Sunday, 23 April 2017

హిల్‌ స్టేషన్స్‌

కూల్‌ కూల్‌ హిల్‌ స్టేషన్స్‌
చలో బిలో 24


ఎండలు మండే వేసవికాలం. మిట్టమధ్యాహ్నమే కానక్కర్లేదు, పొద్దు పొడిచిన కొద్ది గంటలకే నిప్పులు చెరిగే సూర్యుడి తాకిడికి పట్టపగలే చుక్కలు కనిపించే కాలం. ఇలాంటి మండు వేసవిలో మీరూ మీ కుటుంబం 24 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న శీతల ప్రదేశాలకు వెళ్ళిరండి... వేసవిని చల్లగా గడిపేయాలనుకుంటే సరదాగా చల్లచల్లని హిల్‌ స్టేషన్లకు ఓ టూర్‌ వేసి రండి.అందరికీ తెలిసినవే కాదు, అంతగా తెలియని ప్రదేశాలను కూడా ఓసారి చూసి రండి. చూడచక్కని కూల్‌ కూల్‌ హిల్‌ స్టేషన్లను మచ్చుకు ఓ ఐదింటిని ఇక్కడ చూపిస్తున్నాం. సరదాగా ఓ లుక్కేయండి.

పాపులర్‌ హిల్‌స్టేషన్స్‌
మనదేశంలో దాదాపు వంద వరకు హిల్‌స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఊటీ, కోడైకెనాల్, సిమ్లా, నైనితాల్, ముస్సోరి, శ్రీనగర్, షిల్లాంగ్, మౌంట్‌ అబు వంటి పాపులర్‌ హిల్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇవే కాకుండా పెద్దగా ప్రాచుర్యంలోకి రాని హిల్‌ స్టేషన్లలో హిమాచల్‌లోని కుఫ్రీ, నహాన్, డార్జిలింగ్‌ చేరువలోని కాలింపాంగ్, ఉత్తరాఖండ్‌లోని కౌసాని, ఔలి, తమిళనాడులోని యెళగిరి, సిక్కింలోని పెల్లింగ్, నామ్చి, మేఘాలయలోని జోవై వంటివి చాలానే ఉన్నాయి. సాధారణ పర్యాటకులు బాగా తెలిసిన చోట్లకే వెళుతుంటారు.

అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రదేశాలను చూడాలనుకునే పర్యాటకులు ఎక్కువ మందికి తెలియని ప్రదేశాలను అన్వేషించి మరీ వెళుతుంటారు. పాపులర్‌ హిల్‌ స్టేషన్లలో వేసవిలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అలాంటి ప్రదేశాల కంటే తగిన వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండే రద్దీలేని ప్రదేశాలకు వెళ్లడమే మంచిదని పర్యాటక నిపుణుల సలహా. పడమటి కనుమల్లోనూ తూర్పు కనుమల్లోనూ చాలా హిల్‌స్టేషన్లే ఉన్నాయి. ఇవి వేసవిలో చల్లగానే ఉన్నా, హిమాలయాలకు చేరువగా ఉండే హిల్‌స్టేషన్లు మరింత చల్లగా ఉంటాయి. వేసవి మధ్యాహ్న వేళ కూడా AC టెంపరేచర్‌ను ఆస్వాదించాలంటే హిమగిరుల చెంతకు చేరుకోవాల్సిందే!కులూ - మనాలీ

ఉత్తర భారత పర్యాటకంలో కులూ మనాలీ జంట పదాలుగానే వినిపిస్తాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ రెండు పట్టణాలూ జంట పట్టణాలు కావు గానీ, ఒకదానికి మరొకటి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో అక్కడకు వెళ్లే పర్యాటకులు రెండింటినీ చూసే తిరిగి వస్తుంటారు. వేసవి విడిది కేంద్రాలుగా పేరుపొందిన ఈ పట్టణాల పరిసరాల్లో అప్పుడప్పుడు సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. హిమాలయాలకు చేరువలో సముద్ర మట్టానికి నాలుగువేల అడుగులకు పైగా ఎత్తున ఉండే కులూ మనాలీ పట్టణాలు ప్రకృతి సోయగాలకు నిలయాలు. నడివేసవిలో సైతం ఇక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పాతిక డిగ్రీలకు మించవు. వేసవిలో సైట్‌ సీయింగ్, వాకింగ్, సైక్లింగ్, ట్రెక్కింగ్‌ వంటి కార్యక్రమాలకు ఈ పట్టణాలు చాలా అనువుగా ఉంటాయి.

మనాలీ మీదుగా ప్రవహించే బియాస్‌ నదిలో బోటింగ్‌ను, ఇక్కడి పరిసరాల్లోని వేడినీటి బుగ్గల్లో జలకాలాటలను ఆస్వాదించవచ్చు. కులూ మనాలీలలో అడుగడుగునా పురాతన ఆలయాలు తారసపడతాయి. అరుదైన హిడింబ ఆలయం, శృంగి మహర్షి ఆలయం సహా పలు ప్రాచీన ఆలయాలతో పాటు ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. సుల్తాన్‌పూర్‌ ప్యాలెస్, ‘దేవతల కొలను’గా పేరుపొందిన భృగు సరోవరం, గ్రేట్‌ హిమాలయన్‌ నేషనల్‌ పార్క్, రహాలా జలపాతం, అరుదైన వన్యప్రాణులకు నిలయమైన మనాలీ అభయారణ్యం వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

ఎలా చేరుకోవాలి?
మనాలీకి 50 కిలోమీటర్ల దూరంలో భూంతార్‌ విమానాశ్రయం ఉంది. అయితే, ఢిల్లీ, చండీగఢ్‌ మినహా దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు విమానాలు దొరకవు. విమానాల్లో వెళ్లేవారు ఢిల్లీ లేదా చండీగఢ్‌ చేరుకుని, అక్కడి నుంచి మరో విమానంలో భూంతార్‌ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. కులూ మనాలీ పట్టణాలకు రైలు సౌకర్యం లేదు. వీటికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో జోగీందర్‌నగర్, 150 కిలోమీటర్ల దూరంలో పఠాన్‌కోట్‌ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఈ రెండు ప్రదేశాలకు నేరుగా రైళ్లు దొరుకుతాయి. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.
డార్జిలింగ్‌

డార్జిలింగ్‌ అంటే ఎక్కువగా తేయాకు తోటలే గుర్తుకొస్తాయి గానీ, ఇది అద్భుతమైన వేసవి విడిది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో హిమాలయాలకు దిగువన సముద్రమట్టానికి 6,700 అడుగుల ఎత్తున వెలసిన పట్టణం ఇది. ఎంతటి నడి వేసవిలోనైనా ఇక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలకు మించవు. డార్జిలింగ్‌లోని టైగర్‌ హిల్‌ నుంచి ఉత్తరానికి చూపు సారిస్తే నింగిని తాకే హిమగిరుల సొగసులను ఆస్వాదించవచ్చు. ఇక్కడి నుంచి చూస్తే మంచుతో నిండిన ఎవరెస్టు, కాంచన్‌జంగ శిఖరాలు ఇంచక్కా కనిపిస్తాయి. ఎటు చూసినా తేయాకు తోటలు, మహా వృక్షాలతో నిండిన దట్టమైన అడవుల పచ్చదనం కనువిందు చేస్తుంది. డార్జిలింగ్‌లో చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. జపానీస్‌ పీస్‌ పగోడా, భుటియా బస్టీ గోంపా వంటి బౌద్ధారామాలు, ధీర్‌ధామ్, మహాకాల్‌ ఆలయాలు, పద్మజా నాయుడు హిమాలయన్‌ జూలాజికల్‌ పార్క్, చాప్రామడి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, బార్బొటీ రాక్‌ గార్డెన్‌ వంటి ప్రదేశాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. వేసవిలో వాకింగ్, సైక్లింగ్, ట్రెక్కింగ్‌ వంటి కార్యక్రమాలకు ఇది చాలా అనువైన ప్రదేశం.

ఎలా చేరుకోవాలి?
ఢిల్లీ, కోల్‌కతా, గువాహటిల నుంచి డార్జిలింగ్‌కు నేరుగా విమాన సౌకర్యం అందుబాటులో ఉంది. దక్షిణాది నుంచి విమానాల్లో  వెళ్లేవారైతే ముందుగా కోల్‌కతా చేరుకుని అక్కడి నుంచి డార్జిలింగ్‌ వెళ్లడం తేలికగా ఉంటుంది. రైలులో వెళ్లేవారు ముందుగా న్యూజాల్‌పాయిగుడి స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి హిమాలయన్‌ రైల్వేస్‌కు చెందిన టాయ్‌ ట్రెయిన్‌లో డార్జిలింగ్‌ చేరుకోవచ్చు. అలా కాకుంటే కోల్‌కతాలో రైలు దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా కూడా చేరుకోవచ్చు.దిమా హసావో

అస్సాంలోని దిమా హసావో జిల్లా కేంద్రం హాఫ్లాంగ్‌ చూడచక్కని వేసవి విడిది కేంద్రం. స్థానిక దిమాసా భాషలో ‘హాఫ్లాంగ్‌’ అంటే ‘చీమ కొండ’ అని అర్థం. సముద్ర మట్టానికి దాదాపు మూడువేల అడుగుల ఎత్తున వెలసిన హాఫ్లాంగ్‌ పట్టణం ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. వేసవిలోనూ ఇక్కడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పాతిక డిగ్రీలకు మించవు. ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి హాఫ్లాంగ్‌ ఇట్టే ఆకట్టుకుంటుంది. హాఫ్లాంగ్‌ కొండపైన, చుట్టుపక్కల వ్యాపించిన వనాల్లో దాదాపు రెండులక్షల జాతులకు పైగా అరుదైన పూల మొక్కలు కనువిందు చేస్తాయి. ఈశాన్య గిరిజన సంస్కృతికి ఆలవాలమైన ఈ ప్రదేశం గ్లైడింగ్, పారా గ్లైడింగ్, ట్రెక్కింగ్‌ వంటి సాహస క్రీడలకు అనువుగా ఉంటుంది. హాఫ్లాంగ్‌ కొండపై ట్రెక్కింగ్, హాఫ్లాంగ్‌ సరస్సులో పడవ విహారం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పక్షులు ఆత్మహత్యలు చేసుకునే ప్రదేశంగా పేరుపొందిన జతింగా ఇక్కడకు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఏటా వర్షాకాలంలో రాత్రివేళ ఇక్కడ రకరకాల పక్షులు మూకుమ్మడిగా చనిపోతుంటాయి. దీనిపై శాస్త్రవేత్తలు ఎన్నిరకాల విశ్లేషణలు చెబుతున్నా, ఈ పరిణామం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది.

ఎలా చేరుకోవాలి?
విమానంలో వెళ్లాలనుకునే వారికి అస్సాం రాజధాని గువాహటి లేదా మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ వరకు విమాన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఇక్కడకు చేరుకోవచ్చు. గువాహటి వరకు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి వేరే రైలు పట్టుకుని హాఫ్లాంగ్‌ వరకు రైలుమార్గంలో చేరుకోవచ్చు.థండా థండా తవాంగ్‌

అరుణాచల్‌ప్రదేశ్‌లోని జిల్లాకేంద్రమైన తవాంగ్‌ పట్టణం టిబెట్‌ సరిహద్దులకు అతి చేరువగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఏకంగా పదివేల అడుగుల ఎత్తున వెలసిన ఈ పట్టణం ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. నడి వేసవిలో సైతం ఇక్కడి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలకు లోపే నమోదవుతుంటాయి. చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లతో నిండిన దట్టమైన అడవులు, కొండల మీదుగా నేల మీదకు దూకే జలపాతాలు, సరస్సులతో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఇక్కడ కనువిందు చేస్తుంది. బౌద్ధ సంస్కృతికి ఆలవాలమైన తవాంగ్‌లో తవాంగ్‌ బౌద్ధారామం, ఉర్గెలింగ్‌ గోంపా, గ్యాన్‌గోంగ్‌ అని గోంపా వంటి ఆరామాలు టిబెటన్‌ వాస్తుశైలిలో ఆకట్టుకుంటాయి. సెలా పాస్, బుమ్‌లా పాస్‌ వంటి పర్వతమార్గాలు ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. కొండలపై వెలసిన మాధురి సరస్సు, నగులా సరస్సు వంటి సరస్సులు, నురానంగ్‌ జలపాతం వంటి జలపాతాలు నిత్యం జలకళతో కనువిందు చేస్తాయి. ఇక్కడికి చేరువలోనే మంచుతో నిండిన గోరిచెన్‌ శిఖరం ఎక్కేందుకు పర్వతారోహకులు మక్కువ చూపుతారు. ఇక్కడి ఈగల్‌ నెస్ట్‌ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం జీవవైవిధ్యానికి ఆలవాలంగా ఆకట్టుకుంటుంది.

ఎలా చేరుకోవాలి?
ఇక్కడకు చేరువలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ అస్సాంలోని తేజ్‌పూర్‌లో ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 150 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించి తవాంగ్‌ చేరుకోవాల్సి ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి తేజ్‌పూర్‌ వరకు నేరుగా విమానాలు, రైళ్లు దొరకడం కష్టం. అందువల్ల గువాహటి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గం మీదుగా ఇక్కడకు చేరుకోవడం కాస్త తేలికగా ఉంటుంది.గ్యాంగ్‌టక్‌

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌ చూడ చక్కని వేసవి విడిది. గ్యాంగ్‌టక్‌ అంటే కొండకొన అని అర్థం. సముద్ర మట్టానికి దాదాపు ఐదున్నర వేల అడుగుల ఎత్తున తూర్పు హిమాలయ పర్వతశ్రేణుల మధ్య వెలసిన పట్టణం ఇది. ఏడాది పొడవునా చల్లగా ఉండే గ్యాంగ్‌టక్‌లో వేసవిలోనూ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పాతిక డిగ్రీలకు మించవు. సిక్కిం బ్రిటిష్‌ పాలనలో కొనసాగినా, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్నాళ్లు స్వతంత్ర రాజ్యంగానే కొనసాగింది. చివరకు 1975లో భారత్‌లో చేరింది. గ్యాంగటక్‌లో వివిధ హిందూ ఆలయాలతో పాటు బౌద్ధారామాలు చూడముచ్చటగా ఉంటాయి. పట్టణానికి చుట్టుపక్కల సెవెన్‌ సిస్టర్స్‌ జలపాతం సహా పలు జలపాతాలు వేసవిలో జలకాలాటలకు అనువుగా ఉంటాయి. పచ్చదనంతో అలరారే ప్రశాంతమైన గ్యాంగ్‌టక్‌ పరిసరాలు వాకింగ్, ట్రెక్కింగ్, సైట్‌ సీయింగ్‌ వంటి కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటాయి. తాషీ వ్యూ పాయింట్, గణేశ్‌ టోక్‌ వ్యూపాయింట్‌ వంటి ప్రదేశాల నుంచి గ్యాంగ్‌టక్‌ పట్టణాన్నీ, పరిసరాల్లోని అడవుల పచ్చదనాన్నీ తిలకించవచ్చు. ఇక్కడి జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచే హిమాలయన్‌ జూ పార్కు, షింగ్బా రోడో డెండ్రాన్‌ అభయారణ్యం, కాంచన్‌జంగా నేషనల్‌ పార్క్‌ వంటివి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఎలా చేరుకోవాలి?
గ్యాంగ్‌టక్‌కు నేరుగా విమాన, రైలు సౌకర్యాలేవీ అందుబాటులో లేవు. ఇక్కడకు అతి చేరువలోని విమానాశ్రయం పశ్చిమ బెంగాల్‌లోని బాగ్దోగ్రాలో ఉంది. గ్యాంగ్‌టక్‌కు ఇది సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాగ్దోగ్రా విమానాశ్రయం నుంచి గ్యాంగ్‌టక్‌కు హెలికాప్టర్లు కూడా అందుబాటులో ఉంటాయి. విమానం దిగి రోడ్డు మార్గాన రావాలనుకుంటే ట్యాక్సీలు లేదా బస్సుల్లో రావచ్చు. సమీపంలోని రైల్వేస్టేషన్‌ పశ్చిమబెంగాల్‌లోని న్యూ జాల్‌పాయిగుడిలో ఉంది. అక్కడి నుంచి సుమారు 150 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించి గ్యాంగ్‌టక్‌ చేరుకోవాల్సి ఉంటుంది.No comments:

Post a Comment