Tuesday, 25 July 2017

శ్రీముఖలింగం


శ్రీముఖలింగం అష్టదిక్కులు... అష్టతీర్థాలు 

శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగానికి కాశీక్షేత్రంతో సమానమైన ఖ్యాతి ఉంది. అందుకే దక్షిణకాశి అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో ఉన్న అష్టతీర్థాలను అశ్విని దేవతలు ఏర్పాటు చేసినట్లు స్థలపురాణం చెబుతోంది. మాయాజూదంలో రాజ్యాన్ని కోల్పోయిన పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో ఈ తీర్థాల్లో పుణ్యస్నానాలు చేసి ఇక్కడ కొలువైన మధుకేశ్వరుడు, వారాహి అమ్మవారు, జంబుకేశ్వరుడు, ముక్తేశ్వరస్వామి, మహావిష్ణువు, ఆదిత్యుడు, సోమేశ్వరుడు తదితర దేవతలను దర్శించుకోవడంతోపాటు పితృశ్రాద్ధాలు, తిలతర్పణాది కార్యక్రమాలు చేసినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. ప్రధానంగా పాండవ ప్రథముడు ధర్మరాజు జూదంలో రాజ్యం పోగొట్టుకున్నప్పుడు భీముడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అదే భీమేశ్వరాలయం. శ్రీ ముఖలింగ క్షేత్రానికి ఈ నెల 31 నుంచి ఆగష్టు 31 వరకూ అష్టతీర్థ రాజమహాయోగం సందర్భంగా ప్రత్యేక వ్యాసకుసుమం...

సాధారణంగా పుణ్యనదులైన గంగ, కృష్ణ, గోదావరి, పెన్న, కావేరి నదులకు గురుగ్రహం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కుంభం తదితర రాశుల్లో ప్రవేశిస్తే నదులకు 12 సంవత్సరాలకు పుష్కరాలు వస్తాయి. అప్పుడు భక్తులు పుణ్యస్నానాలు చేసి పితృదేవతలకు పిండప్రదానాలు నిర్వహిస్తారు. కాని శ్రీముఖలింగంలో జరగనున్న అష్టతీర్థాలకు అష్టమి, స్వాతి నక్షత్రంతో కూడిన పౌర్ణమి, సోమవారం, శ్రవణం నక్షత్రంతో ఒకే విధంగా ఉండాలి. ఇలా అరుదుగా సంభవిస్తాయి. ఇలా గతంలో 1946, 2000 సంవత్సరాల్లో వచ్చినట్లు ఆలయ చరిత్రను బట్టి తెలుస్తోంది. దక్షిణాయనం, శ్రావణమాసం శుక్లపక్షం అష్టమి ఘడియల్లో సోమవారం స్వాతి నక్షత్రంతో కూడిన శ్రవణ నక్షత్రంనాడు ఈ తీర్థాల్లో రాజమహాయోగం పుణ్యక్రతువులు ప్రారంభిస్తారు. ఎనిమిది రోజులు అనంతరం సోమవారం పౌర్ణమి గ్రహణం అనంతరం పుణ్యస్నానాలతో ఈ మహాక్రతువును ముగిస్తారు.

తీర్ధాల విశిష్టత.. పుణ్యస్నానాల ఫలితం
అష్టతీర్థాలు.. అష్టదిక్కులు.. కొలువైన దేవతలు శ్రీముఖలింగంలో జరగనున్న రాజమహాయోగానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ పుణ్యతీర్థాలలో స్నానాలు చేసి ఆయా దేవతలను దర్శించుకోవడంతోపాటు ప్రధాన దేవాలయంలో ముఖలింగేశ్వరుని దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదు. దీర్ఘరోగాలు పటాపంచలైపోతాయి. కోరిన కోర్కెలు తీరి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. మాన సిక రోగాలు, పిచ్చి, రుణబాధలు తొలగి అషై్టశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రధానంగా పితృదేవతలకు పిండ ప్రదానాలు, దానధర్మాలు చేయడం, తిల తర్పణ కార్యక్రమాలు నిర్వహించడం సంప్రదాయం.

మొదటి రోజు (సోమవారం): 

బిందు తీర్థం ఈశ్యాన దిక్కున ఉంది. పాండవులు వనవాసం సమయంలో ఇదే గిరిపై నివాసం ఉన్నట్లు స్థలపురాణం చెబుతోంది. ఇందులో పుణ్యస్నానం అనంతరం అనంతగిరి (పద్మనాభకొండ)పై ఉన్న శ్రీముఖలింగేశ్వరుని క్షేత్రపాలకుడు మహావిష్ణువుని దర్శించుకోవాలి.

రెండవ రోజు (మంగళవారం): 

గయా తీర్థం పద్మనాభ గిరి కింద తూర్పుదిక్కున ఉంది. ఇక్కడ స్నానానంతరం విష్ణుపాదాలు, శంఖు, చక్రాలను దర్శించుకోవాలి. వీటితోపాటు సమీపంలో ఉన్న శివలింగ దర్శనం చేయాలి. ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు. అలాగే దానధర్మాలు చేయడం వల్ల మోక్షం కలుగుతుందంటారు.

మూడవ రోజు (బుధవారం): 

హంసతీర్థం పశ్చిమ దిక్కున ఉంది. స్నానానంతరం ప్రధాన ఆలయం ఆది విరాట్టు వారాహి సహిత శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకోవాలి.

నాలుగవ రోజు (గురువారం): 

పిశాచవిమోచన తీర్థం దక్షిణం దిక్కున ఉంది. స్నానం చేసి నగిరికటకాం గ్రామ సమీపంలో ఉన్న ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవాలి. సాయంత్రం కనుల పండువగా వారాహి సహిత శ్రీముఖలింగేశ్వరునికి గజవాహనంపై తిరువీధి ఉత్సవం జరుగుతుంది.

ఐదవరోజు (శుక్రవారం): 

పక్షి మోచన తీర్థం ఆగ్నేయ దిక్కున ఉంది. ఇందులో కుటుంబ సమేతంగా స్నానాలు చేసి దానధర్మాలు ఆచరించాలి. భీమేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. జూదంలో ఓడిపోయి రాజ్యం పోగొట్టుకున్న పాండవులు అరణ్య వాసం చేసే సమయంలో ఈ క్షేత్రంలో ఉండగా భీముడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది.

ఆరవ రోజు (శనివారం): 

జంబూతీర్థం ఉత్తర దిక్కున ఉంది. ఈ రోజున ఈ తీర్థంలో స్నానం చేసిన అనంతరం జంబుకేశ్వరుని దర్శనం చేసుకోవాలి.

ఏడవ రోజు (ఆదివారం): 

సూర్యతీర్థం వాయవ్య దిక్కులో ఉంది. స్నానం ఆచరించి ఆదిత్యేశ్వరస్వామిని దర్శించుకోవాలి. ఈ తీర్థం రోగ హరమైనది అని భక్తుల విశ్వాసం.

ఎనిమిదవ రోజు (సోమతీర్థం): 

నైరుతి దిక్కున ఉంది. చివరిరోజు సోమవారం పౌర్ణమి సందర్భంగా ఈ తీర్థంలో స్నానం చేసి సోమేశ్వర స్వామి దర్శనం, అనంతరం దానధర్మాలు చేయాలి. ఈ తీర్థంలో అష్టదిక్పాలకులలో ఒకరైన చంద్రుడు స్నానమాడి శాపవిమోచనం పొందాడు. అనంతరం సోమేశ్వర స్వామి లింగ ప్రతిష్ట చేసినట్లు శ్రీముఖలింగేశ్వర క్షేత్ర మహాత్మ్యంలో ఉంది.

జన్మ ధన్యం!
అష్టతీర్థ రాజమహాయోగం ఇక్కడ ప్రధాన పుణ్యక్రతువు. ఈ తీర్థాల్లో స్నానాలు చేస్తే మోక్షంతోపాటు పుణ్యం సిద్ధిస్తుంది. పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారు పుణ్యలోకాలకు వెళతారు. దానధర్మాలు, తిలతర్పణ కార్యక్రమాలు చేయడం ద్వారా మానవ జన్మ ధన్యమైనట్లే అంటారు. ఎనిమిది రోజులు పాటు అష్టతీర్థాల్లో స్నానం చేసి ఆ తీర్థాల్లో కొలువైన దేవతలతోపాటు వారాహి సహిత ముఖలింగేశ్వరుని దర్శనం తప్పని సరిగా చేసుకోవాలని ఆలయ ప్రధానార్చకులు టి. శ్రీకృష్ణ చెబుతున్నారు.

ఇదీ రూట్‌...
హైదరాబాద్‌ లేదా విజయవాడ నుంచి విమానంలో విశాఖపట్నం వరకూ రావచ్చు. అక్కడ నుంచి నేరుగా కారు/ బస్సు/రైలులో శ్రీకాకుళం రోడ్‌ (స్టేషన్‌)కు వస్తే, అక్కడ నుంచి శ్రీముఖలింగంకు 40 కిలోమీటర్లు ప్రయాణం. రైలులో వచ్చే వారు శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లో దిగితే అక్కడ నుంచి శ్రీముఖలింగం చేరుకునేందుకు ట్యాక్సీ లేదా బస్సులున్నాయి.

– సుంకరి శాంతభాస్కర్‌ సాక్షి, జలుమూరు, శ్రీకాకుళం జిల్లా

No comments:

Post a Comment