Sunday, 23 April 2017

భక్తులను అనుగ్రహించే బొజ్జగణపతి ఆలయం

కేరళలో అనంత సంపదలకు అధినేత అయిన అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి అందరికీ తెలుసు కానీ, ఆ ఆలయానికి అతి సమీపంలోనే ఉన్న గణపతి ఆలయం గురించి తెలిసింది అతి కొద్దిమందికే. అతి పురాతనమైన ఈ ఆలయంలో స్వామివారి మూలమూర్తి అన్ని ఆలయాలలో కనిపించేలా ఎడమ కాలును పైకి మడిచి కూర్చున్న భంగిమలో కాకుండా కుడికాలిని పైకి మడిచి ఎడమకాలిని కిందికి పెట్టి భిన్నంగా కనిపించడం ఒక విశేషం కాగా, కేరళ ఆలయాలకు భిన్నంగా తమిళనాడు రీతిన కట్టడంతో, చిన్న ఆవరణలోనే మహాగణపతి కొలువుదీరడం మరో విశేషం. మహా మహిమాన్వితుడిగా పేరున్న ఈ స్వామివారి ఆలయ ప్రాంగణంలో కోరికలెన్నో కోరుకుని అవి తీరాక కొబ్బరికాయలు కొడుతూ కనిపించే భక్తజనులు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటారు.

తమిళనాడులోని కన్యాకుమారికి సమీపంలో నాగర్‌కోయిల్‌ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో గల పద్మనాభపురం అప్పట్లో కేరళ రాజధాని. ఇరవి వర్మ కులశేఖర పెరుమాళ్‌ అనే రాజు పద్మనాభపురంలో రాజభవనాన్ని నిర్మించాడు. ఆ రాజభవన ప్రాంగణంలోనే చిన్నపాటి గణపతి ఆలయం ఉండేది.

గణపతికి మొక్కిన తర్వాతే దండయాత్రలకు, వేటకు, ఇతర దేశయాత్రలకు బయలుదేరేవారు ఎవరైనా ఆ కాలంలో. తదనంతర కాలంలో రాజా మార్తండవర్మ ట్రావెన్‌కోర్‌ రాజవంశాన్ని పద్మనాభదాసులుగా ప్రకటించి, అనంతుడు వెలసిన పురానికి రాజధానిని మార్చాడు. 1795వ సంవత్సరంలో శ్రీ మహాగణపతిని కూడా సాదరంగా తోడుకొని వచ్చి, పళవంగాడుగా పిలుచుకునే ఆ కోట తూర్పు భాగంలో పునఃప్రతిష్ఠించారు.ఆనాటినుంచి పళవంగాడు మహాగణపతిగా భక్తుల కోర్కెలను నెరవేరుస్తున్నాడు స్వామి.

ఆలయ విశేషాలు
ఆలయ గోపురానికి నల్లరంగు వేయడంతో దూరానికే కొట్టవచ్చినట్లుగా, ప్రత్యేకంగా కనిపిస్తుంది ఆలయం. ఆలయంలో మండపాలెన్నో ఉన్నాయి. రహదారి మీద ఉండే చిన్న రాజగోపురం గుండా ప్రాంగణంలోకి ప్రవేశిస్తే, మండప స్తంభాలపైన ఎంతో రమణీయంగా చెక్కిన శ్రీ లక్ష్మీ సరస్వతీ విగ్రహాలు, ఇతర మూర్తులు దర్శనమిస్తాయి. అన్నింటికీ మించి ముఖమండపం గోడలపైన శిల్పసౌందర్యంలో ఒకదానికొకటి పోటీపడుతున్నట్లుగా చెక్కి ఉన్న 32 రకాలైన గణపతి చిత్రాలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఇవిగాక ఉపాలయాలెన్నో ఉన్నాయి. వాటిలో దుర్గాదేవి, ధర్మశాస్త్త్ర, నాగరాజు ఆలయాలు తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటాయి.

నాడు రాజులకు మాత్రమే.. నేడు పేదలకు కూడా
అలనాడు ట్రావెన్‌కోర్‌ రాజవంశీకుల పూజలందుకున్న పళవంగాడు మహాగణపతి నేడు పేదలకు కూడా దర్శనమిస్తూ, వారి కోర్కెలు తీరుస్తూ, మొక్కులనూ సంతోషంగా స్వీకరిస్తున్నాడు. కొబ్బరికాయలపైన తనకున్న మక్కువను తీర్చుకుంటున్నాడు మహాగణపతి.

పూజలూ... ఉత్సవాలూ
రోజూ ఉదయం నాలుగున్నర గంటలకు ఆలయ ద్వారాలు తెరచిన వెంటనే భక్తులకు నిర్మాల్య దర్శనం కల్పిస్తారు. అనంతరం ఉషఃకాలపూజ, నైవేద్యం, ఉచ్చపూజ, దీపారాధనలతో సహా మొత్తం 21 రకాల పూజాకైంకర్యాలు జరుగుతాయి. ప్రతినెలా సంకటహరచతుర్థి పూజ, హస్తానక్షత్ర పూజ, ప్రత్యేకపూజ, హోమాలు నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే గణపతి హోమానికి ఎంతో గొప్ప పేరు. ప్రతి సంవత్సరం గణేశ చతుర్థి, ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలు, మాఘమాసంలో అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్ష చతుర్థినాడు జరుపుకునే వినాయక వరద చతుర్థి అంగరంగవైభవంగా జరుగుతాయి.

ఎలా వెళ్లాలి?
దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి తిరువనంతపురం వరకు బస్సులు, రైళ్లు ఉన్నాయి. తిరువనంతపురం సెంట్రల్‌ రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లకు అతి సమీపంలో గల ఈ ఆలయానికి వెళ్లడం చాలా సులభం.

ఇతర ప్రదేశాలు...
అనంతపద్మనాభస్వామి ఆలయం, కుంటాలలో గల మరో అనంతుని ఆలయం, ఇంకా కేరళ రాజవంశీకులున్న కోట... అసలు కేరళలో అడుగుపెట్టడమే భూలోక స్వర్గానికి స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది. మహామహిమాన్వితుడైన పళవంగాడు మహాగణపతి ఆలయ సందర్శనం అనంతమైన ఫలాలనిస్తుందని విశ్వాసం.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

No comments:

Post a Comment