Saturday, 8 July 2017

నందలూరు - శ్రీ సౌమ్యనాథాలయం


నందలూరు సౌమ్యనాథుడు


దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాల్లో కడప జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథాలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథునికి చొక్కనాధుడని, చొక్కనాధ పెరుమాళ్‌ అని, కులోత్తుంగచోళ ఎంబరుమన్నార్‌ విన్నగర్‌ అనే పేర్లు ఉన్నాయి. సౌమ్యనాథుడన్నా..చొక్కనాథుడన్నా సౌందర్యవంతుడని అర్ధం. సౌమ్యనాథుడనగా సౌమ్యకు(శ్రీలక్ష్మీదేవికి) నాథుడని కూడా చెప్పుకోవచ్చు. స్వామి మూలవిరాట్టు ఏడడుగుల ఎత్తున ఎంతో అందంగా... అభయముద్రాలంకృతమై ఉంటుంది.

క్రీ.శ. 11వ శతాబ్దంలో చోళవంశరాజు కుళోత్తుంగచోళుడు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర రాజులచే 17వ శతాబ్దంవరకు ఆలయ నిర్మాణం కొనసాగింది. గజపతిరాజుల కాలంలో ఆలయం ప్రసిద్ధి చెందింది. 12వశతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు రాజగోపురాన్ని కట్టించారు. తాళ్లపాక అన్నమాచార్య జన్మస్థలమైన తాళ్లపాక గ్రామం నందలూరుకు సమీపంలో ఉన్నందున అన్నమాచార్యులు సౌమ్యనాథాలయాన్ని తరచు దర్శించుకొనేవారు. స్వామివారిపై శృంగార కీర్తనలు రచించారు. క్రీ.శ 11 వ శతాబ్దం మధ్యలో నందలూరులోని సౌమ్యనాథస్వామి దేవస్థానం మొట్టమొదటి వైష్ణవ ఆలయంగా గుర్తింపబడింది.

ఆలయ నిర్మాణం.. స్వరూపం...
శ్రీ సౌమ్యనాథాలయం దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 180 స్తంభాలతో వైఖానస, వైష్ణవాగామ ఆర్షప్రోక్తంగా నిర్మించిన సువిశాలమైన రీతిలో అలరారుతుంటుంది. ఈ ఆలయంలో అధికంగా తమిళ శాసనాలు కనిపిస్తాయి. సింహద్వారంలో గాలిగోపురం ఉత్తరగోపురం, దక్షిణగోపురం ద్వారాలు ఉన్నాయి. ఆలయంలో రాతి దీపస్తంభం, బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడ మందిరం, మత్స్యమంటపం, ఆంజనేయమంటపం, చిన్నకోనేరు, జయవిజయులు, అంకుర్పారణ మంటపం, వంటశాల, శ్రీ యోగనరసింహస్వామి, శిల్పకళ, అంతరాళం ఉన్నాయి.

దీపంలేకున్నా.... వెలిగే స్వామి
ఆలయంలో ఎటువంటి దీపంలేకున్నా, స్వామి వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయం నిర్మించడం అద్భుతం. గర్భగుడి ప్రధానద్వారానికి వందగజాల దూరం నుంచి కూడా స్వామి చాల స్పష్టంగా కనిపిస్తారు. యేడాదిలో ఒకరోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై ప్రసరించడం ఇక్కడి ప్రత్యేకత.

ఆలయకుడ్యాలపై మత్స్య, సింహా చిహ్నాలు..
ఆలయ కుడ్యాలపై (లోపల)పై భాగంలో మత్స్య, సింహా చిహ్నాలు ఉన్నాయి. మత్స్య ఆకారంను మలిచి ఉన్నారు. భవిష్యత్తులో పెద్దఎత్తున వరదలు వచ్చి ఆలయాన్ని ముంచెత్తినప్పుడు ఆలయ పైభాగంలో ఉండే చేపబొమ్మకు ప్రాణం వచ్చి వరదలలో కలిసిపోతుందని స్ధానికుల నమ్మకం. అంటే అప్పటికి కలియుగం అంతమైపోతుందనే అర్ధం వస్తుందని చెబుతుంటారు.

ఆలయంలో మరో ఆలయం!?
రాతి మంటపంపై నుంచి గర్భాలయంలో ప్రవేశించాల్సివుంది. ఈ మంటపం ముందుబాగం శిఖరంలో సింహతల ఆకారంలో ఇరువైపుల ఉన్నాయి. ఏ దేవాలయానికైనా, ఆలయపైభాగంలో సింహతలలు అమర్చిబడి వుంటాయి. కాని సౌమ్యనాథస్వామి ఆలయంలో లోపలి మంటపంలోని ఓ భాగమంతా సింహాతలాటాలతో నిండివుండటం వల్ల భూగర్భంలో మరో ఆలయం ఉన్నట్లుగా గోచరిస్తుంది. దీనిని రాతి మంటపం అడుగున ఉన్న శివాలయంగా చెప్పుకుంటున్నారు.

ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి...
కడప–రేణిగుంట జాతీయరహదారిలో వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడపకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరు గ్రామంలో సౌమ్యనాథాలయం ఉంది. ఈ ఆలయానికి కడప, తిరుపతి, రాజంపేటల నుంచి బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అలాగే జిల్లా రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రానికి ముంబాయి–చెన్నై మార్గంలో నడిచే ఏ రైలు ద్వారా నైనా చేరుకోవచ్చును. విమానాశ్రయం అయితే రేణిగుంటకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా రైల్వేకోడూరు, రాజంపేట మీదుగా నందలూరుకు చేరుకోవచ్చు.

బ్రహ్మోత్సవాల క్రమమిది...
శ్రీ నారదమహర్షిచే ప్రతిష్టించబడిన అన్నమాచార్యులు ఆరాధ్యదైవమైన పరమేష్టి ప్రముఖ నిఖిల సురవంద బృంసదారవిందులైన, భక్తసులభుడైన శ్రీ సౌందర్యవల్లి సమేత శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఆషాడ శుద్ధనవమి మొదలు అంటే జూలై 2 నుంచి ఆషాఢ బహుళ తదియ 11వతేది అత్యంతవైభవంగా జరగనున్నాయి. సౌమ్యనాథస్వామి వారు తన దేవేరితో కలసి రోజుకొక వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. 7న గరుడోత్సవం, 9 న కళ్యాణోత్సవం, 10న రథోత్సవ కార్యక్రమాలు ఉంటాయి.
మోడపోతుల రామ్మోహన్‌, సాక్షి, రాజంపేట, వైఎస్‌ఆర్‌ జిల్లా

No comments:

Post a Comment