Sunday, 6 August 2017

శ్రీరంగపట్నం


భూలోక వైకుంఠం... శ్రీరంగపట్నం

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు అతి సమీపంలో మాండ్యా జిల్లాలో ఉన్న ఈ ఆలయానికి చారిత్రకంగా, ధార్మికంగా, సాంస్కృతికంగా కూడా ఎంతో పేరున్నది. మైసూరు రాజులు శ్రీరంగపట్టణాన్నే రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు. రంగరాయను ఓడించి వడయార్‌ రాజు 1614లో శ్రీరంగపట్టణాన్ని వశపరచుకున్నాడు. మైసూర్‌ పులి టిప్పుసుల్తాన్‌కి శ్రీరంగనాథుడంటే ఎనలేని భక్తి. టిప్పుసుల్తాన్‌ తండ్రి హైదరాలీ మైసూరును పాలించిన కాలంలో ఆయన రంగనాథుని ప్రార్థించిన తర్వాతనే యుద్ధభూమిలోకి అడుగు పెట్టేవాడట. శ్రీరంగపట్టణం చుట్టూతా కావేరీ నది ఆవరించి ఉంటుంది.

అందువల్ల ఇది ఒక ద్వీపంలా కనిపిస్తుంది. ఎల్తైన ఆలయ గోపురం, రెండు సువిశాలమైన ప్రాకారాలు, ఆలయ మంటపం, ఉన్నతమైన ముఖమంటపంతో అలరారుతుంటుంది. ఆలయ ముఖద్వారం పైకప్పు చిన్న చిన్న శిఖరాలన్నీ కలిసి గుచ్చిన పుష్పమాలాలంకృతమై ఉంటుంది. గర్భగుడిలోకి అడుగుపెట్టగానే ఏడుతలల ఆదిశేషువుపై శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువు, ఆయన పాదాలు వత్తుతున్న లక్ష్మీదేవి దర్శనమిస్తారు. ఆలయంలో నరసింహస్వామి, గోపాలకృష్ణుడు, శ్రీనివాసుడు, హనుమంతుడు, గరుడుడు, పన్నిద్దరు ఆళ్వారుల సన్నిధులు కూడా కనిపిస్తాయి.

కావేరీ నీరు వైకుంఠంలోని విరజానదితో సరితూగగలిగేంత పవిత్రమైనవని విశ్వాసం. గంగ కూడా కావేరీలో స్నానం చేసి తన పాపాలను పోగొట్టుకుంటుందని పురాణ కథనాలున్నాయి. అంతేకాదు, కావేరీ నది కోరికమేరకే శ్రీరంగనాథుడు ఇక్కడ కొలువయ్యాడని, బ్రహ్మ, రుద్రుడు కూడా దివినుంచి భువికి దిగివచ్చి రంగనాథుని పూజిస్తారని ప్రతీతి. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన విష్ణువర్థనుడనే రాజు ఎంతో ధనాన్ని వెచ్చించి ఆలయ అభివృద్ధికి పాటుపడ్డాడు. ఆయన భార్య అలమేలమ్మ ప్రతి మంగళ, శుక్రవారాలలో దేవేరులకు అమూల్యమైన ఆభరణాలు తయారు చేయించి అలంకరింపజేసేది. ఆ తర్వాత వచ్చిన విజయనగర రాజులు, అనంతర కాలంలో మైసూరు మహారాజులు ఆలయానికి మరింత శోభను చేకూర్చారు. అంగరంగవైభవంగా ఉత్సవాలు నిర్వహించారు.


సేవలు, ఉత్సవాలు: 

మకర సంక్రాంతినాడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ముక్కోటి ఏకాదశినాడు స్వామివారి ఉత్తరద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈరోజున స్వామివారిని వెన్నతో అలంకరిస్తారు. సాయంత్రం కిరీటాలంకరణ చేస్తారు. ఆ తర్వాత రథసప్తమికి కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మాఘ పూర్ణిమనాడు స్వామివారికి కావేరీనదిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఈ పర్వదినాన వేలాది భక్తులు స్వామిని సేవించుకుంటారు. వైశాఖ శుద్ధ సప్తమినాడు శ్రీరంగ జయంతి ఉత్సవాలు జరుపుతారు. ఆ తర్వాత వచ్చే పున్నమినాడు బంగారు గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఇక్కడ ఇంకా ఏమేమి చూడవచ్చు? టిప్పుసుల్తాన్‌ కోట, శ్రీరంగనాథిట్టులోని బర్డ్‌ శాంక్చువరీ, నిమిషాంబ ఆలయం, దొడ్డ ఘోశాయ్‌ ఘాట్, కరిఘట్ట కొండలు, సంగమ, గుంబాజ్, జామా మసీద్‌ వంటివాటిని సందర్శించవచ్చు.

ఎలా వెళ్లాలి? దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి శ్రీరంగపట్నానికి నేరుగా రైళ్లు, బస్సులు ఉన్నాయి. విమానాశ్రయం మాత్రం మైసూరులో ఉంది. అక్కడినుంచి శ్రీరంగపట్నం కేవలం పదహారు కిలోమీటర్లే. విశాఖపట్నంలోని గాజువాక నుంచి శ్రీరంగపట్నానికి నేరుగా రైలుంది.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌


No comments:

Post a Comment