Thursday, 25 July 2013

మద్ది ఆంజనేయస్వామిఈ గుడికి చెట్టే శిఖరం!!


చెట్టునే ఆలయ శిఖరంగా చేసుకుని ఆ చెట్టు పేరు మీదే మద్ది ఆంజనేయస్వామిగా వెలిసి దేశంలోనే ప్రముఖ హనుమద్‌ క్షేత్రంగా పేరుగాంచిన ఆలయం శ్రీమద్ది ఆంజనేయస్వామి దేవస్థానం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం గ్రామంలో పచ్చని పొలాల మధ్య ఎర్రకాలువను ఆనుకుని మద్దిచెట్టు తొర్రలో వెలిసిన స్వయంభూ క్షేత్రం మద్ది ఆంజనేయస్వామి ఆలయం. 50 సంవత్సరాల క్రితం చిన్న చెట్టు తొర్రలో ఉన్న ఈ దేవాలయం ప్రస్తుతం ప్రముఖ దేవాలయాల జాబితాలో స్థానం సంపాదించుకుంది.

స్థలపురాణం
పచ్చనిపొలాల నడుమ మద్దివృక్షం కింద ఒక చేతిలో ఫలం, మరో చేతిలో గదతో దర్శనమిచ్చే ఈ స్వామివారు ఇక్కడ స్వయంభూగా అవతరించడం వెనక చాలా లోతైన పురాణ గాథ ఉంది. మద్వాసురుడు అనే రాక్షసుడు త్రేతాయుగంలో రావణసైన్యంలో ఉండేవాడు. రాక్షసుడైనప్పటికీ మద్వాసురుడు ఆధ్యాత్మిక చింతనతో జీవించేవాడు. రామ రావణ యుద్ధంలో రాముని వైపు పోరాడుతున్న ఆంజనేయస్వామి వారిని చూసిన మద్వాసురుడు అస్త్రసన్యాసం చేసి ‘‘హనుమా హనుమా’’ అంటూ తనువు చాలించాడు. అతడే ద్వారయుగంలో మ«ధ్వకుడుగా జన్మించాడు. ఈ యుగంలో కౌరవ, పాండవుల యుద్దంలో కౌరపక్షాన పోరాడుతున్న మధ్వకుడు ఆర్జునునిజెండాపై ఉన్న శ్రీ ఆంజనేయస్వామి వారిని చూసి పూర్వజన్మ స్మృతితో ప్రాణత్యాగం చేశాడు. కలియుగంలో మద్వుడుగా జన్మించి ఆంజనేయస్వామి వారి దర్శనం కోసం అనుక్షణం పరితపించేవాడు. నిత్యం ఎర్రకాలువలో దిగి స్నానమాచరించి ఆంజనేయస్వామి కోసం తపస్సు చేసేవాడు.

ఒకరోజు స్నానంచేసి, ఒడ్డుకు చేరబోతున్న మద్వుడు వయోభారంతో తూలి కాలువలో పడిపోబోయాడు. అప్పుడు ఎవరో తనను చెయ్యి పట్టుకుని ఆపినట్లు అనిపించింది. ఎవరా అని చూస్తే, వానరం ఒకటి తన చేయి పట్టుకుని ఒడ్డుకు తీసుకువచ్చి ఒక ఫలాన్ని ఇచ్చింది. అది మొదలు ఆ వానరం రోజూ మద్వుడికి సపర్యలు చేస్తూ ఫలాన్ని ఇచ్చి వెళుతుండేది. ఒకనాడు మద్వుడికి ఆ వానరం ఆంజనేయస్వామిలా గోచరించింది. ‘నేను ఎంత పాపిష్టివాడిని! ఇంతకాలం స్వామివారితో సపర్యలు చేయించుకున్నానా!’ అని బాధపడ్డాడు. ఇంతలో స్వామి ప్రత్యక్షమై ‘‘మద్వా ఇందులో నీ తప్పేమీ లేదు. నీ భక్తికి మెచ్చి నేనే నీకు సేవలు చేశాను కాబట్టి విచారించక వరం కోరుకో’’ అన్నాడు. మద్వుడు ‘‘స్వామీ మీరు ఎల్లప్పుడూ నా చెంత ఉండేలా వరం ప్రసాదించండి’’ అని ప్రార్థించాడు. అప్పుడు స్వామి ‘‘నీవు మద్దిచెట్టుగా అవతరించు. నేను నీ సమీపంలో శిల రూపంలో ఒక చేతిలో ఫలం, మరో చేతిలో గదతో వెలుస్తాను. మనిద్దరినీ కలిపి మద్ది ఆంజనేయస్వామిగా భక్తులు పిలుస్తారు’’ అని చెప్పినట్లు స్థలపురాణం.

ప్రదక్షిణలతో పరవశించే దైవం
కోరిన కోర్కెల తీరాలంటూ శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఈ క్షేత్రాన్ని వస్తుంటారు. ముఖ్యంగా వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడిన వారు ఈ స్వామి వారి ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం.

దీక్షల దేవుడు
శబరిమలైలో అయ్యప్ప స్వామి మాలధారణకు ఎంత విశిష్టత ఉందో, గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి హనుమద్దీక్షలకు అంత ప్రాముఖ్యత ఉంది. ఏటా హనుమజ్జయంతి, కార్తీక మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా హనుమద్‌ దీక్షలు చేపట్టిన హనుమత్‌ దీక్షాధారులు శ్రీమద్ది క్షేత్రంలో స్వామి వారి సన్నిధిలో ఇరుముడులు సమర్పిస్తుంటారు.

స్వామిని సందర్శించాకనే...
గోదావరి జిల్లాల్లో ఏపని మొదలు పెట్టాలన్నా ఈ దేవస్థానాన్ని సందర్శించి ఆ పని మొదలుపెట్టడం ఆనవాయితీ. ఈ ప్రాంతం నుంచి సినీరంగంలో స్థిరపడిన నటులు, దర్శకులు తమ సినిమా ప్రారంభంలో ఈ దేవస్థానాన్ని దర్శించి పూజలు చేయడం ఆనవాయితీ. అదే విధంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో తప్పనిసరిగా దేవస్థానాన్ని సందర్శించి ప్రచారం ప్రారంభించడం అనేక సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఆలయానికి ఇలా వెళ్లాలి
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయానికి చేరుకోవాలంటే హైదరాబాద్‌ నుంచి జంగారెడ్డిగూడెం బస్సు ద్వారా చేరుకోవచ్చు. విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి నుంచి జంగారెడ్డిగూడెంకు బస్సు సర్వీసులు ఉన్నాయి. రైలు ద్వారా చేరాలనుకునేవారు ఏలూరు రైల్వే స్టేషన్‌ నుంచి జంగారెడ్డిగూడేనికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. గన్నవరం విమానాశ్రయం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో గల ఈ దేవాలయం చేరుకోవడానికి అనేక రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
– అచ్యుత రాము, సాక్షి,
జంగారెడ్డిగూడెం, ప.గో.జిల్లా


మహిమాన్వితం... మద్ది క్షేత్రం..!

వాయునందనుడూ, వజ్రబల సమన్వితుడూ, అంజనీ పుత్రుడూ అయిన ఆంజనేయుడిని అర్చిస్తే చాలు ముక్కోటి దేవతలనూ పూజించిన ఫలితం దక్కుతుందట. అంతటి మహిమాన్వితుడైన హనుమ తెల్ల మద్ది వృక్షపు తొర్రలో వెలిసిన చోటు మద్ది ఆంజనేయస్వామి దేవాలయం. మద్దిచెట్టే గర్భాలయానికి గోపురంగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత.

హనుమంతుడికి రాముడంటే ఎంతిష్టమో తనను శరణువేడిన భక్తులన్నా అంతే ప్రీతి. తలచినంతనే తన భక్తులను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. అంతేకాదు, ఆయన్ను నమ్మిన వారికి మనోబలాన్నీ, బుద్ధి కుశలతనూ, మంచి వాక్కునూ అనుగ్రహిస్తాడు. వాయునందనుడిని భక్తితో కొలవాలే కానీ అసురుడినైనా అక్కున చేర్చుకుంటాడు. దీనికి నిదర్శనమే పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని గురవాయిగూడెంలో ఉన్న మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రం. ఓ అసుర భక్తుడి కోరికను మన్నించిన స్వామి అక్కడే ఓ చెట్టు తొర్రలో స్వయంభూగా వెలిశాడు.

స్థల పురాణం..
సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్నీ, బుద్ధి బలాన్నీ ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యంలోని మధ్యుడు అనే అసురుడు స్వామికి భక్తుడయ్యాడు. నిత్యం అంజనీసుతుడినే ఆరాధిస్తూ జీవనం సాగించేవాడు. శత్రు పక్షంలో ఉన్నందువల్ల స్వామిని నేరుగా దర్శించే భాగ్యం అతడికి లేకపోయింది. వచ్చే జన్మలోనైనా ఆయన సాక్షాత్కారం పొందాలన్న ఉద్దేశంతో హనుమ సేనకు ఎదురెళళ్లి మధ్యుడు వీరమరణం పొందాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ అంశతోనే కలియుగంలో మధ్యుడు జన్మించాడనీ అతడిని అనుగ్రహించేందుకే మద్ది వృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించాడని ప్రతీతి. ఓ భక్తురాలి స్వప్నంలో సాక్షాత్కారమైన ఆంజనేయుడు మద్దిచెట్టు తొర్రలో ఉన్న తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట. దీంతో చెట్టు దగ్గరకి వెళ్లి చూడగా అక్కడ ఆంజనేయస్వామి రాతి విగ్రహం కనిపించిందట. అలా క్రీ.శ.1166వ సంవత్సరంలో ఆ వూరివారికి స్వామి మొదటి దర్శనం లభించిందని పూర్వీకులు చెబుతున్నారు. తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు. తర్వాత 1978వ సంవత్సరంలో పూర్తిస్థాయి ఆలయాన్ని నిర్మించారు. అయితే మధ్యుడే మద్ది చెట్టుగా వెలిశాడన్న నమ్మకంతో ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేశారు.

ప్రదక్షిణ మొక్కులు..
తీరని కోర్కెలు ఉన్నవారూ పలు సమస్యలతో సతమతమవుతున్నవారూ ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రధాన మండపం చుట్టూ తొలుత 21 ప్రదక్షిణలు చేసి తమ మనసులోని కోర్కెలు తీరాలని మొక్కుకుంటారు. అవి నెరవేరిన తర్వాత మళ్లీ 108 ప్రదక్షిణలు చేసి స్వామికి మొక్కు చెల్లించుకుంటారు. దీనితోపాటు శని దోషాలూ, రాహు కేతు దోషాలూ, నవగ్రహ దోషాలూ ఉన్నవారు స్వామిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

వైష్ణవ సంప్రదాయంలో మద్ది ఆంజనేయస్వామికి నిత్యపూజలూ, అభిషేకాలను వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి శనివారం స్వామివారి మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం శాస్త్రòక్తంగా జరుపుతారు. ప్రతి నెలా స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రంలో సువర్చలా సమేత ఆంజనేయస్వామి కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. దూరాభారాల నుంచి వచ్చే భక్తుల కోసం విశాలమైన మండపం, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్షేత్రంలో నిత్యాన్నదానం జరుగుతుంది.

వేడుకలు, ఉత్సవాలు...
మద్ది క్షేత్రంలో హనుమజ్జయంతి వేడుకలను అయిదు రోజులపాటు నిర్వహిస్తారు. ఆది, సోమవారాల్లో భక్తులతో సామూహిక హనుమద్‌ కళ్యాణాలూ, లక్ష్మీ కుంకుమార్చనలూ జరుపుతారు. కార్తిక మాసం నెల రోజులూ ఈ క్షేత్రం పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో స్వామికి లక్ష తమలపాకులతో ఆకు పూజ నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే వేంకటేశ్వరస్వామి కూడా కొలువై ఉన్నాడు. ఆంజనేయుడిని పూజించిన భక్తులు శ్రీనివాసుడినీ దర్శించి సంపూర్ణ క్షేత్ర దర్శన ఫలాన్ని పొందుతారు.

ఈ క్షేత్రానికి సమీపంలోనే ఎర్రకాలువ జలాశయం ఉంది. ఇందులోని బోటు షికారు పర్యటకులకు ప్రత్యేక ఆకర్షణ. మద్ది క్షేత్రానికి 4 కి.మీ. దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆనుకుని గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం ఉంది. పారిజాతగిరిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడి స్వామివారిని దర్శిస్తే సాక్షాత్తు తిరుమల వేంకన్నను దర్శించిన అనుభూతి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

ఎలా వెళ్లాలంటే...
ఏలూరు నుంచి 50 కిలోమీటర్లూ, రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్ది క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం నుంచి ప్రతి గంటకూ బస్సు ఉంటుంది.


కొండవీటి అనిల్‌కుమార్‌, ఈనాడు, తాడేపల్లిగూడెం
- కార్తిక్‌, న్యూస్‌టుడే, లింగపాలెం
No comments:

Post a Comment