Sunday, 23 April 2017

ద్వారకాతిరుమల - తెలుగు గడ్డపైనే రెండో తిరుపతి

తెలుగు గడ్డపైనే రెండో తిరుపతి

ఎక్కడైనా ఆలయాల్లో మూల విరాట్టు విగ్రహం అంటే ఒక్కటే ఉంటుంది. ఆ దేవతా మూర్తికి ఏడాదికి ఒక్కసారే బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు. కానీ గర్భాలయంలో రెండు మూల విరాట్టులు నిత్యం పూజలందుకోవడం, ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగడం ద్వారకా తిరుమల ప్రత్యేకత. చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఆ క్షేత్ర విశిష్టత ఎంతో.


ద్వారక మహర్షి అనే ముని కృష్ణా, గోదావరి నదుల మధ్యగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలోని శేషాచల కొండపై ఘోరతపస్సు చేసి వేంకటేశ్వరస్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన స్వామివారు ఏ వరం కావాలని అడగ్గా ‘మీ పాద సేవ చాలు’ తండ్రీ అని చెప్పాడట ద్వారక మహర్షి. అతడి కోరిక మేరకు వేంకటేశ్వర స్వామి అక్కడ స్వయంభూగా వెలిశాడు. అయితే, ద్వారక మహర్షి చాలాకాలం తపస్సు చేసిన కారణంగా ఆయన చుట్టూ పుట్ట ఏర్పడటంతో స్వామి వారి పాదాలు పుట్టలో ఉండిపోయి ఉదరం నుంచి పై భాగం మాత్రమే దర్శనమిచ్చేదట. దాంతో భక్తులు స్వామివారిని కొలిచేందుకు కుదిరేదికాదు. కాలాంతరంలో ఇతర రుషులు ‘విష్ణు ఆరాధనలో పాదసేవయే కదా ప్రాధాన్యమని... పాదసేవ లేకుండా పూజ ఎలా చేయాలని’ ఆ శ్రీవారిని వేడుకోగా మరొక మూర్తిని ప్రతిష్ఠింపచేయవలసిందిగా ఆనతి ఇచ్చారట. దీంతో రుషులు సర్వాంగ సుందరమైన మరొక విగ్రహాన్ని తిరుమల నుంచి ప్రత్యేక పూజలతో తీసుకువచ్చి స్వయంభూగా వెలసిన స్వామి వారి విగ్రహం వెనుకభాగంలో పాదసేవ కోసం ప్రతిష్ఠించారు. అలా ద్వారకా తిరుమల గర్భాలయంలో రెండు ధృవ మూర్తులుగా స్వామివారు దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి ఎనలేని విశిష్టతను తెచ్చిపెట్టింది. ద్వారక మహర్షి తపస్సు ఫలితంగా ఆవిర్భవించిన విగ్రహమూ, తిరుమల నుంచి తెచ్చిన విగ్రహమూ ఉండడం వలన రెండు పేర్లతో ఈ క్షేత్రం ద్వారకాతిరుమలగా ప్రసిద్ధి చెందింది. స్థానికులు ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతి అనీ పిలుస్తారు. ఏ కారణం వల్లైనా తిరుపతి వెళ్లలేని స్థానిక భక్తులు అక్కడి స్వామివారికి మొక్కుకున్న మొక్కుబడులనూ కానుకల్నీ ఇక్కడి స్వామికి సమర్పించడం కూడా అనాదిగా వస్తోంది. రెండు మూల విరాట్టులు ఉన్న కారణంతోనే ద్వారకా తిరుమలలో ఏడాదికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీ. స్వయంభూగా వెలసిన స్వామివారికి వైశాఖ మాసంలోనూ, తిరుపతి నుంచి తెచ్చి ప్రతిష్ఠించిన స్వామి వారికి ఆశ్వయుజ మాసంలోనూ ఏ సంవత్సరంలోనైనా వైశాఖ మాసం గానీ, ఆశ్వయుజ మాసం గానీ అధిక మాసం వస్తే అప్పుడు మరొకసారీ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

దక్షిణ ముఖంగా స్వామి వారు
దేవాలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలు తూర్పు ముఖంగా లేదా పశ్చిమ ముఖంగా ఉంటాయి. కానీ స్వామి వారు దక్షిణ ముఖంగా ఉండడం ద్వారకా తిరుమల ఆలయానికున్న మరో ప్రత్యేకత. ద్వారక మహర్షి ఉత్తర దిక్కుగా ఉండి తపస్సు చేసినందువల్ల వేంకటేశ్వర స్వామి ఆయనకు ఎదురుగా ప్రత్యక్షం కావడంతో ఇక్కడి స్వామి వారు దక్షిణాభిముఖంగా ఉన్నారు.

సామాన్యంగా దేవాలయాల్లో నిత్యం స్నపన తిరుమంజనం(అభిషేకం) చేస్తారు. కానీ ద్వారకాతిరుమల క్షేత్రంలో మూల విరాట్టులకు ఎప్పుడూ స్నపనమాచరించరు. ‘స్వామివారి విగ్రహం కింద ద్వారక మహర్షి తపమాచరించిన పుట్ట ఇప్పటికీ ఉందట. అందుకే, అనుకోకుండా విగ్రహం దగ్గర నీటి చుక్క పడితే స్థానికంగా కొణుజులు అని పిలిచే తేనె రంగు చీమలు విపరీతంగా బయటకు వచ్చేస్తాయి. ఈ కారణంతోనే ఇక్కడి స్వామివారికి స్నపన తిరుమంజనం నిషేధించారు. స్వామి వారికి అభిషేకం లేకపోవడంతో అమ్మవార్లకు సైతం తిరుమంజనం జరగటం లేదు’ అంటారు ఆలయ ప్రధానార్చకులు రాంబాబు.

త్రేతాయుగం నుంచే
ఇక్కడి స్వామివారు త్రేతాయుగం నాటికే ఉన్నట్లు బ్రహ్మపురాణం ఆధారాలు చెబుతున్నాయి. పూర్వం శ్రీరాముని పితామహుడు అజ మహారాజు ఇందుమతిని వివాహం చేసుకునేందుకు వెళుతూ ముందుగా స్వామివారిని దర్శించుకోవాలనుకున్నారట. అయితే వివాహానికి ఆలస్యమవుతుందని దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోవటం, ఇందుమతిని వివాహం చేసుకోవటం జరిగింది. అయితే, అద్భుత సౌందర్యరాశి అయిన ఇందుమతిని అజమహారాజు పరిణయ మాడటంతో ఇతర రాజులకు ఈర్ష్య కలిగి ఆయనపై దండెత్తారు. అప్పుడు కుల గురువైన వశిష్ట మహర్షి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోకపోవడంతో కలిగిన కష్టమే ఇది అని సెలవిచ్చారట. దాంతో అజమహారాజు సతీసమేతంగా ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడంతో కష్టాలు తొలగిపోయాయన్నది బ్రహ్మ పురాణంలో ఉంది.

ప్రస్తుతం ఉన్న ఆలయంతో పాటు ఇతర నిర్మాణాలన్నీ నూజివీడు జమీందారు ధర్మాప్పారావు కట్టించారు. ఆయనే ఆలయ విమానం, గోపురాలు, ప్రాకారాలు, మండపాలు పునఃనిర్మాణం చేసినట్లుగా చెబుతారు. స్వామిని దర్శించి అంతరాలయం నుంచి బయటకు రాగానే కుడిపక్కన అలివేలు మంగతాయారు, ఆండాళ్‌ అమ్మవార్లను(శ్రీదేవి, భూదేవి) దర్శించవచ్చు. ఇక్కడి వెంకన్న స్వామికి అభిముఖంగా గరుడ, ఆంజనేయస్వామి వార్ల సన్నిధితో పాటు ఉత్తర గోపురం, ఈశాన్య మండపానికి మధ్యలో సూత్రవతీ సమేత విష్వక్సేన స్వామి మందిరాలూ ఉంటాయి. స్వామి వారికి నిత్యార్జిత కల్యాణం సైతం నిర్వహిస్తున్నారు. దేవస్థానం ట్రస్టు ద్వారా భక్తులకు నిత్యం అన్నదానం చేస్తున్నారు. విరాళాలు, తలనీలాలు ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏడాదికి రూ.43కోట్ల ఆదాయం వస్తోంది. వీటితో భక్తులకు సకల సౌకర్యాలూ కల్పిస్తున్నారు.

ఎ.దుర్గాప్రసాద్‌.
బి.బ్రహ్మయ్య

No comments:

Post a Comment