Sunday, 2 April 2017

కోరికలు తీర్చే కోదండరామయ్య..!

కోరికలు తీర్చే కోదండరామయ్య..!

‘సర్వజనలోక రక్షణం, సకల పాపహరణం’గా వేదశాస్త్రాలు ఉద్ఘాటించే ఆ భద్రాద్రి సీతారాముల కల్యాణ వైభవాన్ని కళ్లారా చూసి తరించాలనుకునే భక్తులు కోకొల్లలు. దాని తరవాత అంతటి ప్రాశస్త్యాన్ని పొంది, చిన్న భద్రాద్రిగా భక్తజనం ఆదరాభిమానాలు చూరగొంటున్న మరో ఆలయం గొల్లల మామిడాడలోని శ్రీ కోదండ రామచంద్రమూర్తి దేవాలయం..!
శ్రీ రామ రామ రామేతి,
రమే రామే మనోరమే!
సహస్రనామ తత్తుల్యం,
రామనామ వరాననే!
ఈ శ్లోకం మూడుసార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం వస్తుంది అంటారు. అలాగే ఆ సీతారాముల కల్యాణాన్ని కనులారా చూసి తరించాలనుకుంటారు భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఆ మహోత్సవానికి పేరొందిన ప్రదేశం భద్రాచలమే. అయితే అందరూ ఏటా ఆరోజున భద్రాద్రికి వెళ్లలేరు కాబట్టి, ఆ రాముణ్ణే తమ వాడకు తెచ్చి, తోచిన రీతిలో కల్యాణం జరిపించే ఆచారం ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. అందులో భాగంగా వెలసినదే తూ.గో.జిల్లా, పెదపూడి మండలానికి చెందిన గొల్లల మామిడాడలోని రామాలయం. 1889లో గ్రామానికి చెందిన ద్వారంపూడి సబ్బిరెడ్డి, రామిరెడ్డి సోదరులు ఓ చిన్న ఆలయాన్ని కట్టి, అందులో చెక్క విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ తరవాత 1939లో ఆలయాన్ని నిర్మించారు. 1950లో తొమ్మిది అంతస్తులతో తూర్పువైపున గాలిగోపురం, తిరిగి 1958లో 200 అడుగుల ఎత్తులో పశ్చిమగోపురాన్నీ నిర్మించారు. ఆకాశాన్ని తాకుతున్నట్లుండే ఈ గోపురాలమీద కేవలం రామాయణ ఘట్టాలేకాదు, మహాభారత, భాగవత దృశ్యాలనూ కళ్లకు కట్టినట్లుగా చెక్కడం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయశిఖరం(విమానగోపురం)మీద బాల రామాయణ గాథను తెలిపే బొమ్మలు చెక్కారు. గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఎటువైపు నుంచి చూసినా ఈ గోపురాలు కనిపిస్తాయి. పశ్చిమగోపురం చివరి అంతస్తు ఎక్కితే 25 కిలోమీటర్ల దూరంలోని పెద్దాపురం పట్టణంలోని పాండవుల మెట్ట, 20 కి.మీ. దూరంలోని కాకినాడ కనిపిస్తుంటాయి.

అద్దాల మందిరం..!
ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా దేవుడికోసం ఓ అద్దాల మందిరాన్నీ నిర్మించడం ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత. పశ్చిమగోపురానికి ఆనుకుని 64 స్తంభాలతో పుష్పకమను పేరుతో కట్టిన మండపంమీద అలనాటి మయసభను తలపించేలా ఈ మందిరాన్ని నిర్మించారు. ఎటు వెళుతున్నామో తెలీదు. కానీ ఆ అద్దాల్లోంచి అక్కడ కొలువైన శ్రీరాముణ్ని చూడగలగడం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. మండపం చుట్టూ ఉన్న గోడలమీద ఆకర్షణీయమైన శిల్పాల్లో రామాయణ గాథ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. స్వామి కల్యాణం అనంతరం రాములవారి శ్రీపుష్పయాగాన్ని ఈ అద్దాలమందిరంలోనే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

శ్రీరామ పుష్కరిణి!
ఆలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో శ్రీరామ పుష్కరిణి ఉంది. పవిత్ర తుల్యభాగ నదీజలాలు ఇందులో ఉండేలా చూస్తారు. శ్రీరామకల్యాణానికి పుష్కరిణి నీటినే తీర్ధబిందెలతో తీసుకొచ్చి, స్వామివారి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఏటా శ్రీరాముడికి వసంతోత్సవం, చక్రస్నానాలను ఈ పుష్కరిణిలోనే నిర్వహిస్తారు. కార్తీకమాసంలో వచ్చే చిలుక ద్వాదశినాడు శ్రీరాముడి తెప్పోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

సీతారాముల కల్యాణం!
భక్తుల గుండెల్లో కొలువైన సుందర చైతన్య రూపుడైన శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత రుతువులో చైత్ర శుద్ధనవమిరోజున పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడట. అరణ్యవాస అనంతరం చైత్రశుద్ధనవమి రోజునే అయోధ్యలో సీతాసమేతుడై పట్టాభిషిక్తుడయ్యాడు. సీతారాముల కల్యాణం కూడా అదేరోజున జరిగిందని చెబుతారు. అందుకే శ్రీరామనవమిని వూరూవాడా పండగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ కల్యాణమహోత్సవానికి ఎంతో పేరుపొందిన శ్రీరామ క్షేత్రాల్లో భద్రాచలం ఒకటి. దాని తరవాత అంతటి ప్రాధాన్యం ఉన్న క్షేత్రంగా పేరొందినదే ఈ గొల్లల మామిడాడ కోదండ రామాలయం.భద్రాచలంలో చేసే పద్ధతిలోనే ఈ ఆలయంలోనూ కల్యాణ క్రతువుని జరపడం పూర్వం నుంచీ ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో మంచి ముత్యాల తలంబ్రాలనూ పట్టుబట్టలనూ బహూకరిస్తారు. వివాహమహోత్సవం అనంతరం స్వామివారి తలంబ్రాలను ప్రసాదంలా పంచుతారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి పాయసంగానీ పరమాన్నంగానీ చేసుకుని తిన్నవారికి కోరికలు తీరతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే కల్యాణానికి వచ్చిన వాళ్లంతా అక్కడ ఏర్పాటుచేసిన కౌంటర్ల నుంచి వాటిని తప్పక తీసుకువెళతారు. ఈ నెల ఐదో తేదీన జరగబోయే కల్యాణానికి కనీసం లక్షమందైనా భక్తులు వస్తారన్నది నిర్వాహకుల అంచనా. నాలుగో తేదీ నుంచే పెళ్లి పనులను ప్రారంభించి,. ఐదో తేదీన 11 గంటల నుంచి సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం స్వామి వారి కల్యాణ ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో వూరేగిస్తారు. మహాన్నదానం కూడా నిర్వహిస్తారు. చుట్టూ పచ్చని కొబ్బరితోటలూ మామిడితోపులూ వాటి మధ్యలో వరిపొలాలూ గోదావరి పిల్లకాలువలతో భూదేవి మెడలోని పచ్చలహారంలా శోభిల్లే గొల్లలమామిడాడలో ఆ కోదండరామచంద్రమూర్తి ఆలయంతోబాటు కుక్కల నారాయణస్వామి ఆలయాన్నీ సూర్యదేవాలయాన్నీ కూడా సందర్శించవచ్చు. రాజమండ్రి వరకూ రైలూ లేదా బస్సులో వెళ్లి అక్కడ నుంచి కెనాల్‌ రోడ్డు మీదుగా బస్సూ ట్యాక్సీల్లో గొల్లల మామిడాడకు చేరుకోవచ్చు.


ఆరుమిల్లి శ్రీనివాస్‌, 
న్యూస్‌టుడే, పెదపూడి.

No comments:

Post a Comment