Tuesday, 30 May 2017

అలంపూర్‌ జోగుళాంబ


అలంపురం జోగుళాంబ

అలంపురం జోగులాంబ (యోగులాంబ యోగాంబ) అష్ఠాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం. సతీదేవి ఊర్ధ్వదంత పంక్తి ఈ ప్రదేశంలో పడింది. ఈమె బాల బ్రహ్మేశ్వర స్వామి శక్తి.

జోగులాంబ మహాదేవి / రుద్రవీక్షణ లోచన //
అలంపురీస్థితా మాతా / సర్వార్ధఫలసిధ్ధిద //

అలంపూర్ ఎక్కడ ఉంది?హైదరాబాదు నుండి కర్నూలు వెళ్ళే దారిలో కర్నూలుకి 12 కి.మి ముందు వచ్చే అలంపూర్ అడ్డరోడ్ నుండి 10కి.మి ఎడమకు ప్రయాణిస్తే అలంపూర్ అనే చిన్న గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో వాయువ్య దిక్కున తుంగభద్రానది ఒడ్డున జోగుళాంబ అమ్మవారి గుడి ఉంది.

పాతకాలం నాటి జోగులాంబ గుడి 14వ శతాబ్దంలో బహమని సుల్తాన్ల దాడిలో శిధిలమయినది. కాగా, అమ్మవారి విగ్రహాన్ని మరియు అమ్మవారి శక్తులయిన చండి మరియు ముండి విగ్రహాలను బాల బ్రహ్మేశ్వర స్వామి గుడిలో 2005 వరకు భద్రపరిచి ఉంచారు. ప్రస్తుతము శిథిలం కావించబడిన ప్రదేశంలోనే తిరిగి అమ్మవారి గుడిని పునర్నిర్మించారు. క్రొత్త గుడి చాల చక్కగా, అందంగా నిర్మించారు. అమ్మవారి గుడి చుట్టూ ఒక నీటి కోనేరు కట్టారు. ఆ గ్రామస్తులు చెప్పేదాని ప్రకారం జోగులాంబ అమ్మవారు చాలా ఉగ్రమయిన శక్తి స్వరూపిణి. కాబట్టి ఆ కోనేరు ఆమెను శాంత పరుస్తూంటుంది.

అలంపురం జోగులాంబ విగ్రహం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈమె కుర్చోని ఉంటుంది. తలలో చాలా జుట్టు ఉంటుంది. ఆ జుట్టులో బల్లి, తేలు, గబ్బిలం మరియు మనిషి పుఱ్ఱె ఉంటాయి.

సప్తమాతృకల విగ్రహాలు, విఘ్నేశ్వరుడు, మరియు వీణాపాణి వీరభధ్రుడు విగ్రహాలు గుడిలో ఉన్నాయి. పూర్వకాలపు చండి మరియు ముండి విగ్రహాలు బాల బ్రహ్మేశ్వర స్వామి గుడిలోనే ఉంచారు. క్రొత్తవాటిని తయారు చేసి అమ్మవారి గుడిలో ప్రతిష్టించారు.

అలంపురంను City of Temples అని పిలుస్తారు. ఈ ఊరులో పురాతనమయిన గుళ్ళు చాలా ఉన్నాయి. ఆ గుళ్ళు అన్ని కూడా శిల్పకళకు ప్రసిధ్ధి గాంచాయి. ప్రస్తుతం ఆ గుళ్ళు అన్నీ కూడా ఆర్కియాలజి డిపార్ట్ మెంట్ వారి ఆధీనంలో ఉన్నాయి. అన్ని గుళ్ళు కూడా తుంగభద్రా నది ఒడ్డున ఉన్నాయి. వాటిలో నవబ్రహ్మ ఆలయాలు మరియు కంచి కామక్షి అమ్మవారి గుళ్ళు ముఖ్యమైనవి.అదిగో అలంపురం

తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠం అలంపూర్‌ జోగుళాంబ ఆలయం. ఇది గద్వాల్‌ పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో, కర్నూలు జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల చేరువలో ఉంది. ఇక్కడి శిల్పసౌందర్యాన్ని వీక్షించడానికి దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడం విశేషం. అన్ని క్షేత్రాలకు, ఆలయాలకు సంప్రదాయాలకు భిన్నంగా షణ్మతాలకు నిలయంగా అలంపురం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం దక్షిణకాశీ, పరశురామ క్షేత్రం, భాస్కర క్షేత్రంగా భాసిల్లుతోంది.

నవబ్రహ్మ ఆలయాలు ఇవి
ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా అలంపూరంలో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన విగ్రహాలు ఉండటం, వాటికి నిత్యం ఆగమ సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించడం కూడా విశేషం. భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే వారణాశి, (కాశీ)ని సందర్శించిన ఫలితం లభిస్తుందని స్కాంద పురాణం చెప్తోంది. నవబ్రహ్మల ఆలయాలన్నీ శివాలయాలే. బ్రహ్మ ప్రతిష్ఠించిన కారణంగా ఆ పేరు వచ్చింది.

ప్రధాన ఆలయంలో శ్రీ బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతామూర్తి. కాశీలో విశ్వేశ్వరుడు, అలంపూర్‌లో బాలబ్రహ్మేశ్వరుడు వెలసి ఉన్నారు. అక్కడ కాశీ... ఇక్కడ హేమలాపురం. అలంపురం పూర్వనామం హేమలాపురం. అయితే ఇది కాలక్రమేణా రూపాంతరం చెందుతూ హేమలాపురం, హతంపురం, యోగుళాపురం, జోగుళాపురం అని రూపాంతరం చెందుతూ ప్రస్తుతం అలంపురం క్షేత్రంగా వ్యవహారంలోకి వచ్చింది. కాశీలో ఉత్తరవాహిని గంగానది... అయితే అలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్రా నది. కాశీలో ఉన్నట్లే అలంపురంలో కూడా 64 స్నాన ఘట్టాలు ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠంగా జోగుళాంబ దేవి అలంపురంలో వెలసి ఉన్నారు.

గోష్పాద ముద్రిత లింగం!
సర్వసాధారణంగా లింగాలు స్థూపాకారంగా ఉంటాయి. కానీ అలంపుర క్షేత్రంలో మాత్రం బాలబ్రహ్మేశ్వరుడు గోష్పాద ముద్రిత రసాత్మక లింగంగా వెలసి ఉన్నాడు. ఆవుపాదం మోపితే ఎలాంటి ఆకృతి ఉంటుందో అదే ఆకృతిలో ఇక్కడ విగ్రహం వెలసి ఉంటుంది. పూర్వం ఈ విగ్రహంలో అనేకమైన రసాలు వెలువడుతుండగా రస సిద్ధులు కొందరు ‘పరశువేది’ అనే మూలిక సహాయంతో ఆ రసాలను మిళితం చేస్తూ ఈ విగ్రహంలో నుండి బంగారాన్ని తయారు చేశారు. తద్వారా ఆ బంగారంతో ప్రధాన ఆలయానికి

శైవక్షేత్రాలకు తలమానికంగా ఉన్న శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంలో అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం, తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్దవటం వెలసి ఉన్నాయి. దాదాపు 14 వందల సంవత్సరాల క్రితం 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యుల వంశంలో రెండవ పులకేశి ఈ ఆలయాలను నిర్మించినట్టు ఇక్కడ లభించే శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. షణ్మతాలకు నిలయంగా ఇక్కడ సౌర, శాక్తేయ, కౌమార, గాణపత్య, ౖÔð వ, వైష్ణవ వైదికాలకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి.

బాలబ్రహ్మేశ్వరుడు
పూర్వం బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేయడం ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించాడు. బ్రహ్మకారణం చేత పరమేశ్వరుడు వెలసినందుకు ఈ స్వామిని బ్రహ్మేశ్వరుడు అని, విగ్రహం చిన్నదిగా ఉన్నందున బాలబ్రహ్మేశ్వరుడు అని పిలుస్తారు. ఈ విగ్రహానికి ఆనుకుని విష్ణువుకు ప్రతిరూపమైన సాలగ్రామం వెలసింది. అందుకే శివాయ విష్ణు రూపాయ... శివరూపాయ విష్ణవే...అంటూ ఈ శైవæక్షేత్రంలో ధనుర్మాస పూజలు కూడా నిర్వహిస్తారు.

పాప వినాశి తీర్థం!
అలంపురానికి దక్షిణాన అరమైలు దూరంలో 24 ఆలయాల సముదాయమైన పాపనాశిని తీర్థం ఉన్నది. అది అష్టాదశ తీర్థాలలో ఎంతో ప్రాముఖ్యతగలది. మిగిలిన తీర్థాలు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. 24 ఆలయాల సముదాయం... ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికతలో తులతూగుతోంది. ప్రధాన ఆలయానికి చుట్టూ చిన్న, చిన్న గుడులు నిర్మించారు. ద్రావిడ, వేసర సంప్రదాయాలకు చెందిన ఆలయాలుగా వీటిని గుర్తించారు. ఈ ఆలయానికి ఉత్తర, దక్షిణ మూలలలో చక్కని ఆలయాలు, మంటపాలు ఉన్నాయి. వాటిలో స్తంభాల పైన రామాయణ గాథ శిల్పాలు, క్షీరసాగర మథనం, అపూర్వ రమణీయతలను చాటుతున్నాయి. ఈ తీర్థం శ్రీశైలం ప్రాజెక్టు మునకలో పోయినందున అక్కడి నుండి కిలోమీటర్‌ దూరంలో ఈ పాప వినాశిని పునః నిర్మాణం చేశారు.

లంబస్తనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలాం
ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం 

అని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్తుతించిన స్తోత్రంలో ఈ ధ్యాన శ్లోకాన్ని పేర్కొన్నారు.

పూర్వం దక్షప్రజాపతి నిర్వహించిన నిరీశ్వర యాగంలో అందరి ముందు శివనింద చేయడంతో అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్ని కల్పించుకుని తాను దేహత్యాగం చేసుకుంటుంది. ఈ విషయాన్ని పరివారగణం ద్వారా తెలుసుకున్న పరమేశ్వరుడు ప్రళయకాల రుద్రుడై వచ్చి అక్కడి యాగాన్ని సమూలంగా నాశనం చేసి మరణించిన సతీదేవి సూక్ష్మ శరీరాన్ని తన భుజ స్కందంపై వేసుకుని రుద్రతాండవం చేస్తాడు. పరమేశ్వరుడి కోపాగ్ని చల్లార్చేందుకు శ్రీ విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 శకలాలుగా విభజిస్తారు. ఆ భాగాలు వేర్వేరు ప్రదేశాలలో పడగా ఆది శంకరాచార్యుల వారు వాటికి ప్రాణప్రతిష్ఠాపన చేశారు. అవే నేడు 18 శక్తి పీఠాలుగా ఉద్భవించాయి. అందులో అలంపూర్‌లో దంతపంక్తి పైభాగం పడింది. అదే జోగుళాంబ శక్తిపీఠం.

నవబ్రహ్మ ఆలయాలు
ప్రధాన ఆలయ ఆవరణలోనే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. ఇందులో బాల, కుమార, అర్క, వీర, విశ్వ, తారక, గరుడ, పద్మ, సర్గ బ్రహ్మేశ్వర ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల మీద అష్ట దిక్పాలకులు, శివ, విష్ణు అవతారాలు, నటరాజు, పురాణ కథా శిల్పాలు, ముగ్ధ మనోహరంగా భావ గాంభీర్యం చెడకుండా సృష్టించబడ్డాయి. ఈ శిల్ప సౌందర్యం దేశ విదేశ విద్వాంసులు నుంచి ప్రశంసలు పొందింది. గరుడ, గంధర్వ, కిన్నెర కింపురుషాది మూర్తులు చూపరులకు రమణీయంగా నిలిచాయి. ఇక్కడి శిల్పాల పైన మానవ మిథునాలు, పంచతంత్ర కావ్య కథా శిల్పాలు ఆదిత్యహృదయం, రామాయణ, మహాభారత శిల్పాలు కనువిందు చేస్తాయి. ఈ దేవాలయాల మీద శ్రీమార , నయన, ప్రియన్, శ్రీ కంఠాచార్యన్‌ తదితర శిల్పాచార్యుల పేర్లు నేటికి కనబడుతాయి.

సమీపంలో...
యోగనారసింహస్వామి ఆలయం ఉంది. దీనిని ప్రహ్లాద రాయలు నిర్మించారు. లక్ష్మీదేవి, గణపతి, ఆళ్వారులు, అనంత పద్మనాభస్వామి, ఆంజనేయస్వామి వెలసి ఉన్నారు. 14వ శతాబ్దంలో నిర్మించిన సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది.

దిండిగల్‌ ఆనంద్‌శర్మఅలంపురం - తెలంగాణ శక్తిపీఠం

లంబస్తనీం వికృతాక్షీం ఘాెర రూపాం మహాబలాం,
ప్రేతాసన నమారూఢం జోగుళాంబాం నమామ్యహం

భారతదేశంలో అత్యంత పవిత్రమైన అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమే అలంపురము. బాలబ్రహ్మేశ్వర స్వామి ప్రధాన దైవతంగా నవబ్రహ్మాలయాలు నెలకొని ఉన్న పుణ్యక్షేత్రం అలంపురం, శిల్పరీత్యా, చరిత్ర రీత్యా, పౌరాణిక రీత్యా కూడా ఇదొక పవిత్ర క్షేత్రం. ఉత్తర వాహినియై ప్రవహిస్తున్న తుంగ భద్రాతీరంలో వెలసిన ఈ క్షేత్రానికి మరొక ప్రశస్తి ఉంది. జోగుళాంబాదేవిగా కొలువై ఉన్న అమ్మవారి పేరుతో కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. పరమశివుని భార్య సతీదేవి శరీరాన్ని శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధంతో ఖండించినప్పుడు మన పవిత్ర భారత భూమిపై ఆ శరీరపు పదునెనిమిది ఖండములు పడిన చోటు లే అష్టాదశ శక్తిపీఠములు. ప్రసిద్ధమైన యీ శక్తిపీఠములు మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్నట్లు పురాణ ఆధారాలను బట్టి తెలుస్తున్నది. దేశంలోని అపూర్వశక్తి సంపన్నమైన శక్తి పీఠాలలో ఇది ఒకటి అన్న విషయం లోక విదితము.

జోగుళాంబా అమ్మవారి ఆలయం ప్రాచీనమైనది. క్రీ. శ. 7వ శతాబ్దంలో యీ ప్రాచీనాలయం నిర్మించారని చారత్రకుల భావన. 9వ శతాబ్దంలో శ్రీ శంకర భగవత్పాదుల వారు శ్రీ చక్ర ప్రతిష్ఠ చేసినట్టు తెలుస్తున్నది. 14వ శతాబ్దంలో జరిగిన ముస్లిం దండయాత్రల కాలంలో ఈ ప్రాచీన దేవాలయం ధ్వంసం అయినందువల్ల అమ్మవారి మూల మూర్తిని బ్రహ్మేశ్వ రాలయంలోని ఒక మూలలో ప్రతిష్టించి పూజలు జరిపించారు. ఇంకా అనేక ఆలయాలు ధ్వంసం కాకుండా విజయనగర చక్రవర్తి రెండో హరిహరరాయల కుమారుడు మొదటి దేవరాయలు తన తండ్రి ఆజ్ఞ పాటించి ఆ ముస్లిం సైన్యాన్ని పారగొట్టి దేవాలయాల్ని రక్షించాడు. ఇటీవలె తిరిగి ఆ స్థలంలోని ప్రాచీన ఆలయ వాస్తు రీతిలో నూతన ఆలయం నిర్మించి తిరిగి అమ్మవారి ప్రతిష్ఠ జరిపించడం విశేషం.

ఈ నూతన ఆలయం పైకప్పుపై పద్మం, నాగంవంటివి మిగతా ఇక్కడి ఆలయాల్లో ఉన్నట్టే చెక్కడానికి ప్రధాన కారణం నాగం కుండలినీ శక్తికి, పద్మం సహస్రారానికి సంతాేలు కావడమేనని పెద్దల అభిప్రాయం. ఆలయ స్తంభాలపై అష్టాదశ, శక్తిపీఠాలలో కొలువైన అమ్మవార్ల శిల్పాలు కూడా చెక్కి ఈ శక్తి పీఠ ప్రాశస్త్యాన్ని మరింత శక్తివంతం చేశారు.

బాలబ్రహ్మ కుమార కర్క వీరో విశ్వశ్చ తారకః
గరుడ స్వర్గ పద్మాశ్రీ నవబ్రహ్మా ః ప్రకీర్తితాః

అన్న పౌరాణిక ప్రమాణాలను బట్టి ఇక్కడ నవబ్రహ్మల ఆలయాలన్నట్లు తెలుస్తున్నది. బ్రహ్మ పరమేశ్వరుని గురించి తపస్సు చేసిన పవిత్ర స్థలం కావడం వల్ల ఇక్కడ ప్రధాన శివాలయమైన బాల బ్రహ్మేశ్వరాలయంతో బాటు, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ ఆలయాలు ప్రత్యేకంగా ఉండటం, ఇక్కడ క్షేత్ర పవిత్రతను మరింత పెంచాయి. ఈ శివాలయాలపై ఉన్న అనేక శిల్పాలు పౌరాణిక గాథలతో ూడి ఒక అద్భుత ప్రపంచాన్ని మనకు దృశ్యమానం చేస్తాయి. ఎందరెందరో దేశ విదేశ చరిత్రారులకు స్ఫూర్తినిచ్చేవిధంగా యీ దేవాలయాల నిర్మాణం జరిగింది. బ్రహ్మ తపోభూమిలో వెలసిన శివుడు కనుక ప్రతి శువుని చివరక బ్రహ్మ శబ్దం జోడించబడింది. దేవాలయ వాస్తును అధ్యయనం చేయాలనుకున్న జిజ్ఞాసువుల ఆలయాలు గొప్ప విద్యాంద్రాలని చెప్పవచ్చు.

ఇక్కడి ఆలయాలన్నీ ఒ కాలంలో నిర్మించినవి కాక పోవచ్చునని పరిశోధకుల భావన. తెలుగు నేలపై బాదామీ చాళుక్య రాజుల పాలన సాగిన 200 సంవత్సరాల కాలంలో వీటి నిర్మాణం జరిగినట్లు భావిస్తుంటారు. భారతీయ వాస్తు శిల్ప రీతులను, వేద ధర్మ వికాసాన్ని, చారిత్రక విశేషాలను అధ్యయనం చేయాలనుకున్న పరిశోధకులకు ఇవి గొప్పగా ఉపయోగపడే ఆలయాలు. మహాద్వారం మొదలుకొని వరుసగా కనిపించే ఈ నవ బ్రహ్మాలయాలు భక్తులకు, చరిత్ర విజ్ఞాన సముపార్జన చేయాలనుకున్న వారికి శిల్పరీతులను తెలుసుకొన గోరే వారికి ప్రధాన ంద్రాలై విరాజిల్లుతున్నాయి.

దీనికి దక్షిణా కాశిగా సంభావిస్తుంటారు. అట్లా గుర్తించడానికి అనేక పురాణాంతర్గత సాక్ష్యాలున్నాయి. ఇది శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వారం. శ్రీశైలానికి తూర్పున త్రిపురాంతకం. దక్షిణాన సిద్ధవటం, పశ్చిమాన అలంపుర, ఉత్తరాన ఉమామహేశ్వరం అనే ప్రముఖ శైవ క్షేత్రాలున్నాయని స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం చెబుతున్నది.

బ్రహ్మేశోయం సవిశ్వేశః సాకాశీ హేమలాపురీ సాగంగా తుంగ భద్రే7యం సత్యమేతన్న సంశయః

కాశీ మహాక్షేత్రంలో విశ్వేశ్వరుడైతే ఇక్కడ బ్రహ్మేశ్వరుడు, అక్కడ గంగ ఉత్తరవాహిని, ఇక్కడ తుంగభద్ర ఉత్తర వాహిని అదికాశి, ఇది హేమలాపురం అంటూ చెప్పిన శ్లోకంలోనే దీనిని దక్షిణ దిశలోని కాశి అనడానికి ఏ సంశయమూ లేదని యీ శ్లోకం సాక్ష్యమిస్తున్నది. పైగా కాశీక్షేత్రంలో ఉన్నట్లు ఈ క్షేత్రంలోనూ పాపవినాశిని, మణి కర్ణిక మొదలైన 54 ప్రధాన ఘట్టాలున్నాయి. అక్కడికి దగ్గర్లో త్రివేణి సంగమం ఉంటే ఇక్కడికి దగ్గర్లో కృష్ణా, తుంగ భద్రల సంగమం ఉంది. అక్కడి దేవత కాశీవిశాలాక్షి అయితే ఇక్కడి అమ్మవారు జోగుళాంబాదేవి.

ఈ క్షేత్రానికి వైదిక మత రీత్యా ఎంతో ప్రాధాన్యం ఉంది. శైవ, వైష్ణవ, శా్తయ, గాణాపత్య, సైర, స్కాందగా సంభావించిన షన్మణతాలకు సంబంధించిన దేవతా మూర్తులు ఈ క్షేత్రంలో మనకు కనిపిస్తాయి. ప్రధాన ఆలయమైన బ్రహ్మశ్వరాలయం రససిద్ధులచే నిర్మించబడిందనీ, ఇక్కడి శివలింగం మహా మహిమాన్వితమైందని భావిస్తుంటారు. స్కాంద పురాణంలోని శ్రీశైలఖండంలోని రెండు అధ్యాయాలు, సంస్కృతంలోని ఒక ప్రత్యేక స్థల పురాణం ఈ క్షేత్రం మహాత్మ్యాన్ని తెలిపే ప్రధాన ఆధారాలు. ఇది బ్రహ్మచే ప్రతిష్టితమైన శివలింగం. ఇది జ్యోతిర్వ్యాలామయమైనదని కూడా దీనికి ప్రశస్తి ఉంది. ఇక్కడ జమదగ్ని ఆశ్రమం ఉండేదని, జమదగ్ని మహర్షి భార్య రేణుకను కుమారుడు పరశురాముడు సంహరించిన స్థలంగా దీన్ని భావించడానికి ఇక్కడ తలలేని భూదేవి విగ్రహం ఉండటం కూడా ప్రమాణమని ఐతిహ్యం ఉంది.

ఇక్కడి పాప వినాశని తీర్థంలోని గదాధర విగ్రహ సన్నిధిలో శ్రాద్ధకర్కల నాచరించడం శ్రేష్టమని భావన. ఈ క్షేత్ర మహాత్మ్యం తెలుగులో ప్రసిద్ధి చెందిన పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర కూడా విస్తృతంగా వర్ణించింది. ఇక్కడి అనేక తీర్థాలను ప్రస్తావించింది. బ్రహ్మకు విగ్రహం ఉండటం ఈ క్షేత్రంలోని మరో విశేషం. మనకు అరుదుగా కనిపించే బ్రహ్మ విగ్రహం ఇక్కడ ఉండటానికి ఇది బ్రహ్మతపస్సు చేసి ఇక్కడి శివలింగాన్ని స్థాపించాడన్నదే ప్రధాన కారణంగా చెబుతారు.

ఇక్కడి శివుణ్ణి గోష్పాద ముద్రిత రసాత్మక లింగమూర్తేః అని వర్ణించడానికి కారణం ఇక్కడి లింగం పై భాగం ఆవు గిట్ట పడినట్లుగా ఉంటుంది. అదే దీనికి కారణం పరిమా ణంలో చాలా చిన్నదైన బ్రహ్మేశ్వర లింగం పై భాగం ఇట్లా ఉండటం ఒక ప్రత్యేక విశేషం.

అలంపురానికి గొప్ప చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇక్కడి శాసనాల్లో దీని పేరు హలంపుర, హతంపుర, హేమలాపురంగా పిలువబడిన ఈ గ్రామం ఇక్కడి ఉర్దూ రికార్డుల్లో అల్పూరుగా అలంపూరుగా పేర్కొనబడింది.

శతాబ్దం నాటి ఇక్ష్వాకుల శాసనాల్లో హలంపుర ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక్కడి పరిసరాల తవ్వకాల్లో ప్రాచీన కాలపు అవశేషాలు అనేకం లభించాయి. శిలాయుగం నాటి అవశేషాలు కూడా వీటిలో ఉన్నట్లు గుర్తించారు. రాకాసి గుళ్ళు గా పిలుచుకునే పరిసర గ్రామాల్లోని సమాధులు తవ్వి చూస్తే అనేక ఆధారాలు లభించాయి.

మౌర్యులు, శాత వాహనులు, బాదామీచాళుక్యలు, రాష్ట్ర ూటులు, కల్యాణీ చాళుక్యులు, కాకతీయులు, విజయ నగర రాజులు, సుల్తానులు ఎందరెందరో పాలకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా శాసన ప్రమాణాలు, నిర్మాణ విశేషాలు సూచిస్తున్నాయి.

ఇదొక ప్రాచీన విద్యా పీఠంగా చెప్పడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. మహాద్వారం, కంచికామాక్షి ఆలయాలతో బాటు అనేక ఆలయాలున్న ఈ అలంపుర దేవాలయంలో అద్భుత శిల్పకళారీతు లు భారతీయ సంస్కృతికి పట్టు కొమ్మలు. ప్రాచీన కళాఖండాల సంరక్షణ కోసం ఏర్పరచిన మ్యూజియం మిక్కిలి ప్రసిద్ధం. ఇక్కడి దేవాలయాల ఆవరణలో ఉన్న షా అలీ పహిల్వాన్‌ దర్గా సుప్రసిద్ధమైంది.

కీ.శే. గడియారం రామకృష్ణ శర్మగారు ఈ క్షేత్రంపై విశేష పరిశోధనలు చేసిన పండితకవి. శ్రీ శైలం జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌లో మునిగిపోకుండా పోరాటం చేసి నిలబెట్టిన మహామనిషి. ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపుకు గురైన ప్రాంతాల్లోని అనేక ఆలయాలు ఇక్కడ పునర్మించినిలబెట్టారు.

తెలంగాణాలోని ఏకైక శక్తిక్షేత్రం, అద్భుత చారిత్రక నిర్మాణాలు చోటు చేసుకున్న ప్రాంతం. కాశీతో సమంగా వెలిగే దక్షిణకాశీ క్షేత్రం. దీన్ని పరిరక్షించి మరింత శోభను సమూర్చి మన ప్రాంతపు ప్రాచీన చరిత్రను ప్రపంచం ముందు నిలబెట్టి వెలిగించే బాధ్యత మనమీదే ఉందన్న సత్యం విస్మరించరానిది.
హరహర మహదేవ శంభో శంకర

మహశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు "హరహర మహదేవ శంభో శంకర", "నమః శివాయ" అనే శివనామస్మరణతో మారుమోగుతుంది. శివనామస్మరణం సకల పాపాలకు హరణం అని భక్తుల నమ్మకం ఉండడంతో ఎటుచూసిన శివనామస్మరణమే వినిపిస్తుంది.

మహశివరాత్రి సమయన్న భక్తులు తుంగభధ్రనదిలో పుణ్యస్నానాలు ఆచరించి దక్షిణకాశీగా పిలువబడే ఐదవశక్తి పీఠం జోగులాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలతో పాటు నవబ్రహ్మదుల దేవాలయాలను దర్శించుకుంటారు.

ఐదవశక్తిపీఠం అలంపూర్‌కు తూర్పుదిక్కున, ఆరవ శక్తిపీఠం శ్రీశైలానికి ఉత్తరదిశన వెలసిన ఉమామహేశ్వరుడి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తారు.  అటవీ ప్రాంతంలోని కొండల మధ్య వెలసిన ఉమామహేశ్వరుడి దర్శనంతో పాటు, పాలధార పంచదార దగ్గర వస్తున్న జలపాతంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు.

శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు ఉమామహేశ్వరంలోని ఉమామహేశ్వరుడిని దర్శించుకోవడానికి రావడంతో ఆ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగుతుంది.

దట్టమైన నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో వెలసిన మల్లెలతీర్థంలోని శివలింగం దర్శనం కోసం భక్తులు కిలో మీటర్ల మేర కాలినడకన నడిచివచ్చి లోయలో జలపాతంలో వెలసిన సాక్షాత్తు పరమేశ్వరుడిని భక్తులు దర్శించుకుని, జలపాతంలో ఉన్న శివలింగంపై పడుతున్న నీటిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి తరించిపోతారు.

ఆరు వందల సంవత్సరాల నాటి శివాలయాల్లో ప్రత్యేక పూజలు
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణపేట డివిజన్‌ కేంద్రంలో వెలసిన ఆరు వందల సంవత్సరాల నాటి శివాలయాల్లో భక్తులు శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరు వందల సంవత్సరం క్రితం నిర్మించిన బారంబావి శివాలయం, లింగయ్య దేవాలయం, తీర్థంబావి, మార్కండేయ దేవాలయం, నాగరేశ్వర దేవాలయం, బసవేశ్వర దేవాలయం, నారాయణ దేవాలయం, నీలకంఠేశ్వర దేవాలయం, శివాజీనగర్, మడి ఏరియాల్లో గల ఈశ్వర్ మందిర్ శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాసదీక్షలను చేపట్టారు.

పులకించిన దక్షిణకాశి ఆలయాలు
అలంపూర్: నవబ్రహ్మాలయాల దివ్యదామం, అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబదేవి ఆలయాలు భక్తులు చేసిన శివనామస్మరణతో పులకించి పోయాయి.

బాలబ్రహ్మ కుమార అర్క వీర విశ్వచ్చతారక గరుడ స్వర్గ పద్మర్శ నవబ్రహ్మ ప్రకోపితహః
అలంపూర్ క్షేత్రం నవబ్రహ్మాలయాల దివ్యదామంగా పిలవబడుతుంది. బాల, కుమార, అర్క, వీర, విశ్వ, గరుడ, తారక, స్వర్గా, పద్మబ్రహ్మాలయాలు ఇక్కడ 7వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్యకాలంలో చాళక్యులు నిర్మింప చేశారు.


ప్రాచీన ప్రదేశాలు – ఆధునిక నామధేయాలు


ప్రాచీన ప్రదేశాలు – ఆధునిక నామధేయాలు
::::::::::::::::::::::::::::::::::::::
భాగవతం, మహాభారతం
:::::::::::::::::::::::::::::::::::::::


1. మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం – దేవ్ ధాం,నేపాల్.

2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం – అహోబిలం,ఆంధ్రప్రదేశ్.

3. జమదగ్ని మహర్షి ఆశ్రమం – జమానియా, ఉత్తర్ ప్రదేశ్.

4. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్, మధ్యప్రదేశ్

5. శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు - కురుక్షేత్ర, హర్యానా

6. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి, సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) – కేరళ, కర్ణాటక, మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం

7. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) – పశ్చిమ ఒరిస్సా

8. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్

9. వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్

10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) – సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.

11. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు - మన గ్రామం, ఉత్తరాంచల్

12. ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) - ఝున్సి,అలహాబాద్.

13. సాళ్వ రాజ్యం(సావిత్రీ, సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం) - కురుక్షేత్ర దగ్గర.

14. హస్తినాపురం (కౌరవుల రాజధాని) – హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.

15. మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.

16. వ్రేపల్లె / గోకులం – గోకుల్, మధుర దగ్గర.

17. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) – గ్వాలియర్.

18. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.

19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం) - డెహ్రాడూన్.

20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) – గురుగావ్, హర్యానా.

21. కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).

22. పాండవుల లాక్షగృహ దహనం - వర్నాల్, హస్తినాపూర్.

23. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం – గిర్నార్, గుజరాత్.

24. శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం – ద్వారక,గుజరాత్.

25. హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) - జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.

26. విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) – విదర్భ, మహరాష్ట్ర

27. కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) – కుండినపుర, మహరాష్ట్ర

28. చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.

29. కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.

30. ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) – ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.

31. కుచేలుడు నివసించిన చోటు – పోర్ బందర్, గుజరాత్.
32. పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) – ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.

33. కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు, మత్స్యయంత్ర బేధన స్థలం) – కంపిల్, ఉత్తర్.

34. జరాసంధుని భీముడు చంపిన చోటు – జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.

35. కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) – పశ్చిమ హర్యానా.

36. మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) - ఆల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.

37. విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) – విరాట్ నగర్,రాజస్థాన్

38. శోణపురం (బాణాసురుడి రాజధాని) – సోనిత్ పూర్, అస్సాం.

39. ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) – తేజ్ పూర్, అస్సాం.

40. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.

41. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం – పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.

42. కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.

43. బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.

44. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.

::::::::::::::::::::::::::::::::::::::
రామాయణం
:::::::::::::::::::::::::::::::::::::::


1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం – గంగోత్రి, ఉత్తరాఖండ్

2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) – గంగాసాగర్, వెస్ట్ బెంగాల్

3. కాంభోజ రాజ్యం – ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).

4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు) - లాంగకో, టిబెట్, చైనా

5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు – గోకర్ణ, కర్ణాటక.

6. సీతాదేవి భూమిలో లభించిన చోటు – సీతామర్హి, బీహార్

7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) – జనక్ పూర్, నేపాల్

8. కోసలదేశం – రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం

9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం – ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.

10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) – ఘాఘర నది.

11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) – అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.

12. తాటక వధ జరిగిన ప్రదేశం – బక్సర్, బీహార్

13. అహల్య శాపవిమోచన స్థలం – అహిరౌలి, బీహార్

14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) – సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్

15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు – శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర

16 దండకారణ్యం – చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.

17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) – సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.

18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) – నాసిక్, మహరాష్ట్ర.

19. కబంధాశ్రమం – కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.

20. శబరి ఆశ్రమం – సర్బన్, బెల్గావి, కర్ణాటక.

21. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం – హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.

22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక

23. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం – ధనుష్కొటి, తమిళనాడు.

24. శ్రీరాముడు వానరసైన్యంతో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు

25. రత్నద్వీపం / సింహళం / లంక – శ్రీలంక.

26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) – కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక

27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు – దునువిల్ల, శ్రీలంక

28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం – దివిరుంపోల, శ్రీలంక.

29. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం – ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.

30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) – కుశార్, పాకిస్తాన్.

31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) – లాహోర్, పాకిస్తాన్

32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) – తక్షశిల, పాకిస్తాన్

33. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించెను

Sunday, 21 May 2017

మాహిష్మతి

మాహిష్మతి సామ్రాజ్యం భారత్‌లో ఎక్కడుంది?బాహుబలి సామ్రాజ్యం మాహిష్మతి. బాహుబలి సినిమా చూసిన చాలా మందికి అది ఓ కల్పిత రాజ్యం. కానీ, ఆ రాజ్యం నిజంగానే ఉందన్న విషయం తెలుసా? అది నిజమైన రాజ్యం అని తెలిసిన వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారేమో. భారత్‌లో ఒకప్పుడు మాహిష్మతి అనే సామ్రాజ్యం ఉంది. ఇప్పుడు ఆ మాహిష్మతి సామ్రాజ్యమే మహేశ్వర్ అనే పట్టణంగా రూపాంతరం చెందింది. మరి, ఆ పట్టణం ఎక్కడుంది? అసలు మాహిష్మతి సామ్రాజ్యాన్ని స్థాపించిందెవరు..?

మధ్య భారతంలో..
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లాలో ఉంది ఆనాటి మాహిష్మతి..నేటి మహేశ్వర్. ఇండోర్ నుంచి 91 కిలోమీటర్లు, ఆగ్రా-ముంబై హైవేకి తూర్పున 13 కిలోమీటర్ల దూరంలో ఉంది మహేశ్వర్. నర్మదా నది ఒడ్డును కొలువుదీరింది మహేశ్వర్ నగరం. మరాఠా హోల్కర్ సంస్థానంలో 1818 జనవరి 6 వరకు మాల్వాకు రాజధానిగా కొనసాగింది. మాహిష్మతి నగరాన్ని కార్తవీర్య అర్జున ఈ నగరాన్ని నిర్మించాడని, దానినే రాజధానిగా చేసుకుని పాలించాడని ప్రతీతి. రామాయణ, మహాభారతాల్లోనూ మాహిష్మతి ప్రస్తావనకు రావడం విశేషం. ఓ సారి కార్తవీర్య అర్జున తన 500 మంది భార్యలతో నర్మదా నదీ తీరానికి వెళతాడట. అప్పుడు అతడి ఆ 500 మంది భార్యలు తమకు చాలా పెద్ద ప్లే గ్రౌండ్ కావాలని అడగడంతో.. కార్తవీర్య అర్జున తన 1000 చేతులతో నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటాడట. అప్పుడే అటుగా పుష్పక విమానంలో వెళుతున్న రావణుడు.. శివలింగార్చనకు అదే అనువైన ప్రదేశం అనుకుని అక్కడ దిగుతాడట. ఆంధ్ర మహాభారతం, సభాపర్వంలోనూ మాహిష్మతికి సంబంధించిన ప్రస్తావన వస్తుందట.

రాజమాత
ఇక, 18వ శతాబ్దంలో రాజమాత అహల్య భాయ్ హోల్కర్ తన భర్త మరణానంతరం నర్మదా నదీ తీరాన గల మాహిష్మతి సామ్రాజ్యాన్ని రాజధానిగా చేసుకుని మాల్వా దేశాన్ని పరిపాలించిందని చెబుతారు. ఇక, శివభక్తురాలైన అహల్యాదేవి ఎన్నో శివాలయాలను పునరుద్ధరించిందని ప్రతీతి. ఆమె పాలనాకాలంలో నిర్మించిన, ఆమె నివసించిన కోట ఇప్పటికీ చెక్కుచెదరకుండా పదిలంగా ఉంది. ఇక, బాహుబలిలోని కోటలు.. అచ్చంగా మహేశ్వర్‌లోని కోటల తరహాలోనే ఉండడం విశేషమే మరి. అంతేకాదు.. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్‌నూ మహేశ్వర్ కోటల్లో తీయడం విశేషం.Sunday, 7 May 2017

సీతామడి

సీతామడి
(ఇప్పుడు బీహార్‌లో ఉంది)రామాయణం ప్రకారం ఈ ప్రాంతం జనకుడి పాలనలో ఉండేది. పునౌరా (ఇప్పుడు పునరాధాం)లో జనకుడి నేలను దున్నుతుంటే తనకు సీత దొరికింది. దేవుడిచ్చిన బిడ్డగా తీసుకెళ్లి పెంచుకుంటాడు. జనకుడి నివాసంగా పేర్కొనే జనక్‌పూర్ ఇప్పుడు నేపాల్‌లో ఉంటుంది. అది ఈ సీతామడికి దాదాపు 60 కిలోమీటర్ల దూరం. ఈ సీతామడి జిల్లా సరిహద్దులు కూడా నేపాల్‌తో కలిసే ఉంటాయి. సీత దొరికిన స్థలంలో చాలామంది భక్తులు పూజలు చేస్తుంటారు.

ఉత్తరప్రదేశ్‌లోనూ వారణాసి, అలహాబాద్ మధ్యలోనూ ఓ సీతామడి ఉంది. అయితే అది కొత్తగా వెలిసిన ప్రాంతంలా కనిపిస్తుంది. దాన్ని సీత స్వచ్ఛందంగా భూమాత ఒడిలోకి వెళ్లిపోయిన స్థలంగా భక్తుల నమ్మకం. ఇదీ కథ.సీతామడి
లవకుశుల జననం తరువాత సీతామహాసాధ్వి పిల్లలను శ్రీరామునకు అప్పగించి తాను తన తల్లి అయిన భూమాతను చేరుతుంది. ఆ క్రమములో సీతాదేవి భూమాతను ప్రార్ధించి భూప్రవేశము చేసిన స్థలమే ఈ సీతామడి. అలహబాద్ - వారణాసి రహదారిలో అలహాబాద్ నుండి సుమారు 50 కిలోమీటర్లు వచ్చిన తర్వాత, రహదారి నుండి 12 కిలోమీటర్లు లోపలికి వెళ్తే సీతామడి వస్తుంది. వారణాసి నుండి ప్రయాగ వెళ్ళే దారిలో 20 కిలోమీటర్లు లోపలికి ఈ ప్రదేశము కలదు. ఆ ప్రాంతములో వాల్మీకి ఆశ్రమము ఉండేదిగా చెబుతారు. అక్కడ 108 అడుగుల హనుమంతుని విగ్రహము, దాని కింద పవనపుత్రుని ఆలయము సీతాదేవి ఆలయమునకు రక్షణగానా అన్నట్లు ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆలయం సొరంగమార్గాలతో వైవిధ్యంగా ఉంటుంది. దాని ఎదురుగా సీతాదేవి ఆలయం ఒక నదిపాయ మధ్యలో ఎంతో సుందరముగా ఉంటుంది. అక్కడగల సీతాదేవి విగ్రహము చూస్తూ ఉంటే భక్తిభావముతో చూపు మరల్చుకోలేము. ఇక్కడ ఏర్పాటు చేసిన సీతాదేవి విగ్రహం అత్యంత సహజసిద్ధంగా ఉండి, చూపరులను కట్టి పడేస్తుంది. సీతమ్మ అవతార పరిసమాప్తి కావించిన ఈ స్థానంలో గుండె బరువెక్కిపోతుంది.Thursday, 4 May 2017

డార్జిలింగ్‌

డార్జిలింగ్‌
వేసవిలో AC ప్లేస్‌


తేయాకు తోటల పచ్చదనం, చేతికి అందే ఎత్తులో మేఘాలు, కనుచూపు మేరలో హిమాలయ పర్వతాల అందాలు... ఇలా చెప్పుకుంటూ పోతే డార్జిలింగ్‌ అందాలు వర్ణించడానికి మాటలు రావు. ఏడాదంతా సందర్శించడానికి అనువైన ప్రదేశమే అయినా వేసవిలో వెళితే చల్లటి ఆహ్లాదాన్ని ఆస్వాదించవచ్చు.

వేసవిలో హిల్‌స్టేషన్‌కు వెళ్లడానికి ప్లాన్‌ చేసుకుంటున్నట్లయితే ముందుగా డార్జిలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక్కడి ప్రకృతి అందాలు మీకు కొత్త అనుభూతిని అందిస్తాయి. 2200 మీటర్ల ఎత్తులో ఉండే ఈ హిల్‌స్టేషన్‌ మండు వేసవిలోనూ చల్లటి ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.

హ్యాపీ వ్యాలీ టీ ఎస్టేట్‌
డార్జిలింగ్‌ వెళ్లినవారు తప్పక సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశం ఇది. ముఖ్యంగా మార్చి నుంచి మే మధ్య కాలంలో డార్జిలింగ్‌ వెళితే తేయాకు ఆకులను తెంపి ప్రాసెసింగ్‌ చేయడాన్ని ఇక్కడ చూడొచ్చు. అక్కడి టీ ఎస్టేట్‌ ఉద్యోగులు మీకు గైడ్‌గా మారి అన్నీ చూపిస్తారు. ఆ తేయాకు తోటల అందాలు మీకు జీవితాంతం గుర్తుండిపోతాయి.

బటాసియా లూప్‌
డార్జిలింగ్‌ అందాలు పూర్తిగా చూడాలంటే టాయ్‌ ట్రెయిన్‌ ఎక్కాల్సిందే. డార్జిలింగ్‌ హిమాలయన్‌ రైల్వే నడిపిస్తున్న ఈ టాయ్‌రైలులో ప్రయాణం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. 1999లో దీన్ని వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించారు. ఐదు కిలోమీటర్ల రైలు ప్రయాణంలో హిమాలయాల అందాలను అద్భుతంగా వీక్షించవచ్చు. భారత స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన గూర్ఖా సోల్జర్స్‌ గౌరవార్థం నిర్మించిన వార్‌ మెమోరియల్‌ను చూడొచ్చు. ఇక్కడి మార్కెట్‌లో షాపింగ్‌ తప్పక చేయాల్సిందే. చాలా తక్కువ ధరలో ఆకట్టుకునే వస్తువులు లభిస్తాయి.

జపనీస్‌ పీస్‌ పగోడా
డార్జిలింగ్‌లో తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి డార్జిలింగ్‌, హిమాలయ పర్వత అందాలు సందర్శకులను కట్టిపడేస్తాయి. శాంతి, ప్రశాంతతకు చిహ్నంగా జపనీస్‌ బుద్ధిస్ట్‌ ఆర్గనైజేషన్‌ దీన్ని నిర్మించింది. డార్జిలింగ్‌ నుంచి అరగంట నడక దారిలో ఇక్కడికి చేరుకోవచ్చు. ప్రార్థనలు జరిగే సమయంలో సందర్శిస్తే మరీ మంచిది.

టిబెటన్‌ రెఫ్యూజీ సెల్ఫ్‌ హెల్ప్‌ సెంటర్‌
టిబెటన్ల పునరావాసం కోసం 1959లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక స్కూల్‌, క్లినిక్‌, వృద్ధుల కోసం ఆశ్రమం, క్రాఫ్ట్‌ వర్క్‌షాప్‌ వంటివి ఉన్నాయి. కార్పెట్‌, లెదర్‌ ఉత్పత్తులు, ఉలన్‌ దుస్తులను ఇందులో తయారు చేస్తారు. ఆ వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

టైగర్‌ హిల్‌
భానుడి లేలేత కిరణాలను తాకాలంటే టైగర్‌ హిల్‌ చేరుకోవాల్సిందే. కారులో 40 నిమిషాలు ప్రయాణం చేస్తే టైగర్‌ హిల్‌కు చేరుకోవచ్చు. ఆ రోజు ఆకాశం నిర్మలంగా ఉందంటే మీరు అదృష్టవంతులే. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరెస్ట్‌ పర్వతాన్ని చూడొచ్చు. ఇక్కడికి దగ్గరలోనే డార్జిలింగ్‌లో అత్యంత ఎత్తైన ప్రదేశం ‘గుమ్‌’ ఉంటుంది.

పద్మజా నాయుడు హిమాలయన్‌ జూపార్క్‌
అరుదైన జంతువులను చూడాలంటే ఈ పార్క్‌ను సందర్శించాలి. మంచు చిరుత, సైబీరియన్‌ టైగర్‌, హియాలయన్‌ బ్లాక్‌ బేర్‌ వంటి జంతువులను ఇక్కడ చూడొచ్చు.

ఎలా వెళ్ళాలి:
  • దగ్గరలో ఉన్న ఎయిర్‌పోర్టు బాగ్‌డోగ్రా. ఇక్కడి నుంచి డార్జిలింగ్‌ 95 కి.మీల దూరంలో ఉంటుంది. ట్యాక్సీలు ఉంటాయి.
  • డార్జిలింగ్‌కు 88కి.మీల దూరంలో న్యూ జల్‌పాయ్‌గురి రైల్వేస్టేషన్‌ ఉంది. ఇక్కడి నుంచి ట్యాక్సీలో డార్జిలింగ్‌ చేరుకోవచ్చు. షేరింగ్‌ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
  • కోల్‌కతా నుంచి సిలిగురి వరకు బస్సులో చేరుకోవచ్చు. అక్కడి నుంచి డార్జిలింగ్‌ వెళ్లడానికి ట్యాక్సీలు ఉంటాయి.
  • డార్జిలింగ్‌ను సందర్శించడానికి అనువైన సమయం ఏప్రిల్‌ నుంచి జూన్‌, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌.
  • మాట్లాడే భాషలు.. బెంగాలీ, హిందీ, ఇంగ్లిష్‌, నేపాలీ.