Sunday, 6 August 2017

జంబుకేశ్వర క్షేత్రం


ప్రకృతి సౌందర్యానికి రమణీయతకు
జంబుకేశ్వర క్షేత్రం


శివుడి పంచభూతలింగ క్షేత్రాలలో జలతత్వానికి ప్రతీక జంబుకేశ్వర క్షేత్రం. తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న ఈ జంబుకేశ్వరం సహజ ప్రకృతి సౌందర్యంతో శోభిల్లే రమణీయ ప్రదేశం. కావేరిని తమిళంలో పొన్ని అని కూడా పిలుస్తారు. పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరీ నదిలో స్నానం చేయడం, జంబుకేశ్వరుడిని పూజించడం విశిష్ట ఫలదాయకమని క్షేత్రమహాత్మ్యం చెబుతోంది. జంబుకేశ్వర స్వామివారు భక్తవత్సలుడిగా పేరు పొందిన బోళాశంకరుడు.

చిత్తశుద్ధితో ప్రార్థిస్తే చాలు, కష్టనష్టాలన్నింటినీ చిటికలో తొలగించి, సకల సంపదలూ ప్రసాదిస్తాడని భక్తులు ప్రస్తుతిస్తుంటారు. పవిత్రమైన ఈ శ్రావణమాసంలో శైవ క్షేత్రాలను సందర్శించడం, అభిషేకాలు, అర్చనలు చేయడం ప్రశస్తమని పురాణాలు చెబుతున్నాయి. చోళరాజులు నిర్మించిన ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను అనంతర కాలంలో పల్లవులు, పాండ్యులు, విజయనగర రాజులు చేపట్టినట్లు చారిత్రక కథనాలను బట్టి తెలుస్తోంది. జంబుకేశ్వర క్షేత్రానికి తిరువానైకవర్‌ అనే పేరు కూడా ఉంది.

పేరెలా వచ్చింది
జంబూ అంటే తెల్లనేరేడు అని అర్థం. ఇక్కడ తెల్లనేరేడు చెట్లు అధికంగా ఉండటం వల్ల దీనికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది. పూర్వం శంభుడనే రుషి ఉండేవాడు. ఆయన మహా శివభక్తుడు. శివుని ప్రత్యక్షంగా దర్శించుకుని పూజించాలని శివుని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, ‘‘నేను ఇక్కడ లింగరూపంలో కొలువుదీరతాను. నువ్వు ఇదే ప్రదేశంలో జంబూవృక్షరూపంలో ఉండి నన్ను సేవించుకుంటూ ఉందువుగానీ’’ అని వరమిచ్చాడు. ఇలా ఆ ముని ఇప్పటికీ జంబూవృక్షరూపంలో ఆలయ ప్రాంగణంలో ఉండి శివుణ్ణి, శివభక్తులను దర్శించుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ స్వామివారు జలరూపంలో ఉండరు. సానవట్టం నుంచి స్వామిని అభిషేకిస్తున్నట్లుగా నీరు ఊరుతూనే ఉంటుంది. పానవట్టం చుట్టూ అర్చకులు వస్త్రాన్ని కప్పుతారు. మళ్లీ అందులోకి నీరు ఊరుతుంటుంది. ఈ వస్త్రాన్నే పిండి, అర్చకులు భక్తులకు తీర్థంగా సమర్పిస్తుంటారు.

అత్యంత ప్రాచీన ఆలయాలలో ఒకటిగా పేరొందిన ఈ ఆలయం ఎత్తయిన గోపురాలతో, విశాలమైన ప్రాకారాలతో, వివిధమైన ఉపాలయాలతో, మండపాలతో, తీర్థాలతో సందర్శకులను ఎంతగానో అలరిస్తుంది. నాలుగవ ప్రాకారం 32 అడుగుల ఎత్తు, వేలాది అడుగుల చుట్టుకొలతతో చూడముచ్చట గొలుపుతుంటుంది. అత్యద్భుతమైన ఈ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుడికోసం వృద్ధశిల్పి రూపంలో వచ్చి, దేవతలను కట్టడ నిర్మాణ నిపుణులుగా మార్చి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు స్థలపురాణం చెబుతోంది.

ఆదిశంకరుడు ప్రతిష్ఠించిన శ్రీ యంత్రం
సాక్షాత్తూ శంకరుని అవతారంగా ప్రస్తుతించే జగద్గురు ఆదిశంకరులవారు జంబుకేశ్వరుని సన్నిధిలో అత్యంత శక్తిమంతమైన, మహిమాన్వితమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి, క్షేత్రానికి ఆకర్షణ శక్తిని పెంపొందించినట్లు, అఖిలాండేశ్వరిగా, జగన్మాతగా పేరు గాంచిన ఇక్కడి అమ్మవారికి శ్రీచక్రాంకితమైన రెండు కర్ణాభరణాలను సమర్పించుకున్నట్లు ఐతిహ్యం. అమ్మవారి మందిరంలో గర్భాలయానికి ఎదురుగా అమ్మవారి ముద్దులపట్టి, విఘ్నాలకు రాజయిన వినాయకుని మూర్తిని కూడా శంకరులే ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతోంది.

నిత్యకల్యాణ దంపతులు
ఇక్కడ స్వామి, అమ్మవార్లకు నిత్యం మూడుకాలాలలో పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు, నివేదనలు జరుగుతుంటాయి. శివునికి సంబంధించిన పర్వదినాలలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. స్వామి, అమ్మవార్లకు నిత్యం కల్యాణోత్సవాలను జరుపుతారు. ఈ ఆలయం ఆవరణలోని పలు ముఖ్య ఆలయాలేగాక చుట్టుపక్కల వినాయక, సుబ్రహ్మణ్య, ఇతర శివదేవ పరివార ఆలయాలు, స్వామి భక్తులైన నందరార్, తిరునావుక్కరుసు, మానిక వాసగర్, సంబంధార్‌ తదితర నాయనారుల ఉపాలయాలు కూడా సందర్శనీయమైనవి. తిరుచ్చి సమీపంలోనే కలియుగ వైకుంఠమైన శ్రీరంగం ఉంది.

ఎలా వెళ్లాలంటే..?
చెన్నై నుంచి జంబుకేశ్వరానికి నేరుగా రైళ్లు, బస్సులు ఉన్నాయి.

డి.వి.ఆర్‌.భాస్కర్‌

No comments:

Post a Comment