Sunday, 2 July 2017

గుబ్బల మంగమ్మ గుడి


ఆదివాసీల ఆరాధ్యదైవం గుబ్బల మంగమ్మతల్లి

దట్టమైన అడవి, పొడవైన చెట్లు, ఎత్తైన కొండలు, గలగల పారే సెలయేటి సవ్వడుల నడుమ గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలసింది ఆ తల్లి. అందుకే ఆమెను గుబ్బల మంగమ్మతల్లిగా పిలుచుకుంటూ భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండల కామవరం అడవిలోని మారుమూల ప్రాంతంలో వెలసినప్పటికీ, భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా పేరు పొందడంతో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజించి తమ మొక్కులు తీర్చుకుంటారు. శ్రీరామచంద్రుడు పాలన సాగించిన త్రేతాయుగం నుంచి ఈ తల్లి వెలసినట్లు స్థలపురాణం.

ఈ అడవిలో కొందరు రాక్షసులు సంచరించేవారట. ఒకసారి రాక్షసుల మధ్య తీవ్రయుద్ధం జరిగిందట. ఈ యుద్ధం ధాటికి మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందట. దాంతో అమ్మ ఆగ్రహించేసరికి ప్రకృతి అల్లకల్లోలం అయిందట. అప్పుడు దేవతలంతా ప్రత్యక్షమై మంగమ్మతల్లిని శాంతపరచి భక్తుల కోర్కెలు తీర్చేందుకు మళ్లీ ఈ ప్రాంతంలోనే అవతరించాలని కోరగా అందుకు ఆ తల్లి అంగీకరించి గలగల పారుతున్న సెలయేటి సవ్వడుల మధ్య గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలసింది. ఈ తల్లికి తోడుగా గంగమ్మతల్లి, వీరిద్దరికి తోడుగా నాగమ్మతల్లి చేరింది.

మంగమ్మ మహిమ వెలుగులోకి వచ్చింది ఇలా...
సుమారు యాభై ఏళ్ల క్రితం బుట్టాయగూడెం గ్రామానికి చెందిన కరాటం కృష్ణమూర్తి అనే భూస్వామి ఒకరోజు మంగమ్మతల్లి కొలువై ఉన్న అటవీ్ర పాంతం వైపు కొంతమంది కూలీలతో కలసి వెదురు గెడలు తెచ్చేందుకు ఎడ్లబండ్లు తోలుకుని అక్కడికి వెళ్లారు. బండ్లపై వెదురు లోడు వేయడం అయ్యాక, తిరుగు ప్రయాణంలో ఎంత ప్రయత్నం చేసినా ఎడ్లు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయాయట. ఏం చేయాలో తెలియక ఎడ్ల బండ్ల పై ఉన్న వెదురు కలపను కిందకు దించివేసి కృష్ణమూర్తి ఇంటికి వచ్చేసారట.

కృష్ణమూర్తికి గుబ్బల మంగమ్మ తల్లి కలలో కనిపించి ‘‘నీవు వెదురు లోడు చేస్తున్న సమీపంలోనే వాగు వెంబడి కొంతదూరం ప్రయాణించిన తరవాత జలపాతం పడే ప్రదేశంలో గుబ్బలు, గుబ్బలుగా ఉన్న గుహలో వెలిశాను నేను. నన్ను దర్శించుకుని పూజించిన తరువాత నీవు వెదురు తీసుకువెళ్లు’’ అని చెప్పడంతో కృష్ణమూర్తి నిద్రనుంచి మేల్కొని చూడగా గుబ్బల మంగమ్మ తల్లి వెలసిన ప్రదేశం కనిపించిందట.

మంగమ్మను దర్శించుకున్న కృష్ణమూర్తి అమ్మవారికి పూల మాలలు వేసి ధూప దీప నైవేద్యాలతో పూజలు చేసి, ఏజన్సీ ప్రాంతంలోని చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకు అన్నసంతర్పణ చేయించారట. సంతర్పణకు వెళ్లిన భక్తులు మంగమ్మను దర్శించుకోగా వారి కోర్కెలు నెరవేరాయట. అప్పటి నుంచి మంగమ్మతల్లిని దర్శించుకుని పూజించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

సంతాన వృక్షం
మంగమ్మ తల్లి వెలసిన సమీపంలో గానుగ చెట్టు ఒకటి ఉంది. ఈ చెట్టు సంతాన వృక్షంగా పేరొందింది. పిల్లలు పుట్టని దంపతులు అమ్మను దర్శించుకున్న అనంతరం పసుపు కుంకుమలు ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టుకొమ్మకు కడతారు. అలా చేయడం వల్ల అమ్మ అనుగ్రహంతో కడుపు పండు తుందని విశ్వాసం. ప్రతి ఆది, మంగళ, శుక్రవారాలలో ఈ చెట్టు వద్ద సంతాన పూజలు జరుగుతుంటాయి.

అడవిలో ఆహ్లాదభరితం
గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్ళే భక్తులకు అడవి మార్గంలో ప్రయాణం ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బుట్టాయగూడెం మండలం కామవరం దాటిన తరవాత కొంతదూరం వెళ్లేసరికి దట్టమైన అడవి... అడవిలో కొంతదూరం వెళ్లిన తరవాత గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం కలుగుతుంది.  ప్రయాణంలో పచ్చని చెట్లు, ఎల్తైన కొండలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి.
కోడూరి ఆనంద్‌
No comments:

Post a Comment