Tuesday, 14 March 2017

శ్రీరంగాపూర్‌ - రంగనాయకులు

శ్రీరంగాపూర్‌ చూతము రారండి..

చరిత్ర గురించి తెలుసుకోవడమంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు చెప్పండి. శ్రీ‌రంగంలోని అద్భుతమైన కట్టడాలు, అబ్బుర పరిచే నిర్మాణాలు, కళాపోషకులను కట్టి పడేస్తాయి. నాటి రాజుల కళాపోషణకు స‌లామ్ చేయిస్తాయి. అద్భుత శిల్పకళాసంపద, సుందర దృశ్యాలకు ఆలవాలంగా... ఐదు వందల సంవత్సరాల నాటి చారిత్రక సాక్ష్యాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది మహబూబ్‌నగర్‌ జిల్లాలోని శ్రీరంగాపూర్‌ ఆలయం. ఆలయ పరిసరాల్లోని పలు దర్శనీయ స్థలాల గురించి ఓ సారి చూద్దాం..


ఎనిమిది భాషల్లో పట్టు కలిగిన బహుముఖసాహితీ ప్రియుడు, పాలనాదక్షుడు అయిన వనపర్తి సంస్థానాధీశుడు బహిరి గోపాల్‌రావు 1662వ సంవత్సరంలో దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునే క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్నం చేరుకున్నాడు. అక్కడ శ్రీరంగనాయకులు కొలువై ఉన్న శ్రీరంగ క్షేత్రమును దర్శించాడు. ఆ ఆలయ నిర్మాణం, శిల్పకళను చూసి ముగ్ధుడయ్యాడు. తన రాజ్యం వనపర్తిలోనూ శ్రీరంగ నాయకుల ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు. ఈ ఆలయానికి సంబంధించి ఇంకో కథనం కూడా ప్రచారంలో ఉంది. శ్రీరంగక్షేత్రంలోని గర్భగుడిలో మూలవిరాట్టు దర్శనమివ్వలేదని అనంతరం ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో స్వయానా రంగనాయకులు ప్రత్యక్షమై వనపర్తి సంస్థాన పరిధిలో గల కొరివిపాడులో ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించినట్లు చెబుతారు. క్రీ.శ 1670 సంవత్సరంలో ప్రారంభమైన ఆలయ నిర్మాణం 1804 నాటికి పూర్తయింది.

సుమారు 600 మంది శిల్పులు, ఆగమశాస్త్ర పండితులు, కళాకారులు వేలాదిమంది కార్మికులు నిర్మించిన ఈ ఆలయం పాలమూరు జిల్లాకే మణికిరీటంలా వెలుగొంది ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. త‌మిళ‌నాడులోని తంజావూరు, తిరుచినాపల్లి, కంచి, తిరువనంతపూర్‌ నుంచి రాతిపనిలో నిష్ణాతులైన శిల్పులు... విష్ణుమూర్తి దశావతారాలతో పాటు సామాజిక, వైవాహిక, దాంపత్యం, తదితర కళాఖండాలను చెక్కారు. ఆలయానికి మూడు దిక్కులా రంగసముద్రం చెరువు ఉండటం వలన మరింత సౌందర్యంగా కనిపిస్తుంది ఈ ప్రాంతం. ఆలయ ముఖద్వారంలో నిర్మించిన 60 అడుగుల ఎత్తైన గాలిగోపురంలో శిల్పకళా చాతుర్యం ఉట్టిపడుతుంది. గాలిగోపురం గడప పక్కనే ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి శిలా ప్రతిమను చూసి తీరాల్సిందే.

ఆలయ సప్తప్రాకారాలను ఆనుకుని ఉన్న శ్రీరంగసముద్రం నీటి మధ్యలో సేదతీర్చుకునేందుకు కృష్ణవిలాస్‌ అనే అందమైన భవంతిని రాణి శంకరమ్మ నిర్మించారు. ఆమెకు మనుమడైన శ్రీకృష్ణ దేవరాయలు పేరు మీద కృష్ణవిలాసం నిర్మించినట్టు చరిత్రను బట్టి తెలుస్తోంది. భక్తులకు పవిత్రమైన వైకుంఠ ఏకాదళి రోజున ఆలయ దక్షిణ ద్వార ప్రవేశం తెల్లవారుజామున జరుగుతుంది. దక్షిణ ద్వారం గుండా రంగనాయకుల దర్శనం, సూర్యోదయ కాలంలో చేసుకున్న వారికి పునర్జన్మ ఉండదని శాస్త్రం చెబుతోంది. ఈ దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు.

బహుసుందరంగా, ఆలయానికి మధ్య భాగంలో నిర్మించిన కొఠాయి మండపంలో లతలు, పుష్పాలు, దేవతల శిల్పాలు, నాగబంధం కుండలి, మానవుల రూప శిల్పాలతో అత్యద్భుతంగా ఉంటుంది. రంగ సముద్రం అలల ఆహ్లాదం ఇక్కడి నుంచి చూసి తీరాల్సిందే.

ఆలయానికి 200మీటర్ల దూరంలో 12మూలలు కలిగి, నక్షత్రాకారంలో పూర్తిగా రాతితో నిర్మించిన రత్నపుష్కరిణిలో ఇప్పటివరకు నీరు ఎండిపోలేదు. రంగసముద్రంలో మునిగిపోయిన గుండుబావి (రత్నపుష్కరిణి) తాగునీటి బావిగా ప్రసిద్ధి చెందింది.

తిరుమల, తమిళనాడులోని తంజావూరు నుంచి వచ్చిన మేటి స్వర్ణకారులు, చిత్రకారులు రకరకాల లోహాలతో ఏళ్ల తరబడి శ్రమించి దశావతారాలు, ఇతర ఆధ్యాత్మిక చిత్రాలు, తిరువళ్వార్లు తదితర అంశాలపై వందలాది కళాఖండాలను రూపొందించారు. ఇలాంటి ఎన్నోకళాఖండాలను ఈ ఆలయ నేలమాళిగలోని మ్యూజియంలో భద్రపరిచారు.

ఎలా చేరుకోవాలి హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ 90కి.మీ దూరంలో వుంది. రైలు లేదా బస్సులో ఇక్కడికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వనపర్తి చేరుకోవచ్చు. అక్కడి నుంచి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది శ్రీరంగాపూర్‌ రంగనాథస్వామి ఆలయం. జాతీయ రహదారిలోని పెబ్బేరు నుంచి 12కి.మీ దూరంలో ఉంటుంది శ్రీరంగాపురం.

No comments:

Post a Comment