Tuesday, 25 July 2017

శ్రీముఖలింగం


శ్రీముఖలింగం అష్టదిక్కులు... అష్టతీర్థాలు 

శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగానికి కాశీక్షేత్రంతో సమానమైన ఖ్యాతి ఉంది. అందుకే దక్షిణకాశి అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో ఉన్న అష్టతీర్థాలను అశ్విని దేవతలు ఏర్పాటు చేసినట్లు స్థలపురాణం చెబుతోంది. మాయాజూదంలో రాజ్యాన్ని కోల్పోయిన పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో ఈ తీర్థాల్లో పుణ్యస్నానాలు చేసి ఇక్కడ కొలువైన మధుకేశ్వరుడు, వారాహి అమ్మవారు, జంబుకేశ్వరుడు, ముక్తేశ్వరస్వామి, మహావిష్ణువు, ఆదిత్యుడు, సోమేశ్వరుడు తదితర దేవతలను దర్శించుకోవడంతోపాటు పితృశ్రాద్ధాలు, తిలతర్పణాది కార్యక్రమాలు చేసినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. ప్రధానంగా పాండవ ప్రథముడు ధర్మరాజు జూదంలో రాజ్యం పోగొట్టుకున్నప్పుడు భీముడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అదే భీమేశ్వరాలయం. శ్రీ ముఖలింగ క్షేత్రానికి ఈ నెల 31 నుంచి ఆగష్టు 31 వరకూ అష్టతీర్థ రాజమహాయోగం సందర్భంగా ప్రత్యేక వ్యాసకుసుమం...

సాధారణంగా పుణ్యనదులైన గంగ, కృష్ణ, గోదావరి, పెన్న, కావేరి నదులకు గురుగ్రహం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కుంభం తదితర రాశుల్లో ప్రవేశిస్తే నదులకు 12 సంవత్సరాలకు పుష్కరాలు వస్తాయి. అప్పుడు భక్తులు పుణ్యస్నానాలు చేసి పితృదేవతలకు పిండప్రదానాలు నిర్వహిస్తారు. కాని శ్రీముఖలింగంలో జరగనున్న అష్టతీర్థాలకు అష్టమి, స్వాతి నక్షత్రంతో కూడిన పౌర్ణమి, సోమవారం, శ్రవణం నక్షత్రంతో ఒకే విధంగా ఉండాలి. ఇలా అరుదుగా సంభవిస్తాయి. ఇలా గతంలో 1946, 2000 సంవత్సరాల్లో వచ్చినట్లు ఆలయ చరిత్రను బట్టి తెలుస్తోంది. దక్షిణాయనం, శ్రావణమాసం శుక్లపక్షం అష్టమి ఘడియల్లో సోమవారం స్వాతి నక్షత్రంతో కూడిన శ్రవణ నక్షత్రంనాడు ఈ తీర్థాల్లో రాజమహాయోగం పుణ్యక్రతువులు ప్రారంభిస్తారు. ఎనిమిది రోజులు అనంతరం సోమవారం పౌర్ణమి గ్రహణం అనంతరం పుణ్యస్నానాలతో ఈ మహాక్రతువును ముగిస్తారు.

తీర్ధాల విశిష్టత.. పుణ్యస్నానాల ఫలితం
అష్టతీర్థాలు.. అష్టదిక్కులు.. కొలువైన దేవతలు శ్రీముఖలింగంలో జరగనున్న రాజమహాయోగానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ పుణ్యతీర్థాలలో స్నానాలు చేసి ఆయా దేవతలను దర్శించుకోవడంతోపాటు ప్రధాన దేవాలయంలో ముఖలింగేశ్వరుని దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదు. దీర్ఘరోగాలు పటాపంచలైపోతాయి. కోరిన కోర్కెలు తీరి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. మాన సిక రోగాలు, పిచ్చి, రుణబాధలు తొలగి అషై్టశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రధానంగా పితృదేవతలకు పిండ ప్రదానాలు, దానధర్మాలు చేయడం, తిల తర్పణ కార్యక్రమాలు నిర్వహించడం సంప్రదాయం.

మొదటి రోజు (సోమవారం): 

బిందు తీర్థం ఈశ్యాన దిక్కున ఉంది. పాండవులు వనవాసం సమయంలో ఇదే గిరిపై నివాసం ఉన్నట్లు స్థలపురాణం చెబుతోంది. ఇందులో పుణ్యస్నానం అనంతరం అనంతగిరి (పద్మనాభకొండ)పై ఉన్న శ్రీముఖలింగేశ్వరుని క్షేత్రపాలకుడు మహావిష్ణువుని దర్శించుకోవాలి.

రెండవ రోజు (మంగళవారం): 

గయా తీర్థం పద్మనాభ గిరి కింద తూర్పుదిక్కున ఉంది. ఇక్కడ స్నానానంతరం విష్ణుపాదాలు, శంఖు, చక్రాలను దర్శించుకోవాలి. వీటితోపాటు సమీపంలో ఉన్న శివలింగ దర్శనం చేయాలి. ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు. అలాగే దానధర్మాలు చేయడం వల్ల మోక్షం కలుగుతుందంటారు.

మూడవ రోజు (బుధవారం): 

హంసతీర్థం పశ్చిమ దిక్కున ఉంది. స్నానానంతరం ప్రధాన ఆలయం ఆది విరాట్టు వారాహి సహిత శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకోవాలి.

నాలుగవ రోజు (గురువారం): 

పిశాచవిమోచన తీర్థం దక్షిణం దిక్కున ఉంది. స్నానం చేసి నగిరికటకాం గ్రామ సమీపంలో ఉన్న ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవాలి. సాయంత్రం కనుల పండువగా వారాహి సహిత శ్రీముఖలింగేశ్వరునికి గజవాహనంపై తిరువీధి ఉత్సవం జరుగుతుంది.

ఐదవరోజు (శుక్రవారం): 

పక్షి మోచన తీర్థం ఆగ్నేయ దిక్కున ఉంది. ఇందులో కుటుంబ సమేతంగా స్నానాలు చేసి దానధర్మాలు ఆచరించాలి. భీమేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. జూదంలో ఓడిపోయి రాజ్యం పోగొట్టుకున్న పాండవులు అరణ్య వాసం చేసే సమయంలో ఈ క్షేత్రంలో ఉండగా భీముడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది.

ఆరవ రోజు (శనివారం): 

జంబూతీర్థం ఉత్తర దిక్కున ఉంది. ఈ రోజున ఈ తీర్థంలో స్నానం చేసిన అనంతరం జంబుకేశ్వరుని దర్శనం చేసుకోవాలి.

ఏడవ రోజు (ఆదివారం): 

సూర్యతీర్థం వాయవ్య దిక్కులో ఉంది. స్నానం ఆచరించి ఆదిత్యేశ్వరస్వామిని దర్శించుకోవాలి. ఈ తీర్థం రోగ హరమైనది అని భక్తుల విశ్వాసం.

ఎనిమిదవ రోజు (సోమతీర్థం): 

నైరుతి దిక్కున ఉంది. చివరిరోజు సోమవారం పౌర్ణమి సందర్భంగా ఈ తీర్థంలో స్నానం చేసి సోమేశ్వర స్వామి దర్శనం, అనంతరం దానధర్మాలు చేయాలి. ఈ తీర్థంలో అష్టదిక్పాలకులలో ఒకరైన చంద్రుడు స్నానమాడి శాపవిమోచనం పొందాడు. అనంతరం సోమేశ్వర స్వామి లింగ ప్రతిష్ట చేసినట్లు శ్రీముఖలింగేశ్వర క్షేత్ర మహాత్మ్యంలో ఉంది.

జన్మ ధన్యం!
అష్టతీర్థ రాజమహాయోగం ఇక్కడ ప్రధాన పుణ్యక్రతువు. ఈ తీర్థాల్లో స్నానాలు చేస్తే మోక్షంతోపాటు పుణ్యం సిద్ధిస్తుంది. పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారు పుణ్యలోకాలకు వెళతారు. దానధర్మాలు, తిలతర్పణ కార్యక్రమాలు చేయడం ద్వారా మానవ జన్మ ధన్యమైనట్లే అంటారు. ఎనిమిది రోజులు పాటు అష్టతీర్థాల్లో స్నానం చేసి ఆ తీర్థాల్లో కొలువైన దేవతలతోపాటు వారాహి సహిత ముఖలింగేశ్వరుని దర్శనం తప్పని సరిగా చేసుకోవాలని ఆలయ ప్రధానార్చకులు టి. శ్రీకృష్ణ చెబుతున్నారు.

ఇదీ రూట్‌...
హైదరాబాద్‌ లేదా విజయవాడ నుంచి విమానంలో విశాఖపట్నం వరకూ రావచ్చు. అక్కడ నుంచి నేరుగా కారు/ బస్సు/రైలులో శ్రీకాకుళం రోడ్‌ (స్టేషన్‌)కు వస్తే, అక్కడ నుంచి శ్రీముఖలింగంకు 40 కిలోమీటర్లు ప్రయాణం. రైలులో వచ్చే వారు శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లో దిగితే అక్కడ నుంచి శ్రీముఖలింగం చేరుకునేందుకు ట్యాక్సీ లేదా బస్సులున్నాయి.

– సుంకరి శాంతభాస్కర్‌ సాక్షి, జలుమూరు, శ్రీకాకుళం జిల్లా

జైనథ్‌ లక్ష్మీసూర్యనారాయణా...

ప్రాచీన శిల్పకళకు సజీవ దర్పణంలా నిలుస్తోంది జైనథ్‌ లక్ష్మీనారాయణ ఆలయం. 11, 13 శతాబ్దకాలంలో మహారాష్ట్రలోని వెమత్మాలపంత్‌ రాతితో ఈ ఆలయం నిర్మించబడింది. జైనథ్‌ పరిసరాల చుట్టూ ఈ ఆలయానికి వాడిన శిలలు ఎక్కడా లభించవు. ఈ శిలను మహారాష్ట్ర నుంచి తెప్పించారు. ఉన్నత శిఖరం కలిగి అడుగడుగునా శిల్పకళతో శోభితమైంది. 60 గజాల ఎత్తు, 40 గజాల వైశాల్యంలో, అష్టకోణాకార మండపం పైనున్న గర్భగుడిలో సూర్యనారాయణస్వామి వారు తన అపార కరుణకిరణాలను భక్తులపై ప్రసరింప చేస్తుంటారు. మూలవిరాట్లు లక్ష్మీనారాయణ స్వామి విగ్రహానికి దక్షిణదిశలో లక్ష్మీదేవి, ఆళ్వారులు, అన్యదేవతామూర్తులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కార్తికశుద్ధ ఏకాదశి నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి.

ద్వాదశి రోజు స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. దీన్ని వీక్షించుటకు జిల్లావాసులేకాక మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తుంటారు. మండపం అంతర్భాగంలో స్తంభాలపై హనుమంతుడు, రంభాది అప్సరసల శిల్పాలు, ఆలయం ముందు భాగాన గరుడ స్తంభం ఉంది. ఆలయానికి ఇరువైపులా శృంగార భంగిమలతో కూడిన శిల్పఖండాలు దర్శనమిస్తాయి. ఆలయం ముందున్న కోనేరు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో డోలాహరణ మండపం నిర్మించారు. కాలక్రమేణా అది శిథిలమైంది.

రవికిరణాలు తాకే పాదాలు...
ప్రతి ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ మాసాల్లో, దసరా అనంతరం ఆశ్వయుజ పౌర్ణమి నాడు ఉదయం లేలేత సూర్యకిరణాలు లక్ష్మీనారాయణ స్వామి పాదాలను తాకుతాయి. అందుకే ఈ ఆలయాన్ని సూర్యదేవాలయంగా కూడా పిలుస్తారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించటానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

కోరికలు తీర్చే నారాయణుడు...
సంతానం లేనివారు స్వామిని మనసులో ధ్యానిస్తూ ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధద్వాదశి రోజున కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారి ప్రసాదం (గరుడముద్ద) స్వీకరిస్తే సంతానం ప్రాప్తిస్తుందని నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన కార్తీక బహుళ పంచమి నాడు రాత్రి నిర్వహించే నాగవెల్లి పూజసమయంలో భక్తితో స్వామివారిని తలచుకుని, పూలదండలను ధరిస్తే తప్పనిసరిగా సంతానం కలుగుతుందని విశ్వాసం. కార్తీకమాసంలో పౌర్ణమినాటి నుంచి వరుసగా ఐదు పున్నములకు శ్రీవారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తే సుఖసంతోషాలతో వర్థిల్లుతారని భక్తుల నమ్మకం. సంతాన సాఫల్యత, కోరిన కోర్కెలు తీర్చే దేవుడని నమ్మకం.

జైనమత కేంద్రం...
శాతవాహనుల కాలం నాటి జైనథ్‌ జైనమత కేంద్రంగా వర్ధి్దల్లింది. శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం అంతరాల మండపాన పగిలిపోయిన శిలాఫలకంపై దేవనాగరి లిపిలో చెక్కబడిన శాసనం సూర్యాయనమఃతో ప్రారంభమవుతుంది. ఈ శాసనం సూర్యభగవానుణ్ణి స్తుతిస్తూ శ్లోకంతో కూడి ఉంది.

ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌లో ఉన్న ఈ ఆలయం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి 21 కిలో మీటర్ల దూరంలో, హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్‌ మీదుగా 315 కి.మీల దూరంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలంటే రోడ్డుమార్గమే తప్ప రైలు మార్గం లేదు. ఆదిలాబాద్‌ నుంచి జైనథ్‌కు నేరుగా బస్సులున్నాయి. బేల, చంద్రపూర్‌ వెళ్లే బస్సులు జైనథ్‌ మీదుగా వెళ్తాయి.

– రొడ్డ దేవిదాస్‌ సాక్షి, ఆదిలాబాద్‌

శ్రీ శేషశయన శ్రీ రామాంజనేయస్వామి

దేశంలోనే అపురూపం శేషశయన రాముడు

ఎక్కడైనా శ్రీరాముడు సీతాలక్ష్మణ హనుమత్సమేతుడై దర్శనమిస్తాడు. అయితే ఆదిశేషువుపై శ్రీరాముడు శయనించిన స్థితిలో ఉన్న విగ్రహాన్ని, విశేషాన్ని చూడాలంటే మాత్రం ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణం కోటకట్ల వారి వీధిలోని శ్రీ శేషశయన శ్రీ రామాంజనేయస్వామి వారి ఆలయానికి రావాల్సిందే. శ్రీరాముడు ఆదిశేషువుపై శయనించినట్లుగా ఉన్న ఆలయం దేశంలో ఇదే ప్రథమమని భక్తులు పేర్కొంటున్నారు.

తాటికొండ రామయోగికి 1972లో ఆంజనేయస్వామివారి దర్శన భాగ్యం లభించింది. అనంతరం ఆంజనేయస్వామిని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. ఆలయంలోని ఆంజనేయస్వామి సింగరకొండ ఆంజనేయస్వామి ప్రతిరూపమేనని పలువురి విశ్వాసం. భూతప్రేతపిశాచ గ్రహ బాధలతో బాధపడేవారు ఈ ఆలయంలో 40 రోజులపాటు ప్రదక్షిణలు చేస్తే వారికి స్వస్థత చేకూరుతుందని నిర్వాహకులు చెప్తారు. వారు చెప్పడమే గాక పలువురు భక్తుల ప్రత్యక్ష అనుభవం కూడా. ఆలయంలో గత మూడు దశాబ్దాల నుండి భక్తులు నిత్యం శ్రీరామ నామ జపపారాయణ నిర్వహిస్తున్నారు.

అక్కడ పద్మనాభుడు ఇక్కడ శ్రీరాముడు
ఆంజనేయస్వామి శ్రీరాముని భక్తుడు కావడంతో 1998 ఫిబ్రవరి 6న శేష శయన శ్రీరాముని విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. శ్రీరాముని పాదాల వద్ద ఆంజనేయస్వామి ముకుళిత హస్తాలతో కూర్చుని ఉన్నట్లుగా విగ్రహాన్ని సుందరంగా మలిచారు. కేరళలోని అనంత పద్మనాభస్వామి వారిని స్ఫురింపచేసేలా శ్రీరాముడు శేషశయనుడిగా దర్శనమిస్తాడు.

భక్తులపాలిట సంజీవని
ఎక్కడా నయంకాని మానసిక రుగ్మతలతో బాధపడే వారితోపాటు గ్రహ బాధలతో కుంగిపోయేవారికి ఈ ఆలయం సంజీవని వంటిది అంటారు. రోజూ ఎంతోమంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. శనివారం గ్రహపీడితులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. సాయంత్రం మూడుగంటల పాటు జరిగే భజన సంకీర్తన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడవలసినదే.

21 దేవతామూర్తులు..
ఆలయ ఆవరణలో 21 దేవతామూర్తులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ఆంజనేయస్వామి భజన చేస్తున్న విగ్రహాన్ని సుందరంగా మలిచారు. దుర్గాదేవి, నృసింహస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వేంకటేశ్వరస్వామి, సత్యనారాయణస్వామి, వినాయకుడు, అష్టలక్ష్ములతోపాటు పలు దేవతామూర్తులకు నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం సాయంత్రం ఆంజనేయస్వామి సన్నిధిలో భజన సంకీర్తనల ఆలాపన జరుగుతుంది. ప్రముఖ గాయకులు తాటికొండ బాలయోగి ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.

చూడదగిన ప్రదేశాలు
చీమకుర్తి వచ్చిన భక్తులు శేషశయన రామాలయంతోపాటు హరిహర క్షేత్రం, సాక్షి రామలింగేశ్వర స్వామి ఆలయం, గుంటిగంగ గంగమ్మ ఆలయం, అగ్రహారం వేంకటేశ్వరస్వామి ఆలయం, గోనుగుంట శివాలయం, రామతీర్థం మోక్ష రామలింగేశ్వరస్వామి ఆలయం, రామతీర్థం జలాశయం, చీమకుర్తి గ్రానైట్‌ క్వారీలను కూడా చూడవచ్చు.

ఆలయానికి చేరుకునే మార్గం
చీమకుర్తి... ఒంగోలు పట్టణానికి 21 కి.మీ.ల దూరంలో ఒంగోలు–మార్కాపురం ప్రధాన రోడ్డుమార్గంలో ఉంది. బస్సులు, ఆటోలలో, ప్రైవేట్‌ వాహనాలలో సులభంగా చేరుకోవచ్చు.

– M.V.S‌. Sastri సాక్షి, ఒంగోలు

Sunday, 16 July 2017

పుష్కర్‌ పుణ్యక్షేత్రం

పుష్కర్‌ పుణ్యక్షేత్రం
బ్రహ్మాండమైన ఆలయం


సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఆలయాలు లేవెందుకు? త్రిమూర్తుల్లోకెల్లా చిన్నవాడయిన బ్రహ్మ ఎప్పుడూ వృద్ధుడుగానే ఉంటాడెందుకు? ఈ సందేహాలకు సమాధానమిస్తుంది పుష్కర్‌ పుణ్యక్షేత్రం, ఆ క్షేత్ర స్థలపురాణం. రాజస్థాన్‌ రాష్ట్రంలో అజ్మీర్‌కు 11 కి.మీ దూరంలో సముద్రమట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న సరస్సు పుష్కర్‌. క్రమంగా ఆ ప్రాంతం ఈ సరస్సు పేరుతో ప్రసిద్ధి చెందింది.

ఈ సరస్సు చెంతనే ఉంది సృష్టికర్త బ్రహ్మ ఆలయం. ప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక ఆలయం ఇది. మన దేశంలోని అతి ముఖ్యమైన తీర్థాల్లో ఒకటైన  పుష్కర్‌ను దర్శించుకోకుంటే పుణ్యక్షేత్ర సందర్శన పూర్తి కానట్టేనని పెద్దలంటారు. అందుకే దీన్ని తీర్థరాజ్‌ అంటారు. పౌరాణికంగా ఎంతో ప్రాశస్త్యం చెందిన మహాభారత, రామాయణాల్లోనూ ఆదితీర్థంగా ప్రస్తావించబడింది ఈ తీర్థం. కార్తీక పౌర్ణమి రోజున ఇందులో ఓసారి మునిగితే వందల సంవత్సరాల పాటు యజ్ఞం చేసిన ఫలితం దక్కుతుందట.

స్థలపురాణం
పద్మపురాణం ప్రకారం పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామరపూవునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజుని సంహరించాడు బ్రహ్మదేవుడు. ఆ సమయంలో ఆ తామరపూపు నుంచి రేకులు మూడు చోట్ల రాలి, మూడు సరస్సులు ఏర్పడ్డాయి. వాటిని జ్యేష్ట పుష్కర్, మధ్యపుష్కర్, కనిష్టపుష్కర్‌ అని పిలుస్తున్నారు. పైగా సృష్టికర్త తాను భూలోకంలో అడుగినప్పుడు తన చేతి (కరం) నుంచి పుష్పం రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ  ప్రాంతానికి పుష్కర్‌ అని పేరు పెట్టినట్లు మరో కథనం కూడా వినిపిస్తుంది.

సరస్వతీదేవి శాపం.. ఏకైక ఆలయం
వజ్రనాభ సంహారం అనంతరం లోకకల్యాణం కోసం ఇక్కడ యజ్ఞం చేయాలని సంకల్పించాడట సృష్టికర్త. సుముహూర్తం ఆసన్నమవుతుండటంతో సరస్వతీదేవిని తీసుకుని రమ్మని తన కుమారుడైన నారదుడిని పంపిస్తాడు బ్రహ్మ. కానీ నారదుడి కలహప్రియత్వం కారణంగా బయలుదేరేందుకు తాత్సారం చేస్తుంది సావిత్రీ దేవి. (ఈమెనే సరస్వతీ దేవి అని కూడా పిలుస్తారు) ఇవతల ముహూర్తం మించిపోతుండటంతో, అనుకున్న సమయానికే యజ్ఞం పూర్తి కావాలన్న తలంపుతో ఇంద్రుడి సహకారంతో గాయత్రిని పెళ్లాడి నిర్ణీత సమయానికి యజ్ఞాన్ని ప్రారంభించారు.

యజ్ఞం సమాప్తం అవుతుండగా అక్కడికి చేరుకున్న సరస్వతీదేవి బ్రహ్మ దేవుడి పక్కన మరో స్త్రీని చూసి ఉగ్రరూపం దాలుస్తుంది. బ్రహ్మదేవుడితో సహా అక్కడున్న దేవతలందరినీ శపిస్తుంది. భర్తను వృద్ధుడై పొమ్మని, ఆయనకు ఒక్క పుష్కర్‌లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవనీ శపిస్తుంది. అనంతరం బ్రహ్మదేవుడి అభ్యర్థనను మన్నించి శాప తీవ్రతను తగ్గిస్తుందట. బ్రహ్మదేవాలయం పుష్కర్‌లో మాత్రమే ఉండటానికి కారణం ఇదేనట. పుష్కర్‌లో సావిత్రీమాత ఆలయంతో పాటు ఓ చిన్న నీటి ప్రవాహం ఉంది. దీన్ని సావిత్రీనది అని పిలుస్తారు స్థానికులు. ఆమెను పూజించిన స్త్రీలకు నిత్య సుమంగళి వరాన్నిస్తుందన్న నమ్మకంతో పుష్కర్‌ను సందర్శించిన భక్తులంతా ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తారు.

ఇతర విశేషాలు
పుష్కర్‌లో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సుమారు 400 పురాతన ఆలయాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఆప్తేశ్వర్, రంగ్‌జీ, ఏకలింగజీ దేవాలయాలు. వీటిలో రంగ్‌జీ ఆలయం దక్షిణాది శైలిలో కట్టబడి ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి రంగ్‌జీగా పూజలందుకుంటున్నాడు. రాజస్థాన్‌లోని సుప్రసిద్ధ శివక్షేత్రం ఏకలింగజీ దేవాలయం. ఇక్కడ శివలింగం కేవలం లింగాకారంగా కాక నలుపక్కలా నాలుగు ముఖాలను కలిగి ఉండటం విశేషం. ఇవి కాక గోవిందాజీ ఆలయం, నక్షత్రశాల, హవామహల్, చట్రిస్, గాలోటా, ఖవాసాహిబ్‌ దర్గా, అధాన్‌ దిన్‌ కా జూన్‌ ప్రా, అనాసాగర్, జగ్‌నివాస్‌ భవనం, జగదీష్‌ ఆలయం, అహర్, నక్కి సరస్సు, జోథ్‌పూర్‌ పట్టణం, అజ్మీరు, ఉదయ్‌పూర్, అబూశిఖరం, పింక్‌సిటీగా పేరుగాంచిన జైపూర్‌లు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు.

ఎలా వెళ్లాలంటే..?
పుష్కర్‌కు వెళ్లడానికి దగ్గరలోని అజ్మీర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ఢిల్లీ, జోద్‌పూర్, జైపూర్, ఆగ్రా, ముంబాయ్‌. అహ్మదాబాద్‌ల నుంచి రైళ్లున్నాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ బెస్ట్‌. అజ్మీర్‌ నుంచి 11 కిలోమీటర్ల దూరంలోని పుష్కర్‌కు చేరుకోవాలంటే లోకల్‌ బస్సులు, ఆటోలు ఉన్నాయి. విమాన మార్గం సంగనీర్‌ ఏర్‌పోర్ట్‌. అయితే అక్కడి నుంచి పుష్కర్‌ వెళ్లాలంటే 127 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అన్ని ప్రధాన నగరాల నుంచి పుష్కర్‌కు నేరుగా బస్సు సౌకర్యం ఉంది.

– పూర్ణిమ స్వాతి


Monday, 10 July 2017

అపూర్వ అమర్‌నాథ్‌ యాత్ర ప్రయాణం

ఏటా ఆషాఢమాస శుక్ల పాఢ్యమి నుంచి శ్రావణమాస శుక్ల పౌర్ణమి వరకు ఈ అమర్‌నాథ్‌ యాత్ర కొనసాగుతుంది. జమ్మూకశ్మీర్‌లోని మంచుకొండల్లో కొలువై ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడం కొత్త అనుభూతి జూన్‌ 29 నుంచి ప్రారంభమవుతుంది. నగరం నుంచి పెద్ద ఎత్తున ఈ యాత్రకు భక్తులు వెళుతుంటారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమరనాథ్‌ యాత్రకు తరలివెళ్తుంటారు. 40 రోజుల పాటు సాగే ఈయాత్రలో మంచుకొండలు, శివనామస్మరణతో మార్మోగుతాయి. అయితే జమ్మూకాశ్మీర్‌లోని అమర్‌నాథ్‌కు అలా వెళ్లడానికి మూడు నెలల ముందే పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. వాతావరణం అనుకూలంగా ఉంటేనే యాత్ర సాగుతుంది. యాత్రకు వెళ్లేవారు ఆరోగ్యధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి. అమర్‌నాథ్‌ షరైన్‌బోర్డు అనేక రకాల నిబంధనలతో యాత్రకు అనుమతిస్తుంది. 13 ఏళ్లలోపు పిల్లలు 75 ఏళ్లు దాటిన మహిళలను, గర్భిణిలను యాత్రకు అనుమతించరు. తెలుగురాష్ట్రాల వాళ్లు ఎక్కువగా అమర్‌నాథ్‌యాత్రకు వెళ్తుంటారు.

దరఖాస్తు ఇలా చేసుకోవాలి...
పాతబస్తీ Pathar Gattiలోని S.Y.J Shopping Mallలో జమ్మూకాశ్మీర్‌ బ్యాంకు, సికింద్రాబాద్‌ రాష్ట్రపతిరోడ్‌లో, హిమయతనగర్‌లోని Old MLA క్వార్టర్స్‌ సమీపంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుల్లో యాత్రకు దరఖాస్తు ఫారాలను ఉచితంగా పొందవచ్చు. మే 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. www.shriamarnathjishrine.com వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులను download చేసుకోవచ్చు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తును పూరించి ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి. దరఖాస్తుకు 4 పాస్‌పోర్టుసైజు ఫొటోలను జతచేసి బ్యాంకులలో ఇవ్వవచ్చు. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత బ్యాంకు అధికారులు కార్డును జారీ చేస్తారు. ఏ తేదీలలో యాత్రకు వెళ్లేది కార్డులలో పొందుపరుస్తారు.

రైళ్లలో వెళ్తే తక్కువ ఖర్చు..
అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లేవారు రైళ్లలో వెళ్తే తక్కువ ఖర్చవుతుంది. కొన్ని ట్రావెల్స్‌ సంస్థలు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాయి. నగరం నుంచి ఢిల్లీ వరకు ఒక రైలులో అక్కడి నుంచి జమ్మూతావీ, ఖత్రా వరకు మరో రైలులో వెళ్లవచ్చు. నగరం నుంచి ఢిల్లీకి స్లీపర్‌క్లాస్‌లో రూ.665ల చార్జీ, ఢిల్లీ నుంచి జమ్మూతావీ, ఖత్రా వరకు స్లీపర్‌క్లాస్‌ చార్జి రూ.360లు. జమ్మూ నుంచి హైదరాబాద్‌కు రాను పోను రూ.2వేలు ఖర్చు అవుతాయి. బ్రేక్‌ జర్నీ టికెట్‌ తీసుకుంటే ఈ ఖర్చు తగ్గుతుంది. జమ్మూతావీ రైల్వేస్టేషన్‌లో RTC బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. Baltal(బల్టాల్‌), Pahalgam(పహల్‌గావ్‌) నుంచి అమర్‌నాథ్‌గుహ వరకు రెండు వైపులా ప్రయాణానికి గుర్రాలకు రూ.3 నుంచి రూ.8వేల వరకు వసూలు చేస్తారు. బేరం ఆడితే రేట్లు తగ్గిస్తారు. ఎక్కువ లగేజీ ఉంటే అదేస్థాయిలో కిరాయి వసూలు చేస్తారు.

హిమాలయాల్లో తెలుగు భోజనాలు...
అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే తెలుగు వారికి కొన్ని సంస్థలు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నాయి. జూన్‌ 29నుంచి ఆగస్టు 7 వరకు Baltal, Panjtarni(పంచతరణి)లో ఉచిత భోజన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సిద్దిపేట జిల్లాకు చెందిన అమర్‌నాథ్‌ అన్నదాన సేవాసమితి గౌరవాధ్యక్షుడు బండ అంజయ్య తెలిపారు. 40 రోజుల పాటూ ఈ అన్నదాన సత్రం కొనసాగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 5గంటల నుంచి 11 గంటల వరకు నాలుగురకాల టిఫిన్స్‌ , మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు రాత్రి 7 గంటల నుంచి 10.30 గంటల వరకు ఉచిత భోజనం అందజేస్తారు. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తులు మరిన్ని వివరాలకోసం సెల్‌నెం.9440088511, 9848488511లలో సంప్రదించవచ్చు.

బృందాలుగా వెళ్లడం ఉత్తమం...
అమర్‌నాథ్‌ యాత్రకు బృందాలుగా వెళ్తే మంచిది. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.150లు చెల్లించాల్సి ఉంటుంది. బృందాలుగా వెళ్లేవారికి పోస్టల్‌చార్జీలు అదనంగా వసూలు చేస్తారు. 1నుంచి 5మందికి పోస్టల్‌ చార్జీకింద రూ.50లు, 6 నుంచి 10మందికి రూ.100లు, 11మందినుంచి 15మందికి రూ.150లు, 16మంది నుంచి 20మందికి రూ.200లు, 21మందినుంచి 25మందికి రూ.250లు, 26నుంచి 30మందికి రూ.300లు వసూలు చేస్తారు.

హెలికాప్టర్‌ల ద్వారా గుహకు చేరుకోవచ్చు...
అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లేవారు హెలికాప్టర్‌ల ద్వారా కూడా గుహకు చేరుకోవచ్చు. Baltal - Panjtarni, Pahalgam - Panjtarniల మధ్య ఏవీయేషన్‌ సంస్థలు హెలికాప్టర్‌లను నడుపుతున్నాయి. Baltal-Panjtarniల మధ్య ఒక్కొక్కరికి రూ.2వేలు, Pahalgam - Panjtarni వరుక రూ.4300లు చార్జీలుగా వసూలు చేస్తున్నారు. ఏప్రిల్‌ నెలలో ఆన్‌లైన్‌ ద్వారా హెలికాప్టర్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు.

ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో మెడికల్‌ సర్టిఫికెట్లు...
అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తులు ఆరోగ్య ధ్రువీకరణపత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. నగరంలోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో అమర్‌నాథ్‌యాత్రకు మెడికల్‌ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో ముగ్గురు వైద్యనిపుణులు, గాంధీ ఆస్పత్రిలో నలుగురు వైద్యనిపుణులు ఈ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. మెడికల్‌ సర్టిఫికెట్లు, ఏఏ వైద్యపరీక్షలు చేయించుకోవాలో సూచనలు ఉంటాయి. వయస్సును బట్టి పూర్తిస్థాయి రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష, చాతి ఎక్స్‌రే, గుండె సంబంధిత ECG, 2D ECHO పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

ఈ వస్తువులు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి... 

అమర్‌నాథ్‌ యాత్ర ఎముకలు కొరికే చలి వాతావరణంలో సాగుతుంది. Monkey Capలు, Sweatersలు, చేతి గ్లౌజులు, Shoes తప్పనిసరిగా తీసుకెళ్లాలి. చేతికర్ర, టార్చిలైట్లు ఉంచుకోవాలి. అమరనాథ్‌ గుహకు చేరుకునేముందు మూడు కిలోమీటర్లు మంచుమీదనే నడవాల్సి ఉంటుంది. శ్వాసకోస సమస్యలు తలెత్తుతాయి. హారతికర్పూరం తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలి. చలిబాగా ఉండడం వల్ల చెవిలో దూది పెట్టుకోవాలి. ఈ దూదిని ఇంటి వద్ద నుంచే తీసుకెళ్లడం మంచిది. డ్రైఫ్రూట్స్‌, గ్లూకోజ్‌ వెంట ఉండడం అవసరం. కడుపునొప్పి, విరోచనలు, తలనొప్పి, జ్వరం సంబంధించిన ట్యాబ్‌లెట్స్‌ను వైద్యుడి సలహాతో వెంటతీసుకెళ్లాలి. అమర్‌నాథ్‌ షరైన్‌బోర్డు గుర్రాలు, డోలి నిర్వాకులకు లైసెన్సు కార్డు ఇస్తుంది. గుర్రాలు, డోలిలో వెళ్లే యాత్రికులు అమర్‌నాథ్‌ గుహ వద్దకు వెళ్లగానే ట్యాక్సీ వారి గుర్తింపు కార్డును మన వద్ద ఉంచుకోవాలి. మంచులింగాన్ని దర్శనం చేసుకొని వచ్చేంత వరకు ట్యాక్సీ వారు మన కోసం ఎదురుచూస్తారు. దీని వల్ల మనం తీసుకువెళ్లే సామాన్లు వారు భద్రంగా ఉంచుతారు. లేకపోతే ఇబ్బందులు తప్పవు. అయితే మంచు మీద నడిచే బూట్లను జమ్మూకాశ్మీర్‌లో ప్రత్యేకంగా తయారు చేస్తారు. నగరంలోనే కాకుండా జమ్మూలోనే ఈ బూట్లను రూ.300లోపు రేట్లతో కొనుగోలు చేయవచ్చు.

జూన్‌ 29నుంచి అమర్‌నాథ్‌యాత్ర...
అమర్‌నాథ్‌ యాత్ర ఈ సంవత్సరం జూన్‌ 29నుంచి ప్రారంభమవుతుంది. ఆగష్టు 7వ తేదీ రక్షాబంధన్‌ (రాఖీపౌర్ణమి) వరకు ఈయాత్ర కొనసాగుతుంది. 40 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే తప్ప ఈ యాత్రకు అనుమతించరు. జమ్మూకాశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహకు చేరడానికి రెండుమార్గాల ద్వారా వెళ్లవచ్చు. Pahalgam నుంచి అమర్‌నాథ్‌ వరకు చేరడానికి 45 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సివుంటుంది. రెండవ మార్గం Baltal గుండా కూడా వెళ్లవచ్చు. ఇక్కడి నుంచి అమర్‌నాథ్‌ గుహ కేవలం 14కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అయితే ఈ మార్గం అత్యంత క్లిష్టతరమైనది. ఈ యాత్రకు వెళ్లే భక్తులు గుర్రాలు, డోలి లేక కాలిబాటన వెళ్లవచ్చు. Pahalgam నుంచి అమర్‌నాథ్‌ గుహకు కాలినడకన మూడు రోజులు పడుతుంది. మధ్యలో బేస్‌ క్యాంపులు ఉంటాయి. అక్కడ హాల్ట్‌ చేయవచ్చు. అదే విధంగా Baltal నుంచి కేవలం ఒక్కరోజులోనే అమర్‌నాథ్‌ గుహకు చేరుకోవచ్చు.

The Helicopter services from Pahalgam or Baltal is up to Panjtarni which is approximately 5-6 KMs from the Holy Cave Shrine of Shri Amarnath.


మహిమ లింగం


హిమవన్నగములు.. హిమానీ నదాలు.. హిమపాతము.. ఇన్నిటి మధ్య ఆధ్యాత్మిక మహిమను చాటుతూ వెలసిన హిమలింగం.. అమర్‌నాథ్‌! యుగాల కిందట దేవతామూర్తులు దర్శించుకున్న పుణ్యక్షేత్రం. ఏటా లక్షల మంది భక్తులు చూసి తరించే ప్రకృతి శిల్పం.. అమర్‌నాథ్‌! ఒకప్పుడు భక్తి పారవశ్యాల మధ్య సాగిన అమర్‌నాథ్‌ యాత్ర.. ఇప్పుడు ‘భయ’భక్తుల మధ్య సాగుతోంది. ఆ ధవళమూర్తి దర్శనానికి భద్రతా దళాల పహారా అవసరం అవుతోంది. తాజాగా ఉగ్రదాడితో కలకలం మొదలైనా.. శివయ్య దర్శనానికి మాత్రం భక్తులు వెనుకంజ వేయడం లేదు. భారమంతా ఆ లయకారుడి మీద వేసి, వ్యయ ప్రయాసలకోర్చి, యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్‌ విశిష్టత మీ కోసం.

హిమాలయ పర్వత శ్రేణుల్లో వెలిసిన అందమైన గుహ. ఆ గుహాలయంలో గుంభనంగా కనిపించే శుద్ధ స్పటిక రూపం. ఈ హిమలింగం ప్రళయ కాలంలో వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రాణాలు పోయాక ఆ కైలాసాన్ని చేరుకుంటామో లేదో! అందుకే ప్రాణాలకు తెగించి అపర కైలాసంగా అభివర్ణించే అమర్‌నాథ్‌ క్షేత్రాన్ని దర్శించుకుంటారు భక్తులు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురైనా.. వాటిని లెక్క చేయకుండా అమర్‌నాథ్‌ యాత్రకు పూనుకుంటారు.

అమర రహస్యం
అమర్‌నాథ్‌ ముక్తి క్షేత్రం. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గుహలోనే పరమేశ్వరుడు పార్వతీదేవికి సృష్టి రహస్యాన్ని తెలియజేశాడంటారు. అమ్మవారికి సృష్టి రహస్యాన్ని తెలియజేసే క్రమంలో.. ఇతరులు ఎవరూ వినరాదని తన పరివారాన్ని ఒక్కో ప్రదేశంలో విడిచిపెట్టాడట శివుడు. నందీశ్వరుడిని పహల్గాంలో, శిఖలోని నెలవంకను చందన్‌వాడీలో, శేష్‌నాగ్‌ దగ్గర తన ఆభరణమైన వాసుకిని వదిలివేశాడట. మహాగణేశ పర్వతం దగ్గర వినాయకుడిని, పంచరతన్‌ దగ్గర పంచభూతాలను వదిలిపెట్టాడట. ఒక్క పార్వతిని మాత్రమే గుహ దగ్గరికి తీసుకొచ్చాడట. పార్వతితో ఆనంద లాస్యం చేసి ఆ తర్వాత సృష్టి రహస్యాన్ని తెలియజేశాడట. ఈ రహస్యాన్ని గుహపై ఉన్న ఒక పావురాల జంట విన్నదట. అమర రహస్యాన్ని చెప్పిన ప్రదేశం కావడంతో ఈ క్షేత్రానికి అమర్‌నాథ్‌ అని పేరు వచ్చింది. అంతటి దేవ రహస్యాన్ని విన్న ఆ పావురాలు మృత్యురాహిత్యాన్ని పొందాయని అంటారు. నేటికీ అమర్‌నాథ్‌ ఆలయంలో పావురాలు కనిపించడం విశేషం. పరమశివుడి పరివారం కొలువుదీరిన అమరనాథ్‌ పరిసర ప్రాంతాలు కూడా పుణ్యక్షేత్రాలుగా పరిఢవిల్లుతున్నాయి.

మంచు శిఖరం
ఏడాది పొడుగునా మంచుతో కప్పి ఉంటుందీ క్షేత్రం. ఏటా జూలై-ఆగస్టు నెలల్లో 45 రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. గుహ అంతా మంచు పరుచుకుని ఒక వేదికగా కనిపిస్తుంది. దీనిపై ఆద్యంత రహితుడైన శివ రూపం మహిమాన్వితమై మంచు శిఖరంలా దర్శనమిస్తుంది. చంద్రుని వృద్ధి, క్షయాలను సూచిస్తూ.. ఈ లింగాకృతి పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. గరిష్ఠంగా ఆరు అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. ఏటా శ్రావణ పౌర్ణమి నాటితో అమర్‌నాథ్‌ యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీతో అమర్‌నాథుడి దర్శనానికి తెరపడనుంది.

శతాబ్దాలుగా..
అమర్‌నాథ్‌ క్షేత్ర వైభవం గురించి 11వ శతాబ్దానికి చెందిన కల్హణుడి ‘రాజతరంగిణి’ గ్రంథంలో ప్రస్తావన ఉంది. కశ్మీరదేశ రాణి సూర్యమతి అమరనాథుడికి బాణలింగం, త్రిశూలం కానుకగా సమర్పించుకుందట. నేటికీ అవి ఆలయంలో కనిపిస్తాయి. కశ్మీర రాజులెందరో స్వామిని తమ ఇలవేల్పుగా భావించేవారు. ఏటా అమర్‌నాథ్‌ యాత్ర నిర్వహించి భక్తిప్రపత్తులు చాటుకున్నారు. అమరనాథుడి సేవలో తరిస్తున్న బుటామాలిక్‌ వంశస్థుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరు యాత్ర సాగే దారిలో మధ్య మధ్యలో గుడారాలు వేసుకుని యాత్రికులకు వేడి వేడి తేనీరు, వంటకాలు అందిస్తుంటారు. యాత్రికుల నుంచి విరాళాలు తీసుకుని వచ్చిన మొత్తంలో మూడో వంతు తిరిగి భక్తుల అవసరాలకు వెచ్చిస్తారు.

అడుగడుగునా అపాయం..
అమర్‌నాథ్‌ యాత్ర ఎన్నో అనుభూతుల సమ్మేళనం. అకస్మాత్తుగా మారిపోయే వాతావరణం, ఎప్పుడు వచ్చి పడతాయో తెలియని కొండ చరియలు, మరోవైపు పాతాళాన్ని తలపించే లోయలు. ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా ప్రమాదం తప్పదు. ఏ వేళలో ఏం చేస్తారో తెలియని ముష్కర మూక. ఇన్ని ఇబ్బందులు ఉన్నా అమరనాథుడి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంతా శివయ్య లీల అనుకుంటూ ముందుకు సాగుతూనే ఉంటారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని పురిగొల్పుతూ ‘బోలేనాథ్‌ అమర్‌నాథ్‌’ అని విశ్వాసంతో యాత్ర పూర్తి చేస్తారు.

ఐదేళ్లు రద్దు
శతాబ్దాలుగా సాగుతున్న అమర్‌నాథ్‌ యాత్ర ఉగ్రవాదుల దుశ్చర్యల కారణంగా ఐదేళ్లపాటు రద్దయింది. ఉగ్రవాదుల నుంచి యాత్రికుల ప్రాణాలకు ముంపు పొంచి ఉండటంతో 1991-95 మధ్యకాలంలో యాత్రను నిలిపివేసింది భారత ప్రభుత్వం. 1996లో యాత్రికులపై కాల్పులు జరపబోమని ఉగ్రవాదులు హామీ ఇవ్వడంతో యాత్రను పునరుద్ధరించారు. తీవ్రవాదుల ధోరణి కారణంగా దశాబ్దకాలంగా అమర్‌నాథ్‌ సందర్శించే యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2008లో 5.33 లక్షల మంది అమర్‌నాథ్‌ని దర్శించుకోగా 2016లో అది కేవలం 2.20 లక్షలకే పరిమితమైంది. 2017లో 1.46 లక్షల మంది మాత్రమే అమర్‌నాథ్‌ యాత్రకు ముందుకొచ్చారు.

ఇలా ముందుకు
శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని పహల్గాం నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం అవుతుంది. ఇక్కడే అమర్‌నాథ్‌ యాత్ర బేస్‌ క్యాంప్‌ ఉంటుంది. పహల్గాం నుంచి అమర్‌నాథ్‌కు 45 కిలోమీటర్లు. బేస్‌క్యాంప్‌ నుంచి బృందాలుగా అమర్‌నాథ్‌ యాత్రకు బయల్దేరుతారు. పహల్గాంకు శ్రీనగర్‌ నుంచి రోడ్డు మార్గాన చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో రహదారికి ఇరువైపులా ఉండే లిడ్డర్‌ నదీపాయలు మనసును ఉల్లాసపరుస్తాయి.(Lidder River)

పహల్గాం నుంచి చందన్‌వాడీ(Chandanwari) మీదుగా యాత్ర సాగుతుంది.
  • చందన్‌వాడీ నుంచి యాత్ర సంక్లిష్టంగా మారుతుంది. ఇక్కడి దుకాణాల్లో డ్రైఫ్రూట్స్‌, చాక్లెట్లు, ఇతర తినుబండారాలు కొనుక్కొని మళ్లీ ప్రయాణం మొదలుపెడతారు. పచ్చదనం పరుచుకున్న కొండల నడుమ ప్రయాణించాలి. చందన్‌వాడీ నుంచి గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉంటాయి. మూడున్నర అడుగులు ఉండే దారిలో, కొండ అంచుల వెంట వెళ్లాల్సి ఉంటుంది. కర్ర చేత పట్టుకుని నడుస్తుంటారు.
  • చందన్‌వాడీ నుంచి 11 కిలోమీటర్లు ప్రయాణించాక శేష్‌నాగ్‌ ప్రాంతం వస్తుంది. ఇక్కడ ఐదు కొండలు నాగుపాము పడగల్లా కనిపిస్తాయి.
  • ఈ పర్వతాల చెంతనే ఒక నీలిరంగు తటాకం ఉంటుంది. ఇందులో శంకరుడి ఆభరణం అయిన వాసుకి నిద్రిస్తుందని విశ్వసిస్తారు.
  • శేష్‌నాగ్‌ దగ్గర భక్తులకు బస చేసే సదుపాయం ఉంటుంది. శేష్‌నాగ్‌ నుంచి 18 కిలోమీటర్లు ప్రయాణిస్తే అమర్‌నాథ్‌ వస్తుంది.
  • పహల్గాం, చందన్‌వాడీ నుంచి అమర్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లే సదుపాయం కూడా ఉంది.


132

Saturday, 8 July 2017

నందలూరు - శ్రీ సౌమ్యనాథాలయం


నందలూరు సౌమ్యనాథుడు


దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాల్లో కడప జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథాలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథునికి చొక్కనాధుడని, చొక్కనాధ పెరుమాళ్‌ అని, కులోత్తుంగచోళ ఎంబరుమన్నార్‌ విన్నగర్‌ అనే పేర్లు ఉన్నాయి. సౌమ్యనాథుడన్నా..చొక్కనాథుడన్నా సౌందర్యవంతుడని అర్ధం. సౌమ్యనాథుడనగా సౌమ్యకు(శ్రీలక్ష్మీదేవికి) నాథుడని కూడా చెప్పుకోవచ్చు. స్వామి మూలవిరాట్టు ఏడడుగుల ఎత్తున ఎంతో అందంగా... అభయముద్రాలంకృతమై ఉంటుంది.

క్రీ.శ. 11వ శతాబ్దంలో చోళవంశరాజు కుళోత్తుంగచోళుడు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర రాజులచే 17వ శతాబ్దంవరకు ఆలయ నిర్మాణం కొనసాగింది. గజపతిరాజుల కాలంలో ఆలయం ప్రసిద్ధి చెందింది. 12వశతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు రాజగోపురాన్ని కట్టించారు. తాళ్లపాక అన్నమాచార్య జన్మస్థలమైన తాళ్లపాక గ్రామం నందలూరుకు సమీపంలో ఉన్నందున అన్నమాచార్యులు సౌమ్యనాథాలయాన్ని తరచు దర్శించుకొనేవారు. స్వామివారిపై శృంగార కీర్తనలు రచించారు. క్రీ.శ 11 వ శతాబ్దం మధ్యలో నందలూరులోని సౌమ్యనాథస్వామి దేవస్థానం మొట్టమొదటి వైష్ణవ ఆలయంగా గుర్తింపబడింది.

ఆలయ నిర్మాణం.. స్వరూపం...
శ్రీ సౌమ్యనాథాలయం దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 180 స్తంభాలతో వైఖానస, వైష్ణవాగామ ఆర్షప్రోక్తంగా నిర్మించిన సువిశాలమైన రీతిలో అలరారుతుంటుంది. ఈ ఆలయంలో అధికంగా తమిళ శాసనాలు కనిపిస్తాయి. సింహద్వారంలో గాలిగోపురం ఉత్తరగోపురం, దక్షిణగోపురం ద్వారాలు ఉన్నాయి. ఆలయంలో రాతి దీపస్తంభం, బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడ మందిరం, మత్స్యమంటపం, ఆంజనేయమంటపం, చిన్నకోనేరు, జయవిజయులు, అంకుర్పారణ మంటపం, వంటశాల, శ్రీ యోగనరసింహస్వామి, శిల్పకళ, అంతరాళం ఉన్నాయి.

దీపంలేకున్నా.... వెలిగే స్వామి
ఆలయంలో ఎటువంటి దీపంలేకున్నా, స్వామి వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయం నిర్మించడం అద్భుతం. గర్భగుడి ప్రధానద్వారానికి వందగజాల దూరం నుంచి కూడా స్వామి చాల స్పష్టంగా కనిపిస్తారు. యేడాదిలో ఒకరోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై ప్రసరించడం ఇక్కడి ప్రత్యేకత.

ఆలయకుడ్యాలపై మత్స్య, సింహా చిహ్నాలు..
ఆలయ కుడ్యాలపై (లోపల)పై భాగంలో మత్స్య, సింహా చిహ్నాలు ఉన్నాయి. మత్స్య ఆకారంను మలిచి ఉన్నారు. భవిష్యత్తులో పెద్దఎత్తున వరదలు వచ్చి ఆలయాన్ని ముంచెత్తినప్పుడు ఆలయ పైభాగంలో ఉండే చేపబొమ్మకు ప్రాణం వచ్చి వరదలలో కలిసిపోతుందని స్ధానికుల నమ్మకం. అంటే అప్పటికి కలియుగం అంతమైపోతుందనే అర్ధం వస్తుందని చెబుతుంటారు.

ఆలయంలో మరో ఆలయం!?
రాతి మంటపంపై నుంచి గర్భాలయంలో ప్రవేశించాల్సివుంది. ఈ మంటపం ముందుబాగం శిఖరంలో సింహతల ఆకారంలో ఇరువైపుల ఉన్నాయి. ఏ దేవాలయానికైనా, ఆలయపైభాగంలో సింహతలలు అమర్చిబడి వుంటాయి. కాని సౌమ్యనాథస్వామి ఆలయంలో లోపలి మంటపంలోని ఓ భాగమంతా సింహాతలాటాలతో నిండివుండటం వల్ల భూగర్భంలో మరో ఆలయం ఉన్నట్లుగా గోచరిస్తుంది. దీనిని రాతి మంటపం అడుగున ఉన్న శివాలయంగా చెప్పుకుంటున్నారు.

ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి...
కడప–రేణిగుంట జాతీయరహదారిలో వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడపకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరు గ్రామంలో సౌమ్యనాథాలయం ఉంది. ఈ ఆలయానికి కడప, తిరుపతి, రాజంపేటల నుంచి బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అలాగే జిల్లా రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రానికి ముంబాయి–చెన్నై మార్గంలో నడిచే ఏ రైలు ద్వారా నైనా చేరుకోవచ్చును. విమానాశ్రయం అయితే రేణిగుంటకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా రైల్వేకోడూరు, రాజంపేట మీదుగా నందలూరుకు చేరుకోవచ్చు.

బ్రహ్మోత్సవాల క్రమమిది...
శ్రీ నారదమహర్షిచే ప్రతిష్టించబడిన అన్నమాచార్యులు ఆరాధ్యదైవమైన పరమేష్టి ప్రముఖ నిఖిల సురవంద బృంసదారవిందులైన, భక్తసులభుడైన శ్రీ సౌందర్యవల్లి సమేత శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఆషాడ శుద్ధనవమి మొదలు అంటే జూలై 2 నుంచి ఆషాఢ బహుళ తదియ 11వతేది అత్యంతవైభవంగా జరగనున్నాయి. సౌమ్యనాథస్వామి వారు తన దేవేరితో కలసి రోజుకొక వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. 7న గరుడోత్సవం, 9 న కళ్యాణోత్సవం, 10న రథోత్సవ కార్యక్రమాలు ఉంటాయి.
మోడపోతుల రామ్మోహన్‌, సాక్షి, రాజంపేట, వైఎస్‌ఆర్‌ జిల్లా

కొలనుపాక సోమేశ్వరాలయం


కొలనుపాక సోమేశ్వరాలయం

హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది కొలనుపాక. యాదాద్రి దివ్యక్షేత్రం నుంచి 20 కిలోమీటర్ల దూరం! వీరశైవ మతాచార్యులు శ్రీశ్రీ రేణుకాచార్యుల జన్మస్థలంగా ఉన్న కొలనుపాక సోమేశ్వరాలయానికి వేయి సంవత్సరాల ఘనచరిత్ర ఉంది. సోమేశ్వర మహాలింగం నుంచి ఉద్భవించిన ఈ ఆచార్యులు వీరశైవమతాన్ని ప్రపంచానికి బోధించి లింగంలోనే ఐక్యం చెందాడని ప్రతీతి. కొలనుపాక శివారుప్రాంతాల్లో వివిధ సమయాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ శిలాశాసనాలు, దేవతా ప్రతిమల ఆధారంగా ఇక్కడి చరిత్ర మనకు తెలుస్తోంది. దక్షిణ కాశిగా పిలువబడే ఈ గ్రామంలో కాశీలో ఉన్నట్లుగా 18 సామాజిక వర్గాలకు మఠాలు ఉన్నాయి. అలాగే చండీశ్వరీ ఆలయం, కోటిలింగేశ్వరాలయం, భైరవస్వామి ఆలయం, రుద్రమహేశ్వరాలయం, ఏకాదశరుద్రాలయం, మల్లికార్జున స్వామి ఆలయం, క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి ఆలయాలు ఉన్నాయి.

వీరశైవ మతగురువైన రేణుకాచార్యులు చండికాంబ సహిత సోమేశ్వరాలయంలోని స్వయంభూ లింగం నుంచి ఉద్భవించి చివరకు అదే లింగంలో ఐక్యం అయినట్లు వీరశైవ కవి షడక్షరుడు రాసిన రాజశేఖర విలాసంలో ఉంది. వీరశైవ మతోద్ధరణ కోసం రేణుకాచార్యులు ఎంతోకృషి చేశారని తెలుస్తోంది. ఈ శైవపీఠానికి సంబంధించిన వివరాల ప్రకారం తానుకేశుడనే శైవాచార్యునికి రుద్రమునీశ్వరుడనే కుమారుడున్నాడు. తానుకేశుని అనంతరం రుద్రమునీశ్వరుని లింగాయతు మతానికి అధిపతిని చేశాడు. ఆయన కొలనుపాక కేంద్రంగా వీరశైవ మతాన్ని స్థాపించి ప్రచారం చేశాడని తెలుస్తోంది.

ఘనమైన చరిత్ర
కొలనుపాక చండికాంబ సహిత సోమేశ్వరాలయానికి ఘనమైనచరిత్ర ఉంది. 10, 11వ శతాబ్దానికి చెందిన పశ్చిమ చాళుక్యుల కాలం నాటిది. నాటినుంచి నేటివరకు సోమేశ్వరుడు, చండికాంబ దేవతలు నిత్యపూజలు అందుకుంటున్నారు. చాళుక్యుల కాలంలో కొలనుపాక గ్రామం రాజప్రతినిధి స్థానంగా ఉండేదని సమాచారం. సైనికపరంగా దక్షిణాపథంలో కొలనుపాక ముఖ్యకేంద్రంగా ఉండేదట. రాజులు, రాజప్రతినిధులు వివిధస్థాయుల్లో ఆలయ నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేసినట్లు పరిసర ప్రాంతాల్లో దొరికిన శాసనాల్లో నిక్షిప్తమై ఉంది.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ఉన్న ఈ దేవాలయానికి దేశ, విదేశాల నుంచి భక్తులు రోజు వచ్చి పోతుంటారు. మధ్యయుగానికి ముందు నుంచే ఇక్కడ ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టమెనదిగా ఉంది.

లింగాకారంలో స్వామి దర్శనం
ఇక్కడ స్వామి వారు లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ లింగం నుంచే జగత్‌గురువు రేణుకాచార్యులు ఉద్భవించి వీరశైవ మతాన్ని, సిద్ధాంతాలను విశ్వవ్యాపితం చేశారు. ఈ ఆలయంలో ఉన్న సహస్ర లింగేశ్వరుని కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సోదరి మైలాంబ ప్రతిష్టించినట్లు ప్రతీతి. ప్రధానాలయంలోనే చండికాంబ అమ్మవారు ఉంటారు. కోరిన కోర్కెలు తీర్చమని అమ్మవారికి భక్తులు ముడుపులు కడతారు. కోర్కెలు తీరిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం పోయడం ఇక్కడ ప్రత్యేకత. పక్కనే కోటొక్కలింగం అత్యంత రమణీయంగా భక్తులకు కనువిందు చేస్తుంది. దేవదేవుని ప్రతిరూపమైన లింగాకారానికి ఖర్జురపు పండ్ల ఆకారంలో చెక్కబడిన చిన్నచిన్న లింగాలన్నిటినీ కలుపుకుంటే కోటొక్కటి ఉంటాయని చెబుతారు. ఈ కోటొక్కలింగాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.

చరిత్రను తెలిపే మ్యూజియం
ఆలయం ముందు పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ఈ కొలనుపాక ఆలయం, గ్రామ చరిత్రకు సంబంధించిన పలు విశిష్టతలను తెలియజేస్తోంది. కళ్యాణ చాళుక్యులు, కాకతీయ రాజుల ఏలుబడిలో గొప్ప శైవక్షేత్రంగా కొలనుపాక వెలుగొందిన విషయాలను విపులంగా వివరిస్తోంది. వీరశైవ, జైన, వైష్ణవ మతాలకు సంబంధించిన మహోన్నత చరిత్రను మనకు అందిస్తోంది.

నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు
కొలనుపాక సోమేశ్వరాలయానికి తెలంగాణతో పాటు ప్రతి నిత్యం కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి లింగాయత్‌లు వస్తారు. తమ ఆరాధ్యదైవం సోమేశ్వరునితోపాటు జగద్గురువు రేణుకాచార్యులను దర్శనం చేసుకుని వెళ్తారు. శివరాత్రి పర్వదినం రోజు వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. దేశ విదేశాల పర్యాటకులు వచ్చిపోతుంటారు.

ఎలా రావాలంటే..
హైదరాబాద్‌ – వరంగల్‌ జాతీయ రహదారి పై సరిగ్గా 70 కిలో మీటర్ల వద్ద ఆలేరు ఉంటుంది. ఇక్కడి RTC Busలు, రైళ్లు ఉంటాయి. భక్తులు ఆలేరులో దిగిన తర్వాత ఆటోలు, RTC Busలలో ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాకకు వెళ్లవచ్చు. ఆలేరు – చేర్యాల మార్గంలో కొలనుపాక ఉంది.

యంబ నర్సింహులుSunday, 2 July 2017

గుబ్బల మంగమ్మ గుడి


ఆదివాసీల ఆరాధ్యదైవం గుబ్బల మంగమ్మతల్లి

దట్టమైన అడవి, పొడవైన చెట్లు, ఎత్తైన కొండలు, గలగల పారే సెలయేటి సవ్వడుల నడుమ గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలసింది ఆ తల్లి. అందుకే ఆమెను గుబ్బల మంగమ్మతల్లిగా పిలుచుకుంటూ భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండల కామవరం అడవిలోని మారుమూల ప్రాంతంలో వెలసినప్పటికీ, భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా పేరు పొందడంతో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజించి తమ మొక్కులు తీర్చుకుంటారు. శ్రీరామచంద్రుడు పాలన సాగించిన త్రేతాయుగం నుంచి ఈ తల్లి వెలసినట్లు స్థలపురాణం.

ఈ అడవిలో కొందరు రాక్షసులు సంచరించేవారట. ఒకసారి రాక్షసుల మధ్య తీవ్రయుద్ధం జరిగిందట. ఈ యుద్ధం ధాటికి మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందట. దాంతో అమ్మ ఆగ్రహించేసరికి ప్రకృతి అల్లకల్లోలం అయిందట. అప్పుడు దేవతలంతా ప్రత్యక్షమై మంగమ్మతల్లిని శాంతపరచి భక్తుల కోర్కెలు తీర్చేందుకు మళ్లీ ఈ ప్రాంతంలోనే అవతరించాలని కోరగా అందుకు ఆ తల్లి అంగీకరించి గలగల పారుతున్న సెలయేటి సవ్వడుల మధ్య గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలసింది. ఈ తల్లికి తోడుగా గంగమ్మతల్లి, వీరిద్దరికి తోడుగా నాగమ్మతల్లి చేరింది.

మంగమ్మ మహిమ వెలుగులోకి వచ్చింది ఇలా...
సుమారు యాభై ఏళ్ల క్రితం బుట్టాయగూడెం గ్రామానికి చెందిన కరాటం కృష్ణమూర్తి అనే భూస్వామి ఒకరోజు మంగమ్మతల్లి కొలువై ఉన్న అటవీ్ర పాంతం వైపు కొంతమంది కూలీలతో కలసి వెదురు గెడలు తెచ్చేందుకు ఎడ్లబండ్లు తోలుకుని అక్కడికి వెళ్లారు. బండ్లపై వెదురు లోడు వేయడం అయ్యాక, తిరుగు ప్రయాణంలో ఎంత ప్రయత్నం చేసినా ఎడ్లు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయాయట. ఏం చేయాలో తెలియక ఎడ్ల బండ్ల పై ఉన్న వెదురు కలపను కిందకు దించివేసి కృష్ణమూర్తి ఇంటికి వచ్చేసారట.

కృష్ణమూర్తికి గుబ్బల మంగమ్మ తల్లి కలలో కనిపించి ‘‘నీవు వెదురు లోడు చేస్తున్న సమీపంలోనే వాగు వెంబడి కొంతదూరం ప్రయాణించిన తరవాత జలపాతం పడే ప్రదేశంలో గుబ్బలు, గుబ్బలుగా ఉన్న గుహలో వెలిశాను నేను. నన్ను దర్శించుకుని పూజించిన తరువాత నీవు వెదురు తీసుకువెళ్లు’’ అని చెప్పడంతో కృష్ణమూర్తి నిద్రనుంచి మేల్కొని చూడగా గుబ్బల మంగమ్మ తల్లి వెలసిన ప్రదేశం కనిపించిందట.

మంగమ్మను దర్శించుకున్న కృష్ణమూర్తి అమ్మవారికి పూల మాలలు వేసి ధూప దీప నైవేద్యాలతో పూజలు చేసి, ఏజన్సీ ప్రాంతంలోని చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకు అన్నసంతర్పణ చేయించారట. సంతర్పణకు వెళ్లిన భక్తులు మంగమ్మను దర్శించుకోగా వారి కోర్కెలు నెరవేరాయట. అప్పటి నుంచి మంగమ్మతల్లిని దర్శించుకుని పూజించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

సంతాన వృక్షం
మంగమ్మ తల్లి వెలసిన సమీపంలో గానుగ చెట్టు ఒకటి ఉంది. ఈ చెట్టు సంతాన వృక్షంగా పేరొందింది. పిల్లలు పుట్టని దంపతులు అమ్మను దర్శించుకున్న అనంతరం పసుపు కుంకుమలు ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టుకొమ్మకు కడతారు. అలా చేయడం వల్ల అమ్మ అనుగ్రహంతో కడుపు పండు తుందని విశ్వాసం. ప్రతి ఆది, మంగళ, శుక్రవారాలలో ఈ చెట్టు వద్ద సంతాన పూజలు జరుగుతుంటాయి.

అడవిలో ఆహ్లాదభరితం
గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్ళే భక్తులకు అడవి మార్గంలో ప్రయాణం ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బుట్టాయగూడెం మండలం కామవరం దాటిన తరవాత కొంతదూరం వెళ్లేసరికి దట్టమైన అడవి... అడవిలో కొంతదూరం వెళ్లిన తరవాత గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం కలుగుతుంది.  ప్రయాణంలో పచ్చని చెట్లు, ఎల్తైన కొండలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి.
కోడూరి ఆనంద్‌
లవకుశలు ఇక్కడే పుట్టారట!


లవకుశలు ఇక్కడే పుట్టారట!

సీతను రాముడు అడవులకు పంపడం, అక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఆమె లవకుశులకు జన్మనివ్వడం, తర్వాత అశ్వమేధయాగ సమయంలో రామలక్ష్మణులతో లవకుశులు యుద్ధంచేయడం రామాయణంలో మనకు బాగా తెలిసిన ఘట్టాలే. అయితే ఆ సమయంలో సీతమ్మతల్లి ఉన్న చోటు ఇదేనని కర్ణాటక రాష్ట్రం ఆవని వాసులంటారు. దానికి చాలా ఆనవాళ్లే చూపిస్తారు కూడా! 

సీతమ్మతల్లికి ఆలయం ఉండటం బాగా అరుదనే చెప్పాలి. శివుడు లేకుండా పార్వతినీ, రాముడు లేకుండా సీతనూ దేవాలయాల్లో చూడటం, వీళ్లిద్దరినీ ఒకే గర్భగుడిలో దర్శించడం ఇంకా అరుదు. కర్ణాటక రాష్ట్రం, కోలారు జిల్లా, ముల్‌బాగల్‌ తాలూకాలోని ఆవని అలాంటి పుణ్యక్షేత్రం. ఇక్కడి కొండమీద పార్వతీ సీతమ్మలను పక్కపక్కన దర్శించొచ్చు. ఇక్కడే రామలక్ష్మణులూ, భరతశత్రుఘ్నులతో పాటు సుగ్రీవాది వానరులూ తమ తమ పేర్లతో శివలింగాలను ప్రతిష్ఠించారు. వాల్మీకి తపస్సు చేసిన గుహనీ ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా ఆవనిలోని ప్రతి అణువూ పరమ పవిత్రమే.

రామాయణ కాలంలో...
గర్భవతైన సీతమ్మను రాముడి ఆజ్ఞ మేరకు అడవుల్లో వదులుతాడు లక్ష్మణుడు. తర్వాత ఆమె వాల్మీకి ముని ఆశ్రమానికి చేరుతుంది. సీతమ్మను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు వాల్మీకి మహర్షి. ఆశ్రమంలోనే లవకుశులకు జన్మనిస్తుంది సీత. లవకుశులు అక్కడే పెరుగుతూ సకల విద్యలనూ అభ్యసిస్తారు. అప్పుడు ఆశ్రమం దగ్గరలోనే ఓ చోట సీతమ్మ పార్వతీదేవిని పూజించేదట. తర్వాత రాముడు అశ్వమేధయాగం చేస్తాడు. అప్పుడు వదిలిన గుర్రాన్ని లవకుశులు కట్టేయడంతో రాముడూ ఆయన సోదరులకీ, లవకుశులకూ మధ్య యుద్ధం జరుగుతుంది. తర్వాత విషయం తెలుసుకున్న రామభద్రుడు కన్నబిడ్డల మీద యుద్ధానికి దిగినందుకు ఎంతో వ్యధ చెందుతాడు. ఈ పాపానికి పరిహారంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సహా వానరులూ రామ పరివారమంతా అక్కడే శివలింగాలను ప్రతిష్ఠించి ప్రార్థిస్తారు. ఉత్తర రామాయణంలోని ఈ ఘట్టం జరిగిన చోటు ఇదేనని ఆవని స్థలపురాణంలో తెలుస్తోంది. అప్పుడు రాముడు ప్రతిష్ఠించిన లింగమే రామలింగేశ్వర స్వామిగా ఆవనిలో పూజలందుకుంటోంది. అంతేకాదు లక్ష్మణేశ్వర లింగమూ, భరత శత్రుఘ్నులు ప్రతిష్ఠించిన లింగాలనూ మనం ఇప్పటికీ దర్శించొచ్చు. నిజానికి ఆవనిలో మొత్తం 1100 దాకా శివలింగాలుండేవట. తురుష్కుల దండయాత్ర కారణంగా ఇప్పుడు వీటిలో కొన్నే మిగిలి ఉన్నాయి. ఆవనిలోని శివలింగాలకు చోళరాజులు గుళ్లు కట్టించారు. పల్లవులూ, విజయనగర రాజులూ వీటిని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం దేవాలయం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది.

సీతమ్మ ఆనవాళ్లివే...
సీతాదేవి పూజించినట్టుగా చెబుతున్న పార్వతీదేవి స్వయంభూ విగ్రహాన్ని ఇప్పుడు కూడా ఆవని కొండమీద ఉన్న సీతా పార్వతి ఆలయంలో చూడొచ్చు. తొలుత ఈ గుళ్లొ పార్వతీ దేవి మాత్రమే ఉండేదట. ఒకసారి ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు ఆయనకు ఆదిశక్తి కలలో కనిపించి తన విగ్రహం పక్కనే సీతాదేవి విగ్రహాన్నీ ప్రతిష్ఠించమని చెప్పిందట. శంకరులు దాన్ని శిరసావహించారు. ఇక ఇక్కడి కొండ మీద వాల్మీకి తపస్సు చేసుకున్న గుహగా పిలిచే ఓ గుహను మనం చూడొచ్చు. లవకుశుల జన్మప్రదేశం, పవళించిన తొట్టె, ఉగ్గుగిన్నె, పసుపు కుంకుమ గిన్నెలు, నీళ్లు కాచే కాగు తదితరాల శిలామయ చిహ్నాలు ఇక్కడ కనిపిస్తాయి. సీతాదేవి బట్టలుతికిన బావి, స్నానం చేసిన కొలను, రామచంద్రుడితో లవకుశులు యుద్ధం చేస్తున్నారని తెలిసి ఆమె దుఃఖించిన చోటు తదితరాలుగా చెప్పే కొన్ని ప్రదేశాలూ దర్శనమిస్తాయి. కొండమీద లవకుశులు, బృహస్పతి, జాంబవంతుడు, ఆంజనేయుడు ప్రతిష్ఠించిన లింగాలకు చిన్న గుళ్లున్నాయి. అడవిలోకి వెళ్లినప్పుడు సీత దాహం వేస్తోందనడంతో లక్ష్మణుడు ఒక బాణం వేసి కొలనును సృష్టించాడట. దాన్నే ధనుష్కోటిగా పిలుస్తారు. కొండ మీద చాలా కొలనులున్నాయి. కలియుగంలో తీర్థాలు దుష్టసంపర్కం వల్ల కలుషితమవుతాయి అని భూమి మీద తీర్థాల్లో స్నానమాచరిస్తున్న దేవతలతో అన్నాడట బృహస్పతి. అందుకు ఏదైనా నివారణను సూచించమని దేవతలు అడగడంతో ఆవని క్షేత్రానికి కలిదోషం అంటదని చెప్పాడట. అందుకే తీర్థాభిమాన దేవతలంతా ఇక్కడి కోనేరుల్లో ఉంటారని చెబుతారు.

రుషిధామం...
ఈ ఆవని క్షేత్రం ఒకప్పుడు నైమిశారణ్య ప్రాంతంలో ఉండేదట. ఇక్కడ యోగనిష్ఠాగరిష్ఠులైన అగస్త్య, కౌశిక, కణ్వ, మార్కండేయ, కపిల, గౌతమ, భరద్వాజ తదితర 2800 మంది మునులు నివసించారట. ఇక్కడ వీరంతా హావని యజ్ఞాన్ని చేశారట. దాని పేరు మీదుగా ఈ చోటుకి ఆవని అనే పేరు వచ్చిందంటారు. ఆవని క్షేత్రాన్ని ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు దర్శిస్తూ ఉంటారు. ఇక్కడి రామలింగేశ్వరుడికి శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. రథోత్సవం సహా పుష్పపల్లకీసేవ, అర్చకులు కలశాలను తలపై పెట్టుకుని నిర్వహించే గరిగ ఉత్సవాలకు వేలాది భక్తులు హాజరవుతారు. ఈ సమయంలో గిరి ప్రదక్షిణ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఇదే సమయంలో 20 రోజుల పాటు జరిగే పశువుల పరసగా పిలిచే పశువుల సంతకు మూడు రాష్ట్రాల నుంచీ జనం వస్తారు.

తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై ముల్‌బాగల్‌లో దిగి అక్కడి నుంచి 12 కి.మీ ప్రయాణించి ఆవని క్షేత్రాన్ని చేరుకోవచ్చు.

రేచిని నాగుల గుడి - రాక్షసులు నిర్మించిన ఆలయం


రాక్షసులు నిర్మించిన ఆలయమిది!
లింగం లేని పానవట్టం ఇక్కడి ప్రత్యేకత
ఒకే రాత్రి నిర్మించినట్లు ప్రసిద్ధి
వైవిద్యమైన చరిత్ర కలిగిన రేచిని నాగుల గుడి

ప్రాచీన ఆలయాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కాకతీయులు నిర్మించినవి.. కృష్ణదేవరాయులు నిర్మించిన ఆలయాలు.. ఇలా వాటి కళాకృతులను, శిల్ప కళలను చూసి చెప్పొచ్చు. కానీ రాక్షసులు నిర్మించిన శివాలయాలు ఎక్కడైనా విన్నారా.. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామంలోని నాగుల గుడిని రాక్షసులు నిర్మించినట్టు ఇక్కడి పూర్వీకులు చెబుతుంటారు. ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే పూజలు నిర్వహించే ఈ గుడి రాతి బండల అల్లికతో నిర్మితమై ఉంది. గుడి నిర్మాణ శైలి మొదలుకొని గర్భగుడిలోని దేవుడి లింగం వరకు అన్నీ విభిన్నంగా ఉన్నాయి. అత్యంత పురాతన ఈ ఆలయం ప్రచారానికి కొంత దూరంగానే ఉంది.

గ్రామస్థులు నాగుల గుడిగా పిలుచుకునే ఈ ఆలయంలో ప్రతి అంశం విశేషమే. అసంపూర్తి ఆలయం.. నిర్మాణానికి వినియోగించిన బండ రాళ్లు.. లోపల శివలింగం లేని పానవట్టం.. ఇలా ఎవరైనా తొందరలో నిర్మించి సగంలో వదిలేసి వెళ్లినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. పెద్ద పెద్ద బండ రాళ్లను ఒకదానిపై ఒకటి అమర్చి ఆలయ మండపాన్ని నిర్మించారు. నిలువు స్తంభాలతో పాటు పైకప్పు కూడా బండరాళ్ల అమరికతోనే ఉంది. గర్భగుడిలో సైతం ఇవే బండ రాళ్లు నేర్పుగా అమర్చి కనిపిస్తాయి. గర్భ గుడి గడప, తోరణం రాయిపై నాగు పాముల ఆకృతులు చెక్కి ఉంటాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ఇక్కడ గర్భ గుడిలో లింగం లేకపోవడం విశేషం. శివ లింగమంటే ఎక్కడైనా పానవట్టం, లింగం రెండు ఉంటాయి. కానీ ఇక్కడ కేవలం పానవట్టం మాత్రమే కనిపిస్తుంది. లింగం ప్రతిష్ఠించే చోటు ఖాళీగా ఉండడం విశేషం. ఆలయాన్ని మాత్రం మంటపం, గర్భగుడిలా చక్కగా నిర్మించారు. గ్రామ శివారులోని పొలాల్లో ఈ ఆలయం ఉంటుంది. నిర్మాణానికి ఉపయోగించిన బండ రాళ్లు చూస్తే మోసేందుకు కూడా వీలుకానంత పెద్దగా ఉంటాయి.

పూర్వీకులు ఇలా చెబుతున్నారు.
ఈ ఆలయం గురించి గ్రామస్థులు చెప్పే ప్రకారం.. ఆలయాన్ని ఒక్క రాత్రిలోనే నిర్మించారు. గ్రామానికి చెందిన వృద్ధుడు మురికి చిన్నన్నను ఆలయం గురించి అడిగితే.. ఆలయాన్ని రాక్షసులు నిర్మించారని చెబుతున్నారు. ‘‘మా తాత ముత్తాతల నుంచి మాకు ఇదే చెప్పారు. గ్రామంలో నాగుల గుడి గురించి అందరికీ తెలుసు. గుడిని రాత్రికి రాత్రే నిర్మించారు. తెల్లవారే సరికి గ్రామంలో ఆలయం కనిపించిందట. వెళ్లి చూస్తే లింగం లేని పానవట్టం కనిపించిందని పూర్వీకుల మాట. కానీ గుడిని కట్టిన బండలు చాలా పెద్దగా ఉంటాయి. అలాంటి బండ రాళ్లతో ఆలయాన్ని నిర్మించారు. నాగుల పంచమి, చవితి రోజుల్లో మాత్రమే వెళ్లి అక్కడి పుట్టలో పాలు పోసి వస్తారు.. రాక్షసులు నిర్మించారని పూర్వం నుంచి చెబుతున్నారు..’’ అంటూ ఆలయం గురించి వివరించాడు.

ఏడాదిలో రెండు రోజులే పూజలు..
రాక్షసులు నిర్మించిన ఆలయంగా పేరున్న ఈ నాగుల గుడిలో కేవలం శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి, కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజుల్లో మాత్రమే పూజలు నిర్వహిస్తారు. మిగతా రోజుల్లో ఆలయంలోనికి కూడా వెళ్లరు. ఆలయంలో ధూప దీప నైవేద్యాలు లేవు. పూజారులూ ఉండరు. సుమారుగా 15వ శతాబ్దంలో ఈ గుడిని నిర్మించినట్టుగా ఇక్కడి వారు చెబుతున్నారు. పొలాల మధ్యలో ఉన్న ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. నిర్వహణ, ఆదరణ లేకపోవడంతో చెత్త చెదారంతో నిండి నిర్మానుష్యంగా కనిపిస్తుంది. పురావస్తు శాఖ వారు వచ్చి ఇక్కడి విశేషాలను పరిశీలిస్తే ఆలయం గురించి మరెన్నో విశేషాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే, బాహ్య ప్రపంచానికి సైతం ఆ గొప్పదనం తెలిసే అవకాశం ఉంటుంది.

రేచిని గ్రామం తాండూరు మండలంలోనే పురాతనమైంది. తాండూరు రైల్వే స్టేషన్‌ను రేచిని రోడ్‌ రైల్వేస్టేషన్‌గా పిలుస్తారు. అంటే గోండు రాజుల పాలనా కేంద్రంగా ఉన్న తాండూరు కంటే రేచిని పురాతన గ్రామం. ఇక్కడి ప్రజలు, పూర్వీకులు సైతం అదే చెబుతుంటారు. రేచిని పూర్వం ఇక్కడి చుట్టుపక్కల సుమారు 50 గ్రామాలకు వ్యాపార కేంద్రంగా ఉండేది.

రేచిని వెళ్లాలంటే..
మంచిర్యాల జిల్లా కేంద్రానికి రేచిని గ్రామం 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంచిర్యాల-చంద్రపూర్‌ జాతీయ రహదారిపై తాండూరు ఐబీ వద్ద నుంచి 11 కిలోమీటర్లు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. తాండూరు ఐబీ నుంచి ఆటోలు మాత్రమే ఉంటాయి. ఆర్టీసీ బస్సు ఉన్నా.. ఉదయం, రాత్రి మాత్రమే నడుస్తుంది. రేచిని వరకు బీటీ రోడ్డు ఉంది. కాగజ్‌నగర్‌ నుంచి రేచిని 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చినా తాండూరు ఐబీ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.