Friday, 7 April 2017

కాశీకి..పోయాము లింగా!

కాశీకి పోయాము లింగా!


భారత్‌లో ఆధ్యాత్మిక పరమైన భక్తి భావనలు కలిగించే హిందూయాత్రా స్థలాలలో కాశీ (వారణాసి, బెనారస్) అతి విశిష్టమైన, పవిత్రమైన పుణ్య క్షేత్రంగా చెప్తుంటారు. కాశీకి పోయినోడు కాటికి పోయినట్లే అనే నానుడి మా చిన్నతనంలో వింటుండే వాళ్లం. అయితే ఈ ఆధునికయుగంలో, అద్భుతమైన శాస్త్ర, సాంకేతిక ప్రగతి సాధించిన నేటికాలంలో పై మాటలకు అర్థం లేకుండా పోయింది. భూ, వాయు మార్గాలలో పయనించి కాశీ విశ్వనాథుని దర్శించుకుని స్వల్ప సమయంలోనే క్షేమంగా తిరిగి రావచ్చు.
మా కాశీయాత్ర ఫిబ్రవరి 20 తేదీన ప్రారంభై మార్చి 3వ తేదీతో ముగిసింది. ఈ యాత్రలో కాశీతో పాటు అలహాబాద్, ప్రయాగ, గయ - బుద్ధగయ, అయోధ్య, వింధ్యాచల్ లాంటి చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశేషాలు గల ప్రాంతాలను దర్శించాం. కాశీ గోల్డెన్‌గా ప్రఖ్యాతి పొందిన ఆలయంలో జ్యోతిర్లింగాలలో ప్రప్రథమంగా వెలసిందిగా భావిస్తున్న శ్రీ విశ్వనాథుడు కాశీ విశ్వానాథునిగా ఖ్యాతి పొందాడు. మహ్మదీయులు ముఖ్యంగా ఔరంగజేబు సృష్టించిన విధ్వంసాల పరంపరను తట్టుకుని నిలిచి లక్షలాది హిందువులను వందల సంవత్సరాలుగా ఆకర్షిస్తున్నది విశ్వనాథుని జ్యోతిర్మయ శివలింగం. ఇది గొప్ప శక్తిమంత, మహిమాన్వితమైందిగా భక్తులు విశ్వసిస్తుంటారు. ఇన్ని గంగా జలాలు, ఇంత భస్మంతో సంతృప్తి చెందెదవా పరమేషా అనుకుంటూ భక్తులు పవిత్ర గంగా జలాలతో అభిషేకిస్తుంటారు. ఇటీవల పవిత్ర మహా శివరాత్రి రోజున భక్తులంతా సుమారు ఐదు గంటలు క్యూలైన్లలో నిల్చుని ఆ విశ్వనాథుని, ఆ పరమశివున్ని దర్శించుకున్నారు.

శ్రీ విశ్వనాథుని గోల్డెన్ టెంపుల్‌కు అతి సమీపంలోనే సర్వ సంపదల దాత, మాతా అన్నపూర్ణేశ్వరీ మాత ఆలయం ఉంది. మరికొంత దూరంలో లక్ష్మీ స్వరూమైన దేవి విశాలాక్షి ఆలయం ఉంది. శ్రీ విశ్వేశ్వరుని, అన్నపూర్ణాదేవిని, విశాలాక్షిని దర్శించిన వారికి ఉత్తమగతులు కలుగునని చెప్తుంటారు.

ఇవేగాక కాలభైరవ్, మాత దుర్గాదేవి, బిర్లా టెంపుల్, సారనాథ్, తులసీ మానస మందిర్, సంకట యోచన మందిర్, దుండిరాజ్ గణేష్, భారతమాత మందిర్‌లు ఉన్నాయి.

బుద్ధుడు తాను గయలో పొందిన జ్ఞానోదయ ఫలితమైన బుద్ధిజాన్ని తన శిష్యులకు బోధించిన స్థలం సారనాథ్. ఇక్కడ థాయ్‌లాండ్, చైనీస్, జపాన్, బర్మా దేశాల ఆలయాలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి ముందే బెనారస్(కాశీ)లో పండిట్ మదన్ మాలవ్యా స్థాపించిన బెనారస్ హిందు విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన విద్యా సంస్థ. ఈ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో విశ్వనాథుని టెంపుల్, విద్యాలయం స్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాలవ్యా విగ్రహం కూడా ఉన్నాయి.

సిరిగలవానికి..
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడువు పార్వతి చాలున్..
అని శ్రీనాథ కవి అన్నట్లు విశ్వనాథుని సిగలో నుంచి దుమికి పడి లేచినట్లుగా కాశీని ఒరుసుకుని ప్రవహించే గంగా నది దానికి మరింత పవిత్రతను చేకూరుస్తున్నది. బోటులో గంగానదిలో తిరుగుతూ 64 ఘాట్‌లను పరిశీలిస్తూ బోటులోనే కూర్చుని సాయంత్రం 7 గంటలకు గంగమ్మ తల్లికి సమర్పించే హారతిని తిలకించడం గొప్ప ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. అతి ముఖ్యమైందిగా చెప్పుకుంటున్న మణి కర్ణికా ఘాట్‌లో స్నానం చేశాం. ప్రధాని మోదీ వాగ్దానం చేసిన గంగానది ప్రక్షాళన ఏది? ఎక్కడ? అది ఎన్నికల వరకేనా అన్న సందేహం కలుగుతుందిప్పుడు అక్కడి పరిస్థితిని చూసినప్పుడు. మరోరోజు అలహాబాద్ ప్రయాగ ప్రయాణమై అక్కడి పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించినాం. గంగా యమున సరస్వతి నదుల సంగమ స్థలమే త్రివేణి సంగమం. ఇక్కడ గతించిన తమ పెద్దలకు పిండ ప్రదానం చేయడం ఆచారంగా వస్తుంది. అలహాబాద్‌లో మరో చారిత్రక ప్రాధాన్యం గల స్థలం.. ఆనంద్ భవన్. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1927లో దీన్ని నిర్మించారు. ఈ భవనం స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా ప్రాచుర్యం పొందింది. ఆ భవనంలో గాంధీజీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైనది. గాంధీ నివసించిన గది, నెహ్రూ గది, ఆయన తనయ ఇందిరా ప్రియదర్శిని గది వేర్వేరుగా ఉన్నాయి. ఆ రోజుల్లో వారు వాడిన వస్తువులు, రాసిన పుస్తకాలు వంటివి ఎన్నో భద్రపరిచి ఉన్నాయిక్కడ.

1963లో నెహ్రూ ప్రభుత్వంపై నాటి ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా, నెహ్రూపై నాకు గల అభిమానంతో ఈ తీర్మానాన్ని విమర్శిస్తూ నేను రాసిన ఓ ఆర్టికల్ నాటి కృష్ణా పత్రికలో అచ్చవటం, 1964 మే 27న మధ్యాహ్నం నల్లగొండలో ఆంగ్లవార్తలు విని అటు నుంచి కదలబోగా ఓ ప్రత్యేక బులెటిన్ ద్వారా ప్రధాని మరణించారన్న వార్త విని తట్టుకోలేక బోరున విలపిస్తున్న బజార్‌గుండా నా గదికి పరుగెత్తిన జ్ఞాపకాల పుటలు నా మదిలో రెపరెపలాడగా హృదయం బరువెక్కింది.

ఇంకోరోజు గయ ప్రయాణం. గయాసురుడనే రాక్షసుని పేరుతో గయ పేరు ప్రసిద్ధి నొందినట్లు చెబుతారు. ఇక్కడ వెలసిన విష్ణు పాద మందిరం, శక్తిపీఠ మంగళగిరి ఆలయం సందర్శనీయ స్థలాలు. ఇక్కడ సైతం పిండ ప్రదానం కార్యక్రమం జరుగుతుంది. నా పితృ పాదులకు పిండ ప్రదానం గావించాను.

ఇక్కడ మరో విశేషం.. గౌతముడు జ్ఞానోదయం కలిగి బుద్ధుడుగా పరిణితి చెందిన స్థలం బుద్ధగయ. బౌద్ధ ఆలయంలోని బుద్ధ విగ్రహాన్ని దేశ, విదేశీ బౌద్ధ సన్యాసులే గాక ఇతర ప్రజలు సైతం సందర్శిస్తుంటారు. థాయ్‌లాండ్, చైనా, బర్మా, శ్రీలంక, జపాన్ మొదలైన దక్షిణాసియా దేశాల బౌద్ధ సన్యాసులు ఇక్కడ కన్పిస్తుంటారు.

బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
నిరంతం ప్రతిధ్వనిస్తుంటుంది.

మేము సందర్శించిన ముఖ్య ప్రదేశం అయోధ్య. ఇక్కడ శ్రీరామ జన్మభూమి, సరయూనది, రామమందిర నమూన, శ్రీరామ పట్టాభిషేకం, హనుమాన్ మందిర్ చూడదగిన స్థలాలు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన ప్రదేశమే రామజన్మభూమి. దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన సంఘటన. అక్కడ ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ మధ్య ఆ ప్రదేశాన్ని దర్శించాం.

మేము సందర్శించిన మరి రెండు స్థలాలు.. వింధ్యాచల్, సీతామడిలో సీతాదేవి హనుమంతుని దర్శించుకున్నాం.

ఇలా సాగిన మా యాత్ర చివరగా కాశీ విశ్వనాథునికి అభిషేకం, అన్నపూర్ణా దేవికి కుంకుమార్చన, విశాలాక్షి దర్శనంతో విజయవంతంగా ముగిసింది.
డోకూరి శ్రీనివాసరెడ్డి

No comments:

Post a Comment