Sunday, 25 June 2017

పూరీ జగన్నాథుడు

జగన్నాథ రథయాత్ర

రథయాత్ర... ఈ పేరు వినగానే కళ్లముందు కదలాడే స్వరూపం ఒక్కటే. పూరీ జగన్నాథుడు. మూడు పెద్ద పెద్ద రథాలు..3 కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలనంత భక్తజనం.. సముద్రపు హోరును తలదన్నేలా.. జై జగన్నాథ్‌ అంటూ హరి సంకీర్తనలు..హరిబోల్‌ అంటూ భగవంతుడిని ప్రార్థించే సన్నివేశాలు సాక్షాత్కరిస్తాయి.

పరవశింపజేసే యాత్ర:
పూరీ జగన్నాథ రథయాత్ర అనగానే ఒళ్లు పులకరిస్తుంది. మనసు పరవశిస్తుంది. ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత భారీ రథయాత్రలో జీవితంలో ఒక్కసారైనా పాల్గొనాలని ప్రతి హిందువు పరితపిస్తాడు. ఆ పుణ్యకార్యంలో పాలుపంచుకోవాలని.. ఆ పరంధాముడి రథాన్ని లాగాలని పరితపిస్తాడు. ఆ ఆనంద క్షణంలో.. అలౌకిక భక్తిపారవశ్యంలో.. ఆ రథచక్రాల కింద పడి ప్రాణాలు పోయినా.. ఫరవాలేదనేంత భక్తి తన్మయత్వం ఆవహిస్తుంది.జగతిని పాలించే ప్రభువు.. విహారానికి వెళ్లి తిరిగి యథాస్థానానికి వచ్చే సమయం ఆసన్నమైంది. బలభద్ర, సుభద్ర సమేతుడైన జగన్నాధుడు రథోత్సవానికి బయలుదేరాడు...తిరిగి తన స్థానానికి వచ్చేస్తున్నాడు. ఏడాదికొక్కసారి జరిగే ఈ మహోత్సవానికి ముగింపు ముహూర్తం వచ్చేసింది. నిన్నటి ఏకాదశితో ఈ మహోన్నత ఉత్సవం ముగింపునకు వచ్చేసింది. నేటి నుండి స్వామి తన కొలువులో యథాస్థితిలో భక్తులకు దర్శనమిస్తుంటారు.

రెండు కళ్లూ చాలవు:
పూరీ జగన్నాథ రథయాత్ర చూడ్డానికి రెండు కళ్లు చాలవు. ఆ జగన్నాధుడిలాగా.. మనకూ పెద్ద పెద్ద కళ్లుంటే బావుండనిపిస్తుంది. గత నెల 18న జరిగిన రథయాత్రతో పులకించిపోయింది జగన్నాథ పురి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ రథోత్సవంలో.. పాల్గొనడానికి వచ్చేనవారు కొందరైతే.. దీన్ని చూడడానికి వచ్చే వారు మరెందరో.పూరీ జగన్నాథుడి విహార యాత్రే రథయాత్ర. ప్రస్తుతం ఉన్న ఆలయం నుంచి.. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయం వరకు సాగుతుందీ విహారం. కురుక్షేత్రంలో రథాన్ని పరుగులు పెట్టించిన శ్రీకృష్ణుడు..సాక్షాత్‌ జగన్నాధుడి రూపంలో కొలువైన రథాలు కదలడం మాత్రం అంత ఆషామాషీ కాదు. 3 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి సుమారు 12గంటలు పడుతుంది. అంత భారీ ఎత్తున జనం తరలివస్తారిక్కడికి.

రథయాత్ర సమయంలో స్వామిని పతితపావనుడు అంటారు. ఆ పరంధాముడు కొలువైన రథాన్ని లాగడానికి భక్తులు రెట్టించిన ఉత్సాహంతో ఉంటారు. జయజయధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. ఆ రాత్ర ఆలయం బయట రథాల్లోనే మూలవిరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు పొద్దున్న మేళతాళాలతో గుడిలోపలికి తీసుకువెళతారు. స్వామి అక్కడ ఏడురోజులుంటాడు. ఐదోరోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతోపాటూ తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి, గుండిచా గుడి బయటి నుంచే జగన్నాథుడిని ఓరకంట దర్శించి.. పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్లిపోతుంది. ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు. ఆ రోజును 'హీరాపంచమి' అంటారు.

తిరుగు ప్రయాణం:
వారంపాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమినాడు తిరుగు ప్రయాణమవుతారు. దీన్ని బహుదాయాత్ర అంటారు. జగన్నాథుడు మాత్రం దారిలో అర్థాసని గుడి దగ్గర ఆగి తియ్యటి ప్రసాదాల్ని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి మూడు రథాలూ ఆలయానికి చేరుకుంటాయి. తరువాత రోజు, ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ఆ దృశ్యం అద్వితీయం.  అనిర్వచనీయం. ద్వాదశినాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామిలేక చిన్నబోయిన పూరీ, జగన్నాథుడి రాకతో కొత్తకళ సంతరించుకుంటుంది.

బంగారు చీపురుతో శుభ్రం:
పూరీజగన్నాథ రథయాత్ర సుప్రసిద్ధమైంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియనాడు రథయాత్ర జరుగుతుంది. అదే రోజు మన రాష్ట్రంలోని జగన్నాథ స్వామి ఆలయాల్లో రథయాత్ర జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్కళ ప్రాంతంలోని పూరీలో ప్రస్తుతం ఉన్న జగన్నాథ ఆలయాన్ని పన్నెండో శతాబ్దంలో గంగవంశీయుడైన అనంత చోళుడు నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతకుముందు ఉజ్జయిని పాలకుడైన ఇంద్రద్యుమ్నుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని బ్రహ్మాండ, స్కంద పురాణాలు పేర్కొంటున్నాయి. జగన్నాథ రథాన్ని నందిఘోష అంటారు. ఇది పసుపు రంగులో ఉంటుంది. బలభద్రరథం తాళ ధ్వజం. ఆకుపచ్చని రంగు కలిగి వుంటుంది. నలుపు వర్ణంలో ఉండే సుభద్ర రథం దేవదళనం.

వర్గ బేధాలు లేని సామూహిక భోజనాలు పూరి జగన్నాథ రథయాత్ర వేడుకల్లో ప్రత్యేకత. పూరీ రాజవంశానికి చెందినవారు బంగారు చీపుళ్లతో రథయాత్రకు ముందు నేలను శుభ్రం చేసే సంప్రదాయాన్ని బెహరా పహరా అంటారు. ప్రతి ఏడాది మూడు కొత్త రథాలు చేయిస్తారు. రథానికి 16 చక్రాలు ఉంటాయి. అధిక ఆషాఢం వచ్చే సంవత్సరాల్లో దేవతల విగ్రహాలను కూడా మారుస్తారు.జగన్నాథునికి అన్నాన్ని నైవేద్యంగా సమర్తిస్తారు. పూరీ సమీపంలో సాక్షి గోపాల మందిరం దర్శిస్తేనే పూరీ యాత్ర దర్శన ఫలం కలుగుతుందని విశ్వాసం. జయదేవుడు, రామానుజులు, రామానందుడు, చైతన్య ప్రభు ఈ క్షేత్రాన్ని దర్శించారు. పూరీలో ఆది శంకరులు గోవర్ధన పీఠం నెలకొల్పారు. జైనులు, బౌద్ధులకు కూడా ఇది పవిత్ర క్షేత్రమే. పూరీ శక్తిపీఠంకూడా. ఇక్కడి అమ్మవారు విమలాదేవి.

ఆలయ చరిత్ర:
పూర్వం ఇంద్రద్యుమ్నునికి కలలో విష్ణుమూర్తి కనిపించి సముద్రంలో వేపమాను తేలియాడుతూ ఉందని దాన్ని తెప్పించి విగ్రహాలను చేయించమని ఆదేశించాడు. ఆ తర్వాత శ్రీమహావిష్ణువే వృద్ధ శిల్పిరూపంలో వచ్చి ఇరవై ఒక్కరోజుల వ్యవధిలో తాను దేవతావిగ్రహాలు తయారు చేయగలనని, తాను విగ్రహాలు నిర్మించే గది తలుపులు ఎవరూ తెరవరాదని చెప్పగా రాజు అంగీకరించాడు. కొన్ని రోజుల తర్వాత మహారాణి ఆహార పానీయాలులేని శిల్పి పరిస్థితిని గురించి తెలుసుకోవాలనే ఆందోళనతో తలుపులు తెరిపించింది. అయితే గదిలో శిల్పి కనిపించలేదు. అసంపూర్తి విగ్రహాలు మూడు దర్శనమిచ్చాయి. బలరామ జగన్నాథులకు చేతులు ఉన్నాయి. సుభద్రకు చేతులు కూడా లేవు. ఏ విగ్రహానికీ కళ్లు లేవు భగవదేచ్ఛగా భావించి రాజు వాటినే గర్భగుడిలో ఉంచి పూజించసాగాడు. శ్రీకృష్ణావతర పరిసమాప్తి అనంతరం ఆయన దేహమే దారువుగా మారిందని, అదే జగన్నాథమూర్తి అని పురాణాలు చెబుతున్నాయి.

జగన్నాథుడి మహాప్రసాదం!

తూర్పుతీర దివ్యధామం పూరీ శ్రీక్షేత్రం. సప్త మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటైన ఆ పరమ పుణ్యతీర్థంలో సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి సమేతంగా కొలువుదీరిన జగన్నాథుణ్ణి కనులారా దర్శించి, అక్కడి మహాప్రసాదాన్ని ఒక్కసారయినా స్వీకరించి తరించాలనుకుంటారు భక్తులు. ఎందుకంటే ఆ దివ్యక్షేత్ర పాకశాలలో తయారయ్యే అన్నభోగం... అమృతతుల్యం..

పురుషోత్తమ, శంఖు, నీలాద్రి, శ్రీక్షేత్రం... ఇలా విభిన్న పేర్లతో పిలిచే పూరీ క్షేత్ర ప్రాశస్త్యం గురించి మత్స్య, స్కంద, విష్ణు, వామన పురాణాలన్నింట్లోనూ కనిపిస్తుంది. ప్రస్తుత ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోరగంగదేవ్‌ నిర్మించతలపెడితే, ఆయన మనుమడు అనంగభీమదేవ్‌ పాలనలో పూర్తయినట్లు శాసనాలద్వారా తెలుస్తోంది. చరిత్రని పక్కనబెడితే వేల సంవత్సరాలనుంచీ భక్తుల కొంగుబంగారమై విలసిల్లుతున్నాడు పూరీ జగన్నాథుడు. ఏటా ఆషాఢ శుద్ధ విదియనాడు ప్రారంభమయ్యే రథయాత్రను ఎంతటి భక్తిప్రపత్తులతతో వీక్షిస్తారో, నిత్యం అక్కడి పాకశాలలో వండి స్వామికి నివేదించే అన్నాన్నీ అంతే భక్తితో మహాప్రసాదంగా స్వీకరిస్తారు సందర్శకులు. అందుకే ఆ జగన్నాథుణ్ణి దర్శించే భక్తులంతా ఆనందబజారు ఆవరణలో ఒబడా(అన్నభోగం)ను అత్యంత ప్రీతితో ఆరగిస్తుంటారు.

భోజనప్రియుడు జగన్నాథుడు!
అందరివాడూ అందనివాడుగా భక్తుల నీరాజనాలందుకుంటున్న జగన్నాథుడు భోజనప్రియుడు. స్వామికి నిత్యం అన్నభోగం అర్పణవుతుంది. పురాణగాథ ప్రకారం విష్ణుమూర్తి ఉదయం స్నానసంధ్యాదులు రామేశ్వరంలో ఆచరించి, అల్పాహారం బదరీనాథ్‌లో భుజించి, మధ్యాహ్న భోజనానికి పూరీ చేరుకుని, రాత్రికి ద్వారకలో విశ్రాంతి తీసుకుంటాడని చెబుతారు. అందుకే జగన్నాథుడికోసం రకరకాల వంటల్ని వండి స్వామికి రోజుకి ఆరు భోగాలుగా నివేదిస్తారు. గతంలో నిత్యం మధ్యాహ్న భోగలో 56 రకాల వంటకాలూ సమర్పించేవారు. కానీ ప్రస్తుతం పండగలూ, పర్వదినాల్లో మాత్రమే 56 నుంచి 64 రకాల పిండివంటల్ని అర్పిస్తున్నారు. వేల సంవత్సరాలనుంచీ మహాప్రసాదం రుచిలో ఎంతమాత్రం మార్పు ఉండకపోవడం ఈ ఆలయ ప్రత్యేకత. పాకశాలలో వంటలు తయారయ్యాక సేవాయత్‌లు నోటికి గుడ్డ కట్టుకుని గర్భగుడికి తీసుకెళతారు. వాటిని తీసుకెళ్లే సమయంలో ఎవరూ ఎదురుపడకూడదు. దేవుడికి ఆహారాన్ని కూడా ఓ రకమైన నాట్యం ద్వారా అర్పిస్తుంటారు. ముగ్గురు మూర్తులకూ అర్పణ తరవాత ప్రసాదాలను ఆనందబజారుకి తరలిస్తారు. స్వామికి సమర్పించడంతో ఆ ప్రసాదానికి దైవత్వం సిద్ధించి మరింత రుచివస్తుందని విశ్వసిస్తారు.

అతిపెద్ద వంటశాల!
అతి పెద్ద శాకాహార పాకశాలల్లో ఒకటిగానే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద ఓపెన్‌ కిచెన్‌గానూ పూరీ ఆలయ పాకశాలను అభివర్ణిస్తుంటారు. ఆంగ్లేయులు దీన్ని ‘మిరకిల్‌ హోటల్‌’గానూ పేర్కొన్నారు. వంటశాలలో ప్రధాన పాకశాస్త్ర నిపుణులు 500 మందీ, వాళ్లకు సహాయకులుగా 300 మందీ ఉంటారు. పాకశాలలోకి వెళ్లకుండానే వీళ్లకు కావలసినవి అందించడానికి మరో 200 మంది ఉంటారు. వండేవాళ్లంతా పురుషులే. ఇతరులను వండే చోటుకి అనుమతించరు. పొరబాటున కుక్కగానీ వస్తే వండినదంతా భూమిలో పాతి, మళ్లీ వండుతారు. అక్కడి వంటని లక్ష్మీదేవే అదృశ్యరూపంలో స్వయంగా పర్యవేక్షిస్తుంటుందనీ ఆమె గజ్జెల సవ్వడి కూడా వినిపిస్తుంటుందనీ అందుకే ఆ వంటకాలు అంత రుచిగా ఉంటాయనీ చెబుతారు. ఆ కారణంతోనే అక్కడి అర్పణాన్ని మహాలక్ష్మీపాకం అని పిలుస్తారు. అక్కడ ఉండే గంగ-జమున బావుల్లోని నీరు కూడా ఆ ప్రసాదం రుచికి కారణమేనట. పాకశాలలో ఒకేసారి పదివేలమందికి వండి వార్చే సంబారాలు సదా సిద్ధంగా ఉంటాయి. వేడుకల సమయంలో యాభై నుంచి లక్ష మందికి సరిపోయేలా వండుతారు.

నిత్యం కొత్త కుండలే!
వంటశాలలో షడ్భుజాకారంలో మట్టి, ఇటుకలతో నిర్మించిన 752 పొయ్యిలు ఉంటాయి. ప్రతిరోజూ సూర్యుణ్ణీ అగ్నిదేవుణ్ణీ స్తుతిస్తూ మంత్రాలు చదువుతూ హోమం చేసిగానీ పొయ్యి వెలిగించరు. నవగ్రహాలూ నవధాన్యాలూ నవదుర్గల్ని సూచిస్తూ కుండమీద కుండ... ఇలా వరసగా తొమ్మిది కుండలు పెట్టి వండే విధానం నిన్నమొన్నటివరకూ ఉండేది. అందరికీ ఆ పద్ధతి కుదరకపోవడంతో ఈమధ్య వరసగా పెట్టిన పొయ్యిలమీదే వండుతున్నారట. ఒకసారి వండిన పాత్రలో మరోసారి వండరు. ఎప్పటికప్పుడు కొత్త కుండలు ఉపయోగించాల్సిందే. ఆ కుండలు కూడా సమీపంలోని కుంభారు గ్రామస్థులు చేసినవే అయ్యుండాలి. విదేశాలనుంచి వచ్చిన ఆలూ, టొమాటో, పచ్చిమిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్‌... లాంటి కూరగాయల్ని అస్సలు వాడరు. ఉల్లి, వెల్లుల్లి కూడా నిషేధమే. ఆకుకూరలు, కొబ్బరి, నెయ్యి, బియ్యం, పప్పు, పాల ఉత్పత్తులతోనే రకరకాలు చేస్తుంటారు. పంచదారకు బదులు తాటిబెల్లం; పచ్చిమిర్చికి ప్రత్యామ్నాయంగా మిరియాలు వాడతారు. తీపివంటకాల్లో యాలకులు, దాల్చినచెక్క, కుంకుమపువ్వు వాడితే, కారం వంటకాల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, అల్లం, ఇంగువ, పసుపు, చింతపండు వంటివి ఉపయోగిస్తారు. ఆలయ నియమావళినీ, సంప్రదాయ పద్ధతుల్నీ అనుసరించి పండగలూ, పర్వదినాల్లో పిండివంటలు సిద్ధం చేస్తారు. వీటిని స్వామికి నివేదించాక ప్రసాదాలు పంచే ప్రదేశమైన ఆనందబజారులో విక్రయిస్తారు. అయితే ఆనవాయితీ ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమ నుంచి ఆషాడ అమావాస్య వరకు అనారోగ్యం పాలయ్యే జగన్నాథునికి గుప్త వైద్యసేవలు జరుగుతాయి. ఆ సమయంలో స్వామికి నైవేద్యం పెట్టరు. అందువల్ల అప్పుడు మాత్రం మహాప్రసాదం అందుబాటులో ఉండదు.

ఆరోగ్యకరం మహాప్రసాదం
స్వామి ప్రసాదాల్లోకెల్లా ఆరోగ్యకరమైనది ఒబడా అని భక్తులంటారు. ఇందులో అన్నం, ముద్దపప్పు, తోటకూర, సొంతులా(కూరగాయల ఇగురు), సక్కొరొ(తీపి పులుసు), ఖిరి(పాయసం)...వంటివన్నీ ఉంటాయి. పిండివంటల విషయానికొస్తే కక్కరా, అరిసె, పుడొపిఠా, పుళి, చొక్కులి, బాల్సా, రసాబొలి, రసమలై, కాజా... తదితర తీపి పదార్థాలు భక్తులకు నోరూరిస్తాయి. మహాప్రసాదాన్ని పవిత్రమైనదిగా విశ్వసించే భక్తులు శుభకార్యాల్లో ఇతర వంటకాలు వడ్డన చేయడానికి ముందు ఒబడాను కొద్దిగా పెడతారు. వివాహాది శుభకార్యాలు, ఇతర శ్రాద్ధకర్మలు చేపట్టేవారు పూరీ ఆనందబజారుకి ఆర్డరు చేస్తే ఆ సమయానికి మహాప్రసాదం సిద్ధం చేస్తారు. ఒబడా మిగిలిన పక్షంలో దాన్ని శుభ్రమైన ఆవరణల్లో ఆరబోసి నిర్మాయిల్‌(ఎండు అన్నం) చేస్తారు. దీన్ని చిన్న సంచుల్లో వేసి విక్రయిస్తారు. శేషాన్నంతో తయారైన నిర్మాయిల్‌ఎన్నేళ్లయినా పాడవదు. దీన్ని యాత్రికులు తప్పనిసరిగా కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్లి పూజాగదుల్లో భద్రపరచుకుంటారు. పండగలు, పర్వదినాలు, వ్రతాల సమయాల్లో ఉపవాసాలు చేసేవాళ్లు కాస్తంత నిర్మాయిల్‌ నోట్లో వేసుకుంటే ఆకలి వేయదని విశ్వసిస్తారు. చివరి మజిలీకి చేరుకున్న వృద్ధులకు అవసానకాలంలో తులసీ జలంలో నిర్మాయిల్‌ కలిపి నోట్లో పోయడం ఒడిశాలో ఇంటింటా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ అక్కడి అన్నప్రసాదం నుంచి జున్నుతో తయారయ్యే రసగుల్లాల వరకూ ఏది తిన్నా భక్తులంతా ‘ఆహా ఏమి రుచి...’ అనాల్సిందే. అంతా ఆ జగన్నాథుడి మహాత్మ్యమే..!

A.నాగభూషణం


సర్వం జగన్నాథం

ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే... జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.

ఆషాఢ శుద్ధవిదియ...
పూరీ క్షేత్రంలో పండుగ ఆ రోజు. భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతుంటుంది. జగన్నాథ జయజయధ్వానాలతో పూరీ నగరవీధులన్నీ మారుమోగుతుంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించి పోతారు. భక్తిపారవశ్యంతో మైమరచిపోతారు. ఆ క్షణం అపురూపం. స్వరం జగన్నాథం.

రెండు నెలల ముందే...
జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయతృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకీ, 763 కాండాలను బలరాముడి రథనిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ వినియోగిస్తారు.

ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథనిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటిచారలున్న పసుపువస్త్రంతో ‘నందిఘోష’ను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. పద్నాలుగు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం. ఎత్తు 43 అడుగులు. పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతిరథానికీ 250 అడుగుల పొడవూ ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు.

విదియనాడు...
మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లిన పండాలు (పూజరులు) ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే ‘మనిమా(జగన్నాథా)’ అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా... దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడ్ని చూడగానే జై బలరామా, జైజై బలదేవా అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో బోడోదండా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథా అంటూ భక్తిపారవశ్యంతో జయజయధ్వానాలు చేస్తారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండీ అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ మూడు విగ్రహాలనూ తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు... ఇంద్రద్యుమ్న మహారాజుకన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం... ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది.

రాజే బంటు...
సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా... పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చెరా పహారా అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ, సుభద్రాదేవినీ అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి.జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి... జై జగన్నాథా అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. విశాలమైన బోడోదండ (ప్రధానమార్గం) గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు.భక్తుల తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే... జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్రపేరిట పదిరోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది.

స్థలపురాణం
ఇంద్రద్యుమ్నుడనే మహారాజుకు విష్ణుమూర్తి కలలో కనిపించి చాంకీ నదీ తీరానికి ఒక కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా మలచమనీ ఆజ్ఞాపించాడట. కానీ అలా నదీతీరంలో లభ్యమైన దారువును విగ్రహాలుగా మలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదట. అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ రాజు వద్దకు మారువేషంలో వచ్చి... ఆ కొయ్యను తాను విగ్రహాలుగా మలచగలనన్నాడట. కానీ తాను తలుపులు మూసుకుని ఈ పని చేస్తానని తన పనికి మధ్యలో ఆటంకం కలిగించకూడదనీ షరతు పెడతాడు. కానీ 15 రోజుల తర్వాత... ఉత్సుకతను ఆపుకోలేని రాజు తలుపులు తెరిపించాడట. అప్పటికి విగ్రహాల నిర్మాణం పూర్తికాలేదు. దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారనీ ఇప్పటికీ జగన్నాథుడు అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడనీ స్థలపురాణం.

ఎందుకంటే..?
రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరొకొందరు చెబుతారు. ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే... పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథబలభద్రుల కోసం ప్రధానాలయానికి మూడు కి.మీ. దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచామందిరం జగన్నాథుడి అతిథిగృహం అన్నమాట!

ఎలా చేరుకోవాలి

* ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం ఉంది.
* భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్‌ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో ఉంది.
* దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.
* కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో ఉంది.
* భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.అశేష జనం కొలిచే ‘విశేష’ జగన్నాథుడు

ప్రస్తుత పూరీని ఒకప్పుడు శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అనీ, పురుషోత్తమ పురి అనీ, జగన్నాథపురి అని పిలిచేవారు. ఈయనకు నీలమాధవుడని పేరు. ఈ నీలమాధవునికి తొలి పూజలు చేసింది విశ్వవసు అనే శబర నాయకుడు. జగన్నాథునికి ఆలయాన్ని నిర్మించింది గంగవంశస్థులు. నీలమణితో తయారైన నీలమాధవుని విగ్రహం కాలగర్భంలో కలిసిపోగా, ఇంద్రద్యుమ్నుడనే మహారాజు తనకు కలలో కనపడిన దారువు (కొయ్యదుంగ)ను విగ్రహాలుగా చెక్కించి, వాటినే ప్రతిష్టించి, పూజలు జరిపాడు. ముగ్ధమనోహర రూపంలో ఉండే ఈ మూర్తులను శంకర భగవత్పాదులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి ఎందరో మహానుభావులు ఇక్కడ తమ మఠాలను ఏర్పాటు చేసుకుని మరీ కొలిచారు, తరించారు.

సుందరం... సువిశాలం:
ఎల్తైన గోడలతో, చక్కటి పనితనం ఉట్టిపడే ద్వారాలతో పూరీ జగన్నాథుడు కొలువైన ఈ దివ్యధామం అత్యంత సుందరమైనదే కాదు,  సువిశాలమైనది కూడా. నాలుగు ప్రవేశద్వారాలున్న ఈ ఆలయంలో అసంఖ్యాకమైన ఉపాలయాలు, ఇతర దేవతా సన్నిధానాలు కూడా ఉన్నాయి. సుమారు లక్షమంది ఒకేసారి కూచుని భోజనం చేసేంత పెద్ద భోజనశాల, దానికి ఏమాత్రం తీసిపోని విధమైన వంటగది ఈ ఆలయ ప్రత్యేకత.

నిత్యం 56 రకాల పిండివంటలతో అత్యంత నియమ నిష్ఠలతో జగన్నాథుడికి నివేదన చేస్తారు ఆలయ పూజారులు. స్వామికి చేసే నివేదన అంతా మట్టికుండలలోనే తయారవడం విశేషం. ఆ రూపమే అపురూపం... పూరీ జగన్నాథునిది చాలా విచిత్రరూపం. దారుమూర్తిగా పెద్ద పెద్ద కళ్లతో, కాళ్లు, చేతులు, పెదవులు, చెవులు లేకుండా కేవలం ఒక చెట్టుకు పసుపు, కుంకుమలతో అలంకరించినట్లుగా ఉండే ఆటవిక రూపం.

అయితేనేం, ఈ సువిశాల ప్రపంచాన్నంతటినీ చూడడం కోసమే అన్నట్లు ఇంతింతలావున ఉండే గుండ్రని కన్నులతో, త్రికోణాకారంలో ఉండే ముఖం జగన్నాథునిది కాగా, గుండ్రని ముఖారవిందంతో బలభద్రుడు కనువిందు చేస్తాడు,  సుభద్రాదేవి పసుపుపచ్చని వర్ణంతో దర్శనమిస్తుంది. ఈ మూడు మూర్తులూ కూడా కేవలం నడుము భాగం వరకే ఉంటాయి. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుని విగ్రహాలను తయారు చేస్తారు. అంటే కొత్తమూర్తులను తయారు చేసి, పాతమూర్తులలోని ‘బ్రహ్మపదార్థాన్ని’ వాటిలో ప్రవేశపెడతారు. దీనినే నవకళేబర (శక్తి ఆవాహన) ఉత్సవమంటారు. పాతమూర్తులను కొయిలి వైకుంఠమనే ప్రదేశంలో భూస్థాపితం చేస్తారు.

జగన్నాథ రథం:
విశ్వజనీనమైన పండుగగా జరుపుకునే ఈ రథయాత్రలో నిర్ణీతమైన పూజావిధానమే కనిపించదు. వేదమంత్రోచ్చారణ అసలే వినిపించదు. అయితేనేం, భాష, కులం, లింగ, సంస్కృతి, సంప్రదాయం తదితర భేదాలన్నింటినీ పక్కకు తోసి మరీ ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా విచ్చేసి కన్నులపండువైన ఈ ఉత్సవంలో పాల్గొంటారు. పేద, ధనిక, స్త్రీ, పురుష, వృద్ధ, యువక భేదం లేకుండా అందరూ రథయాత్రలో పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ  ఒకే పంక్తిలో భోజనాలు చేస్తారు. అందుకే ‘సర్వం జగన్నాథం’ అంటారు.

ఇతర సందర్శనీయ స్థలాలు:

పూరీలో జగన్నాథాలయం తర్వాత పూరీ బీచ్, కోణార్క్‌ బీచ్, చిల్కా సరస్సు, స్వర్గద్వార్‌ బీచ్, రఘురాజ్‌పూర్‌ ఆర్టిస్ట్‌ విలేజ్, సాక్షి గోపాలుడి గుడి, అలర్నాథాలయం, గుండిచా గుడి, విమలాలయం, లక్ష్మీ ఆలయం, కంచి గణేశాలయం, పూరీ లైట్‌ హౌస్‌లు చూడదగ్గ ప్రదేశాలు.

ఎలా వెళ్లాలి?
దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి పూరీకి నేరుగా రైళ్లున్నాయి. రైల్వేస్టేషన్‌ లేదా బస్‌ స్టాండ్‌ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గల జగన్నాథాలయానికి ఆటోలు, లోకల్‌ బస్సులలో చేరుకోవచ్చు.
ఆకాశమార్గంలో వెళ్లాలనుకునేవారికి దగ్గరలోని విమానాశ్రయం భువనేశ్వర్‌. అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని పూరీకి వెళ్లడానికి బస్సులు, రైళ్లు ఉన్నాయి.
పూరీలో అన్ని తరగతుల వారికీ వారి వారి స్థోమతకు సరిపడా లాడ్జీలు, హోటళ్లు ఉన్నాయి.
– డి.వి.ఆర్‌.భాస్కర్‌విశ్వరక్షకుడి విశేషయాత్ర

జగన్నాథుడు విశ్వరక్షకుడు. శతాబ్దాల చరిత గల ఆ దేవదేవుడికి ఏటా జరిపే రథయాత్ర నిత్యనూతన శోభితం. శ్రీమహావిష్ణువు దారుబ్రహ్మగా కొలువుదీరిన పూరీ క్షేత్రంతో పాటు దేశవిదేశాల్లో జగన్నాథ రథచక్రాలు కదులుతాయి.ఆ దృశ్యాన్ని వీక్షించడాన్ని భక్తులు దానిని పూర్వజన్మ సుకృతంగా, నేత్రోత్సవంగా భావిస్తారు. ఈ సారి ఈ నెల 25వ తేదీ ఆదివారం రథయాత్ర కన్నుల పండువగా జరగనుంది.

దేశంలోని ఏడు మోక్షదాయక క్షేత్రాలలో పూరీ ఒకటి. మత్స్య, స్కంధ, విష్ణు, వామన పురాణాల్లో ఈ క్షేత్రం ప్రస్తావన కనిపిస్తుంది. అన్నాచెల్లెళ్ల ప్రేమకు నిదర్శనం ఈ క్షేత్రం. శ్రీకృష్ణుడు జగన్నాథస్వామిగా దేవేరులతో కాకుండా అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రతో కొలువు తీరడం ఇక్కడి విశిష్టత. శ్రీమహావిష్ణువు రామేశ్వరంలో స్నానసంధ్యాదులు ముగించుకుని, బదరీనాథ్‌లో అల్పాహారం స్వీకరించి, మఽధ్యాహ్న భోజనానికి పూరీ చేరుకుంటాడని, రాత్రి ద్వారకలో విశ్రమిస్తాడని ప్రతీతి.
‘ఎంత మాత్రమును ఎవరు కొలిచిన అంత మాత్రమే నీవు...’అని అన్నమాచార్యులు తిరుమలేశుని కీర్తించినట్లు పూరీలోని జగన్నాథుడి ఆలయంలో వైష్ణవ సంప్రదాయం కొనసాగుతున్నా... స్వామిని శైవులు శివుడిగా, శాక్తేయులు భైరవునిగా, బౌద్ధులు బుద్ధునిగా, జైనులు ‘అర్హర్ద’గా, అలేఖ్యులు శూన్య స్వరూపునిగా పూజిస్తారు.

కళ్లెదుట దైవం
శంకర భగవత్పాదులు, రామానుజ యతీంద్రులు తదితర ఎందరో మహనీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించి మఠాలు నెలకొల్పారు. శంకరాచార్యులు దేశ పర్యటనలో భాగంగా నలుదిక్కుల స్థాపించిన మఠాలలో పూరీలోని మఠం ఒకటి. బదరిలో జ్యోతిర్మతి’. రామేశ్వరంలో ‘శృంగేరి’, ద్వారకలో ‘శారద’, పూరీలో ‘భోగవర్ధన’ మఠం స్థాపించారు. వీటిని వరుసగా త్యాగ, భోగ, ఐశ్వర్య, కర్మ క్షేత్రాలుగా అభివర్ణిస్తారు. స్వామి ఎల్లప్పుడూ తన కళ్ల ముందే ఉండాలన్న అపేక్షతో శంకరాచార్యులు ‘జగన్నాథస్వామి నయన పథగామి భవతు మే’ మకుటంతో ‘జగన్నాథాష్టకం’లో స్తుతించారు. సిక్కుగురువు గురునానక్‌ ఈ క్షేత్రాన్ని సందర్శించారని చరిత్ర. జయదేవుడు ఈ స్వామి సన్నిధిలో ‘గీత గోవింద’ కావ్యాన్ని రచించారు.

రథయాత్రలో చీపురు పట్టే రాజు
‘రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన న విద్యతే’....రథంపై విష్ణుమూర్తి ఊరేగుతున్న దృశ్యం వీక్షించిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అందునా పూరీలో జగన్నాథ రథోత్సం మరింత విశిష్టమైందిగా భావిస్తారు. ఈ ఉత్సవాన్ని శతాబ్దాల తరబడి నిర్వహిస్తున్నా నిత్యనూతనమే. స్వామి నవనవోన్మేషుడు. జగములనేలే దేవదేవుడు సోదరసోదరీ సమేతంగా. ‘శ్రీ మందిరం వీడి జనం మధ్యకు రావడం, రోజులు తరబడి ఆలయానికి దూరంగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఊరేగింపునకు బయలుదేరిన రథం మరునాడు సూర్యోదయంలోగా యథాస్థానానికి చేరాలన్నది శాస్త్ర వచనం. కానీ పూరీ ఉత్సవంలో బయలుదేరిన రథాలు తొమ్మిది రోజుల తర్వాతే తిరిగి వస్తాయి. పూరీ రాజు స్వామికి తొలి సేవకుడు. ఆయన కిరీటాన్ని తీసి నేలమీద ఉంచి బంగారు చీపురుతో రథాన్ని శుభ్రపరచి మంచిగంధం నీటితో కడుగుతారు. రథాల ముందు పన్నీరు కళ్లాపి చల్లుతారు. ‘చెర్రాపహరా’అనే ఈ ప్రక్రియ విశిష్టమైనది.

చెల్లెమ్మ సు‘భద్రం’
ఏ ఆలయంలోనైనా ఉత్సవమూర్తులందరినీ ఒకే రథంలో తీసుకు వెళ్లడం సహజం. పూరీలో మాత్రం ముగ్గురు దేవతామూర్తులు జగన్నాథ, బలభద్ర, సుభద్రలను వేర్వేరు రథాల్లో ఊరేగిస్తారు. అన్నగారి రథం అగ్ర భాగాన ఉంటే ఆ తర్వాత చెల్లెలి రథం వెళుతుంది. జగన్నాథుని రథం వారిని అనుసరిస్తూ సోదరి సుభద్రను సు‘భద్రం’గా చూసుకునే తీరు, ‘చెల్లెలి’పై అనురాగాన్ని చాటిచెబుతుంది.

అశ్లీల పదార్చన
ఇతర క్షేత్రాల రథయాత్రల్లో కనిపించని దృశ్యాలు, వినిపించని మాటలు ఆక్కడ కనిపిస్తాయి. దోషంగా భావించే మద్యం పానాన్ని ఇక్కడ సాధారణంగా పరిగణిస్తారు. రథంలాగే సమయంలో అశ్లీల పద ప్రయోగం ఆచారంగా వస్తోంది. రథయాత్ర సందర్భంగా ‘జై జగన్నాథ...జై.జై జగన్నాథ’ నినాదాలతో పాటు అశ్లీల పదప్రయోగం ఉంటుంది. రథం ఆగినప్పుడు ఆ పదాలను ఉపయోగిస్తూ కొబ్బరికాయలు కొడుతుంటారు. ‘దాహుక’ అనే జగన్నాథ సేవకుడు ఇందు నిమిత్తం ప్రత్యేకంగా రథం వద్ద ఉంటాడు.

పరమాత్మకు ‘పథ్యం’
జగన్నాథ ఆరాధన శైలి మానవ జీవితచక్రాన్ని పోలి ఉంటుంది. ఆకలిదప్పులు, అనారోగ్యం, మమతలు, అభిమానాలు, అలకలు గోచరిస్తాయి. జ్యేష్ఠ పౌర్ణమి నాడు దేవస్నాన యాత్రలు ప్రారంభమవుతాయి. 108 బిందెల సుదీర్ఘ స్నానంతో మానవ సహజమైన అనారోగ్యం బారిన పడిన తిరిగి కోలుకునేందుకు రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో దైతపతులు అనే సవరలకు తప్పించి ఒడిశా మహారాజు సహా ఎవరికి స్వామివార్ల దర్శన భాగ్యం కలగదు. వీరు తమతమ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. నిత్యం 64 రకాల పదార్థాలు ఆరిగించే స్వామికి ఆ సమయంలో ‘పథ్యం’గా కందమూలాలు, పండ్లు మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు.

ప్రతి రథమూ ప్రత్యేమే!

  • జగన్నాథస్వామి రథాన్ని ‘నందిఘోష’ అంటారు దీని ఎత్తు 44 అడుగులు.పదహారు చక్రాలుంటాయి. తేరును తెలుపు, పసుపు వస్త్రాలతో అలంకరిస్తారు. రథాన్ని లాగే తాడును ‘శంఖచూడ నాగ’ ’ అంటారు.
  • బలభద్రుడి రథం ‘తాళధ్వజం’. 43 అడుగుల ఎత్తు. 14 చక్రాలు ఉంటాయి. రథాన్ని ఎరుపు, ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరిస్తారు. రథానికి ఉపయోగించే తాడును ‘వాసుకీ నాగ’ అంటారు.
  • సుభద్ర రథాన్ని ‘దర్పదళన్‌’ అంటారు. ఎత్తు 42 అడుగులు. 12 చక్రాలు ఉంటాయి. ఎరుపు, నలుపు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. దానికి వాడే తాడును ‘స్వర్ణచూడ నాగ’ అంటారు.
  • ప్రతి రథానికీ 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం గల తాళ్లను కడతారు.

ప్రసాదం-సర్వం జగన్నాథం
జగన్నాథుడు నైవేద్య ప్రియుడు. నిత్యం 64 రకాల పిండివంటలను కట్టెల పొయ్యి మీద తయారు చేస్తారు. ఆకుకూరలు, కూరగాయలతో ప్రత్యేకంగా తయారు చేసిన పదార్థాలను నివేదిస్తారు. ఆయన వంటశాల దేశంలోని అన్ని దేవాలయల్లో కన్నా పెద్దది. వంటలకు మట్టి పాత్రలనే వాడతారు వంటకు ఒకసారి వాడిన కుండలను మరోసారి వాడరు. వాటన్నిటిని సమీపంలోని ‘కుంభారు’ గ్రామస్థులు తయారు చేస్తారు.

ఇక్కడ కుండ మీద కుండ పెట్టి అన్నం వండే విధానం విచిత్రమే. కట్టెల పొయ్యిపై ఒకేసారి ఏడుకుండలను పెట్టి వండినా అన్ని కుండల్లోని పదారాలూ చక్కగా ఉడుకుతాయి. శ్రీమహాలక్ష్మి స్వయంగా వంటను పర్యవేక్షిస్తుందని భక్తుల విశ్వాసం.

ఈ ప్రసాదాన్ని ‘ఓబడా’ అని, ప్రసాద వినియోగ ప్రదేశాన్ని ‘ఆనందబజార్‌’ అనీ అంటారు. అన్నప్రసాదంతో పాటు ‘శుష్క ప్రసాదం’ తయారు చేస్తారు. దైవదర్శనానికి వచ్చేవారు అక్కడికక్కడ ప్రసాదాన్ని స్వీకరించడం అన్నప్రసాదం కాగా ఇంటివద్ద ఉన్నవారికి తీసుకువెళ్లేది శుష్కప్రసాదం. స్వామికి నివేదించిన అన్నప్రసాదం గల పెద్ద పళ్లాన్ని అర్చకులు (పండాలు) అక్కడ ఉంచగానే భక్తులు తమకు కావలసిన ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తారు. అన్నం, పప్పు అయ్యాక ఆ పక్కనే విశాలమైన మూతి ఉన్న పాత్రలో మజ్జిగ ఉంటుంది. ‘ఎంగిలి’ ప్రసక్తి ఉండదు. ‘సర్వం జగన్నాథం’ అనే మాట ఇక్కడ అలాగే పుట్టి ఉంటుంది.

‘నవ్య’త జగన్నాథుని ప్రత్యేకత
జగన్నాథ, సుభద్ర, బలభద్ర విగ్రహాల నుంచి అన్నీ నిత్య నూతనమే. దేవతామూర్తుల విగ్రహాలను ఏటా తయారు చేస్తారు. ఆలయ శిఖరంపై ఎగిరే ‘పతిత పావన’ పతాకాన్ని ప్రతి ఉదయం మార్చి కొత్తది ఎగురువేస్తారు.
ఇతర క్షేత్రాల్లో కంటే భిన్నంగా పూరీలో రథయాత్ర శూన్యమాసంగా పిలిచే ‘ఆషాఢం’లో జరుగుతుంది.
-డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామిపూరీ జ‌గ‌న్నాథుని దేవాలయం

ప్రపంచ ప్రఖ్యాత దివ్యధామం, పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యం కల పుణ్యక్షేత్రం, భారతదేశంలో గల ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ముఖ్యమైనది మరియు చార్‌ధామ్‌లలో అత్యంత ప్రధానమైనది, అదే ఒడిషా రాష్ట్రంలో గల పూరీ దివ్య క్షేత్రం. ఇక్కడ శ్రీమహావిష్ణువు జగన్నాథుడి రూపంలో సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రలతో కలసి కొలువు తీరి ఉన్నాడు.

పూరీ దేవాలయంలో మూల విరాట్‌ నుండి ప్రసాదం వరకు అంతా విశిష్టమే. దేవాలయాలలో మూలవిరాట్‌ విగ్రహాలు రాతితో మరియు ఉత్సవ విగ్రహాలు పంచలోహములతో తయారు చేయబడతాయి. కాని ఈ విశిష్ట దేవాలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేయబడతాయి. అదే విగ్రహాలు ఉత్సవమూర్తులుగా ఊరేగింపబడతాయి. ప్రసాదంగా ఇచ్చే అన్నం, పప్పు మొదలైనవి కుండలలో వండుతారు. ఇతర దేవాలయాలలో మాదిరిగా స్వామి తన దేవేరులతో కొలువై ఉండక, సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కొలువై ఉంటాడు. అందుకే ఈ ఆలయంసోదర ప్రేమకు ప్రతీకగా కీర్తి పొందింది.

ఆలయంలో చెక్క విగ్రహాల ప్రతిష్ట వెనుక అనేకానేక పురాణగాధలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక కథనం ప్రకారం, ఉజ్జయిని పాలకుడైన ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకు కలలో విష్ణుమూర్తి దర్శనమిచ్చి సముద్రంలో తేలియాడుచున్న వేపమానుతో జగన్నాథుని రూపంలో తన విగ్రహాన్ని చేయించమని కోరాడట. విగ్రహాలను చెక్కడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ముందుకు వచ్చాడు. కాని తాను విగ్రహాలు చెక్కినపుడు ఎవరు లోపలికి రారాదని తలుపులు మూసుకున్నాడు. పదిహేను రోజులైనా శిల్పి బయటకి రాకపోవడంతో, అన్నపానీయాలు లేక ఆయన ఎక్కడ శుష్కించిపోతాడో అని భావించి, రాజమాత ఆదేశానుసారం తలుపులు తెరవగా, విగ్రహాలు అసంపూర్తిగా దర్శనమిచ్చాయి. శిల్పి అదృశ్యమైనాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శిల్పిగా వచ్చాడని భావించి, అసంపూర్తిగా ఉన్న ఆ విగ్రహాలనే రాజు ప్రతిష్టించాడని ప్రతీతి. అవయవ లోపం కలిగిన విగ్రహాలు అర్చనకు అనర్హం అని అంటారు. కానీ ఈ ‘నీలాచలం’ క్షేత్రంలో అదే ప్రత్యేకత. పూరీ జగన్నాథుడి రూపం దైవం చెక్కిన దారుశిల్పం.

ఆలయ నిర్మాణం:
జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్ధంలో కళింగ పాలకుడైన అనంతవర్మన చోడ గంగాదేవ నిర్మించగా, ఆ తర్వాత కాలంలో అనంగ భీమదేవి పునర్నించాడని తెలుస్తోంది. ఆలయం మొత్తం కళింగ శైలిలో నిర్మితమైనది.

పూరీ ఆలయం నాలుగు లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబ డింది. సుమారు 120 ఉపాలయాలు ఉన్నాయి. అమోఘమైన శిల్ప సంపదతో భారతదేశలోని అద్భుత కట్టడాలలో ఒకటిగా చెబుతారు. ఆలయంలో విష్ణువుకు చెందిన ‘శ్రీచక్ర’ ఎనిమిది ఆకుల చక్రంగా నిర్మించబడింది. దీనినే ‘నీలిచక్ర’ అనికూడా అంటారు. ధ్వజస్తంభం ఎత్తైన రాతి దిమ్మపై నిర్మించబడింది. ఇది గర్భగుడి కన్నా ఎత్తులో ఉంటుంది. తూర్పు ముఖంగా ఉం డే ఆయల ముఖ ద్వారాన్ని సింహ ద్వారం అంటారు. మిగిలన మూడు పక్కల ఉన్న ద్వారాలని ‘హాథీ ద్వారా’ (ఏనుగు), ‘వ్యాఘ్రద్వార'(పులి), ‘అశ్వద్వార'(గుఱ్ఱ ం) లుగా పిలుస్తారు. ప్రధానమైన సింహద్వారం ‘బడోదండో’ గా పిలిచే పెద్ద వీధికి దారి చూపుతుంది. ‘బాయిసిపవచ’ అంటే 22 మెట్లు ఆలయ ముఖ ద్వారానికి దారి చూపుతాయి.

జగన్నాథుడు విష్ణువు రూపంగా కొలువుబడుచున్నాడు. కానీ ఈ ఆలయంలోని కొన్ని విగ్రహాలను శివ రూపమైన భైరవ, శివపత్ని విమలగా కొలుస్తారు. ఇక్కడ అమ్మవారు 17వ శక్తిపీఠ ం విమలదేవిగా పూజలందుకుంటోంది. పూరీ జగన్నాధ శ్రీక్షేత్ర సంస్కృతి సాంప్రదాయాలు హైందవంలో శివ-శక్తి-వైష్ణవ తత్వాలకు ప్రతీకగా నిలుస్తాయి. అందుకే ఈ క్షేత్రం భక్తుల నీరాజనాలందుకుంటోంది. ప్రతి హిందువు జీవింలో ఒక్కసారైనా దర్శించుకోవలసిన దివ్యక్షేత్రం పూరీ. అలాగే ఈ క్షేత్రం బౌద్ధ, జైన మతాల్లలోని అంశాల మేలు కలయికగా ఏర్పడినట్టు చెబుతారు. గణ గణ మ్రోగే గంటలు, 65వ అడుగుల ఎత్తయిన పిరమిడ్‌ నిర్మాణం, వివరంగా చెక్కబడిన గోడలు, కృష్ణుడు యొక్క జీవితాన్ని చిత్రీకరిస్తున్న స్తంభాలు అసంఖ్యాక భక్తులను ఆకర్షిస్తున్నాయి.

ఈ దేవాలయాన్ని భగవత్‌ శ్రీరామానుజాచార్యుల వారు, ఆదిశంకరాచార్యుల వారు వంటి ఎందరో మతాచార్యులు సందర్శించారు. జగన్నాథస్వామి ఎప్పుడు తన కళ్ళెదుటే కదలాడాలని స్తుతించారు శంకరాచార్యులు. శంకరాచార్యుల వారు ఇక్కడ గోవర్ధన పీఠాన్ని స్థాపిస్తే, రామానుజాచార్యులు ఎన్నో వైష్ణవ మఠాలను స్థాపించారు. గురునానక్‌, కబీర్‌, తులసీదాస్‌ కూడా ఈ ఆలయాన్ని దర్శించిన ఆధారాలున్నాయి.

పూరీ జగన్నాథుడి ఆలయ గోపురం అంచు మీద సుదర్శన చక్రం దర్శనమిస్తుంది. దీనిపై పసుపు జెండా ఎగురుతూ ఉంటుంది. దీనిలోని ఎరుపు రంగు జగన్నాథుడు ఆలయంలో ఉన్నాడని సూచిస్తుందని భావిస్తారు. ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతియేటా ‘అక్షయ తృతీయ’ రోజున జరిగే చందనయాత్ర రథాల నిర్మాణాన్ని మొదలుపెట్ట డాన్ని సూచిస్తుంది. జ్యేష్ఠ పౌర్ణమినాడు స్నానయాత్ర పేరుతో ప్రతిమలకు స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంత కాలంలో ‘డోల యాత్ర’, వర్షాకాలంలో ‘ఝలన్‌ యాత్ర’ వేడుకలను నిర్వహిస్తారు. పంచాంగం ప్రకారం ప విత్రోత్సవం, దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తారు.

రథయాత్ర
పూరీ జగన్నాథ ఆలయం రథయాత్రకు ప్రసిద్ధి. జగన్నాథ రథయాత్ర శ్రీకృష్ణుడు గోకులం నుంచి మధురకు చేసే యాత్రగా పరిగణించబడుతుంది. రథోత్సవం అంటే సాక్షాత్తు ఆ భగవంతుడు భక్తులను వె తుక్కుంటూ రావడం. కృష్ణుడు భక్తజన సమ్మోహనుడు. నరులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటం వలన నర నారాయణుడయ్యాడు. అందువలన జగన్నాథ రథోత్సవానికి భక్తులు పోటెత్తుతారు. ప్రపంచంలో అసంఖ్యాక భక్త జనం పాల్గొనే ఉత్సవాలలో ఈ రథోత్సవానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆలయంలోకి అన్య మతస్థులకు ప్రవేశం నిషేధం. తన దగ్గరకు రాలేని వారి కోసం ఆ జగన్నాథుడు వీధులలో ఊరేగింపుగా వచ్చి అందరికి దర్శన భాగ్యం కలిగిస్తాడన్నది నమ్మకం. ఈ రథోత్సవాన్ని తిలకించి తరించడానికి కుల, మత, వర్గ విభేధాలను మరచి దేశవిదేశాల నుంచి అశేష జనవాహిని తరలి వస్తుంది. ఇసుక వేస్తే రాలనంత జనసంద్రంతో పూరీ నగరం కిటకిటలాడుతుంది.

పూరీలో రథయాత్ర సందర్భంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమినాడు జరిగే స్నాన పౌర్ణమి లేదా అభిషేకాల పౌర్ణమితో ఉత్సవాలు మొదలవుతాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు నేత్రోత్సవం, విదియనాడు రథయాత్ర, ఏకాదశినాడు బహుదా రథయాత్ర లేదా మారు రథయాత్ర (అనగా రథాలు తిరిగి ఆలయానికి చేరుకోవడం) నిర్వహిస్తారు.

రథోత్సవం ప్రారంభానికి ముందు జ్యేష్ఠ పౌర్ణమి నాడు 108 బిందెల పుణ్యజలాలతో దేవతా మూర్తులకు అభిషేకం చేస్తారు. ఈ సుదీర్ఘ స్నానంతో వారు అనారోగ్యం బారిన పడి, తిరిగి కోలుకొనేవరకు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో దర్శనాన్ని నిలిపివేస్తారు. 56 రకాల ప్రసాదాలు ఆరగించే స్వామికి, ఆ సమయంలో పథ్యంగా కందమూలాలు, పండ్లు మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. తిరిగి ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు ఆలయ ప్రవేశంతో నేత్రోత్సవం జరిపి యథాప్రకారం నైవేద్యం సమర్పిస్తారు. స్నాన పౌర్ణమి, నేత్రోత్సవం వంటి ఉత్సవాలు ఇంట్లోని విగ్రహాలకు చేయడం ఒడిషావాసులకు ఆనవాయితీ. స్నాన పౌర్ణమినాడు వి గ్రహాలకు అభిషేకం చేసి, వాటికి కొత్తగా రంగులు వేసి అలంకరిస్తారు.

రథయాత్రకు ఉపయోగించే రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా తయారుచేస్తారు. జగన్నాథుడు ఊరేగే రథాన్ని ‘నందిఘోష్‌’ లేదా ‘గరుడధ్వజ’ అంటారు. 45 అడుగుల ఎత్తుతో, 832 దుంగలతో చేయబడి, 16 చక్రాలు కలిగి ఉంటుంది. నందిఘోష్‌ చతుర్వేదాలకు ప్రతీకగా 4 గుర్రాలు పూన్చబడి ఉం టాయి. బలభద్రుని రథం ‘తాళధ్వజ్‌’ 44 అడుగుల ఎత్తుతో, 14 చక్రాలతో చతుర్యుగాలకు ప్రతీకగా నాలుగు గుర్రాలు లాగుతూ ఉంటాయి. సుభద్ర రథం ‘దర్పదళన్‌’ 43 అడుగుల ఎత్తుతో 12 చక్రాలతో ఉంటుంది. అక్షయ తృతీయ రోజున ర థాల తయారీ మొదలుపెడతారు. ఈ రథాలను ఆగమశాస్త్రం ప్రకారం నిర్మిస్తారు. 1072 కొయ్య దుంగలతో 120 మంది పనివారు రథాల తయారీలో పాలుపంచుకుం టారు.

ఆషాఢ శుద్ధ విదియనాడు ప్రారంభమయ్యే రథయాత్రలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలు వేరు వేరు రథాలు అధిరోహిస్తారు. గర్భాలయంలో రత్న సిహాసనం పై కొలువై ఉన్న జగన్నాథుడిని , సోదరుడు బలభద్ర, సోదరి సుభద్ర దేవి దేవతామూర్తులను ఆలయ సిం హద్వారం గూండా తీసుకొచ్చి అందంగా అలంకరించినటువంటి రథాలలో ఉంచి ఊరేగిస్తారు. జగన్నాథుడు నల్లని ముఖారవిందం, పెద్ద పెద్ద కళ్ళతో, బలభద్రుని ముఖం తెల్లని వర్ణంతో, సుభద్ర ముఖం పసుపు వర్ణంతో భక్తులకు కనువిందు చేస్తాయి.

యాత్ర ప్రారంభానికి ముందు రథాన్ని, అక్కడి ప్రాంతాన్ని పూరీ రాజకుటుంబానికి చెందిన రాజు బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. రాజైనా భగవంతుని ముందు సేవకుడే అని తెలిపేందుకు అనాదిగా ఈ ఆచారాన్ని పాటిస్తుండడం విశేషం. రుథయాత్ర సాగే వీథిని ‘బొడోదండో’ అని అంటారు. యాత్ర సుమారు 3 కి.మీ. మేర సాగుతుంది. ముందు బలభద్రుని రథం సాగుతుండగా, తరువాత సుభద్ర రథం దాన్ని అనుసరిస్తూ జగన్నాథ రథం సాగుతుంది. సోదరికి రక్షణగా ఆమె వెనుక జగన్నాథుడు పయనిస్తాడు. జగన్నాథ రథయాత్ర సాగుతుండగా ప్రత్యక్షంగా వీక్షించే లక్షలాది మంది భక్త జన తన్మయత్వం చెప్పనలవి కాదు. ‘రథస్తం జగన్నాథం దృష్ట్వా, పునర్జన్మ నభిద్యతే’ అంటే జగన్నాథ రథయాత్రను ప్రత్యక్షంగా వీక్షిస్తే పునర్జన్మ ఉండదని నమ్మకం. నేరుగా దర్శిచుకోలేనివారు ‘నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే | సుభద్రాప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్‌||’ అనే శ్లోకాన్ని జపించవచ్చు. దేశవిదేశాల నుంచి కుల, మత, వర్గ విబేధాలు మరచి తరలి వచ్చే భక్తజనం జగన్నాథుని రథాన్ని లాగడానికి పోటీ పడతారు.

రథయాత్ర ‘గుండీచ’ మందిరం వరకు కొనసాగుతుంది. గుండీచ జగన్నాథుడి పెంపుడు తల్లి. గుండీచ మందిరంలో బసచేసి, తొమ్మిదవ నాడు అంటే ఏకాదశి రోజున ఆలయానికి తిరిగి ప్రయాణమవుతారు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు. ఈ తిరుగు రథయాత్రను ‘బహుడా’ రథయాత్ర అని అంటారు. విగ్రహాలు తిరిగి ఆలయంలో ప్రవేశించే సమయంలో, తనను నిర్లక్ష్యం చేసి యాత్రకు తీసుకు వెళ్ళనందున అలిగిన మహాలక్ష్మి జగన్నాథుడు మందిరంలోకి రాకుండా నిలువరిస్తుంది. స్వామి వారు కొన్ని మధుర ఫలాలతో ఆమెను ప్రసన్నం చేసుకొని మందింరంలోకి ప్రవేశిస్తాడని కథనం. ప్రస్తుతం జగన్నాథుడు ఆలయ ప్రవేశం చేసే సమయంలో జాతర రూపంలో మహాలక్ష్మిని శాంతపరుస్తారు. అంతట విగ్రహరూపంలో ద్వారం తలుపుల పై ఉన్న మహాలక్ష్మి జ గన్నాథ, బలభద్ర, సుభద్ర ఆలయ ప్రవేశానికి అనుమతిస్తూ ఆలయానికి చేరిన దేవతా మూర్తలకు వన మధుర పదార్థాలని నైవేద్యంగా సమర్పిస్తారు. అనతరం జగన్నాథస్వామి బంగారు జలతారు వస్త్రాలు ధరించి భక్తులకు పున:దర్శన ప్రాప్తం కల్పిస్తారు.

పూరీ ప్రసాదం కూడ అత్యంత విశిష్టమైనది. అద్భుత రుచి కలిగి ఉంటుంది. నూనె చుక్క వాడకుండా మట్టికుండలను ఒక దానిపై ఒకటి పెట్టి అన్నాన్ని, పప్పుని ఉడకబెట్టి ప్రసాదాన్ని తయారుచేస్తారు. ప్రసాదానికి ఇంతటి రుచిరావడానికి గల కారణం సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి పర్యవేక్షణలో తయారు కావడమేనని నమ్ముతారు.

నవకళేబరోత్సవం
జగన్నాథ విగ్రహాల తయారీకి, రథాల నిర్మాణానికి ఒక ప్రత్యేక విధానముంది. ప్రతి పన్నెండేళ్ళ నుంచి పందొమ్మిదేళ్ళ కొకసారి ఏ సంవత్సరంలో అయితే ఆషాఢ మాసం రెండు సార్లు వస్తుందో (అధిక ఆషాఢం), ఆ సంవత్సరం నవకళేబరోత్సవం పేరుతో విగ్రహాలు మారుస్తారు. ప్రత్యేక లక్షణాలు కలిగిన వేపమానును విగ్రహాల తయారీకి ఉపయోగిస్తారు. అటువంటి ప్రత్యే వేపమానును ‘‘దారుబ్రహ్మ” అని పిలుస్తారు. అనాదిగా వస్తున్న నమ్మకం ప్రకారం ‘కాకత్‌పురా మంగళాదేవి’ జగన్నాథ ఆలయ పూజారులకు కలలో దర్శనమిచ్చి ‘‘దారుబ్రహ్మ” అని లభించే స్థలాన్ని సూచిస్తుంది. ఆ సూచన ప్రకారం నాలుగు దారు బ్రహ్మలు గుర్తించి, వాటితో విగ్రహాల తయారీ చేపడతారు. ఆగమ జ్యోతిష్యగ్రహగతుల లెక్కల అనుసారం పాత మూర్తులను ఖననం చేసి వాటి స్థానే కొత్తవి చేర్చడం జరుగుతుంది. కాని జగన్నాథుని నాభి బ్రహ్మం మాత్రం పాత విగ్రహ ం నుంచి కొత్త విగ్రహానికి అమర్చబడుతుంది. విష్ణు పురాణానుసారం విష్ణువు నాభి నుంచి బ్రహ్మ పుడతాడు (ఆవిర్భవిస్తాడు). అందుకే విగ్రహాలు మార్చినా, జగన్నాథుని నాభి భాగాన్ని అలాగే ఉంచుతారు. ఆదివాసీ వంశస్థులైన ‘దైతపతులు’ ఆలయంలో జరిగే పూజలో పాల్గొంటారు. దైతపతులే కొత్త దేవతా మూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ గావిస్తారు. ఇది జరిగిన మూడు రోజుల తరువాత ప్రపంచ ప్రఖ్యాత రథ యాత్రను నిర్వహిస్తారు.

నీలాచల నివాసాయ | నిత్యాయ పరమాత్మనే ||
సుభద్రాప్రాణనాథాయ | జగన్నాథాయ మంగళమ్‌||

గూడూరు శ్రీ‌క్ష్మి

Heading

పూరీజగన్నాథ స్వామికి సంబంధించినటువంటి పురాణాలలో క్షేత్ర చరిత్రలలో ఒక అద్భుతమైన విషయం ఉన్నది. ఒకప్పుడు కర్ణాటక దేశానికి చెందినటువంటి ఒక మహాగణపతి భక్తుడు శ్రీక్షేత్రానికి వెళ్ళాడు.  ఏ భక్తులమైనా ఏ దేవతా క్షేత్రానికైనా వెళతాం కదా! భేదం లేదు కానీ ఇష్టం గణపతి అంటే. విష్ణు క్షేత్రమైన ఆ పూరీ క్షేత్రానికి వెళ్ళారట స్వామి దర్శనం కోసం. వెళ్ళి మనస్సులో గణపతిని ధ్యానిస్తున్నాడు. జగన్నాథ స్వామిని చూసి నమస్కారం చేస్తూండగా ఆ జగన్నాథుడు గణపతిగా కనపడి తొండం చాచి అతనిని చుట్టి తనలోపలికి లీనం చేసుకున్నాడట. ఇప్పటికీ దానికి తార్కాణంగా దానికి కథ చెప్పడమే కాకుండా జ్యేష్ఠ శుద్ధ పాడ్యమినాడు స్వామి వారికి గణపతి అవతారం వేస్తారు జగన్నాథ స్వామికి. గణపతి ముఖం పెట్టి వేస్తారు. దీనిని బట్టి గణపతికీ, విష్ణువుకూ వాళ్ళు అభేదాన్ని పాటిస్తూ అది వాళ్ళు తరువాత జరుపబోయే రథయాత్రకి నెలముందు చేస్తారీపని. అదంతా నిర్విఘ్నంగా జరగడం కోసం "విష్ణు స్వరూపుడైన గణపతి, గణపతి స్వరూపుడైన విష్ణువు మాకు సహకరించవయ్యా" అని ప్రార్థన చేస్తారు. అప్పుడు స్వామికి నేత్రాలను ప్రక్షాళన (కన్ను కడగడం అంటారక్కడ) చేసి అవతారం వేసి స్వామిని చీకటి కొట్లో పెట్టి తలుపువేస్తారు. మళ్ళీ రథయాత్రకు పూర్వకాలంలో తీయడం జరుగుతుంది. ఇదంతా అక్కడ జరిగే ఆచారం. గణపతి విష్ణువు స్వరూపం అని తెలిశాక శుక్లాంబరధరం విష్ణుం మరింత స్పష్టంగా మనకి అర్థమౌతుంది. ఇలా బ్రహ్మరుద్రవిష్ణు గణాలకి పతియైన కారణంగా స్వామివారికి గణేశుడని పేరిచ్చారు.
జగన్నాథుడు అందరివాడు

పూరీ శ్రీక్షేత్రంలో వెలసిన శ్రీ జగన్నాథుడు అందరివాడు. ఎక్కడో అల్లంత దూరాన కొండలపై కాకుండా, భక్తులకు చేరువగా సముద్ర తీరానికి కూతవేటు దూరంలో వెలసిన దేవదేవుడు జగన్నాథుడు. ఆలయానికి రాలేని భక్తులకు కన్నుల పండుగ చేసేందుకు ఏడాదికి ఒకసారి సోదరీ సోదర సమేతంగా రథమెక్కి పూరీ పురవీధుల్లో ఊరేగుతాడు. జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథాలు పూరీ బొడొదండొలో (పెద్దవీధి) ముందుకు సాగుతూ ఉంటే, ఆలయాలే కదలి వస్తున్నాయా అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఈ రథాల పైభాగం ఆలయ గోపురాల్లానే గోచరిస్తాయి.

స్నానపూర్ణిమతో ప్రారంభం
పూరీ శ్రీక్షేత్రంలో నిత్యం వేడుకలు, తరచు పండుగలు, పర్వదినాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ ‘బారొ మాసొ తేరొ పొర్బొ’ (పన్నెండు నెలలు... పదమూడు పండుగలు) అనే నానుడి స్థిరపడింది. జ్యేష్ఠపూర్ణిమ రోజున జగన్నాథుడికి స్నానం చేయిస్తారు. దీనినే స్నానపూర్ణిమ అంటారు. స్నానపూర్ణిమ రోజు నుంచే రథయాత్ర వేడుకలకు సన్నాహాలు మొదలవుతాయి. స్నానపూర్ణిమ రోజున గర్భగుడిలోని మూలవిరాట్టులైన దారువిగ్రహాలను బయటకు తెచ్చి, ఆలయం తూర్పువైపు ప్రహారీగోడ వద్ద స్నానం చేయిస్తారు. ఈ స్నానానికి ఆలయంలోని ‘సునా కువా’ (బంగారుబావి) నుంచి తోడితెచ్చిన 108 కుండల నీటిని వినియోగిస్తారు.

ఈ స్నానం తర్వాత జగన్నాథుడు జలుబు, జ్వరంతో బాధపడతాడంటారు. అందుకే రెండు వారాల పాటు చీకటి గదిలో ఉంచేసి, దైతాపతులు పసర్లు, మూలికలతో చికిత్స చేస్తారు. ఈ తతంగం జరిగే రెండు వారాల్లో ఆలయ గర్భగుడిలో మూలవిరాట్టుల దర్శనం లభించదు. మూలవిరాట్టుల పీఠంపై జగన్నాథ, బలభద్ర, సుభద్రల పటచిత్రాన్ని ఉంచి పూజలు చేస్తారు. రెండు వారాల చికిత్స తర్వాత తేరుకున్న జగన్నాథుడు రథారూఢుడై గుండిచా మందిరానికి బయలుదేరుతాడు.

నయనానందకరం రథయాత్ర వేడుక
పూరీలో అంగరంగ వైభవంగా జరిగే రథయాత్ర వేడుక నయనానందకరంగా సాగుతుంది. ఆషాఢ శుద్ధి విదియ నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు రథాలపై తమ పిన్నిగారి ఇల్లయిన గుండిచా మందిరానికి బయలుదేరుతారు. జగన్నాథుడి రథం పేరు ‘నందిఘోష్’ కాగా, బలభద్రుడి రథం ‘తాళధ్వజ’, సుభద్ర రథం ‘దర్పదళన్’. నందిఘోష్ అన్నిటి కంటే ఎత్తుగా ఉంటుంది. దీని ఎత్తు 44.2 అడుగులు. ‘తాళధ్వజ’ ఎత్తు 43.3 అడుగులు, ‘దర్పదళన్’ ఎత్తు 42.3 అడుగులు. రథయాత్ర రోజున జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలను సంప్రదాయబద్ధంగా అలంకరిస్తారు. ముందే సిద్ధం చేసిన రథాలను పూరీ రాజు స్వయంగా చీపురుపట్టి శుభ్రపరుస్తారు.

రథాలను శుభ్రపరచడం పూర్తయ్యాక భారీ దారువిగ్రహాలను మోసుకుంటూ రథాలపైకి తరలిస్తారు. విగ్రహాలను రథాలపైకి తరలించే కార్యక్రమాన్ని ‘పొహాండి’ (పాండోజనం) అంటారు. రథాలపైకి చేరిన విగ్రహాలకు పూజారులు శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. రథాలకు కట్టిన పొడవాటి మోకులను భక్తులు లాగుతారు. భక్తులు రథాలు లాగుతుండగా రథాలపై పూజారులతో పాటే ఉండే ‘డకువా’లు జేగంటలు మోగిస్తూ జగన్నాథుడిపై నిందాస్తుతులతో కీర్తనలు అందుకుంటారు. రథయాత్ర సాగుతున్నంత సేపు పూరీ బొడొదండొ (పెద్దవీధి) లక్షలాది మంది భక్తజనసందోహంతో కిటకిటలాడుతుంది.

దేశం నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. రథయాత్ర మరునాటికి మూడు రథాలూ గుండిచా మందిరానికి చేరుకుంటాయి. గుండిచా మందిరంలో సుభద్రా బలభద్రుల సమేతంగా జగన్నాథుడు ఆషాఢ శుద్ధ దశమి వరకు కొలువు దీరుతాడు. గుండిచా మందిరంలో ఉన్నన్నాళ్లూ జగన్నాథుడు దశావతారాల వేషాల్లో భక్తులకు దర్శనమిస్తాడు. ఆషాఢ శుద్ధ దశమి రోజున జగన్నాథుడు శ్రీక్షేత్రం వైపు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తాడు.

ఈ తిరుగు ప్రయాణాన్ని ‘బాహుడా’ (మారు రథయాత్ర) అంటారు. ఆషాఢ పూర్ణిమ నాటికి శ్రీక్షేత్రానికి చేరుకుంటాడు. ఆ రోజున జగన్నాథుడు స్వర్ణాలంకార వేషంతో (సునా బెసొ) భక్తులకు దర్శనమిస్తాడు. జగన్నాథుడి స్వర్ణాలంకార దర్శనంతో రథయాత్ర వేడుకలు పరిసమాప్తమవుతాయి.

ఊరూవాడా రథాల వేడుక
పూరీలోనే కాదు, ఒడిశా రాష్ట్రంలో ఊరూరా రథయాత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయాల పరిధిలో జరిగే రథయాత్ర వేడుకలు సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. అయితే, ఊళ్లల్లో చిన్నారులు సైతం చిన్న చిన్న రథాలపై జగన్నాథుడిని వీధుల్లో ఊరేగిస్తూ సంబరాలు చేసుకుంటారు. జేగంటలు, తప్పెట్లు మోగిస్తూ తమకు తోచిన రీతిలో పూజలు చేసేస్తూ ఉంటారు. నచ్చిన చిరుతిళ్లను నైవేద్యంగా పెడుతూ ఉంటారు.

ఇతర దేవతలను ఇలా ఇష్టమొచ్చిన రీతిలో పూజించడానికి పిల్లలకు అనుమతి ఉండదు. అయితే, అందరివాడైన జగన్నాథుడి విషయంలో ఎలాంటి ఆంక్షలు, నియమ నిబంధనలు ఉండవు. జగన్నాథుడిని ఎవరైనా పూజించవచ్చు, ఎలాగైనా పూజించవచ్చు. అందుకే ‘సర్వం శ్రీజగన్నాథం’ అనే నానుడి వ్యాప్తిలోకి వచ్చింది.

ఛప్పన్న భోగాల నైవేద్యం
జగన్నాథుడు నైవేద్య ప్రియుడు. అనుదినం స్వామికి ఛప్పన్న (యాభయ్యారు) భోగాలను నివేదిస్తారు. ఈ నైవేద్యాల కోసం పూరీ శ్రీమందిరంలో అనునిత్యం వంటలు సాగుతూనే ఉంటాయి. కట్టెల పొయ్యలపై కుండలలో వంటకాలు వండుతారు. దివ్యధామమైన పూరీలో నివేదించే ప్రసాదాన్ని ‘ఒభొడా’ అంటారు. వడ్డించడాన్ని ఒరియాలో ‘భొడా’ అంటారు. మహాప్రసాదాన్ని వడ్డించరు. అందుకే దీనికి ‘ఒభొడా’ అనే పేరు వచ్చింది. పూరీ ఆలయంలో ఈ నైవేద్యాల తయారీ కోసం 752 కట్టెపొయ్యలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి.

నాలుగు వందల మంది పాకప్రవీణలు అలుపెరగకుండా గరిటెలు తిప్పుతూనే ఉంటారు. పూరీ ఆలయ ప్రాంగణంలోని ఆనంద్‌బజార్‌లో ఈ ప్రసాదాలను కుండల్లో పెట్టి భక్తులకు విక్రయిస్తారు. ఛప్పన్న భోగాలను ఎందుకు నివేదిస్తారనే దానిపై ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడు రోజుకు ఎనిమిదిసార్లు తినేవాడట. ఇంద్రుడు రాళ్లవాన కురిపించినప్పుడు గోవులు, యాదవుల రక్షణ కోసం గోవర్ధనగిరి ఎత్తిన కృష్ణుడు ఏడురోజులు భోజనం చేయకుండా ఉండిపోయాడట. ఇంద్రుడికి బుద్ధి చెప్పి గోవర్ధనగిరిని కిందకు దించిన కృష్ణుడికి యాదవులందరూ 56 పదార్థాలను సమర్పించారట. అందుకే కృష్ణుడి రూపమే అయిన జగన్నాథుడికి పూరీలో 56 పదార్థాలను నివేదించడం ఆచారంగా వస్తోందని చెబుతారు.
Thursday, 22 June 2017

అరసవల్లి

ఆ 6 రోజులే కిరణాలెందుకు?

అది ఆదిత్యుడి గుడి! సంవత్సరానికి 365 రోజులున్నా.. ఆ గుడిలో ఏటా సంవత్సరంలో రెండుసార్లు.. మూడు రోజుల్లో ఒకసారి చొప్పున.. ప్రాతఃకాలాన గాలిగోపురాన్ని దాటి.. ధ్వజస్తంభాన్ని తాకుతూ.. గర్భాలయంలోని మూలవిరాట్టుపై సూర్యకిరణాలు పడతాయి. అప్పుడే ఎందుకు పడతాయి?

క్రమం తప్పదు...
దేశ తూర్పు తీరంలో ఉన్న మూడు సూర్యదేవాలయాల్లో.. తెలుగునాట ఉన్న క్షేత్రం అరసవల్లి. శ్రీకాకుళం పట్టణ సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని కళింగరాజు దేవేంద్ర వర్మ క్రీ.శ. 673వ సంవత్సరంలో నిర్మించాడు. ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11 తేదీల్లో ఒకసారి... అక్టోబరు 1, 2, 3 తేదీల్లో మరొకసారి అరసవల్లిలో సూర్య దేవుడిని భానుడి కిరణాలు తాకుతాయి. ఉదయం 6 గంటలకు గాలి గోపురం మీదుగా వచ్చే కిరణాలు.... అనివెట్టి మండపం, ధ్వజస్తంభాన్ని తాకుతూ మూల విరాట్‌పై ప్రసరిస్తాయి. ‘అరుణ శిల’తో చెక్కిన విగ్రహం... సూర్య కిరణాలు పడగానే బంగారు ఛాయలో మెరుస్తుంది.

వింతల ప్రసరణ... సూర్యుడికి నీడతో అవినాభావ సంబంధం. ఏదీ ఎదురు కానంత వరకే... సూర్యుడి కిరణ ప్రయాణం! ఏదైనా అడ్డు వచ్చిందంటే... దాని నీడే నేలపై కనిపిస్తుంది. అరసవల్లిలో దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. గాలి గోపురం నుంచి మూలవిరాట్టుకు మధ్య దూరం 306 అడుగులు! మధ్యలో... అనివెట్టి మండపం, ధ్వజస్తంభం, బేడా మండపం, అంతరాలయాలను దాటుకుని గర్భాలయంలోకి సూర్య కిరణాలు కనిపిస్తాయి. విచిత్రమేమిటంటే... ఆయా మండపాల తలుపులు మూసినప్పటికీ సూర్య కిరణాలు లోపలికి వస్తాయని చెబుతారు. ఆకాశం మేఘావృతమైతే తప్ప... ప్రతిఏటా రెండుసార్లు సూర్య నారాయణుడి విగ్రహాన్ని కిరణాలు తాకడం విశేషం.

సౌరగమనమే కీలకం.. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పడమట అస్తమిస్తాడు! అయితే, ఈ ‘ఉదయ-అస్తమయాలు’ ఒకే పాయింట్‌ నుంచి జరగవు. కాలానుగుణం గా మారుతాయి. దీనిని బట్టి సూర్యుడి గమనం ఉంటుంది. ఈ సౌర గమనాన్ని గమనిస్తూ, ఏటా మార్చి 9, 10, 11 తేదీల్లో... అక్టోబరు 1, 2, 3 తేదీ ల్లో మరోసారి సూర్యకిరణాలు తాకేచోటును గుర్తించి అక్కడే ఆలయం ని ర్మించి, మూలవిరాట్టును కొలువుదీర్చినట్లు అర్థమవుతుంది.

Wednesday, 14 June 2017

మున్నార్‌ సోయగాలు

మైమరిపించే మున్నార్‌ సోయగాలువేసవిలో ప్రకృతి అందాల మధ్య సేదతీరాలంటే కేరళలోని మున్నార్‌ వెళ్లాల్సిందే. జలపాతాలు, లోయలు, తేయాకు తోటల అందాలతో మున్నార్‌ స్వర్గలోకాన్ని తలపిస్తుంది. నాలుగు రోజులు టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే మున్నార్‌ చుట్టుపక్కల ముఖ్యమైన ప్రదేశాలన్నీ చుట్టేసి రావచ్చు. ఆ విశేషాలు ఇవి...

అట్టుకల్‌ వాటర్‌ఫాల్స్‌
ప్రకృతి సృష్టి ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే. దట్టమైన అడవి, ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారే జలపాతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడికి వెళ్లే దారి ఇరుకుగా ఉంటుంది. నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే వాహనం నడిపించాలి.

దేవికుళం
మున్నార్‌ సమీపంలో ఉండే హిల్‌స్టేషన్‌ ఇది. అందమైన లోయలు, ఎత్తైన పర్వతాలతో దేవికుళం మనోహరంగా ఉంటుంది. మండు వేసవిలోనూ చల్లటిగాలి మిమ్మల్ని పరవశింప చేస్తుంది. మరిచిపోలేని ట్రెక్కింగ్‌ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

మత్తుపెట్టి ఇండో స్విస్‌ ఫామ్‌
మున్నార్‌ సమీపంలో ఉండే మత్తుపెట్టి డ్యామ్‌ పాపులర్‌ పిక్నిక్‌ స్పాట్‌. డ్యామ్‌లో బోట్‌ రైడ్‌ చేయొచ్చు. ఇక్కడ అధిక దిగుబడిని అందించే రకరకాల పశువులను బ్రీడింగ్‌ చేస్తుంటారు. పర్యాటకులను మూడు షెడ్ల వరకు మాత్రమే సందర్శించడానికి అనుమతిస్తారు. డ్యామ్‌లో బోటింగ్‌ చేయడానికి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు అనుమతి ఉంటుంది. ఫామ్‌ను సందర్శించడానికి ఉదయం 9 నుంచి 11 వరకూ, మధ్యాహ్నం 2 నుంచి 3:30 వరకు అనుమతిస్తారు. బోటింగ్‌ ఫీజు రూ.300. పావుగంట నదిలో విహరించొచ్చు. ఫామ్‌ ఎంట్రీ ఫీజు రూ.5.

ఫొటో పాయింట్‌
మున్నార్‌ వెళ్లిన వారు తప్పక సందర్శించాల్సిన స్పాట్‌ ఇది. ఇక్కడి నుంచి తేయాకు తోటల అందాలు, సిల్వర్‌ ఓక్‌ ట్రీల సోయగాలు కనువిందు చేస్తాయి. చిన్న చిన్న కొండలు, చిన్న సరస్సులు నయనానందకరంగా ఉంటాయి. కెమెరాలకు పని చెప్పడానికి అనువైన ప్రదేశం ఇది. అందుకే ఈ ప్రదేశానికి ఫొటో పాయింట్‌ అని పేరు స్థిరపడింది.

పోతమేడు
మున్నార్‌కు 6కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే టీ, కాఫీ తోటల అందాలు, లోయలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్‌ చేసేవాళ్లు ఈ ప్రదేశాన్ని బాగా ఇష్టపడతారు. ఆకాశం నిర్మలంగా ఉంటే ఇక్కడికి 60 కి.మీ దూరంలోని ముత్తిరపుళ రివర్‌, ఇడుక్కి ఆర్క్‌ డ్యామ్‌ అందాలు కనిపిస్తాయి. ఫొటోగ్రఫీని ఇష్టపడే వారు దీన్ని తప్పక సందర్శించి తీరాల్సిందే.

ఎలా చేరుకోవాలి?
విమానంలో : మున్నార్‌లో ఎయిర్‌పోర్టు లేదు. సమీపంలో అంటే రోడ్డు మార్గంలో 110 కి.మీ దూరంలో కొచ్చిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఉంది. కొచ్చిన్‌ నుంచి కారు తీసుకుని మున్నార్‌ చేరుకోవచ్చు. మదురై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు 140 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి నుంచి క్యాబ్‌ లేక బస్సులో మున్నార్‌ చేరుకోవచ్చు.
బస్సులో: కేరళ, తమిళనాడులోని ముఖ్యమైన పట్ణణాలు, నగరాల నుంచి మున్నార్‌కు బస్సు సదుపాయాలున్నాయి.
రైలులో : మున్నార్‌కు 110 కి.మీ దూరంలో అళువా రైల్వేస్టేషన్‌ ఉంది. ఎర్నాకుళం రైల్వేస్టేషన్‌, మదురై రైల్వేస్టేషన్‌ 130 కి.మీ దూరంలో ఉన్నాయి. రైలులో ఇక్కడి వరకు చేరుకుంటే క్యాబ్‌లో లేదంటే బస్సులో మున్నార్‌ చేరుకోవచ్చు. 


వసతి : మున్నార్‌లో బస చేయడానికి రిసార్టులు, హోటల్స్‌ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌ను బట్టి ఎంచుకోవచ్చు.

విశేషాలు...

  • సముద్ర మట్టానికి 1600 నుంచి 1800 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
  • ఆగస్టు నుంచి మే వరకు సందర్శించడానికి అనువైన సమయం.
  • ఉష్ణోగ్రతలు 0 నుంచి 25 డిగ్రీల వరకు ఉంటాయి.
  • మున్నార్‌లో ఏటా ఉత్పత్తి అయ్యే తేయాకు 50 వేల మెట్రిక్‌ టన్నులు(5 కోట్ల కేజీలు) ఉంటుంది.

Saturday, 10 June 2017

గురువాయూర్‌ ఆలయం - మహిమాన్వితం.. మనోహరం

ప్రకృతి అందాలకు, ఆయుర్వేద పంచకర్మ చికిత్సకు, అనేకమైన అపురూపమైన ఆలయాలకు నెలవు కేరళ. అటువంటి కేరళలో స్వర్గ మర్త్య పాతాళలోకాలూ కలసిన భూలోక వైకుంఠం గురువాయూర్‌. అసలు ఈ పేరు వినగానే శంఖచక్ర గదా పద్మాలతో కూడి, విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడి దివ్యమంగళ స్వరూపం కనుల ముందు కదలాడుతుంది. దేవతల గురువైన బృహస్పతి అంటే గురువు, వాయుదేవుడు కలిసి పరశురాముడి సాయంతో సముద్రగర్భంలోకి చేరకుండా కాపాడిన శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన దివ్యస్థలి ఇది. అంతకుముందు వరకు రుద్రతీర్థం అనే పేరుతో విలసిల్లిన ఈ క్షేత్రానికి వారి పేరు మీదుగానే గురువాయూరు అనే పేరొచ్చింది.

ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక చేత శంఖం మరో చేత చక్రం మరో రెండు చేతులలోనూ గదాపద్మాలను, మెడలో తులసి మాలను ధరించిన స్వామి విగ్రహం చూడటానికి రెండు కన్నులూ చాలవేమో అన్నంత నయన మనోహరంగా ఉంటుంది. మీ మనసులోని భావాలన్నీ నాకు తెలుసు, మీరు కోరకుండానే నేనే తీరుస్తానుగా మీ కోర్కెలను అన్నట్లు చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆ సుందర స్వరూపాన్ని చూడగానే పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి.

అన్నట్లు ఐదువేల సంవత్సరాల చరిత్ర గల ఈ విగ్రహం తక్కిన అన్ని విగ్రహాలలాగా రాతితో లేదా పంచలోహాలతో తయారైనది కాదు. పాతాళాంజనమనే విశిష్టమైన వనమూలికలతో రూపొందించినది. ఇక్కడ పరిణయమాడితే జీవితమంతా పరిమళభరితమే అనే విశ్వాసంతో భక్తులు ఎంతో వ్యయప్రయాసలకోర్చి మరీ ఈ ఆలయ ప్రాంగణంలో పెళ్లి చేసుకోవడానికి ఉవ్విళ్లూరతారు. నామకరణాలు, అన్నప్రాశనలు, అక్షరాభ్యాసాలు, ఉపనయనాల వంటి శుభకార్యాలన్నీ ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉంటాయి.

ఆపదలు, గండాలు, దీర్ఘవ్యాధులు తొలగాలని స్వామికి మొక్కుకుని, ఆయా ఆపదలన్నీ హారతి కర్పూరంలా కరిగిపోగానే తమ బరువుకు సరిపడా బంగారం, వెండి, రూపాయి కాసులు, ఆకుకూరలు, కూరగాయలు, వెన్న, పటికబెల్లం... ఇలా ఒకటేమిటి, తమ స్తోమతకు తగ్గట్టుగా తులాభారం తూగుతూ కనిపిస్తారు. కొందరు భక్తులు స్వామివారికి అమూల్యమైన ఆభరణాలనూ సమర్పిస్తుంటారు. ఆయా ఆభరణాలను భద్రపరచేందుకు ఒక ప్రత్యేకమైన గది ఉంది. ఆ గదిని అనునిత్యం అంటిపెట్టుకుని పంచనాగులనే పేరుగల ఐదుసర్పాలు సంరక్షిస్తుంటాయి.

సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆలయానికి చేరువలో రుద్రతీర్థమనే పేరుగల పెద్ద కోనేరు ఉంది. స్వామికి ఈ కోనేటి నీటితోనే నిత్యం అభిషేకం చేస్తారు అర్చకులు. ఏకాదశి, రోహిణీ నక్షత్ర వేడుకలు ఇక్కడ విశేషంగా జరుగుతుంటాయి. ఏనుగులకు ఈ ఆలయంలో ఎంతో ప్రత్యేకత, గౌరవాభిమానాలూ దక్కుతాయి. ఏనుగు పందేలు కూడా జరుగుతాయి. అవి అల్లాటప్పాగా కాదు.. ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉల్లాసోత్సాహాలతో నిర్వహిస్తారు. ఇది చాలా మహిమాన్విత క్షేత్రం కాబట్టి ఆలయంలో మడీ తడీ శుచీ శుభ్రతలకు ప్రాముఖ్యతనిస్తారు.

చుట్టుపక్కల చూడ దగ్గ స్థలాలు:
మమ్మియూర్‌ మహాదేవ క్షేత్రం, ఎలిఫెంట్‌ క్యాంప్‌ శాంక్చువరీ, పున్నతూర్‌ కొట్ట, పార్థసారథి ఆలయం, వెంకటాచలపతి ఆలయం, చోవళూర్‌ శివాలయం, పళయూర్‌ చర్చ్, గురువాయూర్‌ దేవస్థాన దారుశిల్ప కళాసంస్థ, నవముకుందాలయం, చాముండేశ్వరి ఆలయం, హరికన్యక ఆలయం, నారాయణంకులాంగర ఆలయం మొదలైనవి.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

కురుక్షేత్రం - భరతజాతికి ధర్మక్షేత్రం

కురుక్షేత్రం అనే పేరు వినగానే మహాభారత యుద్ధం కనులముందు కదలాడుతుంది. భీష్మద్రోణ కృపాచార్యులూ, కురు పాండవులూ సల్పిన ఘోరయుద్ధ దృశ్యాలు బొమ్మకడతాయి.
అటువంటిది మనం నేరుగా కురుక్షేత్రానికి వెళ్లి, అలనాడు అక్కడ జరిగిన యుద్ధం తాలూకు ఆనవాళ్లను చూస్తే?
శ్రీ కృష్ణుడి పాదధూళితో పవిత్రమైన ఆ నేలపై నడయాడుతూ, ఆ కట్టడాలను చూస్తూ ఒళ్లు గగుర్పొడిచే ఆ సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకున్న తర్వాత దగ్గరలోనే గల బ్రహ్మసరోవరంలో స్నానం చేసి వస్తే?
ఓహ్‌! ఊహించడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదా!
ఆ అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవాలంటే మనం హరియాణా రాష్ట్రానికి వెళ్ల వలసిందే!

స్థలపురాణం:
కురుక్షేత్రానికే ధర్మక్షేత్రమని పేరు. కేవలం ఇక్కడ మహాభారత యుద్ధం జరగడం వల్లే ఈ ప్రదేశం ప్రసిద్ధ పర్యాటక స్థలమో, పుణ్యస్థలమో కాలేదు. వామన పురాణం ప్రకారం కురువంశానికి మూలపురుషుడైన కురు అనే రాజు సరస్వతీ నది ఒడ్డున గల సుందర, ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని అష్టాంగమార్గాల ద్వారా భగవంతుని మెప్పించాడు. ఆ రాజు తపస్సుకు, భక్తి శ్రద్ధలకు మెచ్చిన భగవంతుడు అతనికి రెండువరాలనిచ్చాడు. అవేమంటే... అతని పేరుమీదుగా ఆ స్థలానికి కురుక్షేత్రం అనే పేరు వస్తుందని, పరమ పవిత్రమైన ఆ ప్రదేశంలో మరణించిన వారికి స్వర్గార్హత లభిస్తుందనీ... అందుకే ఈ ప్రదేశానికి కురుక్షేత్రమనే పేరు వచ్చింది.

తెల్లవారి పాలనలో ఇదంతా మరుగున పడిపోయింది. స్వాతంత్య్రం సంపాదించిన తర్వాత పురావస్తు శాఖ వారు చేసిన పరిశోధనలలో ఈ విషయాలన్నీ బయట పడ్డాయి. అందుకే కురుక్షేత్రమనే పేరును తిరిగి పెట్టారు. యుద్ధారంభానికి ముందే గురువులు, సహాధ్యాయులు, మిత్రులు, బంధువులు, రక్తసంబంధీకులను చూసిన అర్జునుడు వీరిని చంపడానికా నేను యుద్ధం చేయడం... అని నిర్వేదం చెందడంతో శ్రీకృష్ణుడు యుద్ధం ఎందుకు చేయాలో, యుద్ధాన్ని ఎలా చూడాలో వివరిస్తూ చేసిన బోధే భగవద్గీత. ఆ బోధ ఇక్కడే జరిగింది. కొన్ని తరాలకు.. కాదు కాదు.. కొన్ని యుగాలపాటు మానవ వికాసానికి తరగని నిధిని అందించింది. అందుకోసమైనా కురుక్షేత్రాన్ని సందర్శించి తీరాలి. తరతరాలుగా ప్రాచీన చారిత్రక, పౌరాణిక, హిందూ సాంస్కృతిక వైభవాలను కలిగి ఉన్న యాత్ర కురుక్షేత్రం.

ప్రతి ఒక్క భారతీయుడూ తన జీవితకాలంలో తప్పక సందర్శించలసిన తీర్థస్థలి. గంగాసరస్వతీ నదులు పునీతం చేసిన నేల ఇది. 360 పుణ్యక్షేత్రాలున్న పరమ పవిత్రమైన మహాభారత సంగ్రామ స్థలి ఇది. యుద్ధమంటే మామూలు యుద్ధమా అది... పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం తాలూకు రక్తంతో తడిసిన రుధిర భూమి. 1947కు ముందు ఈ ప్రాంతాన్ని స్థానేశ్వరం అని పిలిచేవారు. ఇక్కడ కొలువైన స్థానేశ్వరుడనే మహాశివుడి ఆలయం పేరుమీదుగా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఆ తర్వాత మాత్రమే భారతప్రభుత్వం దీనికి కురుక్షేత్రం అనే పేరును నిర్ణయించింది. కురుక్షేత్రంలోనే అమిన్‌ అనే ప్రాంతం ఉంది. ఇక్కడే అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించినట్లు చెబుతారు.

కురుక్షేత్రంలోని దర్శనీయ స్థలాల్లో ముఖ్యమైనది బ్రహ్మసరోవరం. ఈ సరస్సులో స్నానం చేస్తే సమస్తపాపాలు పోతాయని పురాణోక్తి. ఇక్కడ కుంభమేళా సమయంలోనూ , గ్రహణ సమయాల్లోనూ యాత్రీకుల రద్ధీ అధికంగా కనిపిస్తుంది. స్థానిక ‘ సన్నిహిత, వనగంగ’ సరస్సులను కూడా అక్కడి ప్రజలు పరమ పవిత్రంగా భావిస్తారు. ఇక్కడి ‘.జ్యోతిసార’ అనే ప్రదేశంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్టు చెబుతారు. ఇక్కడ ఉండే ఒక పెద్ద మర్రిచెట్టు పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టిని ఇక్కడినుంచే ఆరంభించాడని ప్రతీతి. అందుకే ఇక్కడికి చేరువలోని సరోవరానికి బ్రహ్మసరోవరమని పేరు.

ఎలా వెళ్లాలంటే...?
ఢిల్లీ నుంచి సుమారు 160 కిలోమీటర్లు, చండీగఢ్‌ నుంచి 80 కిలోమీటర్లు ఉన్న ఈ యాత్రాస్థలికి అన్ని రకాల వాహన సౌకర్యాలూ ఉన్నాయి. ఢిల్లీ సెంట్రల్‌ బస్‌ టర్మినల్‌ నుంచి చండీగఢ్‌కు వెళ్లే బస్సుల్లో మనం ఇక్కడికి చేరుకోవచ్చు.

– DVR. భాస్కర్‌

ఫిన్లాండ్‌

ఫిన్లాండ్‌ 100/100


అక్కడ ఏ పిల్లాడూ బడికెళ్లనని మారాం చేయడు. ఏ చిన్నారీ భుజాన పుస్తకాల సంచీతో ఆపసోపాలు పడుతూ కనిపించదు. యూనిఫాంలూ, హోం వర్కులూ, వార్షిక పరీక్షలూ, మార్కులూ, ర్యాంకుల బూచీలూ, రోజంతా సాగే స్కూళ్లూ, స్టడీ అవర్లూ, ట్యూషన్లూ... ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థులకు కష్టం కలిగించే ఏ చిన్న విధానాన్నీ అనుసరించని ఏకైక దేశం ఫిన్లాండ్‌. అయితేనేం, ప్రపంచంలోని అత్యద్భుతమైన విద్యావ్యవస్థల్లో ఆ దేశానిది నిలకడగా తొలిస్థానమే. అక్కడ ప్రతి విద్యార్థీ తరగతిలో టాపరే! పిల్లల్ని స్కూలుకి పంపించేముందు తల్లిదండ్రులూ, పాఠాలు మొదలుపెట్టే ముందు టీచర్లూ... ఫిన్లాండ్‌ వాసులు అనుసరిస్తోన్న పద్ధతుల్ని ఓసారి స్మరించుకోవడం మహా ఉత్తమం.

పదిలోపు వంద ర్యాంకులు, వందలోపు వెయ్యి ర్యాంకులు, వెయ్యిలోపు పదివేల ర్యాంకులు... మే, జూన్‌ నెలల్లో ఏ టీవీ ఛానల్‌ పెట్టినా అదే పనిగా ఈ అంకెల దండోరా చెవుల్ని హోరెత్తిస్తుంది. ఏ పత్రిక తిరగేసినా స్కూళ్లూ, కాలేజీల ప్రకటనలతో నిండుంటాయి. మంచి మార్కులొచ్చిన పిల్లలే పోటీ ప్రపంచానికి మనుషుల్లా కనిపిస్తారు. టాప్‌ ర్యాంకు వచ్చిన వాళ్లనే సమాజం నెత్తిన పెట్టుకుంటుంది. సచిన్‌లా బ్యాటింగ్‌ చేసే శక్తి ఉన్నా, రెహమాన్‌లా పియానో వాయించేంత టాలెంట్‌ సొంతమైనా, తరగతిలో మార్కులు రాకపోతే మాత్రం ఆ పిల్లాడు ఎందుకూ పనికిరాని మొద్దావతారమే! అందుకే మనదేశంలో చాలామంది చిన్నారులు ఆ అంకెల వేటలో పడి అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారు. ఓ పది మార్కులు తగ్గితేనే మహా పాపం చేసినట్టు ప్రాణాలు తీసుకుంటున్న వాళ్లూ ఉన్నారు. తల్లిదండ్రుల ఆరాటం, విద్యా సంస్థల ఒత్తిడీ కలగలిసి ఇక్కడ విద్యార్థుల పరిస్థితిని దయనీయంగా మార్చేస్తున్నాయి. ఉత్తమ విద్యావ్యవస్థల జాబితాలో నానాటికీ మన స్థానం దిగజారుతూ వస్తోంది.

సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించినా మనలాంటి ఎన్నో దేశాలు సాధించలేని ఫలితాలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యావ్యవస్థ కలిగిన దేశంగా పేరున్న ఫిన్లాండ్‌, ఆడుతూపాడుతూ అందుకుంటోంది. ఐరోపాలోని ఓ చిన్న దేశమైన ‘ఫిన్లాండ్‌’ విద్యార్థులపైన ఏ మాత్రం ఒత్తిడి పెట్టకుండానే వాళ్లను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దొచ్చని నిరూపిస్తోంది. పరీక్షలు, ర్యాంకుల ప్రస్తావన లేకుండానే వాళ్లను ఇంజినీర్లూ, డాక్టర్లూ, ఇతర వృత్తి నిపుణులుగా తయారు చేస్తోంది. అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్‌ లాంటి దేశాలకు కూడా, పిల్లల్ని చదివించే విషయంలో ఫిన్లాండ్‌ కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఏటా తన బోధనా పద్ధతుల్ని మార్చుకుంటూ, కొత్త ప్రమాణాల్ని అందుకుంటూ గత నలభై ఐదేళ్లలో అక్కడి విద్యావ్యవస్థ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తొంది. మూడేళ్లకోసారి అంతర్జాతీయంగా విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించే ‘ప్రోగ్రామ్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ఎసెస్‌మెంట్‌’(పిసా) లెక్కల్లో అమెరికా, జపాన్‌, చైనా లాంటి దిగ్గజాలను దాటి ఆ చిట్టి దేశానికి చెందిన పిల్లలు వరసగా తొలి స్థానాన్ని సాధిస్తున్నారు. ప్రతి విద్యార్థీ కలలుగనే తరగతి గదులూ, ప్రతి పాఠశాలా అనుసరించాల్సిన విధానాలూ, అందరు తల్లిదండ్రులూ పాటించాల్సిన నియమాలూ ఫిన్లాండ్‌ సొంతం.

ఏడేళ్లకు స్కూలు...
మన దేశంలో పిల్లలకు రెండేళ్లు దాటగానే తల్లిదండ్రులు స్కూళ్ల వేట మొదలుపెడతారు. బడిలో కాలు పెట్టకముందే అఆలూ, అంకెలూ బట్టీ కొట్టిస్తారు. కానీ ఫిన్లాండ్‌లో పిల్లలు స్కూల్లో అడుగుపెట్టాలంటే కనీసం ఏడేళ్లు నిండాల్సిందే. అప్పటివరకూ వాళ్లు పలకా బలపం, పుస్తకాలూ పెన్సిళ్లూ పట్టుకోరు. అలాగని నేర్చుకునే వయసునీ వృథా చేసుకోరు. డే కేర్‌ సెంటర్లలో ఉంటూ తమ మెదడుని పదును పెట్టుకునే పనిలో పడతారు. సాధారణంగా తొలి ఆరేళ్లలోనే పిల్లల మెదడు కణాలు 90శాతం విచ్చుకుంటాయి. దేన్నైనా త్వరగా గ్రహించే శక్తి పెరుగుతూ వస్తుంది. అన్ని దేశాల్లో ఆరేళ్లలోపు వయసులోనే పిల్లలకు లెక్కలు, సైన్స్‌ లాంటి అంశాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు బోధిస్తారు. ఫిన్లాండ్‌లో మాత్రం తొలి ఆరేళ్లలో పాఠాలకు బదులుగా, పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తారు. అందరితో కలిసి ఆడుకోవడం, పద్ధతిగా తినడం, నిద్రపోవడం, ఒకరికొకరు సహాయ పడటం, శుభ్రత పాటించడం, భావవ్యక్తీకరణ నైపుణ్యం, జాలీ, దయా, సామాజిక స్పృహ... ఇలాంటి అన్ని జీవన నైపుణ్యాలను అలవరచుకునేలా ప్రోత్సహిస్తారు. బడికి ఎప్పుడైనా వెళ్లొచ్చు, కానీ మంచి పౌరుడిగా ఎదగడానికి పునాది మాత్రం పసి వయసులోనే పడాలన్నది ఫిన్లాండ్‌ వాసుల నమ్మకం. అందుకే తొలి ఆరేళ్లను దానికోసమే కేటాయిస్తారు. ‘నేర్చుకోవాల్సిన వయసు వచ్చినప్పుడు పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. తొందరపెట్టి వాళ్లలో ఒత్తిడి పెంచాల్సిన పనిలేద’ంటారు అక్కడి ఉపాధ్యాయులు.

చదువంతా ఉచితం
ఉన్నత విద్యావంతులే మంచి పౌరులుగా మారతారు. అలాంటి ప్రజలున్న దేశమే గొప్పదిగా ఎదుగుతుందన్నది ఫిన్లాండ్‌ నమ్మిన సిద్ధాంతం. అందుకే ఆ దేశంలో పుట్టిన ప్రతి చిన్నారి చదువు బాధ్యతనూ ప్రభుత్వమే భుజాన వేసుకుంది. ఎనిమిది నెలల వయసులో డే కేర్‌ సెంటర్‌లో కాలుపెట్టినప్పట్నుంచీ పాతికేళ్ల తరవాత యూనివర్సిటీ నుంచి PHD పట్టా అందుకునేంత వరకూ రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత విద్యను అందిస్తోంది. ప్రైవేటు పాఠశాలలూ, ప్రైవేటు యూనివర్సిటీల ప్రస్తావనే అక్కడ కనిపించదు. చిన్న కార్మికుడి నుంచి దేశాధినేత వరకూ అందరూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకొని బయటకు రావాల్సిందే. పుట్టుకతో ఎంత సంపన్నులైనా చదువు విషయంలో మాత్రం అక్కడి పిల్లలంతా సమానమే. చిన్న పల్లెటూరు నుంచి దేశ రాజధాని వరకూ అన్ని స్కూళ్లలో ఒకే తరహా శిక్షణ పిల్లలకు అందుతుంది.

ఆరేళ్లదాకా ఆడుతూపాడుతూ...
స్వెటర్లూ, ఉయ్యాలా, ఉగ్గు గిన్నె... పసిపిల్లల తల్లిదండ్రులకు ఎవరైనా ఇలాంటి చిరు కానుకలిస్తారు. ఫిన్లాండ్‌లో మాత్రం బిడ్డ పుట్టాక ఆస్పత్రి నుంచి వెళ్లేప్పుడు వైద్యులు మూడు పుస్తకాలను తల్లిదండ్రుల చేతిలో పెడతారు. పిల్లల్ని బాగా చదివిస్తూనే, తల్లిదండ్రులూ పుస్తకాల్ని చదివే అలవాటు కొనసాగించాలని సూచిస్తూ ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే తొలి రోజుల్లో తల్లి సంరక్షణ చాలా కీలకం. అందుకే అన్ని సంస్థలూ తప్పనిసరిగా ఎనిమిది నెలల ప్రసూతి సెలవుల్ని మహిళలకు అందిస్తాయి. ఆ తరవాత కూడా ఉద్యోగానికి వెళ్లని తల్లులు ఆదాయం గురించి బెంగపడకుండా మూడేళ్లపాటు ‘డే కేర్‌ ఎలొవెన్స్‌’ పేరుతో ప్రభుత్వం కొంత డబ్బుని చెల్లిస్తుంది. కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే తల్లుల సంఖ్య అక్కడ ఐదు శాతంలోపే. దానికి కారణం ప్రభుత్వ పరిధిలో ఉచితంగా పనిచేసే ‘డే కేర్‌’ కేంద్రాలే. ఎనిమిది నెలల వయసు నుంచి ఆరేళ్లు వచ్చే వరకూ పిల్లలంతా ఆ ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో హాయిగా పెరగొచ్చు. అక్కడ ప్రతి పన్నెండు మంది పిల్లలకూ ఓ టీచర్‌, ఇద్దరు నర్సుల చొప్పున అందుబాటులో ఉంటారు. చిన్నారుల ఆలనాపాలనతో పాటు వాళ్లలో జీవన నైపుణ్యాలు పెంచే బాధ్యతనూ వాళ్లే తీసుకుంటారు. దాదాపు ఐదేళ్ల పాటు ఒకే ఉపాధ్యాయుడి దగ్గర పన్నెండు మంది పిల్లలు పెరుగుతారు. తల్లిదండ్రుల తరవాత పిల్లలకు అంతటి అనుబంధం టీచర్లతోనే అల్లుకుంటుంది. దాంతో వాళ్ల స్వభావాన్నీ, సామర్థ్యాన్నీ అర్థం చేసుకుని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకు దొరుకుతుంది. ఆ ఐదేళ్లూ తరగతి గది పాఠాలు పిల్లల దగ్గరకి రావు. పక్షులూ, జంతువులూ, చెట్లూ, మనుషులూ, ఆహారం... ఇలా చుట్టూ కనిపించే అంశాల గురించే పిల్లలకు నేర్పిస్తారు. సంరక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తయ్యాక కూడా ఏ స్కూల్లో చేర్పించాలా అని తల్లులు తలలు పట్టుకోవాల్సిన పనిలేదు. పల్లె నుంచి పట్నం దాకా ప్రతి స్కూలుకీ, ప్రభుత్వం నుంచి ఒకే స్థాయిలో నిధులు అందుతాయి. ఒకే తరహా విద్యార్హతలూ, సామర్థ్యమున్న ఉపాధ్యాయులుంటారు. అన్ని పాఠశాలల్లో ఒకేలాంటి సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయి. అంటే... అక్కడన్నీ మంచి స్కూళ్లే!

రోజూ ఒంటిపూట బడులే...
ఏడేళ్ల వయసు నుంచీ పదహారేళ్ల వరకూ, అంటే ఒకటి నుంచి తొమ్మిదో గ్రేడ్‌ దాకా ప్రతి ఒక్కరూ కచ్చితంగా చదువుకొని తీరాలన్నది ఫిన్లాండ్‌లో తూచా తప్పకుండా అమలయ్యే నిబంధన. అందుకే ప్రస్తుత తరంలో అక్కడ నిరక్షరాస్యులు ఒక్కరంటే ఒక్కరూ కనిపించరు. పేరుకే అది నిర్బంధ విద్య. ఆచరణలో మాత్రం అక్కడి తరగతి గదులు పిల్లల పాలిట స్వర్గధామాలే. ఒంటిమీద రంగురంగుల దుస్తులుంటేనే పిల్లలకు ఉత్సాహం. అందుకే అక్కడ స్కూళ్లలో ఏకరూప దుస్తుల(యూనిఫాం) విధానాన్ని ఎప్పుడో పక్కనపెట్టారు. చదువూ, పుస్తకాలూ పిల్లలకెప్పుడూ భారం కాకూడదని ‘హోం వర్క్‌’ సంస్కృతినీ దూరం చేశారు. ఆరో తరగతి దాకా పిల్లలు ఇంటి దగ్గర పుస్తకం తెరవాల్సిన పనిలేదు. ఆపై తరగతుల వాళ్లకు ఇచ్చే హోంవర్క్‌ని పూర్తిచేయడానికి అరగంటకు మించి సమయం పట్టకూడదన్నది మరో నిబంధన. పిల్లల నిద్రకు ఫిన్లాండ్‌ చాలా ప్రాధాన్యమిస్తుంది. అందుకే పాఠశాలల గేట్లు తొమ్మిది తరవాతే తెరుచుకుని, మధ్యాహ్నం రెండున్నరకల్లా మూతబడతాయి. అంటే హైస్కూల్‌ పూర్తయ్యేదాకా అక్కడ పిల్లలకు నిత్యం ఒంటిపూట బడులే. రోజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు పీరియడ్లకు మించి జరగవు. ప్రతి పీరియడ్‌కీ మధ్యలో కనీసం పదిహేను నిమిషాల విరామం ఉంటుంది. ఆ సమయంలో ఠంచనుగా పిల్లలకు చిరుతిళ్లు అందుతాయి. రోజుకో గంట ఆటల విరామమూ తప్పనిసరి. పిల్లల భోజనం గురించీ తల్లిదండ్రులు బెంగపడాల్సిన పనిలేదు. చదువు పూర్తయ్యేదాకా చక్కని పోషకాహారాన్ని- పిల్లలకు ఇష్టమైన రుచుల్లో ప్రతి రోజూ ప్రభుత్వమే పూర్తి ఉచితంగా అందిస్తుంది.

ర్యాంకులకు చెల్లు!
‘అందరూ సమానంగా చదవాలీ, అందరూ టాపర్లు కావాలీ’ అన్నది ఫిన్లాండ్‌ విద్యాశాఖ లక్ష్యం. అందుకే విద్యార్థుల మధ్య హెచ్చుతగ్గులను ఎత్తి చూపే పరీక్షలూ, మార్కుల సంస్కృతికి ఆ దేశం పూర్తిగా దూరమైంది. అన్ని దేశాల్లోలా త్రైమాసిక, వార్షిక పరీక్షలంటూ పిల్లలకు వేధింపులుండవు. ఒక్కో తరగతిలో 15-20కి మించి విద్యార్థులు ఉండటానికి వీల్లేదు. కనీసం నాలుగు తరగతుల వరకూ ఒకే ఉపాధ్యాయుల బృందం పిల్లలకు పాఠాలు చెబుతుంది. అంటే వరసగా నాలుగేళ్ల పాటు పిల్లల సామర్థ్యం, తెలివితేటలూ, సబ్జెక్టులపైన పట్టూ లాంటి అన్ని అంశాల గురించీ టీచర్లకు అవగాహన కలుగుతుంది. దాంతో పిల్లల్లోని లోపాలను సరిచేస్తూ, ఏటికేడూ వాళ్లని మెరుగుపరచడానికి కావల్సినంత సమయమూ టీచర్లకు దొరుకుతుంది. ఒకట్రెండు పరీక్షలతో కాకుండా ఎప్పటికప్పుడు రకరకాల అంశాల్లో విద్యార్థులు చూపే ప్రతిభ ఆధారంగా వాళ్ల సామర్థ్యాన్ని టీచర్లు అంచనా వేస్తారు. ఏడాది చివర్లో మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో పరీక్షలు పెట్టినా, వాటిలో మార్కుల్ని మాత్రం బయట పెట్టరు. అంటే... పరీక్షలు రాసేది విద్యార్థులైనా, వాటి ద్వారా తామెంత బాగా చెబుతున్నదీ, తాము చెబుతున్న విషయాల్ని పిల్లలు ఏమేరకు అర్థం చేసుకుంటున్నారన్నదీ టీచర్లు అంచనా వేసుకుంటారు. ఆ జవాబు పత్రాల ఆధారంగా మరుసటి ఏడాది తమ శిక్షణ తీరులో మార్పులు చేసుకుంటారు. మొత్తంగా ఒక్కో తరగతి మారే కొద్దీ విద్యార్థుల విజ్ఞానంతో పాటు వ్యక్తిత్వాన్నీ పెంపొందించడమే లక్ష్యంగా ఫిన్లాండ్‌ విద్యా విధానం సాగుతుంది.

ఒకే ఒక్క పరీక్ష!
పదహారేళ్లు వచ్చే వరకూ పరీక్షలే తెలీకుండా పెరిగిన విద్యార్థులు, తొమ్మిదో గ్రేడ్‌ చివర్లో తమ జీవితంలో తొలి ‘పెద్ద పరీక్ష’ రాస్తారు. పైచదువులకు వెళ్లాలంటే అది పాసై తీరాల్సిందే. అపరిమితమైన పాఠాలూ, పిల్లలకు భవిష్యత్తులో ఏమాత్రం ఉపయోగపడని అంశాలూ ఫిన్లాండ్‌ విద్యావ్యవస్థలో కనిపించవు. పైతరగతుల్లో, రోజువారీ వృత్తుల్లో ఉపయోగపడే లెక్కలూ, సైన్స్‌కి సంబంధించిన అంశాలను పరిమితంగానే వారికి నేర్పిస్తారు. పరీక్షలు కూడా విద్యార్థులు బుర్రలు బద్దలుకొట్టుకునేంత కఠినంగా కాకుండా, ఆయా అంశాల్లో వారి ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షించేవిగానే ఉంటాయి. అందుకే పరీక్షల్లో తప్పే విద్యార్థులు దాదాపుగా ఉండరు. తొమ్మిదో గ్రేడ్‌ తరవాత చదువు కొనసాగించాలా వద్దా అన్నది పిల్లల ఇష్టం. ఉన్నత డిగ్రీలు చదవాలనుకునేవాళ్లు ‘అప్పర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌’ కాలేజీల బాట పడతారు. చదువుపైన ఆసక్తి లేని వాళ్లు వొకేషనల్‌ కోర్సుల్లో శిక్షణ తీసుకొని జీవితాల్లో స్థిరపడతారు. రెండిట్లో ఏ దారి ఎంచుకున్నా, ఆ ఫీజుల భారమంతా ప్రభుత్వానిదే. మొత్తంగా చదువు పూర్తయ్యేవరకూ పిల్లల ఖర్చులూ, పాఠశాలలో విద్యా ప్రమాణాల గురించి ఆలోచించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉండదు. పోటీ, ఒత్తిడిలో పడిపోయి బాల్యాన్ని కోల్పోవాల్సిన అగత్యం పిల్లలకూ ఉండదు.

టీచరే సూపర్‌స్టార్‌!
‘బతకలేక బడిపంతులు’ అన్న నానుడిని ఫిన్లాండ్‌లో ‘బతకాలంటే బడిపంతులే’ అని మార్చుకోవాల్సిందే! ఆ దేశంలో అత్యంత గౌరవ ప్రదమైన వృత్తుల్లో వైద్యుల తరవాతి స్థానం ఉపాధ్యాయుడిదే. జీతాల విషయంలోనూ అదే వరస. టాలెంట్‌ ఉన్న టీచర్లను ఆ దేశం నెత్తిన పెట్టుకుంటుంది. తమ ఎదుగుదలకు ముఖ్య కారణం మంచి ఉపాధ్యాయులే అని బల్లగుద్ది మరీ చెబుతుంది. అందుకే ఫిన్లాండ్‌లో బోధన ఓ ‘స్టార్‌ ఉద్యోగం’. కుర్రాళ్లంతా టీచర్‌గా మారడానికి ఉవ్విళ్లూరతారు. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్నుంచే దానికోసం కసరత్తు మొదలుపెడతారు. కానీ ఆ ఉద్యోగం పొందడం అంత సులువైన పనికాదు. ఓ ఆర్నెల్లు పుస్తకాలు తిరగేసి, పరీక్ష రాసి టీచర్‌గా మారిపోదాం అంటే కుదరదు. ఎలిమెంటరీ స్కూల్‌ టీచర్‌గా చేరాలంటే కనీసం మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సెకండరీ స్కూల్‌ టీచర్లకైతే పీహెచ్‌డీ తప్పనిసరి. ఏటా టీచర్‌ పోస్టులకు వచ్చే దరఖాస్తుల్లో కేవలం పదిశాతమే తుది పరిశీలనకు ఎంపికవుతాయి. వాటిని జల్లెడపడితే ఎక్కువ శాతం మంది వివిధ యూనివర్సిటీల టాపర్లే కనిపిస్తారు. ఉద్యోగ ప్రవేశ పరీక్ష ద్వారా వాళ్లలోంచి ఇంకొందర్ని ఎంపికచేస్తారు. ఆ తరవాతి దశ ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల వ్యక్తిత్వం, విజ్ఞానం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను అంచనా వేస్తారు. కేవలం జీతం కోసం కాకుండా బోధనపైన ప్రేమతో ఆ వృత్తిలో అడుగుపెట్టేవాళ్లనే చివరికి ఎంపికచేస్తారు. రెండు మూడు నెలల పాటు సాగే ఆ ప్రక్రియ మన సివిల్‌ సర్వీసు అభ్యర్థుల ఎంపికకు ఏమాత్రం తీసిపోదు. ఎంపికైన టీచర్లకు ఏడాది పాటు పిల్లలకు బోధించే విధానాలపైన శిక్షణ ఉంటుంది. అన్ని కఠినమైన దశల్ని దాటొస్తారు కాబట్టే టీచర్లంటే అక్కడి వాళ్లకి అంత గౌరవం. పిల్లలకు శిక్షణ ఇవ్వడం తప్ప శిక్షించే సంస్కృతి స్కూళ్లలో కనిపించదు. ఆ గురువులపైన అంత నమ్మకం ఉండబట్టే అక్కడ ‘పేరెంట్‌-టీచర్‌’ సమావేశాలకూ చోటు లేదు. ‘లెస్‌ ఈజ్‌ మోర్‌’ అన్నది ఫిన్లాండ్‌ ప్రజల జీవన సూత్రం. అందుకే పసిమెదళ్లపైన గుది బండలా మారే మార్కులూ, ర్యాంకులూ, గ్రేడ్ల విధానాలూ, టాపర్లూ-మొద్దులూ అన్న తారతమ్యాలూ, పేదా-గొప్పా తేడాలూ, మంచి స్కూళ్లూ-చెడ్డ స్కూళ్లూ అన్న భేదాలూ, పల్లెలూ-పట్టణాలూ అన్న వ్యత్యాసాలూ అక్కడి వ్యవస్థలో లేవు. పిల్లలంతా ఒక్కటే, వాళ్లకు అందాల్సిన విద్యా ఒక్కటే అన్న సిద్ధాంతాన్ని మనసావాచాకర్మణా అనుసరిస్తున్నారు. పాఠ్య పుస్తకాన్ని చేతిలో పెట్టడానికి ముందే పిల్లల వ్యక్తిత్వాన్ని నిర్మించే పాఠాలకు పునాది వేస్తున్నారు. మంచి విద్యార్థులనూ, పౌరులనూ దేశానికి అందించడానికి పిల్లల దృష్టిలో చెడ్డ తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా మిగలాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు.

మనకీ కొత్త విద్యాసంవత్సరం మొదలైంది. కోటి ఆశలతో లక్షలాది పిల్లలు బడిబాట పడుతున్నారు. వాళ్ల చదువులు కూడా ఫిన్లాండ్‌ విద్యార్థుల చదువులంత హాయిగా సాగాలంటే, మన ఆలోచనలూ అక్కడి తల్లిదండ్రులూ ఉపాధ్యాయుల ఆలోచనలంత ఉన్నతంగా మారాలి. మన ప్రభుత్వాలూ అక్కడి విధానాల్లో కొన్నింటినైనా ఆచరణలోకి తేవాలి. పిల్లల నుంచి ఆశించడం మానేసి, వాళ్లని అర్థం చేసుకోవడం మొదలుపెడితే చాలు, ఉత్తమ ఫలితాలు వాటంతట అవే వస్తాయనడానికి ఫిన్లాండ్‌ విజయాలే సాక్ష్యం. ఆ దేశంలో పరీక్షల విధానం లేకపోవచ్చు. కానీ విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడమన్నది ఏ దేశానికైనా పెద్ద పరీక్షే. అందులో ఫిన్లాండ్‌కి మరో ఆలోచన లేకుండా వందకి వంద మార్కులూ వేయాల్సిందే..!


అక్షరాస్యతలో నంబర్‌ 1
గతేడాది కనెక్టికట్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రపంచంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన దేశాల్లో తొలిస్థానం ఫిన్లాండ్‌ది (100శాతం). చదువుతో పాటు చదువుకున్న వాళ్ల వ్యవహారశైలినీ పరిగణనలోకి తీసుకొని నిర్వహించిన నాగరిక దేశాల సర్వేలోనూ దానికి తొలి స్థానం దక్కింది.
* తరగతిలోని విద్యార్థుల మధ్య ప్రతిభ విషయంలో అతి తక్కువ వ్యత్యాసం ఉన్న దేశం ఫిన్లాండే. తెలివైన విద్యార్థులకంటే, త్వరగా పాఠాలను అర్థం చేసుకోలేని పిల్లల దగ్గరే టీచర్లు ఎక్కువ సమయం గడపడం, సగటున పదిహేను మంది పిల్లలకు ఒక టీచర్‌ ఉండటం దానికి కారణం. ప్రతిభ ఆధారంగా పిల్లల్ని వేర్వేరు సెక్షన్లలో కూర్చోబెట్టే పద్ధతే వాళ్లకు తెలీదు.
* ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ బోధనా గంటలూ, స్కూళ్లకు ఎక్కువ సెలవులూ ఉన్న దేశం ఫిన్లాండే. అక్కడ స్కూళ్లు గరిష్టంగా 180రోజులు మాత్రమే పనిచేస్తాయి. భారత్‌లో దాదాపు 240 రోజులపాటు తెరిచుంటాయి. అక్కడ సగటున ఒక ఉపాధ్యాయుడు ఏడాదికి 600గంటల పాటు పాఠాలు చెబుతాడు. అదే మన దేశంలో ఆ సంఖ్య దాదాపు 1700 గంటలు. అంటే ఫిన్లాండ్‌ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
* భవిష్యత్తులో విద్యార్థుల వృత్తిగత జీవితంలో పెద్దగా ఉపయోగపడని జాగ్రఫీ, హిస్టరీ లాంటి కొన్ని సబ్జెక్టులను ఈ ఏడాది నుంచి ఫిన్లాండ్‌ హైస్కూళ్లలో తొలగించాలని నిర్ణయించారు. వాటి స్థానంలో ప్రస్తుత తరంలో జోరు మీదున్న రెస్టరెంట్లూ, జిమ్‌లూ, స్టార్టప్‌ల లాంటి సమకాలీన అంశాల గురించి బోధిస్తారు.
* ఫిన్లాండ్‌లో స్కూల్‌ సిలబస్‌ను తయారు చేసే బాధ్యత పూర్తిగా టీచర్లదే. వివిధ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పాఠ్యాంశాలను చేరుస్తూ, పాతవాటిని తొలగిస్తూ ఉంటాయి.
* ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో పిల్లల పుస్తకాల్ని ప్రచురించే దేశం ఫిన్లాండే. ప్రతి సిటీ బస్సులో, రైల్లో ఓ పుస్తకాల స్టాండ్‌ కనిపిస్తుంది. విదేశీ కార్యక్రమాలని అనువదించకుండానే అక్కడి టీవీల్లో ప్రసారం చేస్తూ, వాటి కింద సబ్‌టైటిళ్లు వేస్తారు. టీవీ చూస్తూనే పిల్లలు స్థానిక భాషను చదవడం నేర్చుకునేందుకే ఆ పద్ధతి.
* పదకొండేళ్లు వచ్చాకే ఫిన్లాండ్‌ పిల్లలకు ఇంగ్లిష్‌ పాఠాలు మొదలవుతాయి. అప్పటిదాకా బోధనంతా ఫిన్నిష్‌, స్వీడిష్‌ భాషల్లో సాగుతుంది. అక్కడ ఒక్కో విద్యార్థి సగటున నాలుగు భాషలు మాట్లాడగలడు.
* పోటీ పరీక్షలూ, కాలేజీలకు ప్రవేశ పరీక్షలూ, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లూ లేని దేశం ఫిన్లాండ్‌. హైస్కూల్‌ దశలోనే విద్యార్థులు తమ భవిష్యత్తుని నిర్ణయించుకుని దానికి తగ్గ కోర్సులే చేస్తారు. ఆ విద్యార్థుల సంఖ్యకు సరిపడా వృత్తి విద్యా సీట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది.
అదే తేడా!
‘ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కో-ఆపరేషన్‌ డెవలప్‌మెంట్‌’ అనే సంస్థ మూడేళ్లకోసారి ప్రపంచస్థాయిలో లెక్కలూ, సైన్స్‌లాంటి వివిధ అంశాల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఓ పరీక్ష నిర్వహిస్తుంది. నాలుగేళ్ల క్రితం ఆ పోటీలో పాల్గొన్న భారత్‌కు చివరి నుంచి రెండో స్థానం దక్కింది. దాంతో తరవాతి పరీక్షలో భారత్‌ పాల్గొనలేదు. అదే పోటీలో ఫిన్లాండ్‌ ఎన్నో ఏళ్లుగా నిలకడగా తొలి స్థానాన్ని సాధిస్తోంది. అక్కడి తలసరి ఆదాయంలో ఏడు శాతాన్ని చదువుపైన ఖర్చు చేస్తుంటే, భారత్‌లో 3.3శాతాన్నే ఖర్చుచేస్తున్నారు. అక్కడ హైస్కూల్‌ టీచర్ల సగటు నెలసరి ఆదాయం రెండున్నర లక్షలు. ఇక్కడది రూ.31వేలు. అక్కడ నెలరోజుల్లో చెప్పే పాఠాల్ని, ఇక్కడ వారంలోనే ముగిస్తున్నారు. ఇలా ఎన్నో అంశాల్లో భారత్‌లాంటి అనేక దేశాలతో ఫిన్లాండ్‌కి ఉన్న స్పష్టమైన తేడాలే, ఆ దేశ విద్యా వ్యవస్థని తిరుగులేని స్థానంలో నిలబెట్టాయి.
నలభై ఐదేళ్ల క్రితం...
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఫిన్లాండ్‌ ఒకటి. 1970 వరకూ అక్కడి విద్యావ్యవస్థ నాసిరకంగా ఉండేది. సహజ వనరుల లభ్యతా తక్కువే. అలాంటి పరిస్థితుల్లో దేశం ముందుకెళ్లాలన్నా, ఇతర దేశాలతో సమానంగా ఎదగాలన్నా చదువుకున్న పౌరులే కీలకమని నాటి ప్రభుత్వ పెద్దలు నమ్మారు. డబ్బున్న వాళ్లంతా పిల్లల్ని మంచి స్కూళ్లకు పంపిస్తున్నారనీ, సామాన్యులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారనీ అర్థం చేసుకున్నారు. దాంతో ఎనభయ్యో దశకం తొలినాళ్లలో ప్రక్షాళన మొదలుపెట్టారు. దేశ విద్యా వ్యవస్థనంతా ప్రభుత్వం తన అధీనంలోకే తీసుకొని, ప్రైవేటు విద్యాసంస్థల్ని రద్దు చేసింది. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ సమానమైన విద్యను ఉచితంగా అందించడం మొదలుపెట్టింది. అలా గత నలభై ఐదేళ్లుగా విద్యా ప్రమాణాల్లో ఎన్నో మైలురాళ్లను దాటి, విద్యార్థుల సామర్థ్యం విషయంలో అగ్రరాజ్యాలనూ వెనక్కునెట్టి దూసుకెళ్తొంది. ప్రభుత్వం, తల్లిదండ్రులూ, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం, ఒకరిపైన ఒకరికి సంపూర్ణ నమ్మకం ద్వారా సాధ్యమైన విజయమిది.

మాథెరాన్‌నిశ్శబ్దానికి చిరునామా మాథెరాన్‌!
‘పచ్చని వాతావరణంలో నిశ్శబ్ద సంగీతాన్ని వింటూ కొండగాలి చల్లదనాన్ని ఆస్వాదిస్తూ రణగొణధ్వనులకి దూరంగా ఓ నాలుగు రోజులు హాయిగా గడిపి రావాలనుకునేవాళ్లకి మాథెరాన్‌ చూడచక్కని విడిది’ అంటూ ఆ ప్రాంతంలోని సుందర ప్రకృతి గురించి చెప్పుకొస్తున్నారు నవీ ముంబైకి చెందిన చిల్లరిగే పద్మ.
మాథెరాన్‌. నవీ ముంబైకి చాలా దగ్గర. కాంక్రీట్‌ అరణ్యం నుంచీ పరుగులెత్తే హడావుడి జీవితం నుంచీ ఓ రెండుమూడు రోజులు తప్పించుకోవాలని మాథెరాన్‌కు బయలుదేరాం. మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో కర్జత్‌ తాలూకాలో ఉందీ ప్రాంతం. మనదేశంలోని అత్యంత చిన్న కొండప్రాంత విడిది ఇదే. పర్యావరణ ప్రియమైన పర్యటక ప్రదేశం. ఎందుకంటే పశ్చిమ కనుమల పర్వతశ్రేణుల్లో ఉన్న ఈ ప్రాంతానికి ఎలాంటి మోటారు వాహనాల్నీ అనుమతించరు. అందుకే మిగిలిన హిల్‌స్టేషన్లకన్నా ఎంతో భిన్నమైనది మాథెరాన్‌. సముద్రమట్టం నుంచి 2,625 అడుగుల ఎత్తు కొండమీద ఉన్న మాథెరాన్‌కు వెళ్లాలంటే ముందుగా కొండకింద ఉన్న నేరల్‌ అనే వూరుకి వెళ్లాలి. అక్కడనుంచి కొండమీద ఉన్న దస్తూరినాకాకి వెళ్లి; ఆపై నడక, గుర్రపు స్వారీ లేదా రిక్షాల ద్వారా మాథెరాన్‌కు చేరుకోవచ్చు.
అదిగో... మాథెరాన్‌!
ఉదయాన్నే అల్పాహారం చేసి కారులో బయలుదేరాం. ముంబై-పుణె రహదారిమీద ఉన్న సీబీడీ బేలాపూర్‌ అనే పట్టణంనుంచి నేరల్‌ జంక్షన్‌కి చేరడానికి 90 నిమిషాలు పట్టింది. ఈ నేరల్‌ జంక్షన్‌కి ముంబై, పుణెల నుంచి రోడ్డు, రైలు మార్గాలున్నాయి. అయితే పుణె నుంచి కాస్త దూరం ఎక్కువ. ట్యాక్సీల్లో కూడా వెళ్లొచ్చు. మనమే డ్రైవ్‌ చేసుకుని వెళితే దస్తూరినాకాలో ఉన్న కారు పార్కింగ్‌ దగ్గర వరకూ వెళ్లొచ్చు. రుసుము కట్టి మళ్లీ మనం తిరిగి వచ్చేవరకూ కారుని అక్కడ పార్క్‌ చేసుకోవచ్చు. ఈ పాయింటు వరకూ మోటారు వాహనాలను అనుమతిస్తారు. ఒక్క అంబులెన్సు తప్ప, మరి వేటినీ ఆ ప్రాంతం దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. మేం మా కారుని నేరల్‌ జంక్షన్‌ దగ్గరే పార్కు చేసి షేర్‌ ట్యాక్సీలో దస్తూరినాకా వరకూ వెళ్లాం. స్థానిక ట్యాక్సీ యూనియన్‌ నడిపించే వాటికే అక్కడ అనుమతి. ప్రైవేటు ట్యాక్సీలను అనుమతించరు. స్థానికులకు జీవనోపాధి కల్పించేందుకే ఆ ఏర్పాటు. మాథెరాన్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ పర్యటకుల నుంచి ప్రవేశ రుసుము పెద్దవాళ్లకు 25, పిల్లలకు 10 రూపాయల చొప్పున వసూలు చేస్తోంది. నిర్వహణ ఖర్చులకీ మాథెరాన్‌ అభివృద్ధికీ ఈ నిధిని ఉపయోగిస్తారు.

ఇదివరకు నేరల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి మాథెరాన్‌ అమన్‌ లాడ్జి వరకూ నేరోగేజ్‌ ఉండేది. దీని మీద టాయ్‌ ట్రెయిన్‌ నడుస్తుంటుంది. కానీ గత ఏడాది రెండుసార్లు పట్టాలు తప్పడంవల్ల ప్రజల భద్రతకోసం ఈ రైలు సర్వీసుల్ని ప్రస్తుతం రద్దు చేశారు. తిరిగి ఇంకా మొదలుపెట్టలేదు. ఈ ప్రత్యేక టాయ్‌ రైలుని పూల్‌ రాణి అని పిలుస్తారు.వర్షాకాలంలో ఈ ప్రాంతం పూలతో అద్భుతంగా ఉంటుంది. మరాఠీలో మాథె అంటే నుదురు. రాన్‌ అంటే అడవి. మాథెరాన్‌ అంటే ‘నుదురులాంటి అడవి’ అని అర్థం. మన శరీరంలో నుదురు భాగం ఎత్తుగా ఉంటుంది కదా, అందుకే ఎత్తుగా ఉన్న అడవి అనే ఉద్దేశంలో దీనికాపేరు వచ్చిందని చెబుతారు.

కోతుల లోకం!
అక్కడ సామాన్లు మోయడానికి కూలీలు దొరుకుతారు. రిక్షాలూ గుర్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. చిన్న గేట్‌ దాటి ముందుకు వెళ్లగానే ఎర్ర మట్టి దారి కనిపించింది. ఎలాంటి కాలుష్యం సోకని స్వచ్ఛమైన కొండగాలి... అయితే రైలు పట్టాలమీదుగా నడుచుకుంటూ వెళితే గంటలోనే వెళ్లచ్చు అని చెప్పడంతో ఆ దారినే నడక మొదలెట్టాం. లెక్కలేనన్ని కోతులు పర్యటకుల్ని వెంబడిస్తుంటాయి. మన చేతిలో తినే వస్తువులుంటే వెంటనే లాగేస్తాయ్‌. స్నేహితుల సలహామేరకు చేతిలో ఏమీ ఉంచుకోకుండా నీళ్ల సీసాతో నడక మొదలెట్టాం. పక్షుల కూతలు, కోతుల కిచకిచలు, గాలిలో తేలి వచ్చే పర్యటకుల సంభాషణల శబ్దం తప్ప మరెలాంటి ధ్వనీ వినిపించదు. ఆ నిశ్శబ్ద ప్రకృతిలో చల్లని చెట్ల నీడ ఒడిలో మా నడక సాగింది.

ఎలా తెలిసింది?
థానే కలెక్టర్‌ హ్యూగ్‌ పోయెజ్జ్‌ మాలెట్‌ 1850లో ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడట. దీన్ని హిల్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి నాటి ముంబై గవర్నర్‌ లార్డ్‌ ఎలిఫిన్‌ స్టోన్‌ పునాది వేశారట. రెండు అడుగుల నేరో గేజ్‌ మార్గాన్ని నిర్మించారు. 1907 నుంచి ఆ కొండ రైలు మార్గం సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. దాంతో రాకపోకలు మొదలయ్యాయి. అయితే కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ మాథెరాన్‌ని ఎకో సెన్సిటివ్‌ ప్రాంతంగా ప్రకటించింది. చుట్టూ చూసుకుంటూ కోతుల బారినుంచి తప్పించుకుంటూ రైలుపట్టాల మీద నడవడం మరపురాని అనుభూతి. కొండ మీద నుంచి నెరల్‌ పట్టణాన్నీ కర్జత్‌ పట్టణాన్నీ చూశాం. ఆగి ఆగి ఫొటోలు తీసుకుంటూ గంటన్నర తరవాత మాథెరాన్‌ మార్కెట్‌ చేరుకున్నాం. అప్పటికి ఒంటిగంట కావస్తోంది. మేం ముందుగా బుక్‌ చేసుకున్న హోటల్‌ మార్కెట్‌ నుంచి మరో పదిహేను నిమిషాల దూరంలో ఉంది. ఆ మధ్యలో ఓ ప్రభుత్వ ఆసుపత్రి, స్కూలు, రైల్వే స్టేషన్‌ ఉన్నాయి. మార్కెట్‌లో ఎక్కడ చూసినా చిక్కీ అమ్మే దుకాణాలే. ఇక్కడ వాళ్లకి మరాఠీ, హిందీ, ఇంగ్లిష్‌ మాట్లాడటం వచ్చు.

గుర్రాల కోసమే...
మాథెరాన్‌ను సందర్శించడానికి సీజన్‌తో సంబంధం లేదు. ఎప్పుడైనా రావచ్చు. ప్రకృతిని ఆసాంతం ఆస్వాదించాలంటే మాత్రం వర్షాకాలమే సరైనది. అక్కడి వాళ్లకి పర్యటకమే ప్రధాన ఆదాయం. కింద నుంచి వచ్చిన సవారీలన్నీ మార్కెట్‌ వరకే. అక్కడి నుంచి మరొకటి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆ దారిలో వస్తుంటే పార్సీ వాళ్ల బంగళాలు కనిపించాయి. బ్రిటిష్‌ వాళ్లు మాథెరాన్‌ని హిల్‌ స్టేషన్‌గా మార్చడం వల్ల అక్కడి నిర్మాణాలన్నీ బ్రిటన్‌ వాస్తు శైలిని ప్రతిబింబిస్తున్నాయి. వూరంతా ఎర్రటి దుమ్ము... గుర్రాల పాదాలు తారు రోడ్డు వేడికి తట్టుకోలేవు. వాటికీ మట్టి రోడ్డు మంచిది. అందుకే మాథెరాన్‌లో అన్నీ మట్టి రోడ్లే. పాండే రోడ్డులో ఉన్న మా రిసార్ట్‌కి వెళ్లి, కొద్దిసేపు సేదతీరి, మాథెరాన్‌ అందాలు చూడ్డానికి బయలుదేరాం.

ముందుగా మా రిసార్ట్‌కి దగ్గరగా ఉన్న రాంబాగ్‌ పాయింట్‌ దగ్గరకు వెళ్దామని బయలుదేరాం. దారిలో 1860లో క్యాథలిక్కులు నిర్మించిన అతి పురాతనమైన చర్చి ఉంది. అక్కడ ఆగి, లోపలికి వెళితే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అక్కడ నుండి రాంబాగ్‌కి వెళ్లాం. మెయిన్‌ మార్కెట్‌ నుంచి సుమారు రెండు కి.మీ. ఉండొచ్చు. మా రిసార్ట్‌కి చాలా దగ్గర. దారంతా చిన్న చిన్న రాళ్లతో మెట్ల మెట్లుగా ఉంటుంది. గుర్రాలు అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. వీధి దీపాలు చాలా తక్కువ. అక్కడ నుంచి సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. అయితే తెల్లవారుజామునే లేచి అక్కడకు ఆ దారిలో వెళ్లాలంటే చేతిలో టార్చిలైటు ఉంటే మంచిది. ముందే చూసి రావడంవల్ల మర్నాడు ఆరు గంటలకల్లా చేతిలో టార్చిలైటు ఉంచుకుని, రాళ్లనీ గుర్రాలనీ తప్పించుకుంటూ రాంబాగ్‌ పాయింట్‌కి చేరుకున్నాం. చిక్కని ఆ నిశ్శబ్దాన్ని కదిలిస్తూ మధ్యమధ్యలో సూర్యోదయం చూడాలని వచ్చిన యాత్రికుల గుసగుసలు... అప్పుడు జరిగిందో ప్రకృతి అద్భుతం...కొండల వెనక నుంచి ముందు నెమ్మదిగానూ ఆపై గబగబా పైకి వచ్చాడు భానుడు. ఆ దృశ్యం అద్భుతం... అమోఘం... ఎంతసేపు చూసినా తనివి తీరదు. ‘ఆకాశం నుదుట పెట్టుకున్న ఎర్రటి బొట్టులా ఉన్నాడు సూరీడు’ అన్న ముత్యాలముగ్గులోని రావుగోపాలరావు డైలాగులు గుర్తుకురాక మానవు. అలా అక్కడ చాలాసేపు సూర్యుణ్ణి చూస్తూనే ఉండిపోయాం.

తిరిగి రిసార్ట్‌కి వచ్చే దారిలో- 1916లో కట్టించిన అంటువ్యాధుల వార్డు శిథిలావస్థలో ఉంది. ఆ రోజుల్లో వ్యాధిసోకిన వాళ్లని అలా దూరంగా ఉంచేవారన్నమాట. అల్పాహారం చేశాక మాథెరాన్‌ చూడ్డానికి బయలుదేరాం. ముందుగా ఆ చుట్టుపక్కల పరిసరాలకి నీటిని అందించే చార్లెట్‌ సరస్సు దగ్గరకు వెళ్లాం. చిన్నదైనా పారదర్శకంగా ఉన్న ఆ కొలనులో చేపలు పట్టడం, బట్టలు ఉతకడం లాంటివి అస్సలు అనుమతించరట. అక్కడ ఓ చిన్న ఆనకట్ట కట్టడంవల్ల వర్షాకాలంలో పై నుంచి వచ్చే చిన్న జలపాతం ద్వారా ఈ కొలనులో ఎప్పుడూ నీళ్లు నిల్వ ఉంటాయి.దీనికి కుడివైపున అతి పురాతనమైన పిసర్నాధ్‌ మందిర్‌ ఉంది. గుడి ప్రాంగణంలో భారీ గంట ఉంది. ఇక్కడ శివుడు స్వయంభువుడు. పిసర్నాథ్‌ను స్థానికులు గ్రామదేవతగా కొలుస్తారు. ‘L’ ఆకారంలోని లింగాకృతిలో ఉండటమే ఇక్కడి శివుడి ప్రత్యేకత. పూర్తిగా సింధూరంతో ఉంటుంది శివలింగం. ఇక్కడి కొచ్చే పర్యటకులు సూర్యాస్తమయం లోపలే దర్శనం చేసుకుంటే మంచిదిగా భావిస్తారు. దట్టమైన అడవి మధ్యలో ఉండటంవల్ల చీకటి పడితే జంతువులు తిరుగుతుంటాయట. ఆ పరమేశ్వరుడిని దర్శనం చేసుకున్నాక లార్డ్‌ పాయింట్‌ దగ్గరకు వెళ్లాం. అక్కడకు వెళ్లేసరికి నడిచిన అలసట అంతా ఎగిరిపోయింది. ఆ ప్రాంతాన్ని మాటల్లో వర్ణించలేం. చూసి తీరాల్సిందే. అక్కడి నుంచి దూరంగా కనిపించే ఓ కొండను చూస్తే దేవతా ఆకారంలో చెక్కినట్లు అనిపిస్తుంది. కానీ ప్రకృతి సహజంగా ఏర్పడిన వింత కొండ అది. ఆ పాయింట్‌ నుంచే బైనాక్యులర్స్‌ లేదా గైడ్‌ దగ్గరున్న టెలీస్కోప్‌ ద్వారా దూరంగా ఉన్న ప్రబలగఢ్‌ కోటను చూడొచ్చు. అది మరాఠాల శౌర్యానికీ వీరత్వానికీ ప్రతీక. మొఘల్‌ చక్రవర్తుల్ని ఓడించి శివాజీ గెలుచుకున్న కోట అది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. దూరంగా కనిపించే శివాజీ నిచ్చెననీ చూశాం. అప్పట్లో శివాజీ వేటకోసం మాథెరాన్‌ కొండలు ఎక్కేవాడట. ఆయన ఎక్కేదారినే శివాజీ నిచ్చెన అని పిలుస్తారు. ఈ శివాజీ నిచ్చెన ఎక్కే ముంబై గవర్నర్‌ ఈ కొండ మీదకి వచ్చి ఇక్కడి అందాలను చూసి ముగ్ధులయ్యారని చెబుతారు. ఇప్పటికీ గిరిజనులు ఆ దారిలోనే మాథెరాన్‌ అడవుల్లోకి వెళతారు. సాహసభరితమైన ట్రెక్కింగ్‌ మార్గంగా ఈ శివాజీ నిచ్చెన పేరొందింది.

ఒంటరి చెట్టు!
తరవాత ఎకో పాయింట్‌ చూడ్డానికి వెళ్లాం. అక్కడి నుంచి మనం పిలిస్తే అది ప్రతిధ్వనిస్తుంది. వర్షాకాలంలో వెళితే అక్కడి జలపాతాల అందాలను చూస్తూ వాటి జావళీల్నీ వినొచ్చు. తరవాత వన్‌ట్రీ పాయింట్‌ దగ్గరకు వెళ్లాం. ఓ నేరేడుచెట్టు అక్కడ దశాబ్దాలుగా ఒంటరిగా ఉంటోంది. వర్షాకాలంలో చిన్నచిన్న మొక్కలు మొలిచినా చెట్టు మాత్రం ఇదొక్కటే ఉండడంతో దీనికా పేరు. ఆ రోజంతా తిరగడంతో బాగా అలసిపోయాం. దారిలో లిటిల్‌ చౌక్‌ పాయింట్‌, ఖండాలా పాయింట్‌ చూసి, ఇక కాళ్లు మొరాయించడంతో రిసార్ట్‌లోకి వచ్చి పడ్డాం. మర్నాడు ఉదయాన్నే రూము ఖాళీ చేసి అక్కడ దొరికే చిక్కీలనీ చాక్లెట్‌ ఫడ్జెస్‌నీ కొనుక్కుని తిరుగు ప్రయాణమయ్యాం. లోనావాలా చిక్కీల మాదిరిగానే మాథెరాన్‌ చిక్కీలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. తిరుగు ప్రయాణంలో రిక్షా ఎక్కాం. దీన్ని ముందు ఒకరూ వెనక ఇద్దరూ పట్టుకుని నడిపిస్తారు. అలా దస్తూరినాకా వరకూ వచ్చి, నేరల్‌ చేరుకుని అక్కడి నుంచి మా కారులో ముంబై దారిపట్టాం.


మేఘాలలో.. మాథెరాన్‌
రుతురాగాల వేళ..
అక్కడికి చేరుకోగానే..
చిరుజల్లులు స్వాగతం పలుకుతాయి
ఇంకో నాలుగు అడుగులు వేయగానే..
పచ్చని పర్వతాలు మమ్మల్ని చూడండంటాయి
ఆ కొండ వాలుల్లోకి వెళ్లగానే..
మేఘమాలికలు మీ చేతికందుతాయి
అక్కడ నడవండి..
కొండలెక్కండి..
అద్భుతాలను ఆస్వాదించండి.


వానల్లో.. కోనల్లో.. మాథెరాన్‌

హ్యాద్రి పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 2,650 అడుగుల ఎత్తులో ఉంటుంది మాథెరాన్‌. చల్లని గాలులు, ప్రశాంతమైన రాత్రులు.. అందరికీ ఆహ్వానం పలుకుతాయి. వారమంతా పనితో సతమతమయ్యే ముంబైకర్లు.. వీకెండ్‌ వచ్చిందంటే చాలు మాథెరాన్‌లో వాలిపోతారు. పుణెవాసులూ వారాంతపు వినోదానికి ఇక్కడికి చేరుకుంటారు. కొండవాలులో చకచక అడుగులు వేస్తారు. పిల్ల కాల్వలను దబుక్కున దాటేస్తారు. జలపాతాల జోరులో హుషారెక్కుతారు.
ఏడాదంతా ఇలాగే ఉంటుందిక్కడ. అందుకే ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు మాథెరాన్‌కు వెళ్తుంటారు. వర్ష రుతువులో అయితే మరీనూ! రోజూ వర్షం పలకరిస్తుంది. కొండల నుంచి జలధారలు ఉప్పొంగుతుంటాయి. నేలంతా మెత్తబడి అడుగులకు మడుగులొత్తుతుంది. పర్యాటకులు వర్షంలోనే కొండ అంచుకు చేరుకుంటారు. గరం గరం చాయ్‌ తాగుతూ.. కేరింతల స్వరం పెంచుతారు. కొండల చుట్టూ ఉన్న కోనల సోయగాలు చూస్తూ పరవశిస్తారు. మాథెరాన్‌ చుట్టుపక్కల 38 వ్యూ పాయింట్లు ఉన్నాయి. వన్‌ట్రీ హిల్‌ పాయింట్‌, హనీమూన్‌ హిల్‌, అలెగ్జాండర్‌ పాయింట్‌, పనోరమా పాయింట్‌, లూసియా పాయింట్‌ ఇలా రకరకాల వ్యూ పాయింట్లు మాథెరాన్‌ సౌందర్యాన్ని 360 డిగ్రీల కోణంలో ఆవిష్కరిస్తాయి.
అడ్వెంచర్‌ డెస్టినేషన్‌గా మాథెరాన్‌కు పేరుంది. ఇక్కడి పరిసరాల్లో ట్రెక్కింగ్‌, ర్యాపెలింగ్‌, క్యాంప్‌ఫైర్‌, రాక్‌ క్లైంబింగ్‌ వంటి ఈవెంట్లు సాహసయాత్రికులను అలరిస్తాయి. దోధనీ జలపాతం మనసును కట్టిపడేస్తుంది. చందేరి గుహలు ఆశ్చర్యపరుస్తాయి. ఆద్యంతం ఆనందాల మధ్య సాగే మాథెరాన్‌ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
వాహనాలకు నో ఎంట్రీ
మాథెరాన్‌లో వాహనాల రణగొణ ధ్వనులు వినిపించవు. అంబులెన్స్‌ తప్ప మిగతా ఏ వాహనమూ అక్కడ కనిపించదు. ఎవరు వచ్చినా.. ఆ కొండల పాదాల చెంత వాహనాలు ఆపాల్సిందే. పర్యావరణ పరిరక్షణ కోసం మాథెరాన్‌లో వాహనాలను నిషేధించారు. గుర్రాలపై స్వారీ చేయవచ్చు.
కోటలో పాగా ప్రబల్‌గడ్‌
పుణె సమీపంలో ట్రెక్కింగ్‌ జోన్‌గా పేరున్న మరో అద్భుతం ప్రబల్‌గడ్‌. సముద్రమట్టానికి 2,650 అడుగుల ఎత్తులో ఉంటుందీ ప్రాంతం.ఆ కోటపై మొఘలుల పెత్తనం సాగింది. అదిల్‌షాహీల ఆధిపత్యం నడిచింది. మరాఠాల ధ్వజం ఎగిరింది. ఎందరో యోధులు ప్రబల్‌గడ్‌లో అడుగుపెట్టారు. నేటికీ సాహసవంతులు మాత్రమే కోటలో పాగా వేయగలరు. ట్రెక్కింగ్‌ ప్రియులు క్యూ కడుతుంటారు. వారాంతాల్లో వందల మంది ఇటుగా వస్తారు. సరదాగా కబుర్లాడుకుంటూ.. కొండపైకి చేరుకుంటారు. అక్కడున్న కోట శిథిలావస్థకు చేరినా.. దర్పం మాత్రం తగ్గలేదు. ప్రకృతి సంపదతో అలరారుతున్న ప్రబల్‌గడ్‌ ట్రెక్కింగ్‌కు అనువైన ప్రదేశం. గిరి అంచు నుంచి కిందికి చూస్తే కళ్లముందు అద్భుతాలు కదలాడుతుంటాయి. మేఘాలు దాటి పైకొచ్చిన అనుభూతి కలుగుతుంది. మబ్బులన్నీ వినువీధులు వీడి.. మనతో దోస్తీకి వచ్చాయా అనిపిస్తుంది. చిరుజల్లుల వేళ ప్రబల్‌గడ్‌ ట్రెక్కింగ్‌ మరింత మనోహరంగా ఉంటుంది. కొండవాలులో చిన్నా చితకా జలపాతాలు కళ్లను కట్టిపడేస్తాయి. గంటన్నరలో కొండపైకి చేరుకోవచ్చు. పెద్దగా ఆయాసపడాల్సిన అవసరమూ ఉండదు.
శిఖరాగ్ర సంతోషం కళావతి దుర్గ్‌

ప్రబల్‌గడ్‌ చెంతనున్న కళావతి దుర్గం ఆకాశమంత ఎత్తుంటుంది. ఒంటిస్తంభం మేడలా ఉన్న శిఖరాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అద్భుతమైన కొండ.. దానిపై కోట. సముద్రమట్టానికి 2,300 అడుగుల ఎత్తులో ఉన్న కళావతి దుర్గం దేశంలోనే అత్యంత ఆసక్తికరమైన ట్రెక్కింగ్‌ స్పాట్‌గా పేరొందింది. నింగిని చీల్చుతోందా అన్నట్టుండే శిఖరం.. నిండుగా పచ్చదనంతో మరకత లింగాన్ని మరపిస్తుంది. కొండను తొలిచి అతి తక్కువ వాలుతో నిర్మించిన మెట్లు అధిరోహించడం ఒకింత కష్టమే. అయినా.. మేఘాలను దాటి.. రుతురాగాలు వినాలనుకునే సాహసవంతులు వెనకడుగు వేయరు. నేర్పుగా మెట్లు ఎక్కుతారు. ఓర్పుగా పైపైకి సాగుతారు. పట్టుకుందామంటే తాళ్లుండవు. పట్టుజారితే అడ్డుకోవడానికి పిట్టగోడలు ఉండవు. ఏమాత్రం తేడా వచ్చినా.. అంతే సంగతులు. నిపుణుల పర్యవేక్షణలో ఈ ట్రెక్కింగ్‌లు జరుగుతుంటాయి. ఈ సాహస క్రతువు దాదాపు రెండు గంటల పాటు సాగుతుంది. పైకి చేరిన తర్వాత ఆ కష్టమంతా ఇట్టే మరచిపోతారంతా. కారుమబ్బులు కమ్ముకొచ్చినప్పుడు.. సినిమాల్లో గ్రాఫిక్స్‌లా ఉంటుందా ప్రాంతం. చుట్టూ ఎటు చూసినా.. మబ్బులు పరుపుల్లా పరుచుకున్నట్టు అనిపిస్తుంది. మేఘాలు చెదిరిపోయిన వేళ.. చెంతనే ఉన్న ప్రబల్‌గడ్‌ కోట సిసలైన ఠీవి కంటపడుతుంది. మాథెరాన్‌ సౌందర్యం కనిపిస్తుంది. మహాబలేశ్వర్‌ కొండలు, కల్యాణ్‌, పాన్వెల్‌ కోటల దృశ్యాలూ చూడొచ్చు.
చేరుకునేదిలా
మాథెరాన్‌ ముంబయ్‌ నుంచి 90 కి.మీ, పుణె నుంచి 120 కి.మీ దూరంలో ఉంది. ఈ రెండు ప్రాంతాల నుంచి బస్సుల్లో, ప్రైవేట్‌ ట్యాక్సీల్లో మాథెరాన్‌ పర్వతం పాదాల చెంతనుండే నెరల్‌కు చేరుకోవచ్చు. అక్కడి నుంచి మాథెరాన్‌ వెళ్లొచ్చు.
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి కర్జత్‌కు రైళ్లున్నాయి. అక్కడి నుంచి నెరల్‌ మీదుగా మాథెరాన్‌ వెళ్లొచ్చు.
కర్జత్‌ నుంచి రోడ్డు మార్గంలో ప్రబల్‌గడ్‌ బేస్‌క్యాంప్‌ ఠాకూర్‌వాడికి (27 కి.మీ.) చేరుకోవచ్చు.
క్యాంప్‌లో సందడి

ప్రబల్‌గడ్‌, కళావతి దుర్గం ట్రెక్కింగ్‌ ఈ కొండల సమీపంలో ఉన్న ఠాకూర్‌వాడి నుంచి మొదలవుతుంది. పలు అడ్వెంచర్‌ క్లబ్‌లు ఠాకూర్‌వాడి, ప్రబల్‌మాచిల్లో క్యాంప్‌లు నిర్వహిస్తాయి. అక్కడి నుంచి ఉదయాన్నే ట్రెక్కింగ్‌ మొదలవుతుంది. సాయంత్రానికి మళ్లీ కిందికి చేరుకుంటారు. బేస్‌క్యాంప్‌ దగ్గర టెంట్‌హౌస్‌లు ఉంటాయి. నైట్‌ఫైర్‌ క్యాంప్‌లు నిర్వహిస్తారు. రాత్రంతా ఆటపాటలుంటాయి. క్యాంప్‌ నిర్వాహకులే భోజన వసతి కల్పిస్తారు. చిన్న చిన్న హోటళ్లూ ఉంటాయి.
కొండల మీదుగా..
మాథెరాన్‌ దిగువన నెరల్‌ జంక్షన్‌ ఉంటుంది. అక్కడి నుంచి కొండపైకి రైలుమార్గం అందుబాటులో ఉంది. 21 కిలోమీటర్ల దూరం.. టాయ్‌ ట్రైన్‌లో భలేగా సాగుతుంది. కొండలు, గుట్టల నడుమ రెండుగంటల పాటు సాగే రైలు ప్రయాణం మరచిపోలేని అనుభూతినిస్తుంది.


పేరూరు. ఓ అందమైన సాంస్కృతిక గ్రామం
పేరూరు... ఓ సాంస్కృతిక గ్రామం!
ప్రపంచం రోజురోజుకీ మారిపోతుంది. చేతిలోని సెల్‌ఫోను నుంచి నివసించే పల్లె వరకూ అన్నీ క్షణాల్లో మారిపోతున్నాయి. నిన్న ఉన్నట్లుగా నేడు, నేడు ఉన్నట్లు రేపూ ఉంటుందని చెప్పలేం. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలోని ఓ వూరు మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అలాగే ఉంటుంది. దాని పేరే పేరూరు. ఓ అందమైన సాంస్కృతిక గ్రామం!

చుట్టూ పచ్చని కొబ్బరితోటలూ వాటి మధ్య పారే పిల్ల కాలువలూ ఆ మధ్యలో కుదురుగా కట్టిన పాతకాలంనాటి పెంకుటిళ్లూ ఎర్ర కంకర రోడ్లూ కాస్త దూరంలోనే గోదావరి పాయలూ ఇంకాస్త ముందుకు వెళితే సాగర జలాలూ ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కనువిందు చేస్తుంటుంది తూర్పుగోదావరి జిల్లాలోని పేరూరు. క్రీ.శ. 11వ శతాబ్దం నుంచీ తన స్వరూపాన్ని కాస్త కూడా మార్చుకోకుండా పూర్వం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే కనిపిస్తుంది. దీనికి కారణం ఆ వూరికి ఉన్న చరిత్రే అని చెబుతారు స్థానికులు.

చాళుక్యరాజైన రాజేంద్రచోళుడు, తన కుమార్తె అమ్మంగిదేవిని రాజమహేంద్రవర పాలకుడు రాజరాజనరేంద్రుడికి వివాహం చేసి, అత్తింటికి పంపే సమయంలో చీరసారెలతోబాటు 18 కుటుంబాలకు చెందిన వేదపండితులనూ పంపించాడట. అలా వచ్చినవాళ్లలో కొందరు ఆత్రేయపురం దగ్గర ఉన్న ర్యాలీ దగ్గర స్థిరపడితే, మరికొందరు అంబాజీపేట మండలానికి వెళ్లగా, ఇంకొందరు పేరూరుని ఆవాసంగా చేసుకున్నారట. తమిళనాడులోని పెరియా(పెద్ద)వూరు నుంచి వచ్చినవాళ్లు స్థిరపడినదే పేరూరు అనీ, అందుకే ఇక్కడి బ్రాహ్మల్ని పేరూరు ద్రావిడులు అంటారనీ చెబుతుంటారు.

మహామహులెందరో..!
నాటి పేరూరు- విశ్వేశ్వరుని, గున్నాపంతుల, పేరమ్మ, బుచ్చమ్మ, బండివారి... అని ఐదు అగ్రహారాలుగా ఉండేది. కాలక్రమంలో మిగిలినవి అమలాపురంలో కలిసిపోగా విశ్వేశ్వరుని, బండివారి అగ్రహారాలు మాత్రమే ప్రస్తుత పేరూరులో ఉన్నాయి. విశ్వేశ్వరుని అగ్రహారం మెరక, పల్లపు వీధులతో ప్రధాన గ్రామంలో ఉంది. ఇక్కడ 365 కుటుంబాలు నివసిస్తున్నాయి. వందలాదిమంది నిత్యాగ్నిహోత్రులు, నిత్యానుష్టానపరులు, వేదపండితులు, ఘనాపాఠీలు, శాస్త్రపండితులు... ఇక్కడ ఇప్పటికీ నివసిస్తున్నారు.

పంచ ప్రణాళిక!
ప్రకృతికి ఆటంకం కలగకుండా జీవించాలన్నదే ఆ వూరివారి ఆశయం. అందుకే నాటి అగ్రహారంలో మెరక, పల్లపు వీధులకు రెండు ప్రధాన రహదారుల్నీ; వాటిని విభజిస్తూ చిన్నపాటి అడ్డు దారుల్నీ నిర్మించారు. ఇళ్లన్నీ ఉత్తర-దక్షిణ దిక్కుల్లోనూ; రోడ్లు తూర్పు-పడమర దిక్కుల్లో నిర్మించడంతో గాలీవెలుతురూ చక్కగా ఉంటాయి. రోడ్డుకిరువైపులా ఐదేసి చొప్పున పంచకమనే పద్ధతిలో ఇళ్లు నిర్మించి ఉంటాయి. ప్రస్తుతం ఆ వూళ్లొ ఇంటికి ఒకరు చొప్పున అమెరికాలోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయినప్పటికీ వాళ్లెవరూ తమ ఇళ్లను మార్చి ఆధునికంగా కట్టించాలనుకోలేదు. వాటిని యథాతథంగా ఉంచేందుకే డబ్బును వెచ్చించడం వారి ప్రత్యేకత.

అలాగే భూగర్భజలాల పరిరక్షణ, తద్వారా ఉష్ణతాపం తగ్గుతుందన్న కారణంతోనే వూళ్లొ ఇంతకాలం తారు, సిమెంటు రోడ్లు వేసుకోలేదు(ఈమధ్యే కనీస సౌకర్యాల కల్పన పేరుతో ప్రభుత్వం గ్రామంలోని ప్రధాన రహదారుల్లో సిమెంటు రోడ్లు వేయడం ప్రారంభించింది). తాగడానికి పంచాయితీ నీటిని వాడుకున్నా ఇతర అవసరాలకు నేటికీ నాటి గిలక బావులనే వాడతారు. ప్రతిఇంటిలో ఈశాన్యం దిక్కున ఉన్న బావి దగ్గర ఇంకుడు గుంతను తవ్వారు. వాడిన నీరు మొక్కలకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను కొట్టకూడదన్న నియమం పెట్టుకున్నారు.

గ్రామంలో దేవాలయాలకూ లోటు లేదు. వాటిల్లో నిత్యం ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దత్త, పుష్పగిరి, శృంగేరి, కంచి, హరిహర, విరూపాక్ష పీఠాలకు చెందిన ఆయా తరాల పీఠాధిపతులూ ఈ గ్రామంలోని దేవాలయాలను సందర్శించారు. ఈ వూరి విశిష్టతను గుర్తించిన ఎన్టీ రామారావు కూడా అనేకసార్లు ఆ ఆలయాలను సందర్శించారు. ఆ విషయం డైరీలో రాసుకోవడంతో అది చదివిన బాలకృష్ణ కూడా ఆ గ్రామానికి రెండుసార్లు వెళ్లారట.

‘అందుకే కౌశిక గోదావరీ పాయ తీరాన ఉన్న మా వూరంటే మాకెంతో ఇష్టం. ఈ వూళ్లొ జన్మించడం పూర్వ జన్మ సుకృతం. ఇక్కడ మరణిస్తే, తదుపరి కార్యక్రమాలకోసం కాశీ కెళ్లాల్సిన అవసరం కూడా లేద’ని స్థానికులైన పేరి విశ్వనాథశర్మ ఎంతో గర్వంగా చెబుతారు.

సమాజంలో ఆధునిక పోకడలు ఎన్ని వచ్చినా వారసత్వంగా వస్తోన్న ఇళ్లని కాపాడుకుంటూ తరాలనాటి తమ సంస్కృతిని కొనసాగిస్తోన్న పేరూరు... చెప్పుకోదగ్గ వూరే కదూ!

- విజయ్‌, న్యూస్‌టుడే, అమలాపురం