Tuesday, 18 April 2017

కదిలె పాపహరేశ్వరుడు

సప్తగుండాల నడుమ కదిలె పాపహరేశ్వరుడు

కదిలె పాపహరేశ్వర క్షేత్రం

సహ్యాద్రి పర్వతాల చివరి సానువుల్లో పచ్చటి అడవి అందాల ప్రకృతి ఒడిలో... మాతాన్నపూర్ణేశ్వరీ సమేతుడై వెలిసిన స్వయంభూ లింగాకారుడాయన. తండ్రి ఆజ్ఞపై తల్లి తలనరికిన పరశురాముడి మాతృహత్యా పాతకాన్ని తొలగించిన పరమ పావన క్షేత్రమిది. అదే కదిలె పాపహరేశ్వర క్షేత్రం. తన భక్తుడి పరమభక్తికి తన్మయత్వంతో ఆ స్వామి కదలడంతో ఈ ఆలయానికి.. ఈ ప్రాంతానికీ ‘కదిలె’ అని పేరొచ్చింది. తన భక్తుడిని పాపవిముక్తుడిని చేయడంతో స్వామి పాపహరేశ్వరుడయ్యాడు. దట్టమైన అడవులు.. ఎల్తైన కొండల నడుమ కొలువైన ఈ శివాలయంలో ఎన్నో విశేషాలు, వింతలు, ఏకశిలతో చేసిన శిల్పకళాకృతులు ఉన్నాయి.

అంతేకాదు, ఎల్తైన కొండలపై బండరాళ్లలో ఏడాదిపొడవునా ఎండిపోకుండా ఒకే లాంటి జలధారతో ఉండే ఋషిగుండం ప్రధానమైంది. ఇందులోనే పరశురాముడు నిత్యస్నానమాచరించి పాపన్నను పూజించాడు. పక్కపక్కనే ఉన్నా ఒకదాంట్లో వేడిగా, మరోదాంట్లో చల్లగా ఉండే సూర్య, చంద్ర గుండాలు.. పాలవలె తెల్లని నీళ్లతో గల పాలగుండం, ఎంతటి శతృత్వం ఉన్నా.. తనలో ఒక్కసారి మునిగితే అత్తాకోడళ్లను కలిపేసే అత్తాకోడళ్ల గుండం... తీర్థాన్ని తలపించే నీళ్లుగల తీర్థగుండం వీటన్నింటితో పాటు ఆవు మూతి నుంచి జలధార వచ్చే ఆవుమూతి గుండం (గో పుష్కరిణి) ఇక్కడి సప్తగుండాలు.

పాపవిముక్తుడైన పరశురాముడు
మాతృహత్యా పాతకం నుంచి తనను విముక్తుని చేయాలంటూ పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు పరశురాముడు. ఈ క్రమంలో దేశమంతటా పర్యటిస్తూ... 31 శివలింగాలను ప్రతిష్ఠించి పూజలు చేశాడు. ఇక దక్షిణ దిశగా బయలుదేరిన పరశురాముడు గోదావరి తీరప్రాంతమైన ప్రస్తుత నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలకేంద్రానికి చేరాడు. ఇక్కడనే తన తల్లి రేణుకా ఎల్లమ్మని ప్రతిష్ఠించి పూజించాడు. అనంతరం దిలావర్‌పూర్‌ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో గల ఎల్తైన కొండలను దాటుకుని వెళ్లి దట్టమైన అడవుల నడుమ లోయలాంటి ప్రదేశంలో తపస్సుకు ఉపక్రమించాడు. నల్లనిరాళ్ల మీదుగా పారుతోన్న సెలయేరు... చల్లటి, వేడి, పాల వంటి నీళ్లతో కూడిన సప్తగుండాల (చిన్న కోనేరు) కలిగిన ఈ ప్రాంతం ఆయనను అమితంగా ఆకట్టుకుంది.

అక్కడే స్వయంభూగా వెలసిన శివుణ్ణి గుర్తించిన పరశురాముడు 32వ లింగంగా పూజించాడు. ఆయన చేసిన ఘోరతపస్సుకు లింగాకారంలో ఉన్న శివుడు కదిలాడు. దీంతో పరశురాముడు‘శివయ్య కదిలె... శివయ్య కదిలె...’అంటూ పరవశించిపోయాడు. సప్తగుండాలలో స్నానంచేసి, శివయ్యను కొలవడంతో పరశురాముడి పాపమూ పోయింది. దీంతో ఈ ఆలయానికి, ప్రాంతానికి కదిలెగా... ఇక్కడి శివయ్యకు పాపహరేశ్వరుడిగా పేరొచ్చింది. ఇప్పటికీ భక్తులు ‘కదిలె పాపన్న’గా పిలుస్తారు. నాలుగువందల ఏళ్లక్రితం నిమ్మల పాలకులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

అపమృత్యుదోషాలు తొలగించే అన్నపూర్ణ
కదిలñ  పాపహరేశ్వరుడు మాతాన్నపూర్ణేశ్వరీ సమేతుడై కొలువయ్యాడు. అయ్యవారి ఆలయం వెనుకభాగంలోనే అమ్మవారు కొలువయ్యారు. మాతాన్నపూర్ణేశ్వరి దక్షిణాభిముఖంగా ఉండటం ఇక్కడి విశేషం. యమస్థానమైన దక్షిణం వైపు ఉన్న అమ్మవారిని పూజిస్తే అకాల, అపమృత్యుదోషాలు, అన్ని సమస్యలూ తొలగిపోతాయని స్థల పురాణం. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో త్రిమూర్తులూ దర్శనమిస్తారు. పాపన్న ఆలయానికి కుడివైపు బ్రహ్మ, ఎడమవైపు నటరాజ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఇక గర్భగుడికి కుడివైపు వరాహస్వామి, ఎడమవైపు విష్ణుమూర్తి ఉండటం  ఆలయ శిఖరంపై పంచముఖ శివుడి విగ్రహం ఇక్కడి ప్రత్యేకత.

ఇక్కడ ఉంది
నిర్మల్‌ జిల్లాకేంద్రం నుంచి మొత్తం 21 కిలోమీటర్ల దూరంలో కదిలె  ఆలయం ఉంది. నిర్మల్‌ నుంచి భైంసా వైపు వెళ్లే 61నంబరు జాతీయరహదారిపై నిర్మల్‌ నుంచి 15కిలోమీటర్ల దూరంలో దిలావర్‌పూర్‌ మండలకేంద్రం ఉంటుంది. అక్కడి నుంచి కదిలె 7కిలోమీటర్లు. ఈ 7కిలోమీటర్లూ ఎల్తైన గుట్టలపై వంపులతో కూడిన ఘాట్‌రోడ్లు, చుట్టూ పచ్చటి అడవులు, స్వచ్ఛమైన పల్లెల గుండా సాగుతుంది. లోయవంటి ప్రదేశంలో చుట్టూ దట్టమైన అడవిలో పాపహరేశ్వరాలయం ఉంటుంది. అభినవ శ్రీశైలంగా ప్రాశస్త్యం కలిగిన కదిలె పాపహరేశ్వారాలయంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు, నిత్యాన్నదానం ఉంటాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా విశేషంగా భక్తులు తరలి వస్తుంటారు.

ఏకశిలతో మహానంది
పరమశివుడి వాహనమైన నందీశ్వరుడు ఇక్కడ ఏకశిలలో కొలువయ్యాడు. నల్లని ఏకశిలతో అందమైన అభరణాలతో నందీశ్వరుడు ఆకట్టుకుంటాడు.

ఎలా కదలాలంటే..?
హైదరాబాద్‌ నుంచి నాగపూర్‌ వైపు వెళ్లే 44నంబరు జాతీయ రహదారిపై దాదాపు 250 కి.మీ. దూరంలో నిర్మల్‌ జిల్లా కేంద్రం ఉంటుంది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ల నుంచి నేరుగా నిర్మల్‌ జిల్లాకేంద్రానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. నిర్మల్‌ నుంచి కదిలె ఆలయం 21కి.మీ. దూరం వస్తుంది. నిర్మల్‌ నుంచి భైంసావైపు వెళ్లే 61నం. జాతీయరహదారిపై గల దిలావర్‌పూర్‌ మండలకేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి 7కి.మీ. దూరంలో గల కదిలెకు చేరుకోవచ్చు. భక్తులు సొంత వాహనాలను కదిలె ఆలయ పరిసరాల వరకూ తీసుకెళ్లవచ్చు.

పాపహరేశ్వరుడి ప్రత్యేకతలెన్నో..
కదిలెలో వెలసిన పాపహరేశ్వరాలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోని ఏ ఆలయం చూసిన తూర్పు లేదాæ.. ఉత్తరం వైపు ముఖాలను కలిగి ఉంటాయి. కానీ ఈ కోవెల పశ్చిమ ముఖద్వారం కలిగి ఉండటం విశేషం. పశ్చిమదిశకు అధిపతి అయిన శనేశ్వరుడితో తనను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను పీడించవద్దని ఆదేశించేందుకే పరమేశ్వరుడు ఇక్కడ ఇలా ఉన్నాడని చెబుతారు. దేశంలో ఇలా పశ్చిమదిశగా ఉన్న శివాలయం ఒకటి కశ్మీర్‌లో ఉంటే.. రెండోది కదిలె ఆలయమే.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 రకాలైన చెట్లన్నీ కలిసి ఒకే వటవృక్షంగా ఉండటం కదిలెకున్న మరో విశేషం. మర్రి, వేప, రావి, జీడి, మద్ది, టేకు.. ఇలా 18 రకాలైన చెట్లు ఒకే వటవృక్షంగా ఉంటాయి. ఈ చెట్టు ఎన్నేళ్లదో ఎవరికీ తెలియదు. దీనిపై పరమశివుడి మెడలో ఉండే నాగుపాము ఉంటుందని, ప్రతీ అమావాస్య, పౌర్ణమి రోజున దర్శనమిస్తుందని భక్తుల నమ్మకం.
– ఆర్‌.శ్రీధర్, సాక్షి, నిర్మల్‌

No comments:

Post a Comment