Saturday, 10 June 2017

కురుక్షేత్రం - భరతజాతికి ధర్మక్షేత్రం

కురుక్షేత్రం అనే పేరు వినగానే మహాభారత యుద్ధం కనులముందు కదలాడుతుంది. భీష్మద్రోణ కృపాచార్యులూ, కురు పాండవులూ సల్పిన ఘోరయుద్ధ దృశ్యాలు బొమ్మకడతాయి.
అటువంటిది మనం నేరుగా కురుక్షేత్రానికి వెళ్లి, అలనాడు అక్కడ జరిగిన యుద్ధం తాలూకు ఆనవాళ్లను చూస్తే?
శ్రీ కృష్ణుడి పాదధూళితో పవిత్రమైన ఆ నేలపై నడయాడుతూ, ఆ కట్టడాలను చూస్తూ ఒళ్లు గగుర్పొడిచే ఆ సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకున్న తర్వాత దగ్గరలోనే గల బ్రహ్మసరోవరంలో స్నానం చేసి వస్తే?
ఓహ్‌! ఊహించడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదా!
ఆ అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవాలంటే మనం హరియాణా రాష్ట్రానికి వెళ్ల వలసిందే!

స్థలపురాణం:
కురుక్షేత్రానికే ధర్మక్షేత్రమని పేరు. కేవలం ఇక్కడ మహాభారత యుద్ధం జరగడం వల్లే ఈ ప్రదేశం ప్రసిద్ధ పర్యాటక స్థలమో, పుణ్యస్థలమో కాలేదు. వామన పురాణం ప్రకారం కురువంశానికి మూలపురుషుడైన కురు అనే రాజు సరస్వతీ నది ఒడ్డున గల సుందర, ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని అష్టాంగమార్గాల ద్వారా భగవంతుని మెప్పించాడు. ఆ రాజు తపస్సుకు, భక్తి శ్రద్ధలకు మెచ్చిన భగవంతుడు అతనికి రెండువరాలనిచ్చాడు. అవేమంటే... అతని పేరుమీదుగా ఆ స్థలానికి కురుక్షేత్రం అనే పేరు వస్తుందని, పరమ పవిత్రమైన ఆ ప్రదేశంలో మరణించిన వారికి స్వర్గార్హత లభిస్తుందనీ... అందుకే ఈ ప్రదేశానికి కురుక్షేత్రమనే పేరు వచ్చింది.

తెల్లవారి పాలనలో ఇదంతా మరుగున పడిపోయింది. స్వాతంత్య్రం సంపాదించిన తర్వాత పురావస్తు శాఖ వారు చేసిన పరిశోధనలలో ఈ విషయాలన్నీ బయట పడ్డాయి. అందుకే కురుక్షేత్రమనే పేరును తిరిగి పెట్టారు. యుద్ధారంభానికి ముందే గురువులు, సహాధ్యాయులు, మిత్రులు, బంధువులు, రక్తసంబంధీకులను చూసిన అర్జునుడు వీరిని చంపడానికా నేను యుద్ధం చేయడం... అని నిర్వేదం చెందడంతో శ్రీకృష్ణుడు యుద్ధం ఎందుకు చేయాలో, యుద్ధాన్ని ఎలా చూడాలో వివరిస్తూ చేసిన బోధే భగవద్గీత. ఆ బోధ ఇక్కడే జరిగింది. కొన్ని తరాలకు.. కాదు కాదు.. కొన్ని యుగాలపాటు మానవ వికాసానికి తరగని నిధిని అందించింది. అందుకోసమైనా కురుక్షేత్రాన్ని సందర్శించి తీరాలి. తరతరాలుగా ప్రాచీన చారిత్రక, పౌరాణిక, హిందూ సాంస్కృతిక వైభవాలను కలిగి ఉన్న యాత్ర కురుక్షేత్రం.

ప్రతి ఒక్క భారతీయుడూ తన జీవితకాలంలో తప్పక సందర్శించలసిన తీర్థస్థలి. గంగాసరస్వతీ నదులు పునీతం చేసిన నేల ఇది. 360 పుణ్యక్షేత్రాలున్న పరమ పవిత్రమైన మహాభారత సంగ్రామ స్థలి ఇది. యుద్ధమంటే మామూలు యుద్ధమా అది... పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం తాలూకు రక్తంతో తడిసిన రుధిర భూమి. 1947కు ముందు ఈ ప్రాంతాన్ని స్థానేశ్వరం అని పిలిచేవారు. ఇక్కడ కొలువైన స్థానేశ్వరుడనే మహాశివుడి ఆలయం పేరుమీదుగా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఆ తర్వాత మాత్రమే భారతప్రభుత్వం దీనికి కురుక్షేత్రం అనే పేరును నిర్ణయించింది. కురుక్షేత్రంలోనే అమిన్‌ అనే ప్రాంతం ఉంది. ఇక్కడే అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించినట్లు చెబుతారు.

కురుక్షేత్రంలోని దర్శనీయ స్థలాల్లో ముఖ్యమైనది బ్రహ్మసరోవరం. ఈ సరస్సులో స్నానం చేస్తే సమస్తపాపాలు పోతాయని పురాణోక్తి. ఇక్కడ కుంభమేళా సమయంలోనూ , గ్రహణ సమయాల్లోనూ యాత్రీకుల రద్ధీ అధికంగా కనిపిస్తుంది. స్థానిక ‘ సన్నిహిత, వనగంగ’ సరస్సులను కూడా అక్కడి ప్రజలు పరమ పవిత్రంగా భావిస్తారు. ఇక్కడి ‘.జ్యోతిసార’ అనే ప్రదేశంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్టు చెబుతారు. ఇక్కడ ఉండే ఒక పెద్ద మర్రిచెట్టు పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టిని ఇక్కడినుంచే ఆరంభించాడని ప్రతీతి. అందుకే ఇక్కడికి చేరువలోని సరోవరానికి బ్రహ్మసరోవరమని పేరు.

ఎలా వెళ్లాలంటే...?
ఢిల్లీ నుంచి సుమారు 160 కిలోమీటర్లు, చండీగఢ్‌ నుంచి 80 కిలోమీటర్లు ఉన్న ఈ యాత్రాస్థలికి అన్ని రకాల వాహన సౌకర్యాలూ ఉన్నాయి. ఢిల్లీ సెంట్రల్‌ బస్‌ టర్మినల్‌ నుంచి చండీగఢ్‌కు వెళ్లే బస్సుల్లో మనం ఇక్కడికి చేరుకోవచ్చు.

– DVR. భాస్కర్‌

No comments:

Post a Comment