప్రదేశానికి చేరుకుని త్రవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు శివలింగం బయటపడింది. ఆ విధంగా లింగం బయటపడగా.. ఆలయాన్ని నిర్మించారు.

మరో ఇతిహాసం-2 :
నేపాల్ మహత్యం, హిమవత్‌ఖండం ప్రకారం.. ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రుస్తున్నాడు. అప్పుడు దేవతలు శివుడిని తిరిగి కాశీకి తీసుకొని పోవడానికి జింకని లాగినప్పుడు.. జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. ఈ నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగంగా ఉన్నదని ఇతిహాసంలో పేర్కొనబడింది.

మరికొన్ని విశేషాలు :
  • గోపాలరాజ్ వంశవలి అనే చారిత్రాక పత్రిక ప్రకారం.. ఈ ఆలయాన్ని లించచ్చవి రాజు శుశూపదేవ క్రీ.శ. 753 సంవత్సరంలో నిర్మాణం జరిపినట్లుగా పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తొంది. తరువాతి కాలంలో 1416 సంవత్సరం రాజా జ్యోతి మల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని, 1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయానికి పునఃనిర్మించాడని తెలుస్తోంది.
  • ఈ దేవాలయం పగోడ వలె ఉంటుంది. రెండు పైకప్పులు రాగి, బంగారంతో చేయబడి ఉంటాయి. నాలుగు ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయబడి ఉంటుంది. పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఇక్కడ పూజలు చేసే పూజారులను భట్ట అని, ప్రధాన అర్చకుడిని మూలభట్ట లేదా రావల్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ. ఈ దేవాలయం తూర్పున వాసికినాథ్ దేవాలయం వుంది.
  • శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. అలా నిర్వహించడానికి ప్రధాన కారణం.. నేపాల్ రాజు మరణించినప్పుడు దేశం సంతాప సముద్రంలో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు. పశుపతినాథ్ కి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశార్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు.
  • ఈ దేవాలయంలోకి హిందు మతస్థులను మాత్రమే ప్రవేశించనిస్తారు. హిందువులు కానివారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూలవిరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం వుంది. ఏకాదశి, సంక్రాంతి, మహా శివరాత్రి, రాఖీ పౌర్ణమి గ్రహణం రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

No comments:

Post a Comment