Sunday, 23 April 2017

భక్తులను అనుగ్రహించే బొజ్జగణపతి ఆలయం

కేరళలో అనంత సంపదలకు అధినేత అయిన అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి అందరికీ తెలుసు కానీ, ఆ ఆలయానికి అతి సమీపంలోనే ఉన్న గణపతి ఆలయం గురించి తెలిసింది అతి కొద్దిమందికే. అతి పురాతనమైన ఈ ఆలయంలో స్వామివారి మూలమూర్తి అన్ని ఆలయాలలో కనిపించేలా ఎడమ కాలును పైకి మడిచి కూర్చున్న భంగిమలో కాకుండా కుడికాలిని పైకి మడిచి ఎడమకాలిని కిందికి పెట్టి భిన్నంగా కనిపించడం ఒక విశేషం కాగా, కేరళ ఆలయాలకు భిన్నంగా తమిళనాడు రీతిన కట్టడంతో, చిన్న ఆవరణలోనే మహాగణపతి కొలువుదీరడం మరో విశేషం. మహా మహిమాన్వితుడిగా పేరున్న ఈ స్వామివారి ఆలయ ప్రాంగణంలో కోరికలెన్నో కోరుకుని అవి తీరాక కొబ్బరికాయలు కొడుతూ కనిపించే భక్తజనులు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటారు.

తమిళనాడులోని కన్యాకుమారికి సమీపంలో నాగర్‌కోయిల్‌ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో గల పద్మనాభపురం అప్పట్లో కేరళ రాజధాని. ఇరవి వర్మ కులశేఖర పెరుమాళ్‌ అనే రాజు పద్మనాభపురంలో రాజభవనాన్ని నిర్మించాడు. ఆ రాజభవన ప్రాంగణంలోనే చిన్నపాటి గణపతి ఆలయం ఉండేది.

గణపతికి మొక్కిన తర్వాతే దండయాత్రలకు, వేటకు, ఇతర దేశయాత్రలకు బయలుదేరేవారు ఎవరైనా ఆ కాలంలో. తదనంతర కాలంలో రాజా మార్తండవర్మ ట్రావెన్‌కోర్‌ రాజవంశాన్ని పద్మనాభదాసులుగా ప్రకటించి, అనంతుడు వెలసిన పురానికి రాజధానిని మార్చాడు. 1795వ సంవత్సరంలో శ్రీ మహాగణపతిని కూడా సాదరంగా తోడుకొని వచ్చి, పళవంగాడుగా పిలుచుకునే ఆ కోట తూర్పు భాగంలో పునఃప్రతిష్ఠించారు.ఆనాటినుంచి పళవంగాడు మహాగణపతిగా భక్తుల కోర్కెలను నెరవేరుస్తున్నాడు స్వామి.

ఆలయ విశేషాలు
ఆలయ గోపురానికి నల్లరంగు వేయడంతో దూరానికే కొట్టవచ్చినట్లుగా, ప్రత్యేకంగా కనిపిస్తుంది ఆలయం. ఆలయంలో మండపాలెన్నో ఉన్నాయి. రహదారి మీద ఉండే చిన్న రాజగోపురం గుండా ప్రాంగణంలోకి ప్రవేశిస్తే, మండప స్తంభాలపైన ఎంతో రమణీయంగా చెక్కిన శ్రీ లక్ష్మీ సరస్వతీ విగ్రహాలు, ఇతర మూర్తులు దర్శనమిస్తాయి. అన్నింటికీ మించి ముఖమండపం గోడలపైన శిల్పసౌందర్యంలో ఒకదానికొకటి పోటీపడుతున్నట్లుగా చెక్కి ఉన్న 32 రకాలైన గణపతి చిత్రాలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఇవిగాక ఉపాలయాలెన్నో ఉన్నాయి. వాటిలో దుర్గాదేవి, ధర్మశాస్త్త్ర, నాగరాజు ఆలయాలు తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటాయి.

నాడు రాజులకు మాత్రమే.. నేడు పేదలకు కూడా
అలనాడు ట్రావెన్‌కోర్‌ రాజవంశీకుల పూజలందుకున్న పళవంగాడు మహాగణపతి నేడు పేదలకు కూడా దర్శనమిస్తూ, వారి కోర్కెలు తీరుస్తూ, మొక్కులనూ సంతోషంగా స్వీకరిస్తున్నాడు. కొబ్బరికాయలపైన తనకున్న మక్కువను తీర్చుకుంటున్నాడు మహాగణపతి.

పూజలూ... ఉత్సవాలూ
రోజూ ఉదయం నాలుగున్నర గంటలకు ఆలయ ద్వారాలు తెరచిన వెంటనే భక్తులకు నిర్మాల్య దర్శనం కల్పిస్తారు. అనంతరం ఉషఃకాలపూజ, నైవేద్యం, ఉచ్చపూజ, దీపారాధనలతో సహా మొత్తం 21 రకాల పూజాకైంకర్యాలు జరుగుతాయి. ప్రతినెలా సంకటహరచతుర్థి పూజ, హస్తానక్షత్ర పూజ, ప్రత్యేకపూజ, హోమాలు నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే గణపతి హోమానికి ఎంతో గొప్ప పేరు. ప్రతి సంవత్సరం గణేశ చతుర్థి, ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలు, మాఘమాసంలో అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్ష చతుర్థినాడు జరుపుకునే వినాయక వరద చతుర్థి అంగరంగవైభవంగా జరుగుతాయి.

ఎలా వెళ్లాలి?
దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి తిరువనంతపురం వరకు బస్సులు, రైళ్లు ఉన్నాయి. తిరువనంతపురం సెంట్రల్‌ రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లకు అతి సమీపంలో గల ఈ ఆలయానికి వెళ్లడం చాలా సులభం.

ఇతర ప్రదేశాలు...
అనంతపద్మనాభస్వామి ఆలయం, కుంటాలలో గల మరో అనంతుని ఆలయం, ఇంకా కేరళ రాజవంశీకులున్న కోట... అసలు కేరళలో అడుగుపెట్టడమే భూలోక స్వర్గానికి స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది. మహామహిమాన్వితుడైన పళవంగాడు మహాగణపతి ఆలయ సందర్శనం అనంతమైన ఫలాలనిస్తుందని విశ్వాసం.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

ద్వారకాతిరుమల - తెలుగు గడ్డపైనే రెండో తిరుపతి

తెలుగు గడ్డపైనే రెండో తిరుపతి

ఎక్కడైనా ఆలయాల్లో మూల విరాట్టు విగ్రహం అంటే ఒక్కటే ఉంటుంది. ఆ దేవతా మూర్తికి ఏడాదికి ఒక్కసారే బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు. కానీ గర్భాలయంలో రెండు మూల విరాట్టులు నిత్యం పూజలందుకోవడం, ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగడం ద్వారకా తిరుమల ప్రత్యేకత. చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఆ క్షేత్ర విశిష్టత ఎంతో.


ద్వారక మహర్షి అనే ముని కృష్ణా, గోదావరి నదుల మధ్యగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలోని శేషాచల కొండపై ఘోరతపస్సు చేసి వేంకటేశ్వరస్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన స్వామివారు ఏ వరం కావాలని అడగ్గా ‘మీ పాద సేవ చాలు’ తండ్రీ అని చెప్పాడట ద్వారక మహర్షి. అతడి కోరిక మేరకు వేంకటేశ్వర స్వామి అక్కడ స్వయంభూగా వెలిశాడు. అయితే, ద్వారక మహర్షి చాలాకాలం తపస్సు చేసిన కారణంగా ఆయన చుట్టూ పుట్ట ఏర్పడటంతో స్వామి వారి పాదాలు పుట్టలో ఉండిపోయి ఉదరం నుంచి పై భాగం మాత్రమే దర్శనమిచ్చేదట. దాంతో భక్తులు స్వామివారిని కొలిచేందుకు కుదిరేదికాదు. కాలాంతరంలో ఇతర రుషులు ‘విష్ణు ఆరాధనలో పాదసేవయే కదా ప్రాధాన్యమని... పాదసేవ లేకుండా పూజ ఎలా చేయాలని’ ఆ శ్రీవారిని వేడుకోగా మరొక మూర్తిని ప్రతిష్ఠింపచేయవలసిందిగా ఆనతి ఇచ్చారట. దీంతో రుషులు సర్వాంగ సుందరమైన మరొక విగ్రహాన్ని తిరుమల నుంచి ప్రత్యేక పూజలతో తీసుకువచ్చి స్వయంభూగా వెలసిన స్వామి వారి విగ్రహం వెనుకభాగంలో పాదసేవ కోసం ప్రతిష్ఠించారు. అలా ద్వారకా తిరుమల గర్భాలయంలో రెండు ధృవ మూర్తులుగా స్వామివారు దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి ఎనలేని విశిష్టతను తెచ్చిపెట్టింది. ద్వారక మహర్షి తపస్సు ఫలితంగా ఆవిర్భవించిన విగ్రహమూ, తిరుమల నుంచి తెచ్చిన విగ్రహమూ ఉండడం వలన రెండు పేర్లతో ఈ క్షేత్రం ద్వారకాతిరుమలగా ప్రసిద్ధి చెందింది. స్థానికులు ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతి అనీ పిలుస్తారు. ఏ కారణం వల్లైనా తిరుపతి వెళ్లలేని స్థానిక భక్తులు అక్కడి స్వామివారికి మొక్కుకున్న మొక్కుబడులనూ కానుకల్నీ ఇక్కడి స్వామికి సమర్పించడం కూడా అనాదిగా వస్తోంది. రెండు మూల విరాట్టులు ఉన్న కారణంతోనే ద్వారకా తిరుమలలో ఏడాదికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీ. స్వయంభూగా వెలసిన స్వామివారికి వైశాఖ మాసంలోనూ, తిరుపతి నుంచి తెచ్చి ప్రతిష్ఠించిన స్వామి వారికి ఆశ్వయుజ మాసంలోనూ ఏ సంవత్సరంలోనైనా వైశాఖ మాసం గానీ, ఆశ్వయుజ మాసం గానీ అధిక మాసం వస్తే అప్పుడు మరొకసారీ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

దక్షిణ ముఖంగా స్వామి వారు
దేవాలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలు తూర్పు ముఖంగా లేదా పశ్చిమ ముఖంగా ఉంటాయి. కానీ స్వామి వారు దక్షిణ ముఖంగా ఉండడం ద్వారకా తిరుమల ఆలయానికున్న మరో ప్రత్యేకత. ద్వారక మహర్షి ఉత్తర దిక్కుగా ఉండి తపస్సు చేసినందువల్ల వేంకటేశ్వర స్వామి ఆయనకు ఎదురుగా ప్రత్యక్షం కావడంతో ఇక్కడి స్వామి వారు దక్షిణాభిముఖంగా ఉన్నారు.

సామాన్యంగా దేవాలయాల్లో నిత్యం స్నపన తిరుమంజనం(అభిషేకం) చేస్తారు. కానీ ద్వారకాతిరుమల క్షేత్రంలో మూల విరాట్టులకు ఎప్పుడూ స్నపనమాచరించరు. ‘స్వామివారి విగ్రహం కింద ద్వారక మహర్షి తపమాచరించిన పుట్ట ఇప్పటికీ ఉందట. అందుకే, అనుకోకుండా విగ్రహం దగ్గర నీటి చుక్క పడితే స్థానికంగా కొణుజులు అని పిలిచే తేనె రంగు చీమలు విపరీతంగా బయటకు వచ్చేస్తాయి. ఈ కారణంతోనే ఇక్కడి స్వామివారికి స్నపన తిరుమంజనం నిషేధించారు. స్వామి వారికి అభిషేకం లేకపోవడంతో అమ్మవార్లకు సైతం తిరుమంజనం జరగటం లేదు’ అంటారు ఆలయ ప్రధానార్చకులు రాంబాబు.

త్రేతాయుగం నుంచే
ఇక్కడి స్వామివారు త్రేతాయుగం నాటికే ఉన్నట్లు బ్రహ్మపురాణం ఆధారాలు చెబుతున్నాయి. పూర్వం శ్రీరాముని పితామహుడు అజ మహారాజు ఇందుమతిని వివాహం చేసుకునేందుకు వెళుతూ ముందుగా స్వామివారిని దర్శించుకోవాలనుకున్నారట. అయితే వివాహానికి ఆలస్యమవుతుందని దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోవటం, ఇందుమతిని వివాహం చేసుకోవటం జరిగింది. అయితే, అద్భుత సౌందర్యరాశి అయిన ఇందుమతిని అజమహారాజు పరిణయ మాడటంతో ఇతర రాజులకు ఈర్ష్య కలిగి ఆయనపై దండెత్తారు. అప్పుడు కుల గురువైన వశిష్ట మహర్షి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోకపోవడంతో కలిగిన కష్టమే ఇది అని సెలవిచ్చారట. దాంతో అజమహారాజు సతీసమేతంగా ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడంతో కష్టాలు తొలగిపోయాయన్నది బ్రహ్మ పురాణంలో ఉంది.

ప్రస్తుతం ఉన్న ఆలయంతో పాటు ఇతర నిర్మాణాలన్నీ నూజివీడు జమీందారు ధర్మాప్పారావు కట్టించారు. ఆయనే ఆలయ విమానం, గోపురాలు, ప్రాకారాలు, మండపాలు పునఃనిర్మాణం చేసినట్లుగా చెబుతారు. స్వామిని దర్శించి అంతరాలయం నుంచి బయటకు రాగానే కుడిపక్కన అలివేలు మంగతాయారు, ఆండాళ్‌ అమ్మవార్లను(శ్రీదేవి, భూదేవి) దర్శించవచ్చు. ఇక్కడి వెంకన్న స్వామికి అభిముఖంగా గరుడ, ఆంజనేయస్వామి వార్ల సన్నిధితో పాటు ఉత్తర గోపురం, ఈశాన్య మండపానికి మధ్యలో సూత్రవతీ సమేత విష్వక్సేన స్వామి మందిరాలూ ఉంటాయి. స్వామి వారికి నిత్యార్జిత కల్యాణం సైతం నిర్వహిస్తున్నారు. దేవస్థానం ట్రస్టు ద్వారా భక్తులకు నిత్యం అన్నదానం చేస్తున్నారు. విరాళాలు, తలనీలాలు ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏడాదికి రూ.43కోట్ల ఆదాయం వస్తోంది. వీటితో భక్తులకు సకల సౌకర్యాలూ కల్పిస్తున్నారు.

ఎ.దుర్గాప్రసాద్‌.
బి.బ్రహ్మయ్య

యాదగిరి గుట్ట

పంచనారసింహ క్షేత్రం యాదగిరి గుట్ట!పరమ భక్తుడూ పసివాడూ అయిన ప్రహ్లాదుడ్ని కాపాడటానికి ఉగ్రనారసింహ అవతారమెత్తిన స్వామి, మరో భక్తుడి కోరిక మేరకు ప్రసన్న రూపంతో లక్ష్మీ సమేతంగా కొలువుదీరిన క్షేత్రమే యాదగిరిగుట్ట. తెలంగాణ తిరుపతిగా ప్రాశస్త్యం పొందిన ఈ క్షేత్రానికి ఉన్న విశిష్టత ఎంతో.

యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్టపైన వెలసిన లక్ష్మీ నరసింహస్వామి ప్రశస్తికి సంబంధించి పురాణాల్లో ఎన్నో ఐతిహ్యాలున్నాయి. రామాయణ మహా భారతాల్లోనూ ఆ ప్రస్తావనలున్నాయి. మహాజ్ఞాని విబాంఢకుడి కుమారుడు రుష్యశృంగుడు. అతడి పుత్రుడు యాద రుషి చిన్నతనం నుంచీ విష్ణు భక్తుడు. అందులోనూ నృసింహ అవతారం పట్ల ఎనలేని మక్కువ. ఆ స్వామి సాక్షాత్కారం పొందేందుకు దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతి వారికి చిక్కాడు. వాళ్లు యాదుడిని క్షుద్రదేవతకు బలివ్వబోయారు. అప్పుడు రామబంటుగా హనుమంతుడు ప్రత్యక్షమై యాదర్షిని రక్షించి, కీకారణ్యంలో సింహాకార గుట్టలున్నాయనీ అక్కడికెళ్లి సాధన చేస్తే స్వామి సాక్షాత్కరిస్తాడనీ సూచించాడు. యాదర్షి దీర్ఘకాల తపస్సు ఫలించి... నృసింహ స్వామి ప్రత్యక్షమయ్యాడట. అయితే, ఆ ఉగ్ర నరసింహ రూపాన్ని దర్శించలేకపోయాడు యాదర్షి. అతడి కోరిక మేరకు స్వామి శాంత స్వరూపంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు. అనంతరం యాదరుషి స్వామిని వేరు వేరు రూపాల్లో చూడాలనుందని వరం కోరుకున్నాడు. దాంతో జ్వాల, గండభేరుండ, యోగానంద, ఉగ్రసింహ, శ్రీలక్ష్మీనృసింహ స్వామిగా ప్రత్యక్షమయ్యాడు మహా విష్ణువు. అందుకే, ఈ ఆలయాన్ని పంచనారసింహ క్షేత్రంగా పిలుస్తారు. యాదరుషి కోరిక ఫలితంగా వెలసింది కాబట్టి, యాదగిరిగుట్టగానూ ప్రసిద్ధమైంది. యాదర్షి కోరికమీదే ఆంజనేయస్వామి యాదగిరి గుట్టకు క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. ఓ రాక్షసుడు తపోముద్రలో ఉన్న యాద మహర్షిని మింగేయాలని ప్రయత్నించడంతో విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని పంపి ఆ దైత్యుడిని అంతమొందించాడట. ఇప్పటికీ గుట్ట చుట్టూ సుదర్శనం రక్షా కవచంలా నిలిచి ఉంటుందనేది ఓ విశ్వాసం.

మరో అన్నవరంగా...
ఎంతో పురాతనమైన యాదగిరీశుడిని 1148 సంవత్సరంలో పశ్చిమ చాళుక్య రాజు త్రిభువన మల్లుడు, తర్వాత శ్రీకృష్ణదేవరాయలూ దర్శించుకున్నట్లు శాసనాలున్నాయి. అయితే, చాలాకాలం పాటు మరుగున పడిపోయిన క్షేత్ర మహత్యాన్ని స్థానిక గ్రామాధికారి గుర్తించాడు. స్వామి అతడికి కలలో కనిపించి తన అవతార రహస్యాన్ని చెప్పాడట. హైదరాబాద్‌ వాస్తవ్యుడు రాజా మోతీలాల్‌ ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు పునరుద్ధరించాడని చరిత్ర చెబుతోంది.

యాదాద్రిలో గుట్ట మీదే కాకుండా కింద కూడా మరో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది. నిజానికి స్వామివారు ముందు ఈ పాత ఆలయంలోనే వెలశాడనీ తరవాత కొత్త నరసింహ స్వామివారి ఆలయానికి గుర్రంమీద వెళ్లేవారనేది మరో కథనం. కింది ఆలయం నుంచి పై ఆలయం వరకూ మెట్లమీద ఇప్పటికీ కనిపించే గుర్రపు పాద ముద్రలు అవేనంటారు. ఇక, మహిమాన్వితమైన యాదాద్రిలో నిత్యం శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు జరగడం వల్ల ఈ క్షేత్రం మరో అన్నవరంగా విలసిల్లుతోంది.


బ్రహ్మోత్సవ వైభవం
యాదాద్రి ఆలయంలో ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవ సంప్రదాయాన్ని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే స్వహస్తాలతో ప్రారంభించాడని చెబుతారు. అందుకే, వీటికి బ్రహ్మోత్సవాలనే పేరొచ్చింది. ఉత్సవాలు జరిగిన పదకొండు రోజులూ యాదగిరి ముక్కోటి దేవతల విడిదిల్లుగా మారుతుంది. ఆ సందర్భంగా సకల దేవతల్నీ శాస్త్రోక్తంగా ఆహ్వానించి, వేదోక్తంగా పూజలు నిర్వహించడం సంప్రదాయం. దానివల్ల క్షేత్ర మహత్యం రెట్టింపు అవుతుందట. యాదగిరిగుట్టలోని విష్ణు పుష్కరిణి సాక్షాత్తూ బ్రహ్మ కడిగిన పాదాల నుంచే ఉద్భవించిందంటారు. అనారోగ్యం, ఇతర గ్రహ సమస్యలున్నవారు ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తే బాధల నుంచి విముక్తులవుతారనేది భక్తుల నమ్మకం. గుట్టమీది ఆలయానికి మెట్ల మార్గంలో వెళ్లేటపుడు దార్లో శివాలయం కనిపిస్తుంది. ఇక్కడి శివుడు నరసింహస్వామి కన్నా ముందే స్వయంభూగా వెలిశాడట. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారికి కీళ్ల నొప్పులు తగ్గుతాయనేది మరో విశ్వాసం.

తెలంగాణ తిరుపతిగా...
ఎంతో మహిమాన్వితమైన యాదగిరి గుట్టను తెలంగాణ తిరుపతిగా మహాదివ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పూనుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రెండువేల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవనాలూ పార్కులూ కాటేజీలూ కల్యాణమండపాలనూ నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన. సుమారు రూ.రెండు వేల కోట్లతో నిర్మించే ఈ మొత్తం క్షేత్రానికి ‘యాదాద్రి’ అనే నామకరణం చేశారు. ప్రస్తుతం అర ఎకరంలో ఉన్న ప్రధాన ఆలయం స్థానంలో 2.33 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆలయాన్ని కడుతున్నారు.

హైదరాబాద్‌ ప్రధాన బస్టాండ్ల నుంచి ప్రతి అరగంటకూ యాదాద్రికి వెళ్లే బస్సులున్నాయి.హిల్‌ స్టేషన్స్‌

కూల్‌ కూల్‌ హిల్‌ స్టేషన్స్‌
చలో బిలో 24


ఎండలు మండే వేసవికాలం. మిట్టమధ్యాహ్నమే కానక్కర్లేదు, పొద్దు పొడిచిన కొద్ది గంటలకే నిప్పులు చెరిగే సూర్యుడి తాకిడికి పట్టపగలే చుక్కలు కనిపించే కాలం. ఇలాంటి మండు వేసవిలో మీరూ మీ కుటుంబం 24 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న శీతల ప్రదేశాలకు వెళ్ళిరండి... వేసవిని చల్లగా గడిపేయాలనుకుంటే సరదాగా చల్లచల్లని హిల్‌ స్టేషన్లకు ఓ టూర్‌ వేసి రండి.అందరికీ తెలిసినవే కాదు, అంతగా తెలియని ప్రదేశాలను కూడా ఓసారి చూసి రండి. చూడచక్కని కూల్‌ కూల్‌ హిల్‌ స్టేషన్లను మచ్చుకు ఓ ఐదింటిని ఇక్కడ చూపిస్తున్నాం. సరదాగా ఓ లుక్కేయండి.

పాపులర్‌ హిల్‌స్టేషన్స్‌
మనదేశంలో దాదాపు వంద వరకు హిల్‌స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఊటీ, కోడైకెనాల్, సిమ్లా, నైనితాల్, ముస్సోరి, శ్రీనగర్, షిల్లాంగ్, మౌంట్‌ అబు వంటి పాపులర్‌ హిల్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇవే కాకుండా పెద్దగా ప్రాచుర్యంలోకి రాని హిల్‌ స్టేషన్లలో హిమాచల్‌లోని కుఫ్రీ, నహాన్, డార్జిలింగ్‌ చేరువలోని కాలింపాంగ్, ఉత్తరాఖండ్‌లోని కౌసాని, ఔలి, తమిళనాడులోని యెళగిరి, సిక్కింలోని పెల్లింగ్, నామ్చి, మేఘాలయలోని జోవై వంటివి చాలానే ఉన్నాయి. సాధారణ పర్యాటకులు బాగా తెలిసిన చోట్లకే వెళుతుంటారు.

అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రదేశాలను చూడాలనుకునే పర్యాటకులు ఎక్కువ మందికి తెలియని ప్రదేశాలను అన్వేషించి మరీ వెళుతుంటారు. పాపులర్‌ హిల్‌ స్టేషన్లలో వేసవిలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అలాంటి ప్రదేశాల కంటే తగిన వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండే రద్దీలేని ప్రదేశాలకు వెళ్లడమే మంచిదని పర్యాటక నిపుణుల సలహా. పడమటి కనుమల్లోనూ తూర్పు కనుమల్లోనూ చాలా హిల్‌స్టేషన్లే ఉన్నాయి. ఇవి వేసవిలో చల్లగానే ఉన్నా, హిమాలయాలకు చేరువగా ఉండే హిల్‌స్టేషన్లు మరింత చల్లగా ఉంటాయి. వేసవి మధ్యాహ్న వేళ కూడా AC టెంపరేచర్‌ను ఆస్వాదించాలంటే హిమగిరుల చెంతకు చేరుకోవాల్సిందే!కులూ - మనాలీ

ఉత్తర భారత పర్యాటకంలో కులూ మనాలీ జంట పదాలుగానే వినిపిస్తాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ రెండు పట్టణాలూ జంట పట్టణాలు కావు గానీ, ఒకదానికి మరొకటి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో అక్కడకు వెళ్లే పర్యాటకులు రెండింటినీ చూసే తిరిగి వస్తుంటారు. వేసవి విడిది కేంద్రాలుగా పేరుపొందిన ఈ పట్టణాల పరిసరాల్లో అప్పుడప్పుడు సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. హిమాలయాలకు చేరువలో సముద్ర మట్టానికి నాలుగువేల అడుగులకు పైగా ఎత్తున ఉండే కులూ మనాలీ పట్టణాలు ప్రకృతి సోయగాలకు నిలయాలు. నడివేసవిలో సైతం ఇక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పాతిక డిగ్రీలకు మించవు. వేసవిలో సైట్‌ సీయింగ్, వాకింగ్, సైక్లింగ్, ట్రెక్కింగ్‌ వంటి కార్యక్రమాలకు ఈ పట్టణాలు చాలా అనువుగా ఉంటాయి.

మనాలీ మీదుగా ప్రవహించే బియాస్‌ నదిలో బోటింగ్‌ను, ఇక్కడి పరిసరాల్లోని వేడినీటి బుగ్గల్లో జలకాలాటలను ఆస్వాదించవచ్చు. కులూ మనాలీలలో అడుగడుగునా పురాతన ఆలయాలు తారసపడతాయి. అరుదైన హిడింబ ఆలయం, శృంగి మహర్షి ఆలయం సహా పలు ప్రాచీన ఆలయాలతో పాటు ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. సుల్తాన్‌పూర్‌ ప్యాలెస్, ‘దేవతల కొలను’గా పేరుపొందిన భృగు సరోవరం, గ్రేట్‌ హిమాలయన్‌ నేషనల్‌ పార్క్, రహాలా జలపాతం, అరుదైన వన్యప్రాణులకు నిలయమైన మనాలీ అభయారణ్యం వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

ఎలా చేరుకోవాలి?
మనాలీకి 50 కిలోమీటర్ల దూరంలో భూంతార్‌ విమానాశ్రయం ఉంది. అయితే, ఢిల్లీ, చండీగఢ్‌ మినహా దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు విమానాలు దొరకవు. విమానాల్లో వెళ్లేవారు ఢిల్లీ లేదా చండీగఢ్‌ చేరుకుని, అక్కడి నుంచి మరో విమానంలో భూంతార్‌ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. కులూ మనాలీ పట్టణాలకు రైలు సౌకర్యం లేదు. వీటికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో జోగీందర్‌నగర్, 150 కిలోమీటర్ల దూరంలో పఠాన్‌కోట్‌ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఈ రెండు ప్రదేశాలకు నేరుగా రైళ్లు దొరుకుతాయి. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.
డార్జిలింగ్‌

డార్జిలింగ్‌ అంటే ఎక్కువగా తేయాకు తోటలే గుర్తుకొస్తాయి గానీ, ఇది అద్భుతమైన వేసవి విడిది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో హిమాలయాలకు దిగువన సముద్రమట్టానికి 6,700 అడుగుల ఎత్తున వెలసిన పట్టణం ఇది. ఎంతటి నడి వేసవిలోనైనా ఇక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలకు మించవు. డార్జిలింగ్‌లోని టైగర్‌ హిల్‌ నుంచి ఉత్తరానికి చూపు సారిస్తే నింగిని తాకే హిమగిరుల సొగసులను ఆస్వాదించవచ్చు. ఇక్కడి నుంచి చూస్తే మంచుతో నిండిన ఎవరెస్టు, కాంచన్‌జంగ శిఖరాలు ఇంచక్కా కనిపిస్తాయి. ఎటు చూసినా తేయాకు తోటలు, మహా వృక్షాలతో నిండిన దట్టమైన అడవుల పచ్చదనం కనువిందు చేస్తుంది. డార్జిలింగ్‌లో చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. జపానీస్‌ పీస్‌ పగోడా, భుటియా బస్టీ గోంపా వంటి బౌద్ధారామాలు, ధీర్‌ధామ్, మహాకాల్‌ ఆలయాలు, పద్మజా నాయుడు హిమాలయన్‌ జూలాజికల్‌ పార్క్, చాప్రామడి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, బార్బొటీ రాక్‌ గార్డెన్‌ వంటి ప్రదేశాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. వేసవిలో వాకింగ్, సైక్లింగ్, ట్రెక్కింగ్‌ వంటి కార్యక్రమాలకు ఇది చాలా అనువైన ప్రదేశం.

ఎలా చేరుకోవాలి?
ఢిల్లీ, కోల్‌కతా, గువాహటిల నుంచి డార్జిలింగ్‌కు నేరుగా విమాన సౌకర్యం అందుబాటులో ఉంది. దక్షిణాది నుంచి విమానాల్లో  వెళ్లేవారైతే ముందుగా కోల్‌కతా చేరుకుని అక్కడి నుంచి డార్జిలింగ్‌ వెళ్లడం తేలికగా ఉంటుంది. రైలులో వెళ్లేవారు ముందుగా న్యూజాల్‌పాయిగుడి స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి హిమాలయన్‌ రైల్వేస్‌కు చెందిన టాయ్‌ ట్రెయిన్‌లో డార్జిలింగ్‌ చేరుకోవచ్చు. అలా కాకుంటే కోల్‌కతాలో రైలు దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా కూడా చేరుకోవచ్చు.దిమా హసావో

అస్సాంలోని దిమా హసావో జిల్లా కేంద్రం హాఫ్లాంగ్‌ చూడచక్కని వేసవి విడిది కేంద్రం. స్థానిక దిమాసా భాషలో ‘హాఫ్లాంగ్‌’ అంటే ‘చీమ కొండ’ అని అర్థం. సముద్ర మట్టానికి దాదాపు మూడువేల అడుగుల ఎత్తున వెలసిన హాఫ్లాంగ్‌ పట్టణం ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. వేసవిలోనూ ఇక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పాతిక డిగ్రీలకు మించవు. ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి హాఫ్లాంగ్‌ ఇట్టే ఆకట్టుకుంటుంది. హాఫ్లాంగ్‌ కొండపైన, చుట్టుపక్కల వ్యాపించిన వనాల్లో దాదాపు రెండులక్షల జాతులకు పైగా అరుదైన పూల మొక్కలు కనువిందు చేస్తాయి. ఈశాన్య గిరిజన సంస్కృతికి ఆలవాలమైన ఈ ప్రదేశం గ్లైడింగ్, పారా గ్లైడింగ్, ట్రెక్కింగ్‌ వంటి సాహస క్రీడలకు అనువుగా ఉంటుంది. హాఫ్లాంగ్‌ కొండపై ట్రెక్కింగ్, హాఫ్లాంగ్‌ సరస్సులో పడవ విహారం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పక్షులు ఆత్మహత్యలు చేసుకునే ప్రదేశంగా పేరుపొందిన జతింగా ఇక్కడకు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఏటా వర్షాకాలంలో రాత్రివేళ ఇక్కడ రకరకాల పక్షులు మూకుమ్మడిగా చనిపోతుంటాయి. దీనిపై శాస్త్రవేత్తలు ఎన్నిరకాల విశ్లేషణలు చెబుతున్నా, ఈ పరిణామం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది.

ఎలా చేరుకోవాలి?
విమానంలో వెళ్లాలనుకునే వారికి అస్సాం రాజధాని గువాహటి లేదా మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ వరకు విమాన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఇక్కడకు చేరుకోవచ్చు. గువాహటి వరకు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి వేరే రైలు పట్టుకుని హాఫ్లాంగ్‌ వరకు రైలుమార్గంలో చేరుకోవచ్చు.థండా థండా తవాంగ్‌

అరుణాచల్‌ప్రదేశ్‌లోని జిల్లాకేంద్రమైన తవాంగ్‌ పట్టణం టిబెట్‌ సరిహద్దులకు అతి చేరువగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఏకంగా పదివేల అడుగుల ఎత్తున వెలసిన ఈ పట్టణం ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. నడి వేసవిలో సైతం ఇక్కడి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలకు లోపే నమోదవుతుంటాయి. చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లతో నిండిన దట్టమైన అడవులు, కొండల మీదుగా నేల మీదకు దూకే జలపాతాలు, సరస్సులతో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఇక్కడ కనువిందు చేస్తుంది. బౌద్ధ సంస్కృతికి ఆలవాలమైన తవాంగ్‌లో తవాంగ్‌ బౌద్ధారామం, ఉర్గెలింగ్‌ గోంపా, గ్యాన్‌గోంగ్‌ అని గోంపా వంటి ఆరామాలు టిబెటన్‌ వాస్తుశైలిలో ఆకట్టుకుంటాయి. సెలా పాస్, బుమ్‌లా పాస్‌ వంటి పర్వతమార్గాలు ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. కొండలపై వెలసిన మాధురి సరస్సు, నగులా సరస్సు వంటి సరస్సులు, నురానంగ్‌ జలపాతం వంటి జలపాతాలు నిత్యం జలకళతో కనువిందు చేస్తాయి. ఇక్కడికి చేరువలోనే మంచుతో నిండిన గోరిచెన్‌ శిఖరం ఎక్కేందుకు పర్వతారోహకులు మక్కువ చూపుతారు. ఇక్కడి ఈగల్‌ నెస్ట్‌ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం జీవవైవిధ్యానికి ఆలవాలంగా ఆకట్టుకుంటుంది.

ఎలా చేరుకోవాలి?
ఇక్కడకు చేరువలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ అస్సాంలోని తేజ్‌పూర్‌లో ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 150 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించి తవాంగ్‌ చేరుకోవాల్సి ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి తేజ్‌పూర్‌ వరకు నేరుగా విమానాలు, రైళ్లు దొరకడం కష్టం. అందువల్ల గువాహటి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గం మీదుగా ఇక్కడకు చేరుకోవడం కాస్త తేలికగా ఉంటుంది.గ్యాంగ్‌టక్‌

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌ చూడ చక్కని వేసవి విడిది. గ్యాంగ్‌టక్‌ అంటే కొండకొన అని అర్థం. సముద్ర మట్టానికి దాదాపు ఐదున్నర వేల అడుగుల ఎత్తున తూర్పు హిమాలయ పర్వతశ్రేణుల మధ్య వెలసిన పట్టణం ఇది. ఏడాది పొడవునా చల్లగా ఉండే గ్యాంగ్‌టక్‌లో వేసవిలోనూ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పాతిక డిగ్రీలకు మించవు. సిక్కిం బ్రిటిష్‌ పాలనలో కొనసాగినా, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్నాళ్లు స్వతంత్ర రాజ్యంగానే కొనసాగింది. చివరకు 1975లో భారత్‌లో చేరింది. గ్యాంగటక్‌లో వివిధ హిందూ ఆలయాలతో పాటు బౌద్ధారామాలు చూడముచ్చటగా ఉంటాయి. పట్టణానికి చుట్టుపక్కల సెవెన్‌ సిస్టర్స్‌ జలపాతం సహా పలు జలపాతాలు వేసవిలో జలకాలాటలకు అనువుగా ఉంటాయి. పచ్చదనంతో అలరారే ప్రశాంతమైన గ్యాంగ్‌టక్‌ పరిసరాలు వాకింగ్, ట్రెక్కింగ్, సైట్‌ సీయింగ్‌ వంటి కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటాయి. తాషీ వ్యూ పాయింట్, గణేశ్‌ టోక్‌ వ్యూపాయింట్‌ వంటి ప్రదేశాల నుంచి గ్యాంగ్‌టక్‌ పట్టణాన్నీ, పరిసరాల్లోని అడవుల పచ్చదనాన్నీ తిలకించవచ్చు. ఇక్కడి జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచే హిమాలయన్‌ జూ పార్కు, షింగ్బా రోడో డెండ్రాన్‌ అభయారణ్యం, కాంచన్‌జంగా నేషనల్‌ పార్క్‌ వంటివి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఎలా చేరుకోవాలి?
గ్యాంగ్‌టక్‌కు నేరుగా విమాన, రైలు సౌకర్యాలేవీ అందుబాటులో లేవు. ఇక్కడకు అతి చేరువలోని విమానాశ్రయం పశ్చిమ బెంగాల్‌లోని బాగ్దోగ్రాలో ఉంది. గ్యాంగ్‌టక్‌కు ఇది సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాగ్దోగ్రా విమానాశ్రయం నుంచి గ్యాంగ్‌టక్‌కు హెలికాప్టర్లు కూడా అందుబాటులో ఉంటాయి. విమానం దిగి రోడ్డు మార్గాన రావాలనుకుంటే ట్యాక్సీలు లేదా బస్సుల్లో రావచ్చు. సమీపంలోని రైల్వేస్టేషన్‌ పశ్చిమబెంగాల్‌లోని న్యూ జాల్‌పాయిగుడిలో ఉంది. అక్కడి నుంచి సుమారు 150 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించి గ్యాంగ్‌టక్‌ చేరుకోవాల్సి ఉంటుంది.పెళ్లిళ్ల దేవుడు వీరేశ్వరస్వామి!పెళ్ళిళ్ళ దేవుడుగా ప్రాచుర్యం చెందిన ఆ స్వామికి కళ్యాణం జరిపిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరతాయన్న నమ్మకంతో భక్తులు అక్కడకు విశేషంగా తరలివస్తుంటారు... అదే వృద్ధ గౌతమీ తీరంలో వెలసిన సుప్రసిద్ధ శైవ క్షేత్రం... మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం.

కొబ్బరిచెట్ల సవ్వడులూ పచ్చని పంటపొలాలూ గోదావరీజలాల గలగలల మధ్య భద్రకాళీ సమేతంగా వెలసిన వీరేశ్వరస్వామి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంతో అలరారుతుంటుంది. తూర్పుగోదావరి జిల్లా, మురమళ్లలో వెలసిన ఆ వీరేశ్వరుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలి వస్తుంటారు. ఆలయంలో కొలువైన స్వామికి కళ్యాణం జరిపిస్తే అవివాహితులకు వెంటనే వివాహం జరుగుతుందని ప్రతీతి. దక్షిణ భారతదేశంలోనే మరెక్కడాలేని విధంగా ఈ ఆలయంలో స్వామికి నిత్యం వివాహ వేడుకని అత్యంత శాస్త్రోక్తంగా జరిపించడం విశేషం. భక్తులంతా సంకల్పం చెప్పుకుని, తమ గోత్రనామాలతో ఆ వీరభద్రుడికి కళ్యాణం జరిపిస్తుంటారు. అందుకే ఆయన్ని పెళ్లిళ్ల దేవుడని పిలుస్తారు.

స్థల పురాణం!
దక్షయాగాన్ని భంగం చేసి, సతీదేవి పార్థివ దేహంతో తాండవం చేస్తూ ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తోన్న వీరభద్రుడి మహోగ్రాన్ని చల్లార్చేందుకు దేవతల కోరిక మేరకు ఆ జగజ్జనని భద్రకాళి పేరుతో అతిలోకసుందరిగా రూపుదాల్చుతుంది. ఆమెను చూడగానే స్వామి శాంతించి, వివాహం చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు వాళ్లిద్దరికీ గాంధర్వ పద్ధతిలో మునులంతా కలిసి వివాహం జరిపించారట. మునులు సంచరించే ప్రాంతాన్నే మునిమండలి అంటారు. ఆ మునిమండలి ప్రాంతమే కాలక్రమంలో మురమళ్లగా మారింది అనేది పురాణ కథనం. ఆరోజునుంచీ అక్కడ వెలసిన స్వామికి మునులంతా కలిసి గాంధర్వ పద్ధతిలో కళ్యాణం జరిపిస్తున్నారు.

పూర్వం గౌతమీ నదికి వరదలు వచ్చినప్పుడు స్వామి ఆలయం మునిగిపోయిందట. అప్పుడు శివభక్తుడైన వేలవలి శరభరాజుకి స్వామి కలలో కనిపించి మునిమండలి ప్రాంతంలోని గోదావరిలో మునిగి ఉన్న తనను వెలికితీయాలని కోరడంతో, శివలింగాన్ని గడ్డపారతో తీసేందుకు ప్రయత్నించాడట. అయితే గడ్డపార దెబ్బకు శివలింగం నుంచి రక్తం రావడంతో, భయభ్రాంతులైన భక్తులు స్వామిని ధ్యానించగా శివలింగం నుంచి మాటలు వినిపించాయట. శివలింగాన్ని ఐ.పోలవరం సమీపంలోని బాణేశ్వరాలయానికి తీసుకువెళ్లాలనీ మధ్యలో అనుకూలంగా ఉన్నచోట ఆగిపోతానన్నది ఆ మాటల సారాంశం. అంతట భక్తులు జయజయ ధ్వానాలమధ్య శివలింగాన్ని తీసుకెళుతుండగా మురమళ్ల గ్రామంలోని ఓ ప్రదేశంలో శివలింగం భారీగా పెరగడంతో అదే స్వామి ఆజ్ఞగా భావించి అక్కడే దించి, ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడుగా లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు.

వివాహమహోత్సవం!
అనాదిగా వస్తోన్న ఈ వివాహ క్రతువు జరిగే తీరు భక్తులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతుంటుంది. బాజా భజంత్రీలూ మేళతాళాలతో ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం జరపడం ద్వారా కళ్యాణ వేడుకను ప్రారంభిస్తారు. ఓ పక్క కొందరు అర్చకులు యక్షగానం ఆలపిస్తుంటారు. మరోపక్క స్మార్తాగమం ప్రకారం ఆలయ పురోహితులు స్వామివారి వివాహ వేడుకను నిర్వహిస్తుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి తంతులన్నీ స్వామి కళ్యాణంలో కనిపిస్తాయి. అనంతరం స్వామివారినీ అమ్మవారినీ అద్దాల మండపానికి తోడ్కొని, పవళింపుసేవ చేయడంతో కళ్యాణమహోత్సవం ముగుస్తుంది. మూడుగంటల పాటు జరిగే ఈ వివాహ మహోత్సవం భక్తులకు కన్నులపండగే. కళ్యాణం జరిపించే భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ఉదయంపూట అభిషేకం జరుపుతారు. రోజుకిన్ని కళ్యాణాలు అన్న లెక్క ఉండటంతో భక్తులు నెల రోజులు ముందుగానే నమోదు చేసుకుంటుంటారు.దూరప్రాంతాలనుంచి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఆలయంలో నిత్యాన్నదానం, వసతి గదులూ అందుబాటులో ఉన్నాయి. కాకినాడకు 36, రాజమండ్రికి 90 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం.
- వై.నాయుడు, న్యూస్‌టుడే, ఐ.పోలవరం

అద్దాల రైలులో.. అరకులోయ వెళ్లొద్దాం

అద్దాల రైలులో.. అరకులోయ వెళ్లొద్దాం!


చుట్టూ పచ్చని కొండలు... అల్లంత దూరాన విసిరేసినట్లుంటే గిరిజన పల్లెలు. పచ్చని పొలాల నడుమ అద్దాల రైలులో కూర్చుని ప్రయాణించే ప్రకృతి ప్రేమికులకు సహజ అందాల వీక్షణం ఓ మధురానుభూతిని మిగులుస్తుంది. మధురమైన అద్దాల రైలు ప్రయాణాన్ని ఆనందమయం చేసుకోవాలంటే చక్కటి ప్రణాళికను రూపొందించుకోవాలి. పర్యటక ప్రాంతమైన అరకులోయ, పరిసర ప్రాంతాల్లో దర్శనీయ ప్రాంతాలు ఏమేం ఉన్నాయి, అరకులోయ స్టేషన్‌లో అద్దాల రైలు దిగినప్పటి నుంచి సాయంత్రం రైలు తిరిగి విశాఖపట్నం బయలుదేరే వరకు ఏఏ ప్రాంతాలను చుట్టి రావచ్చు, ఆయా ప్రాంతాలకు చేరుకునేందుకు ఉన్న రవాణా సదుపాయాలు, స్థానికంగా ఉన్న వసతులేంటో తెలుసుకుందామా..

ముందస్తు సన్నద్ధత అవసరం
విశాఖపట్నం - కిరండూల్‌ వెళ్లే పాసింజరు రైలుకు అద్దాల బోగీని జత చేసి అరకులోయ వరకు రైల్వే శాఖ నడుపుతోంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో అరకులోయ స్టేషన్‌లో అద్దాల బోగీని కలుపుకొని విశాఖపట్నం తీసుకువస్తుంది. విశాఖపట్నం నుంచి అరకులోయకు అద్దాల బోగీలో ప్రయాణానికి టికెట్‌ ధర రూ.665 గా నిర్ణయించారు. విశాఖపట్నం నుంచి బొర్ర వరకు అద్దాల బోగీలో వద్దామన్నా రూ.665 టికెట్‌ తీసుకోవాల్సిందే. ఈ బోగీలో మొత్తం 40 సీట్లున్నాయి. సీట్లు తక్కువ కావడం, డిమాండు అధికంగా ఉండటంతో ప్రయాణ తేదీని నిర్ణయించుకుని ముందుస్తు రిజర్వేషన్‌ చేయించుకోవడం మంచిది. ఈ రైలు విశాఖపట్నం స్టేషన్‌ నుంచి ప్రతి రోజూ ఉదయం 7.10 గంటలకు బయలుదేరుతుంది.

అరకులోయ వరకు ఇలా..
విశాఖ నుంచి అద్దాల బోగీలో బయలుదేరిన ప్రయాణికులు సొరంగ మార్గాలు, ఇరువైపులా ప్రకృతి రమణీయ దృశ్యాలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలను వీక్షిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రైలు ఉదయం 10.05 గంటలకు బొర్రా స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరిన రైలు 11.05 గంటలకు అరకులోయ స్టేషన్‌కు వస్తుంది. అరకులోయ రైల్వేస్టేషన్‌లో దిగిన ప్రయాణికులు స్థానికంగా సందర్శనీయ స్థలాలకు వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. సమయపాలన పాటిస్తూ ముందుకు సాగితే అరకులోయ అందాలను ఆస్వాదించవచ్చు.

గిరిజన మ్యూజియం
పద్మాపురం ఉద్యానవనం నుంచి 3 కి.మీ. దూరంలో గిరిజన మ్యూజియం ఉంది. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20. ఇక్కడ గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించే సహజ సిద్ధంగా ఉండే ప్రతిమలు ప్రత్యేకం. బోటు షికారు, ల్యాండ్‌ స్కేపింగ్‌లు ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడే కాఫీ రుచులు పంచే కాఫీ మ్యూజియం ఉంది. వివిధ రకాల కాఫీలతోపాటు కాఫీ పౌడర్‌ లభిస్తుంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు మ్యూజియంలో గడపవచ్చు.

కటికి, తాటిగుడ జలపాతాలు
బొర్రా గుహలను సందర్శించి బయటకు వచ్చాక సమయం ఉంటే 3 కి.మీ. దూరంలో ఉన్న కటికి జలపాతాన్ని, అక్కడి నుంచి అనంతగిరి చేరుకుని తాడిగుడ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లవచ్చు. సాయంత్రం అరకులోయ రైల్వేస్టేషన్‌ నుంచి అద్దాల రైలు బయలుదేరి బొర్రా స్టేషన్‌కు 6.05 గంటలకు వస్తుంది. ఈలోగా బొర్రా స్టేషన్‌కు చేరుకుంటే రాత్రి 9 గంటలకు విశాఖపట్నం చేరుకోవచ్చు.

చాపరాయి జలపాతం
గిరిజన మ్యాజియం నుంచి 16 కిమీ. దూరంలో చాపరాయి జలపాతం ఉంది. గిరిజన మ్యూజియం నుంచి బయలుదేరితే 30 నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. బండరాయి వంటి చాపరాతిపై ప్రవహిస్తున్న జాలువారే నీటిలో తేలియాడవచ్చు. ప్రవేశ రుసుము రూ.10. స్థానికంగా బొంగులో చికెన్‌ విక్రయాలు అధికంగా జరుగుతాయి. మాంసాహార ప్రియులు బొంగులో చికెన్‌ను ఇక్కడు రుచి చూడవచ్చు.

పద్మాపురం ఉద్యాన వనం
అరకులోయ రైల్వేస్టేషన్‌కు 3 కి.మీ. దూరంలో పద్మాపురం ఉద్యాన వనం ఉంది. రైల్వే స్టేషన్‌లో ఉదయం 11.05 గంటలకు రైలు దిగిన తర్వాత పది నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. ఉద్యాన వనంలో వివిధ రకాల పుష్పజాతులు, వృక్ష జాతులకు సంబంధించిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ల్యాండ్‌ స్కేపింగ్‌ తదితరాలు ఉన్నాయి. ఉద్యాన వనాన్ని దర్శించేందుకు ప్రవేశ రుసుము పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20. మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక్కడ పిల్లలతో సరదాగా గడపవచ్చు.

బొర్రా గుహలు
చాపరాయి జలపాతం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి అరకులోయ చేరుకుని స్థానికంగా ఉన్న హోటళ్లలో భోజనం చేసి 17 కి.మీ. దూరంలో ఉన్న డముకు వ్యూపాయింట్‌, కాఫీ తోటలను తిలకించొచ్చు. అక్కడి నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న బొర్రా గుహలకు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోవచ్చు. బొర్రా గుహలను తిలకించేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. బొర్రా గుహల సమీపంలోనూ హోటళ్లు ఉన్నాయి. ఇక్కడ రుచికరమైన ఆహార పదార్థాలు లభిస్తాయి. బొంగులో చికెన్‌కు బొర్రా గుహల సమీపంలోని హోటళ్లు ప్రసిద్ధి. ముందుగా ఆర్డర్‌ ఇస్తే ప్రత్యేకంగా తయారు చేస్తారు.

123


Wednesday, 19 April 2017

ఉపమాక వేంకటేశ్వరాలయం

ఉపమాక వేంకటేశ్వరాలయం
ఉపమానం చెప్పలేని వేల్పు వేంకటేశ్వరుడు

ఉపమాక అంటే సాటి లేనిది అని అర్థం. ఇటువంటి క్షేత్రం మరెక్కడా ఉండదని అర్థం స్ఫురించేలా పురాణాలలో ఉపమాక అనే పదాన్ని ఉపయోగించారు. ‘కలౌ వేంకటనాయక’ అన్నట్లుగా, కలియుగంలో శ్రీమన్నారాయణుడు వేంకటేశ్వరస్వామి అవతారంలో వేంచేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు నిదర్శనమే ఉపమాక వేంకటేశ్వరస్వామి. ఒకసారి ఆ ప్రాంతాన్ని దర్శించినవారు తిరిగి భగవంతుడిని దర్శించుకోవడానికి పదే పదే వెళ్లి తీరతారని స్థానికులు చెబుతారు. స్వామివారు గరుడాద్రిపై విశ్రాంతి కోసం పవళించినట్లుగా తెలుస్తోంది. ఆలయానికి సమీపంలో బందుర సరస్సు ఉంది. ఇది చాలా పవిత్రమైనదని, తిరుమలలోని పాపనాశంతో సమానమని చెబుతారు.

క్రీ.శ. ఆరవ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ భూపాలుడు స్వామికి ఆలయాన్ని నిర్మించినట్లు క్షేత్ర మహాత్మ్యం చెబుతోంది. ఇక్కడ క్షేత్రపాలకుడైన వేణుగోపాలస్వామి విగ్రహాన్ని నారదుడు ప్రతిష్ఠించాడని, 11వ శతాబ్దంలో రామానుజులవారు ఈ ఆలయాన్ని దర్శించారనీ తెలుస్తోంది.

స్థలపురాణం ద్వాపర యుగంలో గరుత్మంతుడు శ్రీకృష్ణ భగవానుడిని ఎల్లవేళలా తన వీపుపై ఉండాలని కోరాడు. దక్షిణ సముద్రతీరంలో గరుడ పర్వతం ఉందని, తాను వేటకు వచ్చి అక్కడ వేంకటేశ్వరునిగా స్థిరపడతానని వరమిచ్చాడు. అలాగే మునులు తమకు మోక్షం ప్రసాదించాలని కోరగా, దక్షిణ సముద్ర తీరమంతా అరణ్యప్రాంతమని, అక్కడ అడవి  జంతువులుగా జన్మిస్తే, తాను వేటకు వచ్చి మోక్షం ప్రసాదిస్తానని, అనంతరం అక్కడే స్థిరపడతానని వరమిచ్చినట్లు బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. మాట నిల»ñ ట్టుకోవడం కోసం శ్రీకృష్ణుడు... ఉపమాక గ్రామంలో ఉన్న గరుడ పర్వతం మీద కొలువయ్యాడని, అక్కడ సంచరించే గొర్రెల కాపరులు స్వామివారికి నిత్య సేవలు చేస్తూ, నైవేద్యాలు సమర్పించడం ద్వారా భగవంతుడు వెలిశాడని గ్రామప్రజలు తెలుసుకున్నారని తెలుస్తోంది. ఆ విధంగా శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికి, ఋషీశ్వరులకు ఇచ్చిన వరప్రభావంతో కలియుగంలో షడ్భుజాలతో, లక్ష్మీ సమేతుడై, అశ్వాన్ని అధిరోహించి దర్శనమిస్తాడు.

ఆరు భుజాలతో దర్శనమిచ్చే అరుదైన విగ్రహం: ఇక్కడి వేంకటేశ్వరుడు ఆరు భుజాలు, పంచాయుధాలతో దర్శనమిస్తాడు. ఇందులో ఐదు భుజాలు దుష్ట శిక్షణకు, ఒక హస్తం అభయ ముద్రలో ఉంటూ, భక్తులకు అభయమిస్తుంటాడు. గుర్రం మీద కూర్చుని, క్రింద వామభాగంలో ఎడమవైపున లక్ష్మీదేవిని కలిగి కనువిందు చేస్తాడు. స్వయంభూగా వేంచేసిన క్షేత్రం ఉపమాక. ఈ పేరు పురాణాలలోనూ కనిపిస్తుంది.

ఎక్కడ ఉంది? విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఉన్న ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయం క్రీ.పూ 6వ శతాబ్దానికి చెందినది. తుని – విశాఖపట్టణం ప్రాంతాలకు మధ్యగా ఎన్‌హెచ్‌ – 5 నుంచి ఒక కిలోమీటరు దూరంలో ఉంది ఉపమాక గ్రామం.

స్వామి దర్శనం 17, 18 శతాబ్దాలలో పిఠాపురం సంస్థానానికి చెందిన ప్రభువు ఎంతో ముచ్చటపడి విలువైన పచ్చలు, వజ్రాలు పొదిగిన కిరీటాన్ని చేయించుకున్నాడట. ధారణకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. ముందు రోజు రాత్రి ఆ రాజుకి కలలో స్వామి దర్శనమిచ్చి, ‘ఉపమాక క్షేత్రంలో నేను వేంచేసి ఉండగా, నాకు సమర్పించకుండా నువ్వు ఎందుకు ధరించాలనుకుంటున్నావు’ అని అడిగాడట. పశ్చాత్తాప పడిన రాజు మరునాడు ఊరేగింపుగా ఉపమాక వచ్చి స్వామి వారికి కిరీటం సమర్పించాడట.

క్షేత్ర విశేషాలు గరుడాద్రి పర్వతంపై గుర్రంపై వేటకు వెళ్తున్న రూపంలో స్వామి దర్శనమిస్తాడు. ఆలయానికి ఎదురుగా ఉన్న బందుర సరస్సులో బ్రహ్మ తపస్సు చేశాడట. ఆ సరస్సులోని పవిత్ర జలాలతో అనునిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు∙ స్వామి వారు పగలు తిరుపతిలోను, రాత్రి ఉపమాక గరుడాద్రి పర్వతంపై కొలువు తీరి (విశ్రాంతి కోసం) ఉంటారని క్షేత్ర మహాత్మ్యం చెబుతోంది. అందువల్లే ఉదయం 5గం.లకు స్వామివారి గర్భాలయ ద్వారాలు తెరిచి, పూజాదికాలు నిర్వహించి, సాయంత్రం 6 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు∙ కొండ దిగువన బేడా మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులు, పక్కన ఉపాలయంలో ఆండాళ్లమ్మవారు కనువిందు చేస్తారు∙ బందుర సరస్సులో స్నానమాచరించి ధ్వజస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

స్వామివారికి కోట్ల విలువ చేసే స్వర్ణాభరణాలు, నవరత్నాల ఆభరణాలు ఉన్నాయి. ఈ ఆలయంలో నిత్యం ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి శనివారం అన్నదానం చేస్తారు∙ అన్ని క్షేత్రాలలో సంవత్సరానికి ఒక్కరోజు లభించే ఉత్తర ద్వారదర్శనం, ఇక్కడ నిత్య వైకుంఠ ద్వార దర్శనంగా విలసిల్లుతోంది∙ దూరం నుంచి ఈ పర్వతం గరుడ పక్షి ఆకారంలో కనిపిస్తుంది. అందుకే ఈ కొండను గరుడాద్రి అంటారు∙ భక్తులు దగ్గరుండి మూలవిరాట్‌కు అనునిత్యం పంచామృత అభిషేకం  చేయించుకోవచ్చు.

పంచామృతాభిషేక సమయంలో స్వామివారిని దర్శించి, తీర్థప్రసాదాలు స్వీకరిస్తే, సంతానప్రాప్తి కలుగుతుందని నమ్మకం∙ స్వామివారికి తమ కోరికను విన్నవించి, అది నెరవేరిన తరవాత కాలి నడకన కొండపైకి వస్తాననుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని, నెరవేరిన వెంటనే కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని స్థానికులు చెబుతారు∙ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్ద జీయర్‌ స్వామివారు భారతదేశంలో ప్రతిష్ఠించిన 108 స్థూపాలలో ఇది 48వది.

ఎలా చేరుకోవాలి? రోడ్డు మార్గం
రైల్వే స్టేషన్‌ నుంచి 4 కిలోమీటర్లు∙ రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల నుంచి గంటగంటకూ ఆర్టీసీ బస్సులు∙ తుని, యలమంచిలి ప్రాంతాల నుంచి బస్సులు ఎక్కువగా ఉన్నాయి∙ నర్సీపట్నం రోడ్, అడ్డ రోడ్, నక్కపల్లి ప్రాంతాల నుంచి సర్వీస్‌ ఆటోలు నడుస్తూనే ఉంటాయి.
రైలు మార్గం చెన్నై – కలకత్తా మార్గంలో తునిలో దిగితే, అక్కడ నుంచి 20 కి.మీ. దూరం∙
కొన్ని రైళ్లు నర్సీపట్నం రోడ్‌ స్టేషన్‌లో ఆగుతాయి. ఇక్కడి నుంచి ఉపమాక గ్రామం కేవలం 4 కి.మీ.

డా.పురాణపండ వైజయంతిTuesday, 18 April 2017

కదిలె పాపహరేశ్వరుడు

సప్తగుండాల నడుమ కదిలె పాపహరేశ్వరుడు

కదిలె పాపహరేశ్వర క్షేత్రం

సహ్యాద్రి పర్వతాల చివరి సానువుల్లో పచ్చటి అడవి అందాల ప్రకృతి ఒడిలో... మాతాన్నపూర్ణేశ్వరీ సమేతుడై వెలిసిన స్వయంభూ లింగాకారుడాయన. తండ్రి ఆజ్ఞపై తల్లి తలనరికిన పరశురాముడి మాతృహత్యా పాతకాన్ని తొలగించిన పరమ పావన క్షేత్రమిది. అదే కదిలె పాపహరేశ్వర క్షేత్రం. తన భక్తుడి పరమభక్తికి తన్మయత్వంతో ఆ స్వామి కదలడంతో ఈ ఆలయానికి.. ఈ ప్రాంతానికీ ‘కదిలె’ అని పేరొచ్చింది. తన భక్తుడిని పాపవిముక్తుడిని చేయడంతో స్వామి పాపహరేశ్వరుడయ్యాడు. దట్టమైన అడవులు.. ఎల్తైన కొండల నడుమ కొలువైన ఈ శివాలయంలో ఎన్నో విశేషాలు, వింతలు, ఏకశిలతో చేసిన శిల్పకళాకృతులు ఉన్నాయి.

అంతేకాదు, ఎల్తైన కొండలపై బండరాళ్లలో ఏడాదిపొడవునా ఎండిపోకుండా ఒకే లాంటి జలధారతో ఉండే ఋషిగుండం ప్రధానమైంది. ఇందులోనే పరశురాముడు నిత్యస్నానమాచరించి పాపన్నను పూజించాడు. పక్కపక్కనే ఉన్నా ఒకదాంట్లో వేడిగా, మరోదాంట్లో చల్లగా ఉండే సూర్య, చంద్ర గుండాలు.. పాలవలె తెల్లని నీళ్లతో గల పాలగుండం, ఎంతటి శతృత్వం ఉన్నా.. తనలో ఒక్కసారి మునిగితే అత్తాకోడళ్లను కలిపేసే అత్తాకోడళ్ల గుండం... తీర్థాన్ని తలపించే నీళ్లుగల తీర్థగుండం వీటన్నింటితో పాటు ఆవు మూతి నుంచి జలధార వచ్చే ఆవుమూతి గుండం (గో పుష్కరిణి) ఇక్కడి సప్తగుండాలు.

పాపవిముక్తుడైన పరశురాముడు
మాతృహత్యా పాతకం నుంచి తనను విముక్తుని చేయాలంటూ పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు పరశురాముడు. ఈ క్రమంలో దేశమంతటా పర్యటిస్తూ... 31 శివలింగాలను ప్రతిష్ఠించి పూజలు చేశాడు. ఇక దక్షిణ దిశగా బయలుదేరిన పరశురాముడు గోదావరి తీరప్రాంతమైన ప్రస్తుత నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలకేంద్రానికి చేరాడు. ఇక్కడనే తన తల్లి రేణుకా ఎల్లమ్మని ప్రతిష్ఠించి పూజించాడు. అనంతరం దిలావర్‌పూర్‌ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో గల ఎల్తైన కొండలను దాటుకుని వెళ్లి దట్టమైన అడవుల నడుమ లోయలాంటి ప్రదేశంలో తపస్సుకు ఉపక్రమించాడు. నల్లనిరాళ్ల మీదుగా పారుతోన్న సెలయేరు... చల్లటి, వేడి, పాల వంటి నీళ్లతో కూడిన సప్తగుండాల (చిన్న కోనేరు) కలిగిన ఈ ప్రాంతం ఆయనను అమితంగా ఆకట్టుకుంది.

అక్కడే స్వయంభూగా వెలసిన శివుణ్ణి గుర్తించిన పరశురాముడు 32వ లింగంగా పూజించాడు. ఆయన చేసిన ఘోరతపస్సుకు లింగాకారంలో ఉన్న శివుడు కదిలాడు. దీంతో పరశురాముడు‘శివయ్య కదిలె... శివయ్య కదిలె...’అంటూ పరవశించిపోయాడు. సప్తగుండాలలో స్నానంచేసి, శివయ్యను కొలవడంతో పరశురాముడి పాపమూ పోయింది. దీంతో ఈ ఆలయానికి, ప్రాంతానికి కదిలెగా... ఇక్కడి శివయ్యకు పాపహరేశ్వరుడిగా పేరొచ్చింది. ఇప్పటికీ భక్తులు ‘కదిలె పాపన్న’గా పిలుస్తారు. నాలుగువందల ఏళ్లక్రితం నిమ్మల పాలకులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

అపమృత్యుదోషాలు తొలగించే అన్నపూర్ణ
కదిలñ  పాపహరేశ్వరుడు మాతాన్నపూర్ణేశ్వరీ సమేతుడై కొలువయ్యాడు. అయ్యవారి ఆలయం వెనుకభాగంలోనే అమ్మవారు కొలువయ్యారు. మాతాన్నపూర్ణేశ్వరి దక్షిణాభిముఖంగా ఉండటం ఇక్కడి విశేషం. యమస్థానమైన దక్షిణం వైపు ఉన్న అమ్మవారిని పూజిస్తే అకాల, అపమృత్యుదోషాలు, అన్ని సమస్యలూ తొలగిపోతాయని స్థల పురాణం. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో త్రిమూర్తులూ దర్శనమిస్తారు. పాపన్న ఆలయానికి కుడివైపు బ్రహ్మ, ఎడమవైపు నటరాజ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఇక గర్భగుడికి కుడివైపు వరాహస్వామి, ఎడమవైపు విష్ణుమూర్తి ఉండటం  ఆలయ శిఖరంపై పంచముఖ శివుడి విగ్రహం ఇక్కడి ప్రత్యేకత.

ఇక్కడ ఉంది
నిర్మల్‌ జిల్లాకేంద్రం నుంచి మొత్తం 21 కిలోమీటర్ల దూరంలో కదిలె  ఆలయం ఉంది. నిర్మల్‌ నుంచి భైంసా వైపు వెళ్లే 61నంబరు జాతీయరహదారిపై నిర్మల్‌ నుంచి 15కిలోమీటర్ల దూరంలో దిలావర్‌పూర్‌ మండలకేంద్రం ఉంటుంది. అక్కడి నుంచి కదిలె 7కిలోమీటర్లు. ఈ 7కిలోమీటర్లూ ఎల్తైన గుట్టలపై వంపులతో కూడిన ఘాట్‌రోడ్లు, చుట్టూ పచ్చటి అడవులు, స్వచ్ఛమైన పల్లెల గుండా సాగుతుంది. లోయవంటి ప్రదేశంలో చుట్టూ దట్టమైన అడవిలో పాపహరేశ్వరాలయం ఉంటుంది. అభినవ శ్రీశైలంగా ప్రాశస్త్యం కలిగిన కదిలె పాపహరేశ్వారాలయంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు, నిత్యాన్నదానం ఉంటాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా విశేషంగా భక్తులు తరలి వస్తుంటారు.

ఏకశిలతో మహానంది
పరమశివుడి వాహనమైన నందీశ్వరుడు ఇక్కడ ఏకశిలలో కొలువయ్యాడు. నల్లని ఏకశిలతో అందమైన అభరణాలతో నందీశ్వరుడు ఆకట్టుకుంటాడు.

ఎలా కదలాలంటే..?
హైదరాబాద్‌ నుంచి నాగపూర్‌ వైపు వెళ్లే 44నంబరు జాతీయ రహదారిపై దాదాపు 250 కి.మీ. దూరంలో నిర్మల్‌ జిల్లా కేంద్రం ఉంటుంది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ల నుంచి నేరుగా నిర్మల్‌ జిల్లాకేంద్రానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. నిర్మల్‌ నుంచి కదిలె ఆలయం 21కి.మీ. దూరం వస్తుంది. నిర్మల్‌ నుంచి భైంసావైపు వెళ్లే 61నం. జాతీయరహదారిపై గల దిలావర్‌పూర్‌ మండలకేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి 7కి.మీ. దూరంలో గల కదిలెకు చేరుకోవచ్చు. భక్తులు సొంత వాహనాలను కదిలె ఆలయ పరిసరాల వరకూ తీసుకెళ్లవచ్చు.

పాపహరేశ్వరుడి ప్రత్యేకతలెన్నో..
కదిలెలో వెలసిన పాపహరేశ్వరాలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోని ఏ ఆలయం చూసిన తూర్పు లేదాæ.. ఉత్తరం వైపు ముఖాలను కలిగి ఉంటాయి. కానీ ఈ కోవెల పశ్చిమ ముఖద్వారం కలిగి ఉండటం విశేషం. పశ్చిమదిశకు అధిపతి అయిన శనేశ్వరుడితో తనను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను పీడించవద్దని ఆదేశించేందుకే పరమేశ్వరుడు ఇక్కడ ఇలా ఉన్నాడని చెబుతారు. దేశంలో ఇలా పశ్చిమదిశగా ఉన్న శివాలయం ఒకటి కశ్మీర్‌లో ఉంటే.. రెండోది కదిలె ఆలయమే.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 రకాలైన చెట్లన్నీ కలిసి ఒకే వటవృక్షంగా ఉండటం కదిలెకున్న మరో విశేషం. మర్రి, వేప, రావి, జీడి, మద్ది, టేకు.. ఇలా 18 రకాలైన చెట్లు ఒకే వటవృక్షంగా ఉంటాయి. ఈ చెట్టు ఎన్నేళ్లదో ఎవరికీ తెలియదు. దీనిపై పరమశివుడి మెడలో ఉండే నాగుపాము ఉంటుందని, ప్రతీ అమావాస్య, పౌర్ణమి రోజున దర్శనమిస్తుందని భక్తుల నమ్మకం.
– ఆర్‌.శ్రీధర్, సాక్షి, నిర్మల్‌

Monday, 10 April 2017

కొండాకోనల్లో ... వేసవి విడిదుల్లో..!


కొండాకోనల్లో ... వేసవి విడిదుల్లో..!

లంబసింగి - దక్షిణాది కశ్మీర్‌!
తెలుగురాష్ట్రాల్లోకెల్లా అత్యంత చల్లని ప్రదేశం గురించి చెప్పుకోవాలంటే లంబసింగి తరవాతే మిగిలినవన్నీ. సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న గ్రామమే లంబసింగి. ఆంధ్రా కశ్మీరుగా పేరొందిన లంబసింగిలో డిసెంబరు - జనవరి నెలల్లో ఉష్ణోగ్రత మైనస్‌ డిగ్రీలకూ పడిపోతుంది. మిగిలిన కాలాల్లో పది డిగ్రీల సెల్సియస్‌కు మించదు. చలికాలంలో అయితే పదిగంటల తరవాతే సూర్యోదయం. చిత్రంగా ఈ వూరికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని వాతావరణం యథాప్రకారంగానే ఉంటుంది. వేసవిలో అరకులోకన్నా చల్లగా ఉండే ఈ ప్రదేశంలో ఎటు చూసినా చిక్కని పచ్చదనం పరిచినట్లే ఉంటుంది. ఈ ప్రాంతానికే కొర్ర(కర్ర)బయలు(బయట) అని పేరు. ఎవరైనా పొరబాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్థంలో అలా పిలుస్తారట. అక్కడి దట్టమైన అడవుల్లోని చెట్ల మధ్యలోంచి నడుస్తుంటే ఇంగ్లిష్‌ కవి Robert Frost చెప్పిన 
The woods are lovely, Dark and Deep. అన్న కవిత తప్పక గుర్తొస్తుంది. అక్కడున్న పొడవాటి చెట్ల మధ్యలోని చల్లని వాతావరణం కారణంగానే ఈ ప్రాంతంలో కాఫీ, మిరియాల తోటల పెంపకాన్ని చేపట్టింది అటవీశాఖ. పక్షిప్రేమికులకీ ఇది ఆటవిడుపే. పక్షుల కుహుకుహురాగాలు సందర్శకులకు వీనులవిందు కలిగిస్తుంటాయి. దీనికి 27 కిలోమీటర్ల దూరంలోనే కొత్తపల్లి జలపాత అందాలు గిలిగింతలు పెడుతుంటాయి. ఇక్కడ ఓ నాలుగు రోజులపాటు ఉండాలనుకునేవాళ్లు చింతపల్లిలో ఉండొచ్చు. చింతపల్లి నుంచి సీలేరు ఘాట్‌రోడ్డు ప్రయాణంలో మబ్బులు మనముందే పరుగులుతీస్తూ మిట్ట మధ్యాహ్నం వేళలో కూడా మంచుపడుతూ మధురానుభూతిని కలిగిస్తుంది. అందుకే వేసవిని ఆస్వాదించాలనుకునే ప్రకృతిప్రియులు లంబసింగి దారి పడుతున్నారు. కాబట్టి ఆ చల్లని ప్రదేశంలో గడపాలనుకునేవాళ్ల పాలిట స్వర్గధామం ఈ చల్లని కొండగ్రామం!

ఎలా వెళ్లాలి:
హైదరాబాద్‌ నుంచి 571, విశాఖపట్టణానికి 101, చింతపల్లికి 19, నర్సీపట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగికి బస్సు, ట్యాక్సీల్లో ప్రయాణించవచ్చు. హైదరాబాద్‌ నుంచి వెళ్లేవాళ్లు విశాఖపట్టణం వరకూ రైల్లో వెళ్లి, అక్కడ నుంచి బస్సు, ట్యాక్సీల్లో ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు.
అరకులోయ
పచ్చకోక కట్టుకున్న తూర్పుకనుమల సిగలో విరిసిన మరో ముగ్ధసింగారమే అరకులోయ. పొగమంచు జలతారు ముసుగేసుకుని, గిరిజనుల థింసా నృత్యగానాలతో పర్యటకుల్ని రారమ్మని ఆహ్వానిస్తుంటుంది. ఓ పక్క కొండల మధ్యలోంచి దూకే జలపాతాలూ మరోపక్క ఆవులిస్తున్న లోయలూ ఇంకోపక్క చీకటి సొరంగాలూ ఎటుచూసినా ప్రకృతి సుందరి అందాలే. చుట్టూ కొండలూ ఆ మధ్యలోని లోయలో విరిసిన వలిసెపూల అందాలను చూడాలంటే మాత్రం చలికాలం ప్రారంభంలోనే అరకులోయకి ప్రయాణం కట్టాలి. అడవిబిడ్డల మధ్యలో అక్కడి చల్లని వాతావరణంలో ఓ నాలుగురోజులపాటు సేదతీరాలనుకునేవాళ్లు మాత్రం ఎప్పుడైనా బయలుదేరవచ్చు. 36 సొరంగాలు దాటుకుంటూ వెళ్లే విశాఖ - అరకులోయ రైలు ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. అరకు వెళ్లే దారిలోనే ప్రాచీనకాలంనాటి బొర్రాగుహలు రాతియుగానికి తీసుకెళ్లిపోతాయి. కాలచక్రం ఓసారి గిర్రున వెనక్కి వెళ్లిపోయి, వేల సంవత్సరాల క్రితం మనిషి జాడల్ని పోల్చగలిగితే ఎంత బాగుణ్ణో అనిపించకమానదు. ఇక, అక్కడి బొంగు చికెన్‌ రుచి సరేసరి.

బొర్రా గుహల నుంచి కారు లేదా బస్సులో ఘాట్‌రోడ్డులో అరకుకు ప్రయాణం నగరజీవిలోని ఒత్తిడినంతా చేత్తో తీసేసినట్లుగా మాయం చేస్తుంది. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉండే ఎత్తైన సిల్వర్‌ ఓక్‌ చెట్లూ వాటికి పాకించిన మిరియాల పాదులూ ఆ మధ్యలోని కాఫీ పొదలూ ఎటుచూసినా ఆటవిడుపే. ఆ కాఫీ తోటలకు ఓ పక్కగా ఆగి, అక్కడి గిరిజన యువతులు అందించే కాఫీని రుచి చూడకపోతే అరకు పరిసరాల్ని అవమానించినట్లే. ఆ చల్లని కొండల్లో వేడి వేడి కాఫీ గొంతు దిగుతుంటే స్వర్గం ఎక్కడో లేదు, ఇదే అనిపించక మానదు. వంపులు తిరిగిన ఘాట్‌రోడ్డు మెలికలన్నీ దాటుకుని, విశాలమైన మైదానాన్ని తలపించే లోయలోకి అడుగుపెట్టి చుట్టూ చూస్తే ఓ వరసలో పేర్చినట్లుగా గాలికొండ, రక్తకొండ, సుంకరిమెట్ట, చిటమోంగొండి కొండలు కనువిందు చేస్తాయి. తూర్పుకనుమల్లో కెల్లా ఎత్తైన జింధగడ శిఖరం ఇక్కడే ఉంది. లోయలో నుంచి కొండల్లోకి ఒరిగిపోతున్న సూర్యాస్తమయ, సూర్యోదయ దృశ్య అందాల్ని చూసి తీరాల్సిందే. అరకులోయలో నిర్మించిన ట్రైబల్‌ మ్యూజియం, కళాగ్రామాలు గిరిపుత్రుల సంస్కృతీసంప్రదాయాలూ కళలకూ అద్దం పడతాయి. అక్కడే రంగురంగుల పూలసోయగాలూ గులాబీల గుబాళింపులతో కొలువుదీరిన పద్మనాభపురం బొటానికల్‌ గార్డెన్స్‌లో తిరుగుతుంటే సమయమే గుర్తుకురాదు.

తరవాత సరిగ్గా ఇక్కడకు 26 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న అనంతగిరి కొండల్నీ అక్కడి కాఫీతోటల్నీ ఉరకలెత్తే జలపాతాల్ని కూడా చుట్టేయ్యొచ్చు. పాడేరు వెళ్లే దారిలోని చాపరాయి, కటికి జలపాతాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఆ కొండల్లోని అందాలను వీక్షిస్తూ నాలుగురోజులు ఉండాలనుకునేవాళ్లకోసం పర్యటక శాఖ రిసార్టులతోబాటు ప్రైవేటు హోటళ్లూ లాడ్జ్‌లూ వున్నాయక్కడ. అనంతగిరికి సరిగ్గా 11 కిలోమీటర్ల దూరంలోని తైడలో జంగిల్‌బెల్స్‌ రిసార్టులోనూ సేదతీరవచ్చు. అరకులోయలోనూ ప్రభుత్వ అతిథి గృహాలతోబాటు ప్రైవేటు హోటళ్లు కూడా చాలానే ఉన్నాయి. అయితే ముందుగానే వాటిని బుక్‌ చేసుకుని వెళ్లడం మంచిది.

ఎలా వెళ్లాలి:
విశాఖపట్టణం నుంచి 132 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకుకు ఉదయాన్నే రైలు ఉంటుంది. ఆ రైల్లో బొర్రా గుహల వరకూ వెళ్లి, వాటి సందర్శన అనంతరం కాఫీతోటలమీదుగా బస్సు లేదా ప్రైవేటు వాహనంలో అరకులోయకు చేరుకోవచ్చు. తిరిగి విశాఖకు వచ్చేటప్పుడు కారు లేదా బస్సులో వస్తే ఘాట్‌రోడ్డు అందాలను వీక్షించవచ్చు.
హార్స్‌లీ హిల్స్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నైరుతీదిక్కున ఉన్న మరో చల్లని కొండ ప్రదేశమే హార్స్‌లీ హిల్స్‌. ఏడాది పొడవునా చల్లగా ఉండే ఈ ప్రాంతం చెంచు తెగలకీ పుంగనూరు ఆవులకీ పెట్టింది పేరు. ఆంధ్రా వూటీగానూ పేరొందిన దీని అసలు పేరు ఏనుగు మల్లమ్మకొండ. ఒకప్పుడు ఇక్కడ నివసించే మల్లమ్మ అనే బాలిక, ఏనుగుల్ని సంరక్షిస్తుండేదట. అక్కడ నివసించే చెంచులకి ఏదైనా జబ్బు చేస్తే మందు ఇచ్చేదట. ఉన్నట్లుండి ఒకరోజు ఆ అమ్మాయి ఆకస్మికంగా మాయమైపోవడంతో ఆమెనో దేవతగా భావించి గుడి కట్టించి పూజించసాగారట చెంచులు. అందుకే దీనికా పేరు. తరవాత కడప జిల్లా కలెక్టరుగా వచ్చిన బ్రిటిష్‌ ఆఫీసరు విలియం డి.హార్స్‌లీ ఈ ప్రాంతానికి వచ్చి అభివృద్ధి చేయడంతో ఇది హార్స్‌లీ హిల్స్‌గా స్థిరపడిపోయింది.

సముద్రమట్టానికి 4,100 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో వందలకొద్దీ పక్షిజాతులూ ఎలుగుబంట్లూ సాంబార్లూ పాంథర్లూ అడవికోళ్లూ వంటి జంతువులూ; ఎర్రచందనమూ బీడీ కుంకుడూ సీకాయా దేవదారూ వెదురూ వంటి చెట్లకు నిలయమైన కౌండిన్య వైల్డ్‌లైఫ్‌ శాంక్చ్యురీ; పర్యావరణ ఉద్యానవనమూ; మల్లమ్మ ఆలయం... ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఎత్తైన యూకలిప్టస్‌ చెట్ల నుంచి వీచే చల్లని గాలీ కాఫీ తోటల ఘుమఘుమలూ సందర్శకుల్ని మైమరిపిస్తాయి. దేశంలో జోర్బింగ్‌ క్రీడను అందించే అతికొద్ది ప్రదేశాల్లో ఇదీ ఒకటి. అయితే దీనికోసం ఒకరోజు ముందుగానే రిజర్వ్‌ చేసుకోవాలి. రాపెల్లింగ్‌, ట్రెక్కింగ్‌... వంటి ఆటలకీ ఇది నెలవే. ఇక్కడకు దగ్గరలోనే గాలిబండ, వ్యూపాయింట్‌, పడవల్లో విహరించే గంగోత్రీ సరోవరం, మదనపల్లి శివాలయాల్నీ సందర్శించవచ్చు. పర్యటకశాఖవారి హరిత అతిథి గృహాలతోబాటు ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు కూడా ఉంటాయి.

ఎలా వెళ్లాలి:
హైదరాబాద్‌ నుంచి 531 కి.మీ., తిరుపతి నుంచి 128, మదనపల్లె నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి రైలు, రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. రైల్లో వెళ్లాలనుకుంటే ములకలచెరువు స్టేషన్‌లో దిగి వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతి, మదనపల్లిల నుంచి బస్సులు తిరుగుతూనే ఉంటాయి.అనంతగిరి
వికారాబాద్‌ సమీపంలో ఉండే అనంతగిరి ఏడాది పొడవునా సందర్శించదగ్గ ప్రదేశం. నిండైన ఆకుపచ్చ చీర కట్టుకున్న ఈ సుందరసీమలో ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు మించదు. అయితే చినుకులు మొదలయ్యే సమయంలో ఇది మరింత అందంగా కనువిందు చేస్తుంటుంది. మనిషి జీవించిన అత్యంత ప్రాచీన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. ప్రాచీన గుహలూ మధ్యయుగంనాటి గుడులు పచ్చని అడవులూ జలపాతాలతో మనసును మరోలోకంలో విహరింపజేస్తుందీ ప్రదేశం. అప్పట్లో ఓ ముస్లిం చక్రవర్తి ఇక్కడ అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని కట్టించడం విశేషం. అన్నింటికన్నా ప్రాచీనకాలంనాటి ఈ ఆలయ సందర్శన భక్తులకు ఆనందపారవశ్యాన్నీ కలిగిస్తుంది. ఇక్కడి కొండల్లోనే పుట్టిన ముచికుందా నది హైదరాబాద్‌ గుండా మొత్తం 240 కిలోమీటర్లు ప్రవహించి నల్గొండజిల్లాలోని వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడికి సమీపంలోనే ఉన్న నాగసముద్ర సరోవరంలో పర్యటకులు పడవ షికారుకి వెళ్లవచ్చు. ట్రెక్కింగ్‌, క్యాంపింగ్‌..వంటివి ఎటూ ఉండనే ఉన్నాయి.

ఎలా వెళ్లాలి:
హైదరాబాద్‌కు సుమారు 90కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరికి బస్సు సౌకర్యం ఉంది. కారులోనూ బైక్‌ మీదా కూడా వెళ్లి రావచ్చు.ఇవేకాదు, అటు స్వామికార్యం ఇటు స్వకార్యం రెండూ నెరవేరాలనుకునేవాళ్ళకోసం శేషాచలకొండల్లో వెలసిన తిరుమల వెంకన్ననీ, నల్లమల కొండల్లో కొలువైన శ్రీశైల మల్లన్ననీ సందర్శించి, అక్కడి పుణ్యతీర్థాల్లో మునకలేసి, ఆ కొండగాలిలో తేలివచ్చే అడవిపూల పరిమళాల్నీ చెట్ల చల్లదనాన్నీ ఆసాంతం ఆస్వాదించి రావచ్చు. ఆధ్యాత్మిక చింతనతోబాటు ట్రెక్కింగులు చేయాలనుకునే సాహసికులకీ ఈ పుణ్యక్షేత్రాలు నిలయాలే. ఇంకెందుకు ఆలస్యం... ఆనందంగా విహరించండి!

Friday, 7 April 2017

కాశీకి..పోయాము లింగా!

కాశీకి పోయాము లింగా!


భారత్‌లో ఆధ్యాత్మిక పరమైన భక్తి భావనలు కలిగించే హిందూయాత్రా స్థలాలలో కాశీ (వారణాసి, బెనారస్) అతి విశిష్టమైన, పవిత్రమైన పుణ్య క్షేత్రంగా చెప్తుంటారు. కాశీకి పోయినోడు కాటికి పోయినట్లే అనే నానుడి మా చిన్నతనంలో వింటుండే వాళ్లం. అయితే ఈ ఆధునికయుగంలో, అద్భుతమైన శాస్త్ర, సాంకేతిక ప్రగతి సాధించిన నేటికాలంలో పై మాటలకు అర్థం లేకుండా పోయింది. భూ, వాయు మార్గాలలో పయనించి కాశీ విశ్వనాథుని దర్శించుకుని స్వల్ప సమయంలోనే క్షేమంగా తిరిగి రావచ్చు.
మా కాశీయాత్ర ఫిబ్రవరి 20 తేదీన ప్రారంభై మార్చి 3వ తేదీతో ముగిసింది. ఈ యాత్రలో కాశీతో పాటు అలహాబాద్, ప్రయాగ, గయ - బుద్ధగయ, అయోధ్య, వింధ్యాచల్ లాంటి చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశేషాలు గల ప్రాంతాలను దర్శించాం. కాశీ గోల్డెన్‌గా ప్రఖ్యాతి పొందిన ఆలయంలో జ్యోతిర్లింగాలలో ప్రప్రథమంగా వెలసిందిగా భావిస్తున్న శ్రీ విశ్వనాథుడు కాశీ విశ్వానాథునిగా ఖ్యాతి పొందాడు. మహ్మదీయులు ముఖ్యంగా ఔరంగజేబు సృష్టించిన విధ్వంసాల పరంపరను తట్టుకుని నిలిచి లక్షలాది హిందువులను వందల సంవత్సరాలుగా ఆకర్షిస్తున్నది విశ్వనాథుని జ్యోతిర్మయ శివలింగం. ఇది గొప్ప శక్తిమంత, మహిమాన్వితమైందిగా భక్తులు విశ్వసిస్తుంటారు. ఇన్ని గంగా జలాలు, ఇంత భస్మంతో సంతృప్తి చెందెదవా పరమేషా అనుకుంటూ భక్తులు పవిత్ర గంగా జలాలతో అభిషేకిస్తుంటారు. ఇటీవల పవిత్ర మహా శివరాత్రి రోజున భక్తులంతా సుమారు ఐదు గంటలు క్యూలైన్లలో నిల్చుని ఆ విశ్వనాథుని, ఆ పరమశివున్ని దర్శించుకున్నారు.

శ్రీ విశ్వనాథుని గోల్డెన్ టెంపుల్‌కు అతి సమీపంలోనే సర్వ సంపదల దాత, మాతా అన్నపూర్ణేశ్వరీ మాత ఆలయం ఉంది. మరికొంత దూరంలో లక్ష్మీ స్వరూమైన దేవి విశాలాక్షి ఆలయం ఉంది. శ్రీ విశ్వేశ్వరుని, అన్నపూర్ణాదేవిని, విశాలాక్షిని దర్శించిన వారికి ఉత్తమగతులు కలుగునని చెప్తుంటారు.

ఇవేగాక కాలభైరవ్, మాత దుర్గాదేవి, బిర్లా టెంపుల్, సారనాథ్, తులసీ మానస మందిర్, సంకట యోచన మందిర్, దుండిరాజ్ గణేష్, భారతమాత మందిర్‌లు ఉన్నాయి.

బుద్ధుడు తాను గయలో పొందిన జ్ఞానోదయ ఫలితమైన బుద్ధిజాన్ని తన శిష్యులకు బోధించిన స్థలం సారనాథ్. ఇక్కడ థాయ్‌లాండ్, చైనీస్, జపాన్, బర్మా దేశాల ఆలయాలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి ముందే బెనారస్(కాశీ)లో పండిట్ మదన్ మాలవ్యా స్థాపించిన బెనారస్ హిందు విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన విద్యా సంస్థ. ఈ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో విశ్వనాథుని టెంపుల్, విద్యాలయం స్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాలవ్యా విగ్రహం కూడా ఉన్నాయి.

సిరిగలవానికి..
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడువు పార్వతి చాలున్..
అని శ్రీనాథ కవి అన్నట్లు విశ్వనాథుని సిగలో నుంచి దుమికి పడి లేచినట్లుగా కాశీని ఒరుసుకుని ప్రవహించే గంగా నది దానికి మరింత పవిత్రతను చేకూరుస్తున్నది. బోటులో గంగానదిలో తిరుగుతూ 64 ఘాట్‌లను పరిశీలిస్తూ బోటులోనే కూర్చుని సాయంత్రం 7 గంటలకు గంగమ్మ తల్లికి సమర్పించే హారతిని తిలకించడం గొప్ప ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. అతి ముఖ్యమైందిగా చెప్పుకుంటున్న మణి కర్ణికా ఘాట్‌లో స్నానం చేశాం. ప్రధాని మోదీ వాగ్దానం చేసిన గంగానది ప్రక్షాళన ఏది? ఎక్కడ? అది ఎన్నికల వరకేనా అన్న సందేహం కలుగుతుందిప్పుడు అక్కడి పరిస్థితిని చూసినప్పుడు. మరోరోజు అలహాబాద్ ప్రయాగ ప్రయాణమై అక్కడి పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించినాం. గంగా యమున సరస్వతి నదుల సంగమ స్థలమే త్రివేణి సంగమం. ఇక్కడ గతించిన తమ పెద్దలకు పిండ ప్రదానం చేయడం ఆచారంగా వస్తుంది. అలహాబాద్‌లో మరో చారిత్రక ప్రాధాన్యం గల స్థలం.. ఆనంద్ భవన్. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1927లో దీన్ని నిర్మించారు. ఈ భవనం స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా ప్రాచుర్యం పొందింది. ఆ భవనంలో గాంధీజీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైనది. గాంధీ నివసించిన గది, నెహ్రూ గది, ఆయన తనయ ఇందిరా ప్రియదర్శిని గది వేర్వేరుగా ఉన్నాయి. ఆ రోజుల్లో వారు వాడిన వస్తువులు, రాసిన పుస్తకాలు వంటివి ఎన్నో భద్రపరిచి ఉన్నాయిక్కడ.

1963లో నెహ్రూ ప్రభుత్వంపై నాటి ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా, నెహ్రూపై నాకు గల అభిమానంతో ఈ తీర్మానాన్ని విమర్శిస్తూ నేను రాసిన ఓ ఆర్టికల్ నాటి కృష్ణా పత్రికలో అచ్చవటం, 1964 మే 27న మధ్యాహ్నం నల్లగొండలో ఆంగ్లవార్తలు విని అటు నుంచి కదలబోగా ఓ ప్రత్యేక బులెటిన్ ద్వారా ప్రధాని మరణించారన్న వార్త విని తట్టుకోలేక బోరున విలపిస్తున్న బజార్‌గుండా నా గదికి పరుగెత్తిన జ్ఞాపకాల పుటలు నా మదిలో రెపరెపలాడగా హృదయం బరువెక్కింది.

ఇంకోరోజు గయ ప్రయాణం. గయాసురుడనే రాక్షసుని పేరుతో గయ పేరు ప్రసిద్ధి నొందినట్లు చెబుతారు. ఇక్కడ వెలసిన విష్ణు పాద మందిరం, శక్తిపీఠ మంగళగిరి ఆలయం సందర్శనీయ స్థలాలు. ఇక్కడ సైతం పిండ ప్రదానం కార్యక్రమం జరుగుతుంది. నా పితృ పాదులకు పిండ ప్రదానం గావించాను.

ఇక్కడ మరో విశేషం.. గౌతముడు జ్ఞానోదయం కలిగి బుద్ధుడుగా పరిణితి చెందిన స్థలం బుద్ధగయ. బౌద్ధ ఆలయంలోని బుద్ధ విగ్రహాన్ని దేశ, విదేశీ బౌద్ధ సన్యాసులే గాక ఇతర ప్రజలు సైతం సందర్శిస్తుంటారు. థాయ్‌లాండ్, చైనా, బర్మా, శ్రీలంక, జపాన్ మొదలైన దక్షిణాసియా దేశాల బౌద్ధ సన్యాసులు ఇక్కడ కన్పిస్తుంటారు.

బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
నిరంతం ప్రతిధ్వనిస్తుంటుంది.

మేము సందర్శించిన ముఖ్య ప్రదేశం అయోధ్య. ఇక్కడ శ్రీరామ జన్మభూమి, సరయూనది, రామమందిర నమూన, శ్రీరామ పట్టాభిషేకం, హనుమాన్ మందిర్ చూడదగిన స్థలాలు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన ప్రదేశమే రామజన్మభూమి. దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన సంఘటన. అక్కడ ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ మధ్య ఆ ప్రదేశాన్ని దర్శించాం.

మేము సందర్శించిన మరి రెండు స్థలాలు.. వింధ్యాచల్, సీతామడిలో సీతాదేవి హనుమంతుని దర్శించుకున్నాం.

ఇలా సాగిన మా యాత్ర చివరగా కాశీ విశ్వనాథునికి అభిషేకం, అన్నపూర్ణా దేవికి కుంకుమార్చన, విశాలాక్షి దర్శనంతో విజయవంతంగా ముగిసింది.
డోకూరి శ్రీనివాసరెడ్డి

Sunday, 2 April 2017

అమర్‌నాథ్‌ యాత్ర

కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు 145 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో అమర్‌నాథ్‌ గుహలో భక్తులకు దర్శనమిస్తాడు భోళా శంకరుడు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గుహల్లో ఒకటి. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవున్న గుహ ఇది. హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా, సహజసిద్ధంగా ఏర్పడిన గుహ ఇది. ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా ఈ గుహ పూర్తిగా మంచు కప్పుకుని ఉంటుంది. ఆ సమయంలో మైనస్‌ 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇలాంటప్పుడు గుహను చేరుకోవటం అసాధ్యం.

జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది. మంచు కరుగుతుంటుంది. దీంతో గుహ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగే ఉంటుంది. 45 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా కరిగి అంతర్థానమవుతుంది. విచిత్ర మేమంటే గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుంది. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తుంది. అదే శివ మహత్యం అంటుంటారు భక్తులు.

ఇది మామూలు ప్రయాణం కాదు. ఓ వైపు అత్యంత లోతైన లోయలు, ఇరుకు దారులు, గుర్రాలపై తప్ప వెళ్లలేని ప్రయాణం. అయినా భక్తులు అంత దూరం వెళ్లటానికి సంకోచించరు. అదంతా కేవలం పార్వతీ ప్రియ వల్లభుడిపై ఉన్న భక్తి, కొండంత నమ్మకం.


క్షణంలో మారే వాతావరణం 
ప్రపంచంలోనే అత్యంత కష్టమైన యాత్రల్లో ఒకటిగా పేరొందిన అమర్‌నాథ్‌ యాత్రకు ఏయేటికాయేడు భక్తులు భారీగా పెరుగుతున్నారు. యాత్రకు వెళ్లే వారు చలి నుంచి రక్షణ కోసం మంకీ క్యాప్‌లు, స్వెట్టర్లు, జర్కిన్లు, బ్లౌజ్‌లు, షూ తప్పని సరి. ఎందుకంటే అక్కడ వాతావరణం క్షణాల్లో మారుతుంది. అప్పటికప్పుడే వర్షం పడి కొండ చరియలు విరిగిపడతాయి. దారి మూసుకు పోతుంది. కాళ్లు జారుతూ ఉంటాయి. అందుకే చేతిలో కర్ర, టార్చ్‌లైట్‌ ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి.

కోరికలు తీర్చే కోదండరామయ్య..!

కోరికలు తీర్చే కోదండరామయ్య..!

‘సర్వజనలోక రక్షణం, సకల పాపహరణం’గా వేదశాస్త్రాలు ఉద్ఘాటించే ఆ భద్రాద్రి సీతారాముల కల్యాణ వైభవాన్ని కళ్లారా చూసి తరించాలనుకునే భక్తులు కోకొల్లలు. దాని తరవాత అంతటి ప్రాశస్త్యాన్ని పొంది, చిన్న భద్రాద్రిగా భక్తజనం ఆదరాభిమానాలు చూరగొంటున్న మరో ఆలయం గొల్లల మామిడాడలోని శ్రీ కోదండ రామచంద్రమూర్తి దేవాలయం..!
శ్రీ రామ రామ రామేతి,
రమే రామే మనోరమే!
సహస్రనామ తత్తుల్యం,
రామనామ వరాననే!
ఈ శ్లోకం మూడుసార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం వస్తుంది అంటారు. అలాగే ఆ సీతారాముల కల్యాణాన్ని కనులారా చూసి తరించాలనుకుంటారు భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఆ మహోత్సవానికి పేరొందిన ప్రదేశం భద్రాచలమే. అయితే అందరూ ఏటా ఆరోజున భద్రాద్రికి వెళ్లలేరు కాబట్టి, ఆ రాముణ్ణే తమ వాడకు తెచ్చి, తోచిన రీతిలో కల్యాణం జరిపించే ఆచారం ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. అందులో భాగంగా వెలసినదే తూ.గో.జిల్లా, పెదపూడి మండలానికి చెందిన గొల్లల మామిడాడలోని రామాలయం. 1889లో గ్రామానికి చెందిన ద్వారంపూడి సబ్బిరెడ్డి, రామిరెడ్డి సోదరులు ఓ చిన్న ఆలయాన్ని కట్టి, అందులో చెక్క విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ తరవాత 1939లో ఆలయాన్ని నిర్మించారు. 1950లో తొమ్మిది అంతస్తులతో తూర్పువైపున గాలిగోపురం, తిరిగి 1958లో 200 అడుగుల ఎత్తులో పశ్చిమగోపురాన్నీ నిర్మించారు. ఆకాశాన్ని తాకుతున్నట్లుండే ఈ గోపురాలమీద కేవలం రామాయణ ఘట్టాలేకాదు, మహాభారత, భాగవత దృశ్యాలనూ కళ్లకు కట్టినట్లుగా చెక్కడం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయశిఖరం(విమానగోపురం)మీద బాల రామాయణ గాథను తెలిపే బొమ్మలు చెక్కారు. గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఎటువైపు నుంచి చూసినా ఈ గోపురాలు కనిపిస్తాయి. పశ్చిమగోపురం చివరి అంతస్తు ఎక్కితే 25 కిలోమీటర్ల దూరంలోని పెద్దాపురం పట్టణంలోని పాండవుల మెట్ట, 20 కి.మీ. దూరంలోని కాకినాడ కనిపిస్తుంటాయి.

అద్దాల మందిరం..!
ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా దేవుడికోసం ఓ అద్దాల మందిరాన్నీ నిర్మించడం ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత. పశ్చిమగోపురానికి ఆనుకుని 64 స్తంభాలతో పుష్పకమను పేరుతో కట్టిన మండపంమీద అలనాటి మయసభను తలపించేలా ఈ మందిరాన్ని నిర్మించారు. ఎటు వెళుతున్నామో తెలీదు. కానీ ఆ అద్దాల్లోంచి అక్కడ కొలువైన శ్రీరాముణ్ని చూడగలగడం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. మండపం చుట్టూ ఉన్న గోడలమీద ఆకర్షణీయమైన శిల్పాల్లో రామాయణ గాథ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. స్వామి కల్యాణం అనంతరం రాములవారి శ్రీపుష్పయాగాన్ని ఈ అద్దాలమందిరంలోనే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

శ్రీరామ పుష్కరిణి!
ఆలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో శ్రీరామ పుష్కరిణి ఉంది. పవిత్ర తుల్యభాగ నదీజలాలు ఇందులో ఉండేలా చూస్తారు. శ్రీరామకల్యాణానికి పుష్కరిణి నీటినే తీర్ధబిందెలతో తీసుకొచ్చి, స్వామివారి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఏటా శ్రీరాముడికి వసంతోత్సవం, చక్రస్నానాలను ఈ పుష్కరిణిలోనే నిర్వహిస్తారు. కార్తీకమాసంలో వచ్చే చిలుక ద్వాదశినాడు శ్రీరాముడి తెప్పోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

సీతారాముల కల్యాణం!
భక్తుల గుండెల్లో కొలువైన సుందర చైతన్య రూపుడైన శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత రుతువులో చైత్ర శుద్ధనవమిరోజున పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడట. అరణ్యవాస అనంతరం చైత్రశుద్ధనవమి రోజునే అయోధ్యలో సీతాసమేతుడై పట్టాభిషిక్తుడయ్యాడు. సీతారాముల కల్యాణం కూడా అదేరోజున జరిగిందని చెబుతారు. అందుకే శ్రీరామనవమిని వూరూవాడా పండగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ కల్యాణమహోత్సవానికి ఎంతో పేరుపొందిన శ్రీరామ క్షేత్రాల్లో భద్రాచలం ఒకటి. దాని తరవాత అంతటి ప్రాధాన్యం ఉన్న క్షేత్రంగా పేరొందినదే ఈ గొల్లల మామిడాడ కోదండ రామాలయం.భద్రాచలంలో చేసే పద్ధతిలోనే ఈ ఆలయంలోనూ కల్యాణ క్రతువుని జరపడం పూర్వం నుంచీ ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో మంచి ముత్యాల తలంబ్రాలనూ పట్టుబట్టలనూ బహూకరిస్తారు. వివాహమహోత్సవం అనంతరం స్వామివారి తలంబ్రాలను ప్రసాదంలా పంచుతారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి పాయసంగానీ పరమాన్నంగానీ చేసుకుని తిన్నవారికి కోరికలు తీరతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే కల్యాణానికి వచ్చిన వాళ్లంతా అక్కడ ఏర్పాటుచేసిన కౌంటర్ల నుంచి వాటిని తప్పక తీసుకువెళతారు. ఈ నెల ఐదో తేదీన జరగబోయే కల్యాణానికి కనీసం లక్షమందైనా భక్తులు వస్తారన్నది నిర్వాహకుల అంచనా. నాలుగో తేదీ నుంచే పెళ్లి పనులను ప్రారంభించి,. ఐదో తేదీన 11 గంటల నుంచి సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం స్వామి వారి కల్యాణ ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో వూరేగిస్తారు. మహాన్నదానం కూడా నిర్వహిస్తారు. చుట్టూ పచ్చని కొబ్బరితోటలూ మామిడితోపులూ వాటి మధ్యలో వరిపొలాలూ గోదావరి పిల్లకాలువలతో భూదేవి మెడలోని పచ్చలహారంలా శోభిల్లే గొల్లలమామిడాడలో ఆ కోదండరామచంద్రమూర్తి ఆలయంతోబాటు కుక్కల నారాయణస్వామి ఆలయాన్నీ సూర్యదేవాలయాన్నీ కూడా సందర్శించవచ్చు. రాజమండ్రి వరకూ రైలూ లేదా బస్సులో వెళ్లి అక్కడ నుంచి కెనాల్‌ రోడ్డు మీదుగా బస్సూ ట్యాక్సీల్లో గొల్లల మామిడాడకు చేరుకోవచ్చు.


ఆరుమిల్లి శ్రీనివాస్‌, 
న్యూస్‌టుడే, పెదపూడి.

Saturday, 1 April 2017

చార్‌ధామ్‌ యాత్ర

చార్‌ధామ్‌ యాత్ర

జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్లితీరాలని కోరుకునే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైనదైనా ప్రకృతి సోయగాలలో ప్రశాంతతను పొందాలని ఆకాంక్షించే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన ఆరాధ్య దైవాలను దర్శించి, తరించాలని తపించే యాత్ర. అదే, అతిపవిత్రమైన చార్‌ ధామ్‌ యాత్ర.

గంగోత్రి, యమునోత్రి,  బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించుకొని రావటాన్ని ‘చార్‌ధామ్‌ యాత్ర’ అంటారు. సంవత్సరంలో ఆరు నెలల పాటు దేవతలు పూజిస్తారని పేరొందిన ఈ నాలుగు ఆలయాలను మిగిలిన ఆరు నెలల కాలంలో మానవులు సందర్శించుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాల ద్వారాలు ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి నవంబర్‌లో దీపావళి పర్వదినం తర్వాత మూసివేస్తారు.  ఈ నాలుగు ఆలయాలూ ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోనే ఉన్నాయి. గంగానది, యమునా నది జన్మస్థలాలను గంగోత్రి, యుమునోత్రి అంటారు. అలాగే బద్రీనాథ్‌లో శ్రీ మహావిష్ణువు, కేదార్‌నాథ్‌లో శివుడు స్వయంభువుగా వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి.

యమునోత్రి చార్‌ధామ్‌ యాత్రలో మొదటగా దర్శించుకునే ధామం (క్షేత్రం) యమునోత్రి. యమునానది జన్మస్థలంలోనే యమునాదేవి ఆలయం ఉంది. యమునానది ప్రాశస్త్యం గురించి ఒక్కో పురాణం ఒక్కో కథను వివరిస్తున్నాయి. ప్రముఖంగా చెప్పుకునేది – సూర్యదేవుడి అర్ధాంగి ఛాయాదేవి. వీరికి యముడు, యమున సంతానం. ఛాయాదేవికి కూతురైన యమున మీద ఒకానొక సమయంలో ఆగ్రహం కలిగి భూలోకంలో ఉండమని శపించిందట. దాంతో యమున భూలోకంలో నదిగా అవతరించిందట.

గంగోత్రి చార్‌ధామ్‌ యాత్రలో సులువుగా చేరుకోగలిగే ప్రాంతం గంగోత్రి. ఈ నది జన్మస్థలం ఉత్తరాఖండ్‌లోని ఉత్సర కాశీ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. సముద్రమట్టానికి 3,750 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది. నదులన్నింటిలో గంగానది పరమపవిత్రమైనదిగా పూజలందుకుంటోంది. గోముఖం నుండి గంగోత్రి చేరే వరకు ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందువల్లే తమిళనాడు రామేశ్వరంలోని లింగేశ్వరస్వామికి నిత్యాభిషేకం గంగోత్రి నీటితోనే చేస్తారు.

కేదార్‌నాథ్‌ అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది కేదార్‌నాథ్‌. వైశాఖమాసంలో అంటే ఏప్రిల్‌ ఆఖరి వారం లేదా మే నెల మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి అక్టోబరు నెల ఆఖరి వారం లేదా నవంబరు  మొదటి వారంలో మూసివేస్తారు. నరనారాయణులు కేదారనాథుని అనుమతి తీసుకొని, బదరీనాథ్‌లో తపస్సు చేశారని స్థలపురాణం చెప్తోంది.

బద్రీనాథ్‌ జగద్గురు ఆదిశంకరుల వారు నెలకొల్పిన ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలలోని సమస్త దేవతలూ నివసిస్తారనీ నమ్మకం. ఈ ఆలయంలో వైశాఖం నుండి కార్తీక మాసం వరకు మానవులు, మార్గశిరం నుండి చైత్రమాసం చివరి వరకు నారద మహర్షి స్వామికి పూజలు చేస్తారని కథనాలు. గర్భాలయంలో ఉత్సవమూర్తితో పాటు స్వామి ఎడమవైపున నరనారాయణులు శ్రీదేవి– భూదేవి, నారదుడు, ఉద్ధవుడు... కుడివైపున కుబేరుడు, గరుత్మంతుడు కొలువుదీరి ఉన్నారు. పితరులకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

చార్‌ధామ్‌ యాత్ర ఏప్రిల్‌ చివరి వారం, మే నెలలో చేయవచ్చు.