Sunday, 20 August 2017

హంపి

హంపి బాలకృష్ణాలయం అద్భుత శిల్పచాతుర్యం
హంపి పేరు వినగానే మనకు విరూపాక్షాలయమే గుర్తొస్తుంది. అయితే, హంపీలో విరూపాక్షాలయంతో బాటు బాలకృష్ణుడి గుడి కూడా ఉంది. ఈ ఆలయాన్ని అలనాటి విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు యుద్ధంలో సాధించిన విజయానికి ప్రతీకగా స్వయంగా దగ్గరుండి మరీ ఎంతో శ్రద్ధాభక్తులతో కట్టించాడని ప్రతీతి.

ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు అన్నట్లుగా ముద్దులొలికే మోముతో ఉంటాడు బాలకృష్ణుడు. దురదృష్టం ఏమిటంటే ఈ నగుమోమును మనం ఇప్పుడు ఈ గుడిలో సందర్శించుకోలేం. 15వ శతాబ్దానికి చెందిన సువిశాలమైన, సుందరమైన ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ, చారిత్రక సంపదగా యూనెస్కో గుర్తించింది. కృష్ణాష్టమి సందర్భంగా ఈ ఆలయంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా వేడుకలు, ఉత్సవాలు జరుగుతాయి.

ఎల్తైన ప్రాకారాలు, ఆ ప్రాకారాలపై అత్యద్భుతంగా చెక్కిన పౌరాణిక శిల్పాలు ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయం అంతరాళం, గర్భగృహం, అర్ధమంటపం లేదా ప్రదక్షిణ మంటపం, ముక్తిమంటపం లేదా రంగమంటపం అని నాలుగైదు విభాగాలుగా ఉంటుంది. ఆలయానికి తూర్పుదిశగా ఉన్న మంటపానికే  రంగమంటపమని పేరు. అత్యున్నతమైన ప్రాకారాలున్న ఈ రంగమంటపంలోనే అమ్మవారు కొలువుదీరి ఉంటారు. దక్షిణదిక్కుగా అందమైన అరటి తోట. ఆ తర్వాత ఓ రాతి ఉద్యానం. వీటన్నింటినీ కలుపుతూ ఒక కొలను.

అయితే, ఆ కొలనులో నీరుండక పోవడం వల్ల అది వాడకంలో లేదు. పశ్చిమానికి వెళితే దీర్ఘచతురస్రాకారపు భవంతి. ఒకప్పుడు అది అతి పెద్ద ధాన్యపు గాదె, దానిని ఆనుకుని సువిశాలమైన వంటశాల ఉండేది. చిత్రమేమిటంటే, ఆ భవంతి మహమ్మదీయ కట్టడాన్ని తలపిస్తుంది. దాని వెనకాలకు వెళితే ఇరుకుగా ఉండే మెట్లు. ఆ మెట్లెక్కితే ఆలయం పై భాగానికి చేరుకోవచ్చు. అక్కడ నిలబడి చూస్తే, అందమైన చిత్రాన్ని చూడవచ్చు.

ఇక సభామంటపంలోనికి అడుగిడితే... అక్కడి లోపలి నాలుగు గోడలపైనా బాలకృష్ణుడు, హనుమంతుడు, కాళీయమర్ధనం చేస్తున్న కృష్ణుడు, శ్రీ మహావిష్ణువు దశావతారాల చిత్రాలు సజీవమా అన్నట్లు కనిపిస్తుంటాయి. అంతరాలయం పై కప్పుపైన సింహతలాటాలు, వాద్యగాళ్ల శిల్పాలు కనువిందు చేస్తుంటాయి.
బాలకృష్ణాలయంలో బాలకృష్ణుడి విగ్రహం ఉండదు. ఒకప్పుడు ఉండేది కానీ, మహమ్మదీయుల దండయాత్రలలో నాశనం అవుతుందన్న ఉద్దేశంతో చిన్నికృష్ణుడి విగ్రహాన్ని తీసి వేరేచోట భద్రం చేయగా, ఇప్పుడది చెన్నైలోని నేషనల్‌ మ్యూజియంలో ఉంది. కృష్ణుడి విగ్రహం లేదు కదా, ఇంకేముందక్కడ చూడటానికి? అనే సందేహం రావచ్చు... అయితే, ఆలయంలోని శిల్పసంపదను, ఆలయం నిర్మాణాన్ని తప్పకుండా చూసి తీరవలసిందే. ఉత్సవ విగ్రహాలకే పూజలు నిర్వహిస్తున్నారు.
బాలకృష్ణాలయంలోకి అడుగు పెట్టడానికి ఏ విధమైన రుసుమూ వసూలు చేయరు. అంతేకాదు, ఆలయంలోపల కానీ, వెలుపల కానీ మనం ఎన్ని ఫొటోలైనా తీసుకోవచ్చు. మనల్ని ఎవరూ అభ్యంతర  పెట్టరు.

ఎలా వెళ్లాలంటే..?
బెంగళూరు నుంచి హోస్పేటకు ఆర్టీసీ బస్సులున్నాయి. రైళ్లున్నాయి. హోస్పేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని హంపీ చేరుకోవడానికి ప్రైవేటు ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రైవేటు వాహనాలు ఉన్నాయి.

హంపీలో చూడదగ్గ ఇతర ప్రదేశాలు
విరూపాక్ష దేవాలయం, విరూపాక్ష గుహలు, కడలేకలులో ఏకశిలతో నిర్మించిన భారీ గణేశుని విగ్రహం, శశిలేకలులో ఉదరానికి మొలతాడులా సర్పాన్ని చుట్టుకుని ఉన్న ఎనిమిదడుగుల గణేశుని విగ్రహం, హజార రామాలయం, పట్టాభిరామాలయం, కమల్‌ మహల్, హంపీబజార్‌... ఒకనాడు విజయనగర రాజుల కాలంలో రత్నాలు, అమూల్యాభరణాలను రాశులు పోసి విక్రయించిన వీధి ఇది. ఇప్పుడు ఈ వీధిలో కృత్రిమమైన నగలు, రంగురాళ్లు అమ్ముతున్నారు. అచ్యుతరాయాలయం: పూర్తిగా విజయనగర కళారీతిలో నిర్మించిన ఈ ఆలయంలో విష్ణ్వాంశ స్వరూపుడైన తిరువేంగళనాథుని విగ్రహాన్ని సందర్శించుకోవచ్చు. ఇంకా 900 ఏళ్ల క్రితం నాటి చంద్రమౌళీశ్వరాలయం తప్పక సందర్శనీయమైనది. గగన్‌ మహల్, ఆర్కియాలజికల్‌ మ్యూజియం కూడా చూడదగ్గ ప్రదేశాలు.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

No comments:

Post a Comment