Sunday, 2 July 2017

రేచిని నాగుల గుడి - రాక్షసులు నిర్మించిన ఆలయం


రాక్షసులు నిర్మించిన ఆలయమిది!
లింగం లేని పానవట్టం ఇక్కడి ప్రత్యేకత
ఒకే రాత్రి నిర్మించినట్లు ప్రసిద్ధి
వైవిద్యమైన చరిత్ర కలిగిన రేచిని నాగుల గుడి

ప్రాచీన ఆలయాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కాకతీయులు నిర్మించినవి.. కృష్ణదేవరాయులు నిర్మించిన ఆలయాలు.. ఇలా వాటి కళాకృతులను, శిల్ప కళలను చూసి చెప్పొచ్చు. కానీ రాక్షసులు నిర్మించిన శివాలయాలు ఎక్కడైనా విన్నారా.. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామంలోని నాగుల గుడిని రాక్షసులు నిర్మించినట్టు ఇక్కడి పూర్వీకులు చెబుతుంటారు. ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే పూజలు నిర్వహించే ఈ గుడి రాతి బండల అల్లికతో నిర్మితమై ఉంది. గుడి నిర్మాణ శైలి మొదలుకొని గర్భగుడిలోని దేవుడి లింగం వరకు అన్నీ విభిన్నంగా ఉన్నాయి. అత్యంత పురాతన ఈ ఆలయం ప్రచారానికి కొంత దూరంగానే ఉంది.

గ్రామస్థులు నాగుల గుడిగా పిలుచుకునే ఈ ఆలయంలో ప్రతి అంశం విశేషమే. అసంపూర్తి ఆలయం.. నిర్మాణానికి వినియోగించిన బండ రాళ్లు.. లోపల శివలింగం లేని పానవట్టం.. ఇలా ఎవరైనా తొందరలో నిర్మించి సగంలో వదిలేసి వెళ్లినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. పెద్ద పెద్ద బండ రాళ్లను ఒకదానిపై ఒకటి అమర్చి ఆలయ మండపాన్ని నిర్మించారు. నిలువు స్తంభాలతో పాటు పైకప్పు కూడా బండరాళ్ల అమరికతోనే ఉంది. గర్భగుడిలో సైతం ఇవే బండ రాళ్లు నేర్పుగా అమర్చి కనిపిస్తాయి. గర్భ గుడి గడప, తోరణం రాయిపై నాగు పాముల ఆకృతులు చెక్కి ఉంటాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ఇక్కడ గర్భ గుడిలో లింగం లేకపోవడం విశేషం. శివ లింగమంటే ఎక్కడైనా పానవట్టం, లింగం రెండు ఉంటాయి. కానీ ఇక్కడ కేవలం పానవట్టం మాత్రమే కనిపిస్తుంది. లింగం ప్రతిష్ఠించే చోటు ఖాళీగా ఉండడం విశేషం. ఆలయాన్ని మాత్రం మంటపం, గర్భగుడిలా చక్కగా నిర్మించారు. గ్రామ శివారులోని పొలాల్లో ఈ ఆలయం ఉంటుంది. నిర్మాణానికి ఉపయోగించిన బండ రాళ్లు చూస్తే మోసేందుకు కూడా వీలుకానంత పెద్దగా ఉంటాయి.

పూర్వీకులు ఇలా చెబుతున్నారు.
ఈ ఆలయం గురించి గ్రామస్థులు చెప్పే ప్రకారం.. ఆలయాన్ని ఒక్క రాత్రిలోనే నిర్మించారు. గ్రామానికి చెందిన వృద్ధుడు మురికి చిన్నన్నను ఆలయం గురించి అడిగితే.. ఆలయాన్ని రాక్షసులు నిర్మించారని చెబుతున్నారు. ‘‘మా తాత ముత్తాతల నుంచి మాకు ఇదే చెప్పారు. గ్రామంలో నాగుల గుడి గురించి అందరికీ తెలుసు. గుడిని రాత్రికి రాత్రే నిర్మించారు. తెల్లవారే సరికి గ్రామంలో ఆలయం కనిపించిందట. వెళ్లి చూస్తే లింగం లేని పానవట్టం కనిపించిందని పూర్వీకుల మాట. కానీ గుడిని కట్టిన బండలు చాలా పెద్దగా ఉంటాయి. అలాంటి బండ రాళ్లతో ఆలయాన్ని నిర్మించారు. నాగుల పంచమి, చవితి రోజుల్లో మాత్రమే వెళ్లి అక్కడి పుట్టలో పాలు పోసి వస్తారు.. రాక్షసులు నిర్మించారని పూర్వం నుంచి చెబుతున్నారు..’’ అంటూ ఆలయం గురించి వివరించాడు.

ఏడాదిలో రెండు రోజులే పూజలు..
రాక్షసులు నిర్మించిన ఆలయంగా పేరున్న ఈ నాగుల గుడిలో కేవలం శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి, కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజుల్లో మాత్రమే పూజలు నిర్వహిస్తారు. మిగతా రోజుల్లో ఆలయంలోనికి కూడా వెళ్లరు. ఆలయంలో ధూప దీప నైవేద్యాలు లేవు. పూజారులూ ఉండరు. సుమారుగా 15వ శతాబ్దంలో ఈ గుడిని నిర్మించినట్టుగా ఇక్కడి వారు చెబుతున్నారు. పొలాల మధ్యలో ఉన్న ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. నిర్వహణ, ఆదరణ లేకపోవడంతో చెత్త చెదారంతో నిండి నిర్మానుష్యంగా కనిపిస్తుంది. పురావస్తు శాఖ వారు వచ్చి ఇక్కడి విశేషాలను పరిశీలిస్తే ఆలయం గురించి మరెన్నో విశేషాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే, బాహ్య ప్రపంచానికి సైతం ఆ గొప్పదనం తెలిసే అవకాశం ఉంటుంది.

రేచిని గ్రామం తాండూరు మండలంలోనే పురాతనమైంది. తాండూరు రైల్వే స్టేషన్‌ను రేచిని రోడ్‌ రైల్వేస్టేషన్‌గా పిలుస్తారు. అంటే గోండు రాజుల పాలనా కేంద్రంగా ఉన్న తాండూరు కంటే రేచిని పురాతన గ్రామం. ఇక్కడి ప్రజలు, పూర్వీకులు సైతం అదే చెబుతుంటారు. రేచిని పూర్వం ఇక్కడి చుట్టుపక్కల సుమారు 50 గ్రామాలకు వ్యాపార కేంద్రంగా ఉండేది.

రేచిని వెళ్లాలంటే..
మంచిర్యాల జిల్లా కేంద్రానికి రేచిని గ్రామం 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంచిర్యాల-చంద్రపూర్‌ జాతీయ రహదారిపై తాండూరు ఐబీ వద్ద నుంచి 11 కిలోమీటర్లు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. తాండూరు ఐబీ నుంచి ఆటోలు మాత్రమే ఉంటాయి. ఆర్టీసీ బస్సు ఉన్నా.. ఉదయం, రాత్రి మాత్రమే నడుస్తుంది. రేచిని వరకు బీటీ రోడ్డు ఉంది. కాగజ్‌నగర్‌ నుంచి రేచిని 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చినా తాండూరు ఐబీ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.No comments:

Post a Comment